Guest Column
-
బైబిల్... షేక్స్పియర్... అగథా క్రిస్టీ!
ఎప్పటికీ గుర్తుండిపోయే నా టీనేజ్ జ్ఞాపకం: నేను అగథా క్రిస్టీ నవలల్ని చదవటం! అంతుచిక్కని క్రిస్టీ హత్యోదంతాలలో గల్లంతవుతూ ఉక్కపోత వేసవి మధ్యాహ్నాలను గడిపేవాడిని. ప్రధానంగా హెర్క్యూల్ పాయ్రోట్, మిస్ మార్పుల్ (క్రిస్టీ నవలల్లోని కల్పిత డిటెక్టివ్ పాత్రలు)ల అపరాధ పరి శోధనలు నన్ను కదలనివ్వకుండా చేసేవి. తక్కిన డిటెక్టివ్ పాత్రలు... టామీ, టపెన్స్ బెరెస్ఫోర్డ్; పార్కర్ పైన్, హార్లీ క్విన్ అనే వాళ్ల గురించి నాకసలు ఏమీ తెలియకపోయినా... క్రిస్టీ 66 డిటెక్టివ్ నవలలు రాశారనీ, అవి 200 కోట్ల కాపీలకు పైగా అమ్ముడయ్యాయనీ; బైబిలు, షేక్స్పియర్ రచనలు మాత్రమే ఆ సంఖ్యను దాటిన ప్రచురణలనీ, క్రిస్టీ నవలలు వందకు పైగా భాషలలోకి తర్జుమా అయ్యాయనీ అస్పష్టంగానైనా తెలుసు. అగథా క్రిస్టీ వ్యక్తిగత విషయాలు మాత్రం నాకు దాదాపుగా ఏమీ తెలియదు. అయితే ఆ లోటును, గత వారం నేను అనుకోకుండా చూసిన రెండేళ్ల నాటి లూసీ వర్స్‌లీ ‘అగథా క్రిస్టీ’ జీవిత చరిత్ర భర్తీ చేసింది. ఆమె ఇంగ్లండ్ రచయిత్రి. ఆమె తండ్రి అమెరికన్. క్రిస్టీ అనే పేరు ఆమెకు మొదటి భర్త నుండి వచ్చింది. వాళ్ల ఏకైక సంతానం కుమార్తె రోసాలిండ్. వారి వైవాహిక జీవితం 1914 నుండి 1928 వరకు కొనసాగింది. భర్తకున్న వివాహేతర సంబంధం చివరికి ఆమె చేత అత్యంత బాధా కరమైన విడాకులకు దారి తీయించింది. ఆ తర్వాత రెండేళ్లకు క్రిస్టీ తనకన్నా పదేళ్లు చిన్నవాడైన ఒక పురావస్తు శాస్త్రవేత్తను పెళ్లి చేసుకున్నారు. మధ్య ప్రాచ్యంలో అతడు జరిపిన తవ్వకాల ద్వారానే క్రిస్టీ ఇరాక్ (మెసపటేమియా), ఈజిప్టుల గురించి తెలుసుకున్నారు. భర్త తవ్వకాల పనికి చాలా వరకు క్రిస్టీనే డబ్బును సమ కూర్చారని పుస్తక రచయిత్రి వర్స్‌లీ రాశారు. ప్రతిఫలంగా ఆమెకు ‘డెత్ ఆన్ ద నైల్’, ‘మర్డర్ ఇన్ మెసపటేమియా’, ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్‌ప్రెస్’ అనే మూడు పుస్త కాలు రాసేందుకు ముడి సరకు లభించింది. ఆమె తరచూ భర్త పాల్గొనే పురావస్తు త్రవ్వకాల దగ్గరకు వెళుతూ ఉండేవారు. బహుశా మీలో చాలామందికి అగథా క్రిస్టీ అనే ఆవిడ ‘థ్రిల్లర్’ల నవలా రచయిత్రి అని తెలిసి ఉండొచ్చు. కానీ ఆమె గురించి తెలుసుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ‘మేరీ వెస్ట్మెకాట్’ పేరుతో ఆమె ఆరు రొమాంటిక్ నవలలు రాశారు. ఆమె నిష్ణాతురాలైన నాటక రచయిత్రి కూడా! వాటిల్లో ప్రసిద్ధి చెందిన రెండు నాటకాలు ‘మౌస్ ట్రాప్’, ‘విట్నెస్ ఫర్ ద ప్రాసిక్యూషన్’. మొదటి నాటకాన్ని లండన్ వెస్ట్ ఎండ్ థియేటర్లో 1952 నుండి 2020 వరకూ ప్రద ర్శించారు. ఇంకా నడిచేదే కానీ, కోవిడ్ రాకతో తాత్కాలి కంగా నిలిపి వేయవలసి వచ్చింది. తిరిగి 2021 నుండి నిరవధికంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. హెర్క్యూల్ పాయ్రోట్ ఆమె అత్యంత ప్రసిద్ధ కాల్ప నిక డిటెక్టివ్ పాత్ర. అయితే ఆ పాత్రను మోయటం ఆ ‘కల్పితుడికి’ తలకు మించిన పనైపోయిందని క్రిస్టీ తల పోశారు. 1975 నాటి ‘కర్టెన్’ నవలలో చివరిసారి అతడు కనిపించాక, ‘న్యూయార్క్ టైమ్స్’ తన మొదటి పేజీలో అతడికి శ్రద్ధాంజలి ఘటించింది. అగథా 86 సంవత్సరాలు జీవించారు. ఆమె తన 80లలో కూడా రాస్తూనే ఉన్నారని వర్స్‌లీ వెల్లడించారు. ‘‘ఆమె చనిపోయాక, ఆమె చివరి రాత పుస్తకాల్లో సైతం, తర్వాత రాయబోయే నవల కోసం తన ఆలోచనల్ని రాసి పెట్టుకున్నారు. అవి పూర్తిగా కొత్త ఆలోచనలు. ఇద్దరు విద్యార్థులు ఒక బాలుడిని ఏ కారణం లేకుండానే ఒక ప్రయోగంలా హత్య చేయటం గురించిన ఐడియాలు అవి...’’ అని రాశారు వర్స్‌లీ. అగథా క్రిస్టీ జీవితాన్ని కూడా రహస్యాలు చుట్టు ముట్టాయంటే ఆశ్చర్యంగా ఏమీ అనిపించదు. మొదటి భర్త క్రిస్టీతో తన వివాహ బంధం ఊగిసలాడుతూ ఉన్న సమ యంలో 1926లో ఆమె పది రోజుల పాటు అదృశ్యమై పోయారు. ఆమె కోసం భారీ ఎత్తున గాలింపు జరిగింది కానీ, ఆమె జాడ తెలియలేదు. ‘‘నమ్మకద్రోహం చేసిన తన భర్తపై ప్రతీకారం తీర్చుకోటానికి ఈ మాయలాడి ఏదో పథకం వేసి ఉంటుంది’’ అని విమర్శకులు కొందరు ఆమె గురించి మాట్లాడినట్లు వర్స్‌లీ రాశారు. మహోజ్వలమైన అగథా రచనా జీవితం... ఆరంభంలోనే తడబాటుకు లోనైంది. ఆమె తొలి పుస్తకం ‘ద మిస్టీరియస్ ఎఫైర్స్ ఎట్ స్టైల్స్’ను ఇద్దరు ప్రచురణకర్తలు తిరస్కరించారు. ఆ తర్వాత ‘ద బాడ్లీ హెడ్’ అనే సంస్థ ప్రచురణకు తీసుకుంది. 36 ఏళ్ల వయసులో అగథా 70 కిలోల బరువు ఉండే వారు. తర్వాత సంవత్సరాలలో ఆ బరువు 82 కిలో లకు చేరుకుంది. ఆమె భారీ మనిషి అనడంలో సందేహం లేదు. అగథాకు నివాస గృహాలంటే ఇష్టం. ఆమెకు ఎనిమిది ఇళ్లు ఉండేవి. ఆమె చాలాసార్లు నిర్లక్ష్యపూరితంగా రచన చేసేవారు. వర్సిలీ చెప్పినదాని ప్రకారం... పాయ్ రోట్ ‘ వైట్హెవెన్ మాన్షన్స్‘లో నివసిస్తాడు, కానీ కొన్నిసార్లు అతను ‘వైట్‌హౌస్ మాన్షన్స్‘లో కూడా ఉన్నట్లు చూపిస్తారు. ‘స్లీపింగ్ మర్డర్‘లో, ఒక క్లర్క్, రిసెప్ష నిస్ట్, రైలు ప్రయాణీకుడు... ముగ్గురికీ యాదృచ్ఛికంగా ఒకే పేరు ‘నార్రాకాట్’ పెట్టారు. ఈ పేరు మరో మూడు వేర్వేరు పుస్తకాల్లో ఒక చాంబర్మేడ్, పడవవాడు, పోలీసు అధికారి పేరుగా కూడా కనిపిస్తుంది. 1974లో గుండెపోటు వచ్చి కోలుకున్నాక, ఒక సందర్భంలో అగథా క్రిస్టీని ‘‘మీరెలా గుర్తుండిపోవాలని కోరు కుంటున్నారు?’’ అని ప్రశ్నించారు. ‘‘డిటెక్టివ్ కథలు రాసిన ఒక మంచి రచయిత్రిగా’’ అని ఆమె చెప్పారు. ఆశించినట్టే ఆమె డిటెక్టివ్ కథారచయిత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇంతకూ పరిష్కారం ఏమిటి?
పహల్గామ్లో తీవ్రవాదుల ఘాతుకమైన దాడి ఏప్రిల్ 22న జరిగి వారం రోజులు గడిచాయి. ప్రతిగా భారత ప్రభుత్వం దౌత్య పరమైన చర్యలు కొన్ని తీసుకున్నది గాని, దేశంలో రగులుతున్న ఆగ్రహావేశాలు చల్లారు తున్న సూచనలు లేవు. ‘కశ్మీర్ రెసిస్టెన్స్’ పేరిట దాడి జరిపిన వారిని పట్టుకుని శిక్షించటం ఒకటైతే, ఇటువంటి సంస్థలను మొదటినుంచి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై తగిన ప్రతీకార చర్య అన్నది అంతకుమించిన అవసరంగా సాధారణ భారతీయుల మనస్సులను దహించి వేస్తున్నది. పాక్‌తో గల సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నామన్న ప్రకటన దాని పర్యవసానాల రీత్యా తీవ్రమైనదేగానీ, అంతకుమించిన తక్షణ చర్య, సూటిగా చెప్పాలంటే సైనిక చర్యను జనం కోరుతున్నారు. తీవ్రవాదుల కోసం కశ్మీర్లో ముమ్మరమైన తనిఖీలు సాగు తున్నాయి. అనుమానితులను ఇప్పటికే పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుని కొందరి ఇళ్ళను కూల్చివేస్తున్నారు. సాధారణంగా జరిగేట్లు ఇంతవరకు ఎవరినీ ఎన్కౌంటర్లలో కాల్చివేయలేదు. కశ్మీర్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పర్య టించి సైన్యాన్ని అప్రమత్తం చేశారు. వైమానిక బలగాన్ని కూడా. నౌకా బలాలు విన్యాసాలు జరిపాయి. అనగా త్రివిధ బలాలు సన్నద్ధ మవుతున్నాయన్నమాట. యుద్ధంతో మనకూ నష్టమే!కొద్ది రోజులుగా ప్రతి రోజూ రాత్రి సరిహద్దు దళాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అది ‘తేలిక రకం’ ఆయుధాలతోనన్నది సైన్యం స్వయంగా చెప్తున్నమాట. తేలిక రకం అనే మాట కిందకు పలు రకాల ఆయుధాలు వస్తాయి. వాటిలో ప్రజలు వినే పేర్లు ఇన్సాస్ రైఫిళ్లు, లైట్ మెషీన్ గన్స్, సబ్ మెషీన్ గన్స్. వాటి ప్రయోగంతో రెండువైపులా ప్రాణ నష్టాలు ఇప్పటికి జరగలేదు. సరిహద్దులలో తగినంత దూరం పాటిస్తారు, బంకర్లలో ఉంటారు. గనుక ప్రాణ నష్టాలు సాధారణంగా జరగవు. తేలిక రకం ఆయుధాల వినియోగం స్థానిక కమాండర్ల నియంత్రణలో జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో భారీ ఆయుధాల వినియోగం జరిగితేనే ఘర్షణ పైస్థాయికి వెళ్లినట్లు! త్రివిధ బలాలను అప్రమత్తం చేసినందున పూర్తి స్థాయి యుద్ధమా? 2019లో పుల్వామా వద్ద భారత సైనికులపై దాడిలో 40 మంది చనిపోయిన దరిమిలా పాకిస్తాన్‌లోని బాలాకోట్ టెర్రరిస్టు స్థావరాలపై మెరుపు దాడులు జరిపి అంతకు పరిమితం కావడం వంటిదా? కొద్దిగా ఆలోచించినట్లయితే పూర్తి స్థాయి యుద్ధానికి అవకాశం కన్పించదు. ఇండియా కన్నా పాకిస్తాన్ సైనిక శక్తి తక్కువే గానీ మరీ అంత బలహీనమైనది కాదు. యుద్ధం దీర్ఘకాలం సాగితే పాకిస్తాన్ ఓడుతుంది గానీ భారతదేశానికి కూడా తీవ్ర నష్టాలు కలుగుతాయి. యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనపరచుకోవచ్చునని ఎవరైనా భావిస్తే, కొత్త సమ స్యలు కొని తెచ్చుకోవటమవుతుంది. సగం కశ్మీర్‌తోనే ఇన్ని సమస్య లున్నాయి. అణు యుద్ధానికి ఇపుడెవరూ సుముఖంగా లేరు. కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనపరచుకునే స్థితి అంటూ కనిపిస్తే, అణు ప్రయోగానికి పాక్ సైన్యం వెనుకాడబోదు. తూర్పు పాకిస్తాన్ తమది కాకుండా పోయిందనే ఆగ్రహం వారికి ఇప్పటికీ చల్లారలేదు.అందువల్ల, అటు ఇటుగా బాలాకోట్ నమూనా ప్రతిదాడులకే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాన్ని ముదరనివ్వకండంటూ ఇప్పటికే సూచనలు చేస్తున్న అమెరికా జోక్యాలు తెర వెనుక నుంచి ఎట్లుండవచ్చునన్నది మరో ప్రశ్న. అమెరికా మాటను కాదనే శక్తి భారత, పాకిస్తాన్లలో దేనికీ లేదన్నది ఒక చేదు నిజం. కశ్మీర్లో అంతర్గతంగా టెర్రరిజంపై, మిలిటెన్సీపై ఎటువంటి చర్యలైనా భారత భద్రతాదళాలు యథేచ్ఛగా తీసుకోగలవు. ఆ చర్యలు సుమారు 1990 నుంచి 35 సంవత్సరాలుగా తీసుకుంటున్నవే.అందువల్ల కలిగిన ఫలితాలేమిటన్నది వేరే ప్రశ్న.నీటిని ఆపగలమా?ప్రభుత్వం ఇప్పటికి ప్రకటించిన చర్యలలో నిజంగా తీవ్రమైనది సింధూ ఒప్పందాన్ని సస్పెండ్ చేయటం. 1960 నాటి ఆ ఒప్పందం పాకిస్తాన్‌కు కీలకమైనది. ఆ జలాలు ఆగినా, తగ్గినా వారి వ్యవ సాయం అల్లకల్లోలమవుతుంది. కనుకనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అది తమపై ‘యుద్ధ చర్య’ కాగలదంటూ తీవ్రమైన భాషను ఉపయోగించారు. పాకిస్తాన్‌కు ‘ఒక్క చుక్క’ నీరు కూడా పోనివ్వమని భారత ప్రభుత్వ బాధ్యులు ప్రకటించనైతే ప్రకటించారు గానీ,పోకుండా ఆపటం నిజంగా సాధ్యమా? ప్రపంచబ్యాంకు ఆధ్వర్యాన జరిగిన ఈ అంతర్జాతీయ జలాల పంపిణీ ఒప్పందంలో ఐక్యరాజ్య సమితి పాత్ర ఉంది. బ్యాంకు పక్షాన ‘ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్’ (ఐబీఆర్డీ) సంతకం చేసింది. ఏదైనా వివాదం తలెత్తితే మొదట ‘తటస్థ నిపుణుని’ దృష్టికి, తర్వాత ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్’ ముందుకు వెళ్లాలి. తిరిగి ఇందులోనూ రెండు దేశాల సార్వభౌమాధికారానికి ఏది వర్తిస్తుంది, ఏది వర్తించదనే మీమాంస ఉంది. లోగడ రెండుసార్లు వాస్తవంగా యుద్ధాలు జరిగి నపుడు కూడా ఇటువంటి సస్పెన్షన్లు జరగలేదు. ఇదంతా సాంకేతిక పరమైన కోణం కాగా, నీరు అటు పోకుండా ఆపగల జలాశయ నిర్మా ణాలు అసలు ఇండియాకు లేనే లేవనీ, ఆ నిర్మాణాలకు అనేక చిక్కు లున్నాయనే ఆచరణపరమైన విషయాలను నిపుణులు ప్రస్తావిస్తు న్నారు. అనగా, ఈ చర్య ఎంత ప్రభావం చూపగలిగేది అయినా ఇప్పటికిప్పుడు జరిగేది కాదన్నమాట.వాస్తవాధీన రేఖే పరిష్కారమా?మనం విస్మరించేదేమంటే కశ్మీర్ తరహా అనేక భౌగోళిక, సరిహద్దు సమస్యలను బ్రిటిష్ వలస పాలకులు ప్రపంచమంతటా సృష్టించిపోయారు. భారత–చైనా, భారత–బంగ్లాదేశ్, పాలస్తీనా– ఇజ్రాయెల్ వంటివన్నీ అందుకు ఉదాహరణలు. తిరిగి వాటిని సొమ్ము చేసుకుంటూ పాశ్చాత్య దేశాలు ఇరుపక్షాలకూ ఆయుధాలను అమ్ముకుంటున్నాయి.కశ్మీర్‌కు సంబంధించి ఒక వివేకవంతమైన పరిష్కార మార్గాన్ని మొదటిసారిగా కనుగొన్నది 1972లో అప్పటి ప్రధానులు ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత వారు సిమ్లాలో సమావేశమై, కశ్మీర్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ, లేదా లైనా ఆఫ్ కంట్రోల్)ను శాశ్వత సరిహద్దుగా గుర్తించుకున్నట్ల యితే అన్ని సమస్యలూ సమసిపోగలవని సూత్రప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ, తమ రాజధానులకు తిరిగి వెళ్లి ప్రజాభిప్రాయా నికి జంకి వెనుకకు పోయారు. ఆచరణాత్మకంగా ఆలోచించినట్లయితే, అది మాత్రమే ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం కాగలదా?ఇది భారత–పాకిస్తాన్ సమస్యల పరిష్కారం అయితే, ఇక మిగి లేది కశ్మీర్లో అంతర్గత సమస్యలు. మొదటిది తేలినపుడు రెండవది సగం మేర తేలుతుంది. తక్కినది అభివృద్ధి, ఉపాధి కల్పన, అవి నీతిని అదుపు చేయటం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలతో తప్పకుండా పరిష్కారమవుతుంది. ఈ మాట నేను 3 విడతలుగా 55 రోజుల పాటు కశ్మీర్ అన్ని ప్రాంతాలలో తిరిగి అన్ని వర్గాల ప్రజలతో మాట్లా డిన మీదట అంటున్నది. 1947 నుంచి ఇంతవరకు గల కశ్మీర్ చరిత్ర నేపథ్యంలో అక్కడి ప్రస్తుత పరిస్థితులను, యుద్ధం ద్వారా ఏదైనా తేలగలదా అనే అవకాశాలను, మిలిటెన్సీ–టెర్రరిజాల హెచ్చు తగ్గుల క్రమాన్ని, ముఖ్యంగా 1987 నుంచి తీవ్రవాదం తలెత్తి సాగుతున్న కారణాలను పరిశీలించినపుడు, ఇటువంటి అభిప్రాయం ఏర్పడుతు న్నది. అందువల్ల రెండు దేశాలూ విజ్ఞతతో ఆలోచించి ఇందిరాగాంధీ–భుట్టోల స్ఫూర్తితో రాజీ మార్గానికి రావటం సమస్యను శాశ్వ తంగా పరిష్కరించి ఇరు దేశాలకు ఎనలేని మేలు చేయగలదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అభినయమే ఆభరణం.. నటీనటులకు నగలతో అనుబంధం
పెళ్లి అయినా పేరంటమైనా అయినా నగలు అలంకరించుకోవాల్సిందే అంటారు ఆభరణాల ప్రియులు.. అభినయమైనా, ఆభరణమైనా నటులు ఉండాల్సిందే అంటున్నారు ప్రచార వ్యూహాల రూపకర్తలు. తారలు ఆభరణాల లేబుల్‌ల మధ్య అనుబంధం నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పాలి. కళ్యాణం అనగానే పెళ్లి మాత్రమే కాదు కళ్యాణ్ జ్యుయలర్స్ ప్రకటన కూడా గుర్తొస్తుందంటే కారణం... నాగార్జున అని చెప్పొచ్చు, అమితాబ్ బచ్చన్ అని కూడా చెప్పొచ్చు. దేశంలోని బంగారు ఆభరణాల వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాలు దాదాపు 37% వాటాను కలిగి ఉన్న నేపధ్యంలో ఈ బ్రాండ్ తమిళనాడులో ప్రభు గణేషన్, తెలుగు రాష్ట్రాల కోసం అక్కినేని నాగార్జున, కన్నడిగుల్ని మెప్పించడానికి...శివరాజ్‌కుమార్, మంజు వారియర్... ఇలా నలుగురు ప్రధాన తారలతో ఒప్పందం కుదుర్చుకుంది .నమూనాలు, శైలులు, సున్నితత్వాలు ప్రాధాన్యతలు మన దేశంలో ఉన్న భాషలు మాండలికాలు విభిన్నంగా ఉంటాయి. అందుకే మా బ్రాండ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతీయ బ్రాండ్ అంబాసిడర్‌ని ఎంపిక చేసిందని కళ్యాణ్ జ్యువెలర్స్ మార్కెటింగ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ అంటున్నారు. భారతీయ బంగారు ఆభరణాల మార్కెట్లో పశ్చిమ భారత రాష్ట్రాలు 32% వాటా కలిగి ఉన్నందున ఇదే బ్రాండ్ బాలీవుడ్ నుంచి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కత్రినా కైఫ్‌లను ఎంపిక చేసింది. గతంలో ఈ బ్రాండ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సోనమ్ కపూర్ వంటి వారితో కూడా జట్టు కట్టింది.బంగారం వెలిగిపోతోంది.. ఆభరణాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాగే తారలతో ఆభరణాల బ్రాండ్స్ అనుబంధం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. టాలీవుడ్ హీరో యంగ్‌టైగర్ ఎన్టీయార్ మలబార్ గోల్డ్‌లో మెరిశారు. ఇక రామ్ చరణ్ భీమా జ్యుయలర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు కుమార్తె సితార సైతం ప్రముఖ ఆభరణ బ్రాండ్ పిఎంజె జ్యుయల్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. గతంలో గానీ ప్రస్తుతం గానీ... చూసుకుంటే బ్రాండ్ అంబాసిడర్స్‌గా కావచ్చు కలెక్షన్లను ఆవిష్కరించిన సెలబ్రిటీలుగా కావచ్చు... ర్యాంప్ మీద ఆభరణాలను ప్రదర్శించి కావచ్చు..విభిన్న రకాలుగా అనేక మంది నటీనటులు నగధగలకు తమ స్టార్ డమ్ మెరుపులను జత చేశారు.ఒక్కసారి పరిశీలిస్తే...నటి తమన్నా భాటియా వైట్ అండ్ గోల్డ్ బ్రాండ్‌ను స్వయంగా లాంచ్ చేసింది. అంతేకాదు ఆమె హెడ్ డిజైనర్‌గానూ పనిచేస్తోంది. గతంలో ఓ ఆభరణాలను తాకట్టుపెట్టుకునే మరో బ్రాండ్‌కు ఆమె ప్రచారం చేసింది. బాలీవుడ్ నటి దిశా పటానీ రిలయన్స్ జ్యువెల్స్ రూపొందించిన మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబింబించే ’వింధ్య కలెక్షన్’ను ఆవిష్కరించారు. త్రిభువన్ దాస్ భీమ్జీ జువేరీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌ను నియమించుకుంది. భీమా జ్యువెలర్స్‌కు మొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్, బాలీవుడ్ నటి పూజా హెగ్డే పనిచేస్తే, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. అంతగా పాప్యులర్ కాని ఓ మోస్తరు నటీమణులను సైతం బ్రాండ్స్ ఎంపిక చేసుకోవడం విశేషం. వెడ్డింగ్ పులావ్, గులాబీ లెన్స్ వంటి సినిమాల్లో పలు వెబ్‌సిరీస్‌లలో నటించిన అనుష్కా రంజన్ వరుణ డి జానీ అనే ఆభరణ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మెరిసింది. ఖన్నా జ్యువెలర్స్ నగల ప్రచారంలో నటి చిత్రాంగద సింగ్ పనిచేసింది.కలెక్షన్స్ విడుదల్లోనూ...బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడంతో పాటు కేవలం ఒక కలెక్షన్స్‌ను మాత్రమే ప్రదర్శించడం, విడుదల చేయడం వంటివి కూడా తారలు చేస్తున్నారు.తాప్సీ పన్ను రిలయన్స్ జ్యువెల్స్ ’తంజావూర్ కలెక్షన్’ను లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించారు. జాన్వీ కపూర్ సైతం అంతకు ముందే ఈ తంజావూర్ కలెక్షన్‌ను పరిచయం చేశారు. బెంగాలీ నటి రితాభారి చక్రబర్తి గత ఏడాది కల్యాణ్ జ్యువెలర్స్ అక్షయ తృతీయ ప్రత్యేక కలెక్షన్స్‌ను ప్రారంభించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి పిసి జ్యువెలర్స్ బంగారు ఆభరణాలు సతీసమేతంగా ప్రదర్శించాడు. బంగారు ఆభరణాలను మాత్రమే కాదు బంగారంతో అనుబంధం ఉన్న ప్రతీ దాంట్లో తారలు తళుక్కుమంటున్నారు. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన ప్లస్ గోల్డ్ కు సోనాక్షి సిన్హా ప్లస్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది. అలాగే బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకునే ముత్తూట్ ఫైనాన్స్‌కు టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ జట్టు కట్టారు.ప్రతి పండుగ సీజన్లో మాదిరిగానే అక్షయ తృతీయ రోజున ప్రింట్ మీడియా సిటీ హోర్డింగ్‌లలో గోల్డ్ ఫీవర్ కనిపిస్తుంది. విలాసవంతమైన, మెరిసే ఆభరణాలను ధరించిన బాలీవుడ్, దక్షిణ భారత సినిమాలకు చెందిన తారల ప్రకటనలతో నిండిపోతాయిు. అయితే ఒక సెలబ్రిటీ పని బ్రాండ్ తాజా కలెక్షన్స్‌ను ప్రదర్శించేందుకు పోజులివ్వడమే కాదు – ఇది సీజన్ ట్రెండ్లు సమయాలు సందర్భాలను దృష్టిలో ఉంచుకుని వీరు తప్పనిసరిగా సోషల్ మీడియాలో బ్రాండ్ గురించి మాట్లాడాలి బ్రాండ్ ఆభరణాలను ధరించి ఈవెంట్స్‌లో కనిపించాలి. ఒప్పందాల గోప్యత కారణంగా సెలబ్రిటీ ఎండార్స్మెంట్ల కోసం కేటాయించిన ఖర్చుల గురించి చాలా బ్రాండ్లు పెదవి విప్పడం లేదు. అయితే ప్రతి ప్రచారానికి సెలబ్రిటీని బట్టి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 1 కోటి అంతకంటే ఎక్కువ ముట్టచెబుతారని పరిశ్రమలోని సీనియర్లు చెబుతున్నారు. -
ఈ ప్రశ్నకు జవాబు ఉందా?
ఒక సీజనల్ పొలిటీషియన్ ఎంత ‘లోతు’ తక్కువ రాజకీయాలు చేయగలిగితే,అంతలా వేగంగా మాటలు మారుస్తూ, ఎన్నాళ్ళు అయినా ఎలాగోలా అధికా రంలో ఉండగలడు. అయితే ఒక లీడర్‌గా వారి స్థాయి ఏమిటి అనేది రేపు చరిత్ర ఎటూ రికార్డు చేస్తుంది. తమదొక ‘పొలిటికల్ ఫిలాసఫీ’ అని ఇటువంటివారు నమ్మబలికితే, ‘అదే మని’ ఎవరూ ప్రశ్నించరు. అదేమిటో చెప్పలేక పోయినా, అదేమిటో ఎవరికీ తెలియకపోయినా, అప్పటికే దాని నుంచి ఫలాలు కోసుకునే వర్గం వారి వెనుక తమ ‘టర్న్’ కోసం కనిపెట్టుకుని ఉండి గుంపుగా తయారై ఆ నాయకునికి సమర్థన కూడా మొదలవుతుంది. విషయాల లోతులు మనకు అక్కర లేనప్పుడు, ఆ మేరకే మన ఎంపికలు కూడా ఉంటాయి. అక్కడ ఎక్కువ ఆశించడం తప్పు. ఇటువంటి చోట – ‘నువ్వు నన్ను నమ్మనప్పుడు, నిన్ను నేను మాత్రం ఎందుకు నమ్మాలి?’ అనే లాజిక్ నాయకునికి ఎటూ ఉంటుంది. ఇలా పరస్పర విశ్వాసాలు లేకుండానే ఎన్నికయిన నాయకులకు ఈ అధి కారం, తమకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని వారు అను కోరు కనుక ఇప్పటికి ఇదే ప్రస్తుతం.బ్రిటిష్ పాలన తర్వాత కూడా యాభై–అరవై దశకాల్లో భూమి–నీరు–వ్యవసాయం కేంద్రితంగా మన రాష్ట్ర రాజకీయాలు ఉండేవి. కారణం ప్రజలు జీవన సంస్కృతి ఆ రెండింటి చుట్టూనే ఉండేది. అయితే, డెబ్బై దశకంలో వచ్చిన ‘జై ఆంధ్ర’ ఉద్యమ రూపంగా పొడచూపిన 1972 నాటి సాంఘిక సంజ్ఞను సకాలంలో మనం అర్థం చేసుకోలేక పోయాం. అప్పుడే దాన్ని గుర్తించి దాన్ని ‘అడ్రెస్’ చేసి ఉంటే, మన పరిస్థితి మరోలా ఉండేది. అప్పట్లో ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు మొదలైన రైతు కుటుంబాల యువత ఉపాధి వలసల తీవ్రత తగ్గేది. ఆ వలసల ఒత్తిడితో ఆ దశకం చివర 1978లో కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు అవసరం అయింది. రంగా రెడ్డి ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ వద్ద ఆంధ్రుల రద్దీతో విషయం అర్థమయినా అప్పటికే ఇక్కడ కొత్తగా మహిళా కళాశాలలు కూడా మొదలయ్యాయి.ఏమైంది, గుప్పిట్లోని ఇసుకలా కాలం కళ్ళముందు అలా జారిపోయింది. వెనక్కి తిరిగివచ్చి చూసుకుంటే, ఒకప్పటి తయారీ రంగం ఉపాధి అవకాశాల్ని ‘సర్వీస్ సెక్టార్’ ఆక్రమించాక, మూడు దశాబ్దాలుగా ఎక్కడా నిలకడ లేని ఉపాధిరంగం మిగిలింది. ఇప్పుడు ఉన్నది భుజానికి సంచి (షోల్డర్ బ్యాగ్ఎంప్లాయ్మెంట్) ఉపాధి. ఇక్కడ ఉద్యోగే కాదు,కంపెనీ అధిపతిది కూడా అమూర్త (రూపం తెలి యని) స్థితే. ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో అది ఎన్నాళ్ళో తెలియని స్థితి.అయినా ‘లీడర్’ అంటే ప్రజలు–ప్రాంతము పక్షంగా నిలబడి, అక్కడి సామాజిక పర్యావరణానికి తగిన ‘జియో–ప్లానింగ్’తో అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన వాతావరణం సృష్టించాలి. మన ప్రయోజనాలు కాపాడుకుంటూనే, మనవి కాని బయట పవనాల వేగాన్ని అతడు ఎదుర్కోవాలి. అది లేకపోగా ముప్పై ఏళ్ళుగా ఏదొచ్చినా అదంతా నా వల్లనే అని ‘క్లెయిం’ చేసుకునే పరిస్థితి. ఇక్కడే అస్సలు ఒక నాయకుడి మూలాలు ప్రశ్న అవుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు (74) కాలం చూస్తే, 1995 నుంచి తొమ్మిదేళ్లు; మధ్యప్రదేశ్ దిగ్విజయ్ సింగ్ (78) 1993 నుంచి పదేళ్ళు, శరద్ పవార్ (84) మహరాష్ట్రలో 1988 నుంచి 1995 వరకూ కనిపిస్తారు. వీరిలో చంద్రబాబుది తప్ప మిగతా ఇద్దరిదీ రాజకీయ కుటుంబ నేపథ్యం. దిగ్విజయ్ సింగ్ తండ్రి 1951లో శాసనసభ్యులు, శరద్ పవార్ తండ్రి 1937–1952 మధ్య మూడుసార్లు జిల్లా బోర్డు సభ్యుడు, ఖాదీ, సహకార చక్కెర రైతు సంఘాల రాష్ట్ర నాయకుడు. అయితే, ఈ కాలంలో స్వయం ప్రతిభతో ఎదిగిన నాయకుడు లాలూప్రసాద్ యాదవ్. పట్నా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా చేస్తూ 1977లో 29 ఏళ్లకే ఎంపీగా పార్లమెంట్‌లోకి వెళ్ళిన అరుదైన చరిత్ర ఆయనది. బిహార్‌పై వీరి బలమైన ప్రభావం 1990–1997 వరకూ ఉంది. ఆయన సతీమణి రబ్రీదేవి ప్రభావం 2000–2005 వరకూ కనిపిస్తుంది. స్వాతంత్య్రం తర్వాత ఈ దేశం గురించి సమీక్ష అంటే, దాన్ని మండల్ కమీషన్ నివేదిక అమలు, పి.వి. నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ఈ పూర్వరంగంలో విధిగా చూడాలి. అలా ‘లాలూ– బిహార్’ లోతుల్ని కనుక వెతికితే ఏముంది? ఒక ప్పుడు ఆసియా జ్ఞాన కేంద్రాలకు నెలవైన బిహార్‌లో ‘రీ మ్యాపింగ్ ఇండియా’ మొదలై– జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ అనే మరో రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.వీరితో పోల్చినప్పుడు జగన్ మోహన్ రెడ్డికి సీఎంగా గత అనుభవం లేదు, అయినా ‘జై ఆంధ్ర’ ఉద్యమ 50 ఏళ్ళ చరిత్ర తర్వాత, జరిగిన రాష్ట్ర విభజన వల్ల ‘పరిపాలన–అభివృద్ధి–సంక్షేమం–ఉపాధి’ రాష్ట్రం అంచులకు చేరేలా ‘జియో–ప్లానింగ్’ చేశారు. మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసి, 26 జిల్లాలతో తన వికేంద్రీకరణ పని మొదలు పెట్టారు. ఆ పాలనలోని మంచి–చెడులు గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. అది సహజం కానీ, పార్టీలకు రాజకీయా లకు బయట ఉండి రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలో చించేవారు, ఏపీకి కీలకమైన కాలంలో తాము ఎంత బాధ్యత కలిగిన పౌరసమాజంగా ఉన్నాం? అనే ప్రశ్నకు మాత్రం జవాబు వెతుక్కోవలసి ఉంటుంది.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
పాక్‌కు ఏది సరిపోయే శిక్ష?
పహల్గామ్లో 26 మంది పౌరులను కాల్చి చంపిన భయంకర ఉగ్రదాడి తర్వాత భారత్ లో పాకిస్తాన్ పై ఆగ్రహం పెరుగుతోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) కటువైన ప్రకటన విడుదల చేసింది. దాడి చేయడంలో ఉగ్రవాదులు ప్రదర్శించిన క్రూరత్వాన్ని చూస్తే ఆ ఆగ్రహం ఆశ్చర్యం కలిగించదు. పాక్ మీడియా వ్యాఖ్యాతలు ఇస్లామాబాద్‌ను ఇరికించడానికి భారతదేశమే ఈ దాడిని నిర్వహించిందని దారుణమైన ఆరోపణ చేస్తున్నారు. స్పష్టంగా, వారు ఘోరమైన పరిణామాన్ని ఆశిస్తున్నారు.భద్రతా కేబినెట్ కమిటీ ప్రకటన కావలసిన అన్ని అంచనాలను తీర్చింది. న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ లోని ఛార్జ్ డి’అఫైర్ సహా 14 మంది సిబ్బంది ఇంకా మిగిలి ఉన్నప్పటికీ, పాక్ సైనిక సలహాదారులు, ఇతర సహాయక సిబ్బందిని భారత్ విడిచి వెళ్ళమని ఆదేశించారు. ఇది పాక్ సైనిక సంస్థపై పూర్తిగా నిందను మోపుతుంది. అటారీ చెక్‌పోస్ట్ మూసివేయడం, మిగిలిన వీసా ప్రోటోకాల్స్‌ని నిలిపివేయడం కూడా ఊహించినదే. పాక్‌పై తీవ్రమైన ప్రభావం కలిగించడానికి భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగించలేదు. గత సంవత్సరం చివర్లో, సింధునదీ జలాల ఒప్పందంపై తిరిగి చర్చలు జరిగే వరకు సింధునదీ జలాల కమిషన్ సమావేశాలను నిర్వహించడానికి కూడా భారత్ నిరాకరించింది.కేవలం నిలిపేసింది!భారత్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆలస్యం చేయడానికి పాకిస్తాన్ అతి స్వల్ప కారణాలను చూపుతూ సింధు జలాల ఒప్పందాన్ని ఉపయోగించుకుంటోంది. ఒప్పందంలో ఇరు దేశాల కమిషనర్లు సహా మూడు అంచెల వివాద యంత్రాంగం ఉంది. అది విఫలమైనప్పుడు, 1960లో ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ప్రపంచ బ్యాంకు ఒక తటస్థ నిపుణుడిని నియమిస్తుంది. అది కూడా పని చేయకపోతే, మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయవచ్చు. 1970లలో, భారతదేశం సలాల్ (జమ్ము–కశ్మీర్) ఆనకట్ట ఎత్తును తగ్గించి, దాని అవుట్లెట్లను తెరిచి వేయవలసి వచ్చింది. దీనివలన ఆనకట్ట ఉపయోగం తగ్గి భారీగా బురద చేరి, కోతకు గురైంది. మరొక సందర్భంలో, బాగ్లిహార్ ఆనకట్ట (జమ్ము–కశ్మీర్) 14 ఏళ్ల ఆలస్యాన్ని ఎదుర్కొంది. కిషన్‌గంగా ప్రాజెక్టు మరింత ఇబ్బందులకు గురైంది. ప్రపంచ బ్యాంక్ నియమించిన తటస్థ నిపుణుడు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడే పాక్ మధ్యవర్తిత్వ స్థాయికి వెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత నీటి కొరత ఉన్న దేశాలలో పాకిస్తాన్ 15వది. భారతదేశం ప్రస్తుతం జలాల ఒప్పందాన్ని కేవలం ‘నిలిపివేసింది’. సరిహద్దుకు అవతలి వైపు ఉన్న బాధ్యతాయుతమైన మనుషులు ఈ స్వల్పభేదాన్ని అర్థం చేసుకోవాలి.అయితే, ఇవేవీ భారతదేశ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేవు. భద్రతా కేబినెట్ కమిటీ ప్రకటన ‘ఇటీవల తహవ్వుర్ రానాను వెనక్కి రప్పించినట్లే, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన లేదా వాటిని సాధ్యం చేయడానికి కుట్ర పన్నిన వారిని వెంబడించడంలో భారతదేశం అవిశ్రాంతంగా ఉంటుంది’ అని పేర్కొంది. ఉగ్రదాడి తర్వాత ప్రధాని బిహార్‌లో ఉద్దేశపూర్వకంగానే ఇంగ్లీషులో మాట్లాడుతూ, ‘భారతదేశం ప్రతి ఉగ్రవాదినీ, వారికి మద్దతు ఇచ్చేవారినీ గుర్తించి, వెంబడించి, శిక్షిస్తుంది. మేము వారిని భూమ్మీద ఎక్కడున్నా దొరికించుకుంటాం’ అన్నారు. ఉగ్రవాదాన్ని శిక్షించే చర్యలు దీర్ఘకాలంపాటు కొనసాగుతాయని ఈ ప్రకటన సూచిస్తుంది.ఎలా దాడి చేయొచ్చు?కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఏమి సాధ్యమవుతుంది అంటే కచ్చితంగానే బాలకోట్ తరహా దాడి సాధ్యం కాదు. ఈసారి, పాక్ సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది. స్పష్టమైన ప్రత్యామ్నాయం ఏమిటంటే, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను గుర్తించే లక్ష్యంతో భారత భూభాగం నుంచే 290 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించడం. అది భారత్ తనదని చెప్పుకొంటున్న ప్రాంతం కాబట్టి ఇది సాంకేతికంగా పాకిస్తాన్‌పై దాడి కాదు. మరింత కావాల్సిన లక్ష్యం లష్కర్–ఎ–తొయిబా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న మురిద్కే. ఇది లాహోర్‌కు దగ్గరగా, భారత సరిహద్దు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంది. సాయుధ డ్రోన్ లను ఉపయోగించి కూడా దీనిపై దాడి చేయవచ్చు. దీని వలన కచ్చితత్వంతోపాటు ఎటువంటి ఆనుషంగిక నష్టం ఉండదు.కానీ ఏదైనా సరే, ఎంత సమర్థనీయమైనా సరే, అది యుద్ధ చర్యే. పాకిస్తాన్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలకోట్ తరువాత, అది జాగ్రత్తగా దాడి చేసింది. పెద్దగా నష్టం కలిగించకుండా ప్రతిస్పందనను నమోదు చేసింది. దానికి ప్రధానంగా అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బాజ్వా కారణం. ఆయన దేశ సొంత ప్రయోజనం కోసం పాక్ అంతటా భారతదేశానికి వాణిజ్యాన్ని ప్రతిపాదించిన వాస్తవికవాది. కానీ, యుద్ధం, దాని అన్ని తీవ్రతరమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుత చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వివేకవంతమైన వ్యూహకర్త కాదు. భారతదేశం ఈ యుద్ధాన్ని భరించగలదు. అయినప్పటికీ ముఖ్యంగా ఆయుధాల కోసం దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పుడు ఇది అత్యంత వ్యర్థమైన ఖర్చు.ముక్కలుగా కత్తిరిస్తే!భారత్ యుద్ధాన్ని కాకుండా, ఆర్థిక వృద్ధిని కోరుకుంటోంది. పాక్ నిజంగా యుద్ధాన్ని భరించలేదు. పైగా అంతర్జాతీయ ద్రవ్య నిధి అటువంటి ఖర్చులను దయతో చూస్తుందా లేదా అనేది విషయం కాదు... వాస్తవం ఏమిటంటే, ఆ దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు సంక్షోభంలో ఉన్నాయి. ఇది జెట్ ఇంధనం విషయంలో తీవ్రమైన కొరతకు దారితీస్తుంది. గత తొమ్మిది నెలల్లో ఆరు ప్రధాన శుద్ధి కర్మాగారాలలో ఏవీ చమురు పంపిణీ చేయలేదు. కనీస జ్ఞానం ఉన్న ఏ దేశమైనా, కీలకమైన ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభించదు. అయినా భారత్‌ను పాక్ యుద్ధంలోకి లాగాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. దానికి పోయేది ఏమీ లేదు. అందుకే తక్కువ ‘ఆడంబర’ ప్రత్యామ్నాయం ఏమిటంటే, ఎల్ఓసి అంతటా ఫిరంగి కాల్పులు జరపడం. కానీ మన వైపు పౌరులకు కూడా నష్టాలు ఉంటాయి. పైగా ఈ మొత్తం విన్యాస ప్రయోజనమే ప్రశ్నార్థకం అవుతుంది. ఏమైనప్పటికీ ఉగ్రవాదులు చొరబడతారు. ఏమైనా పాక్ కోరుకుంటున్న దిశలో ఇండియా కొట్టుకుపోకుండా జాగ్రత్త వహించాలి. బదులుగా, చాలా నైపుణ్యంతో పాక్‌ని శిక్షించడాన్ని ఎంచుకోవాలి.చాలా కాలంగా, పాకిస్తాన్ రెండు వైపులా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని అందరూ గుర్తించారు. పాకిస్తాన్ ను మోకరిల్లేలా చేసేవరకు సంబంధిత దేశాలు ఆంక్షలు విధించాలని డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఆంక్షలనేవి పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. ఇకపై పాక్ సైన్యాధికారులు సౌకర్యవంతమైన విదేశాల పర్యటనలు చేయకుండా చూడాలి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి వచ్చే అన్ని బాహ్య నిధులకు అడ్డుకట్ట వేయాలి.అవును, చాలా దేశాలు పాక్‌ను శిక్షించే కార్యక్రమంలో చేరవు. ఉగ్రవాదాన్ని ఎంత ఇష్టపడకపోయినా, పాక్‌ని శిక్షించని దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే పాక్ కోరుకోని విధంగా, దీర్ఘకాలంగా అణచివేతకు గురైన బలూచ్‌లు, పష్తూన్లకు బహిరంగ మద్దతు ప్రకటించే సమయం ఇదే కావచ్చు. ఇది పాక్ రహస్య వ్యూహాల అనుకరణ కాకూడదు. ఇది ప్రపంచాన్ని ముందుకు రావాలని పిలుపునిచ్చే బహిరంగ మద్దతుగా ఉండాలి. ఇక జరిగింది చాలు, పాక్‌కు దాని స్థాయేమిటో తెలియజెప్పాలి.తారా కార్థా వ్యాసకర్త డైరెక్టర్ (పరిశోధన), సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
తహవ్వుర్ రానా (26/11 సూత్రధారి) రాయని డైరీ
‘‘రేపటితో నీ రిమాండ్ ముగుస్తుంది...’’ అన్నాడు నా లాయర్. ‘‘తర్వాత ఏం జరుగుతుంది?’’ అని నేను నా లాయర్ని అడగలేదు. నా తరఫున వాదించటానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాయర్ అతడు. ‘ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ’ నుంచి వచ్చాడు. గవర్నమెంట్ డబ్బులిచ్చి నడిపిస్తున్న లీగల్ అథారిటీ నుంచి, గవర్నమెంటే ఏర్పాటు చేస్తే నా కోసం వచ్చిన లాయర్‌ను నేను అడిగేది ఏముంటుంది? అతని పేరేమో పీయూష్ సచ్దేవ!‘ఏమైనా తిన్నావా?’ అంటాడు!‘ఏమైనా అన్నారా?’ అంటాడు! ‘ఆరోగ్యం ఎలా ఉంది?’ అంటాడు. ‘ఇక ఉండేదా మరి?!’ అంటాడు.ఈ నాలుగే... రోజు మార్చి రోజు అతడు నన్ను అడిగే ప్రశ్నలు. ఊరికే వస్తుంటాడు, పోతుంటాడు. ‘ధైర్యంగా ఉండు, న్యాయం గెలుస్తుంది..’ అంటాడు! నేనడిగానా ‘నాక్కాస్త ధైర్యమివ్వు’ అని, నేనడిగానా ‘న్యాయాన్ని గెలిపించు’ అని!!ఒకరోజు వచ్చాడు. ‘‘నువ్వు మందులేమీ వేసుకోవటం లేదనీ, కనుక నువ్వు చెప్పుకుం టున్నట్లుగా నీకు 33 అనారోగ్యాలేమీ లేవనీ, అందుచేత నీ ఇంటరాగేషన్ టైమ్‌ను తగ్గించే అవసరం లేదనీ వాళ్లు వాదించబోతున్నట్లు తెలిసింది...’’ అన్నాడు! ‘‘నువ్వూ, వాళ్లూ నా గురించి ఏదైనా వాదించుకోండి. అది నాకు సంబంధం లేని విషయం. నాకైతే ఒక ఖురాన్, ఒక పెన్ను, కొన్ని తెల్ల కాగితాలు తెప్పించు...’’ అన్నాను. తెప్పించాక, ‘‘ఇవన్నీ ఎందుకు?!’’ అని అడిగాడు.‘‘పవిత్ర ఖురాన్ గ్రంథం నా డాక్టర్. ఆ డాక్టర్ నాకు ప్రిస్క్రిప్షన్ రాయటానికి ఈ పెన్ను, ఈ తెల్ల కాగితాలు. ప్రవక్త సూక్తులే నేను వేసుకునే మందులు...’’ అని చెప్పాను.తర్వాతి విజిట్‌లో ... ‘‘నా కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించగలవా?!’’ అని అడిగాను.‘‘కష్టం కావచ్చు’’ అన్నాడు. ‘‘ఎందుకు కష్టం కావచ్చు?!’ అన్నాను. ‘‘మీ ‘కుటుంబ సభ్యులు’ ఒకరు పాకిస్తాన్ లో 78 ఏళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకొకరు లాహోర్, రావల్పిండి వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ వారు జైల్లో ఉన్నారని పాకిస్తాన్ అంటోంది కనుక జైల్లోంచి మాట్లాడటం కుదరదు. మీ మిగతా కుటుంబ సభ్యులు పాకిస్తాన్‌లోని కోట్ లఖ్‌పట్ జైల్లో వెంటిలేటర్ మీద ఒకరు, అమెరికా జైల్లో ఒకరు, ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో ఒకరు ఉన్నారు. కాబట్టి వారందరితో ఫోన్లో మాట్లాడించటం కష్టం’’ అన్నాడు నా లాయర్! నా చేతిలో కనుక ఒక గన్ ఉండి ఉంటే అక్కడికక్కడ... అది ఎన్.ఐ.ఎ జైలు అని, నేను పోలీస్ రిమాండ్‌లో ఉన్నానని కూడా చూడ కుండా రూఫ్ టాప్ మీదకు బులెట్‌ని పేల్చి అతడి భయాన్ని కళ్లజూసేవాడిని!‘‘నేను మాట్లాడతానంటున్నది నా కుటుంబ సభ్యులతో మిలార్డ్...’’ అన్నాను నా లాయర్‌తో, కోపంగా. ‘‘కానీ అవతలి వైపు వాళ్లు ఇలాగే వాదిస్తారు మిస్టర్ తహవ్వూర్. అయినా మన ప్రయత్నం మనం చేద్దాం...’’ అన్నాడు. రెండు రోజుల తర్వాత వచ్చి – ‘‘మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి జడ్జి గారు ‘నాట్ అలౌడ్’ అనేశారు...’’ అని చెప్పాడు.అతడు అటు వెళ్లగానే, ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ వచ్చి కూర్చున్నాడు. ‘‘నువ్వు 26ని వదిలి పెట్టటం లేదా? లేక 26 నిన్ను వదిలిపెట్టటం లేదా?’’ లేక... నువ్వూ, 26 కలిపి ఈ దేశాన్ని వదిలిపెట్టటం లేదా?’’ అన్నాడు!నాకర్థమైంది! నా రిమాండ్ రేపే ముగిసి, మళ్లీ రేపే మొదలు కాబోతోంది. ‘‘చెప్పు... మొన్న పహల్గామ్లో 26 మందిని చంపిన టెర్రర్ ఎటాక్ వెనుక నీతో పాటు ఎవరెవరు ఉన్నారు?’’ అని ఫ్రెష్‌గా ఇంటరాగేషన్ మొదలుపెట్టాడు ఎన్.ఐ.ఎ. ఆఫీసర్!! -
పార్టీ స్థాపనకు ఏడాది ముందు...
టీఆర్ఎస్ ఆవిర్భవించే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ లక్ష్య శుద్ధితో విజయం సాధించాలని కేసీఆర్ పార్టీని స్థాపించారు. ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్ రెండు బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజిక వర్గాలు. వీరికి ధన బలంతో పాటు ప్రసార మాధ్యమాల తోడు ఉంది. ఒక్క అంశం అనుకూలంగా లేని, చుట్టూ గాఢాంధకారం అలుముకున్న ప్రతికూల పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు సాహసోపేతం. ఈ సాహసం ఒక్క కేసీఆర్‌కే చెల్లు.విస్తృత చర్చలు– సంతృప్తికర వివరణలుతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపనకు ఒక సంవత్సరం ముందు నుండే సన్నాహాలు, చర్చలు ప్రారంభమయ్యాయి. పార్టీ పేరు, జెండా, కండువా 2000 లోనే నిర్ణయమైనాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన నాటి పరిస్థితుల సమీక్ష జరిగింది. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను, తనపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మల్చుకొని కేవలం 9 మాసాల కాలంలోనే ఎన్టీయార్ అధికారం చేపట్టిన విషయం ప్రస్తావనకొచ్చింది.పార్టీ పెట్టాలనుకునే విషయం తెలిసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష దీపాన్ని ఆరిపోకుండా అప్పటివరకు కాపాడుతున్న సంఘాలు... తెలంగాణ జన సభ, తెలంగాణ మహా సభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్, తెలంగాణ లాయర్స్ అసోసియేషన్, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ స్టడీ ఫోరం, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ జన పరిషత్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ జన సంఘటనలకు చెందిన కొందరు వచ్చి చర్చించడం, తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం జరిగింది. మరికొందరిని కేసీఆరే స్వయంగా ఆహ్వానించి చర్చించారు. తెలంగాణలోని ప్రముఖుల వివరాలను సేకరించి, సందర్భానుసారంగా వారితోనూ కేసీఆర్ చర్చలు జరిపారు. వారిలో దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, వైస్ ఛాన్స్లర్లు నవనీత రావు, ఆర్వీయార్ చంద్రశేఖర్ రావు, జయశంకర్, జస్టిస్ సీతారాం రెడ్డి, గౌరవ నిఖిలేశ్వర్, ‘ప్రెస్ అకాడమీ’ పొత్తూరి వెంకటేశ్వరరావు, జస్టిస్ భాస్కర్ రావు, ప్రొఫెసర్లు మధుసూదన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కోదండరాం రెడ్డి, సింహాద్రి, బియ్యాల జనార్ధన రావు, కంచె ఐలయ్య, కేశవరావు జాదవ్, జల సాధన సమితి దుశర్ల సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రభాకర్, ప్రజ్ఞా మ్యాగజైన్ కెప్టెన్ పాండురంగ రెడ్డి తదితరులున్నారు. వీరిలో చాలామందితో సంప్రదింపులు జరిపి, వారి సూచనలు స్వీకరించారు.తెలంగాణ మేధావులు, విద్యావంతులు, యువకులు, కవులు, కళాకారులతో చర్చలు సాగిస్తూనే, మరొవైపు తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తన వద్దకు వచ్చేవారి సందేహాలన్నిటికీ సవివరమైన, సంతృప్తికరమైన వివరణ ఇచ్చి, అప్పటివరకు అపనమ్మకం ఉన్నవారిలో సంపూర్ణ విశ్వాసం పెంచేవారు. వివిధ పార్టీలలో పనిచేసే నాయకులు ఎవరికి వారుగా కేసీఆర్‌ను కలిసి, చర్చించి, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాత కలిసి పనిచేయడానికి సంసిద్ధత చెప్పేవారు. ఇటువంటి వారిలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, దేశిని చిన్న మల్లయ్య, నాయిని నర్సింహారెడ్డి లాంటి పెద్దలు ఉన్నారు. ఒకానొక సందర్భంలో లక్ష్మీకాంతరావు ‘తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనా? ఎలా సాధ్యమవుతుంది?’ అని సంశయం వ్యక్తం చేయగా, కేసీఆర్ ఇచ్చిన సుదీర్ఘ వివరణ అనంతరం, ‘తెలంగాణ సిద్ధించిందనే భావన మీ జవాబుతో నాకు కలిగింది. ఇక నుండి ఎప్పుడు ఈ విషయంలో అనుమానం వ్యక్తం చేయను, వివరణ కోరను. తెలంగాణ సాకారం అయ్యేంత వరకు మీతోనే నా పయనం’ అని ఉద్విగ్నుడయ్యారు. స్టేట్ ఫైట్– స్ట్రీట్ ఫైట్ కాదు!వివిధ రాజకీయ పార్టీల నాయకుల, కార్యకర్తల తాకిడి రోజురోజుకు పెరుగుతూ రేయింబవళ్ళు చర్చోపచర్చలు సాగేవి. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే చర్చలు మధ్యరాత్రి వరకు జరిగేవి. కొన్ని సందర్భాల్లో తెల్లవారు వరకు ఈ చర్చలు జరిగేవి. ఒకరిద్దరు ఉన్నా, పది మంది ఉన్నా, వందలాది మందిలో ఉన్నా కేసీఆర్ నాలుగైదు గంటలు నిరాఘాటంగా తెలంగాణ ఉద్యమం సాగించే క్రమాన్ని సోదాహరణలతో సహా వివరించేవారు. వారు లేవనెత్తిన సంశయాలకు సంతృప్తికర సమాధానం ఇచ్చి, వచ్చిన వారిలో అత్యధికులను ఉద్యమ కార్యోన్ముఖులను చేసేవారు. ఒకట్రెండు సందర్భాల్లో ఉద్యమం ఆవేశభరితంగా, ఆందోళన పథంలో సాగాలని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేయగా... ఇది స్టేట్ ఫైట్, స్ట్రీట్ ఫైట్ కాదనీ; లక్ష్యం సాధించే వరకు సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం కావాలనీ; పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు కాబట్టి భావవ్యాప్తిని సాగించి, ప్రజలను సమీకరించి, శక్తిగా మలిచి, ఎన్నికల్లో గెలిచి, గాంధీజీ ప్రబోధించిన అహింసా మార్గంలోనే రాష్ట్రం సాధించాలనీ; ఒక ప్రాంతానికి న్యాయం జరగాలని చేసే ఈ ప్రయత్నంలో ఇంకొక ప్రాంతం వారికి ఇబ్బందులు కలిగించడం వాంఛనీయం కాదనీ; తాను శాంతియుత పంథాలో మాత్రమే పయనిస్తాననీ కరాఖండిగా చెప్పేవారు. ఈ విధానం నచ్చని కొందరు మళ్ళీ వచ్చేవారు కాదు. సంకీర్ణాల్లో ఒక్క ఓటైనా విలువే!2000వ సంవత్సరంలో తెరాస పార్టీని స్థాపించవలెననే చర్చలు సాగుతున్న తరుణంలో దేశ రాజకీయ చిత్రపటం అనుకూలంగా ఉందా లేదా అనే సమీక్ష కూడా జరిగింది. కారణం గతంలోని చేదు అనుభవం. అయితే 1969 – 71 నాటి రాజకీయ పరిస్థితులకు పూర్తి భిన్నమైన పరిస్థితులు అప్పుడు నెలకొన్నాయి. ఒకప్పుడు ఇందిరా గాంధీ భారీ మెజారిటీతో ఏక పార్టీ పాలన సాగింది. తదనంతరం కొన్ని దశాబ్దాలు తక్కువ మెజారిటీతో ఏక పార్టీ పాలన, అటుపిమ్మట సంకీర్ణ ప్రభుత్వాల కాలం సాగుతోంది. సంకీర్ణ యుగం రాష్ట్రం సాధించుకోవడానికి అనువైనదిగా తేలింది. 1999వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షను కోల్పోయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభలో ఒక సభ్యుడి ఓటు కూడా అత్యంత కీలకంగా మారిన ఈ పరిణామం ప్రస్తావనకు వచ్చింది. అంటే సంకీర్ణాల యుగంలో మూడు, నాలుగు లోక్‌సభ స్థానాలతో కూడా జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించవచ్చని తేలింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ ప్రజా సమితిని 14 స్థానాల్లో పదింట గెలిపించారు. టీఆర్ఎస్ చిత్తశుద్ధి, నిబద్ధతతో ఉద్యమాన్ని నడిపి ప్రజా విశ్వాసాన్ని పొందగలిగితే, కచ్చితంగా లోక్‌సభకు చెప్పుకోదగిన సంఖ్యకు ప్రతినిధులను తెలంగాణ ప్రజలు తప్పక గెలిపిస్తారనే నమ్మకం కలిగింది. 10 మంది లోక్‌సభ సభ్యులున్నప్పటికీ 1971లో తెలంగాణ రాష్ట్రం సాధించబడక పోవడానికి బలమైన కారణం లోక్‌సభలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని సంఖ్యా బలం ఉండటమే. నాడు అధికార బలంతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజా సమితి సభ్యులను విలీనపర్చుకుంది. కానీ దానికి భిన్నంగా నేడు సంకీర్ణాలే శరణ్యం కాబట్టి పార్లమెంట్లో కనీస ప్రాతినిధ్యంతో ఒత్తిడి ద్వారా రాష్ట్రాన్ని సాధించవచ్చని నమ్మకం కుదిరింది. తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనని సంపూర్ణ విశ్వాసం కలిగిన కేసీఆర్... శాసన సభ్యత్వానికి, డిప్యుటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ప్రజలను ఆలోచింపజేసి, ఆశలు రేకెత్తించి విశ్వాస బీజాలు నాటారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో జలదృశ్యం కేంద్రంగా 2001 ఏప్రిల్ 27న పార్టీ జెండా ఎగురవేయబడింది. పదవీ త్యాగంతో పార్టీ స్థాపించారు, ప్రాణ త్యాగానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రం సాధించారు. వ్యాసకర్త బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేతసిరికొండ మధుసూదనాచారి (బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా) -
తీవ్రవాదులను ఓడిద్దాం... దేశాన్ని గెలిపిద్దాం!
కేవలం పహల్గామ్లోనే కాదు, కేవలం పాకిస్తాన్‌లోనే కాదు, దేశమంతా ఉన్నారు. అవకాశవాద, అవినీతిలో నిండిన ప్రజా, సివిల్ అధికారుల వల్లనే టెర్రరిస్టులు బతుకుతున్నారు, టెర్రరిజం బతుకుతున్నది. టెర్రరిస్టు డబ్బుతో ఆ దేశం, ఈ దేశం అనికాదు, ప్రతి బిజినెస్‌లో పెద్దలు, నేతలు బతుకుతున్నారు. సిగ్గు సిగ్గు! రాబోయే పదేళ్లదాకా, లేదా వందేళ్లదాకా తీవ్రవాదం ఉంటుంది, ఉంచుతారు. వ్యాపారం కోసం, రాజకీయం కోసం! అధికారం కోసం, ఎన్నికల కోసం!అంతర్జాతీయంగా అన్నీ అమ్ముకోవడాలే గాని, జాతీయతా భావనే లేదు. నాయకులకే కాదు, సగం మంది ప్రజలకు కూడా సిగ్గు పడవలసిన ‘దుర్మార్గం’ ఎక్కువగా ఉంది. గుడికి దర్శనానికి వెళుతున్నాం. ప్రసాదాలను, నిజాలను నమ్ముకోకుండా, ఖనిజాలు అమ్ముకుంటున్నాం. ఆ ఖనిజం కోసం అడవులు నరికేస్తున్నాం. ‘సత్యమేవ జయతే’ అని మన జాతీయ నినాదం. 150 కోట్ల జనాల్లో ఎంతమంది నిజం చెబుతున్నారు? ‘రామ్ నామ్ సత్య్ హై’ అనేది మనదేశంలో చిత్తశుద్ధితో వినేవారున్నారా? రామ్ పేరుతో రాజకీయాలు, మతం పేరుతో అధికారాలతో ఆడు కుంటూ, పై పెదవుల కొస నుంచే ‘జై శ్రీరామ్’ అంటున్నాం. రామరాజ్యం రావడం లేదు. భక్తి లేదు, భయం లేదు. గర్భగుడులలో ఒక్కొక్క స్తంభానికి బంగారపు తాపడాలకు డబ్బిస్తాం కానీ పేదవాడికి తిండిచ్చేవాడు లేదు.చదవండి: ఈ దేశాన్ని ఎన్ని ముక్కలు చేద్దామనీ!అమెరికాలో అద్భుత ఆకాశాలను తాకే రెండు భవనాలను విమానాల్లో కూల్చిన దుర్మార్గం ద్వారా వందలాది జీవనాలు ధ్వంసమయ్యాయి(2001 సెప్టెంబర్ 11). నిన్న పహల్గామ్లో 26 మంది ప్రాణాలు తీసిన నేరం చిన్నదేం కాదు. వెంటాడి వేటాడి ఒక్కొక్కణ్ణి పట్టుకు శిక్ష వేస్తాం అంటున్న ప్రభుత్వానికి వందలాది వందనాలు. అమెరికా చేసిందేమిటి? మాటలు కాదు. తూటాలు కాదు. రాజకీయం కాదు. ఎక్కడున్నా సరే వేటాడి పట్టుకుని అమెరికాను కాపాడుకోవడానికి చూపిన కమిట్మెంట్ మనకు ఆదర్శం కావాలి. కమిట్మెంట్ అంటే కట్టుబాటు, దీక్ష. అకుంఠిత దీక్ష కావాలి. అది ఉందా? ఒక్కో మరణానికి కన్నీటి బిందువునైనా ఇచ్చుకున్నామా? క్రికెట్ మైదానంలో ఓ రెండు క్షణాలు నిలబడితే చాలా? కోట్ల కోట్ల వ్యాపారం కోసం, ప్రచారం కోసం మౌనమే సరిపోతుందా? ఒక్కో ప్రాణానికి, ఒక్కో సైనికుడి జీవనానికి డబ్బు ఇచ్చే దమ్ముందా?రాజ్యాంగాన్ని మార్చుకున్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలితం చేశారు. అంటే జరిగినదానికి రాష్ట్ర బాధ్యత లేదు, కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. టూరిస్టులయిన మామూలు మనుషుల్ని టెర్రరిస్టులకు బలిచేసిన ప్రభుత్వానికి బాధ్యత లేదా? పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు, మరికొన్ని భూభాగాలతో అఖండ భారత్ అనే నినాదాలు చేసే పెద్దలు... పక్కనున్న టెర్రరిస్టులు, మన నేల మీద మన వారిని చంపేస్తుంటే ఏం చేస్తున్నట్టు? పదేళ్ల ముందు దద్దమ్మలని పాత పాలకులను తిట్టి పోశాం. యూపీఏ చెత్త పరిపాలన వల్ల తీవ్రవాదులు జనాన్ని చంపేస్తున్నారన్నారు. మరి ఇప్పుడు 2025 దాకా ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహానాయకుడు అవసరం. ప్రతి సైనికుడిని ఒక శక్తిగా మార్చి, తుపాకీలు ఎక్కుపెట్టినట్టే మహా ధైర్యంగా, రాజకీయ నాయకులను కూడా ప్రశ్నించి, నిజం చెప్పి, వ్యూహం నేర్పి భారత దేశాన్ని గెలిపించిన (1971 ఇండో–పాక్ యుద్ధం) ఫీల్డ్ మార్షల్ మానెక్‌శా వంటి సైన్యాధిపతులు మనకు అవసరం. ఆ విధంగా మన దేశాన్ని గెలిపిద్దాం. తీవ్రవాదులను మట్టి కరిపిద్దాం. చెత్త రాజకీయాలు కాదు, మన కైలాస హిమాలయాలున్న మన కశ్మీర్‌ను గెలిపిద్దాం. మన రాజ్యాన్ని, రాజ్యాంగాన్ని, రాజనీతిని నిలబెడదాం.ప్రొ. మాడభూషి శ్రీధర్ మహీంద్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా ప్రొఫెసర్ -
ఈ దేశాన్ని ఎన్ని ముక్కలు చేద్దామనీ!
సంవత్సరాల క్రితం, నేను హిందీ నవలా రచయిత కమలేశ్వర్ రాసిన ‘కిత్నే పాకిస్తాన్’ (ఎన్ని పాకిస్తాన్‌లు) – అనే నవల చదివాను. ఆయన భారతీయ సమాజపు విచ్ఛిన్నకరమైన, వివక్ష, అధికార దాహంతో కూడిన ధోరణులను విజయవంతంగా వ్యక్తపరిచారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా నుండి ప్రజలు వలస వెళ్ళిన నేపథ్యంలో.. ‘ధర్మిక విశ్వాసం’ ఆధారంగా ప్రజలను విభజించే మనస్తత్వాన్ని మనం ఎప్పుడు వదిలించుకోగలం అని మరోసారి అడగవలసిన అగత్యం ఏర్పడింది. మెజారిటీ వర్గంవారి మనుగడకు ప్రత్యేక హక్కులు ఉండే మెజారిటీవాదాన్ని... మెజారిటీ పాలన స్థానంలో ఉంచాలనుకుంటున్నారా? మనం ముర్షిదాబాద్‌తో ప్రారంభిద్దాం. భారత ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించిన తర్వాత చెలరేగిన అల్లర్లు, అక్కడి మైనారిటీ హిందువుల జీవితాలను దుర్భరంగా మార్చాయి. పరిస్థితి దారుణంగా ఉంది. బాధితుల కుటుంబం ఎదుర్కొన్న విచారణలను బట్టి దీనిని అర్థం చేసుకోవచ్చు. ఆ జిల్లాలోని జాఫరాబాద్ నగరానికి చెందిన టీ స్టాల్ యజమాని హృదయ్ దాస్, అతని కోడలు సుచరిత సర్కార్ జార్ఖండ్–పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఉండే రాజ్‌మహల్‌లో ఒక జాతీయ పత్రిక విలేకరికి తమ కథను వివరిస్తు న్నప్పుడు కూడా వారు భయంతో వణుకుతున్నారు. కన్నీళ్లు నిండిన వారి కళ్లలో... జరిగిన బీభత్సం ఛాయలు స్పష్టంగా కనిపించాయి. ఏప్రిల్ 12 ఉదయం ఇదంతా ప్రారంభమైందని వారు చెప్పారు. ప్రతి రోజులాగే, 170 దళిత కుటుంబాలు పనికి సిద్ధమవుతుండగా అకస్మాత్తుగా డజన్ల కొద్దీ సాయుధ వ్యక్తులు వారిపై దాడి చేశారు. వారు తాళం వేసిన ఇళ్లపై రాళ్ళు రువ్వారు. దాస్ దుకాణాన్ని ధ్వంసం చేశారు. కానీ అతను తన నివాసంలోనే ఇరుక్కుపోయాడు. తన ఇంటికప్పుపై రాళ్ళ వర్షం కురుస్తూనే ఉందనీ, వీధుల్లో ఉన్న ప్రజలను కొట్టారనీ దాస్ అన్నారు. అతని సోదరుడు హర్గోబింద్, మేనల్లుడు చందన్ దాక్కునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ గుంపు వారిని పట్టుకుంది. రాడ్లు, కర్రలు. కత్తులతో వారిపై దాడి చేసింది. ‘తిరిగి వచ్చే వారిని తుడిచి పెట్టేస్తామనే ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఆ గుంపు హెచ్చరించింది. ‘మిమ్మల్ని రక్షించే ధైర్యం పాలనా యంత్రాంగంలో ఎవరికి ఉందో చూద్దాం’ అనేది దాడి చేసినవారి మరో సవాల్.సుచరిత భయంతో వణుకుతూ, తాను ముర్షిదాబాద్‌కు ఎప్పటికీ తిరిగి రానని చెప్పింది. ముర్షిదాబాద్, 24 పరగణాలు, పరిసర జిల్లాల్లో చాలా మంది ఇలాంటి కథనాలను వివరించారు. బాధితులంతా తమను రక్షించడానికి పాలనా యంత్రాంగం ఎందుకు ముందుకు రాలేదన్న ఒకే ఒక సాధారణ ప్రశ్న అడుగు తున్నారు. ఇది చట్టబద్ధమైన ప్రశ్న. కానీ వారికి భద్రత కల్పించే బాధ్యత అప్పగించబడిన వారు రాజకీయాలలో బిజీగా ఉన్నారు. వాస్తవానికి, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో మతతత్త్వ మహమ్మారి చాలా సంవత్సరాలుగా విజృంభిస్తోంది. ఇప్పుడు, ఈ విభేదాలు బయటపడ్డాయంతే! రాష్ట్ర బీజేపీ నాయకుడు, ఒకప్పుడు మమతా బెనర్జీకి కీలక అనుయాయి అయిన సువేందు అధికారి, బెంగాల్లో ప్రబలంగా ఉన్న చట్టవిరుద్ధతను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోలేకపోతోందని పేర్కొంటూ, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపున ముర్షిదాబాద్ హింసాకాండ కొన్ని రాజకీయ పార్టీలతో కుమ్మక్కై కేంద్ర సంస్థలు చేసిన పని అని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ చిరకాల హింసాకాండలో నేరస్థులు, బాధితుల ముఖాలు మాత్రమే మారాయి. నాయకుల ప్రకటనలు మాత్రం అలాగే ఉన్నాయి.అందరూ బాధితులే!గత 50 సంవత్సరాలలో దేశంలో జరిగిన అన్ని ప్రధాన హింసాత్మక ఘటనలను సమీక్షిస్తే ఇది నిజమే సుమా అనిపిస్తుంది. 1970–80ల మధ్య, అస్సాంలో హిందీ మాట్లాడే ప్రజలపై జరిగిన దౌర్జన్యాలతో ఈ విద్వేషం ప్రారంభమైందనాలి. దీని ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ రాష్ట్రం నుండి పారిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో, ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా చాలా మంది హిందువులు పంజాబ్‌ను విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఇందిరా గాంధీ మరణం తరువాత జరిగిన అల్లర్లు సిక్కు సమాజాన్ని ధ్వంసం చేసి పడేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని మాలియానా, బిహార్‌లోని భాగల్పూర్ ప్రత్యేకించి ముస్లింలకు చాలా కఠిన పరిస్థితులను తెచ్చిపెట్టాయి. అల్లర్ల తర్వాత భాగల్పూర్ నగరాన్ని విడిచిపెట్టిన పట్టు నేత కార్మికులు తిరిగి రాలేదు. 1990లలో కశ్మీరు పండిట్లు కశ్మీర్ లోయను వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఈ దురదృష్టకర జాబితా సుదీర్ఘమెనది.21వ శతాబ్దం మొదటి రెండు దశాబ్దాలలో పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. అయితే, గత సంవత్సరం మణిపుర్లో చెలరేగిన హింస మళ్ళీ పాత గాయాలను రేపింది. ఇక్కడ, నిర్వాసితులైన వారిలో ఎక్కువ మంది క్రైస్తవ సమాజానికి చెందినవారు. ఈ హింసాత్మకమైన సంక్లిష్ట సంఘటనలు హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులను ఒకేలా ప్రభావితం చేశాయి. కొన్ని సంఘటనలలో వారు నేరస్థులు, మరికొన్నింటిలో బాధితులు. మతం కంటే మెజారిటీవాదం కారణంగా వలసలు ఎక్కువగా జరిగాయి. అల్లర్లను ప్రేరేపించడానికి మత విశ్వాసం ఒక అనుకూలమైన సాధనం. సోషల్ మీడియా విస్తరణ ఇప్పటికే దిగజారుతున్న పరిస్థితిని క్లిష్టతరం చేస్తోంది. ఇది వేర్పాటువాదులు, పుకార్లు వ్యాప్తి చేసేవారు, దుష్ట శక్తులకు శక్తినిచ్చేదిగా సోషల్ మీడియా పనిచేసింది. మన రాజకీయ నాయకులు కూడా విభజనవాద పరిస్థితులను ఉపయోగించు కోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతారు. మతంతో పాటు, ప్రాంతీయ, భాషా వ్యత్యాసాలను ప్రజల మధ్య విభజనను రేకెత్తించడానికి ఉపయోగిస్తున్నారు. భారతదేశంలోనే మరెన్ని దేశాలను సృష్టించాలనీ! -శశి శేఖర్ ‘ది హిందుస్థాన్ టైమ్స్’ సంపాదకుడు -
యువ సృష్టికర్తలకు ప్రోత్సాహం
వాణిజ్య సుంకాలు, స్టాక్ మార్కెట్ అస్థిరతలు ప్రపంచాన్ని వేధిస్తున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తూనే ఉంది. విస్తృత జనాభా, సాంకేతిక సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ, సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ప్రపంచ ‘క్రియేటివ్ పవర్ హౌస్’గా తనను తాను నిరూపించుకునే సత్తా భారత్‌కుంది. కథలు చెప్పడంలో మనకున్న సామర్థ్యాన్ని ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్’ విజన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సృష్టికర్తలను (క్రియేటర్స్) లక్ష్యంగా చేసుకుని భారత మీడియా–వినోద (ఎం అండ్ ఇ) రంగం ముందుకు సాగుతోంది.చలనచిత్రం, సంగీతం, కళ, సాంకేతికత వంటి వివిధ రంగాలలో యువ సృష్టికర్తలకు భారత్ నిలయంగా ఉంది. ముఖ్యంగా ‘డ్యూన్–2’ సినిమా ఆస్కార్ గెలుపునకు కారణమైన అద్భుత వీఎఫ్ఎక్స్ను అందించిన విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ స్టూడియోగా నమిత్ మల్హోత్రాకు చెందిన ‘డీఎన్ఈజీ’ని చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచ వినోద పరిశ్రమలో భారత్ ప్రాబల్యాన్ని తెలియచెబుతూ భారత్‌కు 7వ ఆస్కార్‌ను తెచ్చిపెట్టింది. సంప్రదాయ ఫిల్మ్ మేకింగ్ నుంచి డిజిటల్ నిర్మాణానికి మళ్ళుతూ ప్రపంచ స్థాయి కంటెంట్‌ను రూపొందించడంలో భారత్ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.ముంబయి వేదికగా మే నెలలో భారత ప్రభుత్వం ‘ప్రపంచ ఆడియో–విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)– 2025’ను నిర్వహిస్తోంది. యువ సృష్టికర్తలను పరిశ్రమ దిగ్గజాల చెంతకు చేర్చడం, అంకుర సంస్థలను ప్రోత్సహించడం వేవ్స్‌లో భాగమైన వేవ్స్ ఎక్స్లెరేటర్ (వేవెక్స్) లక్ష్యం. యువ సృష్టికర్తలు అనుభవజ్ఞుల సలహాలు పొందేలా చూడటం, నిధుల లభ్యత, అంతర్జాతీయ అవకాశాలను అందించడం ద్వారా మీడియా, వినోద రంగాల్లో భారత అంకుర సంస్థల స్థాయిని పెంచడానికి వేవ్స్ కృషి చేస్తుంది. గేమింగ్, కృత్రిమ మేధ, మెటావర్స్ వంటి వినూత్న రంగాలపై దృష్టి సారిస్తూ... ఈ రంగం 2023లో రూ. 2,422 బిలియన్ల నుంచి 2027 నాటికి రూ.3,067 బిలియన్లకు పెరుగుతుందని అంచనా.కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, బ్రాహ్మణ్ గేమ్ స్టూడియోస్, కీబౌండ్, వాయన్ క్లౌడ్ వంటి అంకుర సంస్థలు ప్రపంచ పెట్టుబడిదారుల ముందు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేవ్స్ ఒక వేదికగా ఉపకరిస్తుంది. వీటిలో మీడియా – వినోద రంగ సామర్థ్యాన్ని చాటే ల్యాప్వింగ్ స్టూడియోస్, వైగర్ మీడియా వంటి మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అడుగు పెట్టడానికి ఒక పోటీతత్వ అంకుర సంస్థల వాతావరణాన్ని వేవ్స్ అందిస్తుంది. పెట్టుబడులు పొందడానికి, అంతర్జాతీయ అరంగేట్రంలో ఇబ్బందులను తప్పించడానికి, మెంటార్షిప్ అడ్డంకులకు ఒక పరిష్కార వేదికగా నిలుస్తుంది. కేవలం రూ.10,000 పెట్టుబడితో ఒక విజన్‌తో ‘బయోకాన్’ను ప్రారంభించిన నాకు ఇటువంటి ప్రోత్సాహక వేదికల ప్రాముఖ్యం ఏమిటో బాగా తెలుసు.క్రియేటివ్ హబ్ కళలంటే ఇష్టపడే నేను మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ ఫొటోగ్రఫీ (మ్యాప్), సై¯Œ ్స గ్యాలరీ బెంగళూరు కార్యక్రమాలకు నా సహకారాన్ని అందిస్తూ ఉంటాను. ఒక దేశ సంస్కృతి దాని కళలు, శాస్త్రాలతో ముడిపడి ఉందని బలంగా నమ్ముతాను. కళలు, విజ్ఞాన శాస్త్రం రెండూ సృజనాత్మకతలో భాగమే. కళాకారులు వేదికపై ప్రదర్శించే విధంగానే శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేస్తారు.కథలు చెప్పడంలో శతాబ్దాలుగా నైపుణ్యం కలిగిన భారత్... ప్రపంచ సృజనాత్మక శక్తిగా ఎదగడానికి గొప్ప అవకాశం ఉంది. శాస్త్రీయ నృత్యం నుంచి సినిమా వరకు; కామిక్స్ నుంచి ఇమ్మర్సివ్ టెక్నాలజీ వరకు, అధునాతన సృజనాత్మకత ఆవిష్కరణలతో ముడిపడి ఉన్న ఉత్తేజకరమైన యుగంలోకి ప్రవేశిస్తున్నాం. ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్’ అనే ఆలోచన ఈ ఆశయాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తుంది.సృజనాత్మక అంకుర సంస్థలకు ఉత్ప్రేరకంసాంకేతికత, కథ చెప్పడంలోని నైపుణ్యానికి వేవ్స్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. యానిమేషన్, ఏఐ, ఏఆర్/వీఆర్, గేమింగ్, మెటావర్స్ వంటి వినూత్న రంగాల్లో అంకుర సంస్థలకు మద్దతు ఇవ్వడం ద్వారా వేవెక్స్ తన ప్రాబల్యాన్ని చాటడానికి సిద్ధంగా ఉంది.వేవ్స్ బజార్లో 4,500కు పైగా అమ్మకందారులు, 5,900కి పైగా కొనుగోలుదారులు నమోదు చేసుకున్నారు. ఇది భారతీయ అంకుర సంస్థలను అంతర్జాతీయ సంస్థల చెంతకు చేర్చడం ద్వారా ప్రపంచ మీడియా, వినోద రంగాల్లో భారత్ పురోగమనాన్ని మరింత వేగవంతం చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సంప్రదాయ మీడియాకు మించిన ఆవిష్కరణలకు కూడా వేవ్స్ పెద్దపీట వేస్తుంది. కృత్రిమ మేధ ఆధారంగా తయారుచేసిన ప్రకటనల్లో ఎరుకానావిస్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు అగ్రగామిగా ఉన్నాయి. అదే సమయంలో యానిమేషన్, వీఆర్ ద్వారా అమేజ్ స్టూడియోస్, ఆఫ్‌లైన్ హ్యూమన్ స్టూడియోలు కథను చెప్పే విధానాన్ని పునర్నిర్వచిస్తున్నాయి. ఇన్స్కేప్ ఎక్స్ఆర్, విజన్ ఇంపాక్ట్ వంటి ఎడ్–టెక్ వెంచర్లు ఇమ్మర్సివ్ మీడియాతో నేర్చుకునే విధానంలో మార్పులు తెస్తున్నాయి.భవిష్యత్ దృక్కోణంమీడియా, వినోద రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి రూపొందించిన వేవ్స్ వంటి కార్యక్రమాలకు మద్దతునిచ్చే విషయంలో భారత ప్రభుత్వం నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం వేవ్స్ ద్వారా కేవలం అంకుర సంస్థల్లో పెట్టుబడి పెట్టడమే కాదు, కథను చెప్పే, స్వీయ–వ్యక్తీకరణ, భవిష్యత్తును నిర్వచించే సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలోనూ పెట్టుబడి పెడుతున్నాం. అది బయోటెక్ ల్యాబ్ కావొచ్చు, డిజిటల్ స్టూడియో కావొచ్చు... సృజనాత్మకత అనేది రేపటి పరిశ్రమలు, గుర్తింపులను రూపొందించే ఒక సాధనం.వేవ్స్–2025 భారతదేశపు మీడియా, వినోద పరిశ్రమలకు సంబంధించిన వేడుకే కాదు... ఇప్పటి వినోదం, విద్య, సంస్కృతుల్లో సమూల మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రపంచంలో తదుపరితరం సృష్టికర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిచయ వేదిక.ఈ ప్రయాణంలో వేవ్స్ సలహా సంఘంలో నేనూ ఒక సభ్యురాలైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. ప్రపంచ సృజనాత్మక విప్లవానికి నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధమవుతున్న క్షణమిది. ‘భారత్‌లో సృష్టిద్దాం– ప్రపంచం కోసం సృష్టిద్దాం’ అంటూ అనంత కాల్పనిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేద్దాం.-వ్యాసకర్త బయోకాన్ గ్రూప్ చైర్ పర్సన్-కిరణ్ మజుందార్ షా -
అతి జాప్యంతో అదృశ్యమైన న్యాయం!
ఇటీవల ఒక న్యాయ, చట్ట సంబంధమైన వార్తల వెబ్ సైట్లో ఒక ఆశ్చర్యకరమైన వార్తా కథనం కనబడింది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ల ధర్మాసనం ముందు, తన కక్షిదారు చనిపోయాడనీ, ఆ కేసులో నిందితులుగా ఉన్న ఇరవై ఆరు మందీ చనిపోయారనీ ఒక న్యాయవాది చెప్పారు. అవి ప్రతీకార హత్యలేమీ కావు, సహజ మరణాలు. ఈ దేశంలో సామాజిక వ్యవస్థ గురించీ, న్యాయవ్యవస్థ గురించీ ఎన్నో పాఠాలు చెప్పగల నేరమూ–శిక్షా కథ ఇది.బిహార్ లోని అర్వాల్ జిల్లా లక్ష్మణ్ పూర్ బాతే అనే గ్రామంలో 1997 డిసెంబర్ 1న నరసంహారం జరిగింది. రాజధాని పట్నాకు తొంభై కి.మీ. దూరంలో సోన్ నదీ తీరగ్రామం లక్ష్మణ్ పూర్ బాతే. అప్పుడు ఆ ప్రాంతంలో ఎన్నో అరాచకాలకూ, హత్యాకాండలకూ పాల్పడిన రణ వీర్ సేన అనే అగ్రవర్ణాల సేన ఆ గ్రామంలోని దళితుల ఇళ్ల మీద దాడి చేసి చిన్నారి పిల్లలు, స్త్రీలతో సహా 58 మందిని ఊచకోత కోసింది. హతులలో ఒక ఏడాది పసిపాప, ఒక గర్భిణి కూడా ఉన్నారు. నదికి అవతలి ఒడ్డు నుంచి రాత్రి పదకొండు గంటలకు పడవలలో వచ్చి దళిత వాడలో ఇళ్ల తలుపులు విరగ్గొట్టి, లోపలికి చొరబడి, పడుకున్నవాళ్లను పడుకున్నట్టే కాల్చి చంపారు. మూడు గంటల పాటు జరిగిన మారణకాండలో యువతుల మీద అత్యాచారాలు చేసి చంపేశారు. తర్వాత అక్కడికి వెళ్లిన పోలీసులకు అత్యాచారానికి గురైన ఐదుగురు బాలికల నగ్న మృతదేహాలు కనిపించాయి. ఈ నరసంహారం సాగించి, తిరిగి అదే పడవలలో నది దాటిన హంతకులు సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి తమను నది దాటించిన ఇద్దరు పడవవాళ్ల గొంతులు కోసి చంపేశారు.అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ‘దేశానికి సిగ్గు చేటు’ అని అభివర్ణించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. ఈ మారణకాండ కారణాలు, పూర్వరంగం ఏమైనప్పటికీ, తర్వాత జరిగిన న్యాయ విచారణా ప్రక్రియ ఆశ్చర్యకరమైన మలుపులు తిరిగింది. జహానాబాద్ జిల్లా సెషన్స్ కోర్టులో జరగవలసిన ఈ విచారణను పట్నా హైకోర్టు ఆదేశాల మేరకు 1999 అక్టో బర్లో పట్నాకు బదిలీ చేశారు. తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత 2008 డిసెంబర్లో 46 మంది రణవీర్ సేన కార్యకర్తల మీద నేరారోపణలు నమోద య్యాయి. రెండు సంవత్సరాల తర్వాత 2010 ఏప్రిల్ 7న పట్నా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి విజయ్ ప్రకాష్ మిశ్రా నిందితులలో 16 మందికి మరణశిక్ష, 10 మందికి యావ జ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ హత్యాకాండ ‘పౌర సమాజం మీద మచ్చ’ అనీ, ‘పాశవికత్వంలో అరుదైన వాటిలోకెల్లా అరుదైనది’ అనీ తీర్పులో రాశారు. శిక్షితులు అప్పీలుకు వెళ్లగా పట్నా హైకోర్టు జస్టిస్ వీఎన్ సిన్హా, జస్టిస్ ఏకే లాల్ ద్విసభ్య ‘ధర్మాసనం’ 2013 అక్టోబర్ 9న ‘సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా’ శిక్షలన్నిటినీ కొట్టివేసింది. ఇంత అన్యాయమైన హైకోర్టు తీర్పు వార్త ప్రధాన స్రవంతి పత్రికలకు పట్టనే లేదు. యాభై ఎనిమిది మందిని హత్య చేసి, కింది కోర్టులో నేరం రుజువై తీవ్రమైన శిక్షలు కూడా పడిన నేరస్థులను, అలా సాక్ష్యాధారాలు లేవంటూ వదిలివేసిన దుర్మార్గమైన వార్త కన్నా ఆ రోజే క్రికెట్ నుంచి విరమించుకుంటున్నానని సచిన్ టెండూల్కర్ చేసిన ప్రకటన పెద్ద వార్త అయింది! హైకోర్టు తీర్పును బిహార్ ప్రభుత్వమూ, బిహార్‌లోని రాజకీయ పార్టీలన్నీ తప్పు పట్టాయి. ఈ తీర్పును ఎంత మాత్రమూ అంగీకరించడానికి వీలు లేదని, తీర్పును సమీక్షించమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని బిహార్ రాజకీయ పార్టీలు కోరాయి.పట్నా హైకోర్టు తీర్పును సమీక్షించి, కొట్టివేయాలని, మారణకాండ దోషులకు కఠిన శిక్షలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2013 డిసెంబర్లో సుప్రీంకోర్టును అభ్యర్థించింది. 2014 జనవరి 13న సుప్రీంకోర్టు కేసు నమోదు చేసుకుని నోటీసులు పంపింది. నాలుగు సంవత్సరాల తర్వాత 2018, 2019లలో కాస్త విచారణ జరిగి, కేసు మౌలిక దస్తావేజులు, అదనపు పత్రాలు పంపమని కింది కోర్టులను ఆదేశించడంలోనే సమయం గడిచిపోయింది. 2023 ఒక్క సంవత్సరంలోనే ఎటువంటి వాదనలు, విచా రణ జరగకుండా ఆరుసార్లు వాయిదాలు పడ్డాయి. ఈ మధ్యలో కొందరు నిందితులు మరణించారని న్యాయ వాదులు సుప్రీంకోర్టు దృష్టికి తెస్తూనే ఉన్నారు. 2025 జనవరి 1 నాటికి ఇరవై ఆరు మందిలో ఐదుగురు మర ణించారని నమోదయింది. పన్నెండేళ్లుగా వాయిదాలు పడుతూ నత్తనడకలతో సాగుతూ సాగుతూ వచ్చిన ఆ కేసులో 2025 ఏప్రిల్ 3న ఒక నిందితుడి తరఫున వాది స్తున్న న్యాయవాది ‘ఇరవై ఆరు మంది నిందితులూ మరణించారని ధర్మాసనానికి తెలియజేస్తున్నాం’ అన్నారు. వాస్తవ స్థితి ఏమిటో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన ధర్మాసనం కేసును మళ్లీ వాయిదా వేసింది. ఆలస్యం చేయడమంటే న్యాయాన్ని నిరాకరించినట్టే అనే నానుడిని నిజం చేస్తూ మన న్యాయవ్యవస్థ సాచివేత ద్వారా న్యాయాన్ని నిరాకరిస్తున్న తీరు ఇది! ఇప్పుడు నడుస్తున్న మందకొడి వేగంతోనే నేర విచారణలు సాగుతూ పోతే దేశంలో ఆ నాటికి న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ పూర్తి కావడానికి 324 సంవ త్సరాలు పడుతుందని 2018లో నీతి ఆయోగ్ ఒక వ్యూహ పత్రంలో నిర్ధారించింది. ఆ నాటికి దేశం మొత్తం మీద పెండింగ్‌లో ఉన్న కేసులు రెండు కోట్ల తొంబై లక్షలు కాగా, 2025 జనవరి నాటికి ఆ సంఖ్య ఐదు కోట్ల ఇరవై లక్షలకు చేరింది. నీతి ఆయోగ్ అంచనా ప్రకారమే చూస్తే, ప్రస్తుత పెండింగ్ కేసులు పూర్తి కావడానికి 580 సంవ త్సరాలు పడుతుంది!! అప్పటికి వాదులూ ఉండరు, ప్రతి వాదులూ ఉండరు. అటు, ఇటు వాదించే న్యాయ వాదులూ ఉండరు! న్యాయం ఉంటుందా?ఎన్. వేణుగోపాల్ సీనియర్ జర్నలిస్ట్ -
నాడు క్షీరధార! నేడు కన్నీటి వరద!
సర్వదేవ మయే దేవీ–సర్వ దేవా రలంకృతా మామాభిలషితం కర్మ–సఫలం కురు నందినీ ఇది హిందువులు చేసే గోప్రార్థన. ‘సర్వ దేవతా స్వరూపిణీ! సర్వదేవతలచే అలంక రింపబడినదానా! ఓ నందినీ! నా కోరికలను సఫలం చేయి’ అని అర్థం. కేవలం గోవును పూజిస్తే సమస్త దేవత లను పూజించిన ఫలం దక్కుతుందని పెద్దల వాక్కు. ఇది వేదం నుంచి వచ్చిన సంప్ర దాయం, నమ్మకం. హిందువులకు ఆవు ఓ జంతువు కాదు, అభీష్టా లను నెరవేర్చే దైవ స్వరూపం. ఆకలి తీర్చే అన్నపూర్ణ. హిందూ ధర్మానికి వేదం మూలం. వేదం నుంచి యజ్ఞం వచ్చింది. యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది. మానవాళి ఆకలి తీరుతుంది. ఆ యజ్ఞపు అగ్నిహోత్రానికి ఘృతాన్ని (నెయ్యి) సమర్పించాలి. యజ్ఞానికి ఆవు నెయ్యి తప్ప ఇతరాలు సమర్పించరు. గోవు అనే పదానికి సూర్యుడు, యజ్ఞము, భూమి, నీరు, స్వర్గం... ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. ‘‘గవా మంగేషు తిష్ఠంతి/ భువవాని చతుర్దశ’’ గోవు శరీర భాగాలలో పదునాలుగు భువనాలు ఉంటాయట. అంటే సమస్త సృష్టికి మూలం గోవు. గోవు అంత పవిత్రమైనది కాబట్టే దాని పేడ, పంచకాలను కూడా ఔషధాలకు ఉపయోగి స్తున్నాం. శాస్త్రం అంగీకరిస్తున్న సత్యం ఇది.పూర్వకాలంలో గోవులేని ఇల్లు వుండేది కాదు. ఎన్ని గోవులుంటే అంత సంపద వున్నట్లు. మహాభారతంలో విరాటరాజు గోవులను దుర్యోధనాదులు అపహరించటానికి పూనుకున్నది ఈ కారణం వల్లే! ఆవు నడయాడిన ప్రాంతంలో క్షేమం తప్ప, క్షామం ఉండదు. నూతన గృహప్రవేశ కాలంలో గోవును తీసుకువెళ్లేది ఇందుకే!శ్రీ మన్మహావిష్ణువు... గోపాలుడు, గోవిందుడు. గోకులంలో ఉండటం, గోవులను కాయడం ఆయనకు ఇష్టం. కాయడం అంటే కేవలం కాపలా కాదు, అన్ని విధాలా రక్షించడం! శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడన్నది మన నమ్మకం. నిజానికి ఆ స్వామికి నిత్య స్థానము గోలోకమట. అది వైకుంఠం కన్నా పైన ఉంటుందట.అందుకే గోవిందా అని పిలిస్తేనే ఆ స్వామికి ఇష్టం. నవనీత చోరుడు కదా! నేటికీ తిరుమలలో శ్రీవారికి నవనీత నివేదన జరుగుతూనే ఉంది. గోహృదయం తెలిసిన వైఎస్ ఆ శ్రీవారి సన్నిధానంలో గోవులకు ఆస్థానం ఉండాలని 1956లో డైరీ ఫారం పేరుతో చిన్న గోశాల ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. 2002లో దాన్ని ట్రస్టు గానూ, 2004లో శ్రీ వేంకటేశ్వర గోరక్షణ శాలగానూ మార్చారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా, నేను తి.తి.దే. అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తిరుపతి గోశాలను అభివృద్ధి చేసినంతగా మరెవ్వరూ చేయలేదు అన్నది అతిశయోక్తి కాదు. రైతు హృదయమే కాదు, రైతుకు సంపద అయిన గోçహృదయం కూడా తెలిసినవారు రాజశేఖరరెడ్డి. ఆయన ఆదేశంతో గోసంరక్షణ కోసం తిరుపతిలో మూడు రోజుల పాటు ‘వందే గోమాతరం’ పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాం. నోబెల్ బహుమతి గ్రహీతలైన ఇద్దరు ప్రముఖులు, అరవై మందికి పైగా గోసంరక్షణ ఉద్యమకారులు, వివిధ పీఠాధిపతులు ఆ సదస్సులో పాల్గొన్నారు. ఔషధీకరణ రీత్యా గోవిసర్జితాలు ఎంత ముఖ్యమైనవో, వీరు తమ ప్రసంగాల ద్వారా నిరూపించారు. గోసంరక్షణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరించారు. వందే గోమాతరం సదస్సును దేశమంతా ప్రశంసించింది. ఎందరో పీఠాధిపతులు ఆశీస్సులు పంపారు. అప్పటి రాష్ట్రపతి రాజశేఖర రెడ్డి గారిని అభినందిస్తూ లేఖ పంపారు.శ్రీవారి సన్నిధానంలో ఉన్న గోశాలను మరింత విస్తృత పరచాలన్న రాజశేఖర రెడ్డి ఆదేశానుసారం పలమనేరులో అతి పెద్ద గోశాలకు అంకురార్పణ చేశాం.తండ్రి వలెనే ప్రత్యేక శ్రద్ధ వై.ఎస్. జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి వలెనే గోసంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. గోసంపద మరింత విస్తరించాలని సాహివాల్, గిర్, కాంక్రీజ్ వంటి నాణ్యమైన దేశవాళీ గోవులు సుమారు 550 తెప్పించారు. రిలయన్స్, మై హోమ్, ఇతర పారిశ్రామిక వేత్తల సహాయంతో ఈ గోవులను పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తెప్పించారు. రవాణాలో అవి ఇబ్బందులకు గురి కాకూడదని, అప్పటి రైల్వే మంత్రితో మాట్లాడి ప్రత్యేక కంపార్టుమెంట్ల ద్వారా తెప్పించడం జరిగింది. ఇదీ నాటి ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న శ్రద్ధ.పూర్వకాలపు పద్ధతిలో కవ్వంతో చిలికి వెన్నతీసి, దానిని తిరుమలలో ధూప దీప నైవేద్యాలకు, అన్నప్రసాదాలకు వినియోగించాలని ఏర్పాట్లు చేయడం జరిగింది. కవ్వంతో చిలికి వెన్న తీయడాన్ని బిలోనా పద్ధతి అంటారు. దీనికి 5 కోట్ల నిధిని కేటాయించాం.ఈ 550 గోవుల ద్వారా పునరుత్పత్తి చేసి నాణ్యమైన గోవుల సంఖ్య మరింత పెంచాలని నిర్ణయించాం. దీనికి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు సహకారం తీసుకున్నాం. దాదాపు 48 కోట్ల రూపాయల ఖర్చుతో ఆవుల కృత్రిమ గర్భధారణకు ప్రయ త్నాలు చేస్తూ, అందులో 90 శాతం ఆడ దూడల జననం కొరకు బృహత్ సంకల్పం చేశాం.నవనీత చోరుడు, నవనీత ప్రియుడు అయిన వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత అనంతరం నవనీత (వెన్న) నివేదన చేస్తారు. ఆ వెన్నను పూర్వం బయట నుంచి కొని తీసుకువచ్చేవారు. స్వామికి వెన్న కొనడం తగదు అని తిరుమలలో గోశాలను ఎనిమిది ఎకరాలకు విస్తరించేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. అందులో 50 సాహివాల్ గోవులను ఉంచి, శ్రీవారి సేవకులైన మహిళల ద్వారా వెన్న చిలికించారు. ఆ వెన్నను ప్రతిదినం గోశాల నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి నవనీత సేవకు అందేలా ఏర్పాటు చేశారు.శ్రీవారికి నివేదించిన వివిధ రకాల పుష్పాలను వృథాగా పారేయక వాటి ద్వారా అగరుబత్తీలు, తదితర పరిమళ ద్రవ్యాలు తయారు చేయడానికి, గోమయంతో సబ్బులు తదితర 14 ఉత్పత్తులు గోశాల ద్వారా రావటానికి ముఖ్య కారకులు జగన్ గారే! ఈ రోజు ఆ ఉత్పత్తుల ద్వారా 40 కోట్ల రూపాయల వ్యాపారం జరుగు తోంది. శ్రీవారికి దాదాపు 10 కోట్ల లాభం వస్తోంది. డబ్బు విషయం పక్కన పెడితే, కొన్ని కోట్ల గృహాలలో శ్రీవారి అగరుబత్తీలు వెలు గుతూ తిరుమలను తలపిస్తున్నాయి.అలిపిరి దగ్గర గోప్రదక్షిణశాలను పూర్తి చేసి భక్తులకు అందు బాటులోకి తెచ్చింది జగన్ గారే. ఆవు అలమటిస్తోంది! కొండంత చేసినా కొంచెంగా ఉండటం మాకు అలవాటు. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిగా చేశాం తప్ప ప్రచారం కోసం కాదు. చేసినవి చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ కళ్ళు మూసుకుని కనిపించలేదు అంటే అది తప్పు!ఇరువురు ముఖ్యమంత్రులు ఇంతగా అభివృద్ధి చేసిన గోశాల నేడు దీనంగా ఉంది. ఆవు అలమటిస్తోంది. క్షీరధార బదులు, కన్నీటి ధార విడుస్తోంది. నిజం చెబితే దాన్ని స్వీకరించాలి, సరిదిద్దుకోవాలి. అంతేగానీ విమర్శకు విలవిలలాడిపోయి ఎదురుదాడికి దిగితే,దొంగ కేసులు పెడితే అది వారికే నష్టం. నేను కోరేది ఒక్కటే! అధికారాలు, ప్రభుత్వాలు మారవచ్చు. కానీ పీఠంపై ఎవరున్నా శ్రీవారికి ఇష్టమైన ‘గోపతు’లుగా ఉండాలి తప్ప, ‘గోఘ్నులు’గా ఉండకూడదు అని!భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
బిహార్ ఎన్నికలు... ఎన్నెన్నో ప్రశ్నలు!
బిహార్ రాష్ట్రం 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలనీ; వలసలు నియంత్రించాలనే డిమాండ్స్ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్లో బిహార్ రాష్ట్రానికి పెద్ద పీట వేసి అందరికంటే ముందుగానే బీజేపీ అక్కడ ప్రచారం మొదలుపెట్టింది. గత ఎన్నికల వరకు ఎన్డీయే కూటమిలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ)దే పైచేయిగా ఉండేది. కానీ, ఐదేళ్లలో రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీ అగ్రవర్ణాలపై తన పట్టును కాపాడుకుంటూనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రెండు దశాబ్దాలుగా జేడీ(యూ) ఓటు బ్యాంకుగా ఉన్న ఓబీసీలను, దళితులను తన వైపు తిప్పుకుంది. నితీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో, పరిపాలనా సంస్కరణలతో లబ్ధిపొందిన ఈ వర్గాలను ఆకర్షించడం ద్వారా... బీజేపీ తన ‘సామాజిక’ కూటమిని బలోపేతం చేసుకుంది. సామాజిక న్యాయ పోరాటంలో కీలక పాత్ర పోషించిన లోక్ జన్ శక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపకులు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆ పార్టీ తన బలాన్ని కోల్పోయింది. ఆ పార్టీ తమ గుర్తింపును కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడు తున్న క్రమంలో బీజేపీకి సానుకూలంగా మారింది. వివిధ కుల సమూహాలను తనవైపు తిప్పుకోవడానికి బీజేపీ అంతర్గతంగా ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తోంది. పలు సందర్భాల్లో జేడీ(యూ)తో విభేదాలొ చ్చినా రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉండటం వల్ల బీజేపీ తన హిందూత్వ భావ జాలాన్ని బిహార్ మట్టిలో జాగ్రత్తగా నిక్షిప్తం చేయగలిగింది. హిందూ సంఘటితం చుట్టే రాజకీయాలు నడు పుతూ మొట్టమొదటిసారి ఈ ఎజెండాతోనే ఎన్నికలు నడిచేలా వ్యూహాలను రచిస్తోంది. బడుగు, బలహీన వర్గాల ఐక్యతను కాపాడాలనే సిద్ధాంతంతో పని చేస్తున్న ‘ఇండియా’ కూటమికి ఇది అతిపెద్ద సవాలుగా మారబోతోంది. రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉంది. అలాగే ఆ పార్టీ వ్యూహాత్మ కంగా సృష్టిస్తున్న హిందూ కులాల ఐక్యత ఈసారి బిహార్ ఎన్నికలను రసవత్తరంగా మార్చనున్నది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం, బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీ, హిందుస్తానీ ఆవామ్ మోర్చా పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమికి 43.17 శాతం ఓట్లు రాగా; ఆర్జేడీ,కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన మహాగఠ్‌బంధన్ (ఎంజీబీ) కూటమికి 38.75 శాతం ఓట్లు వచ్చాయి.ఈ ఓట్ల వ్యత్యాసం ఇకముందు కూడా కొనసాగితే ఎన్డీఏ 2025లోనూ సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయి. కానీ 2020 తర్వాత వికాసషీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) మహాVýæఠ్బంధన్లో చేరడం, జేడీ (యూ)లో రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ విలీనం కావడంతో ఈసారి లెక్కలు మారవచ్చు.బిహార్‌లో 18 శాతం ఉన్న ముస్లింలు కీలక పాత్ర పోషిస్తారు. 2020లో ఎంజీబీకి 76 శాతం ముస్లిం ఓట్లు రాగా, ఎన్డీఏకు కేవలం 5 శాతమే వచ్చాయి. యాదవ్– ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే బీజేపీ వైపు ఉన్న బీసీలను, దళితులను తనవైపు తిప్పుకోగలిగితే ఎంజీబీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. అయితే రాష్ట్రంలో పుట్టుకొచ్చిన కొత్త పార్టీలు ఎన్డీఏ–ఎంజీబీ కూటముల గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) జన్ సూరజ్ పార్టీ నుంచి ఎంజీబీకి ముప్పు పొంచి ఉంది. 2024లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో పాటు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం ఆయన ఇటు ఎంజీబీ, అటు జేడీ(యూ) ఓట్లను గణనీయంగా చీల్చవచ్చు. ఆయన ఆర్జేడీ, జేడీ(యూ) పార్టీలపైనే విమర్శలతో విరుచుకుపడుతుండటంతో బీజేపీకి పరోక్షంగా మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల ఆధారిత రాజకీ యాలు కాకుండా అభివృద్ధి తరహా రాజకీయాలు చేస్తా నని పీకే చెప్తున్నారు. లాలూ, నితీష్ల వృద్ధాప్యం, పాశ్వాన్ మరణంతో ఏర్పడిన ఖాళీని తాను భర్తీ చేయా లనుకుంటున్నారు. అయితే 243 నియోజకవర్గాల్లో నిల బెట్టడానికి బలమైన, నమ్మకమైన అభ్యర్థులు ఆయన పార్టీకి లేరు. కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత ఐ.పి. గుప్తా ‘ఇండియన్ ఇంక్విలాబ్ పార్టీ’ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రెండు కులాలపై ఈ పార్టీ ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. ఐపీఎస్ అధికారిగా బిహార్‌లో ప్రత్యేక పనితీరు కనబర్చిన మహా రాష్ట్రకు చెందిన శివ్‌దీప్ లాండె ‘హింద్ సేన’ పార్టీ ఏర్పాటు చేశారు. ఒకప్పుడు నితీష్‌కు సన్నిహి తునిగా ఉన్న ఆర్సీపీ సింగ్ ఆయనతో విభేదించి బీజేపీలో చేరారు. అయితే బీజేపీ – జేడీ(యూ) మళ్లీ పొత్తు పెట్టుకో వడంతో ఈయన ‘ఆప్ సబ్కీ ఆవాజ్’ పార్టీని నెలకొల్పారు. కుర్మీ సామాజిక నేత అయిన ఆర్పీ సింగ్ ఆ సామాజిక ఓట్లు చీల్చే అవకా శాలున్నాయి. ఈ చిన్న పార్టీలు చీల్చే ఓట్లు ఎన్డీఏ, మహాగఠ్‌బంధన్ అభ్యర్థుల గెలుపోటములను శాసించ నున్నాయి.ఆర్జేడీ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. బీజేపీకి పెరుగుతున్న ఆకర్షణను అడ్డుకోవడానికి ఆర్జేడీ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. ఓబీసీలను ఏకం చేయాలనీ, మైనారిటీ ఓట్లను కాపాడుకుంటూనే ఈబీసీలను, దళితులను ఎన్డీయే శిబిరం నుంచి తమ వైపు తిప్పుకోవాలనీ ఎంజీబీ లక్ష్యాలుగా పెట్టుకుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం ఇది. మరో ఏడు నెలల్లో ఎవరు గెలుస్తారో వేచిచూడాల్సిందే!ఆర్. దిలీప్ రెడ్డి వ్యాసకర్త పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
ఇండియా విధానం సరైనదేనా?
భారత ప్రభుత్వం సుంకాల విషయమై అమెరికాతో చర్చిస్తున్న పద్ధతిని కొందరు సమర్థిస్తుండగా, కొందరు విమర్శిస్తున్నారు. విలువైన అంశాలు రెండింటిలోనూ ఉన్నాయి. కానీ ఈ చర్చలన్నీ తక్షణ అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. అవి అవసరమే. అదే సమయంలో మరికొంత లోతుకు వెళ్లటం, దీర్ఘకాలిక దృష్టి తీసుకోవటం కూడా చేస్తే తప్ప ఇంత ముఖ్యమైన విషయమై సమగ్రమైన అవగాహన ఏర్పడదు. ఇతర దేశాల నుంచి దిగుమతులపై తాము స్వల్పమైన సుంకాలు విధిస్తున్నామనీ, తమ ఎగుమతులపై మాత్రం వారు భారీ సుంకాలు వేస్తున్నారనీ, ఆ విధంగా తాము రెండు విధాలుగానూ నష్టపోతున్నామన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నమాట. కేవలం గణాంకాలకు పరిమితమైతే అది నిజమే. కానీ, అందులో అనేక మతలబులున్నాయి. అమెరికాలో ఒకప్పుడు విస్తారంగా ఉండిన ఉత్పత్తుల రంగాన్ని కుదించి, పరిశ్రమలను ఇతర దేశాలకు తరలించింది అక్కడి ప్రభుత్వమే గదా? అసలు వివిధ అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను ఉనికిలోకి తెచ్చి స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిందే అమెరికా. ఒకవేళ 90 రోజుల వాయిదా కాలంలో చర్చల ద్వారా కొన్ని సర్దుబాట్లు జరిగినా కొంత నష్టం మిగిలే ఉంటుంది. ఈ పరిణామాలన్నింటి ప్రభావంతో అమెరికా పట్ల ప్రపంచానికి ఇంత కాలం ఉండిన విశ్వాసం తగ్గుతుందనే సందేహం ఉంది. అది జరిగినపుడు ఇప్పటికే గల బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు మరింత బలపడగలవనే అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి.నాలుగు ధోరణులుఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 2024–25లో 41.18 బిలి యన్ డాలర్లు. మన దిగుమతులపై అమెరికా సుంకాల రేటు సగటున 2.7 శాతం. అమెరికా నుంచి దిగుమతులపై మన సుంకాల రేటు సగ టున 12 శాతం కాగా, కొన్ని సరుకులపై 48 శాతం వరకు ఉంది. ఈ లెక్కలను బట్టి అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాలతో గల వాణిజ్య లోటులో 50 శాతం మేర సుంకాలు పెంచిన ప్రకారం భారత ఎగుమతులపై రేటును 26 శాతంగా ప్రకటించారు. ఏప్రిల్ 2న ఈ కొత్త రేట్లు ప్రకటించటానికి ముందే చేసిన హెచ్చరికలను బట్టి భారత ప్రభుత్వం అమెరికన్ మోటార్ సైకిళ్లు వగైరాపై సుంకాలు తగ్గించటం తెలిసిందే. అయినప్పటికీ కొత్త రేట్లు యథావిధిగా పెరిగాయి.ఈ పరిస్థితుల దృష్ట్యా భారత్ ఏమి చేయాలన్నది ప్రశ్న. ప్రపంచ దేశాలు చేస్తున్నదేమిటని చూడగా నాలుగు ధోరణులు కనిపిస్తు న్నాయి. కొన్ని చిన్న ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా లొంగి పోతున్నాయి. అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలు నూరు శాతం రద్దు చేస్తు న్నాయి. ఇందుకు ఒక ఉదాహరణ జింబాబ్వే. కొన్ని సామరస్య ధోర ణితో ఇచ్చిపుచ్చుకునే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. జపాన్ అందు కొక ఉదాహరణ. కొన్ని ఎదురు సుంకాలతో ప్రతిఘటిస్తూ అమెరికా తగ్గితే తాము తగ్గుతామంటున్నాయి. కెనడా, యూరోపియన్ దేశాలు ఈ కోవలోకి వస్తాయి. చైనా ఒక్కటి భిన్నంగా కనిపిస్తున్నది. పోరాడు తాము తప్ప లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నది.ఈ నాలుగింటిలో ఇండియా ప్రయోజనాలకు ఉపయోగపడ గలది ఏది? చైనా వలె పూర్తిగా ధిక్కరించటమన్నది అభిలషణీయం కాదు, కావాలనుకున్నా సాధ్యమయ్యేదీ కాదు. వారిది రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత దేశం కన్నా అయిదు రెట్లు పెద్దది.క్రమంగా అమెరికాను మించిపోయి అగ్రస్థానానికి చేరాలన్నది చైనా లక్ష్యం. మన స్థితిగతులుగానీ, లక్ష్యాలుగానీ వీలైనంత అభివృద్ధి చెందటమే తప్ప చైనా వంటివి కావు. కనుక ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అటువంటి వైఖరి తీసుకోవటమన్న ఆలోచనే అసందర్భం. ఇదంతా అర్థమయ్యో, కాకనో కొందరు భారత ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తున్నారు. జపాన్ మార్గంఇక మిగిలినవి జపాన్, కెనడా ప్లస్ యూరోపియన్ మార్గాలు. ఈ రెండింటిలో రెండవది కూడా ఇండియాకు అనుకూలించగలది కాదు. అందుకు ఒక కారణం యూరోపియన్ దేశాలన్నీ ఒక బృందం వలె నిలిచి ఉన్నాయి. అది గాక సైనికంగా, భౌగోళిక వ్యూహాల రీత్యా అమెరికా, కెనడా, యూరప్‌ల సాన్నిహిత్యం భిన్నమైనది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నందువల్లనే అమెరికా ట్యారిఫ్లను వారు బలంగా ఎదుర్కొంటూ, ఆ దేశం దిగి రావలసిందేనని స్పష్టం చేస్తు న్నారు. ఇదంతా భారతదేశానికి సాధ్యమయ్యేది కాదు.అందువల్ల స్థూలంగా జపాన్ నమూనా ఒక్కటే మిగులుతున్నది. దక్షిణ కొరియా, మెక్సికో మొదలైన వాటి వైఖరి కూడా ఇంచుమించు ఇదే విధంగా కనిపిస్తున్నది. ఈ పద్ధతి ఇంకా ఇదమిత్థంగా రూపు తీసుకోలేదు. చర్చలు జరిగే కొద్దీ ఇందుకొక రూపం రాగలదని భావించవచ్చు. భారత్ స్థూలంగా జపాన్ తరహా వైఖరిని తీసుకుంటున్నట్లు కని పిస్తున్నది. ఇందులోనూ ఒక ఆకు తక్కువే. అమెరికాతో జపాన్‌కు గల వ్యూహాత్మక భాగస్వామ్యం వేరు. అందుకే ‘స్థూలంగా’ అనే మాటను ఉపయోగించటం. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత, భారతదేశం గురించి మాట్లాడుకోవలసిన మౌలికమైన విషయాలు రెండున్నాయి. భారత అభివృద్ధి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? కొత్త అభివృద్ధి లక్ష్యాల సాధనకు అనుసరించవలసిన మార్గం ఏమిటని ప్రభుత్వం భావిస్తున్నది? సుంకాల యుద్ధంపై తీసుకోగల వైఖరికి ఈ ప్రశ్నలతో సంబంధం ఉంటుంది.దేశ ప్రయోజనాలే ముఖ్యం!ఆర్థికాభివృద్ధి రీత్యా ఇండియా ఇంకా వర్ధమాన దేశమే. అభివృద్ధి చెందుతున్నా, ఆ వేగం ఉండవలసినంతగా లేదు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే అంతర్గతంగా జరగవలసింది చాలా ఉండటంతో పాటు, అభివృద్ధి చెందిన దేశాల నుంచి, ఇంచు మించు తన స్థాయిలో గల వర్ధమాన దేశాల నుంచి, అవసరమైన వనరులు గల దేశాల నుంచి సహకారం అవసరం. అందుకోసం ఈ కూటమి, ఆ కూటమి అనే ఒకప్పటి రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వైపుల నుంచి సహకారం కోసం సమ సంబంధాలు పాటించాలి. దేశ ప్రయోజనాలే దేనికైనా గీటురాయి కావాలి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఉండరు. పరిస్థితులు, ఫిలాసఫీ రెండూ ఇవే. ఇదంతా ఇప్పుడు మనం సుంకాల సమస్యల సందర్భంలో కొత్తగా సూత్రీకరిస్తున్నది కాదు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ‘ది ఇండియా వే, స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్సర్టెన్ వరల్డ్’ (2020) పేరిట రాసిన పుస్తకంలో ఈ సూత్రీ కరణలన్నీ కనిపిస్తాయి. శీర్షిక దానికదే ఎంతో అర్థవంతమైనది. ‘మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా జీవించటమే వివేకం’ అనే తిరు వళ్ళువర్ బోధనతో ఆయన తన పుస్తకాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ పాలకులు వచ్చిపడుతుండగా చదరంగంలో మునిగి రాజ్యం పోగొట్టుకున్న బెంగాల్ నవాబుల ఉదంతంతో ‘షతరంజ్ కే ఖిలాడీ’ సినిమా తీసిన సత్యజిత్ రే హెచ్చరిక, అమెరికా బలహీనపడుతుండగా ముందుకు దూసుకుపోతున్న చైనాల గురించి చర్చిస్తూ, ‘ఇప్పుడు భారతదేశం తనను తాను నిర్వచించుకుంటుందా? లేక ఇంకో ప్రపంచమే నిర్వచిస్తుంటుందా?’ అని ప్రశ్నిస్తారు. స్వయంగా అమెరికా, చైనాలలో రాయబారిగా పనిచేసిన జైశంకర్ సూత్రీకర ణలు, రూపొందిస్తున్న విదేశాంగ విధానాలు ప్రస్తుత క్లిష్ట పరిణా మాలకు తగినవే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అబ్దుల్లాకు జరిగిన నమ్మక ద్రోహం
అమర్జీత్ సింగ్ దులత్ పుస్తకం జమ్ము –కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లాను ఎందుకంత తీవ్రంగా బాధించిందో అర్థం కాని విషయం. ఆర్.ఏ. డబ్ల్యూ(రా) మాజీ ఉన్నతాధికారి దులత్ ఆయన మీద రాసిన ‘ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై’ పుస్తకం ఏమీ ఫరూఖ్‌కు తెలియకుండా వెలువడలేదు. ‘‘ఫరూఖ్ అబ్దుల్లా మీద నా అవగాహనతో రాసిన నా కథ’’ అని రచయిత ముందుమాటలో చెప్పుకొన్న ఈ రచనకు ఫరూఖ్ మద్దతు ఉంది. దాని గురించి వారిద్దరూ ‘‘అనేకసార్లు మాట్లాడుకున్నారు.’’ ఆయన ‘‘కరో నా (కానీయ్)’’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే పుస్తకం వెలుగు చూసింది. కానీ పుస్తకం బయటకు వచ్చాక ఫరూఖ్ ఎంతో నొచ్చుకున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఈ పుస్తకం ఒక ప్రశంసా గీతిక అనేది సత్యం. ‘నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అంటే ఫరూఖ్ అబ్దుల్లానే అనీ, ఆయన లేకపోతే ఎన్సీ ఎక్కడ ఉండేదో ఊహించలేమనీ పుస్తకం చెబుతుంది. అంతటి తోనే ఆగదు. ‘‘డాక్టర్ సాహిబ్ కేవలం ముఖ్యమంత్రి కారు, ఆయనే కశ్మీర్’’ అని తేల్చిచెప్తుంది. ఫరూఖ్ తన తండ్రి షేక్ అబ్దుల్లా కంటే గొప్ప వ్యక్తి అనీ, బహుశా ఆయనే నేడు దేశంలో అత్యున్నత నాయ కుడు అనీ దులత్ ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ ప్రశంస అతిశయోక్తి. కానీ, దులత్ దృష్టిలో అక్షర సత్యం.ఫరూఖ్ ఎదుర్కొన్న పలు సంక్షోభాల గురించి ఈ పుస్తకం చెబుతుంది. ఫరూఖ్ ‘‘శ్రీనగర్‌కు ఢిల్లీకి నడుమ వారధిగా ఉండాలని కోరుకున్నారు... ఆయన రాజకీయాల్లో ఉన్నది ఢిల్లీతో కలిసి పని చేయడానికే గానీ, వ్యతిరేకంగా కాదు.’’ కానీ సమస్య ఏమిటంటే, ఢిల్లీ ఆయన ఆలోచనను గ్రహించలేక పోయింది. ‘‘ఫరూఖ్ అబ్దుల్లాను, ఆయన ఆశయాలను ఢిల్లీ ఏనాడూ అర్థం చేసుకోలేదు... దేశ రాజధానికి అంతు చిక్కనిది ఏదో ఆయనలో ఉంది.’’ ఇది ఒక పార్శ్వమైతే, రెండోది – కశ్మీరు ప్రజలతోనూ ఆయన సంబంధాలు. అవి ఏనాడూ సవ్యంగా లేవు. ఢిల్లీ మీద కశ్మీర్ ప్రజలకు విశ్వాసం లేదు. ‘‘ఢిల్లీతో ఏ మాత్రం సంబంధం ఉన్నా సరే ఆ వ్యక్తులను, సంస్థలను వారు అనుమానిస్తారు.’’ ఈ క్రమంలో ‘‘ఇండియా పట్ల విధేయత కారణంగా ఫరూఖ్ అబ్దుల్లా కుటుంబం కశ్మీరు పౌరుల ఆగ్రహానికి గురైంది.’’ ఫరూఖ్ అబ్దుల్లా అడకత్తెరలో పోకచెక్క అయ్యారు. ఢిల్లీకిచేరువ కావడం కోసం ఆయన ప్రయత్నించారు. కాని అక్కడ ఆయనకు పూర్తి ఆదరణ లభించలేదు. ఇక తాను దేని కోసం తపన పడుతున్నదీ తన సొంత ప్రజలకు అర్థం కాలేదు. వారి నుంచిమద్దతుకు బదులుగా అనుమానం, ఆగ్రహం ఎదుర్కోవలసివచ్చింది.కశ్మీరు రాజకీయాలను మిగతా దేశం నుంచి విడదీసిన క్లిష్ట సమస్య ఏమిటో దులత్ బాగానే అర్థం చేసుకున్నారు. ‘‘కశ్మీరు నాయ కులు కశ్మీరులో ఒక విధంగా మాట్లాడతారు, ఢిల్లీ వెళ్లి అక్కడ వేరేలా మాట్లాడతారు’’ అని ఆయన వివరించారు. ఆయన ఈ రెండు నాలుకల వైఖరిని కపటత్వంలా కాకుండా ‘ఫ్రెంచి భాష’లో పేర్కొనే ఒక రకమైన సభ్యతగా భావిస్తారు. వారున్న పరిస్థితిలో మనుగడ కోసం అలా మాట్లాడక తప్పదు. అది అవకాశ వాదం కాదు.దులత్ కథనం ప్రధానంగా ఫరూఖ్ అబ్దుల్లా ఎదుర్కొన్న మూడు నమ్మక ద్రోహాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన 370వ అధికరణం రద్దు వాటిలో ఒకటి. దులత్ దీన్ని సరిగ్గా చెప్పలేక పోయారు. అది వేరే విషయం. మిగిలిన రెండూ ఫరూఖ్ మెచ్చేలానే రాశారు.మొట్టమెదటి ద్రోహం – 1984లో ఒక అర్ధరాత్రి జరిగింది.ఇందిరా గాంధీ ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి కూలదోశారు. అది ఆయన మనసులో మానని గాయాన్ని మిగిల్చింది. ‘‘... ఆయన దీన్నుంచి కోలుకున్నారని నేననుకోవడం లేదు’’ అని ఇందిరను తీవ్రంగా దుయ్యబడుతూ దులత్ వ్యాఖ్యానించారు. దీంతో ఫరూఖ్ విభేదిస్తారని నేను అనుకోను. రెండోది – 2002 నాటిది. వాజ్‌పేయి, అద్వానీ కలిసి ఫరూఖ్‌కు ఉప రాష్ట్రపతి పదవి వాగ్దానం చేశారు. అయితే, వారు తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేక పోయారు. వారి వాగ్దానానికి ‘‘ఫరూఖ్ఉప్పొంగిపోయారు... ఏదో ఒక రోజు భారత రాష్ట్రపతి కావాలన్నది ఆయన జీవితాశయం. దానికి ఇది తొలి మెట్టు అను కున్నారు.’’ దులత్, ఫరూఖ్ స్నేహబంధం ఇప్పుడు చిక్కులు ఎదుర్కొంటున్నా అది తెగేది కాదు. దులత్ తమను కలిపి ఉంచే ఆ బంధంపై ఇలా అంటారు. ‘‘డాక్టర్ సాహిబ్ నన్ను ఎంత నమ్మారో నేను ఎప్పటికీ తెలుసుకోలేను – ఆయన గురించి నాకు ఎంత తెలుసో ఆయన ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.’’ఏమైనప్పటికీ, దులత్ అవగాహనలో లోపాలు స్పష్టంగా కనబడతాయి. లేనట్లయితే, తనను విశ్వాసంలోకి తీసుకుని ఉంటే 370వ అధికరణం రద్దు విషయంలో సాయం అందించడానికి ఫరూఖ్ అబ్దుల్లా సుముఖమే అనే ఆరోపణ మీద దురదృష్టకరమైన ఈ వివాదం తలెత్తేదే కాదు. తన పుస్తకం మొదటి అధ్యాయంలోనే దులత్ ఇంతటి కీలకాంశం లేవనెత్తడం హాస్యాస్పదం.‘‘ఫరూఖ్ మూడు దశాబ్దాలుగా నాకు తెలిసి ఉన్నా, నాకు ఆయన నిజంగా తెలుసు అని పూర్తి నమ్మకంగా ఏనాడూ చెప్పలేను. అదీ డాక్టర్ సాహిబ్ అనే ప్రహేళిక. ఆయన్ను తెలుసుకోవడం అంత సులభం కాదు.’’ గత వారం తలెత్తిన వివాదం, దులత్ చెప్పిన అంశాన్నే విషాదకరంగా రుజువుచేసింది.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-కరణ్ థాపర్ -
ప్రభుత్వ ప్రాయోజిత మత పక్షపాతం
కొత్త వక్ఫ్ చట్టాన్ని ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక తప్పుడు సంకే తాన్ని ఇస్తున్నాయి. ముస్లిం ధర్మాదాయ దేవాదాయ వ్యవహారాలను వక్ఫ్అంటారు. 1995 నాటి వక్ఫ్ చట్టం ఇప్పటి వరకు అమలులో వుంది. ఇప్పుడు దీన్ని ‘యునైటెడ్ వక్ఫ్ మేనే జ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్–2025 (యూడబ్ల్యూఎమ్ఈఈడీఏ)గా మార్చారు. వక్ఫ్ సవరణ బిల్లు ఏప్రిల్ 3న లోక్‌సభలో 288 – 232 ఓట్ల తేడాతో గెలిచింది. రాజ్యసభలో ఏప్రిల్ 4న 128 – 95 ఓట్ల తేడాతో గెలిచింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిపోయింది. ఇక్కడ ఒక విశేషం ఉంది. 543 మంది సభ్యు లున్న లోక్ సభలో ముస్లింలు 24 మంది మాత్రమే. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు.అంటే 208 మంది ముస్లిమే తర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. అలాగే 245 మంది సభ్యులున్న రాజ్య సభలో ముస్లింలు 15గురు మాత్రమే. 95 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 80 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. రెండు సభల్లోనూ కలిపి ముస్లింల సంఖ్య 39 మాత్రమే. వాళ్ల పక్షాన నిలిచిన ముస్లిమేతరులు 288 మంది. కొత్త చట్టం రాజ్యాంగ ఆదర్శాలకు, హామీలకు విరుద్ధంగా ఉందనీ, దాన్ని పునఃసమీక్షించాలని కొన్ని సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు సుప్రీంకోర్టులో 70కు పైగా పిటీషన్లు వేశాయి. ఈ విషయంలోనూ ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ముస్లిమేతరుల సంఖ్య చాలా ఎక్కువ. మన దేశంలో వర్ధిల్లుతున్న మతసామరస్యానికి ఇది తాజా ఉదాహరణ. దీనికి విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టానికి మద్దతు ప్రకటించాయి. ఒక బిల్లు ఉభయ సభల్లో మెజారిటీ సాధించి రాష్ట్రపతి ఆమోద ముద్రపడి చట్టంగా మారాక కూడ సుప్రీం కోర్టుకు చేరడం విశేషం. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 16న ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. కొత్త చట్టంలో వివాదాంశాలు అనేకం ఉన్నాయి. ఇందులో నాలుగు అంశాలు మరింత తీవ్రమైనవి. వక్ఫ్ బోర్డులో, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కొత్తగా ముస్లిమేతరులను అనుమతించడం తీవ్రమైన వివాదంగా మారింది. వక్ఫ్ భూముల్లో ‘వక్ఫ్ బై యూజర్’ సౌలభ్యాన్ని తొలగించి అది వక్ఫ్‌గా కొనసాగాలంటే రిజిస్ట్రేషన్ దస్తావేజులు చూపాలనడం ఇంకో వివాదాంశం. వక్ఫ్ ఆస్తి అవునో కాదో తేల్చడానికి జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించడం, కనీసం ఐదేళ్ళుగా ఇస్లామిక్ ధార్మిక ఆచరణను కొనసాగిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ దానం చేయడానికి అర్హులు అనడం కూడా వివాదంగా మారింది. వక్ఫ్ భూములకు దస్తావేజులు చూపడం అసాధ్యమైన విషయం. 19వ శతాబ్దం ఆరంభం వరకు మన దేశంలో అసలు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ల సంప్రదాయమే లేదు. లార్డ్ కార్న్ వాలిస్ 1793లో తొలిసారిగా శాశ్వత భూమిపన్ను విధానాన్ని తెచ్చాడు. అది కూడా ఇప్పటి బెంగాల్, బిహార్, ఒడిశాప్రాంతంలో మాత్రమే. ఆ తరువాత థామస్ మన్రో మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో రైత్వారీ విధానాలను తెచ్చాడు. భారత దేశంలో 8వ శతాబ్దం నాటికే ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం ప్రవేశించిన వెయ్యేళ్ళ తరువాత మనకు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ విధానాలు వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం సరిగ్గా ఈ అంశాన్నే పట్టించుకుంది. ‘మనం చరిత్రను తిరగరాయలేం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు గుర్తుచేశారు. వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకతను ప్రదర్శించడమేగాక, రెండు మత సమూహాల సహవాసాన్ని కొత్త చట్టం ప్రోత్సహిస్తుందని, ముస్లింల గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నదని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. ఇలా రెండు మతసమూహాల కలయిక ఒక ఆదర్శం అని కేంద్ర ప్రభుత్వం నిజంగానే నమ్ముతోందా? నమ్మితే హిందూ ధర్మాదాయ కమిటీల్లోనూ హిందూయేతరులకు స్థానం కల్పించాలిగా? సరిగ్గా ఈ ప్రశ్ననే భారత ప్రధాన న్యాయమూర్తి వేశారు. తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు వక్ఫ్ భూములు వేటినీ డీ–నోటిఫై చేయరాదని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపించడానికి ఒక వారం రోజులు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. ఇందులో ఒక కిటుకు ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా మరో మూడు వారాల్లో, మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఎలాగోలా ఈ సమయాన్ని సాగదీస్తే అనుకూ లమైన తీర్పు తెచ్చుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.- వ్యాసకర్త సమాజ విశ్లేషకులు ‘ 90107 57776'- డానీ -
Dr B R Ambedkarవీళ్ళే ఇలా రాస్తే ఎలా?!
అంబేడ్కర్ జయంతికి కేంద్ర మంత్రులు అంబేడ్కర్‌పై పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఒకరు దీన్ని కాంగ్రెస్ విమర్శకు వాడుకుంటే, మరొకరు అంబేడ్కర్ నోట అబద్ధాలు కుక్కారు. వీటిని ఆదర్శాల పేరుతో భావితరాలకు బోధిస్తారట. ఆర్య దండ యాత్ర సిద్ధాంతాన్ని అంబేడ్కర్ తప్పు పట్టారనీ, సంస్కృతాన్ని అధికార భాషగా ఆమోదించడానికి మద్దతుగా రాజ్యాంగ సభలో సవరణను ప్రవేశపెట్టారనీ. హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి అని ప్రకటించారనీ ఇలా ఎన్నో అవాస్తవాలను రాశారు వారు. ‘‘ఇండో–ఆర్యులు ఇండియాకు వలస వచ్చి స్వదేశీయులను తరిమేశారు. వలస వాద, బ్రాహ్మణవాద కథనాలు కులాధిపత్య సమర్థనలు. ఆర్యులు సాంస్కృతిక భాషా సమూహం, ప్రత్యేక జాతి కాదు. రుగ్వేదం వంటి ప్రాచీన గ్రంథాల్లోని విభేదాలు సామాజిక అంత ర్గత పోరాటాల ప్రతిబింబాలు. ఆర్య దండయాత్ర సూత్రం ఆర్యేతర శూద్రుల, దళితుల అణచివేత సాధనం.’’ అని రాశారు అంబేడ్కర్. ఆర్య సూత్ర జాతి సంస్కృతుల ఊహలను సవాలు చేశారు. యజుర్, అధర్వణ వేదాల రుషులు శూద్రు లకు తగిన ప్రాధాన్యమిచ్చినట్లు అంబేడ్కర్ అనలేదు. ‘‘శూద్రులు ముందు ఆర్య క్షత్రియుల్లో భాగం. జనశ్రుతి (శూద్రుడు) వైదికజ్ఞాన అభ్యాసం, కవశ ఐలూశ (శూద్రుడు) శ్లోకాల రచన సంగతులు ఈ వేదాల్లో ఉన్నాయి. వేదాలు శూద్రుల జాతి, సామాజిక హీనతను సమర్థించ లేదు. మనుస్మృతి ఆ పని చేసింది. బ్రాహ్మణ, ప్రత్యేకించి ఉపనయన, ఆచారాల విభేదాలతో వారిని నాల్గవ వర్ణానికి దిగజార్చారు. శూద్రుల ఉన్నత స్థాయి తగ్గింపునకు వేదకాలం తర్వాతి బ్రాహ్మణ నీతి ఇది’’ అని అన్నారు. అంబేడ్కర్ శూద్రులతో పోల్చి ఆర్యులను పొగడలేదు. ఆర్య ఉన్నత జాతి సూత్రీ కరణను తిరస్కరించారు. ద్రవిడ, నాగ, దాస తెగలు అనార్యుల్లో భాగమని, వారు ఆర్యు లకు ఏ విధంగానూ తక్కువ కారని అంబేడ్కర్ అభిప్రాయం. అంబేడ్కర్ అధి కార భాషగా సంస్కృతానికి మద్దతివ్వలేదు. సంస్కృతాన్ని ప్రజలు అతి తక్కువగా వాడు తారని, పాలనకు, ప్రజలు ఒకరితోనొకరు మాట్లాడుకోవడానికి సంస్కృతం ఆచరణీయం కాదనేది ఆయన అభిప్రాయం. హిందీని రుద్దడం హిందీయేతర భాషా ప్రాంతాల అణచివేతకుదారి తీయగల అపాయాన్ని జాగ్రత్తగా పరిగణించాలన్నారు. ఆంగ్లంతో పాటు హిందీ భారత ప్రజల లంకె భాషగా ఉండాలని అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణ సభలో వాదించారు. మరిఅంబేడ్కర్ ఆదర్శాలను సంఘ్ సర్కారు ఆచరిస్తుందా? – సంగిరెడ్డి హనుమంత రెడ్డి,ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
పటేల్‌కూ, నెహ్రూకూ పడదంటారా?
ఇండియా ఈ ఏడాది అక్టోబర్ 31నసర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంత్యుత్సవం జరుపుకోబోతోంది. జనం మర్చి పోయిన పటేల్ గుణగణాలు కొన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తన సహోదరు లను ఆయన ఎంతో జాగ్రత్తగా చూసుకు న్నాడు. వల్లభ్‌కు నలుగురు సోదరులు. వారిలో ముగ్గురు తన కంటే పెద్ద వారు. ఆయన ఏకైక సోదరి దహిబా అందరికంటే చిన్నది. సంతానంలో మధ్యవాడు కాబట్టి వల్లభాయికి చిన్నతనంలో తగినంత మన్నన, ఆప్యాయత లభించలేదు. ఈ అనాదరణే ఆయనను ఒక వాస్తవవాదిగా, యోధుడిగా మార్చింది. తండ్రి ఝవేర్ భాయ్ ఎప్పుడూ ధనికుడు కాదు. పైగా కాలక్రమంలో ఉన్నది కూడా కరిగిపోయింది. వల్లభ్ తెలివైన వాడు, విశాల హృదయుడు. కాబట్టే, తోడబుట్టిన అయిదుగురి బాగోగులు, డబ్బు అవసరాలు తనే చూసుకున్నాడు.వల్లభ్ దయాగుణం నుంచి ఆయన చిన్నన్న విఠల్ భాయ్ అత్యధికంగా ప్రయోజనం పొందాడు. మన స్వాతంత్య్రోద్యమ హీరో కూడా అయిన విఠల్ 1933లో యూరప్‌లో అనారోగ్యంతో చనిపోయాడు. ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆయనకు సుశ్రూషలు చేశాడు. విఠల్ భాయ్ 1925–30 కాలంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా వ్యవహరించాడు. ఈ ఇద్దరు సోదరులూ బొర్సాద్ (గుజరాత్) టౌనులో లాయర్లు. ఆ సమయంలో, వల్లభ్ లండన్ వెళ్లి బారిష్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బు పొదుపు చేసుకుని పాస్ పోర్టు, టికెట్ సంపాదించాడు. అయితే వీజే పటేల్, ప్లీడర్, బొర్సాద్ పేరిట ఆయనకు వచ్చిన కవరును పోస్ట్‌మన్ అదే పేరుతో నమోదై ఉన్న సోదరుడు విఠల్ ఇంటికి బట్వాడా చేస్తాడు. దీంతో విఠల్‌కు తానూ ఇంగ్లాండు వెళ్లి బారిష్టరు కావాలన్న ఆలోచన వచ్చింది. ముందు నువ్వు వెళ్తే నీకంటే పెద్దవాడినైన నేను ఆ తర్వాత వెళ్లలేను. నీ పాస్ పోర్టు, టికెట్‌తో నేను లండన్ వెళ్తాను అని తమ్ముడిని కోరతాడు. వల్లభ్ సరే అనడమే కాకుండా విఠల్ లండన్ చదువుకు డబ్బు కూడా సమకూర్చాడు. ఆయన కుటుంబ భారాన్నీ మోశాడు. నాలుగేళ్ల తర్వాత 1910లో తనూ లండన్ వెళ్లి అద్భుత ప్రతిభ కనబరచి, 1912లో బారిష్టర్ పట్టాతో ఇండియా తిరిగి వస్తాడు. జైల్లో ఉండి కూడా సర్దార్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ తన సాటి సమర యోధులను ఎందరినో ఆర్థికంగా ఆదుకునేవాడని, వారి వైద్య ఖర్చులకు సాయం చేసేవాడని... పటేల్ జీవిత చరిత్ర కోసం 1987 ఏప్రిల్‌లో నేను ముంబాయిలో ఇంటర్వ్యూ చేసినప్పుడు మురార్జీ దేశాయ్ చెప్పారు. సాటి సమర యోధుల ఇక్కట్లను చూసి మన ఉక్కుమనిషి హృదయం ఇట్టే కరిగిపోయేది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జీవితంలో ఆయన ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవి నేడు ఎంతమందికి తెలుసు? 1927 జులైలో పెను తుపాను రావడంతో గుజరాత్ విలవిల్లాడి పోయింది. ఆ సమయంలో బాధితులను ఆదుకునేందుకు అహ్మదా బాద్, పరిసర ప్రాంతాల్లోని ఎందరో ఆయన స్ఫూర్తితో ముందు కొచ్చారు. అప్పట్లో పటేల్ గుజరాత్ కాంగ్రెస్ కమిటీ, అహ్మదాబాద్ మునిసిపల్ కౌన్సిల్ రెంటికీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో కనబరచిన దక్షతను గుర్తించి బ్రిటిష్ రాజ్ అధికారులు ఆయనకు తగిన బిరుదు ఇవ్వజూపారు. సమాధానంగా ఆయన బిగ్గరగా ఒక నవ్వు నవ్వారు. ‘సర్ వల్లభ్ భాయ్’ అని పిలిపించుకుంటే చాలామందికి అప్పుడు ఇప్పుడు సంబరంగా ఉండేదేమో. కాని, ఖేదా జిల్లా వాసులైన ఝవేరీభాయ్, లద్భా దంపతుల ఈ బిడ్డ ఎంతో గట్టి మనిషిగా, ఎన్నో కీలక పర్యవసానాలకు కారకుడిగా భారత దేశ భావితరాలకు తన ముద్రను మిగిల్చి వెళ్లేవాడా?దాదాపు ఒక శతాబ్దం క్రితం 1920లలో మునిసిపల్ కౌన్సిల్ సారథిగా పటేల్ అహ్మదాబాద్‌ను ‘నడిపించాడు’. అలాగే జవహర్ లాల్ నెహ్రూ అలహాబాద్ ను ‘నడిపిస్తున్నాడు’. 1920–22 సహాయ నిరాకరణ ఉద్యమానికి 1930–33 శాసనోల్లంఘన ఉద్యమానికి మధ్య కాలమది. దేశం ఇతర ప్రాంతాల్లో, కోల్‌కతా మునిసిపాలిటీకి చిత్తరంజన్ దాస్, పాట్నా టౌన్ కౌన్సిల్‌కు రాజేంద్ర ప్రసాద్, ముంబాయి మునిసిపాలిటీకి విఠల్ భాయ్ పటేల్ సారథులుగా ఉన్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పుడు నేర్చుకున్న పాఠాలు ఎంతగానో ఉపకరించాయి. 1948లో, వల్లభ్ భాయ్ పటేల్ నగర పాలక పాత్రకు ముగింపు పలికి రెండు దశాబ్దాలు ముగిసిన సందర్భంగా, ముంబాయిలో ఆయనకు పుర ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర భారత ఉప ప్రధాని ఆ సభలో మాట్లాడుతూ, ‘‘ మీరు ఎన్నో విజయాలు ప్రస్తావించారు. వాటిలో కొన్ని నేను సాధించినవి. కొన్ని నేను సాధించనివి. కాని అభ్యంతరం లేకుండా నేను అంగీకరించే ఒక విషయం: అహ్మదాబాద్ మునిసిపాలిటీకి నా శక్తివంచన లేకుండా సేవ చేశాను. స్వచ్ఛమైన ఆనందం పొందాను... నగరంలోని మురికిపై పోరాడితే మీకు రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. రాజకీయాలతో వ్యవహరించేటప్పుడు మీకు రాత్రి కూడా ప్రశాంతత ఉండదు’’ అని వ్యాఖ్యానించారు.నగర బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత పటేల్ అసాధారణ నాయకత్వ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 1928లో గుజరాత్‌లోని బార్డోలీ ప్రాంత రైతాంగం మీద బ్రిటిష్ పాలకులు విధించిన పన్నులకు వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆయన విజయవంతంగా నిర్వహించారు. అప్పుడే అక్కడి ప్రజలు పటేల్‌కు ‘సర్దార్’ బిరుదు ఇచ్చారు.1916 నుంచీ వల్లభ్ భాయ్ పటేల్– నెహ్రూలు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ఉన్నారు. అయితే, 1937లో ఇద్దరూ కలిసి గుజరాత్లో ఒక వారం రోజులు పర్యటించినప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.ఇద్దరూ జట్టుగా పనిచేశారు. పటేల్‌కు మహాత్మా గాంధీ ఒక లేఖ రాస్తూ, ‘‘ మీరిద్దరూ కలిసినప్పుడు, మీలో ఎవరు గట్టివారో చెప్పడం కష్టం’’ అని వ్యాఖ్యానించారు. తర్వాతి సంవత్సరాల్లో పటేల్– నెహ్రూల నడుమ ఉద్రిక్తతలు, అపోహలు, అప్పుడప్పుడు పరుష భాషణలు తలెత్తాయి. ఏమైనప్పటికీ, స్నేహం, ఒకరి మీద మరొకరికి ప్రశంసా భావన, పరస్పర విధేయత, గాంధీ పట్ల ఉభయుల విధేయత, స్వాతంత్య్ర పోరాటం పెంచిన బంధం... వాటికంటే బలమైనవి.ఆ తర్వాత స్వాతంత్య్రం వచ్చింది. సంబరాలు తెచ్చింది. వాటితో పాటే విభజన విషాదాలు ప్రజలు చవిచూశారు. తాము ఉభయులం ఒకరికొకరుగా ఉండటం ఎంత అదృష్టమో వల్లభ్ భాయ్ పటేల్– నెహ్రూలు గుర్తించారు. 1950 జనవరిలో గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి స్వతంత్ర భారత తొలి దేశాధిపతి పదవీకాలం ముగిసిన అనంతరం దేశానికి తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ వీరిరువురినీ ప్రస్తావిస్తూ, ‘‘ప్రధాన మంత్రి, ఆయన తొలి సహచరుడైన ఉప ప్రధాన మంత్రి కలిసి దేశాన్ని అన్ని విధాలాసుసంపన్నం చేసే గొప్ప ఆస్తి అయ్యారు. మొదటి వారు సార్వజనీన ప్రేమను, రెండో వారు సార్వజనీన విశ్వాసాన్ని చూరగొన్నారు’’ అని చెప్పారు. కాలం మారుతుంది. గడచిన దశాబ్దాలు మర్చిపోతారు. ఎడతెగని తప్పుడు ప్రచారం జరుగుతుంది. అది ఎంత హాని చెయ్యాలో అంత హాని చేస్తుంది. నెహ్రూ అవమానం పాలయ్యాడు. పటేల్ విగ్రహం ఆకాశాన్ని తాకుతోంది... కానీ, ఆయన జీవితానికి, ఆలోచనకు, ఆయన చేసిన కృషికి సంబంధించిన వాస్తవాలు పాతాళంలోకి వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 1940లు, 1950లు ఇంకా గుర్తున్న, పటేల్– నెహ్రూలు ఉభయులనూ కలిసిన, పటేల్ జీవితాన్ని పరిశోధించి ఆయన జీవిత చరిత్ర రాసిన నాలాంటి వాడు తనకు తెలిసిన వాస్తవాలు ఏమిటో చెప్పితీరాలి.కాబట్టి, వారిద్దరి మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి కొన్ని వాక్యాలు ఉటంకించి ఈ వ్యాసం ముగిస్తాను. 1948 ఫిబ్రవరి 3న సర్దార్ పటేల్‌కు నెహ్రూ రాసిన లేఖ నుంచి: ‘‘మనం ఒకరికొకరం సన్నిహితంగా ఉంటూ, ఎన్నో తుపానులనూ, ఇక్కట్లనూ కలసి కట్టుగా ఎదుర్కొని పావు శతాబ్దం గడచిపోయింది. ఈ కాలంలో మీ పట్ల నా గౌరవాభిమానాలు పెరిగాయని పూర్తి నిజాయితీతో చెప్పగలను...’’1948 ఫిబ్రవరి 5న నెహ్రూకు సర్దార్ పటేల్ రాసిన లేఖ నుంచి: ‘‘మనం ఇద్దరం ఒక ఉమ్మడి లక్ష్య సాధనలో జీవితకాల మిత్రులు (కామ్రేడ్స్)గా ఉంటున్నాం. దృక్పథాలు స్వభావాలు విభేదించినా, మన దేశ అత్యున్నత ప్రయోజనాలు, మనకు ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమాభిమానాలు వాటిని అధిగమించేలా చేస్తూ మనల్ని కలిపి ఉంచుతున్నాయి.’’-వ్యాసకర్త సంపాదకుడు, ప్రముఖ రచయిత, ‘పటేల్ – ఎ లైఫ్’ గ్రంథకర్త-రాజ్‌మోహన్ గాంధీ -
నేపాల్ పరిణామాలకు బాధ్యులెవరు?
మహారాజు జ్ఞానేంద్రకు మద్దతుగా నేపాల్‌లో ఏదో ఒక ప్రాంతంలోఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఇవి నేపాల్‌లో ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్చ్ 28వ తేదీన ఇవి ఘర్షణ స్థాయికి చేరి ఇద్దరు వ్యక్తులు మరణించగా అనేకమంది గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. ఇందుకు మహారాజు, ఆయన మద్దతుదారులు బాధ్యులని ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు రాజు 8 లక్షల రూపాయల జరి మానా చెల్లించాలని కూడా ఆదేశించింది. దీన్ని ప్యాలెస్ఖండించింది. మరోవైపు ప్రభువు మద్దతుదారులంతా నిధులు సేకరించి సొమ్ము చెల్లించటానికి సిద్ధమవుతున్నారు.ఒకప్పుడు రాచరికాన్ని కాదనుకున్న నేపాలీ సమాజం ఇప్పుడు రాజుకు ఎందుకు మద్దతు పలుకుతోంది? ఇందుకు నేపాల్ పాలకుల తీరే కారణం. 2008లో నేపాల్‌లో రాచరికం రద్దయిన తర్వాత 17 ఏళ్ల కాలంలో 18 ప్రభుత్వాలు నేపాల్‌ను పాలించాయి. ఏ ఒక్క ప్రభుత్వం కూడా సజావుగా పాలించిన రికార్డు లేదు. అవసరార్థం సర్దుబాట్లు చేసుకుని సంకీర్ణ ప్రభుత్వాలను నడిపారు. ఇప్పటి కేపీ ఓలి, షేర్ కుమార్ దుబా, ప్రచండ... ఇలా ప్రధానులంతా తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న వారే. రాజకీయ అస్థిరత ఒకవైపు, అవినీతి మరోవైపు నేపాల్‌ను దారుణంగా దెబ్బతీశాయి. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఉపాధి అవకాశాలు తగ్గి పోయాయి. యువత దేశాన్ని వదిలి ఉపాధి కోసం బయట దేశాలకు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజు మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. రాచరికాన్నిరద్దు చేయటం వల్ల నేపాల్ సార్వభౌమాత్వానికి దెబ్బ తగిలిందనీ, తిరిగి రాజు అధికారం చేపడితే ప్రపంచ దేశాల్లో నేపాల్ గుర్తింపు సంపాదిస్తుందని భావిస్తున్న వాళ్లు కొందరు ఉన్నారు. మరొక అంశం ‘హిందూత్వ’. నేపాల్‌ను హిందూ స్టేట్‌గా మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇందుకోసం తెరవెనక ప్రయత్నాలు సాగుతున్నాయి. మహరాజు జ్ఞానేంద్ర ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ కావటం, ఆయన ఫొటోలు నేపాల్ వీధుల్లో దర్శనం ఇవ్వటం వంటి ఇటీవల పరిణామాలు దీనికి బలాన్ని ఇస్తున్నాయి. అల్లర్ల వెనక భారత్ ఉందని నేపాల్ ప్రభుత్వం ఆరోపించటానికి ఇది కూడా ఒక కారణమని మనం భావించవచ్చు. ఇప్పుడు చెలరేగుతున్న ఆందోళనలు రానున్న రోజుల్లో ఎటు దారితీస్తాయో తెలి యదు. నేపాల్‌లో ఆందో ళనలకు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నాయకత్వం వహిస్తున్నా, ఇందులో అసాంఘిక శక్తులతో పాటు చైనా పాత్రను కొట్టేయలేం. చాలా కాలంగా చైనా ఆధ్వ ర్యంలో నేపాల్‌లో భారత్ వ్యతిరేక కార్యక్రమాలు సాగుతున్నాయి. దీనికి కమ్యూనిస్టు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. సరిహద్దులో ఆగడాలను చూసీ చూడకుండా వదిలేస్తోంది. భారత్‌తో సంబంధాలు దెబ్బ తిన్నప్పుడు రాజు జ్ఞానేంద్ర చైనాతో స్నేహంగా మసిలిన మాట నిజమే. అలాగని ఆయనకు ఇప్పుడుచైనా మద్దతుగా ఉంటుందని భావించలేం. నేపాల్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని యూఎస్, యూకే, ఇండి యాలు గుర్తిస్తున్నాయి. ప్రజాపాలన నుంచి రాచరికంలోకి మారినంత మాత్రాన నేపాల్ అభివృద్ధి ఫలాలను అందుకుంటుందని చెప్పలేం. రాజు అధికారంలోకి వస్తే అన్నీ సర్దుకుంటాయన్న భావన తార్కికంగా సమంజసంగా లేదు. మార్పు మంచిదే. అదీ అభివృద్ధికి తోవ చూపించినప్పుడే కదా? డా.పార్థసారథి చిరువోలు సీనియర్ జర్నలిస్ట్ -
పెరుగుతున్న మత సమ్మతి
దేశంలో మతతత్వం పెరిగిపోతోంది. కొన్నే ళ్లుగా ఈ ధోరణి మరీ ఎక్కువైంది. అడు గడుక్కీ గుళ్లు, మసీదులు వెలుస్తున్నాయి. నేనీ మధ్య తెలంగాణ వెళ్లాను. చిన్న పల్లె టూళ్లలో సైతం రెండు మూడు దేవాలయాలు ఉన్నాయి. హిందువులకు దేవుళ్లు చాలామంది, కాబట్టి గుళ్ళు కూడా ఎక్కువ గానే ఉంటాయి అనుకోవడం పొరపాటు. హిందూ సమాజం కులాలు, గోత్రాలు, జాతులు,వంశాలుగా చీలిపోయి ఉంది. గుళ్లు గోపురాలు అసంఖ్యాకంగా పుట్టుకురావడానికి ఈ భిన్నవర్గాల సమాజం ఒక ప్రధాన కారణం.జనంలో పెరుగుతున్న వ్యాపార దృష్టి ఇందుకు మరొక ముఖ్య కారణం అనిపిస్తోంది. పౌర సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తు న్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ ఏజెంట్లకు, బళ్లపై పళ్లు అమ్ముకునే వారికి, అనేకానేక చిల్లర పనులకు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ‘లైసెన్స్’లు ఇచ్చి డబ్బు పోగేసు కోవడం మనకు తెలుసు. గ్రామాల్లో సైతం ఈ తరహా సంస్కృతి విస్తరించింది. గ్రామ కమిటీలు అంటూ తయారయ్యాయి. ఇవీ ఇదే మాదిరిగా కొత్త ఆదాయ మార్గాలు కనిపెట్టాయి. ఇసుక మైనింగు, అక్రమ మద్యం అమ్మకాల వంటి కార్యకలాపాలను ఈ కమిటీలు నియంత్రిస్తున్నాయి. ఆ డబ్బును ప్రజల రోజువారీ జీవితాలను బాగు పరచేందుకు వాడతారా అంటే అదీ లేదు. బహుశా ఇక్కడికంటే పరలోకపు జీవితాలకు గిరాకీ ఎక్కువలా ఉంది. అందుకే, ఇలా ఆర్జించిన డబ్బును గుళ్లు కట్టడానికి వాడుతున్నారు.పెరుగుతున్న భక్తిమతం ఇప్పుడు రాజకీయాల్లో కంటే ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పర్యాటక ఆదాయం వాటా 9.6 శాతం. ఇందులో దేశీయ పర్యాటకం 88శాతం. గతేడాది ఇండియా సందర్శించిన విదేశీ పర్యాటకులు కేవలం 90 లక్షలు కాగా, స్థానిక యాత్రికుల సంఖ్య కళ్లు చెదిరేలా 14 కోట్లను దాటింది. కేంద్ర ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ–ఆగ్రా–జైపూర్ ‘స్వర్ణ త్రిభుజం’ మీద అధిక శ్రద్ధ పెడుతుంటాయి. వాస్తవానికి తమిళనాడు సందర్శించేవారు అత్యధికంగా 20 శాతం ఉన్నారు. ఢిల్లీ పర్యాటకులు వారిలో సగం ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలు దేశవిదేశాల టూరిస్టులను ఆకర్షించడంలో ముందు వర సలో నిలుస్తాయి. కారణం – మతపరంగా ప్రముఖమైన తిరుపతి, మదురై వంటి ప్రదేశాలు వీటిలో ఎక్కువగా ఉండటమే. తిరుపతి వల్ల ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే అతిపెద్ద దేశీయ పర్యాటక ప్రదేశంగా రూపొందింది. రెలిజియస్ టూరిజం ఇప్పుడు అతిపెద్ద వ్యాపారం. గడచిన నాలుగైదు ఏళ్లలో గతంలో కంటే అధికంగా మతం మీద మమకారం పెంచుకున్న భారతీయులు 25 శాతం పైగానే ఉన్నారని ‘ప్యూ’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ యాటిట్యూడ్’ సర్వే తేల్చింది. ఇది ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. అన్ని మతాల్లోనూ ఈ ధోరణి కనబడింది. మతం ఎంతో ముఖ్యమైందని భావిస్తున్న వారు 2007–15 మధ్య ఏకంగా 80 శాతానికి పెరిగారు. 11 శాతం పెరుగుదల! ఎన్ఎస్ఎస్ఓ (నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్) నివేదిక ప్రకారం, మత ప్రదేశాల సందర్శనలపై చేసిన సగటు వ్యయం ఇదే కాలంలో రెట్టింపు కంటే ఎక్కువైంది. మత వ్యాపారానికి ఆకాశమే హద్దు (ఇందులో శ్లేష లేదు). ఇది ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. సంతోషమే! మరి మత భావన పెరుగుతూ పోవడం వల్ల తలెత్తే ఇతర పరిణామాల మాటేమిటి? సమాజంలో మూఢనమ్మకాలు, అంధభక్తి, మతపిచ్చి పెచ్చరిల్లుతాయి. ఒక ఆధునిక సమాజంగా ఇండియా ఆవిర్భవించకుండా ఇవి అడ్డుపడే ప్రమాదం ఉంది. లాభదాయక వ్యాపారంగుళ్లు లేదా మసీదులు నిర్మించడం లాభదాయక వ్యాపారం.అందుకే, ప్రార్థనా మందిరాల పేరిట నీతి లేని మనుషులు బహిరంగ ప్రదేశాలను కబ్జా చేయడం రివాజుగా మారుతోంది. ఒకసారి దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్ఠిస్తే, ఇక వాటిని ఎవరూ తొలగించలేరు. నగరాల్లో ట్రాఫిక్ చిక్కులకు ఈ నిర్మాణాలే చాలావరకు కారణాలు.సంత్ కబీర్ దాసు ఎంతో సరళంగా చెప్పిన కవితను ఈ సంద ర్భంగా నేను ప్రస్తావిస్తాను: ‘రాతిని పూజించడం వల్ల దేవుడు లభిస్తే, నేను పర్వతాన్ని పూజిస్తాను. కానీ ఈ చక్కీ (తిరగలి రాయి)మంచిది, ఎందుకంటే ఇది ప్రపంచాన్ని పోషిస్తుంది’. చేదు నిజం ఏమిటంటే, రాతి విగ్రహం తిరగలి రాయి కంటే మంచి ప్రతిఫలం ఇస్తోంది. మతభావన, మతపిచ్చి వ్యాపారంగా మారబట్టే, ప్రభు త్వాలు సైతం ‘రెలిజియస్ టూరిజం’కు పెద్దపీట వేస్తున్నాయి.వాస్తవానికి, ‘మీ విగ్రహం కంటే మా విగ్రహం మంచిది’ అనే రీతిలో ఒక కనిపించని పోటీకి దారి తీస్తోంది. తిరుమల ఆలయం ఇండియాలోనే అతి పెద్ద ‘మనీ స్పిన్నర్’. ఈ వైష్ణవ ఆలయాన్ని ఏటా 4 కోట్ల మంది దర్శించుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్టను పెద్ద మత పర్యాటక కేంద్రంగా ప్రమోట్ చేస్తోంది. సీపీఎం కమ్యూనిస్టు ప్రభుత్వ హయాంలో కేరళ దేవాలయ బోర్డులు విగ్రహాల ‘మహిమల’ గురించి ప్రచారం చేస్తున్నాయి. దేవుడు మానవుడి ఊహాకల్పన అంటూ మనల్ని హేతుబద్ధంగా ఆలోచింప జేయాల్సిన సిద్ధాంతం ఆ ప్రభుత్వానిది. కానీ మాస్కో రెడ్ స్క్వేర్ , చైనా తియనాన్మెన్లలో మమ్మీలుగా మారిన శవాల నుంచి స్ఫూర్తి పొందే సిద్ధాంతం నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?బహిరంగ సమర్థనా?మన తొలి ప్రధాన మంత్రి, నవ భారత వ్యవస్థాపక పితా మహుడు జవహర్లాల్ నెహ్రూ దేశం శాస్త్రీయ దృక్పథంతోముందుకు సాగాలని తలచారు. ఇప్పుడేం జరుగుతోంది? పిడివాదం, అంధవిశ్వాసం మనల్ని నడిపిస్తున్నాయి. మతం, మూఢభక్తి దేశానికి ప్రమాదకరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సమాజంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నెహ్రూ ఎప్పుడూ ప్రార్థనా స్థలాలు సందర్శించలేదు. విశ్వాసి అయినప్పటికీ ఇందిరా గాంధీ సైతం ఆలయాలకు దూరంగానే ఉండే వారు. అయితే ఆమె మనవడు రాహుల్ గాంధీ బొట్టు పెట్టుకుని గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. జంధ్యం కూడా ధరిస్తానని ప్రకటించారు. తాను శివభక్తుడిననీ చెప్పుకొంటారు. అమిత్ షా కూడా అదే చేస్తారు. ఇద్దరికీ కావల్సింది ఓట్లు! రేపిస్టుగా రుజువైన రామ్ రహీం సింగ్‌ను నరేంద్ర మోదీ ప్రశంసించడం అతడి నుంచి రాజకీయ మద్దతు ఆశించే కదా? రాజ్యాంగ పరిరక్షకులు, ప్రముఖ వ్యక్తులు ఆర్భాటంగా మత స్థలాలు సందర్శించడం పెరిగింది. గతేడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల ఆల యంలో ప్రార్థనలు చేయడం మనకు తెలుసు. అంతకు ముందు ఏడాది మోదీ కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలు దర్శించారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ తిరుమల ఆలయంలో బాహాటంగా పూజలు నిర్వహించారు. పూరీ జగన్నాథాలయంలో ఆయన అవమానం పాలైనట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని కేదార్నాథ్ లేదా అయోధ్య సందర్శించినా, మరొకరు అజ్మీర్ షరీఫ్ వెళ్లినా అది వాటిని ఆమోదించడమే అవుతుంది. అలా వెళ్లడం... షారుఖ్ ఖాన్ కోక్ బ్రాండ్‌కు ప్రచారం చేయడం కంటే భిన్నమైనమీ కాదు.- వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత- mohanguru@gmail.com -
Doon School మార్పు మంచిదే... ఆత్మనే మార్చకూడదు కదా!
‘డూన్’ స్కూల్లో బాలబాలికలు కలిసి చదువుకోవడాన్ని (కో–ఎడ్యుకే షన్) ప్రవేశపెట్టాలా? ఇది కొత్త ప్రశ్నేం కాదు. 2010లో చివరిసారి దీనిపై చర్చ జరిగింది. అప్పటి రాష్ట్ర పతి ప్రతిభా పాటిల్ స్కూల్ 75వ ఫౌండర్స్ డే కార్యక్రమంలో ఈ అంశం ప్రస్తావించారు. ఆమె ప్రతిపా దన విని మగపిల్లలు ముసిముసిగా నవ్వుకున్నారు. ఈ ఆలోచన వారి గుండెల్లో వెచ్చదనం నింపి వుంటుంది. పెద్దవారికి మాత్రం ఇదేం రుచించలేదు. కేవలం మగపిల్లల కోసం నెలకొల్పిన డూన్ స్కూల్ ఇండియాలోనే ప్రతిష్ఠాత్మక ఆశ్రమ పాఠశాల (బోర్డింగ్ స్కూలు) అని యాజమాన్యం భావిస్తుంది. సమాజంలో లింగ సమానత్వం ఉండాలన్న భావనతో ప్రతిభా పాటిల్ ఈ వ్యాఖ్య చేసి ఉంటారని ఆహూతులు భావించారు. ‘వెల్హామ్ గరల్స్’ లేదా ‘మహారాణి గాయత్రీ దేవి’ లేదా ఇండియాలో ఉన్న అనేక ‘లొరాటో కాన్వెంట్స్’ స్కూళ్లు ‘గరల్స్ ఓన్లీ (బాలికల) పాఠశాలలుగానే కొనసాగు తున్నాయి. అందుకు లేని అభ్యంతరం డూన్ స్కూల్ విషయంలో ఎందుకు? తొలుత ఎలా ప్రారంభమయ్యాయో అలాగే కొనసాగే హక్కు స్కూళ్లకు ఉండాలి. ఇది కో–ఎడ్యుకేషన్‌కు వ్యతిరేక వాదన అని పొరబడకండి. స్కూళ్ల హక్కుకు సంబంధించిన సమర్థన మాత్రమే. వాస్తవానికి, మనకు కో–ఎడ్యుకేషన్ విద్యాసంస్థలు ఉండి తీరాల్సిందే. ఇందులో ఎలాంటి సందే హం లేదు. అదే విధంగా, కేవలం బాలురకు, అలాగే కేవలం బాలికలకు మాత్రమే ఉద్దేశించిన పాఠశాలలూ ఉండాలి.15 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రశ్న మీద చర్చ మొదలైంది. 2010లో మాదిరిగా ఏదో యథాలాపంగా కాకుండా, ఈఅంశం మీద ఇప్పుడు పకడ్బందీగా చర్చ జరుగుతోంది. ప్రపంచం మారుతోంది. సమతుల్యం, సమ్మిళితం, వైవిధ్యం... వీటితో కూడిన విద్యాభ్యాస వాతావరణాన్ని కో– ఎడ్యుకేషన్ అందిస్తుంది. బాయ్స్ ఓన్లీ స్కూళ్లలో సాంప్ర దాయిక పురుషత్వ భావనలతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుంది. సహవిద్యే దీనికి విరుగుడు. పరస్పరం ఎలా గౌరవించుకోవాలో, ఒకరి నుంచి మరొకరు ఎలా నేర్చు కోవాలో బాల బాలికలు ఉభయులకూ కో–ఎడ్యుకేషన్ వ్యవస్థ నేర్పిస్తుంది. ఇదీ ప్రస్తుతం డూన్ స్కూల్ సహవిద్యకు అనుకూలంగా సాగుతున్న వాదన. వీరు లేవనెత్తుతున్న ఈ అంశాలతో ఎలాంటి పేచీ లేదు. ఇవి మంచి వాదనలు. అయితే, వీటిని తోసిపుచ్చేందుకూ ఇంతే బలమైన, ముఖ్య మైన ఇతర కారణాలు ఉన్నాయి.డూన్ స్కూల్‌కు ఒక గుర్తింపు ఉంది. అది దాదాపువందేళ్ల పురాతనమైంది. ఎవరెన్ని చెప్పినా, సంప్రదాయం ముఖ్యమైంది. ‘మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి’ అంటూ సంప్రదాయాన్ని గాలికి వదిలేయ కూడదు. సహవిద్యా విధానం అనేది డూన్ స్కూల్ అస్తిత్వాన్నీ, వ్యవస్థాపకుడి ఆశయాన్నీ మౌలికంగా మార్చివేస్తుంది. కాబట్టే, ఇంగ్లండులో అనేక వందల ఏళ్ల సుప్రసిద్ధ చరిత్ర కలిగిన ఈటన్ కాలేజీ, హ్యారో పాఠశాలలు మారలేదు.స్కూల్ సంస్కృతినీ ఈ సందర్భంగా మనం పరిగణన లోకి తీసుకోవాలి. దాదాపు శతాబ్ద కాలం నుంచీ డూన్ కొన్ని విలువల ప్రాతిపదికగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అక్కడ విద్యార్థుల ఆలనాపాలన; గురువులతో, పాత విద్యార్థులతో విద్యార్థుల స్నేహపూర్వక సాన్నిహిత్యం ఎన్నదగినవి. కో-ఎడ్యుకేషన్ అయినా, కాకున్నా కొన్ని ఇతర ప్రముఖ పాఠశా లలకూ ఇలాంటి ఔన్నత్యం ఉంటుంది. కాదనడం లేదు. మరో ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే, కో–ఎడ్యుకేషన్ విద్యాసంస్థగా అవతరించడానికీ, అందుకు అవసరమైన వస తులు కల్పించడానికీ, ఇతర మార్పులు చేయడానికీ డూన్ క్యాంపస్ ఎంతమాత్రం సరిపోదు. అయినా సరే బాలికలకు ప్రవేశం కల్పించాలీ అంటే బాలుర సంఖ్యను కుదించాల్సి వస్తుంది. నిజంగా ఇది అవసరమా? మేయో కాలేజీని సహవిద్యాభ్యాస సంస్థగా మార్చక పోవడానికి బహుశా ఇదే కారణమై ఉంటుంది. బదులుగా, ‘మేయో గరల్స్ స్కూల్’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డూన్ స్కూలుకు కూడా ఈ అవకాశం ఉంది. నిజానికి, ఇలా చేయడం మరింత అర్థవంతంగా ఉంటుంది.డూన్ స్కూల్ విషయంలో ఈ చర్చ కంటే ముఖ్యమైంది... స్కూలు పనితీరు విద్యాపరంగా మెరుగుపడాలి. క్రీడా సదుపాయాలు పెరగాలి. అలాగే ఇతర మౌలిక సదు పాయాలు పెంచాలి. ఇవన్నీ సమకూర్చుకోవడమే స్కూలు ప్రథమ ప్రాధాన్యం! కో–ఎడ్యుకేషన్ కాదు!!డాస్కోస్ (డూన్ స్కూల్ బాయ్స్ తమకు తాము పెట్టుకున్న పేరు)కు అమ్మాయిల ప్రపంచం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎవరూ కాదనరు. దగ్గర్లోనే ఉన్న వెల్హామ్ వంటి గరల్స్ స్కూల్స్‌తో డూన్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. వెల్హామ్లో డాస్కోస్ అక్కలు, చెల్లెళ్లు, కజి¯Œ ్స చాలామంది చదువుతుంటారు. ఉభయులూ కలిసి అనేక విద్యా, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి చేపట్టడం సాధ్యమే. కో–ఎడ్యుకేషన్ కంటే ఇది సరైనది. అర్థవంతంగానూ ఉంటుంది. మార్పు అనేది ఇతర సంస్థలకే పరిమితం కాదు. డూన్ స్కూల్ కూడా ఎప్పటికప్పుడు మార్పును అందిపుచ్చు కోవాలి. అంటే దాని మౌలిక స్వరూపమే మారాలని కాదు. మార్పును స్వాగతించడం నిర్మాణాత్మకమైనది. పరిపూర్ణత్వం కోసం పొరపాటు లక్ష్యాన్ని నిర్ణయించి, ఏదో మంచి జరుగు తుందనే నమ్మకంతో అసలు ఆత్మనే మార్చాలనుకోవడం విధ్వంసాత్మకం. అమూల్యమైన, గౌరవనీయమైన ఒక బాయ్స్ స్కూల్‌గా కొనసాగే హక్కును డూన్ స్కూల్ ఇప్పటికే సాధించింది. అలా కొనసాగనిద్దాం.-కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ -
గనులకై యుద్ధం
మధ్యభారత అరణ్యాలలో ఆదివాసుల మీద, ఆదివాసుల జల్, జంగల్, జమీన్, ఇజ్జత్ పోరాటానికి మద్దతు ఇస్తున్న మావోయిస్టుల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి గట్టడం, ఆ ప్రాంతంలోని అపారమైన, సంపన్నమైన ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే వ్యూహంలో భాగమే అని దాదాపు ఇరవై సంవత్సరాలుగా పరిశీలకులు, విమర్శకులు ఎందరో రాస్తున్నారు. సల్వా జుడుం పేరుతో 2005లో పాలకులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిన ఆదివాసుల మధ్య అంతర్యుద్ధం నుంచి, ఇప్పుడు 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్టు రహిత ఛత్తీస్‌గఢ్ తయారు చేస్తామని ముహూర్తం నిర్ణయించి మరీ సాగిస్తున్న ఆపరేషన్ కగార్ దాకా మధ్య భారత అరణ్యాలలో చాలా నెత్తురు ప్రవహించింది. చివరి యుద్ధం అని చెప్పుకొంటున్న ప్రస్తుత దశ మొదలైన 2024 జనవరి 1 నుంచి గడచిన పద హారు నెలల్లో 400 మందికి పైగా ఆదివాసులను, మావోయిస్టులను భద్రతా బలగాలు చంపివేశాయి.ఖనిజ వనరుల కోసమే!ఈ మారణకాండ అంతా ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేసి, స్వస్థలాల నుంచి వారిని నిర్వాసితులను చేసి, వారి కాళ్లకింది నేలలో నిక్షిప్తమైన సంపన్న ఖనిజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడానికే అని విమర్శకులు చేస్తున్న అభియోగం నిజమేనని చూపే పరిణామాలు జరుగు తున్నాయి. కార్పొరేట్ సంస్థల రక్షణ కోసం లెక్కలేనన్ని భద్రతా బలగాల క్యాంపులు నిర్మాణమవుతున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర్ సీమా బల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి సరిహద్దులను రక్షించవలసిన బలగాలు ఇప్పుడు మధ్య భారతంలో ఉన్నాయి. ఆ బలగాలను తీసుకుపోవడానికీ, తవ్విన ఖనిజాన్ని బైటికి తీసుకురావడానికీ నాలుగు లైన్ల, ఆరు లైన్ల రహదారుల నిర్మాణం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేగంగా జరిగిపోతున్నది. ఈ ‘అభివృద్ధి’ కార్యక్ర మానికి అడ్డు వస్తారనే అనుమానం ఉన్నవాళ్ల మీదికి డ్రోన్లతో నిఘా, వైమానిక బాంబు దాడులు, వేలాది కాల్బలాలతో జల్లెడ పట్టి, చుట్టుముట్టి, ఎటువంటి ప్రతిఘటన లేకపోయినా కాల్చి చంపి ఎదురుకాల్పుల కథనాలు విడుదల చేయడం జరుగు తున్నది.ఆ వరుసలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న అత్యుత్తమ స్థాయి ఇనుప ఖనిజం (హెమటైట్) గనులను వేలం వేయడానికి శరవేగంతో ప్రయత్నిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖనిజ వనరుల శాఖ 2025 జనవరి 15న సరిగ్గా ఈ హత్యాకాండల వార్తలు వస్తున్న దంతెవాడ, కాంకేర్ జిల్లాలలోని ఇనుప ఖనిజం గనుల బ్లాకులు నాలుగింటిని వేలం వేసే ప్రక్రియ ప్రారంభించింది. వీటిలో బైలదిల్లా గనులుగా ప్రఖ్యాతమైన ఖనిజ వనరుల కొండలు దంతెవాడ జిల్లా కిరండుల్ నుంచి బీజాపూర్ జిల్లా గంగలూరు దాకా వ్యాపించి ఉన్నాయి. బైలదిల్లా డిపాజిట్ 1ఎ, 1బి, 1సి, కాంకేర్ జిల్లాలోని హాహాలొద్ది అనే ఈ నాలుగు బ్లాకుల వేలం ప్రక్రియ ఫిబ్రవరి 28 దాకా సాగి, 58 ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీ పడ్డాయి. చివరికి మూడు గనులను ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా, ఒక గనిని రూంగ్టా స్టీల్ దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు కూడా ప్రభుత్వ వేలంపాటలో ప్రతిపాదించిన కనీస ధర కన్నా 154 శాతం, 160 శాతం ఎక్కువకు పాడు కున్నాయంటే, అక్కడ వారికి ఎంత లాభం చేకూరే అవకాశం ఉందో ఊహించవచ్చు. ఈ గనుల లీజు యాభై సంవత్సరాల పాటు ఉంటుంది గనుక ఇది రేపో మాపో వట్టిపోయే ఆవు కూడా కాదు, కామధేనువు! ఇప్పటివరకూ బైలదిల్లా గనుల్లోకి ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) తప్ప ప్రైవేటు కంపెనీలు ప్రవేశించలేదు. ఇప్పటివరకూ ఆర్సెలార్ మిత్తల్ తనకు అవసరమైన ఖనిజాన్ని ఎన్ఎండీసీ నుంచి తీసుకుని పైప్ లైన్ ద్వారా విశాఖపట్నం పంపుతుండేది. ఇప్పుడీ వేలంతో ఆ కంపెనీకి సొంత గనులు వచ్చాయి. వీటిలో బైలదిల్లా 1ఎ, 1బి ఒక్కొక్కటీ 2,100 ఎకరాలు, 1సి 1,976 ఎకరాలు, హాహాలొద్ది 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ నాలుగు బ్లాకులతోనే దట్టమైన దండకారణ్యంలో దాదాపు ఏడు వేల ఎకరాల అడవి నేలమట్టమైపోయి ‘అభివృద్ధి’ జరగబోతున్నది. ఈ నాలుగు బ్లాకులూ కలిసి దాదాపు ముపై్ఫ కోట్ల టన్నుల ఉత్తమశ్రేణి ఖనిజం తవ్వబోతున్నారు. ఇటువంటి లెక్కలలో తాము కాగితాల మీద పొందినదానికన్న ఎక్కువ విస్తీర్ణపు గనులు తవ్వి, మరింత ఎక్కువ ఖనిజాన్ని దోచుకుపోవడం అందరికీ తెలిసిందే. వేలం ప్రక్రియలో చెప్పిన మేరకే తవ్వుతారని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమే ఈ నాలుగు గనుల ఖనిజం విలువ ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు. కాగా, ప్రభుత్వానికి దక్కే ఆదాయం ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే! ఈ రాష్ట్రంలో ఇంతకుముందే ఎన్ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వ ఛత్తీస్‌గఢ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సీఎండీసీ)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పరచి, గనులకు పర్యావరణ అనుమతులు సంపాదించి, ఆ గనులను తవ్వకం, ఖనిజాభివృద్ధి కార్యకలాపాలకు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు ఇచ్చింది. ఖనిజ సంపన్నమైన ఈ రాష్ట్రంలో ఇప్పటికే అంబుజా, బిర్లా, ఎస్సార్, జిందాల్, జె కె లక్ష్మి, లఫార్జ్, ఎల్ అండ్ టి, వేదాంత వంటి కార్పొరేట్ దిగ్గజాలన్నీ ఉన్నాయి. ఇది పలు రకాల సమస్యఇది ఆదివాసులకో, మావోయిస్టులకో సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది ముహూర్తాలు నిర్ణయించి మనుషులను చంపవచ్చునా అనే మానవతా సమస్య, నాగరికతా సమస్య. పర్యావరణ సమస్య, దేశ సంపద ఎవరికి చెందాలనే సమస్య, అటవీ హక్కుల చట్టం, పంచాయత్ రాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం వంటి చట్టాల ఉల్లంఘన సమస్య. రాజ్యాంగ ఆదర్శాలు, ప్రజల హక్కులు అమలవుతున్నాయా అనే సమస్య. మనందరి సమస్య!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘శాంతము లేక సౌఖ్యము లేదు...’!
‘శాంతము లేక సౌఖ్యము లేదు...’ అన్న త్యాగరాజ కీర్తన సంగీత కచేరీలలో ఎక్కువగా కనిపించదు. పాత రోజులలో నాగయ్య, భాను మతి వంటివారు సినిమాలలో ఈ పాట పాడటం వల్ల, ఆ పాటకూ, మాటకూ బాగా ప్రాచుర్యం ఉండేది.ఎవరికయినా అకస్మాత్తుగా కోపం బుస్సుమని పొంగివస్తే, చను వున్న సన్నిహితులు, ‘నాయనా! కోపం తగ్గించు. శాంతము లేక సౌఖ్యము లేదు!’ అని త్యాగరాజు గారి పల్లవిని సామెతగా, సుభాషితంగా వాడటం శిష్ట సమాజంలో ఇప్పటికీ అప్పుడప్పుడూ వినిపిస్తుంది.‘తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష!’ అన్న విషయం అందరికీ అనుభవవైక వేద్యమే. కోపాన్ని దూరంగా ఉంచేవాడికి, సుఖ సంతోషాలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి, దార, సుతులు, ధన, ధాన్యములుండిన, / సారెకు జప, తప సంపదలుండిన, / ఆగమ, శాస్త్రములన్నియు చదివిన,.../ భాగవతు లనుచు బాగుగ పేరైన, / శాంతము లేక సౌఖ్యము లేదు! అన్న అయ్య వారి మాట వరహాల మూటే. అయితే, ఇక్కడ ‘శాంతం’ అంటే, క్రోధ రాహిత్యమనీ, కోపం లేకుండా వ్యవహరించటమనీ మాత్రమే అర్థం చెప్తే, అదీ మంచి మాటే! కానీ అది కొంచెం పరిమితమైన అర్థం. వాస్తవానికి, చివరి దాకా చూస్తే, త్యాగయ్య గారంటున్నది, ‘... త్యాగ రాజ నుత! సాధురక్షిత! తనకు ‘ఉప/శాంతము’ లేక సౌఖ్యము లేదు!’ అని. ఉపశాంతం అంటే ఉపశమనం, శమింపజేయటం, నియంత్రించటం! కామ క్రోధ లోభాది ఆరు అంతశ్శత్రువులనూ అదుపులో ఉంచటం. క్షణికోద్రేకం కట్టలు తెగకుండా చూడటం. ఇంద్రియ కాంక్షల విజృంభణను నిగ్రహించటం. ఒత్తిళ్ళ వల్ల ఓర్పు కోల్పోకుండా,సంయమనంతో స్పందించటం. అటు లౌకిక విషయాలలో గానీ, ఇటు ఆధ్యాత్మిక సాధనలలో గానీ పురోగతి కోరేవాడికి, ఇది అత్యావశ్యకమైన గుణం అనడంలో సందేహానికి ఆస్కారం లేదు!– మారుతి శాస్త్రి -
Phule movie ‘ఫూలే’ సినిమాపై అభ్యంతరాలా?
మూడు వేల ఏళ్ల కులవ్యవస్థ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మానవతావాది మహాత్మా ఫూలే. ఆయనపై అనంత్ మహాదేవన్ దర్శకత్వంలో ప్రముఖ నటులు ప్రతీక్ గాంధీ, పత్రలేఖ ప్రధాన పాత్రలలో... ‘ఫూలే’ సినిమా తయారయింది. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపిస్తుందనీ... కులవాదాన్ని ప్రోత్సహిస్తుందనీ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్య క్షుడు ఆనంద్ దవేతో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు ఆరోపించడంతో సినిమా విడుదల వాయిదా పడింది. వారి అభ్యంత రాల కారణంగా... సెన్సార్ బోర్డు కూడా కుల సంబంధిత పదా లను తొలగించాలని సూచించింది. అయితే స్వయంగా బ్రాహ్మ ణుడైన ఈ చిత్ర దర్శకుడు అనంత్ మహాదేవన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, సినిమా చారిత్రక వాస్తవాల ఆధారంగా రూపొందిందనీ, ఎటు వంటి అజెండా లేదనీ చెప్పారు. మూడు వేల ఏళ్ల పాటు ఈ దేశంలోని మెజారిటీ వర్గాల ప్రజలకు క్షుద్రులు, శూద్రులు, మ్లేచ్ఛులు, ఛండాలురు అనే పేర్లు తగిలించి... బానిసలుగా చూసిన అమా నుష కులవ్యవస్థ ఈ దేశంలో రాజ్యమేలింది. తమ స్వార్థం కోసం మతాన్ని, సమా జాన్ని భ్రష్టు పట్టించిన ఆ మనువాదుల దౌర్జన్యాలను ఒంటరిగా ఎదిరించిన ధీశాలి ఫూలే. ‘మనుషులందరినీ పుట్టించినవాడు దేవుడే అయినప్పుడు... ఒక తండ్రి తన బిడ్డలలో కొందరు ఎక్కువ కొందరు తక్కువ... కొందరు ద్విజులు, కొందరు పంచ ములు అంటూ ఎలా శాసిస్తాడు? ఇవన్నీ మీరు రాసిన అబద్ధపు రాతలు! ఇక ఈ అకృత్యాలను కట్టిపెట్టండి!’ అంటూ గర్జించి, స్వార్థపర వర్గాల దౌర్జన్యాలపై సమర శంఖం పూరించాడు మహాత్మా ఫూలే.శూద్ర బిడ్డలకూ, స్త్రీలకూ చదువు చెప్పడానికి పుణే వీధుల్లో సావిత్రిబాయి ఫూలే వెళుతుంటే... అగ్రవర్ణాలు రాళ్లు వేసే దృశ్యాన్ని తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఫూలే జీవిత చరిత్రలో ఆయన ఎదుర్కొన్న అవరోధాల ప్రస్తావన ఉండకపోతే... మరేమి ఉంటుంది? జరిగిన చరిత్రను చూపెడితే... మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ బుకాయిస్తే ఎలా?– ఆర్. రాజేశమ్సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ -
కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!!
డిజిటల్ ప్రపంచంలో మరో కొత్త అంశం చక్కర్లు కొడుతోంది. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు కాస్తా ప్రఖ్యాత జపనీస్ యానిమేటర్ హయావో మియజాకీ శైలిలో గీసిన ఫ్యామిలీ, వ్యక్తిగత చిత్రాలతో నిండిపోతున్నాయి. గిబ్లీ ఆర్ట్ పేరు పెట్టుకున్న ఈ చిత్రాల ధోరణి నాలుగు దశాబ్దాల పాటు యానిమేషన్ రంగంలో ఎన్నో ప్రఖ్యాత క్యారెక్టర్లను సృష్టించిన గిబ్లీ స్టూడియో నకలు అన్నది మీకు తెలిసే ఉంటుంది. తేలిక పాటి పేస్టల్ షేడ్స్‌లో క్యారెక్టర్ల చిత్రీకరణ దీని హైలైట్. ప్రస్తుతానికి ఈ గిబ్లీ ఆర్ట్ అన్నది ఏఐ ప్లాట్‌ఫామ్స్ కొన్నింటిలో ఉచితంగా లభి స్తోంది. కొన్ని క్లిక్‌ల సాయంతో ఏ చిత్రాన్నైనా గిబ్లీ ఆర్ట్‌గా మార్చేయ వచ్చు. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఫ్యాషన్ , స్పోర్ట్స్ ఇన్‌ఫ్లుయెన్స ర్లతో పాటు కొన్ని కోట్ల మంది ఇప్పటికే ఈ గిబ్లీ ఆర్ట్‌ను వాడేశారు.సరదాగా కనబడుతున్నా...కంటెంట్‌ను సృష్టించేందుకు ఉపయోగించే జనరేటివ్ ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చి కొంత కాలం అయినప్పటికీ, ‘ఓపెన్ ఏఐ’ అభివృద్ధి చేసిన సరికొత్త ఏఐ టూల్ ఈ గిబ్లీ ఆర్ట్ ట్రెండ్‌కు కారణమైంది. ఛాట్‌జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లు మనం అందించే సమాచారం (టెక్ట్స్) ఆధారంగా మనకు కావాల్సిన సమ చారాన్ని వివిధ రూపాల్లో (ఆర్టికల్స్, సోషల్ మీడియా పోస్టులు వంటివి) తయారు చేస్తాయి. అదే గిబ్లీ ఆర్ట్ వంటివి మల్టీమీడియా జనరేటివ్ ఏఐ టూల్స్! టెక్ట్స్‌తో పాటు వీడియోలు, వాయిస్, ఫొటోలు, మ్యూజిక్ వంటి వాటినన్నింటినీ అది తీసుకోగలదు. ‘మిడ్ జర్నీ’, ‘స్టేబుల్ డిఫ్యూషన్ ’, ‘డాల్–ఈ’ వంటివి టెక్ట్స్‌ను తీసుకుని ఇమేజెస్ ఇవ్వగలవన్నది తెలిసిందే. డాల్–ఈతో ఢిల్లీ వీధుల చిత్రాలను ఎం.ఎఫ్.హుస్సేన్ లేదా జామినీ రాయ్ శైలిలో కొన్ని సెకన్ల సమయంలోనే తయారు చేయవచ్చు. ఇక ‘లెన్సా’ వంటివి ఇచ్చిన ఇమేజ్‌కు ప్రత్యామ్నాయాలను సృష్టిస్తాయి. వీటితో పోలిస్తే గిబ్లీ ఆర్ట్‌కు ఎక్కువ ఆదరణ ఎందుకు లభించిందంటే... ఇవి ముద్దుగా, హాస్యస్ఫోరకంగా ఉండటమని చెప్పాలి. చూసేందుకు హాస్యస్ఫోరకంగానే ఉండవచ్చు కానీ, దీని వెనుక ఒక సీరియస్ సమస్య ఉంది. ఏదైనా ఏఐ వ్యవస్థ వాస్తవ ప్రపంచం నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే పనిచేస్తుంది. ఈ సమాచారం ద్వారా ఏఐ వ్యవస్థలకు శిక్షణ అందుతుంది. రకరకాల మార్గాల ద్వారా ఏఐ వ్యవస్థలకు డేటా (టెక్ట్స్, ఇమేజెస్, సంగీతం) అందు తూంటుంది. రస్కిన్ బాండ్ లేదా అమితవ్ ఘోష్ శైలిలో ఒక చిన్న కథ రాయమని మనం ఏదైనా లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను అడిగా మనుకోండి... వీరిద్దరి రచనల తాలూకూ సమాచారం మొత్తాన్ని వెతికేస్తుంది ఏఐ! చివరకు కాపీరైట్ హక్కులున్న సమాచారం కూడా. కానీ ఏఐ కంపెనీలు ఈ కాపీరైట్ హక్కులు పొందకపోవడం గమ నార్హం. గిబ్లీ ఆర్ట్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏ కంపెనీ కూడా గిబ్లీ స్టూడియో తాలూకూ చిత్రా లను వాడుకునే హక్కులు తీసుకోలేదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్నే తాము వాడుకుంటున్నట్లు ఏఐ కంపెనీలు చెబుతున్నా... రచయితలు, కళా కారుల స్పందన వేరుగా ఉంది. కాపీరైట్ చట్టాల్లోని ‘ఫెయిర్ యూజ్’ సిద్ధాంతం గురించి ఏఐ కంపెనీలు చదివితే మేలని వీరు అంటు న్నారు. అప్పుడే అమెరికా, యూరప్‌లలో న్యాయపోరాటాలైతే మొద లయ్యాయి. సృజనకారులకు దక్కేదేమిటి?గిబ్లీ ఆర్ట్ వంటి ఏఐ టూల్స్ అసలు సృజనాత్మకత అన్న అంశంపైనే సవాళ్లను లేవనెత్తుతున్నాయి. ఓ అందమైన పెయింటింగ్, కార్టూన్ క్యారెక్టర్, సంగీతం... ఇవన్నీ మనిషి సృజనకు మచ్చుతున కలు. ఇవన్నీ ఆ యా వ్యక్తుల సొంత అనుభవాలు, సందర్భాల నుంచి పుట్టుకొచ్చినవి. గిబ్లీ ఆర్ట్‌నే ఉదాహరణకు తీసుకుందాం. జపాన్ సమాజం, సంస్కృతులకు అది అద్దం పడుతుంది, అమెరికన్ సంస్కృతికి వాల్ట్ డిస్నీ స్టూడియో అద్దం పట్టినట్లు!ఇలాంటి సృజనాత్మక కళాకృతులను యంత్ర సృష్టిగా మార్చడం లేదా ఒక ఏఐ సిస్టమ్ మానవ సృజనాత్మకత, అభినివేశాలకు విరు ద్ధంగా వెళ్లడం మేలైన ఆలోచనైతే కాదు. ఒక పెయింటింగ్‌ను పూర్తి చేసేందుకు కళాకారుడికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. అలాగే పుస్తకం రాయడానికి ఏళ్లు పడుతుంది. ఒక కార్టూన్ లేదా యానిమేషన్ స్ట్రిప్ తయారు చేసేందుకు ఆర్టిస్టులు వందల గంటలు కష్టపడాల్సి రావచ్చు. వీటన్నింటి ఆధారంగా పనిచేసే ఏఐ సృష్టించే ఆర్ట్‌కు పేరు, డబ్బు... రెండూ అసలు కళాకారులకే దక్కాలి. అందుకే ఏఐ కంపె నీలు డేటా లాండరింగ్‌కు పాల్పడుతున్నాయనీ, కళాకారులకు దక్కా ల్సిన డబ్బు, క్రెడిట్ రెండింటినీ ఎగ్గొడుతున్నాయనీ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని లక్షల మంది కళాకారులపై ఆధారపడి అభివృద్ధి అవుతున్న ప్రతి ఏఐ జనరేటివ్ మోడల్ కంపెనీ విలువ వందల కోట్ల డాలర్లుగా ఉండటం ప్రస్తావనార్హం. ఇవి వినియోగ దారుల నుంచి వేల డాలర్ల రుసుము వసూలు చేస్తూంటాయి. అయితే, అసలు కళాకారులకు ఇందులోంచి ఏమీ దక్కడం లేదు. ఇమేజ్ జనరేటర్లు కళాకారులు కాదు కానీ... కళాకారులకు సవాలు విసురుతున్నాయి. జనరేటివ్ ఏఐ మోడళ్లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సృజనాత్మకత కలిగిన వారి జీవనోపాధిని దెబ్బ తీస్తున్నాయి. యానిమేషన్ రంగంలోని కళాకారులు, ఇల్లస్ట్రేటర్లు, డిజైనర్లపై ప్రభావం ఎక్కువే ఉంది. పైగా మానవ కళాకారులతో పోలిస్తే ఏఐ తయారు చేసే బొమ్మల్లో డెప్త్, భావ ప్రకటన తక్కువ. ఏఐ ఆకృతులు ఓ మోస్తరువి మాత్రమే! ఒప్పందాలు మేలా?ఇప్పుడు డిజిటల్ ప్రపంచం మొత్తం గిబ్లీ వంటి ఉచిత ఏఐ టూల్స్ ఉత్పత్తులతో నిండిపోయింది. సినిమా స్టుడియోలు, నెట్ వర్క్‌లు ఇప్పటికే ఈ ఏఐ టూల్స్‌ను శ్రమ, ఖర్చులు రెండూ తగ్గించేవిగా చూస్తున్నాయి. పదుల కొలదీ యానిమేటర్ల బృందాలను నియమించుకునే బదులు, కొందరు ఏఐ టెక్నికల్ డైరెక్టర్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ధోరణి మనదేశంలో ఆందోళనకు కారణం అవుతోంది. వేల మంది భారతీయ టెకీలు హాలీవుడ్ స్టూడియోలు ఔట్‌సోర్స్ చేసే యానిమేషన్ వర్క్‌పై ఆధారపడి ఉన్నారు. వాళ్లు కంప్యూటర్ గ్రాఫిక్స్, ఇతర టూల్స్‌ను వాడుతున్నారు. కానీ ఏఐ టూల్స్‌తో ఆటోమేషన్ మరో స్థాయికి వెళ్తుంది.ఈ సమస్యకు సులభ పరిష్కారం లేదు. కాపీరైట్ల విషయంలో న్యాయ స్థానాలకు వెళ్లడం ఒక మార్గం. డేటా ప్రొటెక్షన్ చట్టాలు, ఏఐ నియంత్రణలు ఇప్పుడిప్పుడే ఏఐ టూల్స్ తాలూకూ సైడ్ ఎఫెక్ట్స్్పై దృష్టి పెడుతున్నాయి. కొంతమంది పబ్లిషర్లు, పుస్తక, సంగీత కంపె నీలు ఆదాయాన్ని పంచుకునే విషయంలో ఏఐ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తద్వారా తమ పుస్తకాలు, సంగీతం లేదా ఇతర కళలను ఏఐల శిక్షణకు ఉపయోగించుకునే వీలు ఏర్పడుతోంది. డేటా ట్రెయినింగ్ కోసం ఎటూ టెక్ కంపెనీలు తమ కళను వాడుకుంటున్నట్లు వీరు భావిస్తున్నారు. బదులుగా ఒప్పందం కుదుర్చుకో వడం మేలని వీరి ఆలోచన. అనుమతులు తీసుకుని కళలు, సమా చారాన్ని ఏఐ ట్రెయినింగ్ కోసం వాడుకోవడం ఇంకొక మార్గం. సోషల్ మీడియా వేదికలు కూడా ఏఐ ఆధారిత ఇమేజెస్, వీడి యోలు, యానిమేషన్లను అనుమతించే విషయంలో ఆచితూచి వ్యవ హరించాలి. ప్రస్తుత గిబ్లీ ఆర్ట్ ట్రెండ్ ముప్పు లేదని అనిపించవచ్చు. కానీ... వాస్తవానికి ఇది మనకు మేలుకొలుపు లాంటిది!దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వన్ వే రూటు
రుణపత్రాల విపణిలో ఉత్పన్నమైన అనూహ్య పరిణామాలు అమెరికా అధ్యక్షుడికి గుబులు పుట్టించాయి. అమెరికా బాండ్స్‌కు గిరాకీ పెరిగినట్లే పెరిగి వెంటనే తగ్గిపోయింది. డాలర్ ఇండెక్స్ విలువ కూడా క్షీణిస్తోంది. దీంతో కొత్త సుంకాల విధింపు అమలును 90 రోజుల పాటు నిలిపివేశారు. ఇతర ప్రపంచ దేశాల విషయంలో తాత్కాలికంగానే అయినా ఒక మెట్టు దిగిన ట్రంప్ చైనా విషయంలో మాత్రం చాలావరకు బెట్టుగానే ఉన్నారు. ఏమైనా, అమెరికా సృష్టించిన ఈ అల్లకల్లోలం రోడ్డు మ్యాపు లేని వన్ వే రూటు! ట్రంప్ సుంకాల సంక్షోభం మధ్యకాలిక అనిశ్చితిని పెంచుతుంది. ఆర్థిక కార్యకలాపాలు అంచనాల మీద ఆధారపడి ఉంటాయి. అనిశ్చితి అనేది అంచ నాలను మార్చేస్తుంది. వ్యాపార సంస్థలు, కుటుంబాలు నిర్ణయాలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తాయి. ట్రంప్ 90 రోజుల ఊరట నిజానికి ఈ అనిశ్చితి వ్యవధిని పెంచుతుందే తప్ప, అనిశ్చితికి ముగింపు పలకదు. ఆర్థిక కార్యకాలపాల్లో తెగింపు, నిర్ణయ శక్తి కొరవడతాయి. ప్రభుత్వాలు ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ, ప్రపంచ వ్యాప్త ఆర్థిక మందగమనం తప్పదు. సుంకాల వెనుక రెండు లక్ష్యాలువిచ్ఛిన్నకర సుంకాల ద్వారా రెండు లక్ష్యాలు సాధించాలని ట్రంప్ అనుకుంటున్నారు. అమెరికా వస్తూత్పత్తుల తయారీ వ్యవస్థ ఏనాడో కుప్పకూలింది. దీన్ని పునరుద్ధరించడం మొదటిది. తద్వారా దిగువ స్థాయి ఫ్యాక్టరీ ఉద్యోగాలు విశేషంగా సృష్టి అవుతాయి. ఇక రెండోది, చైనాను శిక్షించడం. ప్రపంచ వాణిజ్య విధానాన్ని అడ్డు పెట్టుకుని అది అనుచిత ప్రయోజనం పొందుతోంది. పాతికేళ్ల క్రితమే అమెరికాలో పాగా వేయ గలిగింది. ఈ రెండో లక్ష్యం కంటే, మొదటిదే ట్రంప్ రాజకీయ మద్దతుదారులకు మరింత ముఖ్య విషయం. దేశీయంగా పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు కల్పించలేనప్పుడు, ధరలు పెరిగిపోతున్నప్పడు, చైనాను శిక్షించడం వల్ల అమెరికన్లకు ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ ఒక సమస్య ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి మొదటి లక్ష్యాన్ని సాధించడమే... చైనాను దెబ్బ తీయడమనే రెండో లక్ష్యం కంటే కష్టమైన విషయం. చైనా భౌగోళిక ఆర్థిక విస్తరణను అదుపు చేసే వ్యూహాలు ఇప్పటికిప్పుడు రూపొందినవి కాదు. గడచిన రెండు దశాబ్దాలుగా అమెరికాలో వీటి గురించి పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు, పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. ఇవి ఎలా ఉండబోతున్నాయో, వీటిని ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధం కావాలో చైనా ప్రభుత్వానికి మంచి అవగాహనే ఉంది. మరి, ట్రేడ్ వార్ పర్యవసానాలు ఎదుర్కొనేందుకు అమెరికా ఎంతవరకు సన్నద్ధంగా ఉందనేది ప్రశ్న. కర్మాగారాల స్థాపనకు కనీసం రెండేళ్లు పడుతుంది. ట్రంప్ నిరుద్యోగ మద్దతుదారులు అందాకా ఓర్పుతో ఉండగలరా? స్వల్పకాలంలో కష్టాలు, దీర్ఘకాలంలో లాభాలు అనే సూత్రం రాజకీయంగా కుదిరేది కాదు. ట్రంప్ స్వదేశంలోనే మద్దతు కోల్పేతే ఆయన విధానాలకు అంతర్జాతీయంగా స్పందన ఎలా ఉంటుంది?దేశాల స్పందనట్యారిఫ్ సంక్షోభం అనంతర కాలంలో ప్రపంచ దేశాలు అమెరికా మీద విశ్వాసం కోల్పోతాయి. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు తన విధానాలు, (వివాదాస్పద) మాటలు వెనక్కు తీసుకున్నా, ఆయన ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాధిపతులు విశ్వాసంలోకి తీసుకోరు! కెనడా, మెక్సికో, డెన్మార్క్, దక్షిణా ఫ్రికాలను ట్రంప్ బాహాటంగానే టార్గెట్ చేసి మాట్లాడారు. బ్రెజిల్, కొలంబియా, జర్మనీ, ఫ్రాన్స్,సింగపూర్, నమీబియా, ఆస్ట్రేలియా వంటి దేశాల అధినేతలు యూఎస్ అధ్యక్షుడిపై బహిరంగ విమర్శలకు వెనుకాడటం లేదు. యూరోపియన్ యూనియన్ ఈ విషయంలో ఒక్కతాటి మీద లేకున్నా, మెజారిటీ సభ్యదేశాలు అమెరికాను నమ్మే స్థితిలో లేవు. ఈయూ అటు చైనాతోనూ, ఇటు ఇండియా తోనూ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తుంది. బలహీన ప్రధాని నేతృత్వంలోని జపాన్ మాత్రం అమెరికాను ప్రాధేయపడుతున్నట్లు వ్యవహరిస్తోంది. ఏమైనా, అది కూడా చైనాతో వాణిజ్య సంబంధాలు స్థిరీకరించుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇండియా మౌనం వెనుక...ఇక ఇండియా నాయకత్వం అమెరికా ట్రేడ్ పాలసీ పట్ల ఆచితూచి వ్యవహరిస్తోంది. చైనాతో అమీతుమీకి ట్రంప్ సిద్ధపడటం ఇండియాకు ఆనందంగా ఉంది. మరోవంక, అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందానికి చర్చలు జరుపుతోంది. అమెరికా నుంచి రక్షణ సామగ్రి, ఇతరత్రా దిగుమతులు పెంచు కునేందుకు సిద్ధపడుతోంది. అయినా కూడా, ట్రంప్ మొదటి విడత పదవీకాలంలో ఆయనతో వ్యవహరించినంత సంతోషంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దఫా ఉన్నారా? ట్రంప్ ఆయనకు చురకలు వేస్తూ మాట్లాడుతున్నారు. అంతగా స్నేహపూర్వకం కాని ధోరణిలో ఇండియా పేరు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఎంతో సెల్ఫ్ ఇమేజ్, ఇగో ఉన్న మోదీ ఈ అవమానాలకు లోలోపల కుమిలిపోయే ఉంటారు!ఉభయ దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సుస్థిరపరచుకోవాలని ఇండియా భావిస్తోంది. అయినా సరే, ఏ భారతీయ నాయకుడూ జపాన్, ఇటలీ మాదిరిగా ట్రంప్ ముందు సాగిలపడేందుకు సిద్ధంగా లేరు. బహుశా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్న నేపథ్యంలో మోదీ మౌనం పాటిస్తూ ఉండొచ్చు. దీంతో, గ్లోబల్ సౌత్ (పేద దేశాలు) తరఫున మాట్లాడేందుకు ఇతరులకు అవకాశం లభించింది. ట్రేడ్ ట్యారిఫ్లను వ్యతిరేకిస్తూ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు చైనా సంఘీభావం ప్రకటిస్తోంది. ఇండియా కూడా కలిసి రావాలని ఆహ్వానిస్తోంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా నాయకులు కూడా ఇతర వర్ధమాన దేశాలకు సంఘీభావం ప్రకటించాయి. ‘గ్లోబల్ సౌత్’ ఇండియా ‘వాయిస్’ కోసం ఎదురు చూస్తోంది.సంజయ బారు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
బాలీవుడ్ నటి, పాప్ గాయని, బిజినెస్ ఉమెన్... మరెన్నో రంగాల్లో ప్రసిద్ధి చెందిన 'కునిక సదానంద్ లాల్' తన వైవిధ్యమైన పాత్రలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ముంబైలో చలనచిత్రరంగానికి మారడానికి ముందుగానే కునిక నటనా జీవితం ఢిల్లీలో ప్రారంభమైంది, ఆమె తొలుత అనేక టీవీ సిరీస్‌లలో కనిపించింది. ప్రముఖ హాస్యనటుడు అస్రానీ భార్య మంజు అస్రానీ టీవీ సిరీస్‌లో ఓ అద్భుతమైన పాత్రతో బ్రేక్ అందుకుని సినిమా తారగా మారారు. దాదాపుగా 125 సినిమాల్లో నటించారు. గుమ్రాహ్, బేటా వంటి సినిమాల్లో విలన్‌గానూ మెప్పించారు. ఆమె సినిమా విజయాలకు మించి, ప్రైవేటు ఆల్బమ్స్ ద్వారా గాయనిగా పేరొందారు. విజయవంతమైన పలు సంస్థల వ్యవస్థాపకురాలు, సామాజిక కార్యకర్త కూడా. ముంబైలోని గోరేగావ్ శివారులో, వైట్ ఇటాలియన్ కేఫ్, జింగ్కేఫ్ మెజెస్టికా ది రాయల్ బాంక్వెట్ హాల్, అలాగే ఎక్స్హేల్ స్పా వంటివి నిర్వహిస్తున్నారు. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ షోలో కనిపించినప్పటి నుంచి కునికా సదానంద్ వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆ షో లొ ఆమె చాలా ఓపెన్ అయ్యారు గాయకుడు కుమార్ సానుతో తన ప్రేమ వ్యవహారం గురించి అంతేకాదు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పలువురు హీరోయిన్లతో నడిపిన వ్యవహారాల గురించి కూడా మాట్లాడడం విశేషం. ఆమె మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ గురించి కూడా ప్రస్తావించారు అంతేకాదు గతంలో హీరోయిన్లను లొంగదీసుకోవాలని లైట్మెన్లతో సహా ఎలా ట్రై చేసేవారో కూడా వెల్లడించారు. దాంతో ఆ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అక్షయ్ కుమార్ ఎఫైర్స్‌పై కామెంట్లుఅక్షయ్ కుమార్‌కి హీరోయిన్లతో ఉన్న ఎఫైర్స్ గురించి ఆమె మాట్లాడుతూ ‘అతను చాలా అందంగా ఉంటాడు అంతేకాదు అతను నా కంటే ఒక సంవత్సరం చిన్నవాడు అయినా కూడా అతను ఇంకా ఫిట్‌గానే ఉన్నాడు‘ మగవాళ్లలో మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్థాయిలు చురుకుగా ఉన్నప్పుడు, మంచి ఫిట్నెస్ పొందుతారని అది సాధారణమేనని చెప్పారు. అంటే మగతనం ఎక్కువైతే ఫిట్నెస్ దాంతో ఆడవాళ్ళ కు ఆకర్షణ కలగడం.. వల్ల ఇలాంటి ఎఫైర్స్ పుట్టుకొస్తాయన్నట్టుగా అభిప్రాయపడ్డారు. అదే ఇంటర్వ్యూలో తన నటనా జీవితంలో ప్రారంభంలో బాలీవుడ్ టాప్ సింగర్ కుమార్ సానుని కలుసుకున్నానని తొలిచూపులోనే నచ్చడంతో అదొక తక్షణ ఆకర్షణగా భావించానని వెల్లడించారు. తాను ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా ఊటీలో ఉన్నప్పుడు అదే సమయంలో కుమార్ సాను కూడా తన సోదరి, మేనల్లుడితో విహారయాత్రలో ఉన్నాడని అలా తమ మధ్య బలమైన అనుబంధం ఏర్పడిందన్నారు.పరిశ్రమలో తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్న ఆమె... గతంలో గౌరవప్రదమైన కుటుంబాలకు చెందిన మహిళలు అరుదుగా మాత్రమే సినిమాల్లో కెరీర్‌ను ఎంచుకునేవారని అన్నారు. దానికి తగ్గట్టే అప్పటి పరిస్థితులు ఉండేవని చెప్పారు. లైటింగ్ టెక్నీషియన్లు కూడా నటీమణుల పట్ల తరచుగా అనుచితమైన ఆలోచనలతో ఉంటారని, ఆమె వెల్లడించడం విశేషం ‘వారు తమ చేతులపై పెర్ఫ్యూమ్తో వస్తారు, వాటిని హీరోయిన్ వైపు చాచేవారని అంతేకాక హీరోయిన్ల చెవుల్లో అసభ్యకరమైన విధంగా గుసగుసలాడేవారు‘ అని ఆమె అన్నారు. ఈ నేపధ్యంలో అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరమన్నారు. తానెలా ఇలాంటి పరిస్థితుల నుంచి తనను తాను కాపాడుకున్నానో కూడా వివరించారు.‘షూటింగ్ సమయం అయిపోయాక ఆకలితో ఉన్న సింహాలు బయటికి వచ్చి, బయట తిరుగుతున్నట్లుగా ఉండేది. కొంతమంది చాలా మర్యాదగా సాయంత్రం కలుద్దామా? అని ఫోన్లు చేస్తే, మరికొందరు మాత్రం మరింత దూకుడుగా ప్రవర్తించేవారు అంటూ వెల్లడించారు. అలాంటి సందర్భాల్లో తన హెయిర్‌డ్రెస్సర్ తరచుగా తన గదిలో రక్షణగా ఉండేవాడని చెప్పారామె తాను అందుబాటులో లేనని లేదా డిన్నర్‌కి బయటకు వెళ్లారని చెబుతూ, ఆమె హెయిర్డ్రెసర్ వారిని తెలివిగా తప్పించేవాడని గుర్తు చేసుకున్నారు. -
అంబేడ్కరుని పాత్రికేయ ప్రమాణాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అంటే గుర్తొచ్చేవి రాజ్యాంగ రచన, అంటరానితనం, కులనిర్మూలన పోరాటాలు, పోరాడి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమానంగా దక్కాలన్న భావన, సమాలోచనలు. అయితే అంబేడ్కర్ గొప్ప పాత్రికేయులనీ, పాత్రికేయ ప్రమాణాలు, నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చేవారనీ, వాటిని కాపాడేందుకు స్వయంగా తానే పత్రికలు స్థాపించి అక్షర పోరాటం చేశారనీ చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన ‘మూక్ నాయక్’ (1920), ‘బహిష్కృత భారత్’ (1027), ‘సమత’ (1928), ‘జనత’ (1930) ‘ప్రబుద్ధ భారత్’ (1956) పత్రికలు స్థాపించి పత్రికా స్వేచ్ఛకు పట్టం కట్టారు. ప్రతి అక్షరాన్ని నిటారుగా నిలిపి, పాత్రికేయ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన ఏ పత్రిక ప్రారంభించినా, దానికి ఒక ప్రత్యేక అజెండా ఉండేది. ఆరంభ సంచికలోనే తానెందుకు, ఎవరి కోసం సదరు పత్రిక ప్రారంభించారో తెలియచేసేవారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కులవివక్ష, అంటరానితనం తనని ఎక్కువగా ప్రభావితం చేశాయని ‘బహిష్కృత భారత్’ పత్రిక లక్ష్యాన్ని వివరిస్తూ తొలిసంచికలో ‘సంతకపు సంపాదకీయం’(సైన్డ్ ఎడిటోరియల్) రాశారు. చైతన్య పరచడం ద్వారానే ప్రజల్లో కదలిక తీసుకురావడం సాధ్యమవుతుందనీ, దాన్ని సాధించడం కోసం ‘ప్రబుద్ధ భారత్’ పత్రిక ప్రారంభించాననీ ఆరంభ సంచికలో సంపాదకీయం ద్వారా పత్రిక అజెండాను చెప్పారు.అంబేడ్కర్ స్థాపించిన పత్రికల్లో అగ్రస్థానం ‘మూక్ నాయక్’దే! నూరేళ్ళ చరిత్రకు సాక్ష్యంగా నిలచి, ఈ మధ్యనే అక్షర సంబరాలు జరుపుకొన్న ఈ పత్రిక జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిందనే చెప్పాలి. నిర్భీతిగా, నిజంవైపు నిలబడడం, పాత్రికేయ విలువలు తు.చ. తప్పక పాటించడం, రాతల్లో అపోహలకు, అసత్యాలకు తావివ్వక పోవడం; కుల రాజకీయాలకు, వివక్షకు దూరంగా రచనలు చెయ్యడం వంటి సూత్రాలను కడదాకా పాటించారాయన. చాలా మటుకు భారతీయ పత్రికలు ఏకపక్షంగా రాస్తున్నాయనీ, కేవలం ఒక వర్గం తాలూకు అభీష్టానికి అనుగుణంగానే రాస్తున్నాయనీ, కొన్నిసార్లు ఊహాజనిత వార్తల్ని వండి వార్చుతున్నాయనీ దుయ్యబట్టారు. రాజ్యాంగ రూపశిల్పిగా, కేంద్ర మంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పేరు పొందిన తనపైనే అవాకులు, చవాకులు పేలడం తనను కలచివేసిందని, అందు వల్లనే తానీ పత్రిక ప్రారంభించడానికి సంకల్పించినట్లు తన సంపాదకీయంలో పేర్కొన్నారు. పెద్దలకు అనుకూలంగాను, పేదలు బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగానూ పత్రికలు కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పెను ప్రమాదమని హెచ్చ రించారు. వెనుకబాటు తనానికి ఆర్థిక అంశాలు ద్వితీయ స్థానంలో ఉండగా, సామాజికాంశాలే ప్రథమ స్థానంలో ఉన్నా యనేది అంబేడ్కర్ నిశ్చితాభిప్రాయం. తద నుగుణంగానే రాజ్యాంగ రూపకల్పనలో సామాజిక రిజర్వేషన్లకు ప్రాధాన్యమిచ్చినట్లు తన రచనల్లో స్పష్టం చేశారు. పేదరికం, నిస్సహాయత, ఆత్మ న్యూనత, వెనుక బాటుతనం దాడి చేస్తుండడం వల్లనే అణగారిన వర్గాలు అభివృద్ధి ఫలాలను అందుకోలేక పోతున్నాయని, ఈ రుగ్మతల నుంచి మెజారిటీ జనాలను ‘విముక్తుల్ని’ చేయడమే తన ముందున్న లక్ష్య మని తన పత్రికల్లో పదే పదే ప్రస్తావించారు.మిగతా వృత్తుల కంటే జర్నలిజం ‘పవిత్ర’మై నదని, జనజాగృతికి, దిశానిర్దేశం చేయడానికి దీన్ని మించిన ‘వజ్రాయుధం’ మరోటి లేదన్నది అంబే డ్కర్ దృఢమైన అభిప్రాయం. సంచలనాల కోసం, తానెప్పుడూ తప్పుడు రాతలు రాయబోనని ప్రతిన బూనారు. పాత్రికేయునికి నైతికబాధ్యత ఆయుధమై ఉండాలన్నారు. జర్నలిజం వృత్తిని గౌరవించేవారు కనీసం ఆయన ప్రమాణాల్లో కొన్ని పాటించినా ఆ మహనీయునికి ఘననివాళి అర్పించినట్లే!ప్రొ‘‘ పీటా బాబీ వర్ధన్ వ్యాసకర్త మీడియా విశ్లేషకులుమొబైల్: 93931 00566 -
దూరదృష్టి గల సంస్కర్త
భారతదేశపు గొప్ప దార్శనికులలో ఒకరైన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి ఈ రోజు. ఆయన వారసత్వాన్ని తక్కువ చేసి చూపించడానికి ఉద్దేశపూర్వకంగా అవాంఛ నీయ ప్రయత్నాలెన్నో జరిగాయి. శతాబ్దం గడచిన తర్వాత కూడా, అంబేడ్కర్ అంటే కేవలం ఒక దళిత నాయకుడిగా పరిగణించడం శోచనీయం. ఆయనను దళితులు, అణ గారిన వర్గాల ప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఆధునిక భారత దేశపు అగ్రశ్రేణి మేధావుల్లో ఒకరిగా పరిగణించాలన్నది అత్యావశ్యం. చదువుకునే రోజుల్లో పిల్లలంతా తాగే సాధారణ కుళాయి నుంచి నీళ్లు తాగడానికి కూడా ఆయనను అనుమతించేవారు కాదు. ఒకసారి మండు వేసవిలో దాహం తట్టుకోలేక దగ్గర్లో ఉన్న కుళాయి నుంచి నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తే... కట్టుబాట్లు ఉల్లంఘించారనే కారణంతో ఆయన మీద దాడికి తెగబడ్డారు. ఆ సంఘటన తరువాత చాలామంది తమ రాత ఇంతే అని సరిపెట్టుకుని ఉండేవారు. మరి కొందరైతే హింసా మార్గాన్ని ఎంచుకుని ఉండేవారు. కానీ, ఆయన అలా చేయలేదు. తనలోని బాధను గుండెల్లోనే అదిమిపెట్టుకుని జీవితాన్ని చదవడం నేర్చుకున్నారు. కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీలతో సహా ఎంఏ, ఎంఎస్సీ, పీహెచ్డీ, డీఎస్సీ, డీలిట్, బార్–ఎట్–లా పూర్తి చేశారు. ఏ పాఠశాలల్లో అయితే తనను చదువుకోవడానికి అనుమతించలేదో... అంతకు మించిన స్థాయిలో విదేశాల్లో విద్యను పూర్తి చేసి తానేమిటో సమాజానికి చూపించారు. అయినా తన మాతృభూమి, కర్మభూమి అయిన భారతదేశానికి తిరిగి వచ్చే విషయంలో స్పష్టమైన వైఖరితో ఉండేవారు.పేరెన్నికగన్న సంస్థల ఏర్పాటులో అంబేడ్కర్ పాత్ర విస్మరించలేనిది. ఆధునిక భారతదేశంలో ఆర్బీఐ, సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి అనేక సంస్థలు బాబాసాహెబ్ దూరదృష్టితో పురుడు పోసు కున్నవే. ఆర్థికశాస్త్రం, ఆర్థిక చరిత్రపై తన ప్రావీణ్యంతో భారత్ ఎదుర్కొంటున్న ద్రవ్య సమస్యలను ఆధారాలతో సహా ‘రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్’కు విశ్లేషణాత్మకంగా వివరించారు. ఫలితంగా ఒక సెంట్రల్ బ్యాంక్‌గా విధులను నిర్వర్తించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు పునాది పడింది.గట్టి ప్రజాస్వామ్యవాదిఅంబేడ్కర్ దృఢమైన ప్రజాస్వామ్యవాది. భారత దేశపు భవి ష్యత్తు, దాని ప్రజాస్వామ్యం, కష్టపడి సంపాదించిన స్వాతంత్య్రం గురించే ఆయన ఎక్కువగా ఆలోచించేవారు. రాజ్యాంగ సభలో ఆయన చివరి ప్రసంగంలో ఈ భయాందోళనలు సుస్పష్టంగా వ్యక్తమ య్యాయి. ఆయన హెచ్చరికలే భారతదేశాన్ని దాదాపు ఎనిమిది దశా బ్దాలుగా ప్రజాస్వామ్య మార్గంలో నడిపిస్తున్నాయి. అయితే నేడు కులం, మతం, జాతి, భాష మొదలైన సామాజిక విభేదాలతో భారతీ యుల మధ్య సోదరభావాన్ని తగ్గించే ప్రయత్నాలను చూస్తున్నాం.ఆర్య–ద్రావిడ విభజన నుంచి ఎక్కువ ప్రయోజనం పొందగలిగే సమయంలో కూడా ఆర్య దండయాత్ర సిద్ధాంతాన్ని అంబేడ్కర్ తప్పు పట్టారు. ‘ఒక తెగ లేదా కుటుంబం జాతిపరంగా ఆర్యులా లేదా ద్రావిడులా అనేది విదేశీ వ్యక్తులొచ్చి విభజన రేఖ గీసేవరకు భారత ప్రజల మదిలో ఇలాంటి ఆలోచనలు తలెత్తలే’దని 1918లో ప్రచురించిన ఒక పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. పైగా యజుర్వేద, అధర్వణ వేదాల్లోని రుషులు శూద్రులకు తగిన ప్రాధాన్యమిచ్చిన అనేక సందర్భాలను ఉదాహరించారు. ఆర్యులు, ద్రవిడుల కంటే అంటరానివారు జాతిపరంగా భిన్నమైనవారనే సిద్ధాంతాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు.తమ సంకుచిత, మతపరమైన ప్రయోజనాల కోసం భాషా సమస్యలను సాకుగా చూపించేవారు దేశ ఐక్యత విషయంలో అంబే డ్కర్ అభిప్రాయాలను తెలుసుకుంటే ఎంతో ప్రయోజనం పొందుతారు.తాను ప్రావీణ్యం సంపాదించిన తొమ్మిది భాషలలో ఒకటైన సంస్కృతాన్ని అధికారిక భాషగా ఆమోదించడానికి మద్దతుగా 1949 సెప్టెంబరు 10న ఆయన రాజ్యాంగ సభలో ఒక సవరణను ప్రవేశ పెట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై తన ఆలోచనలు వెల్లడిస్తూ... ‘హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి’ అని ప్రకటించారు. హిందీ మాట్లాడే ప్రాంతానికి చెందిన వ్యక్తి కాక పోయినప్పటికీ, దేశ ప్రాధాన్యాలకు ప్రథమ స్థానమిచ్చా రన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఆయన దార్శనికతకు అనుగుణంగా...’ప్రజాస్వామ్యం విజయవంతంగా సాగడానికి అనుసరించా ల్సిన పద్ధతుల’పై 1952 డిసెంబర్ 22న ఒక ప్రసంగమిస్తూ... ప్రజా స్వామ్యం రూపం, ఉద్దేశం కాలక్రమేణా మారుతాయనీ, ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే ఆధునిక ప్రజాస్వామ్యపు లక్ష్యమనీ పేర్కొ న్నారు. ఈ దార్శనికతతోనే మా ప్రభుత్వం గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో విజయం సాధించింది. 16 కోట్ల గృహాలకు కుళాయి నీటిని అందించడానికి కృషి చేశాం. పేద కుటుంబాల కోసం 5 కోట్ల ఇళ్లను నిర్మించాం. 2023లో ‘జన్ మన్ అభియాన్’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ ప్రారంభించారు. బలహీన గిరిజన వర్గాల (పీవీటీజీ) సామాజిక– ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, పీవీటీజీ గృహాలు–ఆవాసా లకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం దీని లక్ష్యం. ప్రధాన మంత్రి 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇది బాబాసాహెబ్ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాదు, బాబాసాహెబ్ వారసత్వం, రచనల గురించి భవిష్యత్ తరాలకు మరింతగా తెలియజెప్పడానికి, మా ప్రభుత్వం పంచతీర్థాన్ని అభివృద్ధి చేసింది. అంబేడ్కర్‌తో ముడిపడిన మహూ (మధ్యప్రదేశ్); నాగపూర్ (మహారాష్ట్ర) లోని దీక్షా భూమి; లండన్ లోని డాక్టర్ అంబేడ్కర్ మెమోరియల్ హోమ్; అలీపూర్ రోడ్ (ఢిల్లీ) లోని మహాపరినిర్వాణ భూమి, మరియు ముంబయి (మహారాష్ట్ర) లోని చైత్య భూమిలే ఆ పంచ తీర్థాలు.గత నెలలో ప్రధాని దీక్షాభూమిని సందర్శించినప్పుడు, బాబా సాహెబ్ ఊహించిన భారతదేశాన్ని సాకారం చేయడానికి మరింత కష్టించి పనిచేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అంబేడ్కర్ ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకుంటామంటూ ప్రతిజ్ఞ చేసే అవకాశాన్ని ఆయన జయంతి కల్పిస్తోంది. జాతి, మత, ప్రాంత, కులాలకు అతీతంగా మనమంతా ‘భారతీయులు’గా సాగిపోదాం. ఆయన్ని ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడిగా చేసే ప్రయత్నాలను అడ్డు కోవాలి. ఒక సందర్భంలో సైమన్ కమిషన్ ఆధా రాల గురించి అడిగితే... ప్రాంతీయ దురభిమానమూ, సమూహ భావనలకూ లోనయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తూ, ‘మనమె ప్పుడూ భారతీయులమే’ అన్న చైతన్యాన్ని ప్రజల్లో కలిగించడం అత్యవశ్యమని చెప్పారు. బాబాసాహెబ్... భారతదేశానికి దేవుడి చ్చిన వరం. ప్రపంచానికి భారతదేశమిచ్చిన బహుమతి. అప్పటి బ్రిటిష్ ఇండియా గానీ, నవ స్వతంత్ర భారతం గానీ ఇవ్వని గౌరవ పీఠాన్ని మనం ఆయనకిద్దాం.రాజ్‌నాథ్ సింగ్‌వ్యాసకర్త భారత రక్షణ మంత్రి -
మహువా మొయిత్రా (ఎంపీ) రాయని డైరీ
పురుషుడితో గొడవ పడిన స్త్రీ పూర్తిగా అతడిని పట్టించుకోవటం మానేస్తుంది. స్త్రీతో గొడవ పడిన పురుషుడు మరింతగా ఆమెను పట్టించు కోవటం మొదలు పెడతాడు! నిజానికది పట్టించుకోవటం కాదు, ఆమె తనని పట్టించు కోక పోవటాన్ని పట్టించుకోవటం! కానీ ఎంపీలు కూడా ఇలా స్త్రీ, పురుషులుగా గొడవ పడాల్సిందేనా? ఏ నాగరికతా, ఏ పదవీ బాధ్యతా... స్త్రీని స్త్రీగా, పురుషుడిని పురుషుడిగా కాక, పరిణతి చెందిన ఒక మనిషిగా ఉంచలేవా? కల్యాణ్ బెనర్జీ, నేనూ లోక్‌సభ ఎంపీలం. కానీ మా మధ్య ఘర్షణను ఇద్దరు ఎంపీల మధ్య ఘర్షణలా అతడు ఉండనివ్వటం లేదు!లోక్‌సభలో అతడు పార్టీ చీఫ్ విప్. సభలో తృణమూల్ ఎంపీలు ఎవరు మాట్లాడాలన్నది అతడిదే నిర్ణయం. ఎవరు మాట్లాడకూడదన్నదీ అతడి నిర్ణయమే. లోక్‌సభలో మొత్తం 28 మంది తృణమూల్ ఎంపీలం ఉన్నాం. అందర్నీ మాట్లాడనిచ్చేవారు కల్యాణ్ బెనర్జీ. నా దగ్గరికి వచ్చేసరికి ‘నో’ చెప్పేవారు! ‘‘నేను మాట్లాడతాను’’ –‘‘నో’’‘‘నాకు అవకాశం ఇవ్వండి’’ – ‘‘నో’’‘‘రెండే రెండు నిమిషాలు...’’ –‘‘నో’’‘‘నన్ను చెప్పనివ్వండి ప్లీజ్..’’ – ‘‘నో’’కల్యాణ్ బెనర్జీ నాకన్నా 18 ఏళ్లు పెద్దవారు. 16 ఏళ్లుగా ఎంపీగా ఉంటున్నవారు. నిన్న మొన్న, ఆరేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన నాతో ఈయనకు ఏంటి ప్రాబ్లం?! ‘‘ఎందుకు మీరు నన్ను మాట్లాడనీయటం లేదు మిస్టర్ బెనర్జీ?’’ అని లాస్ట్ సెషన్లో మళ్లీ అడిగాను. కళ్లింత చేశారు! ‘‘ఫస్ట్ మీరు మీ చీఫ్ విప్‌తో మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఆ తర్వాత మీకు సభలో మాట్లాడే అవకాశం వస్తుంది. మిస్టర్ బెనర్జీ ఏంటి... మిస్టర్ బెనర్జీ? మన చైర్‌పర్సన్‌ని కూడా ఇలాగే ‘మిస్ బెనర్జీ’ అనేసేలా ఉన్నారు?’’ అన్నారు! మధ్యలోకి దీదీజీని ఎందుకు తెచ్చినట్లు!ఏప్రిల్ 4న తృణమూల్ ఎంపీలం అందరం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్‌కి వెళ్లాం. డూప్లికేట్ ఓటర్ ఐడీ నంబర్లు తొలగించాలని డిమాండ్ లెటర్ తయారు చేసి, అందులోఅందరి సంతకాలూ తీసుకున్నారు కల్యాణ్ బెనర్జీ... ఒక్క నా సంతకం తప్ప!‘‘ఏమిటిది మిస్టర్ బెనర్జీ! ఎందుకిలా చేస్తున్నారు?’’ అని అడిగాను.ఆ మాటకు అక్కడ సమాధానం చెప్పకుండా తృణమూల్ ఎంపీల వాట్సాప్ గ్రూప్‌లో నాపై పోస్టులు పెట్టారు. ‘‘ఇంగ్లిష్‌లో మాట్లాడగలనని అహంకారం... ఆఇంటర్నేషనల్ లేడీకి...’’ అని నా పేరెత్తకుండా అన్నారు! నవ్వొచ్చింది నాకు. సమాధానం లేనప్పుడు... ‘పెద్ద మగాళ్లం’ అనుకునే మగాళ్లు కూడా ఇలాగే చిన్నపిల్లల్లా మాట్లాడతారు! గ్రూప్‌లోంచి బయటికి వచ్చేశాను. వెంటనే నన్ను వెతుక్కుంటూ వచ్చారు సాగరికా ఘోష్! సాగరిక రాజ్యసభ ఎంపీ. ‘‘ఏప్రిల్ 4న జరిగిన దానికి దీదీజీ చాలా కోపంగా ఉన్నారు మొయిత్రా. కల్యాణ్ బెనర్జీతో తగాదా మానేయమంటున్నారు. సోమవారం లోపే ఇదంతా ముగిసిపోవాలని దీదీజీ కోరుకుంటున్నారు...’’ అన్నారు సాగరిక. ఆ విషయాన్ని దీదీజీనే నేరుగా నాతో ఎందుకు చెప్పలేకపోయారు!‘‘అంబేడ్కర్‌ని ఓన్ చేసుకోటానికి రేపు ఏప్రిల్ 14న బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని దీదీజీ అంటున్నారు మొయిత్రా. మహిళలకు రాజకీయాల్లో గౌరవం దక్కాలని అంబేడ్కర్ ఆకాంక్షిస్తే, తృణమూల్ పార్టీలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్న మాటను రానీయకూడదని మీకు చెప్పమన్నారు... ’’ అన్నారు సాగరిక. ‘‘అంటే, కల్యాణ్ బెనర్జీకి నన్ను అపాలజీ చెప్పమని అంటున్నారా?’’ అని అడిగాను. ‘‘లేదు. మిమ్మల్ని వెంటనే ఎంపీల వాట్సాప్ గ్రూప్‌లోకి తిరిగి వచ్చేయమంటున్నారు...’’ అన్నారు సాగరిక!!రెండూ ఒకటే కదా! కాదా?! - మాధవ్ శింగరాజు -
ఇలాగేనా పేదరిక నిర్మూలన?
‘ఉగాది’ రోజున ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడికి ఎవరికీ రాని విచిత్రమైన ఆలోచన వచ్చింది. పేదరికం గురించి తీవ్ర మనోవేదన చెందుతూ, పేదరికాన్ని నిర్మూ లించేందుకు కొత్త విధానాన్ని కనుక్కున్నారు. అదే ‘పీ4’ విధానం. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 2047 నాటికి పూర్తిగా పేదరికాన్ని నిర్మూలిస్తాననీ, ఇందుకు దాతృత్వమేఅత్యంత కీలకమనీ పేర్కొన్నారు. పేదలకు సహాయం చేసేలా సంపన్నుల్లో స్ఫూర్తి నింపటం పీ4 లక్ష్యమని అన్నారు. ఇది ఆచరణ సాధ్యమేనా? ప్రపంచంలో ఇటువంటి విధానంతో పేదరిక నిర్మూలన చేసిన ఉదాహరణలు ఏవైనా ఉన్నాయా?‘పబ్లిక్, ప్రైవేట్ – పీపుల్ – పార్టనర్షిప్’ (పీ4) విధానంలో ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు, ప్రజలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అంటున్నారు. 1995లో ప్రపంచ బ్యాంకు అమలు చేసిన సంస్కరణల్లో భాగంగా ‘పీ3’ పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్షిప్ విధానాన్ని అమలు చేసి అద్భుతాలు సాధించాననీ, ఆ స్పూర్తితోనే íపీ4 రూపొందించాననీ అంటున్నారు. ఆ ‘అద్భుతాలు’ ఏమిటో మాత్రం చెప్పలేదు. ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేయటంలో మాత్రం ముందు ఉన్నారు. 1995లోని పీ3లో లేని ప్రజలను అదనంగా పీ4లోఎందుకు చేర్చారో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వలేదు. బడా పారిశ్రామిక వేత్తల పరిశ్రమలకు భూములు కావాలి. భూ సేకరణ చట్టం ప్రకారం భూములకు పరిహారం ఇవ్వటం పరిశ్రమాధిపతులకు ఇష్టంలేదు. పీ4లో పేదలను చేర్చటం ద్వారా వారి భూములను పారిశ్రామిక వేత్తలకు ఇచ్చేలా చేయటం కోసమే వారిని ఇందులో చేర్చారు.తమ పేదరికానికి కారణాలైన వాటికి వ్యతిరేకంగా పేదలు తిరుగుబాటు చేయకుండా బడా సంపన్న వర్గాలను కాపాడటం కోసం గతంలోనూ ఇలాంటి అభిప్రాయాలు ముందుకు వచ్చాయి. ఫ్యాక్టరీ యజమానులు సంపాదించుకున్న సొమ్ము నుండి కార్మికులకు దానధర్మాలు చేయాలని మహాత్మాగాంధీ ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని దెబ్బతీయటానికి 1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని పోచంపల్లిలో వినోబా భావే ప్రారంభించిన ‘భూదానో ద్యమం’ భూస్వాముల ప్రయోజనాలు కాపాడటం కోసమే! ఆచరణలో భూస్వాములు భూములు దానం చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే తరహాలో పీ4 విధానాన్ని ప్రకటించారు. దేశంలోని 10% ఉన్న బడా సంపన్న వర్గాలు, అట్టడుగులో ఉన్న 20% పేదలను దత్తత తీసుకుంటే పేదరికం నిర్మూలించబడుతుందని చెప్పటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. పేదరికాన్ని రూపుమాపటం పాలక ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యత నుంచి చంద్రబాబు తప్పుకొంటున్నారు. పేదలు, బడా సంపన్న వర్గం, వర్గ సంబంధాల రీత్యా శత్రు వర్గాలే గాని మిత్ర వర్గాలు కాదు. బడా పెట్టుబడిదారులు, భూస్వాములు... కార్మికుల, గ్రామీణ పేదల శ్రమశక్తిని దోపిడీ చేసి సంపదలను కూడబెట్టారే గానీ కష్టపడి ఒక్క రూపాయి కూడాసంపాదించ లేదు. వారు అనుభవిస్తున్న సంపద అంతా వాస్తవంగా కార్మికుల, గ్రామీణ పేదలదే! అందువల్ల బడా సంపన్నులు, భూస్వాములు పేదలను దత్తత తీసుకోమని చెప్పటం ఏమిటి! వారి దాన ధర్మాలపై ఎందుకు ఆధారపడాలి? వారు సృష్టించిన సంపద మొత్తం వారికే చెందాలి. అది వారి హక్కు. ఈ హక్కును పక్కన పెట్టటమే చంద్రబాబు పీ4 విధానం. ఒక సమావేశ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘ఒకప్పుడు నాతో పాటు ఇక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది పేదరికం నుంచి వచ్చిన వారే. మేమందరం గ్రామాల్లోని మామూలు కుటుంబాల నుంచి వచ్చి పేదరికాన్ని జయించి ఈ స్థాయికి వచ్చా’మని చెప్పారు. గ్రామీణ పేద కుటుంబాలు అప్పుడు, ఇప్పుడు నిత్యం కష్టపడుతున్నప్పుడు, ఆ కుటుంబాలు పేదరికాన్ని జయించాలి గదా! ఎందువల్ల జయించలేక పోయాయి?నిత్యం పేదరికంలోనే ఎందుకు ఉంటున్నాయి? పేదరికం నుంచి బయటపడాలంటే, అందుకు అనుగుణమైన సామాజిక మార్పు విప్లవాత్మకంగా జరగాలి. ఆ మార్పును అడ్డుకోవటమే పీ4 విధానం. ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం తగ్గక పోగా పెరుగుతూ ఉంది. చిన్న, సన్న కారు రైతులు భూములు కోల్పోవటం, గ్రామీణ ఉపాధి తరిగిపోవటం కార ణాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో శ్రామిక శక్తి 2022– 2023లో 45 శాతం ఉండగా 2023–24 నాటికి 46.1 శాతానికి పెరిగింది. గ్రామీణ పేదరికానికి, భూమికి విడదీయరాని సంబంధం ఉంది. సేద్యానికి భూమి ప్రధానం. ఆ భూమి పరాన్నభుక్కులైన కొద్ది మంది భూ కామందుల వద్ద బంధించబడి ఉంది. తమ శ్రమశక్తితో వివిధ పంటలు పండించే గ్రామీణ పేదలకు ఆ పంటలపై ఎటువంటి హక్కూ ఉండదు. ఎటువంటి శ్రమ చేయని భూ కామందులు ఆపంటలను తరలించుకుపోయి సంపదలను పెంచుకుంటున్నారు. పేదలు తీవ్రమైన దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామీణ పేదలకు భూమిపై హక్కు లభించినప్పుడే పేదరికం నుంచి బయటపడతారు.పట్టణ ప్రాంతంలోని కార్మికులు, పేదలు ఉపాధికి దూరమవుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరగక పోవటం, ఉత్పత్తులు సృష్టించే కార్మికులకు పరిశ్రమల్లో భాగస్వామ్యం లేక పోవటం, పాలక ప్రభుత్వాల విధానాల వల్ల పరిశ్రమలు మూతపడి కార్మికులు నిరుద్యోగులుగా మారటం, ఫలితంగా పరిశ్రమలపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారు కూడా ఉపాధి కోల్పోవడం వల్ల పట్టణ పేదరికం పెరుగుతూ ఉంది. తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని చంద్రబాబు చెబుతున్నారు కాబట్టి పేదరికానికి కారణాలు ఆయనకు తెలుసు. ఆ కారణాల పరిష్కారం గురించి నేడు ఆలోచించటం లేదు. నేడు చంద్ర బాబు బడా సంపన్న వర్గాల జాబితాలో ఉండటమే కాకుండా, ఆ వర్గాల ప్రతినిధిగా ఉన్నారు. నేటి వ్యవస్థను కాపాడే ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి అందుకు భిన్నంగా చంద్రబాబు విధానాలు ఉండవు. పీ4 విధానం అనేది పేదరిక నిర్మూలనకు కాక... నేటి వ్యవస్థనూ, అందులో భాగమైన బడా పెట్టుబడిదారుల, భూస్వా ముల ప్రయోజనాలనూ కాపాడుతుంది. సమాజ పరిణామక్రమంలో దోపిడీ వర్గాలు పేదలు సృష్టించిన సంపదలను దోచు కోవటమే కాకుండా, అణచివేతకు గురి చేశాయి. అంతే తప్ప వారి గురించి ఆలోచించలేదు, ఆలోచించరు కూడా! అది వారి వర్గలక్షణం. పీ4 విధానం పేదలను పేదలుగా ఉంచటం, వారి పేదరికా నికి కారణాలపై పోరాటం చేయకుండా చేయటం, బడా సంపన్న వర్గాల దానధర్మాల కోసం ఎదురు చూసేలా చేయటమే!గ్రామీణ ప్రాంతంలో భూ సంస్కరణల ద్వారా పేదలకు భూముల పంపిణీ జరగాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి, తద్వారా గ్రామీణ ఉపాధిని పెంచాలి. పట్టణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణమైన పరిశ్రమలు నిర్మించి అందులో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. పరిశ్రమల అనుబంధంగా పట్టణ పేదలకు ఉపాధి ఏర్పడినప్పుడే దేశంలో, రాష్ట్రంలో పేదరికం పోతుంది. కానీ చంద్రబాబు పేదలకు భూములపంపిణీకి, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వ్యతిరేకం. రాష్ట్ర ప్రజలే పోరాటాల ద్వారా సాధించుకోవాలి. -వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526-బొల్లిముంతసాంబశివరావు -
ప్రాసంగికత కోల్పోతున్న యూరప్?
డోనాల్డ్ ట్రంప్, జె.డి. వాన్స్ కలిసి వైట్ హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఎలా వేధించారో ప్రపంచం అంతా చూసింది. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆయన పట్ల పాశవికంగా ప్రవర్తించి గుడ్ బై సైతం చెప్పకుండా తరిమేశారు. ‘రష్యాను ధిక్కరించండి, మీకు మేము అండగా ఉన్నాం...’ అంటూ ఉక్రెయిన్ అధినేతకు బాసటగా నిలిచి ఎంతగా ప్రోత్సహించాలో అంతగా ప్రోత్సహించిన యూరప్ ఈ ఘట్టాన్ని చేష్టలుడిగి చూసింది. యూరప్ ప్రభావం పలుచబడిపోతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?తగ్గుతున్న జనాభాయూరోపియన్ యూనియన్ (ఈయూ)కు బలమైన నాయ కత్వం లేదు. ఎవరి దౌత్య విధానం వారిదే. ‘యూరప్‌తో మాట్లాడా లనుకుంటే, నేను ఎవరికి ఫోన్ చేయాలి?’ అంటూ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ ఒక సందర్భంలో చేసిన సుప్రసిద్ధ వ్యాఖ్య ఇందుకు అద్దం పడుతుంది. యూరప్ దేశాలకు కాలం కూడా కలిసిరావడం లేదు. ఆ దేశాల్లో జననాల రేట్లు తగ్గుతున్నాయి.వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా, యువకులు తగ్గిపోతున్నారు. 2050 నాటికి యూరప్ సగటు వయసు 48 ఏళ్లకు పెరుగుతుంది. 60 ఏళ్లు దాటినవారు జనాభాలో 40 శాతం ఉంటారు. వందేళ్ల క్రితం ప్రపంచ జనాభాలో 25 శాతం యూరప్ దేశాల ప్రజలే ఉండేవారు. 2050 నాటికి, వీరి వాటా కేవలం 7 శాతానికి పరిమితం అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.యుద్ధరంగానికి దళాలు సమకూర్చుకోవడం కూడా ఈ దేశాలకు సమస్యగా మారుతోంది. రష్యా ఇప్పటికే ఉత్తర కొరియా దళాలను రెగ్యులర్ ప్రాతిపదికన తన సైన్యంలో నియమించుకోవలసి వచ్చింది. పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతున్నా సరే... యూరప్ కాలం చెల్లిన తన పాత ఇమ్మిగ్రేషన్ విధానాలనే పట్టుకు వేలాడుతోంది. ఇది శ్రమశక్తి సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఉక్రెయిన్ శ్వేతజాతి శరణార్థుల పుణ్యమా అని పనిచేసే వారి సంఖ్య పెరిగినా ఇది తాత్కాలికమే! ఎదుగుదల లేని ఆర్థిక వ్యవస్థపరిపాలన సరిగా ఉండదు, ఆర్థికంగా పురోగమనం లేదు, వయసు మళ్లుతున్న జనం పెరుగుతున్నారు, వృత్తిపరమైన అవకా శాలూ అంతంత మాత్రమే. ఇలాంటి యూరప్ ఇండియాను ఎలా ఆకట్టుకుంటుంది? అమెరికాలో ఒంటి రంగును బట్టి కాకుండా, సత్తాను బట్టి మనుషుల్ని అంచనా వేస్తారు. ఆ మాదిరిగా మార్పు చెందటంలో యూరప్ సమాజం విఫలమైంది. నత్తనడకగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు, పెరుగుతున్న సామాజిక భద్రతా వ్యయాలు, నడ్డి విరుస్తున్న రుణభారం... ఇవన్నీ ఆ ఖండం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. అమెరికా పాత్రికేయుడు ఫరీద్ జకారియా చెప్పినట్లు, యూరప్ దుఃస్థితికి మూల కారణం ఆర్థిక వృద్ధి లోపం. ఉదాహర ణకు ఇటలీ ఆర్థిక వ్యవస్థలో ఏకంగా ఒక దశాబ్దంగా ఎలాంటి పెరుగుదల లేదు.ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాల్లోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు బలం పుంజుకుంటూ దూసుకు వస్తున్నాయి. గ్లోబల్ గవర్నెన్స్‌లో తమకు అధిక పాత్ర ఉండాలని ఈ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, జీ–7, నాటో వంటి ప్రపంచ అధికార సంస్థలు ఇప్పటికీ యూరప్ చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. కానీ ఆర్థిక వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం అయిదు యూరప్ దేశాలు (జర్మనీ, యూకే, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ) ప్రపంచ టాప్–10 ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నాయి. 2050 నాటికి ఈ అయిదింటిలో కేవలం జర్మనీ, యూకే రెండే టాప్–10 జాబితాలో మిగిలి ఉంటాయి. ఆ పదిలో వాటికి దక్కే ర్యాంకులు చిట్టచివరి తొమ్మిది, పది! ఇందుకు భిన్నంగా, వాటి కంటే ముందుండే ఇండియా, బ్రెజిల్, ఇంకా ఇతర వర్ధమాన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో తమకు గణనీయ పాత్ర ఉండాలని ఒత్తిడి చేస్తాయి. ఇప్పటి ప్రపంచ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణను ఎంతో కాలం అడ్డుకోలేరు.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్మాణం ఇప్పటికే కాలం చెల్లిపోయింది. దీన్ని ఎలా పునర్ వ్యవస్థీకరించాలనే అంశంపై పరిశీలన జరుగుతోంది. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు ప్రస్తుత సభ్యత్వాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఒత్తిడి తెస్తున్నాయి.ఇండియా జీడీపీలో మూడోవంతు కంటే తక్కువ, జపాన్ జీడీపీలో దాదాపు సగం ఉండే యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు శాశ్వత సభ్యు లుగా ఉండటం... ఇండియా, జపాన్ వెలుపల ఉండటం ఎలా సమంజసమనీ, వాటి మీద ఈ రెండు యూరప్ దేశాలు ఎలా పెత్తనం చలా యిస్తాయనీ గట్టి వాదన వినబడుతోంది. భద్రతా మండలి, జీ–7 లను సభ్యత్వ పరంగా విస్తరించడం మీద చర్చలు నడుస్తున్నాయి. ప్రపంచ పాలన సంస్థల పునర్ వ్యవస్థీకరణ జరగాలన్నది కాదనలేని అంశం. తిరుగులేని అమెరికా?శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా మున్ముందు కూడా ప్రబలమైన ప్రపంచ శక్తిగా కొనసాగుతుంది. చైనా, ఇండియా వంటి దేశాలు దాన్ని వెన్నంటి ఉంటాయి. ఒకవేళ అధిగమించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఏమైనా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు గడిచే లోపే అప్పటి విజేతల్లో ఒక్క అమెరికా మినహా మిగిలినవన్నీ టాప్–10 జాబితా నుంచి కను మరుగవుతాయి.అమెరికా లోలోపల పలు మార్పులు చెందుతోంది. జనాభా వర్గాల్లో పరివర్తన ఫలితంగా రాజకీయంగానూ మార్పులు సంభవి స్తున్నాయి. నల్ల జాతీయుడిని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆఫ్రో–ఇండి యన్ మహిళ ఉపాధ్యక్ష పదవిని చేపట్టగలిగింది. భారతీయ అమెరికన్లు ప్రభుత్వంలో, విద్యా పారిశ్రామిక రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎగబాకారు. గుజ్జూభాయి కశ్యప్ పటేల్ ఎఫ్‌బీఐ పగ్గాలు చేపడతాడని ఎప్పుడైనా అనుకున్నామా? వివిధ దేశాల సంతతులకు చెందిన వ్యక్తులు ప్రభుత్వ, ఇతర రంగాల్లో ప్రముఖ స్థానాలు పొందడం వల్ల ఆ యా దేశాలు అమెరికాతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నాయి. విదేశీయులకు ప్రవేశం కల్పించడం వల్ల అమెరికా ప్రతిభ ఇనుమడించింది. యూరప్ ఈ విషయంలో విఫలమైంది. వర్ధమాన దేశాలు 21వ శతాబ్దపు నూతన వ్యవస్థకు రూపు దిద్దబోతున్నందున... ప్రపంచ వ్యవహారాల్లో యూరప్ పాత్ర క్రమేపీ క్షీణించిపోతుంది. యూరప్ గనుక జనాభా సంబంధిత (డెమో గ్రాఫిక్) నూతన విధానాలు రూపొందించకపోతే, ఆర్థిక పరమైన సంస్కరణలు చేపట్టకపోతే అది ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో గుర్తింపు లేని ఖండంగా మిగిలిపోతుంది.రానున్న రోజుల్లో ఆసియానే ప్రపంచ అధికార కేంద్రంగా ఆవి ర్భవిస్తుంది. 2020లో ఈ ఒక్క ఖండమే ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో 60 శాతం వాటా కైవసం చేసుకుంది. ఇదే ట్రెండ్ ఇక మీదటా కొనసాగబోతోంది. చైనా, ఇండియా ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమ పలుకుబడి పెంచుకుంటూ పోయి, ప్రపంచ పాలన (గ్లోబల్ గవర్నెన్స్)లో మార్పుల కోసం పట్టుబడతాయి. అయితే, అమెరికాతో విరోధం కారణంగా చైనా, యురోపియన్ యూనియన్ (ఈయూ)కు చేరువయ్యే అవకాశం ఉంది. ఇక చైనాతో సంబంధాలు బెడిసినందువల్ల ఇండియా, అమెరికాకు బహుశా మరింత దగ్గర అవుతుంది.మోహన్ గురుస్వామి వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com -
వారికి భారతరత్న ఎందుకివ్వాలంటే...
మహారాష్ట్ర అసెంబ్లీ మార్చి 22న ఫూలే దంపతులు: మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలకు ‘భారతరత్న’ ఇవ్వాలని అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ గౌరవా నికి ఫూలే దంపతులు తప్ప భారతదేశ చరిత్రలో మరో జంట దొరకదు. అసలు ప్రపంచంలోనే రెండు శరీరాలు ఒకే మనస్సుతో జీవితాంతమూ మానవ మార్పునకు కృషి చేసిన జంట మరోటి లేదు. అది ఒక్క ఫూలే జంట మాత్రమే. కేంద్రం వారికి భారతరత్న ఇచ్చి వారిపట్ల తమ గౌరవాన్ని చాటుకోవాలి.మహాత్మా ఫూలే 1827 ఏప్రిల్ 11న పుడితే, 1831 జనవరి 3న సావిత్రి పుట్టింది. వారు జీవించి ఉన్న కాలానికి కాస్త ఇటు అటు ఈ దేశంలో సంఘ సంస్క ర్తలు ఎదిగారు. వారిలో కొంతమంది స్త్రీల జీవితాలను మార్చాలని ప్రయత్నించారు. ఉదాహరణకు మహారాష్ట్ర లోనే గోవింద రణడే, బెంగాల్లో ఈశ్వర చంద్ర విద్యా సాగర్, ఆంధ్రలో కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారిని తీసుకుందాం. వీరంతా బ్రాహ్మణ కులంలో పుట్టారు. బ్రాహ్మణ కుటుంబాల్లోని ఆడపిల్లలకు విద్య నేర్పించాలని, వితంతు వివాహాలు చేయించాలని మాట్లాడారు, రాశారు. కానీ వారి భార్యల స్థితి తమ కుటుంబాల్లోనే ఎలా ఉండేదో మనకు తెలియదు.వారి గొప్పతనం గురించి ఎన్నో రచనలు వచ్చాయి. స్కూలు పాఠాల్లో సంఘ సంస్కర్తగా వారి గురించే పాఠాలు చెప్పేవారు. వారు అంటరానితనం గురించి, శూద్ర దళిత స్త్రీల గురించి మాట్లాడిన దాఖలాలే లేవు. కానీ ఫూలేల గురించి ఏ పాఠ్య పుస్తకాల్లో చెప్పేవారు కాదు. వారి గురించి తెలిసిన అగ్ర కుల ఉపాధ్యాయులు వారి గురించి చెడుగా చెప్పే వారు. బెంగాల్లో కొద్దిపాటిగా ఉన్న భద్రలోక్ స్త్రీల సంస్కరణ కోసం కృషి చేసిన ఈశ్వరచంద్ర గురించి నేను స్కూల్లో ఉండగానే చదివాను. కందుకూరి గురించి సరేసరి. కానీ ఫూలే గురించి నాకు తెలిసింది 1986–87 ప్రాంతంలో! ఆయన గురించి కాస్తా వివరంగా చదవడానికి ఒక్క పుస్తకం కూడా లేదు. వెతగ్గా, వెతగ్గా కోఠి ఫుట్‌పాత్ పాత పుస్తకాల్లో ధనుంజయకర్ ఆయన మీద రాసిన బయోగ్రఫీ దొరికింది. అది చదివాక నా తల తిరిగి పోయింది. అందులో సావిత్రి బాయి గురించి కొద్దిగానే ఉంది. ఇంత గొప్ప సాంఘిక సంస్కరణకు పాటుపడిన జంటను ఈ దేశ మేధావులు ఎందుకు పక్కకు పెట్టారు? కులం వల్ల!ఇప్పుడు ఒక ఆరెస్సెస్/బీజేపీ ప్రభుత్వం, అదీ ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆ జంటకు భారతరత్న ఇవ్వాలని రిజల్యూషన్ ఎందుకు పాస్ చేసింది? ఈ జంట అనుయాయుడైన అంబేడ్కర్ వాళ్ళు ప్రారంభించిన శూద్ర–దళిత విద్యా పోరాటం నుండి ఎదిగి ఒక రాజ్యాంగం రాశారు. దానివల్ల శూద్రులకు, దళితులకు ఓటుహక్కు వచ్చింది కనుక! వారి సంఖ్యా బలం, వారి ఆత్మగౌరవ చైతన్యం ఆరె స్సెస్ ప్రభుత్వాన్ని ఈ స్థితికి నెట్టింది. శూద్రుడైన శివాజీని దేశం ముందు పెట్టింది ఫూలేనే!ఆరెస్సెస్ మాత్రమే కాదు, అగ్రకుల కమ్యూనిస్టు, ముఖ్యంగా బెంగాలీ కమ్యూనిస్టులు, దేశంలోని ఉదార వాదులు ఊహించని పరిణామం ఇది. బెంగాల్ మేధా వులు ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్లను దేశం మొత్తం విద్యా రంగంలోకి చొప్పించారు. కానీ మహాత్మా ఫూలేను, సావిత్రిబాయిని, అంబేడ్కర్‌ను తమ రాష్ట్ర పరిధిలోకి రానివ్వలేదు. మండల్ కమిషన్ పోరాట చరిత్రను కూడా వాళ్ళు గుర్తించలేదు. ఈ సంవత్సరం ఫూలే దంపతులకు భారతరత్న వస్తే శూద్ర–దళిత ఆదివాసీ స్త్రీల చరిత్ర మార్చే చర్చ ఏ రాష్ట్రమూ పక్కకు పెట్టలేనంత ఎదుగుతుంది. ఫూలే జంట కేవలం భారత దేశానికే కాదు మొత్తం భూ ప్రపంచానికే ఏం పాఠం నేర్పారో తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ భూమి మీద పెద్ద పెద్ద మతాలను స్థాపించిన బుద్ధుడు, జీసస్, మహమ్మద్ వంటి వారు నడిచారు. అందులో బుద్ధుడు, మహమ్మద్ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. జీసెస్ శిలువేసి చంపబడ్డారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో జ్యోతి రావు ఫూలే, సావిత్రిబాయిని పెళ్ళి చేసుకొని పెళ్ళి అర్థాన్నే మార్చారు. అందుకు దీటుగా ఆమె భార్య అనే అర్థాన్నే మార్చారు.వాళ్ళు 19వ శతాబ్దంలో ఎటువంటి భార్యా భర్తలుగా ఈ భూమి మీద నడిచారో కొన్ని ఉదా హరణలతో చూద్దాం. సావిత్రీబాయికి 9వ ఏట, ఫూలేకు 13వ ఏట పెండ్లి అయింది. అది బాల్య వివాహమే. అయితే ఫూలే ఏం చేశారు? ఆమెతో పడక గదిలో భర్తగా జీవించలేదు. ఆమెకు టీచరై అక్కడ చదువు చెప్పారు. అంత గొప్ప పనిచేస్తే పూనా పండితులు తిలక్ నేతృత్వంలో ఆయన తండ్రిని బెదిరించి, బట్టలు బయట పడవేయించి ఇంటి నుండి తరిమేయించారు. ఆ యువ దంప తులు దళిత వాడల్లో మకాం పెట్టి అక్కడే ఒక దళిత మిత్రుడి ఇంట్లో ఆడవాళ్ళకు స్కూలు పెట్టారు. కొద్ది రోజుల్లోనే తన దగ్గర పాఠాలు నేర్చుకున్న సావిత్రిని ఒక టీచర్ని చేశారు ఫూలే.అంతేగాక కుటుంబాల నుండి బయటికి నెట్టబడ్డ వితంతువుల కోసం ఒక నివాస కేంద్రాన్ని ప్రారంభించారు. ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు – యశ్వంతరావుని పెంచుకున్నారు. అంతకు ముందు వాళ్ళి ద్దరూ 30 ఏండ్ల వయస్సులో ఉండగా సావిత్రి తండ్రి,ఖండోజీ పాటిల్ వచ్చి ఫూలేతో... ‘నేను సావిత్రిని ఒప్పించాను, మీకు పిల్లలు కావాలి కనుక మరో పెళ్ళి చేసుకో’ అని కోరాడు. దానికి ఫూలే... ‘లోపం సావి త్రిలో లేదు, నాలో ఉంది. ఆమెకు మరో పెండ్లి చేద్దాం. ముగ్గురం కలిసి పిల్లల్ని పెంచుతాం’ అని బదులు చెప్పారు. ఇటువంటి భర్త ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా!ఫూలే 1890లో పక్షవాతంతో చనిపోయారు. ఆయన బంధువులు సాదుకున్న కొడుకు తలగోరు (తలకొరివి) పెట్టడానికి వీలులేదు అని గొడవ చేశారు. ఫూలే బంధువులలో ఒక పురుషుడు తలగోరు పెడ తానని వాదించాడు. సావిత్రి వారిని ధిక్కరించి ‘నేనే నా భర్తకు తలగోరు పెడతాన’ని చెప్పి ఆ కార్యం నిర్వర్తించారు. ఈ పని చేసిన మొదటి భారత స్త్రీ ఆమె. 1898లో బుబానిక్ ప్లేగు వ్యాపించిన సమయంలో సావిత్రీబాయి, డా‘‘ యశ్వంతరావు ప్రజలకు వైద్యం చేస్తూ అదే రోగానికి బలై చనిపోయారు.ఈ జంటను మహారాష్ట్ర అగ్రకుల మేధావులు చాలా కాలం వెలుగులోకి రానివ్వలేదు. ఇప్పుడు ఆరె స్సెస్ ప్రభుత్వం వారికి భారతరత్నను ప్రతిపాదించింది. ఇది కాంగ్రెస్‌కు మరో సవాలు కానుంది. శూద్ర బీసీలను ఆకట్టుకోవడంలో ఇది ఆరెస్సెస్‌కు పెద్ద ఆయుధమౌతుంది. అంబేడ్కర్‌కు భారతరత్న వీపీ సింగ్ ప్రభుత్వం ఇచ్చినా ఆరెస్సెస్–బీజేపీలు దాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. కాంగ్రెస్‌ను కుటుంబ పార్టీ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఇప్పుడు ఫూలేలకు భారతరత్నను తమ ప్రభుత్వమే స్వయంగా ఇచ్చిందని పెద్ద ప్రచారం ప్రారంభిస్తాయి. ఈ స్థితిలో తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఫూలే లను దీటుగా ఓన్ చేసుకోకపోతే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి చాలా పెద్ద సమస్య అవుతుంది.కనీసం ఈ రెండు ప్రభుత్వాల వాళ్ళు అటువంటి తీర్మానాలే అసెంబ్లీలలో పాస్ చేసి కేంద్రానికి పంపడం, ఫూలేలకు శూద్ర బీసీ జీవితాలను ప్రతిబింబించే మ్యూజియవ్‌ులను కట్టించడం చెయ్యాలి. ఈ రాష్ట్రాల్లో అగ్రకులాలు తమ చదువులకు పునాదులు వేసిన జంటగా ఫూలేలను చూడటం లేదు. వారి నుండి ఒక్క మేధావి కూడా వారి గురించి రాయడం, మాట్లాడటం చెయ్యడం మనకు కనిపించదు. వారిని గుర్తించి గౌరవించడం అన్ని కులాల ఆత్మగౌరవానికీ నిదర్శనం.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు(ఏప్రిల్ 11న మహాత్మా ఫూలే జయంతి) -
వ్యవసాయ సుంకాల కాపట్యం
అధిక సబ్సిడీలతో కూడిన అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు భారతదేశం తన మార్కెట్‌ను తెరవాలని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చాలా ప్రత్యేకంగా కోరిన ట్లుగా నేను ఇటీవల చదివాను. అది చదివిన ప్పుడు, ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త నికోలస్ స్టెర్న్, తన భారతదేశ పర్యటనల సమయంలో క్లుప్తంగా చెప్పింది గుర్తొచ్చింది. ‘అమెరికా రైతులకు అలాంటి సబ్సిడీలను అందించడం తప్పేనని నేను అంగీకరిస్తున్నాను. కానీ అమెరికా ఉత్పత్తులకు భారతదేశం తన తలుపులు తెరవకపోతే అది విపత్తుకు దారితీస్తుంది.’జార్జ్ బుష్ జూనియర్ హయాంలో 2001 నుండి 2005 వరకు పదవిలో ఉన్న యాన్ వెనెమన్ మొదలుకుని, అమెరికా వ్యవసాయ మంత్రులందరూ ఇదే విధమైన కపటత్వాన్ని పదే పదే ప్రదర్శించారు. కొంతకాలం తర్వాత వాషింగ్టన్ డీసీలోని ‘ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (ఐఎఫ్పీఆర్ఐ)లో మాట్లాడుతూ, భారత వ్యవసాయాన్ని బలవంతంగా తెరవాలన్న ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త వాదనను ఆమె ఎంత నిస్సిగ్గుగా సమర్థించిందో నాకు గుర్తుంది.అమెరికాలోని కనీసం 14 వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి గ్రూపులు, భారతదేశ ఉత్పత్తి నిర్దిష్ట కనీస మద్దతు ధరపై పరిమితిని కోరుతూ అమెరికన్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌కు లేఖలు రాశాయి. అప్పుడే ఇండియాకు అమెరికా ఎగుమతులు చేయడానికి వీలుంటుంది మరి.చైనా నిలబడిన తీరుఅందువల్ల, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన అవాంఛ నీయ వాణిజ్య యుద్ధం పట్ల నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలను లొంగదీసుకోవడానికి ట్రంప్ చుట్టూ ఉన్న బిలియనీర్లు ఆయనకు తప్పుడు సలహా ఇస్తున్నారు.అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అమెరికా పట్ల ధిక్కార వైఖరితో నిలబడటం ప్రారంభించాయి. కాబట్టి భారతదేశాన్ని కాస్త వంగమని మాత్రమే అడిగినప్పుడు, అది సాష్టాంగపడటానికి సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను.ఇక్కడ మరొక కథ చెబుతాను. కొన్నేళ్ల క్రితం, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ‘చెడ్డ’ మానవ హక్కుల రికార్డు కారణంగా చైనాతో అమెరికా వ్యాపారం చేయదని వ్యాఖ్యానించారు. మరుసటి రోజు, నేను ‘బీబీసీ’ టీవీ ఛానెల్‌ని చూస్తున్నాను. ఒక జర్నలిస్ట్ అప్పటి చైనా అధ్యక్షుడిని అడుగుతున్నారు: ‘చైనాతో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు చేసిన బెదిరింపునకు మీరు ఎలా స్పందిస్తారు?’ ఆయన సమాధానం కూడా అంతే చిన్నది: ‘యూఎస్‌తో వ్యాపారం చేయడమా? మేము నాలుగు వేల ఏళ్లకు పైగా అమెరికాతో వ్యాపారం చేయలేదు. కాబట్టి అది అంత ముఖ్యమైనదా?’ఈ ప్రకటన తర్వాత, చైనాతో వాణిజ్యాన్ని నిలిపివేయాలని తమ సొంత అధ్యక్షుడు ఇచ్చిన పిలుపును వ్యతిరేకిస్తూ అమెరికా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు తిరగబడ్డాయి. బిల్ క్లింటన్ చివరికి దేశీయ పరిశ్రమ ముందు తల వంచి, మళ్ళీ ఎప్పుడూ ఆ సమస్యను లేవనెత్తలేదు.సుంకాల వాణిజ్య సూత్రాలుకొత్త సుంకాల యుద్ధానికి తిరిగి వస్తే, అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ప్రవేశాన్ని పరిమితం చేసే విషయంలో ట్రంప్ భారత దేశాన్ని ‘సుంకాల రాజు’ అని విమర్శించవచ్చు. ఎందుకంటే, అమె రికా 5 శాతం సుంకాలను విధిస్తుంటే, భారత్ సగటున 39 శాతం సుంకాలను విధిస్తోంది. అయితే, భారత్ విధించే సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. దేశ అభివృద్ధి స్థాయి, వాణిజ్య పుస్తకాలలో పేర్కొన్న ‘ప్రత్యేక, భేదాత్మక వ్యవ హారం’ ఆధారంగా వీటిని విధించారు. భారత్ ఏ దశలోనూ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించలేదని తెలియజేయాలి. భారత్ సాపేక్షంగా విధిస్తున్న అధిక సుంకాలు, అప్పటికే రూపొందించి ఉన్న వాణిజ్య సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. పైగా ఒక వ్యక్తి ఇష్టానిష్టాల ద్వారా వాటిని నియంత్రించడం ఉండదు.మరోవైపు, వ్యవసాయానికి అమెరికా అందించే భారీ సబ్సిడీలే వాస్తవానికి సమస్య. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలు తాము మరిన్ని అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ అమెరికా వ్యవసాయ సబ్సిడీలను కాదు’ అని అప్పటి యూరోపియన్ ట్రేడ్ కమిషనర్ పీటర్ మాండెల్సన్ పేర్కొన్న విషయాన్ని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ (2006 జూలై 21) స్పష్టంగా రాసింది. ‘అమెరికా రైతులతో పోటీ పడటానికి మాకు అభ్యంతరం లేదు, కానీ మేము అమెరికా ఖజానాను ఎదుర్కోలేము’ అని అప్పటి భారత వాణిజ్య మంత్రి కమల్‌నాథ్ చెప్పింది ఆయన ఉటంకించారు.రైతులకు ఎంత ఇస్తున్నారు?గత కొన్ని సంవత్సరాలుగా, అమెరికా తన అధిక సబ్సిడీ వ్యవసాయం చుట్టూ నిర్మించిన రక్షణ కోటను మరింత బలోపేతం చేసుకుంది. అమెరికా వ్యవసాయ శాఖకు చెందిన ఆర్థిక పరిశోధన సేవ నివేదిక ప్రకారం, రైతులు, పశువుల పెంపకందారులకు ప్రత్యక్ష ప్రభుత్వ వ్యవసాయ కార్యక్రమం కింద చెల్లింపులు 2025 నాటికి 42.4 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని అంచనా. నిజానికి 2024 నాటికి 9.3 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని అంచనా వేశారు.అంటే ఒక్కో రైతుకు అమెరికా ప్రభుత్వం సాలీనా రూ. 26.8 లక్షలను చెల్లిస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చలలో వివాదాస్పద అంశంగా మిగిలిపోయిన పత్తిని ఉదాహరణగా తీసుకుందాం. 2021 నాటికి 624.7 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్న కేవలం 8,103 మంది రైతులకు అమెరికా భారీ సబ్సిడీలను అందిస్తోంది (ఇండియాలో 98.01 లక్షల మంది రైతులు పత్తి సాగులో నిమగ్నమై ఉన్నారు). న్యూఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ డబ్ల్యూటీఓ స్టడీస్’ లెక్కల ప్రకారం, 2021లో అమెరికా పత్తి రైతుకు లభించిన వార్షిక మద్దతు 1,17,494 డాలర్లు కాగా, భారత్ విషయంలో అది కేవలం 27 డాలర్లు.2006లో యూరోపియన్ యూనియన్ పత్తికి 139 శాతం సబ్సిడీ మద్దతును అందించింది. 2001లో అభివృద్ధి చెందిన దేశాల పరిమితి కంటే అమెరికా పత్తికి 74 శాతం అధిక మద్దతును అందించింది. వ్యవసాయ దిగుమతులకు తక్కువ సుంకాలు అని అమెరికా అనడం అంటే, తమ వ్యవసాయం బహిరంగ మార్కెట్ అని చూపించడం కోసమే! కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే, దిగుమతులను నియంత్రించడానికి అమెరికా 9,000 కంటే ఎక్కువ పన్నేతర అడ్డంకులు (ఎన్టీబీలు) విధించింది. దీంతో పోలిస్తే ఇండియా విధించిన ఎన్టీబీలు కేవలం 600. సుంకాలతోనే సుంకాలను అమెరికా సమం చేస్తుందని ట్రంప్ చెబుతున్నారు. భారత్ కూడా తన సొంత వ్యవసా యాన్ని కాపాడుకోవడానికి సరిపోలే పన్నేతర అడ్డంకులని ఉపయో గించడానికి తగినంత అవకాశం ఉంది. భారతపై ట్రంప్ వేసిన తాజా అదనపు 27 శాతం ప్రతిచర్య సుంకాలతో మన రొయ్యలు, బాస్మతేతర బియ్యం, గోదుమల ఎగుమతికి దెబ్బే. అమెరికాతో భారత వాణిజ్యంలో అవే దాదాపు 46 శాతం ఉంటాయి. ఏమైనా, భారత్ తన ఇంటిని క్రమబద్ధీకరించు కోవాలని అమెరికా కోరుకునే బదులు, అమెరికాయే వ్యవసాయరంగం ద్వారాలు తెరవాలని భారత్ అడగాల్సిన అవసరం ఉంది. అమెరికా వ్యవసాయం చుట్టూ ఉన్న అధిక సబ్సిడీ కోటను ముందుగా కూల్చి వేయాలని అడిగితేనే ఇది సాధ్యమవుతుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ, ఆహార నిపుణులు -
బెయిల్ నియమం! జైలు మినహాయింపు!!
తీవ్రత లేని కేసుల్లో కూడా బెయిల్‌ని ట్రయల్ కోర్టు తిరస్కరించే ధోరణి పెరుగుతున్నందుకు సుప్రీంకోర్టు ఈమధ్య తీవ్ర ఆందోళన వ్యక్తపరిచింది. ప్రజాస్వామ్య రాజ్యం పోలీసు రాజ్యంగా మార కూడదని న్యాయమూర్తులు అభయ్ ఎస్. ఓకా, ఉజ్జల్ భూయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ దరఖాస్తులను ట్రయల్ కోర్టులు అనవసరంగా తిరస్కరించడం వల్ల సుప్రీంకోర్టు మీద అనవసర భారం పడుతోందని, ట్రయల్ కోర్టు స్థాయిలో పరిష్కరించాల్సిన కేసులకు సంబంధించిన బెయిల్ పిటీషన్లను సుప్రీంకోర్టు పరిష్కరించవలసి రావడం మీద జస్టిస్ ఓకా దిగ్భ్రాంతిని వ్యక్త పరిచారు. దర్యాప్తు పూర్తి అయిపోయి చార్జిషీట్ దాఖలైన కేసుల్లో ముద్దాయి రెండు సంవత్సరాలకు పైగా నిర్బంధంలో ఉన్నప్పటికీ ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. అది ఓ చీటింగ్ కేసు. ఆ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. 20 సంవత్స రాల క్రితం ఇలాంటి కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టులకు కూడా చేరేవి కావనీ, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అలాంటి పిటీషన్లతో నిండి పోతోందనీ అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం పేర్కొంది.ప్రజాస్వామ్య దేశంలో దర్యాప్తు సంస్థలు అనవసరంగా అరెస్టు చేయడానికి వీల్లేదనీ, పోలీసు రాజ్యంగా మార్చకూడదనీ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర పదజాలంతో తన ఉత్తర్వులలో పేర్కొంది. కస్టడీ అవసరం లేని కేసుల్లో వ్యక్తులను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు 2022లో జారీ చేసిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం గుర్తు చేసింది. ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. అందుకని బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టులు ఉదారంగా ఉండాలి.‘బెయిల్ అనేది నియమం. జైలు అనేది దానికి మినహాయింపు’. ఈ ప్రాథమిక చట్టపరమైన సూత్రాన్ని కోర్టులు పదేపదే విస్మరిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఈ కేసుని పేర్కొనవచ్చు. ఈ కేసులో ముద్దాయి మోసం కేసులో నిందితుడు. రెండు సంవత్సరాలకు పైబడి కస్టడీలో ఉన్నాడు. పోలీసులు తమ దర్యాప్తును పూర్తి చేశారు. చార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు. అయినప్పటికీ అతని బెయిల్ పిటీషన్‌ను ట్రయల్ కోర్టు – గుజరాత్ హైకోర్టులు తిరస్కరించాయి. చివరికి అతనికి బెయిల్‌ని సుప్రీంకోర్టు ఇవ్వాల్సి వచ్చింది.బెయిల్ మంజూరు చేయడం గతంలో సరళంగా ఉండేది. ఇప్పుడు సంక్లిష్టంగా మారిపోయింది. జవాబు, రిజాయిండర్ (ప్రతి జవాబు); సర్రిజాయిండర్ లాంటి సంస్కృతి పెరిగిపోతోంది. ఎన్.డి. పి.ఎస్., మనీలాండ రింగ్ లాంటి చట్టాలు నిరూపణా భారాన్ని ముద్దాయిపైనే మోపుతున్నాయి. దీనివల్ల రెగ్యులర్ బెయిల్ దరఖాస్తులు వెనకబడి పోతున్నాయి.క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 437(4) ప్రకారం, అదే విధంగా భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 480(4) ప్రకారం... బెయిల్ మంజూరు చేసినప్పుడు తగు కారణాలను రాయాల్సి ఉంటుంది. బెయిల్ తిరస్కరించినప్పుడు ఎలాంటి కార ణాలూ రాయాలని చట్టం నిర్దేశించలేదు. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం తగు కారణాలు మాత్రమే కాదు, ఎందుకు బెయిల్ మంజూరు చేయాల్సి వస్తుందో కూడా వివరంగా రాయాల్సి ఉంటుంది. ఇది రాయడం కొంత కష్టమైన పని. తగు సమయం అవసర మవుతుంది. ఐ.పి.సి. కేసుల్లో అంత వివరమైన కారణాలు అవసరం లేదు. అయినా కోర్టులు బెయిళ్లను తిరస్కరించ డానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. బెయిల్ అనేది నియమం– జైలు అనేది మినహాయింపు అనే సూత్రాన్నే కోర్టులు పాటించాలి. మనీ లాండరింగ్, ‘ఉపా’ లాంటి కేసుల్లో ఈ సూత్రాన్ని కొన్ని మార్పులతో వర్తింప చేయాల్సి ఉంటుంది.గత సంవత్సరం ప్రతి సుప్రీంకోర్టు బెంచ్ ప్రతిరోజూ కనీసం 15 నుంచి 20 బెయిల్ దరఖాస్తులను విచారిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ అన్నారు. సుప్రీంకోర్టు గత నాలుగైదు సంవత్సరాల నుంచి బెయిల్ దర ఖాస్తుల పరిష్కారానికే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. దీనివల్ల రాజ్యాంగపరమైన వివాదాలను పరిష్కరించాల్సిన సమయాన్ని సుప్రీంకోర్టు ఈ కేసుల వివాదాలను పరిష్కరించడానికి వినియోగించాల్సి వస్తోంది. చాలా బెయిల్ దరఖాస్తులను జిల్లా న్యాయ వ్యవస్థ పరిష్కరించవచ్చు. బెయిల్ అనేది ఒక నియమం అన్న విషయం జిల్లా న్యాయవ్యవస్థకు తెలియని విషయం కాదు. కానీ వారు రకరకాల కారణాల వల్ల బెయిల్స్‌ను మంజూరు చేయడానికి వెనకాడుతున్నారు. అందులో ముఖ్యమైనది – బెయిల్ మంజూరు చేస్తే మోటివ్స్ని న్యాయమూర్తులకు అంటగడుతారనీ, అదే విధంగా హైకోర్టు పాలనాపరమైన చర్యలు తీసుకుంటుందన్న భయం కూడా న్యాయమూర్తులను వెంటాడుతోంది. హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా బెయిల్స్ విషయంలో రకరకాలైన అభిప్రాయాలు, ఉత్తర్వులను జారీ చేశాయి. అది కూడా మరో కారణం. అందుచేత ఈ మధ్యన బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు నిలకడగా ఉన్నాయి. ‘బెయిల్ అనేది నియమం. తిరస్కరించడమ నేది మినహాయింపు’ అనే సూత్రానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయి. జిల్లా న్యాయ వ్యవస్థ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని బెయిల్స్‌ను ఉదారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రేరేపిత కేసుల సంఖ్య పెరుగుతున్న కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టులపై పని భారం పెంచకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా న్యాయ వ్యవస్థపై ఉంది.డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు -
ట్రంప్ విధ్వంసం
‘గ్రేట్ డిక్టేటర్’ చిత్రంలో హిట్లర్ పాత్రధారిగా అభినయించిన చార్లీ చాప్లిన్ గ్లోబ్‌తో ఇష్టానుసారం ఆటలాడుకుంటున్న దృశ్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కేవలం రెండేళ్లలో మీరు ప్రపంచానికే చండశాసనుడు కావొచ్చని చెప్పిన సలహాదారును... తనకు కాసేపు ఏకాంతం కావాలని బయటకు పంపి ఆ గ్లోబ్‌తో రకరకాల విన్యాసాలు చేస్తాడు. చివరికది మొహమ్మీదే భళ్లున బద్దలుకావటంతో ఆ ముచ్చట ముగుస్తుంది. జాత్యహంకారం తలకెక్కి ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని కలలుగన్న హిట్లర్‌పై అది తిరుగులేని వ్యంగ్యాస్త్రం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అలాంటి ఆశలేం లేవుగానీ... వర్తమాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమరికను తలకిందులు చేయాలన్న సంకల్పం... అందువల్ల అమెరికా భారీగా లాభపడుతుందన్న మూఢ విశ్వాసం ఆవరించినట్టుంది. పర్యవసా నంగా గత గురువారం నుంచి అంతర్జాతీయ మార్కెట్లన్నీ అధోగతిలో పయనిస్తున్నాయి. ట్రంప్ విధించిన ప్రతిచర్య సుంకాలతో మాంద్యం ముప్పు తప్పదన్న భయం వెన్నాడుతుండగా ప్రధాన ఈక్విటీల విచ్చలవిడి అమ్మకాలతో మార్కెట్లు పతనమవుతున్నాయి. మన బీఎస్ఈ, నిఫ్టీల్లో ఒక్క రోజులో రూ. 14 లక్షల కోట్ల సంపద ఆవిరైందని చెబుతున్నారు. ఆఖరి క్షణంలో స్వల్పంగా కోలుకో వటం వల్ల ఇక్కడితో ఆగింది గానీ రేపన్నరోజు బాగుంటుందన్న భరోసా చాలామందికి లేదు. దేన్నయినా తట్టుకోగల సామర్థ్యమున్న మన ఆర్థిక వ్యవస్థవల్ల త్వరలోనే సాధారణ స్థితి ఏర్పడగల దని చెబుతున్న నిపుణులూ ఉన్నారు. అంతర్జాతీయంగా అయితే ఎక్కడా ఆశారేఖ కనబడటం లేదు. డాలర్ బలహీనపడటం, చమురు ధరలు పడిపోవటంలాంటి పరిణామాలన్నీ కేవలం మదుపరుల్లో తాత్కాలికంగా అలుముకున్న నిరాశా నిస్పృహల వల్లే అని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. చిత్రమేమంటే... ఇంత జరుగుతున్నా ఈ సంక్షోభాన్ని తాత్కాలికమైనదిగానే ట్రంప్ పరిగణిస్తు న్నారు. తానిచ్చిన డోస్ పనిచేయటం మొదలెట్టాక అమెరికా ఆర్థిక వ్యవస్థ శరవేగంతో ఎదుగుతుందని విశ్వసిస్తున్నారు. ఇదంతా చూస్తూ కూడా అధికార రిపబ్లికన్లు నోరెత్తరు. విపక్ష డెమాక్రాట్లూ మౌనంగానే ఉంటారు. సాధారణ ప్రజానీకం ‘హ్యాండ్సాఫ్ ట్రంప్’ అంటూ వేలాదిగా రోడ్లపైకొస్తున్నారు. మొత్తానికి ప్రపంచీకరణ కళ్లముందు కుప్పకూలుతోంది. ఈ ప్రపంచీకరణలో భాగస్వాములు కావటానికి ససేమిరా అన్న వర్ధమాన దేశాల పాలకులను నయానో భయానో దారికి తెచ్చి అక్కడి వనరులన్నిటినీ అమె రికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎడాపెడా వాడుకున్న అమెరికా... ట్రంప్ ఏలుబడి వచ్చాక దానికి విరుద్ధమైన పోకడలకు పోతోంది. ఇన్నేళ్లుగా అమెరికాను అన్ని దేశాలూ దోచుకున్నాయని ఎదురు ఆరోపిస్తోంది. గతవారం ‘అమెరికా విముక్తి దినం’ రోజున మిత్రులు, ప్రత్యర్థులన్న విచక్షణ కూడా లేకుండా సుంకాల మోత మోగించేందుకు ట్రంప్ అధ్యక్షుడికి వుండే ‘ఎమర్జెన్సీ’ అధికారాలను వినియోగించుకున్నారు. కేవలం యుద్ధ సమయాల్లో వాడుకోవాల్సిన ఈ అధికారాలను రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఆయన చేజిక్కించుకున్నా అమెరికన్ కాంగ్రెస్‌గానీ, ఇన్నాళ్లుగా స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిన రిపబ్లికన్లు గానీ, బహుళజాతి కార్పొరేషన్లు గానీ నోరెత్తక పోవటం ఆశ్చర్యకరం. కేవలం కెనడాపై విధించిన అదనపు సుంకాలను రద్దు చేయటం వంటి పరిమిత చర్య మినహా సెనేట్ మౌనంగా ఉండిపోయింది. ఈమాత్రం చర్యను కూడా ట్రంప్ మద్దతుదారులు సహించలేకపోతున్నారు. మాదకద్రవ్య ముఠాలను అదుపు చేయటా నికి విధిస్తున్న సుంకాలను వ్యతిరేకిస్తారా అంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. ఈ సుంకాల విధింపు గుడ్డెద్దు చేలో పడిన చందాన ఉన్నదని జనాభా పెద్దగాలేని హెర్డ్ అండ్ మెక్‌డోనాల్డ్ ద్వీపాల వంటి అతి చిన్న ప్రాంతాలను సైతం వదలని తీరు గమనిస్తే తెలుస్తుంది. ప్రపంచంలో అమెరికా స్థానాన్ని కైవసం చేసుకుని, అగ్రగామిగా నిలబడాలని దశాబ్దాలుగా చైనా పథకాలు పన్నుతోంది. ట్రంప్ దాన్ని వేగవంతం చేశారు. సుదీర్ఘకాలం నిర్మించుకున్న అనుబంధం కారణంగా ఇన్నాళ్లూ పాశ్చాత్య ప్రపంచం అమెరికాను సమర్థిస్తూ పోయింది. కెనడా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా వంటివన్నీ అమెరికా ఏం చేసినా అది లోకకల్యాణం కోసమే నన్నట్టు వంతపాడాయి. ఇలాంటి అనుకూలతలు లేని కారణంగానే పూర్వపు సోవియెట్ అయినా, ప్రస్తుత రష్యా అయినా, చైనా అయినా దీటుగా నిలబడలేకపోయాయి. కానీ ట్రంప్ దాన్ని కాస్తా మార్చేశారు. కెనడా కొత్త ప్రధాని మార్క్ కేర్నీ మాటల్లో చెప్పాలంటే ‘అమెరికా ఇక విశ్వసించదగ్గ భాగస్వామి కాద’ని తేలిపోయింది. జర్మనీ చాన్సలర్ కాబోతున్న ఫ్రెడరిక్ మెర్జ్ అయితే ఇంకాస్త ముందుకుపోయారు. అమెరికా నుంచి యూరప్ స్వాతంత్య్రాన్ని సాధించాలని పిలుపు నిచ్చారు. ఇదంతా చివరకు ప్రపంచంలో చైనా పలుకుబడి పెరగడానికి దోహదపడుతుందన్న స్పృహ ట్రంప్‌కు లేకుండా పోయింది. నియమాల ఆధారిత ప్రపంచమే ధ్యేయం అంటూ ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా క్వాడ్‌ను రూపొందించి అమెరికా మనల్ని అందులో భాగస్వా ముల్ని చేసింది. సందర్భం వేరు కావొచ్చుగానీ ఆర్థికరంగంలో ఇవాళ అన్ని నియమాలనూ ఉల్లంఘిస్తున్న అమెరికాను క్వాడ్ విషయంలో మనం విశ్వసించవచ్చా అన్న సందేహం కలిగితే ఆశ్చర్యమే ముంది? మౌలికంగా మార్కెట్లు కచ్చితమైన అంచనాల ఆధారంగా ముందుకు కదులుతాయి. మదుపుదార్లు స్వేచ్ఛగా, నిర్భయంగా పెట్టుబడులు పెడతారు. సంపద పోగవుతుంది. కానీ ట్రంప్ చర్యలతో అంతా తలకిందులైంది. ఇక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటం ఇప్పట్లో సాధ్యమా? -
రెండు ఉపయోగకర పర్యటనలు
ప్రధాని మోదీ ఈ నెల మొదటి వారంలో రెండు ఉపయోగకరమైన విదేశీ పర్యటనలు జరిపారు. మొదటిది – 4వ తేదీన థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ‘బిమ్ స్టెక్’ శిఖరాగ్ర సమావేశం కోసం. రెండవది – ఆ మరునాడు శ్రీలంకకు! ఈ రెండూ దేశ ప్రయోజనాలకు అవసరమైనవి కాగా, అద నంగా మరొకటి చెప్పుకోవాలి. బ్యాంకాక్‌లో ఆయన బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహా దారు మహమ్మద్ యూనుస్‌తో విడిగా సమావేశం కావటం.లుక్ ఈస్ట్ – యాక్ట్ ఈస్ట్వివిధ దేశాల మధ్య పరస్పర సహకారాలే కాకుండా ఒక ప్రాంతానికి చెందిన దేశాల మధ్య అందుకోసం ప్రాంతీయ సంస్థలు ఏర్పడటం ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలం తర్వాత నుంచి ఉండగా, ఆ క్రమంలో ఇండియాకు సంబంధించి 1997లో వచ్చిందే ‘బిమ్స్టెక్’. ఇటువంటివి సార్క్, హిందూ మహాసముద్ర తీర దేశాల సంస్థల పేరిట కూడా ఏర్పడ్డాయి గానీ, కారణాలు ఏవైనా అవి సంతృప్తికరంగా పనిచేయలేదు. ఆగ్నేయాసియాకు సంబంధించి 1967 నుంచి గత 57 ఏళ్లుగా విజయవంతంగా పనిచేస్తున్నది ‘ఆసి యాన్’ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్) ఒక్కటే. ‘ఆసియాన్’ దేశాలన్నీ భారత్ కన్నా చాలా చిన్నవి. వాటి ఆర్థిక వ్యవస్థలు కూడా చిన్నవే. ఆ పరిస్థితితో పోల్చినప్పుడు భారత్ కేంద్రంగా ఒక బలమైన ఆర్థిక సహకార వ్యవస్థ ఎప్పుడో ఏర్పడి బల పడ వలసింది. కానీ, విధానపరమైన లోపాల వల్ల ప్రభుత్వాలు కొంత కాలం అప్పటి సోవియట్ వైపు, తర్వాత పాశ్చాత్య ప్రపంచంవైపు చూశాయి గానీ చుట్టూ గల ఆసియా దేశాలను నిర్లక్ష్యం చేశాయి. ఈ వెనుకటి విధానాలకు భిన్నంగా మొదటిసారిగా ‘లుక్ ఈస్ట్’ పేరిట కొత్త విధానాన్ని ముందుకు తెచ్చింది, 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు. ఆ విధంగా కొత్త దృష్టి అయితే ఏర్పడింది గానీ, ఆయనే అమలుకు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, వాటి అవసరాలను బట్టి అయినా తూర్పు దేశాలతో ఆర్థిక సంబంధాలు తగినంత అభివృద్ధి చెందలేదు. పీవీ ఐదేళ్ల పాలన తర్వాత రాజకీయ అస్థిరతలు ఏర్పడటం అందుకొక ముఖ్య కారణం. అప్పటికీ, విదేశాంగ వ్యవహారాలలో నిపుణుడైన గుజ్రాల్ నేషనల్ ఫ్రంట్, యునై టెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల కాలంలో విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా పని చేసినపుడు 1997లో ‘బిమ్స్టెక్’ కోసం చొరవ తీసుకున్నారు.‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ– సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో ఆపరేషన్’ పేరిట ఏర్పడిన ఆ సంస్థలో మొదట ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్ సభ్య దేశాలు కాగా, తర్వాత నేపాల్, భూటాన్, మయన్మార్ చేరాయి. మోదీ ప్రధాని అయిన తర్వాత ‘లుక్ ఈస్ట్’ను ‘యాక్ట్ ఈస్ట్’గా మార్చి కొంత చురుకుదనం తెచ్చారు.సుదీర్ఘ అశ్రద్ధఇతర ఆసియా దేశాలతో కన్నా ‘బిమ్స్టెక్’ మధ్య సంబంధాలు మందకొడిగానే ఉన్నాయి. సంస్థ ఆర్థిక, రక్షణ సహకార విషయాలు అధికారుల స్థాయికి పరిమితం కాగా, ఈ నెల నాల్గవ తేదీ నాటి శిఖరాగ్ర సమావేశం ఏడేళ్ల తర్వాత జరగటం గమనించదగ్గది. ఏడు సభ్య దేశాలలో నేపాల్, భూటాన్ చిన్నవి, సముద్ర తీరం లేనివి అను కున్నా, తక్కిన అయిదు కూడా ముఖ్యమైనవి, సముద్ర తీరం గలవి. సముద్ర మార్గ రవాణాలు, రక్షణలకు కీలకమైన ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ రెండు అంశాలను ‘బిమ్స్టెక్’ లక్ష్యాలలో ప్రముఖంగా పేర్కొ న్నారు కూడా! అయినప్పటికీ ఇంతకాలం కనిపించిన అలసత్వ వైఖరులు వాటికవే సరైనవి కాదు. ఈ పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్‌లతో చైనా సన్నిహితమయ్యింది. అనగా, ఇండియాకు భౌగోళికంగా దగ్గరగా ఉండి, బంగాళాఖాత తీర ప్రాంతానివి అయి కూడా భారత్ వాటిని ‘బిమ్ స్టెక్’ ఏర్పాటు తర్వాత సైతం దగ్గర చేసుకోలేక, చైనాతో పోటీపడాల్సి వస్తున్న దన్నమాట. సంస్థలోని తక్కిన దేశాలకన్న భారత ప్రయోజనాలు విస్తృతమైనవి కావటం, బంగాళాఖాతం కీలక ప్రాంతంలో, అందులోనూ హిందూ మహాసముద్రానికి అనుసంధానమై ఉండ టాన్ని బట్టి అటువంటి చొరవలు ఇండియాకే ఎక్కువ అవసరం. అయినా సుదీర్ఘ కాలం అశ్రద్ధలన్నవి ఎంత పొరపాటో చెప్పనక్కర లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా తిరిగి శిఖరాగ్ర సమావేశం జరగటం మంచి పని. ట్రంప్ సుంకాల హెచ్చింపు చర్యలు సృష్టిస్తున్న ఒత్తిడుల మధ్య జరగటం మరింత మంచిదవు తున్నది. సమావేశంలో చర్చించిన ఆర్థిక సహకారం, అభివృద్ధి, శాస్త్ర–సాంకేతిక రంగాలు, రక్షణ వంటి అంశాలు షరా మామూలువే అయినా, ‘ప్రపంచంలో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా పరస్పర అభివృద్ధిపై దృష్టి పెట్టడం’ అన్నది ప్రత్యేకంగా గమనించ వలసిన ప్రకటన. బంగ్లా, లంకలతో సంబంధాలుపోతే, ఇదే సంస్థలోని పొరుగు దేశమైన బంగ్లా నాయకునితో మోదీ సమావేశం, సంబంధాల పునరుద్ధరణకు దారితీసినట్లయితే ఉభయులకూ మేలు చేస్తుంది. ఇండియా జోక్యంతో 1971లో ఏర్ప డిన ఆ దేశంతో సంబంధాలు ఈ 55 ఏళ్ళలో తరచూ ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధాని షేక్ హసీనా పతనం నుంచి కొద్ది నెలలుగా తిరిగి అదే పరిస్థితి తలెత్తింది. ఈ నాయకులిద్దరూ బ్యాంకాక్‌లో అసలు విడిగా సమావేశమవుతారా అనే సందేహాలుండేవి. కానీ, భారత ప్రధానికి అందజేసేందుకు బంగ్లా నాయకుడు జ్ఞాపక చిహ్నంగా ఒక పాత చిత్రాన్ని వెంట తీసుకువచ్చారంటేనే సామరస్య వైఖరి కనిపిస్తున్నది. బంగ్లాలో త్వరలో జరుగనున్న ఎన్నికలలో ఎవరు అధికారానికి రాగలదీ తెలియదు. ఇండియా మిత్ర పక్షమ నుకునే షేక్ హసీనా ‘అవామీ లీగ్’కు మాత్రం అవకాశాలు కన్పించటం లేదు. ఇండియాలో అనధికార శరణార్థి రూపంలో ఉన్న ఆమెను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని బ్యాంకాక్‌లో మోదీని బంగ్లా నాయకుడు మరొకమారు కోరారు. ఇరు దేశాల సంబంధాలలో ఇదొక చిక్కు ప్రశ్న. అక్కడ హిందువులపై దాడుల సమస్య అట్లానే ఉంది. వీటన్నింటినీ అధిగమిస్తూ ‘బిమ్స్టెక్’ లక్ష్యాల వైపు కదలటం రెండు దేశాలకూ పెద్ద పరీక్షే. కానీ ఉత్తీర్ణత సాధించక తప్పని పరీక్ష. శ్రీలంక విషయానికి వస్తే, భౌగోళికతలు, ఆర్థిక, రక్షణ అవస రాలు, పరస్పర సహకారాలు, విభేదాలు అన్నింటి విషయాలలోనూ ఇండియా సంబంధాలు బంగ్లాదేశ్‌ను పోలి ఉండటం యాదృచ్ఛికమే కావచ్చు. అక్కడ సరికొత్త శక్తులు పూర్తి మెజారిటీలతో గెలిచి అధికారానికి రావటంతో పరిస్థితులు మారాయి. కొత్త అధ్యక్షుడు దిస్సనాయకే, దేశంలో నెలకొని ఉన్న సమస్యలు, వాటి నుంచి బయటపడి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలనే పట్టుదల వల్ల, భారతదేశంతో గతంలో ఉండిన విభేదాలను మరచిపోయి పరస్పర సహకారం కోసం ప్రయత్నిస్తున్నారు. చైనాకు ఎంత సన్నిహితమైనా, తమ విధానం సంతులనమని కొత్తలోనే ప్రకటించటం, చైనా కన్న భారత్‌ను మొదట సందర్శించటం దిస్సనాయకే దౌత్యనీతికి రుజువులు. మోదీ సందర్శన సందర్భంగా ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద స్వాగతం చెప్పిన అసాధారణ చర్య, ఆయనకు ‘మిత్ర విభూషణ’ పురస్కారం, తమ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించనివ్వబోమన్న హామీ ఇదే కోవలోకి వస్తాయి. వివిధ ఆర్థిక, రక్షణ ఒప్పందాలు రెండు వైపుల నుంచి సజావుగా అమలైతే, ట్రంప్ ఆవిష్కరిస్తున్న కొత్త ప్రపంచపు సాధక బాధకాలను సమష్టిగా ఎదుర్కొన వీలవుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఏఐలో మనం మేటి కావాలంటే...
కొత్త సంవత్సరం మొదలై మూడు నెలలే అయింది కానీ... కృత్రిమ మేధ రంగంలో ఈ స్వల్ప అవధిలోనే పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. జనవరిలో విడుదలైన డీప్‌సీక్ ఆర్–1 ఒకటైతే... ఫిబ్రవరిలో ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇంకోటి. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్‌లు సంయుక్తంగా అధ్యక్షత వహించిన ఈ సదస్సులోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏఐ తీసుకురాగల రాజకీయ, భద్రతాపరమైన సవాళ్లను ప్రపంచం ముందుంచారు. చివరగా మోదీ తాజా అమెరికా పర్యటనలో ఇరు దేశాల మధ్య ఏఐ వంటి కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. ఏఐ రంగం నేతృత్వాన్ని ఆశిస్తున్న భారత్‌పై ఈ పరిణామాల ప్రభావం ఏమిటి?డీప్‌సీక్ ఆర్–1 సంచలనం తరువాత భారత్‌లో నడుస్తున్న చర్చ ఏమిటీ అంటే... మనదైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఒకటి తయారు చేసుకోవాలని. ఇందుకు అవసరమైన ఏఐ చిప్స్ అందు బాటులో ఉండేలా చూసుకోవాలని! మరోవైపు ప్రభుత్వం కూడా సొంత ఎల్ఎల్ఎం అభివృద్ధిపై ప్రకటన చేసింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పింది. నేషనల్ ఏఐ మిషన్ స్టార్టప్‌లు, పరిశోధకుల కోసం పది వేల జీపీయూలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. అంతేకాకుండా... ఎల్‌ఎల్‌ఎంలతోపాటు స్మాల్ లాంగ్వేజ్ మోడళ్లు, ప్రాథమికమైన ఏఐ మోడళ్ల తయారీకి పిలుపునిచ్చింది.ఈ చర్యలన్నీ ఆహ్వానించదగ్గవే అయినప్పటికీ... ఇవి మాత్రమే సరిపోవు. డీప్‌సీక్ విజయవంతమైన నేపథ్యంలో చేపట్టాల్సిన పనుల ప్రాథమ్యాల్లోనూ ఇవి లేవనే చెప్పాలి. అతి తక్కువ ఖర్చు, శిక్షణలతోనే అద్భుతమైన ఎల్ఎల్ఎంను రూపొందించవచ్చునని డీప్‌సీక్ ఇప్పటికే రుజువు చేసింది. చౌక ఆవిష్కరణలకు పేరుపొందిన భారత్‌కు ఇది ఎంతో సంతోషించదగ్గ సమాచారం. అయితే దీనర్థం సొంత ఎల్ఎల్ఎం అభివృద్ధే ఏఐ ఆధిపత్యానికి తొలి అడుగు అని కాదు. అమెరికా, ఇతర దేశాల ఎల్ఎల్ఎంలకు, డీప్‌సీక్‌కు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే... శిక్షణకు సంబంధించి భిన్నవైఖరి తీసుకోవడం! ఈ వైఖరి కారణంగానే దాని శిక్షణకు అయిన ఖర్చు చాలా తక్కువగా ఉంది. భారత్‌లోని టెక్నాలజీ నిపుణులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు స్థూలంగా మూడు. ఏఐలో సృజనను పెంచే అన్ని ప్రాథమిక అంశాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇందుకు ఏఐలో అత్యున్నత నైపుణ్యం కలిగిన వారు అవసరం. అలాగే మనదైన డేటా సెట్లు, రేపటి తరం రీసెర్చ్ అండ్ డెవలప్మంట్ దృష్టికోణం కావాల్సి వస్తాయి. ప్రస్తుతం భారత్‌లో అత్యున్నత స్థాయి ఏఐ నైపుణ్యం లేదు. భారతీయ మూలాలున్న ఏఐ నిపుణులు దురదృష్టవశాత్తూ సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్నారు. పెర్ప్లెక్సిటీ ఏఐ సృష్టికర్త అరవింద్ శ్రీనివాస్ భారత్‌లో చేపట్టే ఏఐ కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు సిద్ధమని అంటున్నాడే కానీ... ఇక్కడకు వచ్చేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. అమెరికాలో పెర్ప్లెక్సిటీ ఏఐ బాగా పాపులర్ కాబట్టి ఈ నిర్ణయం సరైందే అనిపిస్తుంది. కానీ ఏఐ విషయంలో భారత్ నుంచి మేధా వలసను అరికట్టేందుకు ఏదైనా చేయాల్సిన అవసరాన్ని కూడా చెబుతోంది ఇది. దేశంలోని టెక్నాలజీ రంగాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు తగిన వ్యూహం కూడా కావాలిప్పుడు! యూపీఐ లాంటి వ్యవస్థల ద్వారా భారత్‌కు సంబంధించిన డేటా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నా వీటి ఆధారంగా డేటాసెట్లను ఇప్పటివరకూ ఏఐ స్టార్టప్‌లు తయారు చేయలేకపోయాయి. ఇలాంటివే అనేక డేటాసెట్లు వేర్వేరు చోట్ల పడి మూలుగుతున్నాయి. వీటన్నింటినీ ఉపయోగించడం ఎలాగో చూడాలి. అలాగే భారతీయ ఆర్ అండ్ డీ (పరిశోధన–అభివృద్ధి) రంగానికి కూడా భారీ ప్రోత్సాహకం అవసరం. మోదీ ఆ మధ్య అమె రికా పర్యటనకు వెళ్లినప్పుడు అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ , అమెరికాకు చెందిన నేషనల్ సైన్ ్స ఫౌండేషన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అలాగే ఏఐలో పరిశోధనలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వంతోపాటు, ప్రైవేట్ రంగం కూడా పెట్టుబడులు పెట్టేలా చేయాలి. ఇవన్నీ చేయడం ద్వారా మాత్రమే సుశిక్షితమైన ఎల్ఎల్ఎం లేదా ఇంకో వినూత్న ఏఐ ఉత్పత్తి ఆవిష్కృతమవుతుంది. ఇలా చేయడం ద్వారా భారత్ ప్రపంచస్థాయిలో తనదైన గుర్తింపు పొందగలుగుతుంది. రెండో విషయం... ఏఐలో వినూత్న ఆవిష్కరణల కోసం ఓపెన్ సోర్స్ పద్ధతిని అవలంబించడం మేలు. డీప్‌సీక్–ఆర్1, మిస్ట్రల్ వంటివి అన్నీ ఓపెన్ సోర్స్ పద్ధతిలో అభివృద్ధి చేసినవే. ఇలాంటివి మేలా? ఛాట్ జీపీటీ వంటి క్లోజ్డ్ సోర్స్ ఎల్ఎల్ఎంలు మేలా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఫ్రాన్ ్సకు చెందిన మిస్ట్రల్, యూఎస్ కంపెనీ మెటా, చైనా కంపెనీ డీప్ సీక్‌లు ఓపెన్ సోర్స్ బాట పట్టాయి. భారత్ కూడా ఇదే పద్ధతిని ఎంచుకోవాలి. ఓపెన్ సోర్స్ ద్వారా భారతీయ స్టార్టప్ కంపెనీలు, పరిశోధకులు మెరుగ్గా పోటీపడగలరు. అదే క్లోజ్డ్ సోర్స్ అనుకోండి... విదేశీ ఏఐలపై ఆధారపడటం మరింత ఎక్కువ అవుతుంది. ఓపెన్ సోర్స్ బాట పట్టేందుకు యూరప్‌తో పాటు దక్షిణ దేశాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి భారత్ అందరికీ మేలు చేసేలా ఆ యా దేశాలతో ఏర్పాటు చేసుకోవడం మంచిది.మూడో అంశం... ఏఐలో పోటీతత్వాన్ని పెంచేందుకు భారత్ తక్షణం ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ నుంచి రక్షణ ఎలా అన్న అంశంపై ప్రస్తుతానికి అంత దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ప్యారిస్ సదస్సులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏఐపై అమెరికా వైఖరి ఏమిటన్నది సుస్పష్టంగా చెప్పారు. ఈ రంగంలో చైనా పైస్థాయిలో ఉంది కాబట్టి... అమెరికా కూడా ఎలాగైనా ఈ రేసులో తనది పైచేయి అనిపించుకోవాలని చూస్తోంది. ఈ పోటీలో భారత్ కూడా తనదైన ప్రత్యేకతను నిరూపించుకోవాలి. ఎప్పటికప్పుడు మారిపోతున్న ఈ పోటీ తీరుతెన్నులను ఒడిసిపట్టుకోకపోతే కష్టమే.అందుకే ఏఐ నైపుణ్యాలను పెంచేందుకు, ఏఐ ఆర్ అండ్ డీకి సంబంధించి ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీల వాడకానికి తగిన వ్యూహం రూపొందించాలి. యూపీఐ వంటి భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన డేటా సాయంతో ఏఐ రంగంలో సృజనకు వీలుకల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రపంచం ఏఐ ఆటలో మనల్ని గుర్తించగలదు.అనిరుధ్ సూరి వ్యాసకర్త ఇండియా ఇంటర్నెట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ -
కఠిన వాస్తవాలను దాచేస్తారా?
ఆమె పేరు సూచిస్తున్నట్టుగానే సంధ్యా సూరి భారత సంతతికి చెందిన ఫిల్మ్ మేకర్. ఆమె దర్శకత్వం వహించిన ‘సంతోష్’ సినిమా గత ఏడాది యూకే తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్స్‌కు వెళ్లింది. కాన్ (ఫ్రాన్స్) చిత్రోత్సవంలో విశేష మన్ననలు అందుకుంది. ‘బాఫ్టా’ (బిఏఎఫ్‌టీఏ– ద బ్రిటిష్ అకాడెమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్)కు నామినేట్ అయ్యింది. ఇందులో నటించిన షహానా గోస్వామి ఏసియన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఇంత ఖ్యాతి గడించినప్పటికీ, కోట్లాది మంది భారతీయులు మాత్రం ఈ సినిమాను ఎప్పటికీ చూడలేరు. సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ– సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) దీనికి దారుణమైన కత్తెరలు వేసింది. వాటికి అంగీకరిస్తేనే భారత్‌లో ప్రదర్శనకు అనుమతి ఇస్తామని చెప్పడంతో, సంధ్యా సూరి సహజంగానే అందుకు నిరాకరించారు.పూర్తిగా భారత్‌లోనే నిర్మించిన, భారతీయ నటీనటులతోనే చిత్రీకరించిన, అదీ హిందీలో తీసిన చిత్రం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి భారతీయ చిత్రం. కానీ భారతీయులమైన మనం దీన్ని వీక్షించలేక పోవడం మన దౌర్భాగ్యం. ఎందుకంటే, మనం కాదనలేని ఒక సత్యాన్ని ఇది ఆవిష్కరించింది. దాన్ని మనకు తెలియకుండా దాచి ఉంచగలనని సెన్సార్ బోర్డు అనుకుంటోంది. నేను ప్రస్తావిస్తున్న ఈ సత్యం పోలీసుల కర్కశత్వం, వారు పెట్టే చిత్రహింసల గురించి!ఈ సినిమా నేను చూశాను. ఇది అంతులేని బాధ కలిగిస్తుంది. మనసును విపరీతంగా కలవరపెడుతుంది. ఉత్తర భారత గ్రామీణ ప్రాంతాల్లో సాగే పోలీసుల దాష్టీకానికి ఇది వాస్తవ చిత్రీకరణ. అమాయక ప్రజలను పోలీసులు ఎలా టార్చర్ పెట్టగలరో, దళితులు, ముస్లింలు వారి చేతిలో ఎన్ని దుర్మార్గాలకు గురవుతున్నారో, మానభంగాలను ఏ విధంగా వారు వెనకేసుకొస్తారో, సాధారణ ప్రజానీకాన్ని ఎంతగా భయభ్రాంతులకు గురిచేస్తారో ఈ సినిమా కళ్లకు కడుతుంది. పుట్టుక, సంపద, పలుకుబడి... ఈ మూడింటిలో ఏ బలమూ లేకుండా పోలీసులతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ ఇది సత్యమని, ఇదే వాస్తవమని తెలుసు. ఈ య«థార్థం వారికి ఆశ్యర్యం కలిగించదు, వారిని దిగ్భ్రాంతికి అసలు గురి చేయదు. ఎందుకంటే వారికి పోలీసుల వైఖరి నిత్యజీవిత అనుభవం. కానీ సెన్సార్ బోర్డు దీన్ని సమ్మతించడానికి ఇష్టపడటం లేదు. గుర్తించడానికి అంగీకరించడం లేదు. పోలీసుల హింస, జవాబుదారీతనం లేకపోవడం గురించి ‘పోలీస్ టార్చర్ అండ్ (అన్) అకౌంటబిలిటీ’ పేరుతో ‘కామన్ కాజ్’, ‘లోక్‌నీతి సీఎస్డీఎస్’లు ఇటీవలే సంయుక్తంగా ప్రచురించిన ఒక నివేదిక ఈ సినిమా వాస్తవికతను ధ్రువీకరిస్తోంది. 17 రాష్ట్రాల్లో 8,000 మందికి పైగా పోలీసులను ఈ సంస్థలు సర్వే చేశాయి. వారిలో రమారమి 30 శాతం మంది చిత్రహింసలను సమర్థించారు. ప్రమాదకరమైన నేరగాళ్లను విచారణ ముగిసే వరకూ వేచిచూడకుండా చంపేయడమే మెరుగు అని దరిదాపు 25 శాతం మంది తేల్చి చెప్పారు. ప్రజల్లో భయం ఉండాలంటే కఠిన పద్ధతులు అవలంబించాల్సిందే అంటూ 20 శాతం మంది వెల్లడించారు. ముస్లింలు నేరప్రవృత్తికి లోనయ్యే అవకాశం ఉందని 50 శాతం మంది చెప్పడం ఆశ్చర్యకరం. ఇక, ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్’ (ఎస్ఓపీ)ను పాటించడం ఎప్పుడో తప్ప జరగదని 40 శాతం కంటే ఎక్కువ మందే అంగీకరించారు. అందుకే కాబోలు... కేవలం 33 శాతం మంది భారతీయులే పోలీసులను విశ్వసిస్తారని ‘ఇప్సాస్’ సర్వే (యూకే) నిర్ధారించింది. వీటిలో ఏదీ మనకు ఆశ్యర్యం కలిగించదు. ఎవరూ చెప్పనవసరం లేకుండానే ఇవన్నీ నిజాలేనని మనకు సహజంగానే తెలుసు. పోలీసుల దాష్టీకాన్ని వెల్లడించే అధ్యయనాలకు కొరత లేదు. ‘నేషనల్ క్యాంపేన్ ఎగైనెస్ట్ టార్చర్’ వార్షిక నివేదిక (2019) ప్రకారం, ఆ ఏడాది 1,723 కస్టడీ చావులు వెలుగు చూశాయి. అంటే పోలీసు కస్టడీలో రోజుకు అయిదుగురు ప్రాణాలు విడిచారు. ఈ అధ్యయ నాలు బట్టబయలు చేసిన వాస్తవాలకే ‘సంతోష్’ సినిమా కర్కశ, వాస్తవిక దృశ్యరూపం ఇచ్చింది. అయినా సరే, భారతీయలు ఈ సినిమా ఎప్పటికీ చూడలేరు. ఏదైనా అద్భుతం జరిగి సెన్సార్ బోర్డు మనసు మారితే తప్ప!ముచ్చటైన విషయం ఏమిటటే, ఇండియాలో చిత్రీకరణ కోసం అనుమతి కోరుతూ సంధ్యా సూరి తన సినిమా స్క్రిప్టును అధికా రులకు సమర్పించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాలేదు. ‘గార్డియన్’ వార్తాపత్రికకు ఆమె ఇదే చెప్పారు. ‘ఇప్పుడు చాంతాడు పొడవన్ని కట్స్ జాబితా ఇచ్చారు. ఈ సెన్సార్ కోత లన్నీ కలిపి పేజీలకు పేజీలు ఉన్నాయి’. వాటికి అంగీకరించడం ‘అసాధ్యం’. ఎందుకంటే, సినిమా ‘విజన్’ పూర్తిగా దెబ్బతింటుందని ఆమె వాపోయారు.నేను ఈ సినిమా చూసిన ప్రభావంతో చెబుతున్నాను. ఇది తప్పనిసరిగా చూడాల్సినది. బాలీవుడ్ సినిమాల్లో కూడా పోలీసు జులుం తరచూ కనబడుతూనే ఉంటుంది. అయితే, అది మృదువుగా, ప్రభావ శూన్యంగా ఉంటుంది. సానుకూల కోణం కూడా సమాంతరంగా నడుస్తుంది. కానీ ‘సంతోష్’ అలాకాదు.అందులో ఎలాంటి చక్కెర పూతా ఉండదు. కర్కశమైన, ఉపశమన రహితమైన వాస్తవికతను చూపిస్తుంది. చూడటం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ వాస్తవాన్ని చూడకుండా మనం ఎలా కళ్లు మూసు కుంటాం? అది తగిన పని కాదు. అయినా మనం సత్యాన్ని తిరస్కరిస్తూనే పోతున్నాం. ‘సంతోష్’ అలాంటి తిరస్కారాల జాబితాలో తాజాగా చేరింది. చిత్రహింసలకు వ్యతిరేకంగా రూపొందించిన ఐక్యరాజ్య సమితి ఒప్పందం (యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఎగైనెస్ట్ టార్చర్)పై సంతకం చేయని అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటి. అలా ఆమోదించకపోవడానికి... కస్టడీ హింసను నిరోధించే సొంత చట్టం ఏమైనా ఉందా అంటే అదీ లేదు. నిజానికి ఇవి మనం ఎప్పుడూ చర్చించని యథార్థాలు. ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినా, ఆ వెంటనే మర్చిపోతాం. ఒకవేళ ‘సంతోష్’ను మనం చూడడం జరిగితే... ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించే అవకాశం అది ఇస్తుంది. ఈ దారుణాలు ఎందుకు అనుమతిస్తున్నారు? ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? అని నిలదీస్తాం. బహుశా అందుకే సెన్సార్ బోర్డు మనం ఎప్పటికీ ఈ సినిమా చూడకుండా జాగ్రత్త పడింది. సత్యమేవ జయతే!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పీయూష్ గోయల్ (కేంద్ర మంత్రి) రాయని డైరీ
ఇండియాలో ఎందుకు ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు?! తింటూ మాట్లాడుతుం టారు?! తింటూనే కాన్ఫరెన్సులు, తింటూనే ‘డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్’లు, తింటూనే చాట్ జీపీటీలు, ్రగ్రోక్లు, జిబ్లీలు... ఆఖరికి నిద్రలోకి జారుకోవటం కూడా తింటూనేనా! మనిషి లోపల గుండె కొట్టుకుంటూ ఉన్నట్లు మనుషుల నోట్లో తిండెందుకు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటుంది?! ‘స్టార్టప్ మహాకుంభ్’లో కూడా తిండి... తిండి... తిండి! మహాకుంభ్‌కు మూడువేల స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. అన్నీ ఇండియన్ల తిండీతిప్పల కంపెనీలే. వెయ్యి మంది ఇన్వెస్టర్లు వచ్చారు. అంతా తిండి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటానికి వచ్చిన ఇండియన్లే! ఏప్రిల్ 3 నుంచి 5 వరకు ప్రగతి మైదాన్‌లోని ‘భారత మండపం’లో ఒకటే తిండి గోల.విజిటర్స్కైతే అదొక తిండి మహా సముద్రం. మనుషులు తిండిలో ఓలలాడి,తిండిలో మైమరచి, తిండిలో స్పృహ తప్పటం స్టార్టప్ మహాకుంభ్ ప్రాంగణంలోని ‘ఆహార్ కుంభ్’లో కళ్లారా చూశాన్నేను!‘రెక్టిజా అండ్ కో’ స్టార్టప్ కంపెనీవారు అక్కడ స్టాల్ పెట్టుకుని పిజ్జాలు అమ్ము తున్నారు. పిజ్జాను రౌండ్‌గా కాకుండా రెక్టాంగిల్లో చేసివ్వటం రెక్టిజా అండ్ కో ప్రత్యేకత. జనం వాటి కోసం ఎగబడుతున్నారు! ఇంకోచోట, ‘సంప్రదాయ భారతీయ ఆహారపు ప్రామాణిక రుచులు మా ప్రత్యేకత’ అని ‘శాండీ ఫుడ్స్’ స్టార్టప్ వాళ్లు బోర్డు పెట్టారు. టేబుల్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి! అవి ఖాళీ అయితే కూర్చోటానికి ఆ టేబుల్స్‌కి నాలుగు వైపులా జనం! ఆ పక్కనే ‘ఫార్చూన్ ఫుడ్స్’ స్టార్టప్ వారి ‘ఇంటి తరహా భోజనం’! అక్కడా నిలువుకాళ్ల గుంపులే. ఇంట్లో భోజనం చేసుకోకుండా ‘ఇంటి తరహా భోజనం’ కోసం ఇంటిల్లిపాదీ ఇలా ఆహార కుంభాలకు రావటం ఏమిటి? ఇందు కేనా ఇండియాలో కొత్త కొత్త తిండి యాప్‌లు, తిండి స్టార్టప్‌లు వచ్చేస్తున్నాయి!కామర్స్ మినిస్టర్‌గా నేనీ చెత్తంతా మాట్లాడకూడదు. మనిషి తింటేనే దేశానికి పుష్టి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్‌గా కూడా పని చేశాను కనుక ఇలా అసలే మాట్లాడకూడదు. మనుషులందరికీ తిండి చేరితేనే దేశానికి ముందుకు నడిచే శక్తి అందుతుంది.నిజానికి ఇండియా కంటే చైనాలోనే తిండి ధ్యాస ఎక్కువ. కానీ వాళ్ల స్టార్టప్‌లు... ఈవీలు, ఏఐలు, సెమీ కండక్టర్లు, రోబోటిక్స్, గ్లోబల్ లాజిస్టిక్స్, ట్రేడ్, డీప్ టెక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఎక్కువగా పని చేస్తున్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’ అన్నారు. అటల్ బిహారి వాజ్‌పేయి ఆ నినాదానికి ‘జై విజ్ఞాన్’ను జోడించారు. మోదీజీ ‘జై అనుసంధాన్’ అనే మాటను చేర్చి... ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ అన్నారు. సిపాయి ఎంతో, రైతు ఎంతో, విజ్ఞానం ఎంతో, పరిశోధన అంత ముఖ్యం దేశ భవిష్యత్తుకు!‘‘మీరు డెలివరీ బాయ్స్‌ని, డెలివరీ గర్ల్స్‌ని సృష్టించటంతోనే ఆగిపోతారా?’’ అని... స్టార్టప్ మహాకుంభ్‌కు వచ్చిన ఇండియన్ ‘స్టెమ్’ గ్రాడ్యుయేట్లను నేను అడిగాను. అది కేవలం అడగటం మాత్రమే కాదు... థామస్ ఆల్వా ఎడిసన్‌లా శాస్త్ర విజ్ఞానాన్ని, వ్యాపారాన్ని కలిపి డెలివరీ చెయ్యమని చెప్పటం కూడా! స్టార్టప్ మహాకుంభ్ ముగిశాక భారత మండపం నుంచి బయటికి వచ్చేస్తూ, ‘‘ఏమైనా తిన్నారా?’’ అని ఆ యంగ్ గ్రాడ్యుయేట్లను అడిగాను. అడగాలని అడగలేదు. అనుకోకుండా అలా అడిగేశాను. ఇంటికి రాగానే సీమ కూడా నన్ను అదే మాట అడిగింది... ‘‘ఏమైనా తిన్నారా?’’ అని!! ఇండియాలోని విశేషం.. తింటూ మాట్లాడటం, తింటూ పని చేయటం మాత్రమే కాదా? ‘‘తిన్నావా?’’ అని అడగటం కూడానా!!గొప్ప టెక్నాలజీని కనిపెట్టటం మాత్రమే కాదు, సాటి మనిషిని ‘‘తిన్నారా?’’ అని అడిగి కనుక్కోవటం కూడా ఎప్పటికప్పుడు ఒక గొప్ప ఇన్వెన్షనే అనిపిస్తోంది నాకిప్పుడు! - మాధవ్ శింగరాజు -
ఈ సుంకాలతో లాభనష్టాలు
భారత్ ఎగుమతులపై అమెరికా 26 శాతం దిగుమతి సుంకాన్ని విధించడం ఆర్థిక ఆందో ళనలకు దారి తీసింది. భారత్‌తో పోల్చిన ప్పుడు అధికంగా చైనాపై 40–60 శాతం (కొన్ని ఉత్పత్తులపై 100 శాతం వరకు), వియత్నాంపై 30–45 శాతం, థాయ్‌లాండ్‌పై 35–50 శాతం దిగుమతి సుంకాలను అమె రికా విధించింది. భారత్‌కన్నా తక్కువగా యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం, జపాన్‌పై 24 శాతం, దక్షిణ కొరియాపై 25 శాతం దిగుమతి సుంకాలను అమెరికా విధించింది.అమెరికా వాదన2024లో అమెరికాకు సంబంధించి భారత్ ఎగుమతుల విలువ 91.23 బిలియన్ డాలర్లు. భారత్ మొత్తం ఎగుమతుల విలువలో అమెరికా వాటా 18 శాతం. ఇదే సంవత్సరం అమెరికా ఉత్పత్తుల దిగుమతులలో భారత్ వాటా 2.6 శాతం. మొత్తంగా భారత్‌తో వాణి జ్యానికి సంబంధించి అమెరికా వాణిజ్య లోటు 2023–24లో 45.7 బిలియన్ డాలర్లు కాగా, 2024–25 (జనవరి వరకు) 22.9 బిలియన్ డాలర్లుగా నమోదయింది. అమెరికాకు సంబంధించిన పాసింజర్ వాహనాలపై 70 శాతం, యాపిల్స్‌పై 50 శాతం, ఆల్కహాల్‌పై 100 –150 శాతం దిగుమతి సుంకాలను భారత్ విధిస్తున్నప్పుడు, ప్రస్తుతం భారత్‌పై అమెరికా విధించిన 26 శాతం దిగుమతి సుంకం సమంజసమేనని అమెరికా వాదిస్తున్నది. ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య నియమావళికి విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తున్నదని అమెరికా భావిస్తున్నది.దిగుమతి సుంకాల పెంపు కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50తో పాటు చైనా, థాయ్‌లాండ్‌కు సంబంధించిన ముఖ్య సూచీల లోనూ క్షీణత ఏర్పడింది. 2023–24లో అమెరికాతో వాణిజ్యంలో చైనా మార్కెట్ వాటా 21.6 శాతం కాగా, వియత్నాం వాటా 19.3 శాతంగా, భారత్ వాటా 6 శాతంగా నిలిచింది. వివిధ దేశాలపై అమె రికా దిగుమతి సుంకాల పెంపు కారణంగా చైనా, వియత్నాంలతో పోల్చినప్పుడు భారత్ ఎగుమతులలో పోటీతత్వం పెరుగుతుందని భావించవచ్చు.సగటు అమెరికా దిగుమతి సుంకాల కారణంగా– భారత్‌లో రొయ్యలు, వస్త్రాలు, స్టీల్ రంగాలపై; చైనాలో సోలార్ పానల్స్, సెమీ కండక్టర్, స్టీల్, ఎలక్ట్రిక్ వాహనాలపై; వియత్నాంలో ఫుట్‌వేర్, ఎల క్ట్రానిక్స్, ఫర్నీచర్‌పై; థాయ్‌లాండ్‌లో ఆటో పరికరాలు, రబ్బరు ఉత్పత్తులపై ప్రభావం ఉంటుందని అంచనా.భారత్‌పై ప్రభావంప్రాథమిక కేటగిరీకి సంబంధించిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరిక రాలు, ఫార్మా ఉత్పత్తులు, విలువైన రాళ్ళు భారత్ నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మార్చి 2025లో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకొనే చర్యలో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై భారత్ దిగుమతి సుంకాన్ని తగ్గించడం వలన రెండు దేశాలకు పరస్పర ప్రయోజనం చేకూరుతుంది. ఆసియా ఖండంలోని ఇతర దేశాలతో పోల్చినప్పుడు సౌరవిద్యుత్, ఫార్మాసూటికల్స్, టెక్స్టైల్స్ – అప్పారెల్ రంగాలలో భారత్‌కు అధిక ప్రయోజనం ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా టెక్స్టైల్ – అప్పారెల్ రంగాలకు సంబంధించి పోటీ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత దిగు మతి సుంకాల నిర్ణయం కారణంగా అమెరికా మార్కెట్లో ఆ యా ఉత్పత్తులకు సంబంధించి భారత్‌కు పోటీ తగ్గుతుంది. చైనాకుసంబంధించిన సౌర ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకం కారణంగా చైనా సౌర ఉత్పత్తుల ధరలు పెరగడం వలన భారత్‌కు ప్రయోజనం చేకూరుతుంది. చైనాపై అమెరికా అధికంగా ఆధార పడటం తగ్గి భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలు మరింత పటిష్ఠమయ్యే అవకాశం ఉంది.భారత్ నుండి రొయ్యల ఎగుమతుల విలువ రూ. 22,000 కోట్లు కాగా, ఈ మొత్తంలో అమెరికా వాటా 44 శాతంగా ఉంది. ప్రస్తుతం అధిక సుంకాల కారణంగా భారత్ నుండి అమెరికా రొయ్యల ఎగుమతుల విలువలో తగ్గుదల ఏర్పడవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకు సంబంధించి అమెరికాలో భారత్ మార్కెట్ వాటా తగ్గుతుంది. వజ్రాలు, ఆభరణాల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. భారత్‌లో అనేక సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు హ్యాండిక్రాఫ్ట్ గార్మెంట్స్ ఎగుమ తులపై అధికంగా ఆధారపడ్డాయి. అధిక సుంకాల నేపథ్యంలోఎం.ఎస్.ఎం.ఇ. సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. తద్వారా ఆ యా సంస్థలలో లే ఆఫ్ కారణంగా ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుంది.సిద్ధించే ప్రయోజనాలుఅమెరికా దిగుమతి సుంకాలను ముఖ్యంగా వస్తువులపై విధించినందువలన భారత్‌లో పటిష్ఠంగా ఉన్న ఐటీ, సేవల రంగంపై ఈ ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది. భారత్ నుండి సాఫ్ట్వేర్ సర్వీ సులు, ఫైనాన్షియల్ టెక్నాలజీ, బిజినెస్ అవుట్ సోర్సింగ్‌కు సంబంధించి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఇంజినీరింగ్ వస్తువులకు సంబంధించి భారత్‌తో పోల్చినప్పుడు చైనా, యూరప్లపై అధిక సుంకాలు విధించిన కారణంగా అమెరికా కొనుగోలుదారులు భారత్ ఇంజినీరింగ్ ఉత్పత్తులపై దృష్టి సారించే వీలుంది. దానివల్ల భారత్ ఎగుమతులలో పెరుగుదల ఏర్పడుతుంది.చైనా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాల కారణంగా బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తిని భారత్‌లో చేపట్టే అవకాశం ఉంది. తద్వారా భారత్ అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే అవ కాశం ఉంటుంది. భారత్‌లో ఇప్పటికే అమలులో ఉన్న ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్టివ్ స్కీమ్’ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం) కారణంగా ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, సెమీ కండక్టర్లకు సంబంధించిన సంస్థలు భారత్‌లో అధికంగా ఏర్పాటవుతాయి. తద్వారా భార త్లో పెట్టుబడులు, ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతుల విలువలో పెరుగు దల కనబడుతుంది. అది స్థూల దేశీయోత్పత్తిలో కూడా పెరుగు దలగా ప్రతిఫలిస్తుంది.అమెరికా దిగుమతి సుంకాల కారణంగా ఇతర దేశాల వ్యవ సాయ ఉత్పత్తుల ధరలలో పెరుగుదల ఏర్పడుతుంది. తద్వారా భారత్ నుండి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌కు అమెరికా మార్కెట్లో డిమాండ్ పెరగడంతోపాటు భారత్ ఎగుమతుల విలువలో పెరుగుదల ఏర్పడుతుంది. ఎగుమతుల పరంగా ఇబ్బంది ఎదుర్కొనే నేపథ్యంలో (కొన్ని ఉత్పత్తులకు సంబంధించి) భారత్ లోని ఉత్పత్తి స్వదేశీ డిమాండ్‌ను తీర్చడానికి ఉపకరిస్తుంది. ఈ స్థితి దేశంలో కొన్ని ఉత్పత్తుల కొరతను నివారించడం ద్వారా సాధారణ ధరల స్థాయి తగ్గుదలకు దారితీస్తుంది.చేయాల్సిందిఅయితే, అమెరికా ఆటో పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే ఒత్తిడిని భారత్ సమీప భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే అమెరికాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించు కోవాలి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలతో భారత్ నూతన వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి.-వ్యాసకర్త ప్రొఫెసర్ అండ్ డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐ.ఎఫ్.హెచ్.ఇ., హైదరాబాద్- డా‘‘ తమ్మా కోటిరెడ్డి -
దాడి కోసం సాకుల వెతుకులాట
ఇరాన్ అణు కార్యక్రమం గురించి మార్చి 25న ఆసక్తికరమైన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. బయట అంతగా ప్రచారంలోకి రాని ఆ నివేదిక, అమెరికాకు చెందిన 18 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కలిసి రూపొందించింది. వాటిలో సీఐఏ, పెంటగాన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్, అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటివి ఉండటం గమనించదగ్గది. ఆ నివేదికను బట్టి, ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేయడం లేదు, చేయాలని కూడా అనుకోవటం లేదు.ఇది ఇరాన్ నాయకత్వం స్వయంగా చెప్తున్న విషయమే!్డ అయి నప్పటికీ అమెరికా నాయకత్వం, ఇజ్రాయెల్‌తో పాటు, అమెరికా ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తుందా అనిపించే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుశక్తి పర్యవేక్షణ సంస్థ ఇందుకు విరుద్ధమైన వాదనలు చేస్తూ వస్తున్నాయి. అణ్వస్త్రాల ఉత్పత్తికి వీలు లేదని అమెరికా హెచ్చరిస్తుండగా, అసలు శాంతియుత ఉపయోగానికా లేక ఆయుధాల కోసమా అనే దానితో నిమిత్తం లేకుండా అణు పరిశోధనలనే సహించబోమని ఇజ్రాయెల్ వాదిస్తున్నది. చర్చలకు సిద్ధం అంటున్నప్పటికీ...వాస్తవానికి ఇరాన్ అణు పరిశోధనా కేంద్రాలన్నీ ఐక్యరాజ్య సమితి అణుసంస్థ పర్యవేక్షణలో ఎప్పటి నుంచో ఉన్నాయి. తమ పరిశోధనలు, వాటి నియంత్రణల విషయమై పాశ్చాత్య దేశాలతో చర్చలకు సిద్ధమని గతంలోనూ ప్రకటించిన ఇరాన్ నాయకత్వం, నిరుడు ఇజ్రాయెల్‌తో క్షిపణుల రూపంలో ప్రతి దాడుల తర్వాత మరొకమారు స్పష్టం చేసింది. అటువంటి అంగీకార పత్రం ‘జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీఓఏ) పేరిట 2015 నుంచి ఉండేది కూడా! కానీ ట్రంప్ పోయినమారు అధ్యక్షునిగా ఉన్నప్పుడు అమెరికా దాని నుంచి ఏకపక్షంగా ఉపసంహరించుకున్నది. ఇపుడు తిరిగి ఆ విషయమై చర్చలకు యూరోపియన్ దేశాలు సుముఖంగా ఉన్నా ఇజ్రాయెల్ అంగీకరించటం లేదు. అమెరికా ఒకవైపు చర్చలంటూ, మరొకవైపు బాంబింగ్ అని బెదిరిస్తున్నది. అయితే చర్చలు మధ్యవర్తుల ద్వారా తప్ప ప్రత్యక్షంగా జరిపే ప్రసక్తి లేదని ఇరాన్ స్పష్టం చేస్తున్నది.దీన్నిబట్టి అర్థమవుతున్నదేమిటి? అమెరికా, ఇజ్రాయెల్‌లకు కావలసింది ఇరాన్ శాంతియుత వినియోగానికైనా సరే అణు పరిశో ధనలు జరుపుకొనేందుకు వీలు లేదు. ఇరాన్ నుంచి అమెరికాకు మధ్య సుమారు 7,000 మైళ్లు, యూరప్‌తో సుమారు 1,500 మైళ్ల దూరం ఉంది. ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయనుకున్నా వాటి నుంచి ముప్పు ఉండేది మొదట యూరప్‌కు. అయినప్పటికీ ఇరాన్ ప్రతిపాదించిన ప్రకారం చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారు. ఇరాన్ అణ్వస్త్ర ప్రయోగం అమెరికాపై చేయాలంటే వాటిని అంతదూరం మోసుకుపోగల దీర్ఘశ్రేణి క్షిపణులు, బాంబర్లు అవసరం. ఇరాన్ వద్ద ఇటు అణ్వస్త్రాలుగానీ, అటు క్షిపణులూ బాంబర్లుగానీ లేవని అమె రికాకు తెలుసు. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల వద్ద అవన్నీ వేలాదిగా ఉన్నాయి. అయినప్పటికీ ఎందుకీ వైఖరి? ఇక్కడ అర్థమవుతుంది రహస్యం. ఇరాన్ భౌగోళికంగా పశ్చిమాసియాలో భాగం. ఆ ప్రాంతం యావత్తూ పాశ్చాత్య శక్తులకు రెండు కారణాల వల్ల ముఖ్యమైనది. ఒకటి – తమ సామ్రాజ్యవాద భౌగోళిక వ్యూహాల దృష్ట్యా. రెండు, ఇరాన్ సహా ఆ ప్రాంతపు దేశాలన్నింటా గల అపారమైన చమురు నిక్షేపాలు. గాజా యుద్ధం ముమ్మరంగా సాగుతుండిన రోజుల్లో ఇజ్రాయెల్ తాము గాజాతో ఆగబోమని, మొత్తం పశ్చిమాసియా చిత్రాన్నే మార్చివేయగలమని ప్రకటించింది. ఆ మార్పులో భాగంగా ఇరాన్ ప్రస్తుత నాయకత్వాన్ని లేకుండా చేయగలమని బాహాటంగా హెచ్చరించింది. ఇరాన్లో ప్రస్తుత నాయకత్వం పట్ల ప్రజలలో కొంత అసంతృప్తి ఉన్న మాట నిజం. కానీ ఆ స్థాయి ఎక్కడైనా మామూ లుగా ఉండేదేగానీ తీవ్రమైనది కాదు. అటువంటిది ఉంటే ప్రజాగ్రహంతో ఇరాన్ షా 1979లో పతనమైనట్లు జరిగేది. లేదా యూరప్‌లోని జార్జియా, ఉక్రెయిన్, కిర్గిజ్‌స్థాన్, యుగోస్లావియా వంటి దేశాలలో సీఐఏ ప్రోత్సాహంతో ‘కలర్ రివల్యూషన్స్’ పేరిట ప్రభుత్వాలను కూలదోయటం, దేశాలనే చీల్చటం చేసినట్లు జరిగి ఉండేది. కానీ అవేవీ సాధ్యం కాగల పరిస్థితులు ఇరాన్లో లేవు.నేను ఒకసారి వారం రోజులపాటు ఇరాన్లో ఉండటం తటస్థించింది. అంతకు ముందు మొహమ్మద్ రజా పహ్లవీ చివరి నియంతగా ఉండిన కాలంలో, ఇండియాలోని పలు నగరాలలో చదువుతుండిన ఇరానియన్ విద్యార్థులు మా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి వచ్చి కొద్ది రోజుల చొప్పున హాస్టళ్లలో బస చేసి, షా పాలన పట్ల నిరసనలు ప్రకటించి వెళుతుండేవారు. అలాగే పాశ్చాత్య దేశాల పన్నుగడల పట్ల ఆ ప్రజల వ్యతిరేకతలు ఎంతటివో కూడా వారి ద్వారా తెలుస్తుండేవి. షా ప్రభుత్వంతోపాటు పహ్లవీ వంశ రాచరికం కూలిన దశాబ్దాల అనంతరం సైతం పాశ్చాత్య శక్తుల పట్ల వ్యతిరేకతలు ఎంతమాత్రం మారలేదని నేనక్కడ ఉన్న రోజులలో అర్థమైంది. అందుకు కారణం తమ పట్ల అమెరికా కూటమి విధానాలుగానీ, ఇజ్రాయెల్ కేంద్రిత వ్యూహాలుగానీ మారక పోవటమే!ఇరానే ఎందుకు లక్ష్యం?పాలస్తీనా సమస్యపై అరబ్ దేశాలకు, ఇజ్రాయెల్‌కు మధ్య యుద్ధాలలో ఇజ్రాయెల్ గెలవటం, ఈజిప్టు నేత గమాల్ అబ్దుల్ నాసర్ మృతితో పాన్ అరబిజం బలహీన పడటంతో అరబ్ రాజ్యా లకు ఇజ్రాయెల్ పట్ల రాజీ వైఖరి, అమెరికా కూటమి పట్ల సఖ్యత మొదలయ్యాయి. ఇజ్రాయెల్‌ను గుర్తించి దౌత్య సంబంధాలు నెల కొల్పుకోసాగాయి. పాలస్తీనాను నెమ్మదిగా మరచిపోయాయి. పాలస్తీనా నాయకుడు అరాఫత్ 2004లో మృతి చెందిన తర్వాత కొత్తగా అధికారానికి వచ్చినవారు అమెరికా, ఇజ్రాయెల్‌లకు పూర్తిగా మచ్చిక అయిపోయారు. హమాస్ కారణంగా ఇటీవలి యుద్ధం తలెత్తకపోయి ఉంటే బహుశా పాలస్తీనా విషయం అన్నదే క్రమంగా మరుగున పడేది. అరబ్ రాజ్యాలన్నీ పాలస్తీనాను ఇంచుమించు వదిలివేయగా, బలమైన మద్దతుగా నిలిచిన దేశం ఇరాన్. ఆసక్తికరం ఏమంటే, సున్నీ ముస్లిం దేశమైన పాలస్తీనాను సున్నీ అరబ్ రాజ్యాలు వదలివేయగా, షియా రాజ్యమైన ఇరాన్ వారి వెంట నిలిచింది. వారికి ఇరాన్ కనీసం పొరుగు దేశమైనా కాదు. పాలస్తీనా సమస్యతో తనకేమి సంబంధం అని భావిస్తే అడిగేవారు లేరు. అయినా ఇటువంటి వైఖరి తీసుకోవటం ఇజ్రాయెల్, అమెరికాలకు ఎంత మాత్రం సరిపడనిది అయింది. ఇరాన్‌తో అరబ్ దేశాలకూ సున్నీ–షియా భిన్నత్వం కారణంగా అరకొర సంబంధాలు మాత్రమే ఉన్నాయి.ఈ మొత్తం పరిస్థితుల మధ్య పశ్చిమాసియాలో ఇరాన్ ఒక్కటే ఇజ్రాయెల్, అమెరికాలకు ఏకైక శత్రు దేశంగా మిగిలింది. లెబనాన్, సిరియా, హిజ్బుల్లా, హౌతీలను ఏదో ఒక విధంగా దారికి తెచ్చు కోవచ్చు. కానీ ఇరాన్ సాధారణమైన శక్తి కాదు. అది గాక దాని వెంట రష్యా, చైనా ఉన్నాయి. పైపెచ్చు ఇటీవల ఉమ్మడి సైనిక విన్యాసాలు జరిపాయి. అణు రంగం విషయమై కూడా త్రైపాక్షిక చర్చలు నిర్వహించాయి. అణు ఇంధనం ఇరాన్ రియాక్టర్లలో ప్రస్తుతం 60 శాతం మేరకు శుద్ధి అయి ఉంది. శాంతియుత వినియోగానికి అది అవసరం. అణ్వస్త్రాల కోసం 90 శాతం శుద్ధి కావాలి. ఆ స్థాయికి వెళ్లగల సాంకేతిక శక్తి ఇరాన్‌కు ఉంది. కానీ అటువంటి ఆయుధాల తయారీ ఇస్లాంకు వ్యతిరేకమంటూ పాతికేళ్ల క్రితం ప్రకటించిన అధినాయకుడు అలీ ఖమేనీ ఇప్పటికీ అందుకు కట్టుబడి ఉన్నారు. అయినప్పటికీ ఇజ్రాయెల్, అమెరికాలు యుద్ధం చేయదలచిన వారికి సాకులు కరవా అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ద్విముఖ పోరు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఇటీవలి ఎన్కౌంటర్లో ఒక లేఖ బయటపడింది. మహిళా కమాండర్ మన్ కీకి నక్సల్ నేత మోటూ రాసిన ఆ లేఖను చూస్తే మునుపు ఎన్నడూ లేని విధంగా నక్సలైట్లలో నిస్పృహ ఆవరించి ఉన్నట్లు అనిపిస్తుంది. బోడ్కా నుంచి గామ్‌పూర్ వరకూ, దోడితుమ్నార్ నుంచి తోడ్కా వరకూ నక్సలైట్లకు సురక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయిందని ఆ లేఖలో పేర్కొన్నారు. భద్రతా దళాల నిరంతర నిఘా, దాడులు ఈ పరిస్థితిని తెచ్చాయి. నక్సలైట్లను 2026 మార్చ్ 31లోగా ఛత్తీస్‌గఢ్‌లో లేకుండా చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటన నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. బస్తర్, అబూర్nుమాడ్ అడవుల నుంచి గరియాబంద్ వరకూ భద్రతాదళాలు నిత్యం కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏడాది కాలంలో సుమారు 300 మంది నక్సలైట్లు మరణించగా, మరెందరో అరెస్ట్ అయ్యారు. లేదా లొంగిపోయారు. భారత అంతర్గత భద్రతకు వామపక్ష తీవ్రవాదం చాలాకాలంగా సవాలు విసురుతున్నది. రాజ్యాంగానికి సమాంతరంగా వ్యవస్థలు ఏర్పాటు చేసిన నక్సలైట్లను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్థంగా అణచివేయగలిగింది. ఇందుకోసం ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అనుసరించింది. ఒకవైపు అభివృద్ధి కార్యకలాపాలకు పెద్దపీట వేస్తూనే, ఇంకోవైపు భద్రతా దళాల కార్య కలాపాలనూ ముమ్మరం చేసింది. నక్సలైట్ల రాజ్యంలోకి...సామాజిక, ఆర్థిక వెనుకబాటు, దశాబ్దాల నిర్లక్ష్యం కారణంగా దేశంలో నక్సలిజం పెరిగిపోయింది. ఇది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు. వివక్షకు గురైన ప్రజలు, ప్రాంతాలు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచు కోలేదు. ఫలితంగా అక్కడ తిరుగుబాటు పుట్టుకొచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం అభివృద్ధి విషయంలోని లోటుపాట్లను సరిచేయడంతోపాటు, దేశాద్యంతం రాజ్యాంగ పరిధిలోనే పనిచేసేలా ద్విముఖ వ్యూహం అనుసరించింది. పట్టు కోల్పోయిన ప్రాంతాలను భద్రతా దళాలు మళ్లీ తమ స్వాధీనంలోకి తీసుకోగలిగాయి. ఒకప్పటి నక్సలైట్ల రాజ్యంలో ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పాటు చేయగలిగాయి.అయితే ఈ మార్పు ఒక్కరోజులో జరిగిందేమీ కాదు. కచ్చితమైన ప్రణాళికతో అమలు చేసిన ఈ వ్యూహం నక్సలైట్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించింది. వ్యూహా త్మక మోహరింపులు, నిఘా వర్గాలను బలోపేతం చేయడం, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ వంటి భద్రతాదళాల సాయంతో అతివాదుల అడ్డాలను నిర్వీర్యం చేయగలిగారు. అననుకూల పరిస్థి తుల్లో పనిచేసే ఈ భద్రతా దళాలు అత్యాధునిక డ్రోన్లు, నిఘా పరికరాలు, కృత్రిమ మేధ, ఉపగ్రహ ఛాయా చిత్రాల వంటి వాటి సాయంతో నక్సలైట్ల ఆట కట్టిస్తున్నాయి. తీవ్రవాద సంస్థల ఆర్థిక వనరులపై ఉక్కుపాదం మోపడం కూడా కీలకమైంది. ఎన్ఐఏ, ఈడీ వంటి సంస్థలు కొన్ని కోట్ల రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకుని నక్సలైట్ల వెన్నువిరిచాయి. పీఎంఎల్ఏ చట్టాలతో కఠిన చర్యలు తీసుకోవడంతో నక్సలైట్లకు ఆర్థిక దన్నుగా నిలిచిన వారినీ కట్టడి చేయగలిగారు. ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ పని చేయడం నక్సలైట్ల సమస్య గణనీయంగా తగ్గేందుకు ఒక కారణంగా నిలిచింది. మౌలిక సదుపాయాల్లో వృద్ధి కూడా నక్సలిజం అణచివేతకు సాయపడింది. 2014–2024 మధ్యకాలంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 11,503 కిలోమీటర్ల హైవేలు, 20 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు నిర్మించారు. ఫలితంగా అక్కడి ప్రజలు ఆర్థికంగా స్థిరపడేందుకు అవకాశాలు వచ్చాయి. వేలాదిగా ఏర్పాటు చేసిన మొబైల్ టవర్ల కారణంగా సమాచార వినిమయం సులువైంది. వెయ్యికి పైగా బ్యాంక్ శాఖలు, 937 ఏటీఎంల ఏర్పాటుతో ఈ ప్రాంతాలు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యాయి. నక్సలైట్ల ఆధ్వర్యంలో నడిచే ఆర్థిక వ్యవస్థ ప్రభావం తగ్గింది.తగ్గిన ప్రభావంఈ చర్యల ఫలితం సుస్పష్టం. 2004–2014 దశతో పోలిస్తే ఇప్పుడు హింసాత్మక ఘటనలు 53 శాతం, భద్రతా దళాల మరణాలు 73 శాతం తగ్గాయి. సాధారణ ప్రజల మరణాలు కూడా 70 శాతం మేరకు తగ్గడం గమనార్హం. ఏడాది కాలంలో ఛత్తీస్‌గఢ్‌లోనే 380 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పో యారు. 1,194 మంది అరెస్ట్ అయ్యారు. 1,045 మంది లొంగిపోయారు. నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య దేశవ్యాప్తంగా 2014 నాటి 126 నుంచి 12కు చేరుకోవడం విశేషం. నక్సలిజానికి ముగింపు పలికే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతాదళ సిబ్బంది కుటుంబాలను ఆదుకునే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. ఆయుష్మాన్ భారత్‌లో వీరిని భాగస్వాములను చేసింది. ఆరోగ్య సేవలను దగ్గరకు చేర్చింది. సుమారు లక్ష మందికి ఈ–హౌసింగ్ పోర్టల్ ద్వారా ఖాళీగా ఉన్న ఇళ్లలో ఆవాసం లభించింది. సెంట్రల్ పోలీస్ వెల్ఫేర్ ఫండ్‌కు తీసుకొచ్చిన మార్పుల కారణంగా ఎక్స్‌గ్రేషియా మొత్తం పెరిగింది. ‘భారత్ కే వీర్’ వంటి కార్య క్రమాలు వీరమరణం పొందిన వారి కుటుంబాలకు ఆధారంగా నిలుస్తున్నాయి.నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టడం చేయడంతోపాటు ఈ ప్రాంతాలకు బడ్జెట్ కేటాయింపులు కూడా మూడు రెట్లు పెరగడం విశేషం. నైపుణ్యాభివృద్ధి, గిరిజన యువతను భద్రతా దళాల్లో చేర్చుకోవడం, సామాజిక సేవా కార్యక్రమాలు ముమ్మరం చేయడం ద్వారా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలందరూ జన జీవన స్రవంతిలో భాగమయ్యేలా జాగ్రత్త తీసుకున్నారు.నక్సలిజానికి చరమగీతం పాడే ఈ దశలో ఇప్పటివరకూ సాధించిన విజయాలన్నీ అభివృద్ధి, భద్రత అన్న రెండు అంశాల మేళవింపునకు నిదర్శనంగా నిలుస్తాయి. కృతనిశ్చయం, విధానపరంగా స్థిరత్వం మాత్రమే నక్సలిజం అంతానికి పరిష్కార మార్గాలని రుజువు చేశాయి.- డాక్టర్ సువ్రోకమల్ దత్తా వ్యాసకర్త కన్జర్వేటివ్ పొలిటికల్, ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్ -
వైఫల్యాల వెనుక వ్యవస్థ లోపాలు!
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద మొత్తంలో అక్రమ నగదు కనిపించినట్లు గత వారం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ బయట పెట్టింది. అంతకు మునుపు, జస్టిస్ శేఖర్ యాదవ్ న్యాయవ్యవస్థ గౌరవప్రతిష్ఠలకు భంగం కలిగిస్తూ మాట్లాడారు. భారతదేశం మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తోందని జస్టిస్ శేఖర్ యాదవ్ గత డిసెంబరులో ఒక ప్రైవేటు కార్యక్రమంలో అనడం వివాదాస్పదమయింది. అప్పుడు ఆయనపై సరైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడీ రెండో కేసులో అంతటా నిరసన పెల్లుబుకటంతో ఆలస్యంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. న్యాయవ్యవస్థ స్పందనలు అర్థవంతంగా, బాధ్యతాయుతంగా ఉంటున్నాయా? లేవని సమా ధానం చెప్పుకునేటట్లయితే, జ్యుడీషియరీ జవాబుదారీతనం కోసం పనిచేయాల్సిన అంతర్గత విచారణ యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? ఇక న్యాయమూర్తుల ఎంపిక విధానం ఈ పరిస్థితికి దారి తీసిన రెండో సమస్య. హైకోర్టు స్థాయిలో జరిగే నియామకాల తీరు మరీ ఆందోళన కలిగిస్తోంది.న్యాయవ్యవస్థ జవాబుదారీతనాన్ని కాపాడవలసిన అంతర్గత యంత్రాంగం (ఇన్–హౌస్ మెకానిజం) గుణదోషాల్ని జస్టిస్ అజిత్ ప్రకాష్ షా ‘రోసలిండ్ విల్సన్ స్మారక ఉపన్యాసం’లో తీవ్రాతి తీవ్రంగా విమర్శించారు. ఇది 2019 నాటిదైనా నేటి సందర్భానికి అతికినట్లు సరిపోతుంది. మొట్టమొదటగా అంతర్గత వ్యవస్థ స్వభావం మీద ఆయన అస్త్రం ఎక్కుపెట్టారు. అది అనుసరించే పద్ధతులు ఎప్పటికప్పుడు తాత్కాలికంగా, ఇష్టాగోష్ఠిలా ఉంటాయి. ‘‘ఈ ప్రొసీజర్‌కు ఎలాంటి చట్టబద్ధ ప్రాతిపదిక లేదు’’. ‘‘ న్యాయ వ్యవస్థ లోపల దానికి ఉన్న మన్నన పరిమితం’’. ‘‘ఇందుకు నిదర్శనం – కమిటీ నివేదిక వ్యతి రేకంగా వచ్చిందని చెప్పి రాజీనామాకు సిద్ధపడిన న్యాయమూర్తి ఒక్క రంటే ఒక్కరూ లేకపోవటం...’’ అని ఆయన అంటారు. ‘‘న్యాయవ్యవస్థ దానికదే ఒక చట్టం, ఒక ప్రపంచం’’ అన్నట్లు అంతర్గత యంత్రాంగం పరిగణిస్తుందని జస్టిస్ షా మరీ ముఖ్యంగా ప్రస్తావించారు. వారిని వారే నియమించుకుంటారు. తమ ప్రవర్త నను నియంత్రించే విధివిధానాలను వారే అంతర్గతంగా రూపొందించుకుంటారు. ఇది ‘‘ఒక తరహా స్వీయపాలన’’ అంటూ, ‘‘ఏలాగైతే ఉండాలో కచ్చితంగా అందుకు భిన్నంగా ఉంది..’’ అని విమర్శించారు. అంతర్గత యంత్రాంగం వాస్తవ పనితీరు ఎలా ఉంటుందో తెలిపేందుకు పలు విమర్శలు ఉన్నాయి. న్యాయమూర్తుల నడత గురించి బహిరంగంగా చెప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నా, వారిపై ఇన్–హౌస్ విచారణలు ఏనాడూ జరగలేదు. అలాగే, జడ్జీల మీద నిర్దిష్ట ఆరోపణలు చేసిన కేసుల్లోనూ అంతర్గత విచారణకు ఆదేశాలు లేవు. న్యాయవ్యవస్థ జవాబుదారీతనం కోసం తటస్థమైన, అధికా రికమైన, చట్టబద్ధ యంత్రాంగం ఒకటి ఎందుకు ఉండాలో జస్టిస్ షా తీవ్ర పదజాలంతో వివరించారు. ‘‘న్యాయపీఠం మీద కూర్చున్న క్షణం నుంచీ వారి ప్రవర్తన ఎలా ఉండాలో నిర్దేశించే నైతిక వర్తన నియమావళి న్యాయమూర్తులకు మనసుల్లో పాతుకుపోయి ఉండాలి. కాని అలా ఉండదు. కచ్చితంగా చెప్పాలంటే, వారు తమ ముందుండే లాయర్లు, వాదులు, ప్రతివాదులు, నేరస్థులు, సాక్షులు, పోలీసుల మాదిరిగానే ఫక్తు సాధారణ మానవులు. వారు నిర్వహించే పదవుల స్వభావాన్ని బట్టి వారికి నైతికతను ఆపాదిస్తే అది మోసం, ప్రమాదకరం...’’ అన్నారు.న్యాయమూర్తుల నడత, ప్రవర్తన గురించి మాట్లాడుకుంటు న్నాం కాబట్టి, వారి ఎంపిక విధానం గురించిన ప్రశ్న తలెత్తక మానదు. కొలీజియం వ్యవస్థ పరిపూర్ణంగా పనిచేయడం లేదన డంలో సందేహం లేదు. మనకు వేరొక విధానం కావాలి. దాని గురించి మాట్లాడుకునే ముందు, ప్రస్తుత కొలీజియం వ్యవస్థ ఎక్కడ విఫలమైందో చూద్దాం.జస్టిస్ షాతో నేను ఈ విషయం మాట్లాడినప్పుడు, ఆయన పలు అంశాలు చెప్పారు. మొదటిది – జడ్జీలను ఎంపిక చేయడానికి ఇవీ అంటూ చెప్పగలిగిన ఆమోదిత ప్రమాణాలేవీ లేవు. అంతా ‘‘అడ్ హాక్’’గా ఉన్నట్లు ఉంటుంది. నోటిమాట చెల్లుబాటు అవుతుంది. తరచూ ఇష్టులకే పెద్దపీట వేస్తారు.ఎంపికల్లో అత్యుత్తములను నిర్లక్ష్యం చేయడం కూడా పరిపాటి. ఇది మరీ ఆందోళనకరం. కొట్టొచ్చినట్లు కనబడే రెండు ఉదాహ రణలు జస్టిస్ షా చెప్పారు. జస్టిస్ అకిల్ ఖురేషీ, జస్టిస్ మురళీధర్‌లు సుప్రీం కోర్టులో స్థానం పొందలేకపోయారని, సుప్రీంలో ప్రవేశించ డానికి వారు పూర్తిగా అర్హులని ఆయన విశ్వసిస్తారు. ఎంపిక ప్రక్రియ నుంచి ప్రభుత్వాన్ని దూరం పెట్టడానికి కొలీజియం వ్యవస్థ రూపొందింది. అయినప్పటికీ ప్రభుత్వం తాను చేయగలిగినంతా చేయగలదు. పార్లమెంటులో మంచి మెజారిటీ ఉన్న ప్రభుత్వం కొలీజియం సిఫారసులను తొక్కిపట్టగలదు. అంటే ఏదైతే జరగకూడదన్న భావనతో కొలీజియం ఏర్పడిందో దొడ్డిదారిన అదే జరుగుతోంది. ఏమైనప్పటికీ, హైకోర్టు జడ్జీల నియామక స్థాయిలో కొలీజియం వ్యవస్థ అత్యంత బలహీనమైనదని భావించాలి. ఇది ఆందోళనకర పరిస్థితి. ఎందుకంటే, సుప్రీంకోర్టులో బహుశా 95 శాతం మంది న్యాయమూర్తులు హైకోర్టు జ్యుడీషియరీ నుంచే ఎంపిక అవుతారు. హైకోర్టు జడ్జీల నియామకాలు లోపభూయిష్ఠంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం సుప్రీం కోర్టు మీదా పడుతుంది. చివరగా, మనం చర్చించిన రెండు సమస్యలూ... అంతర్గత యంత్రాంగం, నియామక విధానం... ఏమాత్రం అలక్ష్యం చేయదగి నవి కావు. ఈ అలక్ష్యం మన న్యాయవ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. వాస్తవానికి వీటికి దేనికదిగా కాకుండా, రెంటికీ కలిపి పరిష్కారం ఆలోచించాలి. పాలక, న్యాయ వ్యవస్థల పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది. మరి ఇందుకు అవి సిద్ధంగా ఉన్నాయా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చక్రవర్తులందరూ పన్నులను వడ్డించినవారే!
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ క్రూరుడూ, హిందూ వ్యతిరేకీ కాబట్టి, మహారాష్ట్రలో ఉన్న అతని సమాధిని తవ్వి తీసిపారెయ్యాలని డిమాండ్ చేస్తూ, నాగపూర్‌లో, వారం కిందట, కొన్ని హిందూ సంస్థలు సభలూ, నిరసన ప్రదర్శనలూ జరిపాయి. ఔరంగజేబు సమాధిని తీసెయ్యనక్కరలేదనీ, అతను అంతిమంగా మరాఠా ప్రజల చేతుల్లో ఓడిపోయాడు గనక, అతని సమాధి, మరాఠా ప్రజల వీరత్వానికి గుర్తుగా ఉంటుందని చీలిన శివసేనలోని ఒక పక్షం వాదన. తీసేస్తే తీసెయ్యండి, కానీ మహారాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి– అని కూడా ఒక విమర్శ. ఇటీవల వచ్చిన, హిందీ సినిమా ‘ఛావా’లో చూపించినట్టు... ఔరంగజేబు క్రూరుడు కాదనీ, ఎన్నో మంచిపనులు కూడా చేశాడనీ, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒక ముస్లిం సభ్యుడు అన్నాడు. వివాదం పెరిగి పెద్దదై, నాగపూర్‌లో చిన్న స్థాయి మతకలహాల వంటివి జరిగి షాపులూ, ఇళ్ళూ, వాహనాలూ ధ్వంసం అయ్యాయి. 50మందికి గాయాలయ్యాయట! ఇంగ్లీషూ, హిందీ టీవీ చానళ్ళలో ఈ వివాదంపై చర్చలు చూపించారు. ఇదే సమయంలో ఛత్రపతి శివాజీ ఎంత గొప్ప ప్రజానుకూల చక్రవర్తో వాదించిన వారున్నారు. ఔరంగ జేబ్ సైన్యంలో కీలకమైన పదవుల్లో హిందూ సైనికాధి కారులున్నారని వాళ్ళ జాబితా ఇచ్చిన వారున్నారు. అలాగే, శివాజీ సైన్యంలో కూడా, అతనికి ఎంతో నమ్మకస్తులైన ముస్లిం ఉన్నత సైనికాధికారులున్నారని వాళ్ళ పేర్లు చెప్పారు. ఈ చర్చల్లో ముస్లిం చక్రవర్తుల్ని ప్రజా వ్యతిరేకులుగానూ, హిందూ చక్రవర్తుల్ని ప్రజలకు అనుకూలురుగానూ వాదించు కోవడమే ఎక్కువగా కనిపించింది. పత్రికల్లోగానీ, టీవీ డిబేట్లలో గానీ, అసలు ప్రపంచ చరిత్రలో చక్రవర్తులనేవారు, వాళ్ళు ఏ మతస్థులైనా, పాలకవర్గ ప్రతినిధులనీ, పాలకవర్గం ఎప్పుడూ ప్రజలకు అనుకూలంగా ఉండజాలదనీ వివరించే వర్గ సిద్ధాంత దృష్టితో ఒక్క మాటంటే ఒక్క మాట చెప్పిన వారు లేరు. ఆ దృష్టికోణాన్ని పట్టించుకోకపోతే, సత్యానికి కళ్ళు మూసినట్టవుతుంది. చక్రవర్తులంటే, అనేక చిన్నా పెద్దా భూభాగాల మీద పరిపాలన చేసే వాళ్ళు గదా? ఉదాహరణకి, ఔరంగజేబ్ (1618–1707) అయినా, శివాజీ (1630–1680) అయినా, చక్రవర్తులుగా విశాలమైన భూభాగాలను వారి కాలంలో పాలించారు. వారు ఎవరితో కలిసి ఎవరిని ఓడించారో, ఎన్నెన్ని ప్రాంతాలను ఆక్రమించారో, ‘ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ, కైఫియతులూ’ ఇక్కడ చెప్పు కోలేము. అదంతా రకరకాల చరిత్ర పుస్తకాలలో దొరుకుతుంది. వారి ప్రభుత్వాలలో కూడా ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, సైనిక శాఖ, ఇతర అనేక రకాల శాఖలూ ఉన్నాయి. ఏకాలంలో అయినా, ఏ ప్రభుత్వమైనా పరిపాలన చెయ్యాలంటే, తప్పనిసరిగా కావలిసినవి పన్నులే. చరిత్రనించీ, మార్క్స్ గ్రహించి చెప్పినది ఇదే: ‘అధికార గణానికీ, సైన్యానికీ, మత గురువులకూ, కోర్టులకూ, క్లుప్తంగా చెప్పాలంటే, మొత్తం కార్యనిర్వాహక అధికార యంత్రాంగపు మనుగడకీ ఆధారం... రాజ్యానికి అందే పన్నులే! పన్నులు అంటే, ప్రభుత్వపు యంత్రాంగపు ఆర్థిక పునాది తప్ప, మరేమీ కాదు’. అయితే, పన్నులు ఏ పేర్లతో వచ్చినా, ఏ రూపంలో చెల్లించినా, వాటి మూలం ఎక్కడుంది? ఏ కాలం గురించి మనం మాట్లాడుతున్నామో, ఆ కాలానికి చెందిన శ్రామిక జనాల శ్రమలోనే ఉంది! అదెలాగో చూద్దాం. ఔరంగజేబు ప్రభుత్వమైనా, శివాజీ ప్రభుత్వమైనా ఆ కాలంలో రకరకాల పద్ధతుల్లో పన్నులు వసూలు చేసేవి. వసూళ్ళకు ఒక యంత్రాంగం ఉండడం తప్పనిసరి. మనం మాట్లాడుకుంటున్న ఇద్దరు చక్రవర్తులూ పన్నులు ఎవరి దగ్గర్నించి ప్రధానంగా వసూలు చేశారు? వ్యవసాయ రంగం నించీ. అలాగే, ఆనాటి పరిమితుల్లో ఉండిన పరిశ్రమలనించీ, సరుకులతో వ్యాపారం జరిపే వర్తకుల నించీ! అసలు, ఒక రాజ్యంలో ఉండే భూములు ఎవరి అధీనంలో ఉంటాయి? వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎవరు? పంటలు పండించేది ఎవరు? (1) జమీందారులనీ, మిరాసీదారులనీ, రకరకాల పేర్లతో ఉండే పెద్ద భూస్వాములు. వీళ్ళసలు ఒళ్ళు వంచరు. అంతా కౌలు రైతులు ఇచ్చే కౌలు మీదే ఆధారపడతారు. ఏ శ్రమా చెయ్యకుండా, కౌలు రైతులనించి గుంజిన కౌలులో నించే, చక్రవర్తికి శిస్తుగానీ, కప్పం గానీ, రకరకాల పన్నులు గానీ కడతారు. (2) సొంత శ్రమల మీదే, ప్రధానంగా ఇంటిల్లిపాదీ, కష్టపడి జీవించే ‘స్వతంత్ర రైతులు’. వీళ్ళు కట్టే శిస్తులు గానీ, పన్నులు గానీ అన్నీ వీళ్ళ సొంత శ్రమ వల్లనే కడతారు. (3) సొంత శ్రమ మీదే కాక, కొంత ఇతరుల శ్రమల మీద కూడా ఆధార పడి జీవించే రైతులు వీళ్ళు. వీళ్ళు కట్టే పన్నులు కూడా, వీరి సొంత శ్రమలో నించీ కొంతా, ఇతరుల నించీ వచ్చిన అదనపు శ్రమ నించీ కొంతా. (4) వ్యవసాయ శ్రామికులు. వీళ్ళు లేకుండా వ్యవసాయంలో ఏ దశలోనూ, ఏ పనీ జరగదు. వీళ్ళని పనిలో పెట్టుకునే వారు, వారు పేద రైతులైనా, కొంత మెరుగైన స్థితిలో ఉన్న వారైనా, కౌలు రైతులైనా, ఈ కూలీల శ్రమ మీద ఆధారపడే వారే! వీళ్ళకి ‘కూలి’ అనేది డబ్బు రూపంలో ఇచ్చినా, ధాన్యం రూపంలో ఇచ్చినా, వాళ్ళకి అందేది వాళ్ళ శ్రమ శక్తి విలువే. మొత్తం శ్రమ విలువ కాదు. శ్రమ శక్తి విలువ అంటే, మర్నాడు వచ్చి పని చెయ్యడానికి శ్రామికులకి కావలిసిన జీవితావసరాలకు తగ్గ జీతం అన్నమాట. శ్రమ విలువ అంటే, తాము జీతం రూపంలో తీసుకునే విలువా, యజమాని లాభంగా మిగుల్చు కునే అదనపు విలువా కూడా కలిసినదే. వ్యవసాయ రంగం నించీ వచ్చే పన్నులు ఎక్కువ భాగం ఈ అదనపు విలువలో నించీ తీసి ఇచ్చేవే!ఆ కాలపు రెవెన్యూ చరిత్ర ప్రకారం, ఈ ఇద్దరు చక్రవర్తులకీ ప్రధానమైన ఆదాయం వ్యవసాయ రంగం నించే వచ్చేది. వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. ‘శిస్తు’ అనీ, ‘చౌత్’ అనీ, ‘జప్త్’ అనీ, ‘సర్దేశ్ ముఖీ’ అనీ, ఇంకేవో పేర్లు. అవన్నీ మనకి అనవసరం. భూమి వైశాల్యాన్ని బట్టో, సారాన్ని బట్టో, వచ్చిన పంట మొత్తాన్ని బట్టో కొంత భాగం పన్ను కట్టాలి. వీటిని చెల్లించే వారిని రైతులనీ, జమీందారులనీ, మిరాశీ దారులనీ, కౌల్దారులనీ... ఏ పేరుతో మనకి చెప్పినా, అసలు సంగతి కాయకష్టం చేసే రైతుల శ్రమని దోచడమే! ఈ ఆర్థిక సత్యాన్ని పట్టించుకోకుండా, ఈ చక్రవర్తి గొప్పా, ఆ చక్రవర్తి గొప్పా అనే తగువు అర్థం లేనిది. వ్యక్తిగత స్వభావాల్లో కొన్ని తేడాల వల్ల, కొందరు చక్రవర్తులు కొంత గంభీరంగానూ, కొందరు కొంత సాత్వికంగానూ, కొందరు కటువు గానూ, మరికొందరు కర్కశంగానూ, క్రూరంగానూ ఉంటారు. ‘ఏ రాయి అయితేనేమీ పళ్ళూడగొట్టుకోవడానికి?’ అనే నానుడిలో ఉన్న గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటే... చక్రవర్తులందరూ శ్రమ దోపిడీదారులే! మనం మాట్లాడుకునే చక్రవర్తుల కాలంలో చిన్న స్థాయిలో అయినా రకరకాల పరిశ్రమలు ఉండేవి. వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడిగానీ, ఇతరత్రా గానీ సరుకులు తయారయ్యేవి. ఉప్పూ, దూదీ, దారం, నేతా, నూనెలూ, చర్మంతో తయారు చేసే వస్తువులూ, నివాసాల సామగ్రీ... ఇలా ఎన్నో రకాల పరిశ్రమలూ, వర్తకాలూ ఉండేవి. పరిశ్రమల యజమానులైనా, వర్తకులైనా, కట్టే పన్నులు, వాళ్ళ దగ్గిర పనిచేసే శ్రామికులు ఇచ్చే అదనపు విలువలోనించే తీసి కడతారు. అంటే, మళ్ళీ శ్రమ దోపిడీ ద్వారానే! ఈ విషయాలు ప్రజలు గమనంలో ఉంచుకుంటే మత ఘర్షణలు తలెత్తవు. ప్రజల అనైక్యత నుంచి ఎన్నికల ప్రయో జనం పొందాలని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం గమనార్హం.బి.ఆర్. బాపూజీ వ్యాసకర్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవిశ్రాంత ఆచార్యులు -
నిజంగా హర్షణీయం!
కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని సమూలంగా మార్చేసింది. దాని పర్యవసానాల్లో ఒకటి, బయటికి వెళ్లే పనిలేకుండా చేయగలిగే పనుల గురించి ఆలోచించడం. అలాంటి ఒక కారణంతో మొదలైన ‘హర్షణీయం’ తెలుగు పాడ్‌కాస్ట్, సమస్త సాహిత్య ప్రపంచాన్ని తెలుగు గడపలోకి తెచ్చిపెట్టింది. అంతేనా? అనువాద ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే ఏ భాషవారికైనా ఒక ఆన్ లైన్ నిధిగా రూపొందింది. 2020 మార్చ్‌లో ముందు తెలుగులో ప్రారంభమై, తర్వాత తెలుగు– ఆంగ్లంగా మారి, అటుపై ఆంగ్లంలోకి కూడా వ్యాపించిన ఈ పాడ్‌కాస్ట్ ‘నూరు మంది అనువాదకుల’ సిరీస్‌ను ఇటీవలే ముగించుకుంది. ఇందులో మలయాళం, తమిళం, కన్నడం, గుజరాతీ లాంటి భారతీయ భాషల్లోంచి ఆంగ్లంలోకి అనువదిస్తున్నవారితో పాటు– థాయి, ఉజ్బెక్, వియత్నమీస్, హంగేరియన్, తుర్కిష్, నార్వేజియన్, మంగోలియన్, కిస్వాహిలీ లాంటి భాషల ఆంగ్లానువాదకుల ఇంటర్వ్యూలు ఉన్నాయి. దోస్తోవ్స్కీ ఉపరితల అంశాల మీద సమయం వృథా చేయరని చెబుతారు, గతేడాదే ‘బ్రదర్స్ కరమజోవ్’కు మరో ఆంగ్లానువాదం వెలువరించిన మైకేల్ ఆర్. కట్జ్. మనిషిని మలిచే కీలక క్షణాలు, విశ్వాసం, నైతికత, హింస, తీవ్రోద్వేగాల మీద దోస్తోవ్స్కీ దృష్టి ఉంటుందని అంటారు. పంతొమ్మిదో శతాబ్దపు రష్యన్ సాహిత్యాన్ని బోధించే మైకేల్ సుమారు 20 రష్యా నవలల్ని అనువదించారు. దోస్తోవ్స్కీ ‘నోట్స్ ఫ్రమ్ అండర్‌గ్రౌండ్’లోని తొలి 30 పేజీలు అనువాదానికి అసలు లొంగనివని ఆయన అభిప్రాయం. ఒక పుస్తకం పుట్టించే తక్షణ స్పందనే దాన్ని అనువాదానికి పూనుకునేలా చేస్తుందని చెబుతారు అరుణవ సిన్హా. పదహారేళ్ల కాలంలో సుమారు 80 పుస్తకాల్ని బంగ్లా నుంచి ఆయన ఆంగ్లంలోకి అనువదించారు. సగటున ఏడాదికి ఐదు పుస్తకాలు! ఒక దానిలో దిగితే అందులో మునిగిపోవడమే ఇంత వేగంగా అనువదించడానికి కారణమంటారు. ఫుట్‌నోట్ ఇవ్వాల్సి రావడాన్ని ఒక వైఫల్యంగా చూస్తారు హిందీ, ఉర్దూ నుంచి అనువాదాలు చేసే అమెరికన్ డైసీ రాక్వెల్. భాషల మీద ప్రేమతో ఆమె దాదాపు పదిహేను భాషలు నేర్చుకున్నారు. ఇంకా, కరీమ్ అబ్దుల్ రహమాన్ (కుర్దిష్), జెస్సికా కోహెన్ (హీబ్రూ), లోలా రోజర్స్ (ఫిన్నిష్) లాంటివాళ్లు ఈ పాడ్‌కాస్ట్‌లో తమ ఆలోచనలను పంచుకున్నారు. అనువాద క్రాఫ్ట్తో పాటు మొత్తంగా అనువాద ఎకో సిస్టమ్ గురించి ఇంత విస్తారంగా ఒకేచోట మాట్లాడిన పాడ్‌కాస్ట్ ప్రపంచంలో ఇంకోటి లేదని ఐస్లాండిక్ అనువాదకురాలు విక్టోరియా క్రిబ్ కితాబునివ్వడం హర్షణీయం అందుకున్న ప్రశంసల్లో ఒకానొకటి.మూడు దశాబ్దాలుగా స్నేహితులైన ఇంజినీరింగ్ క్లాస్మేట్లు హర్ష, అనిల్, గిరి ఉద్యోగాలు చేస్తూనే, పాఠకులుగా తమ అభిరుచితో ‘హర్షణీయం’ మొదలుపెట్టారు. ఇందులో హర్ష కథకుడు, అనిల్ అనువాదకుడు, గిరి సాంకేతిక నిపుణుడు. వక్తలను ఎంచుకోవడం, ప్రశ్నలు కూర్చుకోవడం ముగ్గురూ కలిసి చేస్తారు. ఎడిటింగ్ బాధ్యత కుదిరినవాళ్లు తీసుకుంటారు. ఇంటర్వ్యూలు మాత్రం అనిల్ చేస్తారు. సాహితీవేత్తలను ఇంటర్వ్యూలు చేయడంలో ప్రొఫెసర్ మృణాళిని ‘అక్షర యాత్ర’ తమకు స్ఫూర్తి అంటారు. ముందు తెలుగు రచయితల సంభాషణలతో మొదలుపెట్టి, తర్వాత ఇరవై నాలుగు రాష్ట్రాల్లోని పర్యావరణవేత్తల అభిప్రాయాలకు వేదికై, బిభూతీభూషణ్ బంధోపాధ్యాయ ‘వనవాసి’ నవలను యాభై వారాలు ఆడియోగా ఇచ్చి, తర్వాత అనువాదకుల వైపు మళ్లారు. లోప్రొఫైల్‌లో ఉండే అనువాదకుల మెయిల్స్, కాంటాక్ట్ నంబర్స్ సంపాదించడం, వాళ్లకు తమ వివరాలు చెబుతూ సందేశాలు పంపడం, ఒక్కోసారి ఎనిమిది నెలల తర్వాత కుదురుతుందని చెబితే వేచివుండి(ఉదా: మైకేల్ కట్జ్) మళ్లీ సంప్రదించడం, ప్రశ్నలు ముందే పంపడం, విదేశీయుల సమయాన్ని బట్టి రాత్రుళ్లు మాట్లాడటం, వివాదాల జోలికి పోకుండా పుస్తకాల మీదే ఫోకస్ పెట్టడం వీళ్ల పనితీరు. ఎక్కువ అనువాదాలు జరిగే ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్ అనువాదకులు కూడా సహజంగానే ఈ పాడ్‌కాస్ట్‌లో చోటుచేసుకున్నారు. ‘ది హర్షణీయం పాడ్‌కాస్ట్ అండ్ ఇట్స్ ఇటాలియన్ లిటరేచర్ ఇన్ ట్రాన్ ్సలేషన్ ’ పేరుతో ‘ద గ్లోబల్ లిటరేచర్ ఇన్ లైబ్రరీస్ ఇనీషియేటివ్’ 2024 నవంబర్‌లో వీళ్ల పాడ్కాస్ట్ట్ను ప్రస్తావించడం విశేషం. కొన్నింటికి కాలం కూడా కలిసిరావాలి. ఇంకో కాలంలో అయితే ఇలాంటిది జరిగే అవకాశం లేదు. కొన్ని మెయిల్స్‌తో, ఒక్క ఫోన్‌కాల్‌తో ప్రపంచంలో ఎక్కడో ఉన్నవారితో సంభాషించడం ఎలా సాధ్యం? కాని కలిసొచ్చే కాలంలో కూడా ఎంతమంది ఇలాంటి పనికి పూనుకున్నారు? అందుకే వీళ్ల పని హర్షణీయం.తెలుగు భాషలోని 56 అక్షరాలన్ని దేశాల వారితోనైనా మాట్లాడాలని సరదాగా వీళ్లు పెట్టుకున్న లక్ష్యం నెరవేరింది. అనువాదకుల సిరీస్‌లో భాగంగా, గతేడాది ప్రతిష్ఠాత్మక బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ లాంగ్‌లిస్ట్‌లోని పదముగ్గురు అనువాదకులతోనూ సంభాషించారు. ఈ ఏడాది లాంగ్‌లిస్ట్‌లోని రిఫరెన్సుల్ని సాక్షాత్తూ ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్’ అడ్మినిస్ట్రేటర్ ఫియమెత్తా రోకో ఇచ్చి ఇంటర్వ్యూలకు సహకరించడం వీళ్ల విశ్వసనీయతకు చిహ్నం. ఈ సంభాషణలు ఈ ఏప్రిల్‌లోనే ప్రసారం అవుతాయి. అక్కడివాళ్లను ఇక్కడికి తెస్తున్నారు సరే, తెలుగువాళ్లు అటుపోయే మార్గమేమిటి? ‘తెలుగులో గొప్ప రచయితలు చాలామంది ఉన్నారు. కానీ ముందు ఆంగ్లంలోకి అనువాదం కావడం; ముఖ్యంగా యూకే, యూఎస్‌లో ప్రచురితం కావడం అతిపెద్ద సవాలు. దానికి నాణ్యమైన అనువాదకులతో పాటు నిబద్ధత ఉన్న ప్రచురణకర్తలు అవసరం’ అని చెబుతారు అనిల్. తెలుగు సాహిత్యంలో ఆ వాతావరణం క్రమంగా చోటుచేసుకుంటోందనీ, రెండేళ్లలో సానుకూల మార్పు చూడబోతున్నామనీ అంటారు. ఇది ఇంకోరకంగా హర్షణీయం. -
జాతి పునర్నిర్మాణంలో... 'ఆర్ఎస్ఎస్'@100
దేశమాత సేవలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నూరు వసంతాలను పూర్తిచేసుకుంటున్న తరుణంలో, ఈ మైలు రాయిని సంఘ్ ఏ విధంగా పరిగణిస్తుందో అనే విషయంలో ఒక స్పష్టమైన జిజ్ఞాస ఉంటుంది. ఇలాంటి సందర్భాలు... ఉత్సవాల కోసం కావని, ఆత్మపరిశీలన చేసుకుని, లక్ష్యసాధనకు పునరంకితం కావడానికి వీటిని అవకాశంగా తీసుకోవాలన్నది సంఘ్ స్థాపించినప్పటి నుండి సుస్పష్టమైన విషయం. అదే సమయంలో, ఈ మహోద్యమానికి మార్గదర్శకులైన మహనీయ సద్గురువులు, నిస్వార్థంగా ఈ మార్గంలోకి ప్రవేశించిన స్వయంసేవకులు, వారి కుటుంబాల స్వచ్ఛంద సహకారాన్ని స్మరించుకునేందుకు ఇదొక అవకాశం. ప్రత్యేకించి, సంఘ్ స్థాపకులైన డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ జయంతి సుదినమే హిందూ కాలదర్శినిలో మొదటి రోజైన వర్ష ప్రతిపద కూడా అయిన తరుణంలో... ఈ నూరు సంవత్సరాల ప్రయాణాన్ని పునర్దర్శనం చేసుకునేందుకు, సమరసతతో కూడిన సమైక్య భారతావని దిశగా సంకల్పం చేసుకునేందుకు ఇంతకు మించిన అనువైన సందర్భం మరేముంటుంది? దేశం కోసం జీవించేలా...డాక్టర్ హెడ్గేవార్‌లో భారతదేశం పట్ల అహంకార రహితమైన ప్రేమ, అఖండమైన అంకితభావం చిన్నతనం నుంచే కనపడింది. కోల్‌కతాలో తన వైద్య విద్యను పూర్తిచేసేనాటికే, సాయుధ విప్లవం నుంచి సత్యాగ్రహం వరకూ భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తిని కలిగించేందుకు చేపట్టిన అన్ని రకాల ప్రయత్నాలతోనూ ఆయనకు అనుభవం ఉంది. అదే సమయంలో దైనందిన జీవితంలో దేశభక్తి లేకపోవడం, సంకుచిత ప్రాంతీయ విభేదాలకు దారితీసేలా ఉమ్మడి జాతీయ వ్యక్తిత్వం పతనం కావడం, సామాజిక జీవితంలో క్రమశిక్షణరాహిత్యం వల్ల భారతదేశంలో బయటివారి దురాక్రమణ సంభవించి వీరి స్థానం సులభతరమైందని ఆయన గ్రహించారు. ఎడతెగని దురాక్రమణలతో మన ఘనచరిత్రకు సంబంధించిన సామాజిక జ్ఞాపకాలను ప్రజలు మరచిపోయారని ఆయనకు అనుభ వానికి వచ్చింది. ఫలితంగా మన సంస్కృతి, జ్ఞాన సంబంధమైన సంప్రదాయం పట్ల నైరాశ్యభావం, ఆత్మన్యూనతాభావం చోటు చేసు కున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరో కొద్దిమంది నాయకుల నేతృత్వంలో జరిగే రాజకీయ కార్యకలాపాలు మన ప్రాచీన దేశపు సమస్య లను పరిష్కరించలేవన్న నిశ్చయానికి వచ్చారు. అందుకే, దేశం కోసం జీవించేలా ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు నిరంతర ప్రయత్నా లతో కూడిన ఒక పద్ధతిని రూపొందించాలని నిర్ణయించారు. రాజ కీయ పోరాటానికి అతీతంగా దార్శనిక దృష్టికోణంతో ఆయన చేసిన ఆలోచన ఫలితమే శాఖా పద్ధతి ఆధారంగా వినూత్నమైన పద్ధతిలో నడిచే సంఘం ఆవిర్భావం.ఈ ఉద్యమం, సిద్ధాంతాల క్రమబద్ధమైన పురోగతి ఒక అద్భు తానికి ఎంతమాత్రం తక్కువ కాదు. హెడ్గేవార్ ఈ భావజాలాన్ని సిద్ధాంతంగా రూపొందించలేదు, కానీ ఆయన ఒక కార్యాచరణ ప్రణాళికను విత్తన రూపంగా ఇచ్చారు, అది ఈ ప్రయాణంలో చోదక శక్తిగా నిలిచింది. ఆయన జీవితకాలంలో, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకూ సంఘ కార్యం విస్తరించింది.శాఖోపశాఖలుగా ‘శాఖ’మనం స్వాతంత్య్రాన్ని పొందినప్పుడు, అదే సమయంలో భారతమాతను మతం ఆధారంగా విచ్ఛిన్నం చేసినప్పుడు, పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ జనాభాను రక్షించి వారికి గౌరవ, మర్యాద లతో కూడిన పునరావాసాన్ని కల్పించడంలో సంఘ్ స్వయంసేవ కులు తమ అంకితభావాన్ని కనబరిచారు. సమాజం కోసం బాధ్యత, కర్తవ్యభావాలతో ముడిపడిన స్వయంసేవక్ అనే భావన విద్య, కార్మిక రంగం, రాజకీయరంగాల వంటి చోట తన శక్తిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. రెండవ సర్సంఘ్చాలక్ అయిన శ్రీ గురూజీ (మాధవ సదాశివ గోల్వాల్కర్) మార్గదర్శక శక్తిగా ఉన్న ఈ దశలో ప్రతి విషయం జాతీయ సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని పునర్వ్యవస్థీ కరించబడాలి! దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు రాజ్యాంగంపై క్రూర దాడి జరిగిన కాలంలో ప్రజాస్వామ్య పునరు ద్ధరణకు జరిగిన శాంతియుతపోరులో సంఘ్ స్వయంసేవకులు కీలక పాత్ర పోషించారు. రామజన్మభూమి విముక్తి వంటి ఉద్యమాలు సాంస్కృతిక విమోచనం కోసం భారతదేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలను అనుసంధానించాయి. జాతీయ భద్రత నుంచి సరిహద్దుల నిర్వహణ వరకు, పాలనా భాగస్వామ్య వ్యవస్థ నుంచి గ్రామీణాభి వృద్ధి వరకు, సంఘ్ స్వయంసేవకులు స్పృశించని అంశం లేదు. ప్రతి విషయాన్నీ రాజకీయ దృష్టికోణంతో చూసే ధోరణి ఉన్నప్పటికీ, సంఘ్ ఇప్పటికీ సమాజపు సాంస్కృతిక జాగరణపైన, సరైన ఆలోచనలు గల వ్యక్తులు – సంస్థలతో బలమైన అనుసంధాన వ్యవస్థను సృష్టించడంపైన దృష్టి పెట్టింది. సామాజిక పరివర్తనలో మహిళల భాగస్వామ్యం, కుటుంబ వ్యవస్థ పవిత్రతను పునరుద్ధరించడంపై గత కొన్ని సంవత్సరాలుగా సంఘ్ దృష్టి సారించింది. లోక మాత అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది వేడుకల సందర్భంగా సంఘ్ పిలుపుతో దేశమంతటా 27 లక్షల మందికి పైగా వ్యక్తులతో సుమారు 10 వేల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మన దేశ నాయకుల విషయంలో మనమంతా కలిసి ఎలా వేడుక చేసుకుంటున్నామో ఇది సూచిస్తుంది. సంఘ్ తన నూరవ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు బ్లాక్, గ్రామ స్థాయి వరకూ జాతి నిర్మాణం కోసం వ్యక్తి నిర్మాణ కార్యాన్ని కీలకంగా చేపట్టాలని సంఘ్ నిర్ణయించింది. గత ఏడాది కాలంలో పటిష్ఠమైన ప్రణాళికతో మరో పది వేల శాఖలను జోడించేలా కార్యాచరణ చేయడమన్నది అంకితభావానికి, అంగీకారానికి చిహ్నం. అయితే, ప్రతి గ్రామానికి, బస్తీకి చేరుకోవడ మనే లక్ష్యం ఇంకా ఒక అసంపూర్ణంగా ఉంది. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాబోయే సంవత్సరాలలో పరివర్తనకు ఉద్దేశించిన పంచ్ పరివర్తన్ అనే ఐదంశాల కార్యక్రమం ప్రధానంగా కొనసాగుతుంది. శాఖ నెట్‌వర్క్‌ను విస్తరించే క్రమంలో పౌరవిధులు, పర్యా వరణహితమైన జీవనశైలి, సామాజిక సమరసతా వర్తన, కుటుంబ విలువలు, స్వీయత్వ స్పృహపై ఆధారపడిన దైహికమార్పుపై దృష్టిని ఉంచింది. తద్వారా ప్రతి ఒక్కరూ ‘పరం వైభవం నేతు మేతత్ స్వరాష్ట్రం’ – మన దేశాన్ని మహావైభవ స్థితికి తీసుకువెళ్లే బృహత్ ప్రయోజనం కోసం తమ వంతు కృషి చేస్తారు.గత వంద సంవత్సరాలలో, సంఘ్ ఒక జాతీయ పునర్నిర్మాణ ఉద్యమంగా ప్రయాణించింది. ఎవ్వరినైనా వ్యతిరేకించడం పట్ల సంఘ్‌కి నమ్మకం లేదు. అలాగే, ఈ రోజున సంఘ్ పనిని వ్యతిరే కిస్తున్నవారు కూడా సంఘ్‌లో భాగమవుతారనే విశ్వాసాన్ని కలిగి ఉంది. ప్రపంచం పర్యావరణ మార్పుల నుంచి హింసాత్మక ఘర్షణల వరకు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో సత్వర పరిష్కా రాలను అందించే సామర్థ్యాన్ని భారతదేశపు ప్రాచీన, అనుభవ ఆధారిత జ్ఞానం కలిగివుంది. ఈ అతి పెద్దయిన, అనివార్యమైన కార్యం ఎప్పుడు సాధ్యమవుతుందంటే, భారతమాత పుత్రులందరూ తమ పాత్రను అర్థం చేసుకుని, ఇతరులు సైతం అనుసరించేలా ప్రేరేపించే దేశీయ నమూనాను నిర్మించడంలో తమ వంతు కృషి చేసినప్పుడే! ఇందుకోసం సజ్జన శక్తి నాయకత్వంలో సమరసతతో కూడిన సంఘటిత భారతీయ సమాజంలో ఆదర్శవంతులమై నిలిచే సంకల్పంతో ఏకమవుదాం!దత్తాత్రేయ హోసబాళె వ్యాసకర్త ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ (జాతీయ ప్రధాన కార్యదర్శి) -
పళనిస్వామి (ఏఐఎడీఎంకే) రాయని డైరీ
ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లో ఉన్న అమిత్‌షా నివాసానికి వెళ్లి, ఆయన్ని కలిసి బయటికి రాగానే... ఆ చీకట్లో మీడియా వాళ్లు నిలబడి మిణుగురుల్లా మెరుస్తూ ఉన్నారు!‘‘సర్! వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోతు న్నారట కదా? పొత్తు కుదుర్చుకోవటం కోసమే మీరు అమిత్‌షాను కలిసేందుకు వచ్చారా?’’ – ఆరంభ ప్రశ్న.‘‘లేదు లేదు, ఢిల్లీలో మా పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం పని మీద వచ్చాం...’’ అన్నాను. ‘‘సర్! మీ ఢిల్లీ ఆఫీస్‌ని మీరు ఫిబ్రవరి 10 నే వర్చువల్‌గా చెన్నై నుంచి ప్రారంభించారు కదా, మళ్లీ ఇప్పుడేమిటి! అమిత్షాతోగంటన్నరకు పైగా మాట్లాడారు. ఏడాదిన్నర క్రితం బీజేపీకి బ్రేకప్ చెప్పాక, తిరిగి ఇన్నాళ్లకు ఇప్పుడే కదా మీరు అమిత్‌షాను కలవటం!ఇంతసేపూ ఆయనతో ఏం మాట్లాడారు సర్ మీరు?’’ – ఆరాలు తీస్తున్న ప్రశ్న. ‘‘అలా ఏం లేదు. అమిత్జీని అనుకోకుండా కలిశాం...’’ అన్నాను.‘‘కానీ సర్, చెన్నై నుంచి ఉదయాన్నే మీరు ఢిల్లీ వచ్చారు. మధ్యాహ్నానికి మీ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేపీ మునుస్వామి, సీనియర్ లీడర్ వేలుమణి మీ వెనుకే ఢిల్లీకి రీచ్ అయ్యారు. సాయంత్రానికి ఢిల్లీలోనే ఉంటున్న మరో ఇద్దరు సీనియర్ లీడర్లు తంబిదొరై,సీవీ షణ్ముగం మీతో జాయిన్ అయ్యారు.అంతా కలిసి చీకటి పడ్డాక అమిత్‌షా నివాసానికి వెళ్లారు. అమిత్‌షాను కలవాలని అందరూ అనుకునే కలిశాక, అదెలా సర్ అమిత్‌షాను అనుకోకుండా కలవటం అవుతుంది?’’ – ఆధారాలు సేకరించిన ప్రశ్న!‘‘మీరనుకుంటున్నట్లు మేమేమీ చీకటి పడ్డాక అమిత్జీని కలవలేదు. అమిత్జీని కలిసేటప్పటికే చీకటి పడినట్లుంది. వెళ్లి కలిశాం, శాలువా కప్పాం, కాసేపు మాట్లాడాం. వచ్చేశాం...’’ అని నవ్వుతూ చెప్పాను.‘‘మరి, బీజేపీ వాళ్లు ఇంకోలా చెబుతు న్నారు కదా సర్?’’ – చీకట్లో విసిరిన ప్రశ్న!‘‘మేము లోపలికి వెళ్లినప్పుడు లోపల ఉన్నది మీరంటున్న బీజేపీ వాళ్లలో అమిత్జీ ఒక్కరే. ఆయనే మీకు చెప్పారంటారా,ఇంకోలా?’’ అని అడిగాను. ‘‘లేదు సర్, ‘కలిసి పోటీ చేద్దాం’ అని మీరు అమిత్‌షాను అడిగినప్పుడు, అందుకాయన ‘మీరు 117 సీట్లలో, మేము 117 సీట్లలో సగం సగం పోటీ చేయటానికి ఒప్పుకుంటేనే మీతో కలుస్తాం...’ అని మీకు కండిషన్ పెట్టారట కదా?! – ఊహించి వేసిన ప్రశ్న.‘‘ఇంకా?!’’ అన్నాను.‘‘పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్‌ని, శశికళను, పన్నీర్‌సెల్వంను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని కూడా అమిత్‌షా మీకు కండి షన్ పెట్టారట కదా సర్...’’ – ఇదైతే కచ్చితంగా బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై వేయించిన ప్రశ్న!పొత్తు కోసం నేను అమిత్జీ దగ్గరకు వెళ్లకుండా, అమిత్జీనే పొత్తు కోసం నా దగ్గరకు వచ్చి ఉంటే, ముందు ఆ అన్నామలైని మార్చి, వేరెవరినైనా బీజేపీ ఛీప్‌గా పెట్టమని నేనే కండిషన్ పెట్టి ఉండేవాడిని.‘‘చెప్పండి సర్! బీజేపీతో పొత్తు కోసం కాదా మీరు అమిత్‌షాను కలిసింది?’’ – తిరిగి మళ్లీ అదే ఆరంభ ప్రశ్న. ‘‘తమిళనాడులో డ్యామ్‌ల సమస్య ఉంది. స్కామ్‌ల సమస్య ఉంది. లాంగ్వేజీల సమస్య ఉంది. డీ–లిమిటేషన్ సమస్య ఉంది. డీఎంకే సమస్య ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మేము వాటి గురించి మాట్లాడి ఉండొచ్చని మీరెందుకు అనుకోరు?’’ అని అడిగాను. ‘‘బీజేపీతో పొత్తు కోసం మీరిక్కడికి వస్తే, అక్కడ చెన్నైలో అన్నామలై మీరంటే పడని వాళ్లందరితో పొత్తు పెట్టుకుంటున్నారు. దీనికేమంటారు సర్?’’ – ఇంకేదో రాబట్టే ప్రశ్న. నేనేమీ అనలేదు. డ్యామ్‌లు, స్కామ్‌లు, లాంగ్వేజీలు, డీ–లిమిటేషన్, డీఎంకే... వీటన్నిటికన్నా తమిళనాడుకు అతి పెద్ద సమస్య అన్నామలై... అని నాతో చెప్పించటానికే ఈ మిణుగురులు ఇక్కడికి చేరినట్లు నాకర్థమైంది! -
భాషా రాజకీయాల ఆట
తమిళనాడు తన బడ్జెట్ ప్రమోషనల్ లోగోలో భారత కరెన్సీ సింబల్‌కు బదులుగా తమిళ అక్షరం ‘రూ’ వాడి దేశవ్యాప్తంగా దుమారం లేవనెత్తింది. ఈ చర్య కేవలంసింబల్ వివాదం కాదనీ, ఇది భారత సమైక్యతను బలహీనపరుస్తుందనీ, ప్రాంతీయ అభిమానం మాటున వేర్పాటువాద సెంటిమెంటును రెచ్చగొడుతుందనీ విమ ర్శిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే మాజీ చట్టసభ్యుడి తనయుడు, గువాహటి ఐఐటీలో డిజైనర్ అయిన ఒక తమిళ వ్యక్తి రూపకల్పన చేసిన సింబల్‌ను తిరస్కరించడం డీఎంకే ‘మందబుద్ధి’ని బయటపెడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అభివర్ణించారు. తమిళంలో రూపాయి గుర్తుకు తమిళ అక్షరం ‘రూ’ వాడటం సహజమే. మూడు భాషలను ప్రతిపాదించిన ఎన్ఈపీ 2020 పట్ల అసమ్మతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే బడ్జెట్ పత్రాల్లో రూపాయి సింబల్‌కు బదులుగా తమిళ ‘రూ’ అక్షరం వాడటం వెనుక డీఎంకే ఉద్దేశం. ఏడాదిలో రాష్ట్ర ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి స్టాలిన్ భాషాదురహంకారాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. తమిళ సెంటిమెంట్ ఆందోళనహిందూ అహంకారం పతాకస్థాయికి చేరిన తరుణంలో అస్తిత్వ పోరుకు నడుం బిగించిన రాజకీయ నాయకుడు నిజానికి డీఎంకే అధినేత ఒక్కరే కాదు. అయితే ఒక్క డీఎంకే మీద మాత్రమే బీజేపీ నేతలు శ్రుతి మించిన ఆగ్రహావేశాలు ప్రదర్శించడం చూస్తే, ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారని అనుకోవాలి. మతం ప్రాతిపదికగా వ్యక్తులను అవమానించడం, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం దేశ సమైక్యతకు ముప్పుగా భావించే రోజు ఎప్పుడు వస్తుంది? రెండోసారి అధికారం చేజిక్కించుకోవడానికి స్టాలిన్ సన్నద్ధం అవుతున్నారు, వాస్తవమే! ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం తమిళనాడు అలవాటు. ఈ సింగిల్ టర్మ్ ఆనవాయితీని భగ్నంచేసింది జయలలిత ఒక్కరే! 2016లో ఆమె ఏఐఏడీఎంకేను రెండో టర్మ్ అధికారంలోకి తెచ్చారు. ఈ సెంటిమెంటుతో పాటు నటుడు విజయ్ నాయకత్వంలో ఏర్పడిన తమిళగ వెట్రి కళగం పార్టీ సైతం డీఎంకేకు ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ లేదా మరో ఇతర పార్టీ రానున్న ఎన్నికలకు అజెండా సెట్ చేసేవరకూ డీఎంకే వేచి చూడదలచుకోలేదు. భాష, నియోజకవర్గాల పునర్విభజన అస్త్రాలను బయటకు తీసింది. రాష్ట్రంలో ఏ మూలైనా ఈ అంశాల మీదే మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, విజయ్‌లు... ఈ రెండు అంశాల మీద డీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రహస్థితులు అనుకూలిస్తే, రానున్న ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ కూటమి కట్టే అవకాశాలున్న ఏఐఏడీఎంకే ఇప్పుడు పులుసులో పడింది. 2020లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఈపీకి వ్యతిరేకంగా తొలి శంఖం పూరించిన పార్టీ ఇదే. హిందీని నిర్దేశించకపోయినా...హిందీ వ్యతిరేక రాజకీయాల్లో తమిళనాడుకు వందేళ్ల చరిత్రఉంది. మూడు భాషల సూత్రానికి అంగీకరిస్తేనే రాష్ట్రానికి కేంద్ర విద్యానిధులు విడుదల చేస్తామని ప్రకటించి, నిద్రాణంగా పడి ఉన్న ఒక జటిల సమస్యకు బీజేపీ ఎందుకు తిరిగి ప్రాణం పోసింది? ఇది అంతుచిక్కని విషయం. ‘హిందీకరణ’ ఇండియా పట్ల తన మక్కు వను వెల్లడిస్తూ ఆ పార్టీ సంకేతాలపై సంకేతాలు ఇస్తోంది. వలసవాద అవశేషాలు తుడిచిపెట్టాలన్న మిషతో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పేర్లను హిందీలోకి మార్చడం ఇందుకు ఉదాహరణ. ఇంతా చేసి ఇప్పుడు వెనకడుగు వేస్తే రాజకీయ బలహీ నత అవుతుందేమో అన్నది బీజేపీ డైలమా. మూడో భాష హిందీయే అవ్వాలని ఎన్ఈపీ ఆంక్ష పెట్టని మాట నిజమే. ఆచరణలో మాత్రం మూడో భాష హిందీనే అవుతుంది. లెక్కలేనన్ని మూడో భాషలను బోధించే టీచర్లను నియమించడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా తలకు మించిన భారం. పైగా ఎక్కడెక్కడి నుంచో వారిని తీసుకురావడం మరీ కష్టం. స్కూళ్లలో హిందీ బోధించడం తప్ప గత్యంతరం లేదు. ఇదో దుఃస్థితి. తమిళనాడులో కూడా మలయాళం, కన్నడం, తెలుగు టీచర్ల కంటే హిందీ బోధించేవారిని నియమించుకోవడం సులభం.సరికొత్త ప్రచారకర్తఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘వాళ్లు ఆర్థిక లాభాలు ఆశించి ఎందుకు తమిళ చిత్రాలను హిందీలోకి డబ్ చేస్తు న్నారు?’ అంటూ ఒక తప్పు ప్రశ్న వేస్తున్నారు. దక్షిణాదిన హిందీకి, హిందుత్వకు సరికొత్త ప్రచారకర్తగా మారిన ఈయన డీఎంకేది ‘హిపో క్రసీ’ అని కూడా నిందిస్తున్నారు. ఒక్కమాటలో ఈ ప్రశ్నకు సమా ధానం చెప్పవచ్చు. తమిళనాడు హిందీకి వ్యతిరేకం కాదు. దాని వ్యతిరేకత అంతా హిందీని బలవంతంగా రుద్దడం మీదేఆశ్చర్యం ఏమిటంటే, తమిళనాడులో లక్షల మంది స్వచ్ఛందంగా హిందీ నేర్చుకుంటారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడూ వారిని అడ్డుకోడు. హిందీ తప్ప మరో భాష మాట్లాడని లక్షల మంది ఉత్తర భారతీయలు ఉపాధి కోసం తమిళనాడు రావడం నాణానికి రెండో పార్శ్వం. ఉత్తరప్రదేశ్ లేదా బిహార్ స్కూళ్లలో తమిళం నేర్చుకోరు. తమిళనాడులో ఉపాధి కోసం తమిళం నేర్చుకోవాలని వారిని ఎవరూ ఒత్తిడి చేయరు. హిందీ మాట్లాడటానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆంక్షా లేదు. అందరూ వారికి అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చీరాని హిందీలో ప్రయత్నించి సహకరిస్తారు.చెన్నైలో ఏ రెస్టారెంటుకి వెళ్లినా మీకో దృశ్యం కనబడుతుంది. ఉత్తరాది వెయిటర్, తమిళ కస్టమర్ పరస్పరం ఎదుటి వారి భాషలో మాట్లాడుతారు. ఆ సంభాషణ ఎలా ఉన్నా ఆర్డర్ చేసిన ఆహారం రాకుండా పోదు. అదే తరహాలో హిందీ, తమిళ సినిమా పరిశ్రమల నడుమ విలసిల్లుతున్న చిరకాల సహకారం పవన్ పేర్కొంటున్నట్లు హిపోక్రసీ కాదు. ఆర్థికం కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు... ప్రజలు స్వచ్ఛందంగా చేరువ అవుతారనడానికి ఇదో ఉదాహరణ.దొడ్డిదారినో మరో అడ్డదారినో ఒక భాషను బలవంతంగా రుద్దడం ఎప్పుడూ, ఎక్కడా సుఖాంతం కాలేదు. తమిళనాడు హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఈ విషయంలో తగినంత గుణపాఠం నేర్ప లేదు. పొరుగు దేశాల పరిణామాలు దీన్ని రుజువు చేస్తాయి. ఒకే భాష ద్వారా జాతీయ సమైక్యత సాధించాలన్న రాజకీయాలు చావు దెబ్బ తిన్నాయి. పాకిస్తాన్ ఇందుకు చక్కటి ఉదాహరణ. 1947లో ఏర్పాటై సంబరాలు జరుపుకొన్న కొద్ది నెలల్లోనే ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది. ఆనాడే వాస్తవంగా ఆ దేశం తన తూర్పు ప్రాంతాన్ని కోల్పోయింది. ఉర్దూకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం 1971లో, ఇండియా తోడ్పాటు లభించి, దేశవిభజనతో సమసింది. ‘సింహళ ఒక్కటే’ శాసనంతో... సింహళీయులకు తమిళు లకు నడుమ ఉన్న విభేదాలు ఒక్కసారిగా పతాకస్థాయికి చేరాయి. అదే 30 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీసింది. డీఎంకే అన్ని అంశాల్లోనూ, ఎన్ఈపీతో సహా, కేంద్రంతో సంప్ర దింపుల ధోరణితోనే వ్యవహరిస్తోంది. ‘రూ’ తమిళ అక్షరం వాడిందన్న సాకుతో ఆ పార్టీని ‘వేర్పాటువాది’గా అభివర్ణించడంతో బీజేపీ నైజం వెల్లడైంది. సర్వం కేంద్రం అధీనంలోకి తెచ్చుకోవాలన్న వీరావేశం, తనను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల పట్ల దాని వైఖరి బట్టబయలు అయ్యాయి. చరిత్ర పట్ల ఆ పార్టీ నిర్లక్ష్య భావం కూడా బయటపడింది. ఇదే అన్నిటి కంటే ప్రమాదకరం.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-నిరుపమా సుబ్రమణియన్ -
న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు.. కదిలిన డొంక
తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా ఒక న్యాయమూర్తి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు మొత్తం న్యాయవ్యవస్థను కుదిపేస్తున్నవి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. న్యాయమూర్తి ఇంటికి పరుగున వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి దగ్ధమవుతున్నవి భిన్నంగా కనిపించాయి. తమ బాధ్యతగా మంటలు ఆపి పై అధికారులకు ఎటువంటి సమాచారం ఇచ్చారో తెలియదు! కానీ మూడు రోజుల తర్వాత గానీ మీడియాలో ఈ వార్త రాలేదు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉపాధ్యాయ దగ్గరకు చేరిన వీడియోలు సుప్రీంకోర్టు వెబ్ సైట్లో అప్లోడ్ కాకపోయి వుంటే కరెన్సీ తగలబడటం అనేది బయటకు వచ్చేది కాదు. తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా... జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలు ప్రకటించారు. అయితే ఆ చర్యలే ఇప్పుడు ప్రశ్నలు ఎదుర్కొంటున్నాయి. న్యాయమూర్తులకు భిన్న న్యాయమా?ఒక సాదాసీదా ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో లక్ష కరెన్సీ దొరికితే ఆ వివరాలను మీడియాకి ఇచ్చి, ఆ ఉద్యోగి ఫొటోలు విడుదల చేసే పోలీసులు జస్టిస్ యశ్వంత్ వర్మ పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహ రించారు? దాదాపు 15 కోట్ల విలువ ఉన్న కరెన్సీ ఒక న్యాయమూర్తి ఇంట్లో లభిస్తే న్యాయవ్యవస్థ తీసుకున్న చర్య ఆ న్యాయమూర్తిని మరో హైకోర్టుకు బదిలీ చేయడమా? ఒక కేసులో విచారణ సక్రమంగా జరగదని న్యాయస్థానాలు భావించినప్పుడు నిష్పక్ష విచారణకు సీబీఐకి కేసును బదిలీ చేస్తాయి కదా. మరి ఆ కరెన్సీ విషయం నిగ్గు తేల్చమని సీబీఐని ఎందుకు ఆదేశించలేదు? కరెన్సీతో కూడిన కేసు కాబట్టి ఈడీను ఆ కేసు తీసుకోమని ఎందుకు అడగలేదు? స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో దర్యాప్తు చేస్తే గాని నిజాలు బయటకు రావని పలు సందర్భాలలో వ్యాఖ్యానించిన న్యాయవ్యవస్థ ఈ విషయంలో అంతర్గత విచారణకు ఆదేశించడం ఏమిటి? ఒక న్యాయమూర్తి మీద ఆరోపణలు వస్తే మరో ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ వేయడం సబబా? ఆ న్యాయమూర్తి మీడియా ముందుకు వచ్చి ‘ఆ కరెన్సీ నోట్లు నావి కావు, అక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు’ అనీ నోట్ల కట్టలను చూపుతుంటే ఆయన మీద ఆంక్ష విధించలేదు. కేసు గురించి బహిరంగంగా మాట్లాడటానికి వీలు లేదనే నిబంధన సామాన్య నిందితుడి మీద విధించడం న్యాయస్థానాలు చేస్తుంటాయి. కానీ అది ఢిల్లీ న్యాయమూర్తికి వర్తింప చేయలేదు. ‘నా పరువుకు భంగం కలిగించే కుట్రలో భాగంగా ఎవరో ఆ కరెన్సీ నోట్లు (Currency Notes) తెచ్చి నా ఇంట్లో పెట్టారు’ అని సదరు న్యాయమూర్తి అంటున్నారు.మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఇటీవల చెన్నైలో చేసిన ప్రసంగంలో ‘న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సడలుతోంది’ అన్నారు. మరో సమావేశంలో మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కూడా ‘న్యాయవ్యవస్థలో అంతా సక్రమంగా ఉందనలేం’ అన్నారు. ఆ ఇద్దరు న్యాయమూర్తుల నోటి వెంట వచ్చిన మరో పదం భారతీయ న్యాయ వ్యవస్థలో ‘అంకుల్ జడ్జి సిండ్రోమ్’ నెలకొన్నది అనేది. న్యాయవ్యవస్థలో బంధుప్రీతి పెరిగిందని, వారసులు జడ్జిలు అవుతున్నారనే విషయం ముంబైకి చెందిన న్యాయవాది మాథ్యూస్ నెడుంపర సాక్ష్యాలతో సహా ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఆయన పరిశోధనలో హైకోర్టు స్థాయిలో 50 శాతం న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు స్థాయిలో 33 శాతం న్యాయమూర్తులు గతంలో న్యాయమూర్తులుగా పనిచేసిన వారికి దగ్గర బంధువులు. కొలీజియం ఉండటం సబబా?న్యాయవ్యవస్థలో బంధు ప్రీతి పెరగడానికి కారణం ప్రపంచంలో మరే దేశంలో లేనటువంటి కొలీజియం వ్యవస్థ. ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో న్యాయమూర్తులు నియామకం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చేస్తాయి. మనదేశంలో కూడా రాజ్యాంగం ఆ విధానాన్ని అనుసరించింది. అయితే మధ్యలో న్యాయమూర్తులు ఆ విధానాన్ని హైజాక్ చేశారు. కొలీజియం వ్యవస్థను స్థాపించారు. ఈ కొలీజీయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మరో నలుగురు న్యాయమూర్తులు సభ్యులు. హైకోర్టు స్థాయిలోనూ అటువంటి కొలీజియం ఉంటుంది. ఈ కొలీజియం న్యాయమూర్తుల నియామకాలను చేపడుతుంది. వారు సిఫార్సు చేసిన వారిని కేంద్ర ప్రభుత్వం నియమించాలి.ఎన్డీయే ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ సంస్కరణ కోసం రాజ్యాంగాన్ని సవరించి ‘నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్’ (ఎన్‌జేఏసీ) చట్టం చేసింది. దీని ద్వారా న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వం ద్వారా జరిగేందుకు వీలు కల్పించింది. అయితే ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసి, కొలీజియం (Collegium) ద్వారానే నియామకాల విధానం కొనసాగిస్తామన్నది. న్యాయమూర్తులు న్యాయమూర్తులను నియమించే విధానం మరెక్కడా లేదు. ఆ హక్కును ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు కోర్టు ఇస్తుందా? ప్రతి వ్యవస్థలో సీనియర్స్ తమ తర్వాతి స్థానాల వారిని నియమించడం సబబా! న్యాయస్థానాల మీద నోరెత్తడానికి ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు?గతంలో కొలీజియం వ్యవస్థను సవాలు చేసిన న్యాయవాది మాథ్యూస్ నెడుంపర. ఆయన తన పిటీషన్లో వేసిన ప్రశ్నలు – ఇంతవరకు ఆ కరెన్సీని ఎందుకు భద్రపరచి, తగలబడిన వస్తువుల జాబితా తయారు చేయలేదు? ఎవరిని అరెస్టు ఎందుకు చేయలేదు? క్రిమినల్ చట్టాలను ఎందుకు అమలు చేయడం లేదు? ఈ కేసు వివరాలను ఎందుకు బయటకు రానివ్వడం లేదు? ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కడ్ ఎన్‌జేఏసీ చట్టాన్ని తిరిగి తీసుకురావాల్సిన అవసరం గురించి ప్రతిపక్ష నేతలతో చర్చించారు. ఇకముందైనా కొలీజియం వ్యవస్థలోని లోపాలను సుప్రీంకోర్టు వదులుకుంటుందా? పారదర్శకత, జవాబుదారీతనం న్యాయవ్యవస్థ ప్రదర్శిస్తుందా?- పి. వేణుగోపాల్ రెడ్డి ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు pvg2020@gmail.com -
ఏం జరుగనున్నది సామీ?
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికారిక నివాస ప్రాంగణంలోని ఔట్ హౌస్‌లో డబ్బుల బస్తాలు కాలిన విషయంపై అన్ని వర్గాలవారూ అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాథ్యూస్ జె నెడుంపరాతో పాటు మిగతా వారూ బుధవారం (మార్చి 26) సుప్రీం కోర్టులో ఈ విషయమై ఫిర్యాదును నమోదు చేసి, దర్యాప్తును చేపట్టమని ఢిల్లీ పోలీసులను వెంటనే ఆదే శించాలని వాదించారు. అయితే అందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది.మార్చి14 నాడు న్యాయమూర్తి వర్మ నివాస ప్రాంగణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిన నోట్ల వ్యవహారం బయటపడినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం, ఈ సంఘటనపై పోలీసు అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడిన మాటల మధ్య పొంతనలేక పోవడం వంటి కారణాలతో న్యాయవ్యవస్థపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం మార్చి 24 సోమవారం జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే కొలీజియం ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఈ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు చేయడానికి నియమించింది. అయితే ఈ కమిటీకి దర్యాప్తు చేయడానికి ఎటువంటి అధికారమూ లేదని నెడుంపారా వాదించారు. భారీగా నగదు నోట్లు కాలిపోయాయి కాబట్టి ఇది భారతీయ న్యాయ సంహిత ప్రకారం కాగ్నిజన్ ్స నేరం కిందకు వస్తుందనేది ఆయన వాదన. నిజానికి ఇది ప్రతి ఒక్కరి వాదన కూడా. కొలీజియం ఆ కమిటీకి విచారణ అధికారాన్ని ఇవ్వడం చెల్లదన్న వాదనా సరైనదే. పార్లమెంట్ లేదా రాజ్యాంగం స్వయంగా ఆ అధికారం కల్పించకపోతే, కొలీజియం తనంతట తానే విచారణ చేయించుకునే అధి కారం కల్పించుకోలేదు. జస్టిస్ వర్మ తన నివాస ప్రాంగణంలో కాలిపోయిన డబ్బు తనది కాదనీ, దీనివెనుక ఏదో కుట్ర ఉందనీ అంటున్న మాటలనూ అనుమానించవలసి వస్తోంది. ఆ డబ్బు తనది కాకపోతే ఆయన వెంటనే పోలీసు లకు ఫిర్యాదు చేసి, తనపై తప్పుగా కుట్ర పన్నేందుకు యత్నించిన వారిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని ఎందుకు కోరలేదన్న నెడుంపరాతో అందరూ ఏకీభవిస్తున్నారు.జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసప్రాంగణంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద వీడియోలను సుప్రీంకోర్టు వెబ్ సైట్లో పెట్టారు. దేశ అత్యున్నత కోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఏదీ దాచకుండా దొరికిన అన్ని దృశ్యాలకు సంబంధించిన వీడియోలను అందరికీ కనబడే పని చేశారు. ఇదే న్యాయ సమాచార హక్కు.అనుమానాలివీ!మూటలలో డబ్బునోట్ల కట్టలు ‘దొరికాయి’. కష్టపడి సంపాదించిన సొమ్ము పోగొట్టుకుంటారా?’ అని ఢిల్లీ పోలీసు కమిషనర్ అన్న మాటలను అర్థం చేసుకోవాలి. ఢిల్లీ అగ్నిమాపక శాఖ ముఖ్య అధికారి అతుల్ గార్గ్ కాలిన నోట్లేమీ లేవని ముందు అన్నారు. ఆ తర్వాత తాను అలా అనలేదని మాట మార్చారు. మొత్తానికి అగ్నిమాపక శాఖ ఇచ్చిన రిపోర్టు ‘హిందీ’ భాషలో ఉంది. ఆ గదిలో మంటలు రేగినట్లు, మంటలు ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు అందులో సగం కాలిన నోట్లు ఉన్నాయని అందులో ఉంది. పోలీసులు ప్రమాదం స్థలానికి చేరిన సమ యంలో ఆ కాలిన నోట్లు కనపడ్డాయి. అప్పుడు దొరికిన నోట్లను అక్కడే ఎందుకు ఉంచలేదు? జడ్జిగారి అధికారిక ఇంట్లోనే లెక్క చూపని డబ్బు దొరికినపుడు అది కాగ్నిజబుల్ నేరం అవు తుంది కదా. పోలీసులు నేరస్థలంలో ఉన్న పరి స్థితిని ఆదే విధంగా ఉంచాలి, దాన్ని మార్చడానికి వీల్లేదు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలంలో స్టోర్ రూంను లాక్ చేసి ఉంచాలని డాక్యుమెంట్ చెబుతున్నది. లాక్ చేసి ఉంచాం అని సీఆర్పీఎఫ్ గార్డ్ రూం రిపోర్ట్ అంటున్నది. మరి తాళం వేసి ఉంటే జస్టిస్ వర్మ అంటున్నట్లు పనివాళ్లు ఆ రూమ్‌ను ఎప్పుడు పడితే అప్పుడు ఎలా వాడుకోగలుగుతారు? నియమాల ప్రకారం, ఏదైనా అక్రమ సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లయితే, దాన్ని పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి, తర్వాత కోర్టుకు సమర్పించాలి. అదే విధంగా నేర సంఘటన జరిగినట్లయితే, పంచనామా కూడా తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పాటించారా లేదా అనేది తెలియడం లేదు.సీజేఐ చర్యలు అద్భుతంగా ఉన్నాయని ఉప రాష్ట్రపతి మెచ్చుకుంటున్నారని అంటున్నారు. అదే సందర్భంలో మన దేశం 2010లో ప్రవేశపెట్టిన ‘న్యాయ ప్రమాణాలు–జవాబు దారీ బిల్లు‘ (జుడీషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్–2010)ను మళ్లీ చట్టంగా తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అంటున్నారు. సుప్రీంకోర్టును కూడా ఇదేవిధంగా ఆదేశించమని కూడా కోరారు. ఇది న్యాయవ్యవస్థలో అవినీతిని తగ్గించడానికి కీలకంగా ఉపయోగపడుతుందని న్యాయవాది నెడుంపరా వివరించారు. ఇదైనా విని న్యాయం చెబుతారని నమ్మకతప్పదు. ఏం జరగబోతున్నది? ఈ దెబ్బతో 2010 బిల్లు తెచ్చి న్యాయ వ్యవస్థను సైతం కేంద్రం చేతిలోకి తీసుకునే కుట్ర ఏదో నడు స్తున్నదని అనుమానాలు వస్తున్నాయి. ఏం జరుగనున్నది సామీ?మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
విభజన కుట్ర
‘స్టాలిన్ దున్నపోతు ఈనిందని అందరికీ ఆహ్వానాలు పంపితే దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీల నేతలు ఆ దూడను కట్టేయడానికి చెన్నైకి పరుగులు పెట్టారు.’ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరిగిపోతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశం అచ్చంగా ఇలాగే జరిగింది. అన్యాయం జరిగిపోతోందని బీజేపీని గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు ఆ సమావేశానికి వెళ్లాయి. చెన్నైలో ఓ స్టార్ హోటల్లో కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన సమావేశంలో ఒక్కరంటే ఒక్కరైనా ఎలా అన్యాయం జరుగుతుందో చర్చించారా? జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజన జరుగుతుందనీ, దక్షిణాదిలో జనాభా తగ్గి పోయారనీ, ఉత్తరాదిలో పెరిగిపోయారనీ, అందుకే దక్షిణాదికి సీట్లు తగ్గుతాయనీ వీరంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. నిజానికి ఈ ప్రక్రియలో ఇంతవరకూ ఒక్క అడుగు కూడా పడలేదు. ముందుగా జనాభా లెక్కలు పూర్తి చేయాలి. అప్పుడే ఉత్తరాదిలో ఎంత పెరిగారు, దక్షిణాదిలో పెరిగారా, తగ్గారా అన్న స్పష్టత వస్తుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటవుతుంది. జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేస్తారన్నది కూడా అపోహే! అలా అయితే ఈశాన్య రాష్ట్రాలకు 25 లోక్‌సభ సీట్లు ఉండేవా? ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పదే పదే చెబుతున్న ప్రధాని, కేంద్ర హోంమంత్రి... ఏ రాష్ట్రానికీ ఒక్క సీటు కూడా తగ్గదని వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. 2023లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ డీలిమిటేషన్ ప్రక్రియను 2026 తర్వాత జనగణన డేటా ఆధారంగా చేపట్టాలని ప్రభుత్వం యోచి స్తోందని ప్రకటించారు. ప్రతి ఓటరుకూ సమాన ప్రాతి నిధ్యం లభించేలా చేస్తామన్నారు. ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడేలా డీలిమిటేషన్ ఉంటుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్థానిక జనాభా వైవిధ్యం, గిరిజన సముదాయాల ప్రాతినిధ్యాన్ని కాపాడేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘డీలిమిటేషన్ అనేది కేవలం స్థానాల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం కాదు, ప్రజాస్వామ్యంలో సమానత్వాన్ని స్థాపించే ప్రక్రియ’ అని స్పష్టం చేశారురాజకీయ అలజడి కోసమే...అయినా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు కాకి లెక్కలను ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు 42 లోక్‌సభ స్థానాలుంటే, పునర్విభజన తరు వాత 34 అవుతాయని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 స్థానాలుంటే వీటి సంఖ్య 103కు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజ స్థాన్, బిహార్ రాష్ట్రాలలోని స్థానాల సంఖ్య 174 నుంచి 204 స్థానాలకు చేరుకుంటుందని అంటున్నారు. నిజానికి ఈ లెక్కలు ఇచ్చింది ఓ విదేశీ సంస్థ. ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ అనే సంస్థ ‘ఇండియాస్ ఎమర్జింగ్ క్రైసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్’ అనే నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక తప్ప, డీలిమిటేషన్ సీట్లపై మరో రిపోర్టు లేదు.కేంద్రం నుంచి అసలు లేదు. అయినా ఓ విదేశీ సంస్థ రిపోర్టును పట్టుకుని దేశంలో రాజకీయ అలజడి రేపడానికి డీఎంకే ప్రయత్నిస్తూంటే, ఆ పార్టీ ట్రాప్‌లో ఇతర పార్టీలు పడుతున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదనీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసు కోలేదనీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. లోకసభ నియోజకవర్గాల పునర్విభజన గతంలో 2002లో ప్రారంభమైంది. 2008లో అమలులోకి వచ్చింది. ఈ ప్రక్రియ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం జరిగింది. 2002లో డీలిమిటేషన్ చట్టం ఆమోదించిన తర్వాత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో ఎన్నికల కమిషన్ సభ్యులు, రాష్ట్రాల నుండి ప్రతినిధులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను సమన్వయం చేశారు. దీని ప్రకారం, జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులు సవరించారు. మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య మాత్రం మారలేదు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, పౌరుల నుండి సూచనలు స్వీకరించింది. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని, సరిహద్దులను ఖరారు చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇంకా విస్తృత సంప్రతింపులకు కమిటీలు వేస్తారు.పరుష వ్యాఖ్యలు ఎందుకు?ఉత్తరాదివాళ్ళు పందుల్ని కన్నట్లుగా పిల్లల్ని కంటున్నారనీ, అక్కడ బహుభర్తృత్వం ఉంటుందనీ డీఎంకేకు చెందిన మంత్రి దురై మురుగన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాదివారిని కించపరిచి తమిళనాడు డీఎంకే నేతలు ఏం సాధించాలనుకుంటున్నారు? ఉత్తరాది వారిలో దక్షిణాదిపై ఏకపక్షంగా వ్యతిరేకత పెంచే కుట్రలో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారు. తమిళనాడు డీఎంకే పాలన నాలుగేళ్లు నిండ కుండానే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. అందుకే ఉత్తరాదిపై విషం చిమ్మి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో దక్షిణాది సెంటిమెంటుతో గెలవాలనుకుంటున్నారు.హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్య హక్కు. కానీ ప్రాంతాల వారీగా భావోద్వేగాలు కలిగి ఉండే సమస్యల పట్ల పోరాడేటప్పుడు, విభజనవాదం చెలరేగే ప్రమాదం ఉంది. ప్రత్యేక ద్రవిడ దేశం కావాలని గతంలో కొంత మంది తమిళ నేతలు ప్రకటనలు కూడా చేశారు. ఇలాంటి విభ జనవాదుల మధ్య దేశాన్ని సమైక్యంగా ఉంచుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. ప్రత్యేక దేశం అనే మాట వినిపించిందంటే, అది విభజన వాదమే! దీన్ని ఏ మాత్రం ప్రోత్సహించకుండా,దక్షిణాది తన ప్రాధాన్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తే అది మంచి ప్రజాస్వామ్య విధానం అవుతుంది.ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు -
వైవిధ్య వైరుద్ధ్యాలు
ఒక కుటుంబం నుంచి, సమాజం నుంచి, ఒక దేశం వరకు వైవిధ్యాలు అనేకం ఉంటాయి. వాటిని వైరుద్ధ్యాలుగా మారకుండా చూసుకోవటంలోనే విజ్ఞత ఉంటుంది. ఆ విధంగా చూసినపుడు, లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభ జనపై తలెత్తిన వివాదం ఒక వైవిధ్య స్థితి నుంచి వైరుద్ధ్య స్థాయికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఈ నెల 22న చెన్నైలో జరిగిన సమావేశం దేశానికంతా ఒక హెచ్చరిక వంటిదని చెప్పాలి. నియోజక వర్గాల పునర్విభజనతో ముడిపడి మరొక రెండు అంశాలు కూడా ఉన్నాయన్నది గుర్తించవలసిన విషయం. ఒకటి – హిందీ భాషను హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నారనే ఫిర్యాదు. ఈ విషయం చెన్నైలో చర్చకు రాలేదు. కానీ ఎప్పటినుంచో ఉన్నదే. రెండవది – దక్షిణ–ఉత్తర భారతాల మధ్య సాధారణ రూపంలోనే ఉన్నాయనే విభేదాలు. ఈ భావన నియోజక వర్గాల పునర్విభజనకు, హిందీ భాషకు పరిమితమైనది కాదు. ఇటువంటి భావనలకు గల చరిత్ర మూడు దశలలో కనిపిస్తుంది. ఒకటి– ఉత్తరాది వారికి దక్షిణాది వారిపట్ల ఎప్పుడూ చిన్నచూపేనన్నది. రెండు – దాక్షిణాత్యుల రంగురూపులు, భాషా సంస్కృతులు, ఆహార విహారాల పట్ల స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్నదనే ఈసడింపు దృష్టి. మూడవది–ఈ రెండింటికన్నా ప్రమాదకరమైనది, ప్రాచీనమైనది. అది ఆర్య–ద్రవిడ వాదనలు. వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా...మరే దేశంలోనూ లేనంతటి వైవి«ధ్యాలు ఇక్కడ ఉన్నాయి. సాంస్కృతికంగా, విశ్వాసాలపరంగా ఒక ఏక రూపత, కనీసం స్థూలమైన విధంగా, అనాదిగా ఉండిన ప్పటికీ, బ్రిటిష్ వలస పాలన ముగిసినాక చరిత్రలో మొదటిసారిగా మొత్తం నాలుగు చెరగులకూ కలిపి భౌగోళికంగా, రాజకీయంగా దేశానికి ఏకరూపత సిద్ధించింది. వైవిధ్యాలను సరిహద్దులు చెరిపివేసి ఒకటి చేసే ప్రయత్నాలు 1885లో కాంగ్రెస్ వ్యవస్థాపన కాలం నుంచి మొదలై, 1947లో స్వాతంత్య్ర సాధన, 1950 నుంచి రాజ్యాంగం అమలు, 1951–52లో మొదటి సార్వత్రిక ఎన్నికలతో ఒక రూపానికి వచ్చాయి. వైవిధ్యాలు వైరు ద్ధ్యాలుగా మారగల అవకాశాలకు ఆ విధంగా ముగింపు పలికినట్లయింది. కనీసం అందుకు ఒక బలమైన ప్రాతిప దిక సూత్రరీత్యా ఏర్పడింది. దానిని అదే ప్రకారం స్థిర పరచి మరింత పటిష్ఠం చేయవలసిన బాధ్యతను చరిత్ర పాలకులకు అప్పగించింది. అందుకు పునాదుల స్థాయిలో భంగపాట్లు జరిగాయని అనలేముగానీ, వేర్వేరు సాయుల్లో జరుగుతూ వస్తున్న దాని పర్యవసానమే ప్రస్తుత వివాదాలు.ఇటువంటి వివాదాలకు కేంద్ర ప్రభుత్వం ఆస్కార మివ్వనట్లయితే చెన్నై సమావేశపు అవసరమే ఉండేది కాదు. ఆ సమావేశం దరిమిలా కేంద్ర హోంమంత్రిఅమిత్ షా ఏమీ స్పందించలేదుగానీ, దక్షిణాదికి చెందిన ముగ్గురు బీజేపీ మంత్రులు మాట్లాడుతూ, విభజనకు సంబంధించి ఇంకా నిర్ణయం జరగలేదు, విధివిధానాలు రూపొందలేదు, ప్రకటనేమీ వెలువడలేదు, అటువంటపుడు ఈ సమావేశాలు, విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. విధివిధానాల రూపకల్పన, ప్రకటన జరగక పోవచ్చు. కానీ నష్టపోతా మనుకునే రాష్ట్రాలకు స్థూలమైన అభిప్రాయాలు కలగకుండా ఎట్లా ఉంటాయి? వారు ఆ విషయమై మాట్లాడకుండా ఎట్లా ఉంటారు?ఇటువంటి విషయాలలో చర్చలు ఒక ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ముందునుంచే జరుగుతాయి తప్ప, అంతా ముగిసిపోయే వరకు ఆగవు. విషయం వివాదాస్పదమవుతున్న సూచనలు కనిపించినప్పుడు చర్చలు మరింత అవసరం. కానీ అమిత్ షా అదేమీ చేయకుండా, దక్షిణాదికి ఎటువంటి నష్టం ఉండ దనీ, అక్కడి స్థానాలు ఇప్పటికన్నా పెరుగుతాయనటం మొదలుపెట్టారు. ఇందులో ఒక చాతుర్యం ఉంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు రెండింటికీ స్థానాలు ఇప్పటికన్న పెరిగినా, దక్షిణాదికన్న ఉత్తరాదికి పెరిగేవి చాలా ఎక్కువని, ఆ విధంగా రెండు ప్రాంతాల మధ్య గల ప్రస్తుత వ్యత్యాసం బాగా ఎక్కువవుతుందని అంచనా. అమిత్‌షా ఈ కోణాన్ని దాచిపెడుతున్నారు. అట్లాగాక ఏ వ్యత్యాసమూ, నష్టమూ ఉండదనుకుంటే ఆయన ఆ మాటను దక్షిణ రాష్ట్రాలను సమావేశపరచి వివరించాలి.సమావేశం అవసరం!చెన్నైలో జరిగిన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశానికి పార్టీ తేడాలు లేకుండా పలువురు హాజరయారంటేనే, విభజన ప్రతిపాదనలు ఎటువంటి అనుమానాలను కలిగిస్తున్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనటం. ఎందుకంటే, దేశమంతటాగల ఆ పార్టీ ఇటువంటి వైఖరి తీసుకుంటే వారికి ఉత్తరాదిన వ్యతిరేకత రాగలదనీ, ఆ భయంతో వారు హాజరు కాకపోవచ్చుననీ బీజేపీ అంచనా వేసింది. కానీ విభజనకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే ముందుగానే మాట్లాడారు.ఇందులో రెండవవైపున చూస్తే, విభజనకు అనుకూలించటం వల్ల బీజేపీ దక్షిణాదిన నష్టపోగలదనే అభిప్రాయం ఉన్నా, ఆ పార్టీ అదే వైఖరికి కట్టుబడి ఉంటున్నది. దీనిని బట్టి ఇరువురూ, ఆయా ప్రాంతాలలో ప్రజాభిప్రాయాలు ఎట్లున్నా తమ వైఖరులను మార్చుకోదలచలేదని అర్థమవుతున్నది. దాని పర్యవసానాలు ఏమిటన్నది తర్వాతి విషయం. అది సూత్రబద్ధమైన వైఖరి అనుకుంటే మాత్రం ఆ మేరకు వారిని మెచ్చుకోవాలి.ఈ వైవిధ్యాలన్నీ వైరుద్ధ్యాలుగా మారి తీవ్ర స్థాయికి వెళ్ళకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలను సమావేశపరచాలి. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని ఒక తీర్మానంగా ఆమోదించిన చెన్నై సమావేశం, ఆ తీర్మాన ప్రతిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల కాలంలోనే ప్రధాని మోదీకి అందజేయగలమని ప్రకటించింది. ఆయన ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం మంచిదవుతుంది. చెన్నైలో తీర్మానించినట్లు విభజనను 25 సంవత్సరాల వరకు గాక, దక్షిణాదికి ఆమోదయోగ్యమయే ప్రత్యామ్నాయాన్ని కనుగొనే వరకు నిరవధికంగా వాయిదా వేయటం మంచిది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నూరేళ్ల గ్రంథాలయం
పాల్వంచ సంస్థానంలో కుక్కునూరులో ఉన్న ‘దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయం’ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. సరిగ్గా నేటికి వందేళ్ల క్రితం (1925 మార్చి 25) గోదావరి తీరంలో ఉన్న ‘అమరవరం’లో ‘గౌతమి ఆశ్రమం’తో పాటు ఈ గ్రంథాలయాన్నీ, ఒక పత్రికా పఠన మందిరాన్ని, ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. అమరవర వాస్తవ్యులు, ఆంధ్ర భాషా కోవిదులు బ్రహ్మశ్రీ వేలూరు సుబ్రహ్మణ్యం తన పుస్తకాలు ఈ గ్రంథాలయానికి బహూకరించారు. వీటితో పాటు రెండు చెక్క బీరువాలు, బెంచీలు, బల్లలతో మౌలిక సదుపాయాలు కల్పించారు. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావు తమ పత్రికలను ఈ గ్రంథాలయానికి అందించడంతో పాటు దాని ఉన్నతికి ఎంతో కృషి చేశారు. అందుకే ‘దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయం’ అని దీనికి పేరుపెట్టారు. తరువాత ఈ గ్రంథాలయాన్ని కుక్కునూరుకు మార్చారు. గ్రంథాలయంలోని పత్రిక పఠన మందిరంలో ‘ఆంధ్ర పత్రిక, భారతి, నీలగిరి, తెలుగు, ఆంధ్ర రంpని, జన్మ భూమి, త్రిలింVýæ, సుజ్ఞాన చంద్రిక, బ్రహ్మానందిని, ఆంధ్ర అభ్యుదయం, శ్రీ శారద ధన్వంతరి, కృష్ణా పత్రిక’ వంటివి... కోటగిరి వెంకట అప్పారావు, మాజేటి రామచంద్ర రావు తదితరుల సహాయ సహకారాలతో గ్రంథాలయానికి వచ్చేవి. దసరా, దీపావళి, వైకుంఠ ఏకాదశి, పోతన జయంతి, శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ‘గ్రంథాలయ యాత్ర’ చేపట్టి విరాళాలు సేకరించి గ్రంథాలయం ఉన్నతికి కృషి చేశారు. 1960-70 కాలం వరకు చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాల ప్రజలు ఈ గ్రంథాలయాన్ని చక్కగా వినియోగించు కున్నారు. 1970 తరువాత అనుకున్నంత స్థాయిలో ఈ గ్రంథాలయం తన ప్రతిభను కనపరచలేకపోయింది, కారణం ఆర్థిక వన రులూ, మానవ వనరుల కొరత, నాటి అవసరాలకు అనుగుణంగా పుస్తకాలు లేకపోవడం వంటి కారణాలతో 1980–85 మధ్యకాలంలో ఈ గ్రంథాలయాన్ని ప్రభుత్వ గ్రంథాలయంలో విలీనం చేశారు. అప్పటికే ఆ గ్రంథాలయంలో ఉన్న చాలా విలువైన గ్రంథ సంపద అంతరించి పోయింది. – డా. రవి కుమార్ చేగొనితెలంగాణ గ్రంథాలయ సంఘం కార్యదర్శి(నేటితో దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయానికి వందేళ్లు) -
మరిన్ని ప్రయోగాలకు మార్గదర్శనం!
తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి మళ్లీ భూమ్మీదకు చేరారు. చాలామంది సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లో ఇరుక్కుపోయారని అన్నారు. ఈ వర్ణన అంత సరైంది కాదు. ఐఎస్ఎస్లో దీర్ఘకాలం ఉండటం ఇదే మొదటిసారి కాదు. సుమారు పాతికేళ్లుగా మనుగడలో ఉన్న ఐఎస్ఎస్లో నిత్యం యూఎస్, రష్యా, యూరప్, జపాన్ వ్యోమగాములు ఉంటూనే ఉన్నారు. ఒక్కొక్కరి కాలావధి వేర్వేరుగా ఉండవచ్చు. కనీసం 4 నుంచి 8 మంది వ్యోమగాములు జీవశాస్త్ర, బయోమెడికల్, మొక్కలకు సంబంధించిన ప్రయోగాలు చేస్తూ వచ్చారు. గత వారం కొద్ది కాలమైనా సరే... దాదాపు 11 మంది వ్యోమగాములు ఐఎస్ఎస్లో గడిపారు. పరిశోధనలు చేయడంతోపాటు ఉపగ్రహాలను ప్రయోగించడం, ఐఎస్ఎస్ నిర్వహణ పనులు చేశారు వీరందరూ! స్పేస్ వాక్స్ ద్వారా ఐఎస్ఎస్ వెలుపల ఉండే రోబో చేతుల మర మ్మతులు కూడా ఉన్నాయి ఈ పనుల్లో! వ్యోమగాములు నిత్యం ఐఎస్ఎస్లో ఉంటారు కాబట్టి వారికి ఆహారం, ఇతర సరుకుల రవాణా ఎప్పటికప్పుడు జరిగింది. అంతరిక్ష కేంద్రంలో సునీత, విల్మోర్లు 286 రోజుల పాటు ఉండటం చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ... కొత్త కాదు. ఫ్రాంక్ రూబియో విషయాన్నే తీసుకుంటే... 2023 సెప్టెంబరులో ఆయన 371 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి రికార్డు సష్టించారు. ఈ క్రమంలో ఆయన 2022లో మార్క్ వెండే హే 355 రోజుల రికార్డును బద్దలు కొట్టారు. అయినప్పటికీ సోవియట్ యూనియన్ కాస్మోనాట్ల రికార్డులతో పోలిస్తే ఇవి తక్కువ. సోవియట్ యూనియన్ ప్రయోగించిన ‘మిర్’ అంతరిక్ష కేంద్రమే... కాలక్రమంలో ఇతర దేశాల భాగస్వామ్యంతో ఐఎస్‌ఎస్‌గా రూపాంతరం చెందిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. భౌతిక శాస్త్రవేత్త, కాస్మోనాట్... వలేరీ పోల్యాకోవ్ 1994–95లో ఎకాయెకిన సుమారు 437 రోజులపాటు మిర్ స్టేషన్లో గడిపారు. ప్రస్తుతం చైనా సిద్ధం చేసిన అంతరిక్ష కేంద్రం టియాన్ గాంగ్‌లో ముగ్గురు వ్యోమగాములు 139 రోజులుగా ఉంటు న్నారు. వీరిలో కాయ్ షూజీకి అంతరిక్షంలో 320 రోజులు గడిపిన అనుభవం ఉంది. లక్ష్యాల్లో ఒకటి అదే...అంతరిక్ష కేంద్రం ఏర్పాటు లక్ష్యాల్లో ఒకటి– దీర్ఘకాలం అంతరిక్షంలో గడపడం. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ సమయం గడిపితే మనకేం అవుతుందన్న విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇలా ఎక్కువ కాలం అక్కడ గడిపినప్పుడు ఎముకలు, కండరాలు బలహీనపడతాయన్న విషయం మాత్రం ఆందోళన కలిగించే వ్యవహారమే. 1970లలో శాల్యూట్, స్కైల్యాబ్లతో ప్రయోగాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ అంశాలకు సంబంధించి బోలెడంత సమాచారం సేకరించారు. బయో మెడికల్ సమాచా రాన్ని సేకరించడమే లక్ష్యంగా పలు పరిశోధనలు జరిగాయి. ఉదాహరణకు ప్రస్తుత అంతరిక్ష యాత్రలో విల్మోర్ సైక్లింగ్, రోయింగ్, రెసిస్టెన్స్ వ్యాయామాలను కలిపి చేయగల ఒక పరికరాన్ని ఐఎస్ఎస్లో ఏర్పాటు చేయడానికి సాయ పడ్డారు. ఎక్కువ సమయం ఇక్కడ గడపాల్సిన వ్యోమ గాములు ఈ పరికరం ద్వారా వ్యాయామాలు చేస్తే కండ రాలు, ఎముకలు మరీ గుల్లబారకుండా ఉంటాయి. గుండెకూ మేలవుతుంది. గుండె కొట్టుకునే వేగం, శ్వాస, రక్త పోటు వంటి... గుండె–రక్తనాళాలకు సంబంధించిన డేటాను సేకరించడానికీ, ఉష్ణోగ్రతలను వ్యోమగాములు వేసుకునే దుస్తుల్లో ఉంచిన సెన్సార్ల ద్వారా రాబట్టేందుకూ ఉద్దేశించిన ప్రయోగం కూడా జరిగింది. భవిష్యత్తులో మనిషి జాబిల్లిపై, అంగారకుడిపై నివసించాల్సి వస్తే... ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వారి పరమావధిగా ఉండనుంది. 1970, 1980లలో సోవియట్ యూనియన్ , అమెరికన్ల అంతరిక్ష కేంద్రాల అనుభవం తరువాత ఇది చాలా ఖరీదైన వ్యవహారమని వారికి అర్థమైంది. ఈ కారణంగానే ఐఎస్ఎస్ నిర్మాణం, నిర్వహణ రెండింటినీ అంతర్జాతీయ స్థాయికి చేర్చి పలు దేశాలు పాల్గొనేలా చేశారు. నాసా, కెనడా స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ ఏజెన్సీ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లొరేషన్ ఏజెన్సీ, రాస్కోమాస్లు ఐఎస్ఎస్ నిర్వహణ బాధ్యతలు చేపట్టాయి. ఆయా ఏజెన్సీలు అందించిన పరిక రాల నిర్వహణ బాధ్యత వారిదే. 2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ అరవై ప్రయోగాల ద్వారా ఐఎస్ ఎస్‌ను 21 దేశాలకు చెందిన 260 మంది వ్యోమగాములు సందర్శించారు. భారత్ వ్యోమగామి శుభాంశు శుక్లా కూడా త్వరలోనే ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. ఐఎస్ఎస్ 2030 వరకూ పని చేయనుంది. చైనా ఇప్పటికే ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోగా... 2035 నాటికి ఒక కేంద్ర నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మొదలైన అంతరిక్ష కేంద్రం ఏర్పాటు ఆలోచన ఈ అంతర్జాతీయ ప్రాజెక్టు! అంతరిక్ష ప్రయోగాల విషయంలో అమెరికా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలోనే ప్రయోగాలు జరగనున్నాయి. స్పేస్ ఎక్స్, బోయింగ్ వంటివి సరుకు రవాణా కోసం ప్రత్యే కమైన నౌకలను సిద్ధం చేయనున్నాయి. నాసాతో కలిసి పని చేస్తున్న ఈ రెండు సంస్థలూ ఐఎస్ఎస్ నిర్వహణతోపాటు జాబిల్లి, అంగారకుడిపైకి చేరే ప్రయత్నాలు చేస్తున్నాయి. స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా మారిన నేపథ్యంలో బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మాన్ నాసా అధ్యక్షుడు అయ్యే పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష ప్రయోగాల్లో మరింత ఎక్కు వగా పాల్గొనే అవకాశాలున్నాయి. వీరందరూ సునీత, విల్మోర్ల అనుభవం నుంచి లబ్ధి పొందనున్నారు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఫలిస్తున్న ప్రజాభాగస్వామ్య పోరాటం
క్షయవ్యాధి (టీబీ)పై పోరులో భారత్ స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతోంది. ఇటీవల విస్తృత స్థాయిలో 100 రోజులపాటు నిర్వహించిన ‘టీబీ–ముక్త్ భారత్ అభి యాన్’... వినూత్న విధానాలను ప్రవేశ పెట్ట డమే కాక, జన బాహుళ్యాన్ని మమేకం చేయడం కూడా అంతే కీలకమని స్పష్టం చేస్తోంది. టీబీ కేసులను గుర్తించడాన్ని వేగవంతం చేయడం, మరణాలను తగ్గించడం, కొత్త కేసులను నివారించడం వంటి లక్ష్యాలతో 2024 డిసెంబర్ 7న ఈ ప్రచారం ప్రారంభమైంది.ఈ ప్రచారం ద్వారా టీబీ లక్షణాలు లేనివారే కాదు, ఆ లక్షణాలు గుర్తించని వారిని సైతం తొలిదశలోనే పసిగట్టి చికిత్స అందించింది. డయాబెటిస్ ఉన్నవారు, ధూమపానం చేసేవారు, మద్యపానం సేవించేవారు, హెచ్ఐవీ రోగులు, వృద్ధులు, తక్కువ ‘బీఎమ్ఐ’ ఉన్నవారు, టీబీ రోగులతో మసిలే కుటుంబ సభ్యులు... ఇలా అధిక రిస్కున్న వ్యక్తుల చెంతకు పోర్టబుల్ ఎక్స్–రే యంత్రాలను నేరుగా తీసుకెళ్ళి చికిత్స అందించడం జరిగింది. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఎక్స్–రేల ద్వారా అక్కడికక్కడే అనుమానిత టీబీ కేసులను గుర్తించారు. ప్రామాణికమైన ‘న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్’ (ఎన్ఏఏటీ) ఉపయోగించి రోగ నిర్ధారణ కూడా జరిగింది. ఈ ప్రయత్నాలు అంటువ్యాధులను గుర్తించి త్వరగా చికిత్స చేయడానికీ, అవి వ్యాప్తి చెందకుండా అరికట్టడానికీ, ప్రాణాలను కాపాడటానికీ దోహదపడ్డాయి. దేశం నలుమూలలా చేపట్టిన ఈ ప్రచార కార్య క్రమంతో టీబీ బారిన పడటానికి అవకాశమున్న దాదాపు 12.97 కోట్ల మందికి పరీక్షలు జరిగాయి. తద్వారా సుమారు 7.19 లక్షల టీబీ రోగులను గుర్తించారు. ఇది కేవలం ఒక మైలురాయి అంటే సరిపోదు, ఒక మలుపు అనే చెప్పాలి.భాగస్వామ్య ఉద్యమంచెప్పాలంటే... నిజమైన గేమ్ ఛేంజర్ కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు– జనాలను సమీకరించడం (కమ్యూనిటీల సమీకరణ). టీబీ నిర్మూలన అనేది ఇప్పుడు ‘జన్ భాగీదారీ’ (ప్రజల భాగస్వామ్యం) ద్వారా నడిచే ఒక ప్రజా ఉద్యమంగా మారింది. దేశమంతటా 13.46 లక్షలకు పైగా ‘ని–క్షయ్’ శిబిరాలు జరిగాయి. ఇందులో గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఆర్లు, యూఎల్బీల ప్రతినిధులతో సహా 30,000 మందికి పైగా ఎన్నికైన ప్రతినిధులు ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’కు మద్దతు అందించారు. కార్పొరేట్ భాగస్వాములు, సాధారణ పౌరులు సైతం ఈ ప్రచారంలో పాల్గొన్నారు. టీబీ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, సామూహిక లక్ష్యం అనే ఆలోచనను వీరు బలోపేతం చేశారు. ఈ మిషన్‌లో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల భాగ స్వామ్యం ఉండటం విశేషం. టీబీపై అవగాహన, న్యూట్రిషన్ కిట్ పంపిణీ, టీబీ రహిత భారత్ కోసం ప్రతిజ్ఞ చేయడం వంటి 35,000కి పైగా కార్య కలాపాలను 22 వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు చేపట్టాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు, వాణిజ్య సంఘాలు, వ్యాపార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు 21,000కి పైగా కార్యకలాపాలను చేపట్టగా... 78,000 విద్యా సంస్థలలో 7.7 లక్షలకు పైగా విద్యార్థులు క్షయవ్యాధి అవగాహన కార్యకలాపాలలో పాల్గొన్నారు. జైళ్లు, గనులు, తేయాకు తోటలు, నిర్మాణ ప్రదేశాలు, పని ప్రదేశాల వంటి సామూహిక ప్రాంతాల్లో టీబీ బారిన పడటానికి అవకాశమున్న 4.17 లక్షలకు పైగా జనాలకు పరీక్షలు నిర్వహించారు. ‘జన్ భాగీదారీ’కి పునాది వేసిన మన ప్రధాని దార్శనికత సమాజంపై విస్తృత ప్రభావాన్ని చూపింది. ఫలితంగా రోగులకు తగిన పోషకాహారాన్ని అందించడం కోసమే కాక, వారి మానసిక – సామాజిక స్థితిగతుల్లో తోడ్పాటుకు ఎంతోమంది ముందుకొచ్చారు. టీబీ రోగుల బాగోగులు ఇప్పుడు ఆసుపత్రులకు మాత్రమే పరి మితం కాలేదు. ఇది ఇంటింటికీ, గ్రామ గ్రామానికీ, పని ప్రదే శాలకూ వ్యాపించాయి. ‘నిక్షయ్ మిత్ర’ ద్వారా వ్యక్తులు, సంస్థలు ఇప్పటికే వేలాది ఆహార బుట్టలను పంపిణీ చేసి, టీబీ బాధిత కుటుంబాలకు పోషక సహాయాన్ని అందిస్తున్నాయి. కేవలం 100 రోజుల కార్యక్రమంలో 1,05,181 కొత్త నిక్షయ్ మిత్రులు నమోదయ్యారు. పోషకాహారం అందించడం, క్షయవ్యాధి నుంచి రోగులు కోలుకునేలా చేయడం మధ్య కీలక సంబంధాన్ని గుర్తిస్తూ... ప్రభుత్వం ‘నిక్షయ్ పోషణ్ యోజన’ కింద ఆర్థిక సహాయాన్ని నెలకు 800 నుంచి 1,000 రూపాయలకు పెంచింది. తద్వారా ఏ క్షయవ్యాధి రోగీ ఒంటరి పోరాటం చేయకుండా చూడటమే ప్రభుత్వ ఉద్దేశం.ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా విభిన్న రీతిలో టీబీ కేర్ ప్రోగ్రాం కింద రోగులకు అవసరమైన చర్యలు తీసుకోవడమే కాదు, రోగిని బట్టి శ్రద్ధ తీసుంటూ చికిత్సను అంది స్తోంది. ఉదాహరణకు, ఒక టీబీ రోగి తక్కువ బరువుతో ఉన్నట్లు తేలితే (18.5 కంటే తక్కువ బీఎమ్ఐ), వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు తగిన పోషకాహారం, చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు. చికిత్స సమయంలో నెల నెలా వారి పురోగతిని పర్యవేక్షిస్తారు.100 రోజుల పురోగతిక్షయ వ్యాధి పై అవగాహన కల్పించడం, రోజువారీ జీవితంలో సేవలను అందించే విషయంలో 22 మంత్రిత్వ శాఖలు చేతులు కలిపి ముందుకు సాగాయి. గోవా కార్నివాల్ పరేడ్లలో టీబీపై అవగాహన ఒక ప్రధానాంశంగా నిలిచింది. తమ కార్యాలయాలను సందర్శించే వేలాది మందికి ఉచిత టీబీ స్క్రీనింగ్‌లను చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ విభిన్న చర్యలు అపోహలను తొలగించే ప్రయత్నాలు చేశాయి. క్షయ నిర్మూలనలో ప్రజా చైతన్యానికి బాటలు పరిచాయి.100 రోజుల ప్రచారం అనేది కేవలం ప్రారంభం మాత్రమే!ప్రతి పౌరుడు... వారు ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ఆధునిక పద్ధతుల్లో రోగనిర్ధారణ, నాణ్యమైన చికిత్స అందించడం, అన్ని వర్గాల వారినీ భాగస్వాములను చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఈ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. కోవిడ్–19 పరీక్షల విషయంలో ప్రభుత్వం ఎంత చురుగ్గా స్పందించిందో... అదే మాదిరి మరింత వేగవంతమైన, కచ్చితమైన అత్యాధునిక టీబీ పరీక్షలను అన్ని ప్రాంతాలకూ, అన్ని వర్గాలకూ అందుబాటులోకి తేవడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది.స్వచ్ఛ భారత్ మిషన్ కావొచ్చు, పోలియో నిర్మూలన కార్య క్రమాలు కావొచ్చు... యావత్ సమాజం కదలి వస్తే ఎటువంటి ప్రయోజనాలు ఒనగూరుతాయో స్పష్టంగా రుజువు చేశాయి. ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కూడా ఇప్పుడు ప్రజల నేతృత్వంలో మరో ఉద్యమంగా మారుతోంది. భారత్ ఇప్పుడు కేవలం క్షయవ్యాధితో పోరాడటం మాత్రమే కాదు– దాన్ని ఓడిస్తోంది కూడా!జేపీ నడ్డా వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి(మార్చి 24న ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం) -
సమ సమాజమా? సంక్షేమ రాజ్యమా?
సామ్యవాద సమాజాన్ని నిర్మించడానికి ఇండియా కమ్యూనిస్టు పార్టీలు రెండు మార్గాలను ఎంచుకున్నాయి. మొదటిది– సాయుధ పోరాటం. రెండోది– పార్లమెంటరీ ఎన్నికలు. ఆయా పార్టీల నాయకులు అభిమానులు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోనూవచ్చు గానీ, అవి ఎంచుకున్న రెండు మార్గాలూ ఇప్పుడు దాదాపు మూసుకునిపోయాయి. ‘‘దేశాలు స్వాతంత్య్రాన్ని, జాతులు విముక్తిని, ప్రజలు విప్లవాన్ని కోరుకుంటున్నారు’’ అంటూ కమ్యూనిస్టు పార్టీలు ఓ యాభై ఏళ్ళ క్రితం చాలా గట్టిగా మాట్లా డేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉద్యమాల్లో పాతవాళ్ళు తగ్గిపోతున్నారు; కొత్తవాళ్ళు రావడం లేదు. ఇది నేటి వాస్తవ స్థితి. దీనికి కారణం ఆ యా పార్టీలు అనుసరించిన విధానాలా? మరొకటా? అనే చర్చల వల్ల ఇప్పుడు ప్రయో జనం లేదు. చరిత్రలో జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిందేమిటీ? అనేదే చర్చనీయాంశం కావాలి. ప్రత్యామ్నాయ మార్గాలుసోషలిస్టు కలను సాకారం చేసుకోవడానికి అభిమా నులు వందేళ్ళు ఎదురుచూడటమే మహత్తర విషయం. దీర్ఘకాల పోరాటం కనుక ఇంకో వందేళ్ళు ఆగాలి అని ఎవరయినా చెప్పవచ్చు. వందేళ్ళు గడిచిపోయాయి కనుక సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. సమ సమాజం కుదరకపోతే దానికి దగ్గరి ప్రత్యామ్నాయాలు ఏమిటీ? అనేది. దానికి వెంటనే స్ఫురించే సమాధానం సంక్షేమ రాజ్యం. నార్డిక్ దేశాలయిన స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ సంక్షేమ దేశాలని చాలామందికి తెలుసు. పశ్చిమ యూరప్‌లో జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, స్విట్జర్లాండ్ కూడా తమవైన పద్ధతుల్లో సంక్షేమ రాజ్యాలని బయటికి అంత తెలీదు. వీటిల్లో జర్మనీ రాజకీ యార్థిక పరిణామాలతో ఇండియాకు పోలికలున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1919 నుండి 1933 వరకు జర్మనీలో కొనసాగిన ‘వైమర్ రిపబ్లిక్’ను స్థూలంగా ప్రజాస్వామ్యయుత పాలన అనవచ్చు. 1933 నుండి 1945 వరకు అడాల్ఫ్ హిట్లర్ ‘నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ’ పేరిట ‘నాజీ’ పాలన సాగించాడు. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వానికి గరిష్ఠ రూపం... నాజీజం. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓడిపోయిన తరువాత జర్మనీ ‘మిత్రరాజ్యాల’ అధీనంలో వలస దేశంగా మారిపోయింది. ఆ దేశాన్ని నాలుగు ముక్కలు చేసి యూకే, ఫ్రాన్స్, అమెరికా, రష్యాలు తలో భాగాన్ని తమ అధీనంలోనికి తీసుకున్నాయి. ఓ నాలుగేళ్ళు ప్రత్యక్ష వలస పాలన సాగాక జర్మనీ రెండుగా విడిపోయింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ల ప్రాబ ల్యంలోని పశ్చిమ ప్రాంతం 1949 మే 23న ‘ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ’ (ఎఫ్ఆర్జీ)గా అవతరించింది. అదే ఏడాది అక్టోబరు 7న రష్యా ప్రాబల్యంలోని తూర్పు ప్రాంతం ‘జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్’గా ఏర్పడింది. అప్పట్లో పశ్చిమ జర్మనీని పెట్టుబడిదారీ దేశంగానూ, తూర్పు జర్మనీని సోషలిస్టు దేశంగానూ చెప్పు కునేవారు. కారణాలు ఏమైనాగానీ, తూర్పు జర్మనీవాళ్ళకు పశ్చిమ జర్మనీ మీద గొప్ప మోజు వుండేది. వాళ్ళు పెద్ద ఎత్తున పశ్చిమ జర్మనీకి వలస పోయేవారు. దీనిని అరికట్టడానికి బెర్లిన్ నగరాన్ని రెండు ముక్కలు చేసి 1961 ఆగస్టు నెలలో అడ్డంగా భారీ గోడ కట్టింది తూర్పు జర్మనీ. దీనికి ‘ఫాసిస్టు వ్యతిరేక రక్షణ గోడ’ అని గొప్ప పేరు పెట్టారు. అయినా జీడీఆర్ నుండి వలసలు ఆగలేదు.హంగేరీ, జకోస్లోవేకియాల మీదుగా పశ్చిమ జర్మనీకి చేరు కోవడం మొదలెట్టారు. 1980ల చివర్లో తూర్పు జర్మనీతో పాటు పోలాండ్, హంగేరి, చెకోస్లావియా, రొమేనియా, బల్గేరియా తదితర తూర్పు యూరోప్ దేశాల్లోనూ సోష లిస్టు పాలకులకు వ్యతిరేకంగా నిరసనలు మొదల య్యాయి. ఇవి ముదిరి 1989 నవంబరు 9న బెర్లిన్ గోడను కూల్చేశారు. ఆ తరువాత ఆరు దేశాలు సంయుక్తంగా చర్చించి 1990 అక్టోబరు 3న తూర్పు జర్మనీని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీలో విలీనం చేశాయి. జర్మనీ, ఇండియాల సామ్యం...రెండు జర్మనీల విలీనం అంటే విధానపరంగా పెట్టుబడిదారీ, సోషలిస్టు సమాజాల సంకీర్ణం అని అర్థం. ఇప్పటి జర్మనీలో ఈ రెండు ధోరణులేగాక ఉదారవాదం, మతవాదం తదితర అనేక ధోరణులు కనిపిస్తాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మితవాదులు పుంజుకున్న ప్పటికీ మధ్యేవాదులకు అధికారం దక్కింది. మనలాగే ప్రజాస్వామిక, నాజీయిస్టు, వలస, సోషలిస్టు, పెట్టుబడి దారీ దశలన్నింటినీ చవిచూసిన జర్మనీ ఇప్పుడు పశ్చిమ యూరప్‌లో ఒక మెరుగయిన సంక్షేమ రాజ్యంగా కొనసాగుతోంది. ఇండియా, జర్మనీ స్థూల జాతీయోత్ప త్తులు కూడా దాదాపు సమానం. ఇప్పటి ఇండియా ప్రభుత్వ స్వభావం మీద ఫాసిస్టా? కొత్త ఫాసిస్టా? సగం ఫాసిస్టా? అంటూ చర్చ సాగుతోంది. మన దేశంలో కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం కొన సాగుతోందనే అభిప్రాయం బలపడుతోంది. దేశంలోని సహజ వనరుల్ని, మౌలికరంగాలను ఎలాగూ కార్పొరేట్ల పరం చేసేస్తారు. మనం గతంలో ఎన్నడూ ఊహించనంతటి భీకర విస్తాపన సాగుతుంది. దానిని ఇప్పట్లో ఎవరూ ఆపలేరు. సోషలిజం సాధించగల సత్తాగల పార్టీ ఒక్కటీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆచరణాత్మకంగా ఒక సంక్షేమ రాజ్యాన్ని ఆశించడం ఒక్కటే సమంజసంగా ఉంటుంది. మనం ఆ దిశగా ఆలోచించాలి. దానికోసం ప్రయత్నించాలి.డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు ‘ 90107 57776 -
ఉత్తర – దక్షిణ సంకటం
ఊహించినట్లే జరుగుతోంది. ‘డీలిమిటేషన్’ భూతం మనల్ని వెంటాడుతోంది. జనాభా లెక్కలు దగ్గర పడిన కొద్దీ అది మనకు ఇంకా చేరువ అవుతోంది. అయినా మోదీ ప్రభుత్వం ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటోంది. కానీ ‘నియోజక వర్గాల పునర్విభజన’ భయాలు అలా కొట్టేయదగినవి కావు. ఎందుకని? కారణం వెరీ సింపుల్. ఇందులో బుర్ర బద్దలు కొట్టుకోవల్సిందేమీ లేదు. నియోజక వర్గాలు జనాభాపరంగా సైజులో సమానంగా ఉండాలి. ఇప్పుడలా లేవు. కాబట్టి దేశవ్యాప్తంగా నియోజక వర్గాలు ఒకే సైజులో ఉండేట్లు వాటిని పునర్ విభజించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో, జనసంఖ్య వేగంగా పెరిగిన రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కంటే ఎక్కువ నియోజక వర్గాలు ఏర్పడతాయి. మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 వద్దే స్థిరంగా ఉంచేట్లయితే, జనాభా నియంత్రణ పటిష్ఠంగా అమలు చేసిన రాష్ట్రాల్లో సహజంగానే నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుంది. ఆ మేరకు ఇతర రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి. ఒకరి నష్టం మరొకరికి లాభం అవుతుంది. సంఖ్య పెరిగినా ఒరిగేదేంటి?మిలన్ వైష్ణవ్, జేమీ హింట్సన్‌ల అధ్యయనం సూచించిందిదే! అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ పార్లమెంటు నియోజకవర్గాలు తగ్గు తాయి. ఉదాహరణకు కేరళ, తమిళనాడు చెరో 8 సీట్లు కోల్పోతాయి. ఆంధ్ర, తెలంగాణలు రెంటికీ కలిపి చూస్తే అవీ ఇన్ని స్థానాలు నష్ట పోతాయి. కర్ణాటక నుంచి 2 స్థానాలు ఎగిరిపోతాయి. జనాభాను నియంత్రించిన ఇతర రాష్ట్రాలూ ఇలాగే దెబ్బతింటాయి. పశ్చిమ బెంగాల్ నాలుగు, ఒడిషా మూడు, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమా చల్ ప్రదేశ్ ఒక్కో నియోజకవర్గం పోగొట్టుకుంటాయి. ఇక అనేక ఉత్తరాది రాష్ట్రాల స్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ జాబితాకు 11 స్థానాలు అదనంగా కలుస్తాయి. బిహార్ 10, రాజస్థాన్ 6, మధ్యప్రదేశ్ 4 సీట్లు పెంచుకుంటాయి. ఫలితంగా, 543లో 226 సీట్లతో ఇప్పటికే ఆధిపత్యం చలాయిస్తున్న ‘హిందీ హార్ట్‌ల్యాండ్’ డీలిమిటేషన్ అనంతరం తన ప్రాబల్యాన్ని విశేషంగా 259కి పెంచుకుంటుందని యోగేంద్ర యాదవ్ తేల్చారు. దక్షిణాది రాష్ట్రాలు అన్నిటికీ కలిపి ప్రస్తుతం 129 సీట్లు ఉన్నాయి. పునర్విభ జన అనంతరం ఇవి 26 సీట్లు కోల్పోతాయని యోగేంద్ర యాదవ్ లెక్క గట్టారు. దీంతో పార్లమెంటులో వాటి ప్రాతినిధ్యం, పలుకుబడి గణనీయంగా క్షీణిస్తాయని వేరే చెప్పనక్కర్లేదు.డీలిమిటేషన్ సమయంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని లోక్ సభ సీట్ల సంఖ్య పెంచే వీలుందని అంటున్నారు. ఇది కొంచెం నయం. కానీ అలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుందా? మొత్తం స్థానాల సంఖ్య పెంచినా, ప్రతి రాష్ట్ర నియోజకవర్గాలూ అదే నిష్పత్తిలో పెరుగుతాయి. అదీ ఉత్తరాదికే అనుకూలిస్తుంది. ఉత్తరాది–దక్షిణాది నిష్పత్తి ప్రకారం చూస్తే, దక్షిణాది రాష్ట్రాలకు ఒరిగేదే ఉండదు. వాటి సీట్ల సంఖ్య పెరిగినా ప్రయోజనం ఉండదు. వాటి ప్రాతినిధ్యం, పలుకు బడి పూర్వస్థితికి అంటే ఇప్పటి స్థాయికి చేరుకోవు. కాబట్టి, ఈ చర్య కూడా దక్షిణాది భయాలను తొలగించేది కాదు. పరిస్థితి ఏమీ మారదు. ఆ మధ్య ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ లెక్క వేసింది. సమస్యను ఈ గణాంక విశ్లేషణ తేటతెల్లం చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఐదు దక్షి ణాది రాష్ట్రాలకు కలిపి మొత్తం 543లో 129 సీట్లు ఉన్నాయి. అంటే 24 శాతం. ప్రస్తుత లోక్ సభ సీట్ల సంఖ్యను 790కి పెంచారే అనుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాల నియోజకవర్గాలు 152కి పెరుగుతాయి. నిజమే. కానీ మొత్తంలో వాటి వాటా కేవలం 19 శాతానికి కుదించుకు పోతుంది. తమిళనాడు విషయం చూస్తే, దాని వాటా ఇప్పుడున్న 7.2 నుంచి 5.4 శాతానికి పడిపోతుంది.ఏ విధంగా చూసినా దక్షిణాది రాష్ట్రాల క్షోభ అర్థం చేసుకో దగినదే!ఉత్తరాది బాధకానీ రెండో వైపు నుంచి చూస్తే, ఉత్తరాదిదీ సంకట స్థితే! ఆర్. జగన్నాథన్ గణాంక విశ్లేషణ ప్రకారం, మారిన జనాభా నేపథ్యంలో కేరళ పార్లమెంటు సభ్యుడు సగటున 18 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదే రాజస్థాన్ ఎంపీ సగటున 33 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ రకంగా చూసుకుంటే తమకు ఉండవలసిన వారి కంటే చాలా తక్కువ మంది ఎంపీలు ఉన్నారని, ఇది అన్యాయమని హిందీ బెల్టు కూడా వాదించగలదని జగన్నాథన్ అభిప్రాయపడుతున్నారు. ఇది నిజంగా భారత ప్రజాస్వామ్యానికే డైలమా! అసలు సమస్య ఇది: నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఉత్తరాది ఆందోళన పరిష్కారం అవుతుంది. అయితే, ఈ చర్య దక్షిణా దికి క్షోభ కలిగిస్తుంది. యోగేంద్ర యాదవ్ వాదిస్తున్నట్లు డీలిమి టేషన్‌ను వాయిదా వేయడం – లేదా శాశ్వతంగా రద్దు చేయడం ద్వారా యథాతథ స్థితి కొనసాగించవచ్చు. దక్షిణాది భయాలు తొలగి పోతాయి. మరి ఉత్తరాది వారు తమకు జరుగుతుందని భావిస్తున్న అన్యాయం మాటేమిటి? అది అలాగే మిగిలిపోతుంది. కాబట్టి, ఎలా చేసినా ఏదో ఒక పక్షం నష్టపోవడం తప్పదు.మరి దీనికి పరిష్కారం లేదా? ఇది చిటికేసినంత సులభంగా పరిష్కరించే సమస్య అయితే కాదు. నిజం చెప్పాలంటే, మన ప్రజా స్వామ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో కచ్చితంగా ఇదొకటి. వాస్తవానికి వ్యవస్థలో పెను ఉపద్రవానికి దారి తీయగల ఒక నిర్మాణలోపం ఇది. దీన్ని తేలిగ్గా తీసిపారేయడమో, దాటవేయడమో సరైన వైఖరి కాదు. సవాలును సవాలుగా స్వీకరించి అమీతుమీ తేల్చుకోవాల్సిందే. ఇదంత సులభం కాకపోవచ్చు. పోనీ మరొక ప్రత్యామ్నాయం ఉందా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అమిత్ షా (హోం మినిస్టర్) రాయని డైరీ
‘‘నన్ను దీవించండి మోదీజీ’’ అన్నాను తలను కాస్త వంచి, చేతులు జోడించి. మోదీజీ నన్ను వెంటనే దీవించలేదు.‘‘ముఖంలో ఏమిటా అలసట, నుదుటిపై ఏమిటా చెమట?’’ అని అడిగారు!‘‘బస్తర్ నుంచి వస్తున్నాను మోదీజీ. నన్ను దీవించండి’’ అన్నాను. ‘‘తొందరేమొచ్చింది అమిత్ జీ? చేతులు, ముఖం కడుక్కుని, బట్టలు మార్చుకున్నాకే రావలసింది కదా’’ అన్నారు.ఇంకా వగరుస్తూనే ఉన్నాన్నేను.‘‘ఈసారి 30 మోదీజీ. జనవరిలో 48, ఫిబ్రవరిలో 40. మొత్తం కలిపి ఈ 80 రోజుల్లో 120. బస్తర్ నుంచి ఇంటికి వెళ్లకుండా నేరుగా మీ దగ్గరకే వచ్చేశాను. నన్ను దీవించండి మోదీజీ’’ అన్నాను.మోదీజీ నన్ను దీవించలేదు!‘‘30+48+40 = 118 కదా అమిత్ జీ, 120 ఏమిటి? రౌండ్ ఫిగర్ కోసం రెండు కలిపారా?’’ అన్నారు.‘‘లేదు మోదీజీ, రౌండ్ ఫిగర్ కోసం కలపలేదు. ఏమంత పెద్ద ఫిగర్ కాదు కదా అని కలపలేదు. 30కి 48కి మధ్యలోనో, 48కి 40కి మధ్యలోనో ఆ 2 ఎక్కడో ఉండి ఉంటుంది. చూసి చెబుతాను’’ అన్నాను.‘‘చూసి చెప్పటం కాదు అమిత్ జీ. చూశాకే చెప్పాలి. లేకుంటే ‘గ్రోక్’కి, మనకు తేడా ఉండదు. గ్రోక్ బుర్ర పెట్టి చెప్పదు. బుర్రలో పెట్టిన దాన్ని బట్టి చెబుతుంది’’ అన్నారు మోదీజీ.ఆయన ‘గ్రోక్’ని అంటున్నారా, నన్ను అంటున్నారా అర్థం కాలేదు. బహుశా ఇద్దర్నీ కలిపి కావచ్చు. ‘‘నిజమే మోదీజీ. గ్రోక్ బుర్ర పెట్టి చెప్పదు. బుర్రలో ఏది పెడితే అది చెబుతుంది’’ అన్నాను. అందుకు ఆయనేమీ సంతోషించలేదు. ‘‘బుర్రలో ఏం పెట్టారన్నది కాదు అమిత్జీ, బుర్రలో ఎవరు పెట్టారన్నది పాయింట్’’ అన్నారు.ఆయన ఆవేదనలో అర్థం ఉంది.మోదీజీ గురించి గ్రోక్ ఒక్క మంచి విషయం కూడా చెప్పటం లేదు. ఆయన్ని మతవాది అంటోంది. ఆయనవన్నీ మత వ్యూహాలు అంటోంది. ‘‘గ్రోక్లో ఒకటి గమనించారా అమిత్జీ?’’ అని అడిగారు మోదీజీ.‘‘గమనించాను మోదీజీ! మీ గురించి ఏం చెబితే విమ్మల్ని ద్వేషించేవారు సంతోష పడ తారో అది మాత్రమే చెప్పి గ్రోక్ వారిని సంతోష పెడుతోంది. అలాగే, మీ గురించి ఏం అడిగితే తమను సంతోషపెట్టే సమాధానాలను గ్రోక్ చెబుతుందో ఆ ప్రశ్నల్నే గ్రోక్‌ను వాళ్లు అడుగుతున్నారు’’ అన్నాను.‘‘మీరు కొట్టి చూశారా గ్రోక్లో నా గురించి?’’ అని హఠాత్తుగా అడిగారు మోదీజీ.‘‘చూశాను మోదీజీ. మీ గురించి గొప్పగా చెప్పింది. ‘స్ట్రాంగ్ లీడర్షిప్, విజన్ ఫర్ డెవలప్మెంట్, కమిట్మెంట్ టు నేషనలిజం’’ అని చాలా చాలా చెప్పింది’’ అన్నాను.‘‘అదెలా అమిత్ జీ! గ్రోక్‌కి ఇచ్చిన ఫీడ్ ఒకటే అయినప్పుడు వాళ్లకు ఒకలా, మీకు మరొకలా గ్రోక్ నా గురించి చెప్పటం ఏమిటి?’’ అని అడిగారు మోదీజీ.‘‘నమ్మించటం కోసం ఫీడ్‌లో రెండూ ఉంచుతారు మోదీజీ. ‘గ్రోక్’ ఎలాన్ మస్క్‌ది కదా! అయినా సరే, అమెరికాలో అత్యంత దుష్టుడైన మానవుడు ఎవరో గ్రోక్‌ని అడిగి చూడండి. ఎలాన్ మస్క్ అని చెబుతుంది. అదెలా ఉంటుందంటే... బస్తర్‌లో రెండో వైపు కూడా ఒకటో రెండో ఉంటాయి కదా, అలాగ’’ అన్నాను.బస్తర్ అనగానే మోదీజీ మళ్లీ మూడ్ ఆఫ్ లోకి వెళ్లిపోయారు. ‘‘బుర్రల్ని పాడుచేసేవారు బస్తర్ లోపల మాత్రమే ఉంటారని నేను అనుకోను అమిత్ భాయ్’’ అన్నారు.ఎంతో లోన్లీగా ఫీల్ అయితే తప్ప మోదీజీ అలా నన్ను అమిత్ ‘భాయ్’ అనరు. ‘‘చేస్తాను మోదీజీ, అదంతా సెట్ చేస్తాను. నన్ను దీవించండి’’ అన్నాను తలను కాస్త వంచి, చేతులు జోడిస్తూ. -
దక్షిణ భారతంతో హిందీ తగువు
దక్షిణ భారతదేశానికి (తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ) ఉత్తర భారతదేశానికి ప్రధానంగా కనబడే వైరుద్ధ్యం భాషతో ముడిపడి ఉంది. లిపిలోగానీ, పద ప్రయోగంలో గానీ, ఉత్పత్తి సంబంధితఅవగాహనలోగానీ దక్షిణ భారత భాషలు ఉత్తర భారత భాషలకంటే భిన్నమైనవి.లిపి రూపంలో దక్షిణ భారత భాషలకు ప్రాకృత పాళీ భాషతో సంబంధమున్నా అవిక్రమంగా భిన్నమైన అక్షర రూపం తీసుకున్నాయి. బహుశా దక్షిణ భారత భాషలైన తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం – సంస్కృతం ఈ దేశంలో కాలిడక ముందున్న హరప్పన్ భాషతో ముడిపడిఉండవచ్చు. ఈ సంబంధం మీద తమిళనాడులో ఈ మధ్యనే కొంత లోతైన పరిశోధన మొదలైంది.హిందీ, మరాఠీ, గుజరాతి, రాజస్థానీ పూర్తిగా సంస్కృత ఆధా రిత భాషలు. అక్షర రూపంగానీ, పదకోశంగానీ, అవి బోధించిన జీవన విధానంగానీ సంస్కృత భాష సంస్కృతి నుండి రూపొందించ బడ్డాయి. బెంగాలీ, ఒరియా ఈ భాషా విధానాలకు కాస్త భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తాయి. అవి పదకోశంలో హిందీతో మైత్రిలో ఉన్నట్టు కనిపిస్తాయి. లిపి భిన్నమైందే. అయితే అవి కూడా మాగధి, ప్రాకృతి నుండే ఎదిగాయని వాళ్ళు భావిస్తారు. సంస్కృతం ఇండో–యూరో పియన్ భాష అని, బెంగాలీ పూర్తిగా భారతీయ భాష అనీ బెంగాలీలు కూడా భావిస్తారు. అయితే తమిళం లాగా బెంగాలీకి అతి ప్రాచీన చరిత్ర ఉన్నట్టు కనిపించదు. సంగమ సాహిత్యం లాంటి ప్రాచీన ఉనికి ఆధారాలు బెంగాలీకి లేవనే చెప్పాలి.ఆంగ్లాన్ని అక్కున చేర్చుకున్న దక్షిణాదిదక్షిణ భారత భాషలు అభివృద్ధి చెందిన ఐదు రాష్ట్రాల ఆర్థిక స్థితి ఆ భాషల వ్యవసాయక మైత్రి వల్ల బాగా మారింది. ఈ ఐదు రాష్ట్రాలు సమతుల్యంగా వ్యవసాయ అభివృద్ధిలో, విద్యాభివృద్ధిలో, ఇంగ్లిష్ భాషను కూడా త్వరగా తమలో లీనం చేసుకోవడంలో ఒకే లక్షణాలను కలిగి ఉన్నాయి. వీటి మీద హిందీ భాషను రుద్దినప్పుడు ఒక్క తమిళనాడులోనే పెరియార్ రామసామి ఉద్యమం ద్వారా బల మైన వ్యతిరేకత వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో అటువంటి నాయకత్వం లేక హిందీని మోస్తూ వచ్చాయి.1960 దశకంలో నేను చిన్న గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు తెలుగు అక్షరాల తరువాత హిందీ అక్షరాలు నేర్పారు. ఆ తరువాత చాలా దూరపు గ్రామంలో ఉన్న మిడిల్ స్కూల్లో చేరాక ఇంగ్లిష్ అక్షరాలు నేర్పడం ప్రారంభమైంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ అక్షర జ్ఞానంలో హిందీ నేర్చుకోవడం కష్టతరంగా ఉండింది. ఇంగ్లిష్ అక్షరాలు నేర్చుకోవడం అన్నింటికంటే సులభంగా ఉండింది. పదకొండో తరగతి వరకూ హిందీ ఒక సబ్జెక్టుగా చదివినా అది నాకు జీవితంలో ఎటువంటి పనిలో, నేర్పులో ఉపయోగపడ లేదు. నా జ్ఞానాన్ని విస్తృతపర్చలేదు. ఇంగ్లిష్‌లో, తెలుగులో ఎక్కువ జ్ఞానం సంపాదించడానికి నిజానికి హిందీ అడ్డుపడింది. పరీక్షా సమ యాల్లో 25 మార్కులు సంపాదించి పాస్ కావడం ఒక టార్చర్‌గా మారేది. నాతో చదువుకున్న మెజారిటీ విద్యార్థుల అనుభవం అదే. తమిళనాడు హిందీని స్కూళ్లలో బోధించ నిరాకరించి ఇంగ్లిష్, తమిళ భాషలపై మాత్రమే దృష్టి పెట్టినందున తమిళ బ్రాహ్మణులతో పాటు, తమిళులందరూ లాభపడ్డారు. బహుశా అందులో ఇప్పుడు పెరియార్‌ను దూషణలాడే నిర్మలా సీతారామన్, ఇంగ్లిష్ బాగా నేర్చు కున్నందువల్లే విదేశీ మంత్రి అయిన జయశంకర్ కూడా ఉన్నారు. పెరియార్ తమిళ భాషను బార్బారిక్ (ఆటవిక) భాష అన్నారని నిర్మలా సీతారామన్ కొత్త సిద్ధాంతం చెబుతున్నారు.వాళ్లెందుకు ఇక్కడిది నేర్చుకోలేదు?నేను మూడు భాషల చదువుతో ఆంధ్రప్రదేశ్‌లో కుస్తీ పడుతున్న రోజుల్లో ఉత్తరాది హిందీ రాష్ట్రాల విద్యార్థులు మాత్రం ద్విభాషా విద్యా విధానంలో చదువుకున్నారు. వాళ్లకు ఏ దక్షిణ భారత భాషనూ మూడో భాషగా నేర్చుకునే అవసరం లేకుండింది. ఇప్పటికీ దాదాపు అదే పరిస్థితి. ఈ మధ్యనే ఉత్తరాదిలో నామమాత్రంగా ఏదో ఒక మూడో భాష పాఠశాల స్థాయిలో ఉండాలని నిర్ణయిస్తే హరియాణా మూడవ భాషగా పంజాబీని చేర్చుకుంది.ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఏ మూడో భాషను త్రిభాషా విధానాల్లో చేర్చారో తెలియదు. అది ఏదైనా అదే సంస్కృత–హిందీ లిపి, పద కోశం ఉన్నవాటిని మూడో భాషగా నామమాత్రంగా పెట్టుకుంటారు. హిందీని దేశ భాషగా అందరి మీదా రుద్దే హిందీవాదుల మాయా వాదం ఇది. ఇది స్వాతంత్య్రం వచ్చిన మొదటి దశకంలో కూడా జరిగింది. ఇప్పుడు ఆరెస్సెస్/బీజేపీ హయాంలో మళ్ళీ మొదలైంది. ఇంకా పెరుగుతుంది. ‘ఏక జాతి, ఏక భాష’ సిద్ధాంతంలో ఇదంతా భాగం.దక్షిణాది రాష్ట్రాలు చాలా రంగాల్లో ఉత్తరాది రాష్ట్రాల కంటేముందున్నాయనే విషయం తెలుసు. బొంబాయి, గుజరాత్, ఇతర ఉత్తరాది పెట్టుబడిదారులు తమ పిల్లల్ని పూర్తిగా ఇంగ్లిష్ బోధించే ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తూ పాలకులుగా మాత్రం తాము హిందీ వాదులమనే డ్రామా ఆడుతున్నారు. త్రిభాషా నాటకమంతా దక్షి ణాది అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆడుతున్నది.అభివృద్ధి ప్రధానంగా ఆధునిక స్కూలు విద్యతో ముడివడి ఉన్నది. ఆ స్కూలు విద్య దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంకంటే మెరుగ్గా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్కూలు విద్యను పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుకున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలు స్కూళ్లలో ఇంగ్లిష్/ప్రాంతీయ భాషల సెక్షన్లను సమాంతరంగా నడుపుతున్నాయి. ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం విద్య నుండి శ్రమజీవుల కుటుంబాలను, కులాలను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం విద్య దక్షిణాదికంతా పాకింది. ఈ విద్యను హిందీ ఆధి పత్యవాదం అడ్డుకోజూస్తోంది. అందులో భాగంగానే తమిళనాడులో మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యను తమిళ భాషలో బోధించాలని దేశ హోంమంత్రి అమిత్ షా కొత్త వాదన ప్రారంభించారు. అది ఆ రాష్ట్రం నిర్ణయించుకుంటుంది. అమిత్ షా ఎలా బలవంతం చేస్తారు? నిర్మలా సీతారామన్ పెరియార్‌పై కూడా దాడి చేస్తున్నారు.హిందీ మీద అంత ప్రేమ ఉన్న నిర్మలా సీతారామన్ తన కూతుర్ని హిందీ మీడియంలో ఎందుకు చదివించలేదు? పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో చదివించి, బ్రిటన్ చదువులకు ఎందుకు పంపారు? ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని అధికారం నిలబెట్టుకోవడానికి వాడుకుంటే అది ఆమె ఇష్టం. కానీ మొత్తం దక్షిణ భారతదేశాన్ని దెబ్బతీసే ఆ సిద్ధాంతాలను ఆమె కూడా రోజువారీ వల్లించడం బాగాలేదు.అన్నింటికీ తలూపుతున్న బాబు!హిందీ భాష, దక్షిణాది పార్లమెంట్ సీట్లను తగ్గించే డీలిమిటేషన్ పాలసీలకు వ్యతిరేకంగా దక్షిణాది ఐదు రాష్ట్రాలూ ఐక్యంగా పోరాడ వలసి ఉంది. అయితే చంద్రబాబు మద్దతుపై ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఆధారపడి ఉన్నప్పటికీ ఆయన వారు ఏమి చేసినా మద్దతు ఇస్తున్నారు. ఒకప్పుడు ‘నేనే కింగ్ మేకర్ని’ అన్న బాబు ఇప్పుడు మోదీ, అమిత్ షా చెప్పింది బడి పిల్లాడిలా పాటిస్తున్నారు. ఆయన ఎంపీలు కూడా ఆయన చేతిలో ఉన్నట్టు కనిపించడం లేదు. సొంత మెజారిటీ లేని బీజేపీ... ఆరెస్సెస్ ఎజెండాను అమలు చేసి దక్షిణ భారతాన్ని దెబ్బతీస్తే అందుకు పూర్తి బాధ్యత చంద్రబాబుదే అవుతుంది.హిందీ వ్యవహారం గానీ, డీలిమిటేషన్ గానీ ప్రమాదకరమైనవి. పవన్ కల్యాణ్ ఆరెస్సెస్‌ను మించిన రామభక్తుడై మోదీ, మోహన్ భాగవత్ సైతం అసహ్యించుకునే వేషాలు వేస్తున్నారు. వారి హిందీ, డీలిమిటేషన్ వాదనలు తమ వాదనలైనట్టు నటిస్తున్నారు.స్టాలిన్ మొదలెట్టిన పోరాటానికి ఒక్క ఏపీ తప్ప మిగతా అన్ని రాష్ట్రాలూ మద్దతిస్తున్నాయి. ఇది ముదిరితే ఈ పోరులో చంద్రబాబు ముందుగా మునిగిపోతారు. దక్షిణ భారతదేశం ఆయన్ని ఒక ద్రోహిగా నిలబెడుతుంది.» అభివృద్ధి ప్రధానంగా ఆధునిక స్కూలు విద్యతో ముడి పడి ఉంది. ఉత్తరాది పెట్టుబడిదారులు తమ పిల్లల్నిఇంగ్లిష్ ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తూ పాలకులుగా మాత్రం తాము హిందీవాదులమనే డ్రామా ఆడుతున్నారు.» హిందీ భాష, దక్షిణాది పార్లమెంట్ సీట్లను తగ్గించే డీలిమిటేషన్ పాలసీలకు వ్యతిరేకంగా దక్షిణాది ఐదు రాష్ట్రాలూ ఐక్యంగా పోరాడవలసి ఉంది. కానీ, ఒకప్పుడు ‘నేనే కింగ్ మేకర్ని’ అన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రానికి అన్నింటికీ తలాడిస్తున్నారు.-వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు-ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
దక్షిణాది హక్కుల శంఖారావం
కేంద్రానికీ, దక్షిణాది రాష్ట్రాలకూ మధ్య ఏకీ భావ, సానుకూల వాతావరణం రోజురోజుకీ చెదిరి పోతున్నది. ఈ నేపథ్యంలో – తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ నెల 22న చెన్నైలో దక్షిణాది ముఖ్యమంత్రుల సమావే శాన్ని ఏర్పాటు చేయటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బీజేపీ సారథ్యంలోని జాతీయ ప్రజా స్వామిక కూటమి (ఎన్డీయే)లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా దేశంలోని తక్కిన దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ ఆహ్వాన పత్రాలు పంపారు. నూతన విద్యా విధానం పేరుతో హిందీ బోధనను తప్పనిసరి చేయాలని చూడటం, నియోజకవర్గాల పునర్విభ జనకు రంగం సిద్ధం చెయ్యటం వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకోవటం కోసం మద్దతును సమీకరించుకునేందుకు స్టాలిన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. సమావేశానికి పశ్చిమ బెంగాల్, పంజాబ్ ముఖ్య మంత్రులనూ, ఇతర రాష్ట్రాల పార్టీ నాయకులనూ స్టాలిన్ ఆహ్వానించారు. 2056 వరకు వాయిదా వేయాలి!నియోజకవర్గాల పునర్విభజన విషయాని కొస్తే, లోక్ సభలో ప్రస్తుతమున్న 543 స్థానాల సంఖ్యను 1973లో ఏర్పాటైన మూడవ డీలిమిటే షన్ కమిషన్ 1971 జనగణన ప్రకారం నిర్ణయించింది. కుటుంబ నియంత్రణ అన్ని రాష్ట్రాల్లో పక డ్బందీగా అమలయ్యేలా చూడటం కోసం ఇంది రాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను 2001 జనాభా లెక్కల నాటి వరకు స్తంభింపజేసింది. జనాభాను తగ్గించుకుంటే దేశ ప్రజలు పరిమిత వనరులతో సుఖంగా బతకగలరనే ఉద్దేశంతో ఉత్తరాదిలో కూడా దానిని సాధించేవరకు పార్లమెంటరీ నియో జకవర్గాల పునర్విభజనను వాయిదా వేయాలని నిర్ణయించారు. కానీ, 2001 లెక్కల తర్వాత కూడా ఉత్తరాది పరిస్థితిలో మార్పు కనిపించక పోవడంతో అప్పటి వాజపేయి ప్రభుత్వం ఈ ప్రక్రియను 2026 వరకు స్తంభింపజేసింది. ఇప్ప టికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఇక ఇప్పుడు నియోజక వర్గాల విభజనను చేపడితే దక్షిణాది రాష్ట్రాలు 20 స్థానాలకు పైగా కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. పునర్విభజన వల్ల ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమే అదనంగా 60 స్థానాలు పొందుతుందని అంచనా. అంతేకాదు, లోక్‌సభ స్థానాల్లో దక్షిణాది వాటా 19 శాతం తగ్గిపోయి, హిందీ మాట్లాడే రాష్ట్రాల వాటా 60 శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ అన్యాయాన్ని తొలగించడం కోసం నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియను 2056 వరకు వాయిదా వేయాలని స్టాలిన్ కోరుతున్నారు. అందుకే ఈ ‘జాయింట్ యాక్షన్ కమిటీ’ సమావేశం. ఇప్పటికే కేంద్రం నుంచి అందుతున్న నిధుల వాటాలో దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురవుతుండటం స్పష్టంగానే కనిపిస్తోంది. తమిళ నాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి 2024లో ప్రత్యక్ష పన్నుల ద్వారా 25 శాతం, సెంట్రల్ జీఎస్టీ ద్వారా 27 శాతం నిధులు కేంద్రానికి అందగా, వాటి నుంచి ఈ రాష్ట్రాలకు 15 శాతం నిధులే వచ్చాయి. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రం నుంచి 36 శాతం నిధులు పొందాయి. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వమే ఇటీవల పార్లమెంటులో తెలియజేసింది. ఆంగ్లమే కొనసాగుతుందన్న హామీ!ఇక తమిళనాడు పాటిస్తున్న ద్విభాషా విధా నానికి చాలా చరిత్రే ఉంది. 1937లో, 1968లో త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆ రాష్ట్రం దానిని వదిలించుకుంది. 1937లో, అంటే బ్రిటిష్ హయాంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీని పాలించిన సి.రాజగోపాలాచారి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల్లో హిందీ బోధనను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిని పెరియార్ రామస్వామి సహా పలువురు పెద్దలు, ప్రతిపక్ష జస్టిస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడంతో మూడేళ్ల పాటు తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమం సాగింది. దానితో హిందీ తప్పనిసరి అనే ఉత్తర్వును ఉపసంహరించుకున్నారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా అధికార భాషపై రాజ్యాంగ సభలో వాడి, వేడి చర్చ జరిగింది. ఫలితంగా 1950 (రాజ్యాంగ అవతరణ సంవత్సరం) నుంచి 15 ఏళ్ల కాలం హిందీని అధి కార భాషగా, ఆంగ్లాన్ని అసోసియేట్ అధికార భాషగా కొనసాగించాలని నిర్ణయం తీసుకు న్నారు. దాంతో 1965 తర్వాత దేశానికి హిందీ ఏకైక అధికార భాష కాబోవడాన్ని హిందీయేతర రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఆ కారణంగా 1965 తర్వాత సైతం ఆంగ్లాన్ని కొనసాగించడానికి నిర్ణ యిస్తూ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1963లో అధికార భాషా చట్టాన్ని తెచ్చారు. అయినా దక్షి ణాదికి హిందీ భయం వదల్లేదు. 1965 దగ్గరపడ టంతో మద్రాస్ రాష్ట్రంలో హిందీ వ్యతిరేక ఉద్యమం తిరిగి పుంజుకున్నది. 70 మంది ఆందో ళనకారులు ప్రాణాలర్పించారు. దానితో హిందీ యేతర రాష్ట్రాలు కోరుకున్నంత కాలం ఆంగ్లం అధికార భాషగా కొనసాగుతుందని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హామీ ఇచ్చి పరిస్థితిని సద్దుమణిగించారు. ఆధునిక తమిళనాడు రూపశిల్పి సి.ఎన్. అన్నా దురై 1963లో పార్లమెంటులో అధికార భాషల బిల్లుపై చర్చలో మాట్లాడారు. 42 శాతం భారత ప్రజలు మాట్లాడుతున్న భాష గనుక హిందీని జాతీయభాషగా చేయాలనే డిమాండ్‌ను తన సహేతుక వాదనతో తిప్పికొట్టారు. హిందీ మాట్లాడే ప్రజలంతా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఒకే చోట కేంద్రీకృతమయ్యారని, దేశమంతటా విస్తరించి లేరని, అందుచేత హిందీ జాతీయభాష కాజాలదని స్పష్టం చేశారు. ఈ వాదన ఇప్పటికీ వర్తిస్తుంది. దక్షిణాది ప్రయోజనాలు పట్టని టీడీపీవెనుక ఇంత చరిత్ర ఉండగా, ఎన్నికల్లో లబ్ధి కోసం స్టాలిన్ ఈ సమావేశం పెడుతున్నారనటం రాజకీయమే అవుతుంది. కేంద్రం అవలంబిస్తున్న ఫెడరల్ వ్యతిరేక విధానాలపై రాష్ట్రాలను సమై క్యం, సంఘటితం చేయడానికే స్టాలిన్ సారథ్య పాత్ర వహిస్తున్నారు. ‘తెలుగుదేశం’ మూల పురు షుడు ఎన్టీ రామారావు ఏనాడో ‘కేంద్రం మిథ్య’ అన్నారు. రాష్ట్రాల స్వేచ్ఛకు, స్వతంత్ర మను గడకు ప్రాధాన్యమిచ్చే ఫెడరల్ వ్యవస్థను ఆయన గౌరవించారు. ఈ విషయంలో కేంద్రాన్ని సైతం ఢీకొన్నారు. కానీ ఇప్పటి ఆ పార్టీ నేతలు హిందీని జాతీయ భాషగా అంగీకరించని రాష్ట్రాల హక్కును, ఆ యా భాషల స్వతంత్రాన్ని హరించే ప్రయత్నాలకు అడ్డుచెప్పకపోగా అదే భారతీయత అనే పోకడలను అనుసరిస్తున్నారు. కూటమి భాగస్వాములుగా ఉంటున్నారే తప్ప, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల గురించి ఆలోచించటం లేదు. గార శ్రీరామమూర్తి వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సిరియాను కుదుటపడనివ్వరా?
అరవై సంవత్సరాలపాటు అస్సాద్ వంశ నియంతృత్వంలో మగ్గి గత డిసెంబర్లో విముక్తి చెందిన సిరియా ప్రజలు కుదుట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అందుకు రెండు శక్తుల నుంచి సవాళ్లు ఎదురవుతు న్నాయి. ప్రజల తిరుగుబాటుతో దేశం విడిచి పారిపోయిన బషార్ అల్– అస్సాద్, ఇజ్రాయెల్! అస్సాద్ సవాలు కనీసం పరోక్షమై నది, ఇజ్రాయెల్‌ది ప్రత్యక్షమైనది. డిసెంబర్ మొదటి వారంలో అస్సాద్ పతనం తర్వాత సిరియాను మరిచిపోయిన ప్రపంచం, పది రోజుల క్రితం అకస్మాత్తుగా పెద్ద ఎత్తున సాయుధ ఘర్షణ వార్తలు రావటంతో ఉలిక్కిపడింది. ఆ విధంగా దృష్టి ఉక్రెయిన్ యుద్ధం నుంచి కొద్ది రోజులపాటు ఇటు మళ్లింది. వారం రోజులపాటు ఆ ఘటనలలో సుమారు 1,500 మంది చనిపోయినట్లు అంచనా. అస్సాద్ పతనానికి ముందు పది రోజులపాటు సాగిన తిరుగుబాటులోనూ అంతమంది చనిపోలేదు.తిరగబడిన అలావైట్ తెగఈ ఘర్షణలకు కారణం, అస్సాద్‌కు చెందిన మైనారిటీ అలావైట్ తెగవారు తిరగబడటం! వారు ప్రధానంగా సిరియాలోని పశ్చిమ ప్రాంతాన మధ్యధరా సముద్ర తీరం వెంట నివసిస్తారు. వారు తెగను బట్టి మైనారిటీ మాత్రమేగాక, మతం రీత్యానూ మైనారిటీ. దేశంలో సున్నీలది మెజారిటీ కాగా వీరు షియాలు. షియా రాజ్యమైన ఇరాన్, అస్సాద్‌ను బలపరచటానికి గల కారణాలలో ఇది కూడా ఒకటి. తిరుగుబాటు విజయవంతమైనప్పటి నుంచి అలావైట్లలో సహజంగానే భయం ఏర్పడింది. వారు లెబనాన్‌కు తరలి పోవటం మొదలైంది. తిరుగుబాటు నాయకుడు అహమద్ అల్–షరారా, అటు వంటి ఆందోళనలు అక్కర లేదనీ, దేశంలోని అన్ని తెగలు, మతాలు, వర్గాలను ఏకం చేసి దేశాన్ని ముందుకు తీసుకుపోవటం తన లక్ష్యమనీ మొదటి రోజునే ప్రకటించారు.కానీ అలావైట్ షియాలకు, సున్నీలకు మధ్య స్థానికంగా కొన్ని కలహాలు జరగగా, ఉన్నట్లుండి అలావైట్ల పక్షాన సాయుధులు రంగంలోకి దిగారు. అనివార్యంగా ప్రభుత్వ సేనలు మోహరించగా ఘర్షణలు తీవ్ర రూపం తీసుకున్నాయి. వారం రోజులలో 1,500 మంది చనిపోయినట్లు అనధికార అంచనా కాగా, ప్రభుత్వం చేసిన ప్రకటనను బట్టి వారిలో సుమారు 200 మంది సైనికులున్నారు. మిగిలిన 1,300 మందిలో అలావైట్ పౌరులు ఎందరో, సాయుధ దళాల వారెందరో తెలియదు. అస్సాద్ సైన్యంలోని ఒక దళం తిరిగి ఒకచోట చేరి దాడులు ఆరంభించింది. అది స్థానికంగా జరిగిన పరిణామమా, లేక ప్రస్తుతం రష్యాలో తలదాచుకున్న అస్సాద్ ప్రమేయ ముందా అనేది తెలియదు. అందుకు అవకాశాలు తక్కువన్నది ఒక అభిప్రాయం. ఆయనకు రష్యా మొదటి నుంచి మద్దతునివ్వటం, ప్రస్తుతం ఆశ్రయాన్నివ్వటం నిజమే అయినా, సిరియా కొత్త ప్రభు త్వంతో సత్సంబంధాలకు ప్రయత్నిస్తున్నది. మధ్యధరా సముద్రపు తూర్పు తీరాన భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో గల సిరియాలో రష్యాకు ఒక నౌకా స్థావరం, ఒక వైమానిక స్థావరం ఉన్నాయి. యూరప్‌ను ఎదుర్కొనేందుకు అవి చాలా అవసరం. అందువల్ల సిరియా కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాల ద్వారా ఆ స్థావరాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. రష్యా ఇంతకాలం అస్సాద్‌కు పూర్తి మద్దతుగా ఉండినప్పటికీ, తమ కొత్త పరిస్థితులలో రష్యా సహాయం అనేక విధాలుగా అవసరం గనుక, అల్–షరారా కూడా అందుకు సుముఖత చూపుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో అస్సాద్‌ను సిరియాలో తన పాత సైనిక దళాల ద్వారా ఘర్షణలకు రష్యా అనుమతించటం జరిగేది కాదు. పరోక్షంగానైనా అస్సాద్ ప్రోత్సాహం లేక ఇది జరిగేది కాదనే అభిప్రాయమూ ఉంది.అందరినీ ఏకం చేసే దిశగా...ఈ తర్కాన్ని బట్టి చూసినపుడు, ఘర్షణలకు కారణం అస్సాద్ సైన్యానికి చెందిన స్థానికమైన ఒక సైనిక దళమని భావించవలసి ఉంటుంది. అల్–షరారా ప్రకటించింది కూడా అదే. ఆ ఒక్క దళాన్ని చివరకు తుడిచి పెట్టామన్నారాయన. అయితే, ఇటువంటి పరిస్థితి తిరిగి తలెత్తబోదనే హామీ ఏమైనా ఉందా? దేశ నిర్మాణంలో అలావైట్లు కూడా భాగస్వాములని, వివిధ వర్గాల మధ్య ఎటువంటి తారతమ్యాలు ఉండబోవని తమ తిరుగుబాటు విజయవంతమైన మొదటిరోజునే స్పష్టం చేసిన తాత్కాలిక అధ్యక్షుడు అల్–షరారా, గమనార్హమైన పని ఒకటి చేశారు. అది – ఘర్షణలపై నియమించిన విచారణ కమిటీలో అలావైట్లను కూడా చేర్చటం! ఘర్షణలలో తమ వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపైనా చర్యలుంటాయని ప్రత్యే కంగా చెప్పారు. ఈ వైఖరిలో రాజకీయమైన, పరిపాలనాపరమైన వివేకం కన్పిస్తాయి. సున్నీలు, షియాలు, క్రైస్తవులు, కుర్దులు, ద్రూజ్లు మొదలైన తెగలతోపాటు ప్రాంతాల వారీగా కూడా చీలి పోయి ఉన్న దేశాన్ని ఏకం చేయటం, ఒకటిగా ముందుకు నడిపించటం తేలిక కాదు. అగ్రస్థానాన గల నాయకుడు, తన పార్టీ, ప్రభుత్వం, సైన్యం అందరూ దార్శనికతతో ఏకోన్ముఖంగా పనిచేస్తే తప్ప ఆ లక్ష్యం ముందుకు సాగదు.అటువంటి పరిణతిని అల్–షరారా మొదటినుంచి చూపుతుండటం విశేషం. తిరుగుబాటు ఇంకా విజయ వంతం కాక ముందు నుంచే ఈ అవసరాలు ఆయనకు అర్థమైనాయనుకోవాలి. అందు వల్లనే ఇస్లామిక్ స్టేట్ సంస్థతో సంబంధాలను కొన్ని సంవత్సరాల ముందే తెంచి వేసుకున్నారు. అధికారానికి వచ్చిన మొదటి రోజునే తన పోరాట కాలపు అజ్ఞాతనామం అబూ మొహమ్మద్ జొలానీని, అసలు పేరు అహమద్ అల్–షరారాకు మార్చుకున్నారు. పౌర హక్కులు, మహిళల హక్కుల పరిరక్షణ చేయగలమన్నారు. అస్సాద్ కాలపు ఖైదీలందరినీ వెంటనే విడుదల చేశారు. ఆర్థికాభివృద్ధి, దేశాభివృద్ధి మొదటి ప్రాధాన్యాలని ప్రకటించారు.ఈ ప్రకటనలన్నీ మొదటి 24 గంటలలోనే వెలువడ్డాయి. అసద్‌పై వేర్వేరు ప్రాంతాలలో తిరుగుబాట్లు చేస్తుండిన వర్గాలు ముందుకు వచ్చి తమ దళాలను ప్రభుత్వ సైన్యంలో విలీనం చేయాలన్న విజ్ఞప్తికి కుర్దులు మొదలైన కొందరు సానుకూలంగా నిర్ణయించారు. షరారాను తీవ్రవాదిగా, తన సంస్థ హయాత్ తహరీర్ అల్–షామ్‌ను ఇస్లామిస్టు తీవ్రవాద సంస్థగా ప్రకటించిన వివిధ దేశాలు ఆ ముద్రను తొలగించటం, డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయాలను తిరిగి తెరవటం, షరారాతో సమావేశానికి ప్రతి నిధులను పంపటం వంటి ప్రక్రియలు మొదలయ్యాయి. ఇక ప్రధా నంగా మిగిలింది అమెరికా. వారి ప్రతినిధులు కూడా కలిసి సాను కూలంగా స్పందించటం, ఆంక్షలు ఎత్తివేయగలమనటం చేశారు గానీ, ట్రంప్ అధికారానికి రావటంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.ఇజ్రాయెల్ ముప్పుఇదిట్లుండగా షరారా ఈ నెల 13న చాలా ముఖ్యమైన చర్య ఒకటి తీసుకున్నారు. అది – దేశానికి కొత్త రాజ్యాంగ రచన కోసం ఒక కమిటీని నియమిస్తూ, తాత్కాలిక రాజ్యాంగం ఒకటి ప్రకటించటం! అందులోని అంశాలలో తను మొదట పేర్కొన్న అన్ని విధాలైన హక్కులు ఉన్నాయి. అయితే, సిరియన్ తిరుగుబాటు విజయవంతమైన రోజునే సిరియాకు చెందిన గోలన్ కనుమలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. అక్కడి నుంచి ఖాళీ చేయబోమని, అక్కడ ఇజ్రా యెలీల సెటిల్మెంట్లు పెంచగలమని ప్రకటించింది. సిరియా దక్షిణ ప్రాంతం యావత్తును నిస్సైనిక మండలంగా మార్చగలమని హెచ్చ రించింది. పాశ్చాత్య దేశాలతోపాటు, ఐక్యరాజ్యసమితి ఖండించినా వెనుకకు తగ్గటం లేదు. సిరియాకు ఈ ముప్పు ఎట్లా పరిణమించ వచ్చునన్నది పెద్ద ప్రశ్న అవుతున్నది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పేరు ఏదైతేనేం... అంతా అణచివేతే!
దేశంలో, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో, ఉన్న పాలన స్వభావాన్ని ఎలా నిర్వచించాలి, దాన్ని ‘ఫాసిజం’ అనాలా, ‘నయా ఫాసిజం’ అనాలా, ‘నయా ఫాసిజం లక్షణాలు’ అనాలా అని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నదని ప్రచార సాధనాలలో వార్తలూ, వ్యాఖ్యలూ వస్తున్నాయి. ఆ పార్టీకే చెందిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం తన విధానాల ద్వారా, ఆచరణ ద్వారా, బహుశా మౌనం ద్వారా కూడా ఆ చర్చను మరొక స్థాయికి తీసుకు పోదలచుకున్నట్టున్నారు. కార్పొరేట్ ప్రయోజనాల పరిరక్షణ, ప్రజల సామూహిక ఆందో ళనల అణచివేత, వ్యక్తిగత ఆందోళనల పట్ల మౌనం అనే మూడు విషయాలలో ఆయన ప్రభుత్వం, ఏ పేరు పెట్టినా, కేంద్ర ప్రభుత్వం చేయదలచిన, చేస్తున్న పనులనే చేసి చూపిస్తున్నది.కేరళలోని వియ్యూర్ సెంట్రల్ జైలులో టి. ఆర్. రూపేష్ అనే మావోయిస్టు ఖైదీ ఉన్నారు. కేరళ మావోయిస్టు పార్టీ నాయకులలో ఒకరైన ఆయనను, ఆయన సహచరి షైనా, మరొక ముగ్గురు అనుచరులతో సహా 2015 మేలో తమిళనాడులోని కోయంబత్తూరులో అరెస్టు చేశారు. అంతకు ముందువీ, ఈ పదకొండేళ్లలో పెట్టినవీ కలిసి ఆయన మీద మొత్తం 43 కేసులున్నాయి. అందులో ఒక కేసు విచారణ జరిగి, ఆయన నిర్దోషిగా తీర్పు వెలువడింది. పదమూడు కేసులు డిశ్చార్జి అయ్యాయి.ఒక కేసులో శిక్ష పడి, శిక్షాకాలం ముగిసిపోతుండగా, విడుదల కాకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం పదకొండేళ్ల కిందటి కేసు తవ్వి తీసింది. జైలు అధికారులు ఇవ్వవలసిన రెమిషన్ ఇవ్వకుండా ఉండిపోయారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ మహత్కార్యమే గాని ఇప్పుడిక్కడ చర్చ అది కాదు. రూపేష్ జైలుకు వెళ్లక ముందే కవిగా, రచ యితగా గుర్తింపు పొందారు. అజ్ఞాతవాసంలో ఉండగానే, 2013లో వెలువడిన ఆయన మొదటి నవల ‘వసంత్తిలె పూమరంగళ్’ (వసంతకాలపు పూలచెట్లు) మలయాళ సాహిత్య లోకంలో విస్తృత చర్చకు దారి తీసింది. అంతకు ముందు న్యాయ శాస్త్ర పట్టభద్రుడైన రూపేష్ గత పదేళ్ల జైలు జీవితంలో చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, తత్వశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. జైలు రేడియో నడుపుతున్నారు. బాడ్మింటన్ క్రీడా కారుడిగా పేరు తెచ్చుకున్నారు. వీటితో పాటే, జైలులో ఆయన తన రెండో నవల రాశారు. ‘బంధితారుడె ఒర్మక్కురిప్పుగళ్’ (ఖైదీల జ్ఞాపకాలు) అనే ఈ నవల ప్రచురణను అనుమతించమని జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 130 పేజీలు గల ఈ నవల ఇతివృత్తం ఒక కవి–రాజకీయ కార్యకర్త జైలు జీవితం. జైళ్ల నిర్వహణ రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశంగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఒక ఖైదీకి ఉన్న ఈ రాజ్యాంగ బద్ధ హక్కును గౌరవించి అనుమతి ఇచ్చే అధికారం ఉంది. జైలులో ఉన్న ఖైదీకి తన రచనను ప్రచురించుకునే హక్కు ఉందని సుప్రీం కోర్టు ఇచ్చిన ఎన్నో తీర్పులు చెబుతున్నాయి. కాని రూపేష్ లిఖితపూర్వక దరఖాస్తుకు వియ్యూర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నెల గడిచినా అధికారిక జవాబు ఇవ్వలేదు. దరఖాస్తును పై అధికారులకు పంపామని, జవాబు కోసం వేచి చూస్తున్నామని తాత్సారం చేశాడు. నవలలో జైలుకు, యూఏపీఏ, కోర్టు ప్రస్తావనలు ఉన్నాయి గనుక అనుమతి ఇవ్వబోమని నోటిమాటగా చెప్పాడు. తన నవల ప్రచురణకు అనుమతించకపోతే, ఎమర్జెన్సీలో క్యాలికట్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి రాజన్ హత్య చేయబడిన మార్చ్ 2న ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభిస్తానని రూపేష్ అధికారులకు తెలియజేశారు. మిత్రుల సలహా మేరకు దాన్ని ఒక్కరోజు నిరాహారదీక్షగా మార్చారు. అప్పటికే నవల డీటీపీ ప్రతి చదివిన కె. సచ్చిదానందన్, అశోకన్ చారువిల్,ఎన్. ఇ. సుధీర్ వంటి మలయాళ సాహిత్య ప్రముఖులెందరో ఆ నవల కళాత్మక విలువను ప్రశంసిస్తూ, ప్రచురణను అడ్డుకోవడం లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి తగదని ప్రకటించారు. ‘సృజనాత్మకత నేరం కాదు’ అనే శీర్షికతో సామాజిక మాధ్యమాలలో, ఇతర ప్రచార సాధనాలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది. ముఖ్య మంత్రికి బహిరంగ లేఖలు వెలువడుతున్నాయి. ఒక ఖైదీ రచన ప్రచురణను ఫాసిస్టు, నయా ఫాసిస్టు, నయా ఫాసిస్టు లక్షణాలు గల ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోవడం సులభమే. కాని ఆ పని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రభుత్వం చేయడమే ఆశ్చర్యకరం, విషాద కరం. అదే ప్రభుత్వపు మరి రెండు విధానాలు కూడా ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైనవి. కేరళలోని ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్ – ఏఎస్హెచ్ఏ) సిబ్బందిలో అత్యధికులు ఈ సోమవారానికి ముప్పై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తున్నప్పటికీ తమను ఉద్యోగులుగా కాక వాలంటీర్లుగా గుర్తించడం మానేయాలని, అధికారపక్షం ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినట్టు గౌరవ వేతనాన్ని రూ. 7,000 నుంచి రూ. 21,000కు పెంచాలని, ఉద్యోగ విరమణానంతర సౌకర్యాలు కల్పించాలని ప్రధాన డిమాండ్లతో, మరెన్నో డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతున్నది. అనేక రాష్ట్రాలలో ఇవే డిమాండ్ల మీద సీపీఎం కార్మిక సంఘం సీఐటీయూ ఆందోళనలు నిర్వ హిస్తున్నది. కాని కేరళలో సీఐటీయూ కాక మరొక సంఘం ఈ ఆందోళనను నిర్వహిస్తున్నందువల్లనేమో ప్రభుత్వం ఆందోళన కారులతో చర్చలకు కూడా సిద్ధపడడం లేదు. గౌతమ్ అదానీ కంపెనీల మీద విదేశాలలోనూ, దేశంలోనూ లెక్కలేనన్ని విమర్శలు వస్తుండగా, కేరళ ముఖ్యమంత్రి మాత్రం అదానీ మీద పొగడ్తలు కుమ్మరించడంలో దేశ ప్రధానితో పోటీ పడుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా అన్నట్టు, కొద్ది వారాల కిందనే కొచ్చిలో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్‌లో కరణ్ అదానీ అదే స్థాయిలో నరేంద్ర మోదీ, పినరయి విజయన్లు ఇద్దరినీ ఒకే ఊపులో పొగడ్తల్లో ముంచెత్తాడు. ఏది ఫాసిజం? ఏది నయా ఫాసిజం? ఏవి నయా ఫాసిస్టు లక్షణాలు? ఓ మహాత్మా! ఓ మహర్షీ!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నిరీక్షణ ఫలించిన క్షణం...
మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు ‘రాశి చక్రగతులలో/రాత్రిందివాల పరిణామాలలో/ బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో/ కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన/ పరమాణువు సంకల్పంలో...’ ప్రభ వించిన మానవుడు మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కేవలం ఎనిమిది రోజులని భావించింది కాస్తా 286 రోజులపాటు అంతరిక్షంలో ఉండిపోక తప్పని వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, వారిని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళిన మరో ఇద్దరూ నిర్దేశించిన సమయానికల్లా క్షేమంగా, సురక్షితంగా భూమ్మీదకు చేరుకోవడం సంక్లిష్టమైన సవాళ్లపై విజ్ఞాన శాస్త్రం సాధించిన అపూర్వ విజయం. మెక్సికో జలసంధి కెరటాల్లో వారిని తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ కాప్సూ్యల్ తేలియాడుతుండగా డాల్ఫిన్ల గుంపు దాని చుట్టూ వలయాకారంలో స్వాగతిస్తున్నట్టు తిరుగాడటం ఆహ్లాదాన్ని పంచింది. మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)ను వీడి దాదాపు 16 గంటలు ప్రయాణించి భారత కాలమానం ప్రకారం తెల్లారు జామున 3.30కి చేరు కున్నారు. అంతరిక్షానికి రాకపోకలు సాగించటం, అక్కడున్నన్నాళ్లూ నిరంతర పరిశోధనల్లో నిమ గ్నులు కావటం ఒక అనుపమానమైన, అసాధారణమైన విన్యాసం. ఎంతో ఏకాగ్రత, మరెంతో ఆత్మ విశ్వాసమూ, ఓరిమి ఉంటే తప్ప ఆ పరిశోధనలు పరిపూర్తి చేయటం కష్టం. ఎంతో ఇరుకైన ఒక చిన్న స్థలాన్ని మిగిలిన వారితో పంచుకోక తప్పక పోవటం సామాన్య విషయం కాదు. నిరుడు జూన్ 5న అంతరిక్షయానం ప్రారంభం కాగా, ఆ మరునాడు అక్కడికి చేరుకుని ఐఎస్ఎస్లో ఈ వ్యోమ గాములు పని ప్రారంభించారు. సునీత ఇప్పటికే మూడుసార్లు అంతరిక్షయానం చేయటంతో పాటు ఒక దఫా ఐఎస్ఎస్ కమాండర్గానూ వ్యవహరించారు. సునీత, బుచ్ అంతరిక్షంలో చిక్కుకుపోయా రనటాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగీకరించటం లేదు. వారిని సురక్షితంగా దించేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూశామంటున్నది. వారికున్నంత ఆత్మవిశ్వాసం సాధారణ ప్రజలకుండదు. అందుకే సునీత రాక కోసం మానవాళి మొత్తం ఆదుర్దా ప్రదర్శించింది. అంతరిక్షయానం ఎనిమిది రోజులే అనుకుని వెళ్లి తొమ్మిది నెలలు ఉండక తప్పక పోవటమంటే అది వారి మానసిక స్థితిని మాత్రమే కాదు... శారీరక స్థితిగతులనూ ప్రభావితం చేస్తుంది. కేవలం ఎనిమిది రోజులకోసమైతే వారు సాధారణ వ్యాయామంతో సరిపెట్టుకోవచ్చు. అసలు చేయక పోయినా ఫరవాలేదంటారు. కానీ ఇంత సుదీర్ఘకాలం అక్కడ కొనసాగాలంటే మాత్రం శరీ రాన్ని బాగా కష్టపెట్టాలి. సుదీర్ఘ వ్యాయామం తప్పదు. గుండె, రక్తనాళాలూ సక్రమంగా పని చేయ టానికి అవి అవసరం. ఈ వ్యాయామాలు సహజంగానే కష్టంతో కూడుకున్నవి గనుక అందుకు వారిని మానసికంగా సంసిద్ధుల్ని చేయటంతోపాటు వారి దినచర్యలో అవసరమైన మార్పులు చేయాల్సి వస్తుంది. వారికి అందాల్సిన ప్యాకేజ్డ్ ఆహారం వివిధ రకాల రుచులతో సిద్ధంగానే ఉన్నా నచ్చింది తినడానికి లేదు. నిర్ణీత కొలతలో వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్నిటిని తట్టుకుంటూ, నిర్దిష్టమైన సమయాల్లో వ్యాయామాలు చేస్తూ పరిశోధనలు సాగించటం, అందులో వెల్లడైన అంశా లపై పరస్పరం చర్చించుకుని నిర్ధారణలకు రావటం అంతరిక్ష యాత్రికులకు తప్పనిసరి. ఇంతవరకూ మూడు దఫాలు అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీత మొత్తం 62 గంటల 6 నిమి షాలు స్పేస్ వాక్ చేశారంటే... ఆ రకంగా ఆమె మహిళా అంతరిక్ష యాత్రికుల్లో అగ్రస్థానాన్నీ, మొత్తం వ్యోమగాముల్లో నాలుగో స్థానాన్నీ పొందారంటే... అది సునీత దృఢసంకల్పానికి అద్దం పడుతుంది. ఈ అంతరిక్ష యానంలో భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో 900 గంటలపాటు ఆమె వివిధ రకాలైన 150 పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. ఈ తొమ్మిది నెలల్లో ఆమె పరిశోధనలు సాగించిన ఐఎస్ఎస్... భూకక్ష్యలో 4,576 సార్లు తిరగ్గా ఆ నిడివి 19 కోట్ల 40 లక్షల కిలోమీటర్లు! అబ్బురపరిచే విషయమిది. అవకాశం లభిస్తే స్త్రీలు అందరినీ మించుతారనడానికి సునీత ప్రతీక.ఈ అంతరిక్ష యాత్రలైనా, అంతరిక్ష నౌకల అన్వేషణలైనా... వాటి అంతిమ సారాంశం ఏక గ్రహజీవిగా ఉన్న మనిషిని బహు గ్రహజీవిగా మార్చటం. అంతరిక్షంలో సాగించే పరిశోధనలు భవి ష్యత్తులో మనుషులందరూ సునాయాసంగా గ్రహాంతర యానాలు చేయటానికి, అక్కడి పరిస్థితు లకు తట్టుకోవటానికీ తోడ్పడతాయి. ఈ యాత్రలు మున్ముందు మనుషుల్ని పోలిన గ్రహాంతర జీవులతో మనల్ని అనుసంధానించవచ్చు. 1906లో హెచ్‌జీ వెల్స్ రచించిన ‘వార్ ఆఫ్ ది వర్ల్›్డ్స’ నవల ఊహించినట్టు ఆ గ్రహాంతర జీవులు మనపైకి దండయాత్రకొచ్చే ప్రమాదమూ లేకపోలేదు.విశ్వం గురించిన మన జ్ఞానం పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది. కోట్లాది కాంతి సంవత్సరాల దూరంలో సైతం లెక్కలేనన్ని పాలపుంతలున్నాయని, భూమిని పోలిన గ్రహాల ఆచూకీ తెలిసిందని శాస్త్రవేత్తలు చెబుతుంటే ఎంతో విస్మయం కలుగుతుంది. రెక్కలు కట్టుకుని పైపైకి వెళ్లేకొద్దీ మన భూమి సూది మొన మోపినంత పరిమాణంలో కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తే మనం కృత్రిమంగా ఏర్పర్చుకున్న సరిహద్దులు, ఆర్థిక సామాజిక తారతమ్యాలు కనబడవు. విషాదమేమంటే... ఎదిగినకొద్దీ విశాలం కావాల్సిన చూపు కాస్తా మూఢ విశ్వాసాల్లో, మూర్ఖత్వపు మలుపుల్లో సంకు చితమవుతోంది. నలుగురు వ్యోమగాములు సగర్వంగా భూమ్మీదకు తిరుగు పయనమైన రోజే 400 మంది అమాయక పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ బాంబుదాడుల్లో కన్నుమూశారంటే అది మనుషుల్లోని రాక్షసత్వాన్ని చాటుతుంది. ఇలాంటి విషాదాలకు తావులేని కాలం ఆగమిస్తే తప్ప ఈ విజయాలు మనకు పరిపూర్ణమైన సంతోషాన్ని కలగజేయలేవు. -
అరుదైన మిలిటరీ థ్రిల్లర్!
ఒక సైనిక ప్రధానాధికారి నవల రాయటం అన్నది ప్రతిరోజూ జరిగేది కాదు. నిజానికి, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ 77 ఏళ్లలో ఇలా ఒకసారి మాత్రమే సంభవించింది. జనరల్ ముకుంద్ మనోజ్ నరవణే రాసిన పుస్తకాన్ని అరుదైన వాటిలో ఒకటిగా, ప్రత్యేకమైనదిగా చేస్తున్నది ఇదే. నేను ఈ పుస్తకం గురించి రాస్తున్నది కూడా దానికున్న ఈ ప్రత్యేకత కారణంగానే! నరవణే రాసిన ఈ నవల పేరు ‘ద కంటోన్మెంట్ కాన్స్పిరసీ’. టైటిల్ కింద ఉన్న ఉపశీర్షికను బట్టి ఇదొక మిలిటరీ థ్రిల్లర్. ఇది ‘లూ కరే’ (గూఢచారి నవలలకు ప్రసిద్ధి చెందిన స్వర్గీయ బ్రిటిష్ రచయిత డేవిడ్ జాన్ కార్న్వెల్ కలం పేరు) ఒరవడిని కలిగి ఉన్నటువంటిది కాకున్నా... వేగంగా చదివిస్తూ, ముందుకు నడిపించేలా ఉంటుంది. నేనైతే, తెరిచిన పుస్తకం ముగిసే వరకు కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. పేజీలు వాటంతటవే తిరిగిపోతున్నట్లుగా అనిపించింది. ఈ కథ, కొత్తగా ఆర్మీలో చేరిన ఇద్దరు యువ అధికారుల చుట్టూ తిరుగుతుంది. ఒకరు లెఫ్ట్‌నెంట్ రోహిత్ వర్మ. ఇంకొకరు లెఫ్ట్‌నెంట్ రేణుకా ఖత్రీ. రోహిత్ మూడో తరం అధికారి. రేణుక పదాతిదళం రెజిమెంట్‌లో నియామకం పొందిన తొలి మహిళ. రోహిత్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తాయి. చాలామంది అతడు దోషి అని భావిస్తుంటారు. రోహిత్, రేణుకలలో రేణుకే అత్యంత శక్తిమంతమైన వ్యక్తిత్వం కల ఆఫీసర్. ఒక్క దుముకుతో రోహిత్ వెనుక అండగా నిలబడి ఈ కథను ముందుకు నడిపిస్తుంది రేణుక పాత్ర. కథాంశంలో ఒక్కో ముడీ విడివడుతున్నప్పుడు రెండు హత్యలు జరుగుతాయి. ఆ హత్యలు చేసిన వ్యక్తి మొదట మీరు అనుమానించిన వ్యక్తి కాదు. ఇంతకుమించి నేను మీకు చెప్పను. అలా చెప్తే కథ తెలిసి పోతుంది. కథా నేపథ్యం భవిష్యత్ కాలం. ఇదంతా కూడా 2026 జూన్ తర్వాత జరుగుతుంది. ఫతేపురిలోని సిఖ్ రైఫిల్స్ రెజిమెంటల్ సెంటర్లో కథ మొదలవుతుంది. రోహిత్, రేణుక ఓరియెంటేషన్ ట్రైనింగ్ కోసం అక్కడ ఉంటారు. కొత్తను పోగొట్టి, దిశా నిర్దేశం చేసే శిక్షణ కార్యక్రమం అది. జనరల్ నరవణే సొంత రెజిమెంట్ కూడా ‘7వ సిఖ్ లైట్ ఇన్ఫాంట్రీ’ కనుక ఆయన స్వీయానుభవాలు, ప్రత్యక్ష పరిశీలన ద్వారా గ్రహించిన విషయాలు ఈ నవల రాసేందుకు తోడ్ప డ్డాయని స్పష్టంగా తెలుస్తోంది. ఏమైనా, థ్రిల్లర్ కథలు రాయటం అంత తేలికేమీ కాదు. మొదట కథాంశం అన్నది ఉండాలి. అది ఆసక్తికరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా – చదువుతున్న కొద్దీ అది మనల్ని లోలోతుల్లోకి లాక్కెళు తుండాలి. తర్వాత ప్రధానమైనది కథన వేగం. అది మనల్ని ముగింపు వైపు పరుగులెత్తించాలి. మహోగ్రమైనదిగా కూడా ఆ ముగింపు ఉండాలి. చివరిగా భాష. అది కుదింపుగా, ఉద్వేగభరి తంగా ఉండాలి. సుదీర్ఘమైన తాత్విక ప్రసంగాల్లా కాకుండా, వాక్యాలు చిన్న చిన్నవిగా ఉండాలి. వీటి ద్వారా ప్రధాన పాత్రలు ఎటువంటి స్వభావం కలిగినవో మనకొక స్పష్టమైన అవగాహనను కలిగించటం అవసరం. ఇక రచయిత ఆ పాత్రల వ్యక్తిత్వాన్ని సూటిగా, పదునుగా శిల్పీకరించాలి. అంతేనా, ఏది తప్పో ఏది ఒప్పో చెప్ప గలిగేలా ఉండాలి. థ్రిల్లర్ పుస్తకాలు సాధారణంగా నీతి కథలుగా ముగుస్తాయి.ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. నిజానికైతే, ఇది మనం ఆర్మీ జనరల్స్ నుంచి ఆశించేది కాదు. ఈ పుస్తకంలోని వివిధ వర్ణాల ఛాయలు, వివరాల్లోని సూక్ష్మత్వం ఆహ్లాదకరమైన అబ్బురపాటును కలిగించేలా ఉన్నాయని నేను చెప్పగలను. నేను ఎంతో మంది ఆర్మీ చీఫ్‌లను కలిశాను కానీ – మీరు నమ్మండి – ఈ విధమైన సాహితీ నైపుణ్యాలను కలిగి ఉన్న ఆర్మీ చీఫ్‌ను నేనెప్పుడూ కలవలేదు. కథలో బ్రిగేడియర్ అశోక్ మీనన్‌ది కేవలం పైపైన పాత్రే అయినప్పటికీ, ఆ రెజిమెంటల్ సెంటర్ కమాండెంట్ ఇంగ్లిషు నన్ను పడేసింది. మీనన్ మాట్లాడేటప్పుడు ‘బ్లింప్’ అనే ఒక ఇంగ్లిష్ కల్నల్ (కార్టూన్ క్యారక్టర్) గుర్తొచ్చారు నాకు. ‘What the deuce?' (ఆశ్చర్యాన్ని, గందరగోళాన్ని లేదా చికాకును వ్యక్తపరిచే యాస), ‘darn’ (డామిట్) వంటి పదాలు ఆయన నోటి నుండి వచ్చేవి. ఆయన ప్రసంగమంతా కూడా ruddy, blighter, bugger అనే పదాల చిలకరింపుతో ఉంటుంది. అవన్నీ తిట్లు. జనరల్ నరవణే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన తన పాత్ర మాట్లాడే భాషతో ఆ పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించారు. కొన్నిసార్లు ఇది నాకు ఆర్థర్ కానన్ డోయల్ (రచయిత), షెర్లాక్ హోమ్స్(కానన్ డోయల్ సృష్టించిన పాత్ర)ను కూడా గుర్తుకు తెచ్చేది. అయితే ఆర్మీ బ్రిగేడియర్లు నిజంగా అలా ఉంటారా? లేదా, అలా ఉండాలని పాఠకులు ఆశిస్తా రని ఈ రచయిత నమ్ముతున్నారా? ఏదైనా సరే, అది పని చేస్తుంది. అయితే, సునిశితమైన శ్రద్ధతో సాగిన పాత్రల చిత్రీకరణ, సైనిక జీవిత స్ఫూర్తి, స్వభావాల సంగ్రహణలతో ఈ థ్రిల్లర్ పుస్తకం దోష రహితంగా ఉన్నప్పటికీ, ఇందులో నాకొక వింత లోపం మార్మికంగా అనిపించింది. బ్రిగేడియర్ మీనన్, రోహిత్‌తో మాట్లాడే సందర్భంలో రచయిత ఇలా రాశారు: ‘‘గోడవైపు చూపిస్తూ ఆయన అంటారు, ‘గురునానక్ చెప్పిన ఆ మాట నీకు తెలుసా? చెడు విజయం సాధించటానికి కావలసిన ఒకే ఒకటి, మంచి మనుషులు ఏమీ చేయకపోవ టమే’’ అని. నాకు తెలిసినంత వరకు ఈ మాటను 18వ శతాబ్దం నాటి బ్రిటిష్ కన్జర్వేటివ్ నాయకుడు ఎడ్మండ్ బర్క్ అన్నారని చెబు తుంటారు. అయితే ఈ మాటను అన్నది బర్క్ కాదు అని ఇటీవలి కాలంలో కొన్ని పండిత వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గురు నానక్ నిజంగా అలా చెప్పారా? చెబితే ఎప్పుడు చెప్పారు? ఎక్కడ చెప్పారు?ఈ చిన్న విషయాన్ని పక్కన పెడితే జనరల్ నరవణే తర్వాతి థ్రిల్లర్ కోసం నేను కుతూహలంతో వేచి చూస్తున్నాను. ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తే, హత్యల గురించి లెఫ్ట్‌నెంట్ రేణుకా ఖత్రి చెప్పే రహస్యాలు వరుసగా వెలువడతాయని ఆయన నాతో అన్నారు. ఎవరికి తెలుసు? ఆమె మన సొంత ‘మిస్ మార్పుల్’ (ఆంగ్ల రచ యిత్రి అగాథా క్రిస్టీ డిటెక్టివ్ నవలల్లోని కల్పిత పాత్ర) కావచ్చు. అలా జరిగితే కనుక జనరల్ నరవణే కొత్త అగాథా క్రిస్టీ అవుతారు!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మానవ సంకల్ప విజయానికి ప్రతీక!
సైన్స్ చరిత్రను తిరగేస్తే యాదృచ్ఛికంగా జరిగిన ఆవిష్కరణలు కోకొల్లలు కనిపిస్తాయి. ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలం అక్కడే గడపడమూ ఈ కోవకే చెందుతుంది. ఎందుకంటే... మనిషి యుగాలుగా ఆశిస్తున్న, ఆకాంక్షిస్తున్న గ్రహాంతరయానమనే స్వప్నాన్ని ఈ యాత్ర మరికొంత దగ్గర చేసింది మరి!సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు తిరిగి భూమిని చేరిన రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. అంత రిక్ష ప్రయోగాల్లో ఇదో చరిత్రాత్మక ఘట్టంగానే చూడాలి. బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు రావడం, సకాలంలో వాటిని సరిదిద్దే అవకాశం లేకపోవడంతో ఈ ఇద్దరు వ్యోమగా ములు మునుపెవ్వరూ గడపనంత అత్యధిక సమయాన్ని ఐఎస్ఎస్లో గడపాల్సి వచ్చింది. భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూండే ఐఎస్ఎస్లో ఉండటం అంత ఆషా మాషీ వ్యవహారం కానేకాదు. అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుందిక్కడ. దీనివల్ల శరీరంలోని ద్రవాలన్నీ ఉండాల్సిన చోట కాకుండా... శరీరం పైభాగంలోకి చేరుతూంటాయి. ఇరవై నాలుగు గంటలకు ఒకసారి సూర్యోదయ, సుర్యాస్తమయాలను చూసే మనిషి... ఐఎస్ఎస్లో వీటిని పదహారు సార్లు చూడాల్సి వస్తుంది. ఇది కాస్తా వ్యోమగాముల నిద్రపై ప్రభావం చూపుతుంది. కంటినిండా కునుకు లేక... కుటుంబానికి దూరంగా... ఇరుకైన చిన్న గదిలో నెలలపాటు గడపడం ఎంత కష్టమో మనం ఊహించనైనా ఊహించ లేము. ఊపిరి తీసుకోవడం మొదలుకొని కాలకృత్యాలు తీర్చుకోవడం వరకూ ప్రతి ఒక్కటి మానసికంగానూ, భౌతికంగానూ సవాలే! ఇంతటి శ్రమకోర్చి మరీ వీరు భూమికి తిరిగి వస్తూండటమే ఈ అంతరిక్ష ప్రయో గాన్ని మిగిలిన వాటికంటే ప్రత్యేకమైందిగా మారుస్తోంది.తొమ్మిది నెలలు చేసిందేమిటి?గత ఏడాది జూన్‌లో సునీత, విల్మోర్లు ఇద్దరూ ఐఎస్ఎస్కు ప్రయాణమైనప్పుడు వారి వద్ద ఎనిమిది రోజు లకు సరిపడా ప్రణాళికలైతే సిద్ధంగానే ఉన్నాయి. ఏ ఏ ప్రయోగాలు చేపట్టాలి. ఐఎస్ఎస్ నిర్వహణ తాలూకూ పనులు ఏమిటి? అన్నది వీరికి తెలుసు. కానీ అనూహ్యంగా వారి తిరుగు ప్రయాణం నిరవధికంగా వాయిదా పడింది. దీంతో వారికి ఎదురైన సరికొత్త సవాలు అంతకాలం ఏం చేయాలి? అన్నది. నాసా పరిశోధకుల సలహా సూచనల మేరకు వీరు ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు 150 వరకూ పరిశోధనలు చేపట్టారు. జీవ వ్యవస్థలపై సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం, అంతరిక్షంలో మొక్కల పెంపకం, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు అంతరిక్షంలో ఎలా ప్రవర్తిస్తాయి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు... భవిష్యత్తులో మనిషి సుదీర్ఘకాలం పాటు అంతరిక్ష ప్రయాణాలు చేపట్టాల్సి వస్తే... అంతరిక్ష నౌకల్లో అగ్ని ప్రమాదాల్లాంటివి జరక్కుండా ఉండేందుకు... మంటలు ఎలా వ్యాపిస్తాయి? అన్న విషయంపై పరిశోధనలు నిర్వహించారు కూడా! దీంతో పాటే గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల శరీరంలోని కండరాలకు జరిగే నష్టాన్ని నివారించేందుకు యూరో పియన్ ఎన్ హాన్్సడ్ ఎక్స్‌ప్లోరేషన్ ఎక్సర్సైజ్ డివైజ్(ఈ4డీ)ని పరీక్షించారు. ఈ పరికరం సైక్లింగ్, రోయింగ్లతోపాటు రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ల ద్వారా వ్యోమగాముల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. అలాగే గ్రహాంతర ప్రయాణాలకు కీలకమైన నీటి పునర్వినియోగం, ప్రత్యేకమైన సూక్ష్మజీవుల ద్వారా మనిషికి అవసరమైన పోషకాల ఉత్పత్తి వంటి అంశాలపై కూడా ప్రయోగాలు చేశారు. సౌర కుటుంబం మొత్తమ్మీద మనిషి జీవించేందుకు జాబిల్లి తరువాత కొద్దోగొప్పో అనుకూలతలున్న గ్రహం అంగారకుడు. స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఇంకొన్నేళ్లలోనే మనిషిని అంగారకుడిపైకి చేరుస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్లో సునీతా, విల్మోర్లు గత తొమ్మిది నెలలుగా చేసిన ప్రయోగాలకు, పరిశోధనలకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలో ఉండటం భౌతికంగా, మానసికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఈ తొమ్మిది నెలల ప్రయాణం తరువాత శాస్త్రవేత్తలకు కొంత స్పష్టత ఏర్పడి ఉంటుంది. దీని ఆధారంగా భవిష్యత్తులో అంగారక ప్రయాణం జరిగే అవకాశాలు లేకపోలేదు. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మన ఎముకలు పెళుసుబారుతాయి. కండరాలు, దృష్టి బలహీనపడతాయి. అలాంటప్పుడు ఏ రకమైన వ్యాయామాల ద్వారా నష్టాన్ని పరిమితం చేయవచ్చునన్నది సునీత, విల్మోర్ల పరిశోధనల ద్వారా తెలిసింది. అంతరిక్షంలో ఉండే విపరీతమైన రేడియోధార్మికత నుంచి వ్యోమ గాములను రక్షించుకునేందుకు కూడా వీరి ప్రయోగాలు సాయపడతాయి.వ్యోమగాముల త్యాగాల గురుతులు...ఎట్టకేలకు సునీత, విల్మోర్లు భూమిని చేరనున్నార న్నది అందరికీ సంతోషం కలిగించే వార్తే. కాకపోతే ఆ ఇద్దరు వ్యోమగాములు ఇప్పటివరకూ ఉన్న సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి వాతావరణం నుంచి సాధారణ పరిస్థితులకు ఎలా అడ్జెస్ట్ అవుతారన్నది ఒక ప్రశ్న. ఇది మరోసారి వారి సహనాన్ని, దృఢ చిత్తాన్ని పరీక్షించనుంది. వ్యోమగాముల శ్రమ, వేదన లను గమనిస్తే మానవ కల్యాణం కోసం వారు ఇంత త్యాగం చేస్తున్నారా? అనిపించకమానదు. సునీత, విల్మోర్లు ఇద్దరూ 300కుపైగా రోజులు అంతరిక్షంలో గడపడం ఒక రికార్డే. అయితే ఇది వారి వ్యక్తిగత మైంది కాదు. మానవ సంకల్పానికి లభించిన విజయమని చెప్పాలి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా), స్పేస్–ఎక్స్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భాగస్వా ములైన సుమారు 15 దేశాల శాస్త్రవేత్తలు అందరి ఉమ్మడి విజయం. ‘చందమామ రావే... జాబిల్లి రావే’ అంటూ పాట లకే పరిమితమైన ఒక తరం మాదిరిగా కాకుండా... ‘గ్రహ రాశులను అధిగమించి, ఘనతారల పథము నుంచి... గగ నాంతర రోదసిలో గంధర్వ గోళగతులు దాటి’ అంటూ సాగే నవతరానికి స్ఫూర్తి కూడా!– గిళియార్ గోపాలకృష్ణ మయ్యా, సీనియర్ జర్నలిస్ట్ -
పవన్ గొంతు చించుకున్నారు.. మరి అది ఇప్పుడేమైంది?
