అత్యాచార బాధితులకు వేగంగా సేవలు

Faster services for Molestation victims - Sakshi

మరింత సమర్థవంతంగా వైద్య పరీక్షల నిర్వహణ 

ప్రతి బోధనాసుపత్రిలో ఇద్దరు గైనకాలజిస్టులకు ప్రత్యేక శిక్షణ 

పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్‌ అధికారి నియామకం

వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని న్యాయశాస్త్రం చెబుతుంది. అయితే మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన ఏ ఒక్కరూ.. ఎంతటి వారైనా సరే తప్పించుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన వైద్య పరీక్షలపై దృష్టి సారించింది. పక్కా ఆధారాలతో దోషులను కోర్టు బోనులో నిలిపేందుకు అత్యంత ప్రొఫెషనల్‌గా ముందుకు అడుగులు వేస్తోంది.

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ‘దిశ’ చట్టం రూపొందించిన తర్వాత అత్యాచార బాధితులకు వైద్య శాఖ తరఫున అందాల్సిన సేవలకు మరింత పదును పెంచారు. అర్ధరాత్రి, అపరాత్రి ఇలా ఏ సమయంలో వచ్చినా అలాంటి బాధితులకు వెంటనే వైద్య సేవలు అందించడం, వారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయడం, పకడ్బందీగా నిర్ధారణ పరీక్షలు చేయడం వంటి వాటిపై దృష్టి సారించారు. దీనికోసం 23 మంది గైనకాలజీ వైద్యులకు 30 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యాచారం జరిగిందని నిర్ధారించడానికి బాధితులకు కొన్ని రకాల పరీక్షలు చేయడం ద్వారా తేలిన ఫలితాలే నిందితులకు శిక్ష పడేందుకు ఊతమిస్తాయి. అలాంటి నిర్ధారణ పరీక్షలు తారుమారు కాకుండా చూడటం, పకడ్బంధీగా రక్త పరీక్షలు నిర్వహించడంలో భాగంగా గైనకాలజిస్ట్‌లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

రాష్ట్రంలో మొత్తం 11 బోధనాసుపత్రులు ఉండగా, విజయవాడ ఆసుపత్రి నుంచి ముగ్గురు, మిగతా ఆసుపత్రుల నుంచి ఇద్ద్దరు చొప్పున మొత్తం 23 మంది వైద్యులకు శిక్షణ పూర్తయింది. ఈ బృందంలో ఫోరెన్సిక్‌ డాక్టర్లూ ఉంటారు. ‘దిశ’ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బాధితులకు సత్వర న్యాయం అందించడంలోగానీ, నిందితులకు శిక్షలు వేయడంలో గానీ మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రం ఆదర్శంగా నిలవాలని, ఆ తరహాలో వైద్యులు పని చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు బోధనాసుపత్రుల్లో బాధితులకు సేవలందించడంలో పటిష్ట చర్యలు చేపడుతున్నామని వైద్య విద్యా సంచాలకులు డా.కె.వెంకటేష్‌ ‘సాక్షి’తో అన్నారు.

పక్కాగా రికార్డుల నిర్వహణ ఇలా..
- నిర్ధారణ పరీక్షల ఫలితాల నివేదికలను గతంలో కొంత మంది నిందితులు తారుమారు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇకపై అలా జరగకుండా వైద్యులు రాత పూర్వకంగా ఇచ్చే నివేదికతో పాటు అవే అంశాలను ఎలక్ట్రానిక్‌ రికార్డుల్లోనూ భద్రపరుస్తారు. ఈ నివేదికలను ఎవరూ ఎలాంటి పరిస్థితుల్లోనూ తారుమారు చేయకుండా చూస్తారు. 
బాధితులు ఆసుపత్రికి వచ్చిన వెంటనే వైద్య సేవలు అందించడంలో భాగంగా గైనకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ డాక్టర్లు మూడు షిఫ్టులూ పని చేసేలా ఆదేశాలు.
- బాధితులకు వైద్యం, నిర్ధారణా పరీక్షలు, నివేదికలపై తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి. 
ప్రతిరోజూ ఇలాంటి బాధితులకు అందుతున్న వైద్యం, కేసుల వివరాలు, నివేదికలపై పురోగతి, ఆ నివేదికలను పోలీసులకు సకాలంలో అందించడం.. తదితర విషయాల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక నోడల్‌ అధికారిగా డా.నీలిమను నియమించింది.  
బోధనాసుపత్రుల్లో బాధితులకు వైద్యనిర్ధారణ పరీక్షలు అందించేందుకు ఆధునిక వైద్య పరికరాలను అమర్చుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top