పరిహారం సమర్పయామి! | irregularities in input subsidy distribution | Sakshi
Sakshi News home page

పరిహారం సమర్పయామి!

Jan 22 2014 2:57 AM | Updated on Oct 1 2018 2:11 PM

అతివృష్టి, అనావృష్టి .. కారణమేదైనా రైతులు పంటలు నష్టపోయారు.. కొంతమేరకైనా ఉపశమనం కల్పించాలని భావించిన ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసింది.

కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అతివృష్టి, అనావృష్టి .. కారణమేదైనా రైతులు పంటలు నష్టపోయారు.. కొంతమేరకైనా ఉపశమనం కల్పించాలని భావించిన ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసింది.. దీన్ని పొందేందుకు బాధిత రైతులు పట్టాదారు పాసు బుక్కులు, బ్యాంకు ఖాతా పుస్తకాలు ఇచ్చారు.

తర్వాత సీన్ మొత్తం సంబంధిత రెవెన్యూ అధికారి చేతిలోకి మారిపోయింది. సదరు రైతు పొలాల సర్వే నెంబర్లను బినామీ రైతుల పేర నమోదు చేసి బినామీ బ్యాంకు ఖాతా నెంబర్లు వేశారు. డబ్బు పూర్తిగా బినామీ ఖాతాల ద్వారా నేరుగా వీఆర్వో జేబులోకి వెళ్లింది. బాధిత రైతులకు మట్టి మిగిలింది. ఇందుకు సంబంధించి దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామ రెవెన్యూ అధికారిపై ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. 2012 సంవత్సరానికి సంబంధించి మొదటి విడతలో విడుదలైన ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీలో ఈయన తన పరిధిలోని ఎం.కె.కొట్టాల, తువ్వదొడ్డి, గుండ్లకొండ, గుడిమిరాళ్ల, కె.వెంకటాపురం తదితర గ్రామాల రైతుల నోట్లో మట్టికొట్టారు.

 ఆయా గ్రామాల్లోని రైతులకు చెందిన భూములను వివిధ ప్రాంతాల్లో ఉన్న బంధువుల పేర్లతో రాసి వారి ఖాతాలకు పరిహారాన్ని మళ్లించినట్లు ఫిర్యాదులున్నాయి. ఈ మేరకు తువ్వదొడ్డి, ఎం.కె.కొట్టాల, గుండ్లకొండ, గుడిమిరాళ్ల తదితర గ్రామాలకు చెందిన వంద మంది బాధిత రైతులు ఫిర్యాదు చేయగా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు.

 ఒకే సర్వే నెంబర్‌పై పలువురి రైతుల పేర్లు..
 ఒక్కో సర్వే నెంబర్ భూమిని ఐదుగురు అంతకు మించి రైతుల పేర్లతో పరిహారం కోసం నమోదుచేసి జేబులు నింపుకున్నారు. ఒక్క తువ్వదొడ్డిలోని సర్వే నెంబర్ 35లోని భూమిని ఐదుగురు పేర్లపై రాసి రూ. 80వేలు స్వాహా చేశారు. దేవనకొండ మండలం మొత్తం మీద ఇటువంటి అక్రమాలు భారీగా చోటు చేసుకున్నట్లు ఫిర్యాదులున్నాయి.

 ఒకరి ఖాతాకు బదులు మరొకరి ఖాతాకు..
  కె.వెంకటాపురానికి చెందిన దేవరింటి ఉరుకుందమ్మ భూమి(సర్వే నెంబర్ 281)పై ఇన్‌పుట్ సబ్సిడీకి ఇచ్చిన బ్యాంకు ఖాతా(ఏపీజీబీ 19102110248)కాదని ఆలంకొండ ఉరుకుందమ్మ బ్యాకు ఖాతా (ఎస్‌బీఐ: 32829416807)కు జమ అయింది.  

  దళారీ లింగమయ్య ఇన్‌పుట్ సబ్సిడీని డి.తాయమ్మ బ్యాంకు ఖాతాకు జమ చేశారు. సంబంధిత రైతులు బ్యాంకు అధికారులను సంప్రదిస్తే ఇన్‌పుట్ సబ్సిడీలు తారుమారుగా బ్యాంకు ఖాతాల్లో పడ్డాయని, స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. ఇలా వంద మంది రైతుల పరిహారం మరొకరి ఖాతాల్లో పడటం వివాదాస్పదం అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement