
విశ్లేషణ
కొన్ని విషయాలు సున్నితంగా ఉంటాయి. విషయాలు పూర్తి బహిరంగమైనవే. అందు గురించిన చర్చలు హోరాహోరీగా సాగినవే. కానీ పరిస్థితులు ఒక దశ నుంచి ఒకానొక దశకు మారినపుడు అంతా సున్నితం అవు తుంది. ‘ఆపరేషన్ కగార్’ సందర్భంగా ఆపరేషన్ విషయాలు కాదుగానీ నక్సలైట్ల గురించి, నక్సలిజం గురించిన చర్చ సున్నితంగా మారింది. పక్షం రోజులకు పైగా సాగుతున్న కర్రె గుట్టల ఉదంతం, ఎప్పటినుంచో జరుగుతున్న ఆ చర్చకు ఒక తక్షణ లక్షణాన్ని తీసుకు వచ్చింది.
ఇది సున్నితం కావటానికి కారణం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన ‘ఆపరేషన్’ను ఒక భీషణ సమరంగా మార్చటం కాదు. అందుకు నేపథ్య పరిస్థితులు ఇదమిత్థంగా ఫలానా అప్పటి నుంచి మొదలయ్యాయని చెప్పలేముగానీ, సుమారు మూడు దశాబ్దాలుగా కావచ్చు. అవి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినాక మాత్రం తీవ్రం కావటం మొదలైంది.
ప్రస్తుత ప్రభుత్వం తన నక్సలైట్ వ్యతిరేక చర్యలకు ‘ఆపరేషన్ కగార్’ అనే పేరు పెట్టింది. ‘కగార్’ అనే హిందీ మాటకు నిఘంటు అర్థం ‘అంచు’ లేదా ‘చివరి స్థితి’, ‘చివరి దశ’ అని. రాజకీయ అర్థం ‘అంతిమ దాడి’ అని! ఇది ఇతరుల నిర్వచనం కాదు. నక్సలైట్లను, నక్సలిజాన్ని 2026 మార్చ్ చివరి నాటికి అంతం చేసి తీరగలమని హోంమంత్రి అమిత్ షా పదేపదే ప్రకటిస్తున్నారు.
అది సాధ్యమా కాదా అన్నది కాదు ఇక్కడ చేస్తున్న ఆలోచన. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని, సుమారు 57 సంవత్సరాలుగా సాగుతున్న నక్సలైట్ ఉద్యమాన్ని పలువురు సమీక్షిస్తుండవచ్చు. అందులో భాగంగా, పైన ప్రస్తావించిన ఇటీవలి మూడు దశాబ్దాల కాలాన్ని కూడా. అంటే నక్సలిజం బలహీనపడుతూ వస్తున్న మూడు దశాబ్దాలను!
ఎముకలు మెడలో వేసుకోని కాంగ్రెస్
సూటిగా చెప్పుకోవాలంటే, మొదటి సగకాలం బలంగా సాగిన ఉద్యమం, తర్వాత సగకాలం నుంచి బలహీనపడుతూ వస్తున్నది. ఆ బలహీనతలు నాలుగు విధాలు. ఒకటి – సైద్ధాంతికంగా. రెండు – నాయకత్వ పరంగా. మూడు – ఉద్యమ నిర్వహణలో. నాలుగు – జనాదరణ విషయమై!
ప్రభుత్వ అణచివేతలు ఎప్పుడూ ఉన్నవే. అణచివేతకు ఆరంభం తెలంగాణ రైతాంగ పోరాట కాలంలోనే జరిగినపుడు నక్స లిజం తర్వాతి కాలంలో అంతకు భిన్నంగా ఉండగల ఆస్కారమే లేదు. పైగా 1948కి 1968కి మధ్యకాలం 20 సంవత్సరాలు మాత్రమే. అప్పటినుంచి మరో 20 ఏండ్లు గడిచేసరికి నక్సలైట్ ఉద్యమ క్షీణతకు అంకురార్పణ జరిగింది.
గమనించదగినదేమంటే, ఆ కాలమంతా పాలించింది బీజేపీ కాదు... కాంగ్రెస్. కొన్ని రాష్ట్రాలలో ఇతర పార్టీలు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం రాసుకుని, చట్టాలు చేసుకుని, ప్రణాళికలు రూపొందించుకుని, ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించుకున్నప్పటి నుంచి అన్నీ కపటమైన రీతిలో అరకొరగానే అమలయ్యాయి. అందుకే 1947 నుంచి 20 ఏండ్లయే సరికి నక్సలైట్లు అవతారమెత్తారు. అన్ని మలుపులూ 20–20–20 గానే కనిపిస్తు న్నాయి. అదొక విచిత్రం.
‘ఆపరేషన్ కగార్’ తరహా మాటలను కాంగ్రెస్ ఉపయోగించ లేదు, బీజేపీ ఉపయోగిస్తున్నది. చేతలు అవే, మాటలు వేరు. మాటలు వేరవటానికి మంచి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్‌కు 1885 నుంచి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అందులో సామాజిక సమ్మిళితత్వం, ఉదారవాద మధ్యే మార్గం, కొంత అభ్యుదయ ధోరణి, దేశ వ్యాప్తమైన జాతీయత వంటివి ఉన్నాయి. అవి కాలం గడిచినకొద్దీ బలహీనపడుతూ అనేక అవలక్షణాలు ప్రవేశించినా, కనీసం ఎము కలను మెడలో వేసుకునే ధోరణి ఇంకా రాలేదు.
ఆ కారణంగా, నక్సలిజం వెనుక పేదరికం ఉన్నమాట నిజమనీ, అది కేవలం శాంతి భద్రతల సమస్య కాదనీ, పేదల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయ గలమనీ మాటలు, ప్రకటనల రూపంలో చెప్పటం ఎన్నడూ మాన లేదు. అణచివేతలకు సాయుధబలాల ఉపయోగమైతే యథావిధిగా సాగించారు గాని, ‘కగార్’ తరహా ‘అంతిమ దాడి’ అనకుండా జాగ్రత్తపడ్డారు. పౌరహక్కుల సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేసినా, వారికి ‘అర్బన్ నక్సల్స్’ అనే ముద్ర వేయలేదు.
నాగరిక, ప్రజాస్వామిక, ఆధునిక సమాజాలలో ఉదారవాద, ప్రగతిశీల భావనల సంప్రదాయం గురించి తెలిసిందే. ముఖ్యంగా రినైజాన్స్, ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, బ్రిటన్‌లో రాజ్యాంగ ఆవిర్భావ కాలాల నుంచి ఉన్నత తరగతులపై, మధ్యతరగతిపై ఈ ప్రభావాలు మొదలయ్యాయి. ఈ వర్గాలు ప్రగతిశీలమైనవేగానీ, వ్యవస్థలో సంస్కరణలను కోరటం మినహా వ్యవస్థలను కూలదోయా లనేవి కావు.
ఆ పరిమితులను తెలిసినందువల్లనే ఇక్కడ పౌర హక్కుల సంస్థల పాత్రను కాంగ్రెస్ ప్రభుత్వాలు కనీసం ఒక మేర గౌరవించటం, ఒకోసారి వారిని సంప్రదించటం చేస్తుండేవి. ఆ ధోరణి గత పదేళ్లుగా ఎట్లా మారిందో కనిపిస్తున్నదే. ఇది అంతి మంగా వ్యవస్థకు మేలు చేసేది కాదని ప్రభుత్వం గ్రహించవలసిందే తప్ప ఎవరూ చెప్పగల స్థితి కనిపించటం లేదు.
మారిన సమాజ ధోరణులు
ఉద్యమాలకు ఎగుడు దిగుడులు సహజమేగానీ, నక్సలైట్ ఉద్యమం పైన చెప్పిన నాలుగు బలహీనతలలో దేని నుంచి కూడా నిజమైన అర్థంలో బయటకు రాలేక పోయింది. లేనట్లయితే, వారు కర్రె గుట్టల సందర్భంలో ఈ విధంగా చిక్కుకు పోవటం, చర్చల కోసం పది రోజుల్లో నాలుగుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయటం, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరటం, పౌర హక్కుల సంస్థలను కదలించేందుకు ఇంతగా ప్రయత్నించటం వంటి పరిస్థితులు ఏర్పడేవి కావు.
ఇంత జరుగుతున్నా సమాజం నుంచి ఒకప్పటివలె స్పందనలు లేవు. ప్రస్తుత తరాలు వివిధ కారణాల వల్ల మారిపోయాయి. వారి దృష్టి ఇప్పుడు తమ కెరీర్‌పై, ఇతర అంశాలపై ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఒకప్పుడు ఉద్యమానికి పెద్ద బలం. ఇపుడు కొద్ది ప్రాంతాలలోని కొంతమంది ఆదివాసీలు మాత్రం స్థానిక పరి స్థితులనుబట్టి నక్సలైట్లతో కదులుతున్నారు. స్వయంగా ఆదివాసీలైన ప్రజాప్రతినిధులు గతంలో కన్నా ఎక్కువగా స్వప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల వెంట ఉంటున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, వెనుకటి తరాలకు ఉద్యమం పట్ల గురి తప్పి నిరాశ ఏర్పడగా, కొత్త తరాలకు ఒక అగాథం వచ్చి కొత్త ప్రపంచంలో తమ జీవితాలను వెతుక్కుంటున్నారు. ఒకపుడు మధ్యతరగతిలో గణనీయమైన భాగానికి ఆదర్శవాదాలు ఉండేవి. అది సోవియెట్ యూనియన్‌కు, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు, విప్లవకారులకు, సాహిత్య–కళాకార్యకలాపా లకు పచ్చని కాలం. ఆ తరహా మధ్యతరగతి ఇపుడు పిడికెడుగా మిగిలింది. వామ పక్షాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
నక్సలైట్లకు కొత్త రిక్రూట్‌మెంట్లు తగ్గటం ఎప్పటినుంచో ఉన్నది. ఎన్‌కౌంటర్లలో ఒకపుడు ఒకరు చనిపోయినా వార్తలు, ప్రజలలో చర్చలు ఉండేవి. ఇపుడు చాలామంది చనిపోవటం వరుసగా జరిగితే తప్ప వార్తలు, చర్చలు కనిపించటం లేదు. మరొకవైపు సిద్ధాంతాలు, పోరాట పద్ధతులు, సంస్థ నిర్మాణాలు, నాయకత్వాలు ప్రస్తుత ఆధునికమైన, బలమైన ప్రభుత్వ వ్యవస్థలను ఎదుర్కొనగల విధంగా ఉన్నాయనే అభిప్రాయం వారి సానుభూతిపరులలోనైనా ఉందా అన్నది అనుమానమే. పౌరహక్కుల సంఘాల స్పందనలు సైతం స్వీయ సంశయాల మధ్య మందకొడిగానే కనిపిస్తున్నాయి. నక్సలైట్లు, నక్స లిజం భవిష్యత్తు అగమ్యగోచరం కావటానికి వెనుక ఈ పరిస్థితులు, దీర్ఘకాలిక పరిణామాలు అన్నీ ఉన్నాయి.
విషయాన్ని జనాంతికంగా చర్చించుకోవటం ఎందుకంటే, ఒక వైపు పేదరికం, పీడన కొనసాగుదల, ధనిక–పేద తారతమ్యాల పెరుగుదల అనే వాస్తవ స్థితి ఎంత కనిపిస్తున్నదో, ఆ పరిస్థితులను మార్చే సంస్కరణల కోసం లేదా కొత్త వ్యవస్థ ఆవిష్కరణ కోసమని చెప్పేవారు విఫలం కావటం కూడా అంత కనిపిస్తున్నది. ఈ విష యాలు ముఖ్యంగా ‘కగార్’ వంటి సందర్భంలో దాపరికం లేకుండా మాట్లాడటం సున్నితమైనదే!
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు