మస్త్‌... మజా.. | People Enjoyed Sankranthi Festival in Villages | Sakshi
Sakshi News home page

మస్త్‌... మజా..

Jan 17 2019 7:39 AM | Updated on Jan 17 2019 7:39 AM

People Enjoyed Sankranthi Festival in Villages - Sakshi

పల్లెలో సంక్రాంతికి వచ్చిన బంధువుల సందడి

రెండుమూడు నెలలుగా వేసుకున్న ప్రణాళికలు అమలు చేసేశారు. మూడు రోజుల పండుగను మస్తుగా ఎంజాయ్‌ చేశారు. హరిలో రంగ హరీ అంటూ హరిదాసుల కీర్తనలు... డూడూ బసవన్నల విన్యాసాలు... ఇంటి ముంగట ముచ్చట గొలిపే రంగవల్లులు... నూతన వస్త్రాలు... చిన్నారుల కేరింతలు... బంధుమిత్రులో అప్యాయ ముచ్చట్టు... కొత్త అల్లుళ్ల సందడి... పిండి వంటల ఘుమఘుమలతో సకుటుంబ సపరివారంగా సంక్రాంతి పండగను జిల్లా ప్రజలు జరుపుకున్నారు. సామాన్యుడు, సంపన్నుడనే తారతమ్యం లేకుండా ఎవరి స్థాయిలో వారు దండిగానే ఖర్చుచేశారు. ఈ మూడు రోజుల కోసం జిల్లా ప్రజలు కోట్లలో ఖర్చు చేస్తున్నారంటే సంక్రాంతికి ఇచ్చే ప్రాధాన్యం ఏమిటో తేటతెల్లమవుతోంది.

విజయనగరం మున్సిపాలిటీ: తెలుగువారింట ఎంతో ఆడంబరంగా జరుపుకొనే సంక్రాంతి పండుగ ఖర్చు ఏటేటా పెరుగుతోంది. 2019 సంవత్సరంలో ఈ నెల 14, 15, 16  తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జరుపుకున్న పండుగ కోసం రూ. కోట్లలోనే ఖర్చయినట్లు వ్యాపార వర్గాలు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందులో కేవలం మద్యం, విందుల కోసం రూ 40 కోట్లు ఖర్చు చేయగా... హిందువుల సంప్రదాయ పండగైన సంక్రాంతి నేపథ్యంలో ధరించే నూతన వస్త్రాలకోసం సుమారు రూ. 200 కోట్లవరకు ఖర్చుచేసినట్టు ఓ అంచనా. జిల్లాలో 207 మద్యం దుకాణాలు, 28 బార్‌లు ఉండగా గ్రామాలు, పట్టణాలు సైతం అనధికారికంగా వెలసిన బెల్ట్‌ షాపుల ద్వారా జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు రూ. 60 కోట్ల వరకు  విక్రయాలు జరిగాయని అబ్కారీ శాఖాధికారులు తెలిపారు. పెరుగుతున్న ధరలు, పందాలు, మద్యానికి అధికంగా డబ్బును వెచ్చించడమే ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

పెరిగిన మద్యం.. మాంసం విక్రయాలు
ఈ ఏడాది సంక్రాంతి పండగలో మద్యం విక్రయాలు పెరిగాయి. గతేడాది జనవరి రెండు వారాల్లో రూ. 32 కోట్ల వరకు విక్రయాలు జరగ్గా... ఈ ఏడాది రూ. 60 కోట్లు వ్యాపారం సాగింది. కిలో మటన్‌ ధర రూ. 600లు పలికింది. గతేడాది రూ. 500ల నుంచి రూ. 550లు ఉన్న ధర ఈ ఏడాది రూ. 100 వరకూ పెరగడం విశేషం. అదే విధంగా చికెన్‌ పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది రూ. 140లు,  గ్రామీణ ప్రాంతాల్లో రూ. 150ల నుంచి రూ. 200ల వరకు పలికింది. ఈ మూడు రోజుల పాటు మాంసాహారానికి, పిండివంటకాలు, వినోద ఖర్చుల కోసం రూ.50 కోట్లు ఖర్చు చేయగా అందులో కేవలం మాంసాహారానికి రూ.15   కోట్ల వరకు ఖర్చు చేశారు.

గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అదనపు ఖర్చుతో పందేలకు ఖర్చు చేసింది ఎక్కువగా కనిపించింది. ప్రధానంగా జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు కోడి పందేల జోరు తగ్గిందనే చెప్పాలి. కోడి పందాల్లో రూ. 5 కోట్ల వరకు సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా పది మంది ఒక్క దగ్గరికే చేరేసరికి వ్యాపించే జూదం వ్యసనం కూడా ఈ ఏడాది పెచ్చుమీరింది. పల్లె పట్టణమనే తేడా లేకుండా ఇళ్లల్లో, హోటళ్లలో, గ్రామ శివారుల్లో జరిగిన జూదంతో పాటు కోడి, పొట్టేళ్ల పందేల కోసం రూ. 25కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు ఖర్చు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పండుగకోసం జిల్లాకు చేరుకునేందుకు ప్రయాణ ఖర్చులకూ పెద్దమొత్తంలో వెచ్చించాల్సి వచ్చింది. ఈ మూడు రోజుల్లో సుమారు రూ. 3 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. మామూలుగా జిల్లాలో 400 వరకు బస్సులు తిరుగుతుంటాయి.  అవిగాకుండా ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు అదనపు సర్వీసులు నడుపుతున్నారు. ఈ సర్వీసుల ద్వారా రూ.4 కోట్ల వరకు ఆర్టీసీకీ ఆదాయం చేకూరుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement