ప్రస్తుత విధానంలోనే పేదలకు ఊరట

Relief to Poor people within the current Electricity Policy  - Sakshi

డైనమిక్‌ పద్ధతే మేలు చేస్తుంది 

గతంలో మాదిరి ఏడాది మొత్తం పెరిగిన బిల్లు ప్రభావం ఉండదు 

ఏ నెలలో శ్లాబు ఆ నెలలోనే వేసవి, లాక్‌డౌన్‌ వల్లే అధిక వినియోగం 

సాక్షి, అమరావతి: విద్యుత్‌ బిల్లింగ్‌ విషయంలో డైనమిక్‌ విధానం అనుసరించడం వల్ల వినియోగదారులకు విద్యుత్‌ బిల్లు ఏడాది పొడవునా భారం కాకుండా ఉంటుంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా గృహ విద్యుత్‌ వినియోగం పెరగడం వల్ల ఈ మార్పు స్పష్టంగా కన్పించడం లేదు. అదే పాత పద్ధతి (స్టాటిక్‌)లో బిల్లింగ్‌ వల్ల ఒక నెలలో వినియోగం పెరిగితే దాని భారం ఏడాదంతా మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్చి నెల పూర్తవ్వడంతోనే గత సంవత్సర వినియోగం ఆధారంగా శ్లాబుల వర్గీకరణ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా అనేక మంది ఎక్కువ యూనిట్‌ ధర ఉండే శ్లాబులోకి వెళ్తారు. మరుసటి ఏడాది తక్కువ విద్యుత్‌ వినియోగించినా ఆ ఏడాదంతా అధిక ధర ఉన్న శ్లాబులోనే బిల్లులు కట్టాల్సి ఉంటుంది. డైనమిక్‌ విధానం ఈ ప్రమాదాన్ని తప్పించింది.  

మధ్యతరగతికీ ప్రయోజనమే 
నెలకు 225 (ఏడాదికి 2700) యూనిట్లు వాడే విద్యుత్‌ వినియోగదారులు రాష్ట్రంలో 62.43 లక్షల మంది ఉన్నారు. డైనమిక్‌ విధానంలో లెక్కకట్టడం వల్ల విద్యుత్‌ ఎక్కువగా వాడిన నెలకు మాత్రమే శ్లాబు మారుతుంది.  వినియోగం తగ్గిన నెలలో తక్కువ శ్లాబులోకి వెళ్లడం వల్ల బిల్లు తగ్గుతుంది. ఉదాహరణకు 225 యూనిట్ల నెలవారీ టార్గెట్‌ దాటి ఏదైనా నెలలో 300 యూనిట్లు వాడి ఉంటే పాత పద్ధతిలోనైతే  ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆ వినియోగదారుడు ‘సి’ కేటగిరీలోకి వస్తాడు. దీంతో ఈ ఏడాది మొత్తం నెలకు రూ. 225 చొప్పున రూ. 2,700 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఎలా అంటే.... 

75 యూనిట్లు వాడేవారు 73.37 లక్షలు 
► రాష్ట్రంలో 1.45 కోట్ల మంది విద్యుత్‌ వినియోగదారులున్నారు. వీరిలో నెలకు 75 యూనిట్లు (ఏడాదికి 900 యూనిట్లు) వాడే వారు 73.37 లక్షల మంది ఉన్నారు. వీళ్లంతా ‘ఎ’ కేటగిరీ కిందకే వస్తారు. వీళ్ల విద్యుత్‌ వినియోగం 2019–20లో 900 యూనిట్లు దాటితే ఈ ఏడాది మొత్తం ‘బి’ కేటగిరీలోనే కొనసాగుతారు.  
► ఉదాహరణకు ఏదైనా ఒక నెలలో 75 యూనిట్లు దాటి, గత ఏడాదిలో 900 యూనిట్లకు పైగా వినియోగించినప్పుడు ఈ సంవత్సరం ’బి’ కేటగిరీలోకి రావడం వల్ల స్టాటిక్‌ విధానంలో మొదటి 75 యూనిట్లకు యూనిట్‌ రూ. 2.60 చొప్పున నెల బిల్లు రూ. 195 వస్తుంది. కానీ స్టాటిక్‌ విధానం తీసేసి, డైనమిక్‌ పద్ధతిలో బిల్లు చేయడం వల్ల మొదటి 50 యూనిట్లకు యూనిట్‌ రూ. 1.45 చొప్పున 72.50, మిగిలిన 25 యూనిట్లకు యూనిట్‌కు రూ. 2.60 చొప్పున రూ. 65 కలిపి మొత్తం రూ. 137.50 బిల్లు వస్తుంది.  స్టాటిక్‌ విధానంలో బిల్లింగ్‌ వల్ల నెలకు రూ. 57.50 చొప్పున ఏడాదికి రూ. 2147.25 అధికంగా చెల్లించాల్సి వచ్చేది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top