ముప్పు ముంగిట్లో 'పులస'

Pulasa Fish on the threat stage - Sakshi

కాలుష్యం, రసాయనాల ప్రభావంతో అంతరించిపోతున్న అరుదైన చేప

గోదావరిలోకి ఈదలేకపోతున్న వైనం..

మున్ముందు ఇది దొరకడం కష్టమేనంటున్న నిపుణులు 

ఇప్పటికే మార్కెట్‌లో దొరకడంలేదంటున్న మత్స్యకారులు

ఫలితంగా ఒడిశా, బెంగాల్‌ నుంచి దిగుమతి

గ్లోబల్‌ వార్మింగ్‌తో సముద్రంలో తీవ్ర మార్పులు

సాక్షి, అమరావతి : దేశంలోనే అత్యంత రుచికరమైన, ఖరీదైన చేపగా ప్రసిద్ధిగాంచిన గోదావరి పులస చేప కనుమరుగయ్యే దశకు చేరుకుంది. ఏ ఏటికా ఏడు మార్కెట్‌లో పులస కనిపించడమే గగనంగా మారింది. సముద్రంలో నుంచి గోదావరిలోకి ఎదురు ఈదలేక పులస గుడ్లు తేలేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీర ప్రాంతంలో వాతావరణ మార్పులపై ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చి ఫౌండేషన్‌ ఇటీవల కాకినాడలో నిర్వహించిన సదస్సులో పులస జాతి అంతరించిపోయే దశలో ఉన్నట్లు పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సీఐఎఫ్‌ఆర్‌ఐ (సెంటర్‌ ఇన్‌ల్యాండ్‌ ఫిషరీస్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌) అధ్యయనంలో అయితే.. సముద్రం నుంచి గంగా, గోదావరి, నర్మద, యమున తదితర నదుల్లోకి వెళ్లే హిల్సా (గోదావరిలో పులస అంటారు) చేపల ఉత్పత్తి తగ్గిపోతున్నట్లు తేలింది. 

 ఉప్పు నీటి నుంచి మంచినీటిలోకి..
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో జులై నుంచి సెప్టెంబర్‌ మధ్య పులస చేపలు దొరుకుతాయి. పునరుత్పత్తి (గుడ్లు పెట్టేటప్పుడు) సమయంలో ఉప్పు నీటి నుంచి గోదావరిలోకి ఈదుకుంటూ వచ్చే ఈ చేపల్లో ఓమేగా ఆయిల్స్, కొవ్వులు అధికంగా ఉంటాయి. దీనివల్ల ఈ చేపలతో చేసే పులుసు బాగా రుచికరంగా ఉంటుందంటారు. నర్సాపురం, ధవళేశ్వరం, ఎదుర్లంక, రావులపాలెం, సిద్ధాంతం, రాజమండ్రి ప్రాంతాల్లో మత్స్యకారులు నాటు పడవల్లో ప్రత్యేక వలలు వేసి వీటిని పడతారు. కేజీ చేపను డిమాండ్‌ను బట్టి రూ.1,500 నుంచి మూడు, ఐదు వేల వరకూ విక్రయిస్తారు. గతంలో వరదల సమయంలో పులస చేపలు గోదావరి ఒడ్డున, స్థానిక మార్కెట్‌లో విరివిగా కనిపించేవి. కానీ, గత కొన్నేళ్లుగా పులస దొరకడమే గగనంగా మారిందని మత్స్యకారులు చెబుతున్నారు.

కాలుష్యంతోనే కనుమరుగు 
ఖ్యాతిని ఆర్జించిన ఈ చేపలు కొన్నేళ్లుగా కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. గోదావరి, సముద్ర జలాల్లో అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్య ప్రభావం పులస మనుగడపై తీవ్రంగా కనిపిస్తోంది. పరిశ్రమల వ్యర్థాలు.. నగరాలు, పట్టణాల నుంచి విడుదలవుతున్న మురుగు పెద్దఎత్తున కలుస్తుండడం, చమురు నిక్షేపాల కోసం చేస్తున్న డ్రిల్లింగ్, గ్లోబల్‌ వార్మింగ్‌ తదితర కారణాలవల్ల సముద్ర జలాలు కాలుష్యమయంగా మారాయని స్వామినాథన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన సదస్సులో ప్రొఫెసర్లు వివరించారు. అంతేకాదు..
- నీటిలో కాలుష్యం కారణంగా అమ్మోనియా, నైట్రేట్‌ వంటి రసాయనాలవల్ల నీటిలో జిడ్డు ఎక్కువగా ఉంటోంది. దీంతో సముద్రం నుంచి గోదావరిలోకి పులసలు రాలేకపోతున్నాయి. 
సముద్ర తీరం నుంచి 25 కిలోమీటర్ల లోపు చమురు తవ్వకాలు, కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉండడంతో పులస మనుగడ కష్టంగా మారింది. 

అక్కడా తగ్గుతున్న ఉత్పత్తి
నదుల్లోకి రాకముందు సముద్రంలో దొరికే పులస చేపను హిల్సాగా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఇలీష. ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌ సముద్ర జలాల్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. కోల్‌కత మార్కెట్‌లో హిల్సాకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. కానీ, కాలుష్యంవల్ల ఆ ప్రాంతాల్లోనూ వీటి ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని చెబుతున్నారు. గోదావరిలో పులస దొరక్కపోవడంతో ఒడిశా, బెంగాల్‌ నుంచి హిల్సా చేపలను స్థానిక మార్కెట్‌లకు దిగుమతి చేసుకుని పులసలుగా విక్రయిస్తున్నారు.

పులస చేపలకు అనువైన పరిస్థితుల్లేవు
 విపరీతమైన కాలుష్యంతో పాటు అనేక ఇతర కారణాల వల్ల పులస చేపలు గోదావరికి ఎదురీది రాలేకపోతున్నాయి. అందుకే గతంలో బాగా కనిపించే ఈ చేపలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్, కాలుష్యం కారణంగా సముద్రంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మత్స్య సంపదపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది.
– నాగేశ్వరరావు, రిటైర్డ్‌ ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ

పులస దొరకడంలేదు
గతంలో వేటకు వెళ్తే పులసలు బాగా వలకు పడేవి. కొన్నేళ్లుగా అవి పెద్దగా కనిపించడంలేదు. వరదలప్పుడు ఒకటి, రెండు చేపలు మాత్రమే పడుతున్నాయి. ఈ సంవత్సరం అయితే అసలు పులస కనపడనేలేదు. రానురానూ అవి దొరకవనిపిస్తోంది. 
– నారాయణస్వామి, మత్స్యకారుడు, రావులపాలెం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top