మహిళా మేలుకో..

Chaitanya Women's Association jhansi lakshmi  fire on governments - Sakshi

హక్కుల సాధనకు పోరాడు

చైతన్య మహిళా సంఘం సభ్యురాలు ఝాన్సీలక్ష్మీ

మాటలకే పరిమితమైన ప్రభుత్వాలపై మండిపాటు

రాయచోటి రూరల్‌ : ఈమె పేరు ఝాన్సీ లక్ష్మీ. రాయచోటి పురపాలక సంఘం కార్యాలయంలో జనన,మరణ విభాగంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేతత్వం ఆమెది. అందుకోసం జిల్లా కేంద్రంలోని చైతన్య మహిళా సంఘంలో  16 ఏళ్ల క్రితం చేరింది. వరకట్న వేధింపులకు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. మార్చి 8వ తేది మహిళా దినోత్సవం పురస్కరించుకుని సాక్షి ఆమెతో మాట్లాడింది. నేటి సమాజంలో మహిళ చేస్తున్న పోరాటాలు, ఎదురవుతున్న అడ్డంకులపై తీవ్రంగా స్పందించారు.మాటలకే పరమితమైన ప్రభుత్వాలపై  పోరాడాలని,  హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.  

ప్రశ్న : మార్చి 8న మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు ?
ఝాన్సీ : 1910లో యూరప్‌లో మహిళల పని గంటలను తగ్గించాలంటూ   చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆ పోరాటంలో ఎంతో మంది మహిళలు ప్రాణాలు కూడా కోల్పోయారు. 1910 మార్చి 8వ తేదిన క్లారాజెట్కిన్‌ అనే ఉద్యమ నాయకురాలు అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపు నిచ్చింది.  అప్పటి నుంచి పలు దేశాల్లో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది.

ప్రశ్న :  నేటి సమాజంలో మహిళలు ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు ?
ఝాన్సీ :పాఠశాల బాలిక నుంచి కళాశాలల విద్యార్థినుల వరకు, ఉద్యోగాలకు వెళ్లే మహిళలు ప్రతి నిత్యం ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కుంటున్నారు. ప్రేమించిన అమ్మాయి నాకే దక్కాలని, మోజు పడిన మహిళ తన సొంతం కావాలంటూ పలువురు ఆకతాయిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బరితెగించి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం .

ప్రశ్న :    ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారా ?
ఝాన్సీ :ఎక్కడ తీసుకుంటున్నారు.. వాకపల్లి సంఘటనలో 11 మంది ఆదివాసీ మహిళలపై 21 మంది గ్రేహౌండ్స్‌ పోలీసులు అత్యాచారం చేస్తే, వారికి న్యాయం చేయాలని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం   పట్టించుకోలేదు. అయేషా హత్యలో ఒక కాంగ్రెస్‌ నాయకుడి బంధువు హస్తం ఉందని తెలిసి చట్టం కూడా మూగబోయింది .  స్త్రీకి అన్ని విషయాల్లో సమానత్వం ఉండాలని  నాయకులు సమావేశాల్లో చెబుతుంటారు. అయితే అవి మాటలకే పరిమితం అవుతున్నాయి.  కొన్ని సంధర్బాల్లో అధికారాల్లో ఉన్న పెద్దలు సైతం మహిⶠలను అగౌరవ పరస్తూ మాట్లాడుతున్నారు. ఇటువంటి వారు మహిళలకు ఏం న్యాయం చేస్తారు .

ప్రశ్న :  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయాలపై మీరేమంటారు ?
ఝాన్సీ :ప్రస్తుతం విస్తారంగా ఉన్న సోషల్‌ మీడియాలో కూడా బాలికలను, మహిళలను కించ పరిచే విధంగా వీడియోలు, ఫొటోలు ఉంటున్నాయి. దీని వల్ల కూడా యువత  పక్కదారి పట్టేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. మహిళలపై, ముఖ్యంగా విద్యార్థినులపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ప్రశ్న : మహిళలకు మీరిచ్చే సందేశం ?
ఝాన్సీ :మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు .  తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలపై పోరాడాలి .   హక్కుల కోసం, స్వేచ్ఛ సమానత్వం, సోషలిజం కోసం పోరాడి సాధించుకున్న శ్రామిక మహిళా పోరాటం స్పూర్తిగా తీసుకుని అన్ని రంగాల్లో స్త్రీ ముందుండాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒక బలమైన మహిళా ఉద్యమాన్ని నిర్మించాలి. ఆకాశంలో సగం మనం ... పోరాటం చేద్దాం .

ప్రశ్న : విద్యార్థినుల ఆత్మహత్యలకు కారణాలు ఏంటి ?
ఝాన్సీ : దేశ వ్యాప్తంగా ..ముఖ్యంగా రాష్ట్రంలోని పలు కళాశాలల్లో, మన జిల్లాలోని చైతన్య , నారాయణ కళాశాలల విద్యార్థినులు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు.  కళాశాలల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు చదువుకోవాంటూ ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం ఒక కారణం. విద్యార్థినులపై ఈవ్‌టీజింగ్‌తో పాటు లైంగిక వేధింపులు కూడా మరో కారణంగా తెలుస్తోంది. దీని వెనుక అసలు విషయాలు ఏం ఉన్నాయో విచారించి  ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పాటు ప్రభుత్వానికి కొమ్ము కాచే ఆయా కళాశాలలపై చర్యలు తీసుకోరు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top