చంద్రబాబు చిత్తశుద్ధి ఇదేనా?: సీఎం జగన్‌

CM YS Jagan Slams U-turn Chandrababu Naidu On English Medium - Sakshi

రైట్‌ టు ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌ అని గర్వంగా చెప్తున్నాం: సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇంగ్లీష్‌ విద్య వద్దంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్‌ గురువారం శాసనసభలో ప్రస్తావించారు. ఇంగ్లీష్‌ చదువులు పేదవారికి అందకుండా ఓ వర్గం యుద్ధం చేస్తోందన్న సీఎం జగన్‌.... ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను ఎత్తివేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

‘నాడు-నేడు ద్వారా 45వేల ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తాం. తొలి విడతలో రూ.3వేలకోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేస్తాం. దేశ, విదేశాలతో పోటీపడే తత్వం ఇంగ్లీష్‌ విద్యతోనే పెరుగుతుంది. ఇంగ్లీష్‌ మీడియం బోర్డు పరీక్షలు రాసే స్థాయిలోకి విద్యార్థులు వెళతారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసం బ్రిడ్జ్‌ కోర్సులు ఏర్పాటు చేశాం. రైట్‌ టు ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌ అని గర్వంగా చెప్తున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు.

చంద్రబాబు చిత్తశుద్ధి ఇదేనా?
‘ఎవరికి ఎన్ని మీడియాలు ఉన్నాయో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముసుగులు వేసుకున్నంత మాత్రాన సరిపోదు. చంద్రబాబు, ఓ వర్గం మీడియా కలిసి ప్రభుత్వంపై దాడికి ప్రయత్నించారు. తెలుగు సబ్జెక్ట్‌ను ఎత్తివేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. మాతృభాషను విస్మరిస్తే అనర్థాలు తప్పవంటూ బ్యానర్‌ ఐటమ్‌లు పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ విద్య రాకుండా ఉండాలని యుద్ధం చేశారు. అయితే ప్రజల్లో వ్యతిరేకత మొదలు కావడంతో చంద్రబాబు వెన్నులో వణుకు మొదలై యూటర్న్‌ తీసుకున్నారు. ఆంగ్ల మాద్యమానికి తాము వ్యతిరేకం కాదంటూ ప్రకటనలు చేశారు. 

రాష్ట్రంలో 44వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 65 శాతం తెలుగు మీడియం స్కూళ్లే. ఇంగ్లీష్‌ ​మీడియం నేనే తెచ్చానంటున్న చంద్రబాబు చిత్తశుద్ధి ఇదేనా?. ఓ పద్ధతి ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు సర్కార్‌ నిర్వీర్యం చేసింది. ఆరువేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేసింది. ఇక ప్రయివేట్‌ స్కూళ్లు 95 శాతం ఇంగ్లీష్‌ మీడియంలోనే ఉన్నాయి. అలాగే ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు యూటర్న్‌ అందరికీ తెలుసు.ఇంగ్లీష్‌ మాద్యమంపై కూడా చంద్రబాబు ద్వంద్వ వైఖరి అందరికీ తెలిసింది. చంద్రబాబు, టీడీపీ నేతల పిల్లలు ఏ మీడియంలో చదివారు?’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ సూటిగా ప్రశ్నించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top