గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ కథ ముగిసింది

Gangster Sunil Commits Suicide - Sakshi

అనంతపురం సెంట్రల్‌:  గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌. మూడేళ్ల క్రితం ఈ పేరు జిల్లాలో మారు మోగింది. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ జాబితాలో సునీల్‌ పేరు చేరింది. అలాంటి నేరస్తుని కథ ముగిసింది. శుక్రవారం వైఎస్సార్‌ కడప జిల్లా సబ్‌జైలులో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. వందగొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు కుప్పకూలినట్లు అనేక సంచలన నేరాలకు పాల్పడిన మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ సునీల్‌ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రకటించారు. సునీల్‌ దందాలు అనంతలో కూడా 2014 నుంచి 2015 వరకూ సాగాయి. డబ్బున్న వ్యక్తులు సునీల్‌ పేరు చెబితే హడలెత్తిపోయేవారు. అతని ఆచూకీ కోసం జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకబృందాన్నే తయారుచేసి రంగంలోకి దింపాల్సి వచ్చింది. 2014, 2015 సంవత్సరాల్లో రాయలసీమ జిల్లాలో ఎవరు అదృశ్యమైనా సునీల్‌ గ్యాంగ్‌ పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానించారు. అంతస్థాయిలో సునీల్‌ దందాలు సాగాయి.  

నార్పల ఘటనతో వెలుగులోకి.. 
నార్పల మండల కేంద్రంలో 2018 జనవరి 24న ఎరువుల డీలర్‌ నిచ్చెనమెట్ల ప్రసాద్‌శెట్టిని సునీల్‌ గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేసింది. ఉదయం ఇంటి నుంచి వెళ్ళిన తన భర్త తిరిగి రాలేదని ప్రసాద్‌శెట్టి భార్య పోలీసులను ఆశ్రయించారు. డబ్బుకోసం ప్రసాద్‌శెట్టిని కిడ్నాప్‌ చేసినట్లు ముఠా సభ్యులు ఆయన కుటుంభసభ్యులను బెదిరించారు. ఈ విషయం తెలుసుకొని రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా గాలించారు. మరుసటిరోజు బాధితున్ని సురక్షితంగా కాపాడారు. 

ఇవేకాకుండా డబ్బు కోసం కిడ్నాప్, హత్యలు, బలవంతపు వసూళ్లు చేసి మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌గా పోలీస్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. వీటితోపాటు ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన 19 కేసులు సునీల్‌పై అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఉన్నాయి. ఇంజినీరింగ్‌ విద్యార్థులను చేరదీసి వారిని జల్సాలకు అలవాటు చేసి అనంతరం నేరాల్లోకి దించడంలో సునీల్‌ సిద్ధహస్తుడు.

ఎర్రచందనం అక్రమ రవాణాతో మొదలై... 
2011లో కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో ఎర్రచందనం అక్రమ రవాణాతో ఇతని నేరచరిత్ర ప్రారంభమైంది. తర్వాత కిడ్నాప్‌లు, హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లకు ఒడిగట్టాడు. 2013లో తాడిపత్రి పట్టణానికి చెందిన మెడికల్‌ షాపు యజమానిని తన ముఠాతో కలిసి కిడ్నాప్‌ చేశాడు. డబ్బు ఇవ్వలేదనే కారణంతో అతడిని కర్నూలు జిల్లా జలదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చారు. అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక హత్యాయత్నం, ఐదు కిడ్నాప్‌ కేసులు, రాజంపేటలో ఒక కిడ్నాప్‌ కేసు, సింహాద్రిపురంలో ఆయుధాలు కల్గి ఉన్న కేసు, మైదుకూరులో బెదిరింపులు, బలవంతపు వసూళ్లు కేసు, అనంతపురం జిల్లా కదిరి, నార్పల పోలీస్‌స్టేషన్లలో రెండు కిడ్నాప్‌ కేసులు నమోదయ్యాయి. పోలీసులకు చిక్కకుండా నేరుగా కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్న సునీల్‌ గ్యాంగ్‌ను 2014 ఆగస్టు 11న జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో సునీల్‌తో పాటు కడప నగరానికి చెందిన లాయం హరినాథ్, షేక్‌ హుసేన్‌బాషా, పక్కీర్లగార్ల సునీల్‌కుమార్,  మైదుకూరుకు చెందిన జెన్నే మురళీకృష్ణ ఉన్నారు.  

తాజాగా కర్నూలు జిల్లాలో ఓ హత్యకేసులో జీవితఖైదు శిక్ష పడింది. పదిరోజుల కిందట కోర్టు నుంచి జైలుకు వెలుతూ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. రెండు రోజుల క్రింత బెంగుళూరులో పట్టుబడ్డాడు. నిందితున్ని మళ్లీ అరెస్ట్‌ చేసి శుక్రవారం కడప జిల్లా సబ్‌జైలుకు తరలించారు. అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. దీంతో మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ కథ ముగిసిపోయింది.   

ఇదీ సునీల్‌ నేపథ్యం... 
కడప జిల్లా ప్రొద్దుటూరు స్వస్థలం. కొన్నేళ్లుగా అదే జిల్లా పులివెందులలో ఉంటున్నాడు. తండ్రి మండ్లవెంకటరమణ 2011కు ముందు పులివెందులలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. డిగ్రీ వరకు చదువుకున్న సునీల్‌.. తండ్రి వ్యాపార కార్యకలాపాలకు చేదోడువాదోడుగా ఉండేవాడు. అయితే అనతికాలంలోనే బాగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరప్రవృత్తికి తెర తీశాడు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top