సాధారణంగా శాసనసభలో లేని వ్యక్తుల గురించి ఏవైనా ఆరోపణలు,విమర్శలు చేయడం సమంజసం కాదన్నది సంప్రదాయం. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా అలా మాట్లాడితే స్పీకర్ స్థానంలో ఉన్నవారు వారిస్తుంటారు. కాని స్వయంగా ముఖ్యమంత్రే అలా మాట్లాడితే ఏమి చేస్తారు! ఎపి శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ గురించి చేస్తున్న విమర్శలు అసంబద్దంగా ,అసందర్భంగా ఉంటున్నాయి. కారణం ఏమైనా సభలో జగన్ లేనప్పుడు ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి చంద్రబాబు సభా సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తుంది. తాము ఎన్నికల సమయంలో చేసిన సూపర్ సిక్స్ తో పాటు మరో 143 హామీల అమలు గురించి కన్నా జగన్ పైనే ఆరోపణలు చేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. మహిళా సాధికారిత గురించి ఆయన సభలో ప్రసంగం చేసినప్పుడు ఏ అంశాల గురించి చెప్పాలి? తాము ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల గురించి కదా!వాటిని పక్కనబెట్టి కొత్త హామీలు ఇస్తూ కధ నడిపడమే కాకుండా ,జగన్ ఆడబిడ్డల ద్రోహానికి పాల్పడ్డారని ,అదో కేస్ స్టడీ అని చెబుతున్నారంటే ప్రజలు విస్తుపోవడం తప్ప చేయగలిగింది ఏముంది?చంద్రబాబు నాయుడు మహిళలకు ఏఏ హామీలు ఇచ్చారు? వాటిలో ఎన్నిటిని అమలు చేశారో అంశాలవారిగా లెక్కలు చెబితే అది ఆడబిడ్డలకు మేలు చేసినట్లు అవుతుంది .అలాకాకుండా అసలు ఆ అంశాలనే ప్రస్తావించకుండా జగన్ పైనో, మరొకరిపైనో ఆరోపణలు చేస్తే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది. అది చంద్రబాబు ప్రభుత్వం ఆడబిడ్డలకు ద్రోహం చేసినట్లు కాదా!ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తకుండా ఎగవేయడం ద్రోహం అవుతుందా? కాదా?కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంతమంది మహిళలు అఘాయిత్యాలకు గురయ్యారో వివరించి, వాటిని అరికట్టడానికి ఏమి చర్య తీసుకుంటున్నారో చెప్పాలి కదా?అవన్ని ఎందుకు !ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో సుగాలి ప్రీతి అంటూ గొంతు చించుకుని మాట్లాడేవారు కదా! ఆ కేసు గురించి ఎన్నడైనా చంద్రబాబు మాట్లాడారా? పవన్ మాట నిలబెట్టుకున్నారా?దానిని ద్రోహం అంటారా?అనరా?ప్రతి ముఖ్యమైన పండగకు మహిళలకు కానుకలు ఇస్తామని ప్రకటించారు కదా?ఈ ఏడాది కాలంలో పండగలు రాలేదా!అయినా ఏ ఒక్క మహిళకైనా కానుకలు అందాయా?పెళ్లికానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారే!మహిళలు ఎవరికైనా అందచేశారా?వలంటీర్లకు పదివేల వేతనం ఇస్తామని చెప్పి,అసలుకే ఎసరు పెట్టారు కదా!ఆ వలంటీర్లలో లక్షమందికి పైగా మహిళలుఉన్నారు కదా!వారికి ఇచ్చిన సాధికారిత ఇదేనా!ఆర్డిసి బస్ లలో ఉచిత ప్రయాణం హామీ ఇచ్చారు కదా!దానికి బడ్జెట్ లో ఒక్క రూపాయి అయినా పెట్టారా?తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి 15వేలు ఇచ్చే వాగ్దానం ఒక ఏడాదిపాటు అతీగతీ లేదే!వచ్చే ఏడాది ఏ మేరకు ఇస్తారో తెలియదు.ఆ తల్లికి ఆ డబ్బు ద్వారా సాధికారిత వచ్చేది కదా!జగన్ తాను మహిళలకు ఇచ్చిన హామీలన్ని దాదాపు అమలు చేశారే.అన్ని స్కీమ్ లు మహిళల పేరిటే ఇచ్చారు కదా!అమ్మ ఒడి, 31 లక్షల ఇళ్ల పట్టాలు, చేయూత,ఆసరా,కాపు నేస్తం , ఆర్ధికంగా బలహీనవర్గాల నేస్తం..ఇలా ఆయా స్కీములలో డబ్బులు ఇచ్చారే.చేయూత కింద మహిళలకు 18500 రూపాయల చొప్పున ఆర్దిక సాయం చేసి,వారితో వ్యాపారాలు పెట్టించి, రిలయన్స్, ఐటిసి తదితర ప్రముఖ సంస్థలతో టై అప్ చేశారే.మహిళల భద్రతకు దిశ యాప్ తెచ్చారే.ఇప్పుడు అదే యాప్ ను పేరు మార్చి చంద్రబాబు వాడుతున్నారా?లేదా?ఇన్ని చేసిన జగన్ ఆడబిడ్డల ద్రోహి అవుతారా?లేక చేసిన బాసలకు మంగళం పలుకుతున్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు ద్రోహి అవుతారా అన్న ప్రశ్న వస్తే ఏమి జవాబు ఇస్తాం. ఇవన్ని వదలివేసి జగన్ కుటుంబంలో ఏదో జరిగిందని,తల్లికి ,చెల్లికి న్యాయం చేయలేదంటూ అసత్య ఆరపణలు చేయడం ఎంతమేర సమంజసం.చెల్లికి 200 కోట్ల మేర డివిడెండ్ల రూపంలో చెల్లించిన జగన్ ద్రోహం చేసినట్లు ఎలా అవుతుందో చంద్రబాబే చెప్పాలి. పోనీ తన తోబుట్టువులకు చంద్రబాబు ఏ విధంగా సాయం చేసింది చెప్పి ఉంటే బాగుండేది కదా!చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రతిగా వైఎస్సార్సీపీ స్పందిస్తూ పలు ప్రశ్నలు వేసింది.హైదరాబాద్ లో ఇతర చోట్ల చంద్రబాబు కుటుంబానికి ఉన్న వందల కోట్ల ఆస్తులలో తన తోబుట్టువులకు ఎంత ఇచ్చారని అడిగింది.తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుటుంబానికి ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించింది. తనతల్లి పేరు మీద ఉన్న మదీనగూడ భూమిలో వారికి వాటా ఇవ్వకుండా లోకేష్ ఒక్కరి పేరు మీదే ఎందుకు మార్పించింది వాస్తవం కాదా అని అప్రశ్నించింది.ముందుగా తన ఇంటిలో సమన్యాయం పాటించకుండా ఇంకొకరి ఇంటి వ్యవహారాన్ని ప్రస్తావించడం అన్యాయం కాదా అని వైఎస్సార్సీపీవ్యాఖ్యానించింది. డ్వాక్రా మహిళలకు సంబంధించి చంద్రబాబు చేసిన ప్రకటనలు కూడా ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియదు. కొద్ది రోజుల క్రితం ఏడాదికి లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని అన్నారు.తాజాగా ఆ సంఖ్యను లక్షా డెబ్బైఐదువేలకు పెంచారు. డ్వాక్రా మహిళలకు 65వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని,అందులో సగం పెట్టుబడి తీసుకురాగలిగితే ఆరువేల కోట్ల లాభాలు వచ్చేస్తాయని కూడా ఆయన ఊరించారు. డీ లిమిటేషన్ జరిగితే భవిష్యత్తులో శాసనసభలో 75 మంది మహిళలకు అవకాశం రావచ్చని ఆయన అన్నారు. డి లిమిటేషన్ లో ఎపికి కూడా నష్టం జరుగుతుంందని అంతా వాపోతుంటే, దాని గురించి మాట్లాడకుండా మహిళలకు సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనండని ఆయన ప్రచారం చేస్తున్నారు.కాని తద్వారా ఎదురయ్యే సమస్యల గురించి వివరించి, వాటిని అధిగమించడానికి ఏమి చేయాలో చెప్పరు. మహిళలకు తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చి తద్వారా సాధికారిత తెచ్చామని చెబితే ఎవరైనా నమ్ముతారు కాని, ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేసి అంతా అయిపోయినట్లు భ్రమలో పెట్టాలని అనుకుంటే ఏమి ప్రయోజనం ?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మహారాష్ట్ర రాజకీయ చదరంగం
రాజకీయాల్లో ఇవాళ్టి మిత్రుడు రేపు కాబోయే శత్రువు; అదే విధంగా నేటి శత్రువే రేపటి మిత్రుడు అనే నానుడికి చక్కని ఉదాహరణ మహారాష్ట్ర ప్రస్తుత రాజకీయాలు. 2024 నవంబరులో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు గాను మహాయుతి కూటమి ప్రధాన భాగస్వామ్య పక్షాలైన భారతీయ జనతా పార్టీ 105, ఏక్నాథ్ షిండే శివసేన 57 స్థానాలు కైవసం చేసున్నాయి. దీంతో ఆ కూటమి తిరిగి అధికారం చేజిక్కించుకుని పాలిస్తోంది. అయితే కూటమి రెండోసారి పాలనకు 100 రోజులు నిండేలోపే మొత్తం మరాఠా రాజకీయ చిత్రం రసవత్తరంగా తయారయ్యింది. ఎన్నికల ఫలితాల రోజు సాయంత్రమే (2024 నవంబర్ 23) దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ వెళ్ళి ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో; ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి ముఖ్యమంత్రి పీఠం కోసం తన బాటను సుగమం చేసుకొన్నారు. చివరి వరకు ఏక్ నాథ్ షిండే సీఎం కుర్చీ వదలటానికి సుముఖంగా లేనప్పటికీ మోదీ–షాల బుజ్జగింపుతో, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. తను కోరుకున్న హోం శాఖ కూడా దేవా భావు (ఫడ్న వీస్)కే దక్కింది. ఇక అప్పటి నుండి అలక పాన్పు పట్టారు షిండే. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన ఈ వంద రోజుల్లో (మార్చి 15 నాటికి) కొన్ని గమ్మత్తయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి షిండే గతంలో చేపట్టిన పలు ప్రాజెక్టులను ‘తనిఖీ’ చేయవలసిందిగా ముఖ్య మంత్రిగా అధికార పగ్గాలు చేపట్టగానే ఫడ్నవీస్ అధి కారులకు హుకుమ్ జారీ చేశారు. మరో వైపు భాజ పాతో దోస్తీ వదలుకున్న శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, సీఎం ఛాంబర్ చేరుకుని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవటం షిండే వర్గీయులను ఆశ్చర్య పరచింది. ఆ తర్వాత ఫిబ్రవరి 21న కొత్త ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఎన్సీపీ నేత శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనంలో ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేని అవార్డుతో సత్కరించటం ఇక్కడ ఉద్ధవ్ వర్గీయులను ఆశ్చర్య పరచింది. పవార్ లాంటి సీనియర్ నేత తమ పార్టీ ద్రోహిని, ‘రాష్ట్రీయ గౌరవ్ పురస్కారం’తో సత్కరించటం మింగుడు పడలేదు వారికి. (శరద్ పవార్ పాచిక ప్రభావంతో 2019లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని, కాంగ్రెస్–ఎన్సీపీ కూటమికి చేరింది అవి భక్త శివసేన). ఇది చాలదన్నట్టు ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి పవార్ ఆహ్వానించటంలోని రాజకీయం ఏమిటో ఎన్సీపీ కార్యకర్తలకు కూడా బోధ పడలేదు. ప్రస్తుత పరిస్థితు లను నిశితంగా గమనిస్తే ఎవరు ఎవరి అనుయా యులో, ఎవరు ఎవరి శత్రువులో తేల్చుకోలేని పరిస్థితి! మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి చవిచూసిన ఉద్ధవ్ ఠాక్రేను మరింత గాయపరచాలని, ఆయన 20 మంది ఎమ్మెల్యేలలో కొందరిని తన వైపు లాక్కొని, ఉద్ధవ్ రాజకీయ భవిషత్తునే మట్టిలో కల పాలని షిండే వ్యూహం. ఇది ఇలా ఉంటే... శివసేన పార్టీకి కంచుకోటగా ఉన్న కొంకణ్ ప్రాంతంలోనిషిండే సన్నిహితుడు, కేబినెట్ మంత్రి, ఉదయ్ సామంత్‌ను లోబరచుకుని, ఆయన ద్వారా షిండే వర్గాన్ని రెండుగా విభజించి పార్టీ చీఫ్ బలాన్ని తగ్గించే యోచనలో బీజేపీ ఉందనేది ఒక చర్చ. అది గ్రహించిన వెంటనే ఉదయ్ సామంత్ ప్రాముఖ్యాన్ని తగ్గిస్తూ, తనే అసలైన టీం కెప్టెన్ అని షిండే తేల్చే శారు. ఇదే సమయంలో ఇక షిండే ‘బాలే ఖిల్లా’గా చెప్పుకునే, ముంబై నగర శివారులోని థానేలో బీజేపీ పాగా వేసి ఆయనను ఇరుకున పెట్టాలని బీజేపీ వర్గీయులు అక్కడ తరచుగా క్యాంపులు నిర్వహి స్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొ రేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా ఫడ్నవీస్ పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. దానికి అనుగుణంగానే క్షేత్ర స్థాయిలో కమలనాథులు పావులు కదుపుతున్నారు.227 కార్పొరేటర్లతో గ్రేటర్ ముంబయ్ మున్సి పల్ కార్పొరేషన్ ఆసియాలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ కాలం నాటి ఈ కార్పొరేషన్ గత నాలుగు దశాబ్దాల (1985) నుండి ‘మరాఠీ అస్మిత’(ఆత్మ గౌరవం) నినాదంతో శివసేన అధీనంలోనే ఉంది. ప్రస్తుతం రెండుగా చీలిన ఈ ప్రాంతీయ పార్టీని తిరిగి ఇక్కడ పూర్వ వైభవం వరిస్తుందా అనేది ఒక ప్రశ్న. మొన్న జరిగిన విధాన సభ ఎన్నికల్లో 36 ముంబై సిటీ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉద్ధవ్ శివసేన కేవలం 10 సీట్లు గెలవటంతో పార్టీ కేడర్ కొంత వరకు జవసత్వాలు కోల్పోయింది. దీనికి తోడు చీలిపోయిన శివసేన (షిండే) పార్టీ, అటు బీజేపీలు ఉద్ధవ్ పార్టీలోని క్రియాశీల కార్యకర్తలను, కార్పొరేటర్లను తమ తమ వైపు ఆకర్షించుకోవటం మొదలుపెట్టాయి. ఇక ఎన్సీపీ నేత, కింగ్ మేకర్ శరద్ పవార్ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో; షిండే సీఎం పదవికి ఎసరుపెట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ)కి ఉద్ధవ్ ఠాక్రే దగ్గర అవుతున్న వైనాన్ని గమనిస్తే మహారాష్ట్రలో రాబోయే నగర పాలక సంస్థల ఎన్నికలు ఎంత రసవత్తరంగా మార నున్నాయో అంచనా వేయొచ్చు. జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబయ్మొబైల్: 98190 96949 -
భస్మాసుర హస్తంగా... ట్రంప్!
సమస్యలను పరిష్కరించగలిగే అధికారం కలిగినవారే కొత్త సమస్యలను, సవాళ్లను కొనితెస్తే ఎలా ఉంటుంది? అచ్చు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారంలా ఉండదూ! ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ఎన్నికలలో మళ్లీ గెలిచి 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ట్రంప్ పట్ట పగ్గాలు లేనివిధంగా తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయ సమాజం ఆర్థికంగా అల్లకల్లోలంగా మారుతున్నది. ట్రంప్ దేశాధ్యక్షుడు అయిన వెంటనే అమెరికాకు సంబంధించి పలు రక్షణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా పౌరసత్వంపై ఆంక్షలు, విదేశాలకు అందించే సహాయ నిధులలో కోత, అక్రమ వలసదారులపై వేటు, అమెరికన్ ప్రభుత్వ ఉద్యోగుల కుదింపునకు, దుబారా నివారణకు ఎలాన్ మస్క్ నేతృత్వంలో ‘డోజ్’ ఏర్పాటు తదితర నిర్ణయాలకు చాలావరకు సానుకూల స్పందన వచ్చింది. కానీ వివిధ దేశాలతో జరిపే ఎగుమతులు, దిగుమతులలో సమాన స్థాయిలో సుంకాలు విధిస్తామనీ, టారిఫ్‌ల విషయంలో ఎవ్వరికీ మినహాయింపులు ఉండవనీ తెగేసి చెప్పడంతో అంతర్జాతీయ వాణి జ్యంలో అనిశ్చితి ఏర్పడింది. ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అనే ఓ ముతక సామెతను గుర్తు తెచ్చే విధంగా ట్రంప్ ఒకవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత దేశ ప్రజల పట్ల తనకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని చెబుతూనే భారత్ నుంచి దిగుమ తయ్యే సరుకులపై అధిక సుంకాలు వేస్తామని తేల్చేశారు.పరస్పర సుంకాల విధానం అంటే, ఏదైనా ఒక దేశం అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై ఎంత మొత్తాన్నైతే దిగుమతి సుంకంగా విధిస్తుందో, అమెరికా కూడా సదరు దేశ ఉత్పత్తులపై అంతే సుంకం విధిస్తుందంటూ ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించేశారు. కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకొనే ఉత్పత్తులపై 25%; చైనా ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అలాగే, భారత్ వద్ద చాలా సంపద ఉందనీ, అమె రికా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తోంది కనుక... ఆ మేరకు మేమూ సిద్ధమేనంటూ ట్రంప్ సాక్షాత్తూ మోదీ సమక్షంలోనే కుండబద్దలు కొట్టారు.సుంకాలకు శ్రీకారం చుట్టింది అమెరికాయే!ప్రపంచం మొత్తం ఓ అంతర్జాతీయ గ్రామంగా మారాలనీ, స్వేచ్ఛా ప్రపంచ వాణిజ్యం వల్ల అన్ని దేశాలూ లాభపడతాయంటూ తొలుత విదేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 1929 నుంచి ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది అమెరికాయే. దాంతో, అంత ర్జాతీయ వాణిజ్యంలో క్రమంగా అన్ని దేశాలూ పాల్గొనడం మొదలైంది. వాణిజ్య సుంకాలకు సంబంధించి అంతర్జాతీయ నిబంధనలు ఏర్పరచడం తప్పనిసరి అని అన్ని దేశాలూ అంగీకారానికొచ్చిన నేపథ్యంలోనే 1948లో ‘గాట్’ (జనరల్ అగ్రిమెంట్ ఫర్ ట్రేడ్ అండ్ టారిఫ్) ఒప్పందం మొదలైంది. దాంతో ‘అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య సమాజం’ ఆవిర్భవించింది. 1994లో 117 దేశాలు గాట్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అందులో భారత్ కూడా ఉంది. ‘వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్’ (ప్రపంచ వాణిజ్య సంస్థ)లోని సభ్య దేశాల నడుమ వాణిజ్య ఒప్పందాలు జరగడం; సుంకాల విధింపునకు సంబంధించి పలు దఫాలు చర్చలు జరిగి ఆయా దేశాలపై విధించిన ఆంక్షల విషయంలో సడలింపులు చోటు చేసుకొన్నాయి. భారతీయ జౌళి ఉత్పత్తుల దిగు మతులపై అప్పటివరకు ఉన్న ఆంక్షల్ని చాలా దేశాలు ఎత్తి వేశాయి. ఇదంతా చరిత్ర!ఎవరికి నష్టం?‘అమెరికన్లను రక్షించేందుకు ఈ సుంకాలు అవసరం’ అనిట్రంప్ తన నిర్ణయాలను సమర్థించుకొంటున్నారు. పైగా, దీనికోసం అమెరికా అధ్యక్షుడిగా తనకున్న అసాధారణ అధికారాలను ఉపయో గించుకొని ‘అంతర్జాతీయ ఆత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ (ఐఈ ఈపీఏ)ను ఉపయోగించుకొంటున్నారు. దీనివల్ల అమెరికా న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవడానికీ, ట్రంప్ నిర్ణయాలను సమీక్షించ డానికీ అవకాశం లేకుండా పోయింది. ప్రజల స్పందన ఎలా ఉన్నా, అమెరికా దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. రోజుల వ్యవధిలోనే లక్షల డాలర్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. చమురు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. చౌకగా లభించే శ్రామిక శక్తి దూరమైంది. ఈ విపరిమా ణాలతో అమెరికా ద్రవ్యోల్బణ రేటు ప్రస్తుతం ఉన్న 2.9 శాతం నుంచి 3.3 శాతానికి చేరుకొంటుందని అక్కడి ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. అమెరికాలోని భారతీ యులు కూడా ఆ మేరకు నష్టపోతారు.ట్రంప్ దూకుడును నియంత్రించే శక్తి ఎవరికి ఉంది? రష్యా– ఉక్రెయిన్ యుద్ధంపై బైడెన్ అనుసరించిన వైఖరికి భిన్నంగా ట్రంప్ రష్యాకు అనుకూలంగా మారిపోవడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అనివార్యంగా ట్రంప్‌ను సమర్థిస్తున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా సభ్య దేశాలుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఒక దశలో డాలరు చెల్లింపుల వ్యవçస్థ నుంచి వైదొలగాలని భావించినప్పటికీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను విరమించుకొనే అవకాశం ఉంది.‘అమెరికా హితం ప్రపంచ హితం, అమెరికా శోకం ప్రపంచ విషాదం’ అనే ఓ వ్యంగ్య నానుడి ఉంది. అంటే అమెరికా ఏది చేసినా ప్రపంచానికి మంచి చేస్తుంది కనుక అన్ని దేశాలూ గొర్రెల్లా తలలు ఊపాల్సిందే. కానీ ట్రంప్ తీసుకొంటున్న సమాన టారిఫ్ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యాన్ని చావుదెబ్బ తీసే పరిస్థితులు కనిపిస్తున్న నేప థ్యంలో మిగతా దేశాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఆసక్తికరం.భారత రైతాంగానికి రక్షణ అవసరంనిజానికి, అభివృద్ధిలో వెనుకబడిన దేశాలు తమ దేశీయ ఉత్పత్తులను రక్షించుకోవడానికి అధిక సుంకాలు విధించడం సహజం. ఉదాహరణకు మన దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడే వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించనట్లయితే... దేశ రైతాంగానికి పండించే పంటలకు కనీస మద్దతు ధరలు లభించక వారి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఒకవేళ భారత ప్రభుత్వం కనుక ట్రంప్ హెచ్చరికలకు తలొగ్గి, అమెరికా వ్యవసాయ దిగుమతులపై ప్రస్తుతం విధిస్తున్న సుంకాలను తగ్గించినట్లయితే... భారతీయ మార్కెట్లను అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు ముంచెత్తుతాయి. ఫలితంగా భారతీయ రైతాంగం మరింతగా కష్టాల ఊబిలోకి కూరుకుపోతుంది.కాగా, అమెరికాకు భారత్ చేస్తున్న ఎగుమతులలో వస్త్రాలు, ఔషధాలు, ఐటీ ఆధారిత సేవలు, అల్యూమినియం, ఉక్కు, ఇంకా కొన్ని రకాల వ్యవసాయ ఉత్పతులు ప్రధానంగా ఉన్నాయి. వీటిపై అమెరికా అధిక సుంకాలు వేస్తే మన దేశంలోని పరిశ్రమలు నష్ట పోతాయి. నష్టాన్ని నివారించాలంటే కొత్త మార్కెట్లను అన్వేషించాలి. అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల... దేశ పారిశ్రామిక రంగాన్ని ‘ట్రంప్’ సవాళ్ల నుంచి రక్షించుకోవడం కేంద్ర ప్రభుత్వానికి తలకు మించిన భారమే. ట్రంప్ ఏకపక్షంగా పెంచిన సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో)కు ఫిర్యాదు చేసింది. భారత్ కూడా అమెరికా మీద ఒత్తిడి తేవడానికీ, తన ప్రయోజనాలను కాపాడుకోవడానికీ దృఢంగా వ్యవహరించాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి -
ఏది శాశ్వతం? ఏదశాశ్వతం
ఒక మహారాజు ప్రపంచంలో ఎవరూ కట్టించని అద్భుతమైన భవనాన్ని నిర్మింప జేయాలను కున్నాడు. లెక్కలేనంత ధనాన్ని ఖర్చు చేసి, దేశం నలుమూలల నుంచి గొప్ప గొప్ప శిల్పులను పిలిపించి కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో పనిచేయించి గొప్ప భవనాన్ని నిర్మింపజేశాడు. ఆ భవనం విశాలమైన గదులు, ధగ ధగ మెరుస్తున్న కాంతులతో, బంగారు తాపడాల గోడలతో, మంచి శిల్ప నైపుణ్యంతో దేవేంద్ర వైభవాన్ని తలపిస్తూ ఉంది. ఒక రోజు రాజు గృహ ప్రవేశ కార్యక్రమానికిఘనంగా ఏర్పాటు చేసి, దేశం లోని రాజ ప్రముఖులను, విద్వాంసులను, వ్యాపారవేత్తలను, వాస్తు శాస్త్రజ్ఞులను ఆహ్వానించాడు. గృహ ప్రవేశం అయ్యాక, రాజు సభ ఏర్పాటు చేసి, వారితో... ‘ఈ గొప్ప భవనాన్ని ఎంతో ఖర్చు చేసి కట్టించాను. ప్రపంచంలో ఇంత సర్వాంగ సుందరమైన భవనం ఇంకోటి ఉండకూడదు. అందుకని, మీలో ఎందరో ప్రతిభా వంతులు ఉన్నారు. మీరు ఈ భవనాన్ని సమగ్రంగా పరిశీలించి, ఇందులో లోపాలు, దోషాలు ఏమైనా ఉంటే చెప్పండి. సవరణలు చేయిస్తాను. ఇప్పుడే తెలపండి’ అన్నాడు.రాజు మాటలు విని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్య పోయారు. ఇంత అందమైన కట్టడంలో లోపాలా? అనుకున్నారు. అయినా, రాజు మాట కాదనలేక, వారిలో శిల్పులు, వాస్తు శాస్త్రజ్ఞులు భవనమంతా చూసి ఏ లోపం లేదని నిర్ధరించారు. రాజు చాలా సంతోషించాడు. అంతలో, సభాసదులలో నుంచి ఒక సాధువు లేచి నిల్చున్నాడు. ‘రాజా! ఈ భవనంలో రెండు దోషాలున్నాయి’ అన్నాడు. రాజు వినయంగా అవేమిటో తెలపమన్నాడు. అప్పుడా సాధువు, ‘ఈ భవనాన్ని కట్టించినవారు ఎప్పటికైనా చనిపోతారు. ఇది ఒక దోషం. ఈ భవనం కాలగర్భంలో ఎప్పటికైనా కలిసిపోతుంది. ఇది ఇంకో దోషం’ అన్నాడు. అప్పుడు రాజుకు వివేకం ఉదయించింది. ‘ఈ లోకంలో ప్రతిదీ నశించి పోయేదే. నశ్వరమైన భౌతిక సంపదల కోసం, తక్షణఆనందం కోసం ఇంత ఖర్చు చేసి ఇన్ని సంవత్సరాల సమయం వృథా చేశాను కదా. శాశ్వతమైనది దైవం ఒక్కడే! ఆ దైవం ముందు ఇవన్నీ నశ్వరాలే’ అని తెలుసుకున్నాడు. రాజుతో పాటు అందరం తెలుసుకోవలసింది ఇదే! దైవ అనుగ్రహానికే మనిషి పాటుపడాల్సింది. – డా. చెంగల్వ రామలక్ష్మి -
నెగ్గేదెలా?
లోక్‌సభలో ఐదు దక్షిణాది రాష్ట్రాల దామాషా ప్రాతినిధ్యానికి ముప్పు వాటిల్లబోతోంది. వాటి మెడపై డీలిమిటేషన్ కత్తి వేలాడుతోంది. ఈ ఉపద్రవం తప్పాలంటే కేంద్రం మెడ వంచాలి. దీనికోసం దక్షిణాది తరఫున తమిళనాడు ముందుండి కేంద్రంపై పోరాటం చేస్తోంది. భారత సమాఖ్య పట్ల ఏకీభావం ప్రతిష్టంభనలో పడింది. ఈ నేపథ్యంలో, డీలిమిటేషన్ మరో 30 ఏళ్లు వాయిదా వేయాలని తమిళనాడు అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ , ‘వన్ నేషనిజం’ అంటూ బీజేపీ సమస్యను జటిలం చేస్తోంది. భాషావివాదం మీద పార్లమెంటులో మాట్లాడుతూ, తమిళనాడుకు నిజాయితీ లేదని, అనాగరిక రాష్ట్రమని నిందిస్తూ ఆ రాష్ట్రానికి విద్యానిధులు తొక్కిపట్టింది. సమాఖ్య విషయంలో కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత కొరవడింది. కాబట్టే బీజేపీ కూటమి యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తమిళనాడు నేతృత్వంలో కేంద్రంపై ధ్వజమెత్తుతున్నాయి. డీలిమిటేషన్ చిక్కుముడికి పరిష్కారాలు లేకపోలేదు. రాజ్యసభ స్వరూపం మార్చడం వీటిలో ఒకటి. రాష్ట్రాల సరైన ప్రాతినిధ్యానికి వేదికగా దాన్ని రూపొందించాలి. అలాగే సంఖ్యాపరంగా లోక్‌సభ సైజు పెంచడం ద్వారా, పెద్ద రాష్ట్రాలు అదనపు స్థానాలు పొందినా, ఇతరత్రా ఏ రాష్ట్రం నష్టపోకుండా చూడవచ్చు. అధిక జనాభా ఉన్న యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల సరిహద్దులు మార్చడం మరో మార్గం. ఆర్థిక వృద్ధి అనివార్యతలు, రాష్ట్రాల నడుమ నెలకొన్న సామాజిక ఆర్థిక అంతరాలు సమాఖ్య స్ఫూర్తి పునాదులను బలహీన పరుస్తున్నాయి. రాష్ట్రాల పునర్ విభజన చట్టంతో భాషా సమస్య పరిష్కారమైన పిదప, సమాఖ్య ఏకీభావతకు ఎదురవుతున్న తొలి సవాలు ఇదే. దీన్ని ఎదుర్కొనేందుకు ఇప్పుడు కావల్సింది సమాఖ్య సూత్రానికి అన్ని వైపుల నుంచీ బలమైన మద్దతు.విశ్వాసం కల్పించాల్సింది కేంద్రమే!చరిత్ర చూసినట్లయితే, పాలనలోనూ, నిధుల పరంగానూ కేంద్రీకృత విధానాలే ఉన్నాయి. సంకీర్ణ రాజకీయాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సైతం ప్రాంతీయ పార్టీలు పాత వ్యవస్థను సవాలు చేయలేదు. దీంతో సమాఖ్య సూత్రం గట్టిగా వేళ్ళూన లేదు. ద్రవ్యపరంగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణ తగ్గలేదు. పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు పంచాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ రాష్ట్రాల తరఫున కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయితే ఇది రాజకీయ పటా టోపంగానే మిగిలి పోయింది. ఆ రోజుల్లో యథా తథ స్థితిని అనుసరించడమే రాజకీయ సంస్కృతిగాఉండేది. పేద రాష్ట్రాలకు జాతీయ పన్నుల్లో అధిక వాటా లభించడం తరహా సమన్యాయ సూత్రానికి రాష్ట్రాలన్నీ ఇష్టపూర్వకంగానే తలలూ పాయి. ప్రాతినిధ్య అసమానతను అంగీకరించాయి.సమాఖ్య ఏకాభిప్రాయం మీద ఆర్థిక వృద్ధి ప్రభావం పడుతోంది. పన్నుల హేతుబద్ధీకరణ, నియంత్రిత మార్కెట్లు, రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరించే సేవలు వంటి అవసరాలకు కేంద్రీకృత వ్యవస్థ ఎన్నో రకాలుగా ఉపయుక్తం అవుతుంది. ఇలా జరగడం వల్ల రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కూడా అంతే స్థాయిలో తగ్గుతుంది. నిధుల పంపిణీ పరంగా కొత్త వివాదాలు ఉత్పన్నమవుతాయి.ఈ వివాదాలను విశ్వసనీయంగా పరిష్కరించే శక్తి కేంద్రానికి మునుపటి కంటే ఎక్కువ అవసరమవుతుంది.వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం లోకి మారడం వల్ల ఉత్పన్నమైన వివాదాలు ఇందుకు నిదర్శనం. రాష్ట్రాలు తమ పన్ను విధింపు హక్కును వదులుకోవడంతో, పన్ను ఆదాయంలో తమ వాటా ఎంత అన్నది ప్రధానంగా మారింది. రాష్ట్రాల నడుమ ఆర్థిక అంతరం హెచ్చింది. ఆర్థికంగా బలమైన దక్షిణాది రాష్ట్రాలు సమన్యాయాన్ని సవాలు చేయసాగాయి. 16వ ఫైనాన్స్ కమిషన్ ఎదుట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేవనెత్తిన అంశం ప్రస్తావనార్హం: ‘కర్ణాటక సమకూర్చే ప్రతి రూపాయిలో ప్రస్తుత ఫార్ములా ప్రకారం తిరిగి వెనక్కు వచ్చేది కేవలం 15 పైసలు’ అని ఆయన వాపోయారు. తమిళ నాడు కూడా ఇదే వాదన చేసింది. డీలిమిటేషన్ మీద ఆందోళనలు సైతం అదే మాదిరివి.భిన్న ప్రాంతాల నడుమ ఆర్థిక అసమానతలు పెరిగిపోవడమే లక్షణంగా మారిన ఈ దేశంలో ఈ సమదృష్టి సూత్రం ఎంతవరకు ఆచరణ సాధ్యం? కానప్పుడు, పన్ను ఆదాయాల పంపిణీ ఫార్ములాను సంతులన పరచుకుంటూ అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలకూ కలిపి ఒక ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయడం వంటి వేరే మార్గాలు కేంద్రానికి లేవా? అలాగే సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామన్న విశ్వస నీయ సంకేతం ఇవ్వాల్సిన, కొత్త ఏకాభిప్రాయాన్ని తీసుకురావల్సిన బాధ్యత కేంద్రం మీదే ఉంటుంది. సమాఖ్య విధానం పట్ల బీజేపీ ఒంటబట్టించుకున్న అసహనం సమస్య పరిష్కారాన్ని జటిలం చేస్తోంది. స్వయంప్రతిపత్తి గల జమ్ము – కశ్మీర్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు గుంజుకుని, వాటిని కేంద్రం పెత్తనం కిందకు తెచ్చుకోవడం వల్ల ఏర్పడిన పరిణామాలు, రాష్ట్రాలకు పన్నుల్లో దక్కాల్సిన వాటాను తనకు మాత్రమే దఖలు పడే సెస్సులు, సర్ చార్జీల విధింపు ద్వారా కుదించివేయడం, అలాగే కేంద్రం సేవలో ఉండేలా కొత్త పాలనా సంస్కృతిని ప్రోత్సహించడం... ఇవన్నీ సమాఖ్య పట్ల కేంద్ర అసహనానికి నిదర్శనాలు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు కేంద్రంపై రాజకీయంగా ధ్వజమెత్తడం, రాజీలేని వైఖరి ప్రదర్శించడం మినహా మరేం చేయగలవు? సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు తమ హక్కుల కోసం బేరసారాలు జరిపే హక్కు ఎన్ని పరిమితులకు లోబడి ఉందో ప్రస్తుత డీలిమిటేషన్ చిక్కుముడి వెల్లడిస్తోంది. డీలిమిటేషన్‌ను ఎంతకాలం వీలైతే అంతకాలం వాయిదా పడేలా చేయాలన్న స్టాలిన్ ఆలోచన ఫలితమే ప్రస్తుత ప్రతిష్టంభన! ఎంతో కష్టపడి సాధించుకున్న అమూల్యమైన భారత సమాఖ్య ఈ క్రమంలోమరింత బలహీన పడుతుంది.యామినీ అయ్యర్ వ్యాసకర్త బ్రౌన్ యూనివర్సిటీలో విజిటింగ్ సీనియర్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
జన్యు నిధుల అనుసంధానం కీలకం!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025–26 ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండవ ‘నేషనల్ జీన్ బ్యాంక్’ ఏర్పాటును ప్రక టించారు. ఇది ఒక మిలియన్ జన్యు పదార్థాల శ్రేణులతో నిండి, భవిష్యత్తులో ఆహారం– పోషకాల భద్రత కోసం ఏర్పాటు చేయబోయే నిర్మాణంగా చెప్పుకొచ్చారు. జన్యు వైవిధ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికీ, వైవిధ్యాన్ని పరిరక్షించే లక్ష్యం కోసం... పబ్లిక్, ప్రైవేట్ రంగాలూ, కమ్యూ నిటీలూ (వ్యక్తుల సమూహాలు, సంఘాలు, సంప్ర దాయ జాతులు) కలిసికట్టుగా ప్రయత్నిచవలసిన అవసరం ఉంది. అందువల్ల నిపుణులు ఈ నిర్ణ యాన్ని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. నూతనంగా ఏర్పడ నున్న రెండవ జీన్ బ్యాంకుతో కమ్యూనిటీ విత్తన బ్యాంకుల అనుసంధానం ద్వారా పారిశ్రామిక రంగంతో సహా సంబంధిత వ్యక్తులు, సంస్థలు (షేర్ హోల్డర్లు) అందరూ అంతర్జాతీయ ఒప్పందం (కన్వెన్షన్ ఆన్ బయోలా జికల్ డైవర్సిటీ–సీబీడీ 1993), జాతీయ జీవ వైవిధ్య చట్టం–2002 (ఎన్బీఏ–2002)లో పొందుపరిచిన మూడు సూత్రాలకు (పరిరక్షణ, స్థిరమైన వినియోగం, న్యాయమైన – సమానమైన లాభాల పంపిణీ) కట్టుబడి ఉండగలరన్న ఆశా భావం వ్యక్తం అవుతోది.జాతీయ జన్యు బ్యాంక్ అనేది భవిష్యత్ తరాలకు వివిధ పంటలు, అడవి జాతులు, అనేక రకాల చెట్ల జన్యువులను నిల్వచేసే సదుపాయం. కమ్యూనిటీ విత్తన బ్యాంకులు పంటల అభివృద్ధి, ఆహార భద్రత, స్థిరమైన సమాజ అభివృద్ధికి బిల్డింగ్ బ్లాక్‌లుగా ఉపయోగపడే స్థానిక ప్రత్యామ్నాయ జన్యు వనరులుగా గుర్తించబడ్డాయి. జన్యు వనరుల సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవి దశాబ్దాల నుండి అనధికార వ్యవ స్థలుగా కొనసాగుతూనే ప్రాంతీయ కమ్యూనిటీలకు సంప్రదాయ విత్తన కోశాగారాలుగా పని చేస్తున్నాయి. అందులో ఉన్న వైవిధ్యభరిత జన్యు పదార్థాలను ఒక వ్యవస్థలో ఏకీకృతం చేయగలిగే కమ్యూనిటీ నిధులుగా ప్రస్తుతం సంఘటిత పడుతూ, అక్కడి వెనుకబడిన ఆదివాసీ కమ్యూ నిటీ వర్గాలకు సేవలు అందిస్తున్నాయి. ఈ కమ్యూనిటీ విత్తన బ్యాంకులు స్థానికంగా నిర్వహించబడే సంస్థలు. ఇవి విత్తనాలను సేకరించడం, నిల్వ చేయడం, కమ్యూనిటీ విత్తన అవసరా లను తీర్చడం వంటి సేవలు అందిస్తున్నాయి. అవి దేశంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద–చిన్న పంటలు, ఔషధ మొక్కలు, అలాగే నిర్లక్ష్యం చేయబడి తక్కువ ఉపయోగంలో ఉన్న మొక్కల జాతులను తమ పరిధిలో అంతరించి పోకుండా రక్షణ కలిగిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇవి సరైన నిల్వ, మౌలిక సదుపాయాలు, విత్తన శుద్ధి పరికరాలు, నిర్వహణ సిబ్బందికి శిక్షణ లేమి, ఆర్థిక మద్దతు లోటుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయి. ఈ సమస్యలను పరిష్కరించవలసి ఉంది.భారత్ తన మొదటి జాతీయ జన్యు నిధిని 1996లో జాతీయ జాతీయ జన్యు వనరుల బ్యూరో న్యూ ఢిల్లీలో ఏర్పాటు చే సింది. మొట్ట మొదటి జన్యు నిధికి ఉన్న 0.47 మిలియన్ల నమూనాల పరి రక్షణ సామర్థ్యాన్ని అధిగమించి, రెండో జాతీయ జన్యు నిధికి నిల్వ సామర్థ్యాన్ని ఒక మిలియన్ దాకా పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, దేశంలోని అధిక జీవవైవిధ్య సాంద్రత ఉన్న ప్రాంతాలలోని స్థానిక పరిరక్షకుల సంఘాలతో కమ్యూనిటీ విత్తన నిధులను జాతీయ జీన్ బ్యాంకుతో అనుసంధాన పరచడం ఒక ప్రగతిశీల ఆచరణయోగ్య కార్యక్రమం. భారత దేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఈశాన్య, అండమాన్–నికోబార్ దీవులు వంటి అనేక జీవవైవిధ్య సాంద్రత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. కనుక, ప్రస్తుత, భావితరాల ఆహార మరియు పోషకాల భద్రతా లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ రెండవ జాతీయ జన్యు బ్యాంకు ఏర్పాటు చొరవలో స్థానిక పరిరక్షకులు తప్పనిసరిగా భాగస్వాములు కావాలి.బలిజేపల్లి శరత్ బాబువ్యాసకర్త భారత వ్యవసాయ మండలి విశ్రాంత శాస్త్రవేత్త -
ప్రభుత్వం చేయాల్సింది కొండంత!
ప్రధాని మోదీ ఆ మధ్య తన ‘మన్ కీ బాత్’ ప్రసారంలో ఒక ప్రధానమైన ప్రజారోగ్య సవాలు గురించి నొక్కి చెప్పారు. అదేమిటంటే... అధిక బరువు లేదా ఊబకాయం సమస్య. ఒక వ్యక్తి నుండి మరొకరికి నేరుగా సంక్రమించని మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు (ఎన్సీడీలు) పెరగడా నికి దారితీసే కారకాల్లో ఊబకాయం ఒకటి. వంట నూనె వినియోగాన్ని తగ్గించడం వంటి చిన్న ప్రయత్నాలతో దేశం ఊబకాయం సవాలును పరిష్కరించగలదని ప్రధాని అన్నారు. ‘ప్రతి నెలా 10 శాతం తక్కువ నూనె వాడితే సరి. అది ఊబ కాయాన్ని తగ్గించే ముందడుగు అవుతుంది’ అన్నారాయన.ఆహారంలో తక్కువ నూనె వాడటం, ఊబకాయాన్ని ఎదు ర్కోవడం కుటుంబం పట్ల బాధ్యత కూడా అని ప్రధాని అన్నారు. ప్రధాని ఇచ్చిన ప్రజారోగ్య సందేశం ముఖ్యమైనదే. కానీ అది మొత్తం కథలో ఒక భాగం మాత్రమే. కొవ్వుల అధిక వినియోగం, ప్రధానంగా ఆహారంలో ఉండే ఒక రకమైన ట్రాన్స్ ఫ్యాట్స్ లేదా అసంతృప్త కొవ్వు (ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్) లేదా అనేది ఎన్సీడీ వ్యాధులకు కారణమయ్యే వాటిల్లో ఒకటి మాత్రమే. అసంతృప్త కొవ్వు మూలాలలో పాల ఉత్పత్తులు, నెయ్యి, మాంసం, వనస్పతి ఉన్నాయి. ఇతర కొవ్వులను ఎక్కువగా తీసుకోవడం కూడా హానికరం. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ జారీ చేసిన ఆహార మార్గదర్శకాల ప్రకారం... కొబ్బరి నూనె, నెయ్యి, పామోలిన్ నూనెలో సంతృప్త కొవ్వుల నిష్పత్తి అత్యధికంగా ఉంటుంది. ప్రధాని సూచించినట్లుగా, వంట చేసేటప్పుడు లేదా డ్రెస్సింగ్ చేసేట ప్పుడు ఆహారానికి జోడించే కొవ్వుల వినియోగాన్ని తగ్గించడం అనేది మనం వేసే ముందడుగులో సగం మాత్రమే. ప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్, వేయించిన స్నాక్స్, కుకీలు వంటి వాటిద్వారా మనం అసంతృప్త కొవ్వులను తీసుకుంటాం.సంతృప్త, అసంతృప్త కొవ్వుల వనరులు కూడా మారుతూ ఉంటాయి. అలాగే వంట నూనెలూ ఉంటాయి. ప్రజారోగ్యంపై ఆరోగ్యకర ప్రభావం కోసం... నూనెలు మాత్రమే కాక నెయ్యి, వనస్పతి అలాగే అల్ట్రా–ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్, పాల ఉత్పత్తులు తీసుకోవడాన్ని తగ్గించడం అవసరం. అనారోగ్యకరమైన ఆహారం, కూర్చుని పనిచేసే జీవనశైలికి వ్యతిరేకంగా కూడా ఊబకాయంపై జాతీయ ప్రచారాన్ని విస్తరించాలి.వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని కోరడం ద్వారా ఊబకాయ మహమ్మారిని ఎదుర్కోవాల్సిన బాధ్యతను వ్యక్తులపై పెట్టారు ప్రధాని. ఆరోగ్యకర ఆహారపుట లవాట్లను అవలంబించడం అనేది వ్యక్తుల బాధ్యతతోపాటు, సామాజిక బాధ్యత కూడా అంటూ దశాబ్దాలుగా సాగించిన ప్రచారానికి ఇది విరుద్ధం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలు తినడానికి వీలు కల్పించే, ప్రోత్సహించే వాతావరణ పరికల్పనకు తగిన విధానాలను రూపొందించడం ప్రభుత్వ విధి. ఊబకాయాన్ని పరిష్కరించడానికి వ్యక్తిగతమైన చర్యలతో పాటు ఇతర చర్యలూ అవసరం. ఉదాహరణకు, భారతదేశం వంటనూనె దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. పైగా ప్రభుత్వ విధానాలు పామాయిల్ దిగుమతిని ప్రోత్సహిస్తాయి. దిగుమతి చేసుకున్న అన్ని నూనెలలో ఇది దాదాపు 60 శాతం ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ పరిశ్రమకు పామాయిల్ చాలా ఇష్టమై నది. అయినా అనేక అధ్యయనాలు పామాయిల్ వినియోగంతో హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపాయి. వంట నూనెల ఉత్పత్తినీ, దిగుమతినీ నియంత్రించే ప్రభుత్వ విధానాలను ప్రజలకు తక్కువ హానికరమైన వంట నూనెలను అందించే విధంగా రూపొందించాలి.గత కొన్ని దశాబ్దాలుగా... పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ, ఆహార ఉత్పత్తుల ప్రపంచీకరణ పెరగడంతో దేశంలో ఆహారపుటలవాట్లు మారాయి. ఫలితంగా ఉప్పు, చక్కెర, కొవ్వులు అధికంగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు ప్రజాదరణ పొందాయి. ఈ ఉత్పత్తులు ఆహార పర్యావరణాన్ని మార్చాయి. ప్రతి చోటా జంక్ ఫుడ్ అందుబాటులో ఉంది. ఈ మార్పుకు ప్రభుత్వ విధానాలు పెద్ద ఎత్తున దోహదపడ్డాయి. ప్రభుత్వాలు చిప్స్, కోలాస్, కుకీలు, నమ్కీన్ వంటి వాటిని తయారు చేసే, ప్రాసెస్ చేసే ఫుడ్ కంపెనీలకు సబ్సిడీలను అందిస్తాయి. ఆరోగ్యకరమైన ఎంపిక కాబట్టి తాజా పండ్లు, కూరగా యలు అందుబాటులో ఉండేలా ప్రోత్సహించాలి. కానీ మన విధానాలు పండ్లు, కూరగాయలను ప్రాసెస్ చేసే కంపెనీలను ప్రోత్సహిస్తాయి. మరోవైపు, జంక్ ఫుడ్‌ను నియంత్రించే ఏ చర్య నైనా ఆహార నియంత్రణ సంస్థలు, పరిశ్రమ ఆదేశం మేరకు నిలిపివేస్తున్నాయి. హాస్యాస్పదం ఏమిటంటే, ఆహార భద్రతా రెగ్యులేటర్, సుప్రసిద్ధ జంక్ ఫుడ్ కంపెనీల భాగస్వామ్యంతో కొన్ని సంవత్సరాలుగా ’ఈట్ రైట్’ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. జంక్ ఫుడ్‌పై కఠిన నియంత్రణకు మద్దతు పొందే బదులుగా, ఆహార భద్రతా నియంత్రణ సంస్థ అది నియంత్రించాల్సిన వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2022 నాటికి ఆహార గొలుసు నుండి పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన అసంతృప్త కొవ్వులను తొలగించడానికి ‘ఇండియా:75: ఫ్రీడమ్ ఫ్రమ్ ట్రాన్స్ ఫ్యాట్స్’ కార్యక్రమాన్ని ఆహార నియంత్రణ సంస్థ 2019లో ప్రారంభించింది. కానీ జంక్ ఫుడ్ పరిశ్రమ నుండి తీవ్ర వ్యతిరేకత వల్ల ఈ లక్ష్యసాధన సాధ్యం కాలేదు.‘కూర్చుని పనిచేసే’ జీవనశైలి, అసలు వ్యాయామం చేసే అవకాశం లేనిస్థితులు కూడా గమనార్హం. శారీరకంగా చురుకుగా ఉండటం, వ్యాయామం చేయడం వ్యక్తిగత ఎంపికే అయినా, సమాజ స్థాయిలో శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించే చురుకైన వాతావరణాన్ని సృష్టించడంలో ప్రభుత్వ విధానాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు, నడక, వ్యాయామానికి అనుకూల మైన బహిరంగ ప్రదేశాలను అందించడం; ప్రజా రవాణా, పాద చారులకు ప్రత్యేక కాలిబాటలు, సైక్లింగ్ మార్గాలు ఏర్పాటు ప్రజారోగ్యాన్ని కాపాడడంలో కీలకం. వంటనూనె వినియోగాన్ని తగ్గించడం వంటి వ్యక్తిగత చర్యలు ఊబకాయపు చక్రంలో ఒక చిన్న భాగం మాత్రమే. ప్రభుత్వాలు చేయాల్సింది చాలా ఉంది.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘ఇండియా’ కూటమి లేనట్టేనా?
సీపీఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త ప్రకాశ్ కరత్ ఈ నెల 9వ తేదీన గమనా ర్హమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణం తర్వాత ఇంకా ఎవరూ ఆ స్థానంలోకి రాలేదు. కరత్ పాలిట్ బ్యూరో సమన్వయ కర్తగా నియమితులయ్యారు. అది ప్రస్తుతా నికి ప్రధాన కార్యదర్శి వంటి హోదా. పైగా ఆయన స్వయంగా లోగడ ఆ హోదాలో పని చేశారు. అందువల్ల తన మాటలకు తగినంత ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు. కరత్‌కు మార్క్సిస్ట్ సిద్ధాంతాలలో నిష్ణాతుడనే పేరు పార్టీలో, బయటా కూడా ఉన్నది. హరికిషన్ సింగ్ సూర్జిత్ ప్రధాన కార్యదర్శిగా ఉండినపుడు, సీపీఎంతో పాటు మొత్తం వామపక్షాలను మధ్యే మార్గ పార్టీలతో మైత్రి వైపు మళ్లించారు. సీతారాం అందుకు అనుకూలురు కాగా, కరత్ వ్యతిరేకి. కరత్ మాట్లాడిన సందర్భం సీపీఎం కేరళ శాఖ సభలు కొల్లామ్ పట్టణంలో జరగటం. ఆ సభలు ఒక రాష్ట్రానికి సంబంధించినవి. ఆయన మాటలు నేరుగా తన ప్రసంగంలో అన్నవి గాక, విడిగా ఒక పత్రికా ప్రతినిధితో చెప్పినవి. అందువల్ల వాటికి తగిన ప్రచారం రాలేదు. కానీ అవి మొదట అనుకున్నట్లు గమనార్హమైనవి: ‘ఇండి యన్ నేషనల్ డెవలప్మెంటల్, ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరిట ఏర్పడిన 26 బీజేపీ యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధా నాలు, సిద్ధాంతాలు, నాయకులు ఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. ఒక సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఇతర పార్టీలు ప్రయత్నించాయి గానీ అది ఆచరణలో పని చేయగలది కాదన్నాము. దానితో, నాయకులు మాత్రం కలుస్తుండేవారు. కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు గానీ అవేవీ పని చేయ లేదు. సీట్ల సర్దుబాటుపై జాతీయ స్థాయి చర్చలు వీలయేవి కాదు గనుక ఆ పని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా జరగాలన్నాము మేము. ఉదాహరణకు మా పార్టీ బెంగాల్లో, కేరళలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయదు. మొత్తానికి ఆ పద్ధతి పనిచేసి బీజేపీ సొంత మెజారిటీ కోల్పోయి 240 స్థానాలకు తగ్గింది. అందువల్ల, ఇండియా కూటమి అన్న ఆలోచనే లోక్‌సభ ఎన్నికలకు పరిమితమైనటువంటిది... లోక్ సభ ఎన్నికల అనంతరం తమకు అసలు ఒక ఉమ్మడి వేదిక అవస రమా? అయితే ఏ విధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. ఒక వేళ వేదిక ఎన్నికల కోసమే అయితే, ఇపుడు చేయవలసింది ఏమీఉండదు’ అన్నారు సీపీఎం సమన్వయకర్త.కూటమి భవిష్యత్తు?కరత్ వెల్లడించిన అభిప్రాయాలలో ఇండియా కూటమి ఏవిధంగా వ్యవహరించిందన్న గత పరిస్థితులకే పరిమితమయ్యారనే భావన కలగవచ్చు. కానీ అందులో అంతర్లీనంగా, ప్రతిపక్షాలు మౌలి కంగా ఎట్లా పనిచేస్తున్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా పని చేయా లనే కోణాలు కూడా కనిపిస్తాయి. చెప్పాలంటే ఈ ప్రశ్నలు ప్రతి పక్షాలకు 1977 నాటి జనతా పార్టీ నుంచి మొదలుకొని తర్వాత కాలంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ల కాలంలో, ఇంకా తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడిన యూపీఏ హయాంలోనూ కొనసాగినవే. ఇండియా కూటమి బలహీనతలు, వైఫల్యాల వెనుక కూడా ఇదంతా ఉంది. కూటమికి వ్యవస్థాత్మక నిర్మాణాన్ని సీపీఎం వ్యతిరేకించటానికి కారణం అందులో పలు రకాల విధానాలు, సిద్ధాంతాలు గల పార్టీలు, నాయకులు ఉండటం. దీనికి సమాధానాలు కనుగొనలేకపోయినందువల్లనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కూటమికి భంగపాట్లు ఎదురు కావటం జరిగింది. అటువంటి భంగపాట్లు జనతా పార్టీ కాలం నుంచి గత 48 సంవత్సరాలుగా ప్రతిపక్షాలకు ఎదురవుతూనే ఉన్నాయి. అందుకు ఒక కారణం వారి వైఫల్యాలు కాగా, మరొకటి భారతదేశపు మహా విస్తారమైన వైవిధ్యత.ఇన్నిన్ని ప్రాంతాలు, సైద్ధాంతిక, విధానపర, రాజకీయ వైవిధ్య తలు ఉన్నపుడు ఏకాభిప్రాయాలు, విభేదాలకు అవకాశం ఉండని సమష్టి నాయకత్వాలు తేలిక కాదు. కాంగ్రెస్, బీజేపీలవలె నిర్దిష్ట దీర్ఘకాలిక చరిత్రలు, నాయకత్వాలు, సిద్ధాంతాలు ఉన్నపుడు అది సాధ్యమవుతుంది. లేదా ఎమర్జెన్సీ వంటి అసాధారణ పరిస్థితి ఏర్పడి దేశాన్ని ఒకటి చేయటం వంటిది జరగాలి. వీటన్నింటి మధ్య స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి ఒక పాయగా సాగుతుండిన సోషలిస్టు రాజకీయం సరిగా కుదురుకొని ఉంటే ఏమి జరిగేదో గానీ పలు కారణాలవల్ల అది ఛిన్నాభిన్నమైంది. మరొకవైపు, కేవలం ఎమర్జెన్సీ పట్ల వ్యతిరేకతతో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఏర్పడిన జనతా పార్టీ, తర్వాత ‘యాంటీ కాంగ్రెసిజం’ ఆలోచనలతో ముందుకు వచ్చింది. తాము ఒకప్పటి కాంగ్రెస్ సంప్రదాయంలో వామపక్షపు మొగ్గు గల మధ్యే మార్గ ప్రత్యామ్నాయం కాగలమన్న ఫ్రంట్ కూటములు అదే దశలో చెదిరిపోయాయి.కనీస ఉమ్మడి కార్యక్రమం ఏమిటి?అయితే, ప్రకాశ్ కరత్ మాటలను పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే, 1977 నాటి జనతా పార్టీ కాదుగానీ, 1989లో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ కొంత భిన్నంగా కనిపించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలతో అదే పార్టీకి చెందిన వీపీ సింగ్ వంటి ముఖ్య నేతలు బయటకు రావటం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నదనే ఫిర్యాదుతో పలు ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఎమర్జెన్సీ – జనతా పార్టీ దశలో ఒకటై తిరిగి చెదిరిపోయిన సోషలిస్టు వర్గాలు, ఉభయ కమ్యూ నిస్టులు, దేశవ్యాప్తంగా సమాజంలోని ప్రజాస్వామికవాదులు ఒకే వేదికపైకి వచ్చి చేరారు. అంతేగాక, వీపీ సింగ్, ఎన్టీఆర్‌ల నాయ కత్వాన బీజేపీని ఒక అడుగు దూరంలోనే ఉంచివేశారు. ఈ వైవిధ్య తల మధ్య అపుడు ప్రకాశ్ కరత్ ఉద్దేశిస్తున్నది ఒకటి జరిగింది. అది, ఎన్నికలకన్నా ముందే వివిధ పార్టీల మధ్య సుదీర్ఘ చర్చల ద్వారా ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ఒకటి రూపొందించటం. అది దేశ ప్రజానీకానికి ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించిన మాట నిజం. అయితే కొందరు సీనియర్ల అధికార కాంక్షలు, మందిర్–మండల్ వివాదాల మూలంగా ఆ ప్రయోగం భంగపడటం తెలిసిందే. అది జరగనట్ల యితే దేశ రాజకీయాలు మరొక విధంగా ఉండేవేమో.సీపీఎం సమన్వయ కర్త ప్రకాశ్ కరత్ అపుడంతా జాతీయ స్థాయిలో ఈ పరిణామాలను ప్రత్యక్షంగా గమనించిన వ్యక్తి. ప్రస్తుత ‘ఇండియా’ కూటమికి సంబంధించిన పరిణామాల వరకు తనకు తెలియనిది లేదు. అందువల్లనే ఆ కూటమి ఏర్పాటు తీరు, లక్ష్యాలు, పనితీరు, పరిమితులు, సాఫల్య వైఫల్యాల గురించి అంత స్పష్టంగా చెప్పగలిగారు. ఈ విషయాన్ని కొంత ముందుకు తీసుకువెళ్ళి నట్లయితే, ఆయన ఎత్తి చూపిన సైద్ధాంతిక, విధానపరమైన వైవిధ్యతలు, వైరుధ్యాల నుంచి, నాయకుల వ్యక్తిగత ధోరణులనుంచి బీజేపీ యేతర పార్టీలు బయటకు రాగలగటం, నేషనల్‌ఫ్రంట్ వలె కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించుకోవటం ఎంత వరకు సాధ్యమన్నది ప్రశ్న. అందుకు బీజేపీ వ్యతిరేకత అన్నదొక్కటే చాలదు. తమవైపు నుంచి ప్రజలకు చూపించే ప్రత్యామ్నాయ పాజిటివ్ ఆర్థిక, సామాజిక, అభివృద్ధి అజెండా తప్పనిసరి. ఎన్నికల తర్వాత ఏమిటన్న చర్చ ‘ఇండియా’ కూటమిలో ఎప్పుడూ జరగలేదని కరత్ ఎత్తిచూపింది ఈ విధమైన కొరతనే!‘ఇండియా’ పేరిట ఏర్పడిన 26 బీజేపీ యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధానాలు, సిద్ధాంతాలు, నాయకులుఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. లోక్‌సభ ఎన్నికల అనంతరంతమకుఅసలు ఒక ఉమ్మడి వేదిక అవసరమా? అయితే ఏవిధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. – ప్రకాశ్ కరత్, సీపీఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- టంకశాల అశోక్ -
కాలం చెల్లిన చైనా ‘చేప కథ’
ఏ శాస్త్రంలోని నూతన ఆవిష్కరణ అయినా సామాజిక శాస్త్ర పర్యావరణ గీటురాయి మీద దాని మానవీయ విలువను నిర్ధారించుకోక తప్పదు. 2004 డిసెంబర్లో ‘ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ’ (ఐసీటీ) మన బడుల్లో పాఠంగా మొదలయింది. అది మొదలు గత రెండు దశాబ్దాలలో దానికి మొలకెత్తిన చిలవలు పలవలు... ఊడలు దిగిన మ్రానులైన పరిస్థితుల్లో, మన మానసిక వైఖరులు మన మానవీయ విలువలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? అన్నప్పుడు కొంచెం తేడాతో అందరం అందులో మునకలు వేయడం అయితే నిజం. మనకంటే ముందే ఈ అనుభవమున్న సంపన్న దేశాల్లో దీని పర్యవసానాలపై అధ్యయనం మొదలయింది కనుక ఈ ప్రపంచీకరణ కాలంలో ఆ కొలమానాలు మనమూ వాడుకోవచ్చు. గత పదేళ్ళలో పెరిగిన ‘సోషల్ మీడియా’ మన మీద పెంచుతున్న ఒత్తిడితో ఏర్పడిన ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’లో ఇప్పుడు మనం ఉన్నాం. అదొక నూతన పర్యావరణంగా మారి, మన ఆలోచనలు అభిప్రాయాలు అందుకు అనుగుణంగా మార్చుతూ, మూడు రంగాలలో మన జీవితాల్ని అది ప్రభావితం చేస్తున్న దని ఫిబ్రవరి 2023లో ఎవాన్ కుహెన్ ఒక వెబ్‌సైట్‌కు రాసిన ‘వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం?’ వ్యాసంలో అంటారు. గుర్తించిన ఆ మూడింటిలో ‘సివిల్ సొసైటీ’ (పౌరసమాజం) ఒకటి. ఈ పరిశీలన వెలుగులో కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ‘పౌర సమాజం’ సంగతి ఏమిటి? మన పండితులు పామ రుల అభిప్రాయాలపై ఎటువంటి ‘సమాచార’ పర్యా వరణ ప్రభావం ఉంది. ప్రభావశీలురైన ముగ్గురు ప్రముఖులు 2025 ఫిబ్రవరిలో వెలుబుచ్చిన అభిప్రా యాలలో నుంచి వాటిపై ‘సమాచార పర్యావరణ’ ప్రభావం ఏ మేర ఉందో చూద్దాం. ఫిబ్రవరి మొదటివారంలో ప్రభుత్వ కార్యదర్శులతో ఏర్పాటుచేసిన ఒక సమీక్ష సమావేశంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ – ‘‘మీరు ఫిర్యాదుల పరిష్కారం మొదటి ప్రాధాన్యతగా చూడాలి, రెవెన్యూశాఖ నుంచి భూ కబ్జాలు వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయి. డాక్యుమెంట్స్ ఫోర్జరీ ఎక్కువ అయిపోయింది... వీటిని మీరు ఎలా పరిష్కరిస్తారు అనేది మీకే వదిలి పెడుతున్నాను’’ అన్నారు. ఇది విన్నాక ఈ ధోరణి మూలాలు ఎక్కడ ఎందుకు మొదలయింది వెతికితే, రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడకు మారిన 2015 తర్వాత నుంచి రాజకీయం అంటేనే ‘భూమి విలువ’ అన్నట్టుగా మారింది. ‘‘అమరావతిలో అన్నీ పోను ఎనిమిది వేల ఎకరాలు మిగులుతాయి, ఎకరం 20 కోట్లు చొప్పున అమ్మితే 160 కోట్లు వస్తాయి...’’ తరహా మాటలు అధికార కేంద్రాల నుంచి వస్తే, ‘సోషల్ మీడియా’ దానికి విస్తృత ప్రచారం ఇచ్చింది. ఇప్పుడు తెనాలి ప్రాంతానికి చెందిన ఏ.పి. ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్’ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ కూడా విశాఖలో– ‘‘కొత్త రాష్ట్రానికి అమరావతి వంటి ‘గ్రీన్ ఫీల్డ్ కేపిటల్’ ఉండడం అవసరం’’ అంటూ పనిలో పనిగా –‘‘ఉచితాలు అనుచితం’’ అని కూడా అనేశారు. పోనీ అది నిజమనుకుందాం. మరి వారే ‘‘బాపట్ల సమీపాన 20 ఏళ్ళనాడు ఆగిపోయిన ‘వాన్ పిక్’ ఈ పదేళ్లలో పూర్తి అయివుంటే, ‘ఉచితాలు’ తీసుకునేవారు అవి మాని అక్కడే ఏదో ఒక ‘లేబర్’ పని చేసుకుని బతికేవారు’’ అని కూడా అనొచ్చు కదా? చివరికి ఏమైంది గత పదేళ్ళలో ‘రాజధాని’ చుట్టూ ‘సోషల్ మీడియా’ వ్యాప్తి చేసిన ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’ కింద నలిగి కేంద్ర హోంశాఖ నియమించిన శివరామకృష్ణన్ కమిషన్ నిపుణుల అభిప్రాయాలు ఇటువంటి ప్రకట నల కింద సమాధి అయ్యాయి.రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బా రావు కూడా ఇదే విశాఖ నుంచి ఉచితాలు గురించి – ‘ఫ్రీబీస్’ ఎందుకు? అంటూ ఎప్పుడో పాతదైన ‘చైనా వారి చేప’ కథ చెప్పారు. అది చైనాలో నిజమేమో. ఇక్కడ ‘చేపలు’ పట్టడం నేర్పడం కోసం పెట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ ఏమైందో చూశాం. అయినా – ‘ఫ్రీబీస్’ ఎందుకు? అంటే, ఈ ‘ఉచితాలు’ పొందే వారు కూడా ఏమంత సంతోషంగా ఏమీ లేరు. కారణం కళ్ళముందు సంపన్న వర్గాల వద్దకు చేరుతున్న సంపద, వారి విజయగాథలు, వైభవంగా జరిగే వారి పెళ్ళిళ్ళు, ఫ్యామిలీ ఫంక్షన్స్... వాటి గురించి ‘సోషల్ మీడియా’ కథలుగా చెబుతుంటే వింటూ, తమకు అందే అరకొరను వాళ్ళు తూకం వేస్తున్నారు. అధికార కేంద్రాలకు దగ్గరయితే, అక్రమ ఆదాయ వనరులు ఎలా పెరుగుతాయో ‘సోషల్ మీడియా’ వారికి నిత్యం కళ్ళకు కట్టిస్తున్నది.విషయం ఏమంటే, ప్రభుత్వ పరిపాలనలోకి ‘టెక్నాలజీ’ వచ్చాక, అవినీతికి చిల్లులున్న చీకటి మార్గాలు మూతపడి అదాయ వనరులకు గండి పడితే, ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి వనరుల్లో వెతు క్కుంటున్నారు. అభివృద్ధి మారుమూల గ్రామాలకు ప్రవేశిస్తుంటే, బయటకు వెళుతున్న మట్టి, కంకర చూస్తున్నదే. వాటి వివరాలు ‘సోషల్ మీడియా’ 24 గంటలూ జనానికి చూపిస్తున్నది. ఈ అక్రమ లావా దేవీల చిట్టా సామాన్యుడికి అరచేతిలో ‘ఫోన్’లో దొరుకుతుంటే, ప్రభుత్వం అరాకొరా ఉచితంగా ఇచ్చే రొట్టె ముక్కను ఇవ్వాలా వద్దా? అంటూ మళ్ళీ అదే పాత చర్చ అంటే, వారి వద్ద పాండిత్యం పరిహాసం అవుతుందేమో!జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
చేజారుతున్న విత్తన స్వాతంత్య్రం
వ్యవసాయంలో విత్తనాల సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. హరిత విప్లవం పేరిట మొదలుపెట్టిన పరిణామం విత్తనాలతోనే మొదలైంది. అధిక దిగుబడి వంగడాల హామీతో ఇది మొదలై, క్రమంగా రైతులను విత్తనాలకు దూరం చేసింది. 1960వ దశకంలో మొదలు పెట్టిన ఈ మార్పు 2025 నాటికి తీవ్రరూపం దాల్చింది. ఆహార నాణ్యత దిగజారడానికి విత్తనాలలో వచ్చిన మార్పులే కారణం. దేశీ విత్తనాలను తులనాడి, భారత వ్యవసాయాన్ని హీనపరిచి తెచ్చిన హరిత అధిక దిగుబడి వంగడాలు క్రమంగా రైతుల విత్తన స్వావలంబనను హరించాయి. రసాయనాల దిగుబడివిదేశీయుల ప్రోత్సాహంతో ప్రవేశపెట్టిన వంగడాలు అధిక దిగుబడి ఇవ్వడానికి ప్రధాన కారణం రసాయన ఎరువులు. రసా యన ఎరువులు ఉపయోగించని పరిస్థితులలో ఈ వంగడాలు ఉప యోగపడలేదు, ఉపయోగపడవు. ఆ విధంగా మొదలుపెట్టిన రసా యన ఎరువుల వాడకం ఇప్పుడు విధిగా, అత్యధికంగా ఉపయోగించాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు ఎకరాకు ఒకటో రెండో ఎరువుల బస్తాల వాడకం నుంచి ఇప్పుడు 15 బస్తాలు వాడే దుఃస్థితికి రైతు చేరుకున్నాడు. పరిశోధన చేసి ప్రవేశపెట్టిన హైబ్రిడ్ లేదా అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, కీటకనాశక రసాయనాల ఉపయో గాన్ని కూడా పెంచాయి. ఈ రకం విత్తనాలు మొదట్లో అధిక దిగుబడి చూపినా క్రమంగా ఉత్పాదకత తగ్గింది. దిగుబడి పెరిగి తగ్గుతోందని గుర్తించి ఒక కొత్త వాదన ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. విత్తనాలు ఎప్పటికప్పుడు మార్చాలి. మార్చితేనే దిగుబడి! ఏ ఆధునిక విత్తనంలోనూ నూరు శాతం అంకురోత్పత్తి ఉండదు. దాంతో మభ్యపెట్టే సిఫారసు మొదలైంది. ఎకరాకు ఎన్ని గింజలు వెయ్యాలి? సాధారణంగా ఒక్కో పంటకు ఒక్క కొలమానం ఉంటుంది. ఆధునిక విత్తనాల్లో అంకురోత్పత్తి వంద శాతం ఎప్పుడూ ఉండదు కనుక ఈ కొలమానంలో మార్పులు తెచ్చి ఎకరాకు ఎక్కువ విత్తనాలు వాడే విధంగా సిఫారసు చేయడం మొదలు పెట్టారు. వరి పంటకు కొందరు రైతులు ఎకరాకు 18 నుంచి 20 కిలోలు వాడుతుంటే, పరిజ్ఞానం ఉన్న రైతులు కేవలం 250 గ్రాముల దేశీ వరి విత్తనాలు వాడుతున్నారు. ఎంత తేడా! మిర్చి, పత్తి, వరి, గోధుమ, టమాట వంటి పంటలలో నాసి రకం విత్తనాల వల్ల లాభపడు తున్నది ప్రైవేటు కంపెనీలు, నష్టపోతున్నది రైతులు. పోయిన జ్ఞానం, నమ్మకంఆధునిక విత్తనాల వల్ల సాగు ఖర్చు పెరిగింది. ఒకప్పుడు రైతు తన విత్తనాలు దాచుకుని వాడే రోజులలో విత్తనాల మీద సున్నా ఖర్చు ఉండేది. రైతుకు తన విత్తనాల మీద పరిజ్ఞానం ఉండేది. వేరే రైతు దగ్గర తెచ్చుకున్నా నమ్మకం ఉండేది. రైతు తన విత్తనాలు కోల్పోయి ఆధునిక విత్తనాలకు అలవాటు పడ్డ తరువాత విత్తనాల మీద జ్ఞానం, నమ్మకం పోయినాయి. ఆధునిక విత్తనాలకు చీడ పీడ బెడద పెరిగింది. దానికి పరిష్కారంగా కీటక నాశనిల వాడకం పెరి గింది. వాటి వల్ల ఖర్చు పెరిగింది. ప్రమాదకరమైన రసాయనాలు కాబట్టి వాటిని వాడే క్రమంలో రైతు ఆరోగ్యం ప్రమాదంలో పడింది. ఫలితంగా వలసలు, ఆత్మహత్యలు. వ్యవసాయ కూలీ కుటుంబా లతో మొదలైన వలసలు రైతులను కూడా తాకాయి. ఇంకొక వైపు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయం మీద సలహాలు ఇచ్చే కంపెనీలు పెరిగాయి. వాటి వార్షికాదాయం యేటా పెరుగుతున్నది.బహుశా నార్మన్ బోర్లాగ్ కూడా ఈ పరిణామం ఊహించి ఉండక పోవచ్చు. బోర్లాగ్ ప్రవేశపెట్టిన ‘అధిక దిగుబడినిచ్చే’ విత్తనా లకు ఖరీదైన ఎరువులే కాక, ఎక్కువ నీరూ అవసరం. వ్యవసాయ ఉత్పత్తిలో అద్భుతాలు లేవు అని చెప్పిన ఈ వ్యక్తి, ప్రపంచానికి ఆహార భద్రత సాధించాలని మొదలు పెట్టిన ‘ఆధునిక విత్తనాల’ వ్యవసాయం జీవ వైవిధ్యాన్ని, జీవనోపాధులను నాశనం చేస్తున్న విషయం పట్ల స్పందించలేదు. ‘అధిక వంగడాల’ వల్ల దిగుబడి పెరుగుతుందనే ఏకైక సూత్రం మీద పని చేసిన ఆ మహానుభావుడు తద్వారా నిర్మాణమైన ‘దోపిడీ’ వ్యవస్థ గురించి ఆలోచించలేదు.పెద్ద కంపెనీల గుప్పిట్లో...ఇప్పుడు ‘ఆధునిక విత్తనాలు’ రైతుల చేతులలో లేవు. విత్తన, పెస్టిసైడ్ కంపెనీల గుప్పిట్లో ఉన్నాయి. ‘మేధో హక్కుల సంపత్తి’ పేరిట రక్షణ పొంది విత్తన మార్కెట్లను సురక్షితం చేసుకున్నాయి. ఎప్పటికప్పుడు దిగుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో యేటా కొత్త ‘విత్తనాలు’ మార్కెట్లో ప్రవేశపెట్టి అటు ప్రభుత్వాలనూ, ఇటు రైతులనూ మభ్యపెడుతూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. మన దేశంలో విత్తనాలు, ప్రకృతి వనరుల మీద మేధో సంపత్తి హక్కులు పొందే అవకాశం లేదు కనుక ఇతర మార్గాలలో తమ వ్యాపారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. పెద్ద కంపెనీలు సిండికేట్ అయ్యి చిన్న కంపెనీలను గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. మార్కెట్ ఒప్పందాలు చేసుకుని దేశీ, చిన్న కంపెనీలకు ‘బంధనాలు’ వేశారు. ప్రభుత్వం ఏదన్నా ‘చర్య’ చేపడితే కోర్టుకు వెళతారు. విత్తన కంపెనీలు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మీద వేసిన కేసులు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి.రైతులలో విత్తనాల విజ్ఞానం కొండలా పెరగాల్సిందిపోయి, ప్రైవేటు గుత్తాధిపత్యం వల్ల వారికి అందడం లేదు. రానురాను విత్తన విజ్ఞానాన్ని రహస్యంగా మార్చుతున్నాయి విత్తన కంపెనీలు. ఇక్రి సాట్, ఇర్రి వంటి అంతర్జాతీయ సంస్థలు విత్తన పరిశోధనల సాకుతో భారతీయ జన్యు సంపద తీసుకుని, క్రమంగా ప్రైవేటు పెట్టుబడి దారులకు అందజేస్తున్నాయి. 1966 తరువాత నిర్మాణమైన ప్రభుత్వ విత్తన వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఇప్పుడు ఉన్న సంస్థలు, కమి టీల పరిశోధనలు ఉత్సవ పాత్రకే పరిమితమై, పరోక్షంగా ప్రైవేటు కంపెనీల ప్రయోజనాలను కాపాడుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ఏదో జరుగుతున్న భ్రమ కల్పించటానికి ఉపయోగపడుతున్నాయి.వ్యాపార సరళీకరణ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యానికి, దేశాభివృద్ధికి మూలమైన విత్తన రంగాన్ని ప్రైవేటుపరం చేస్తూ, ఉన్న ఒకే ఒక చట్టాన్ని అమలు చేయడం లేదు. 1966లో ప్రభుత్వం రంగంలో చేసే విత్తనాల నాణ్యత, సరఫరా మీద శాస్త్రీయ నియంత్రణకు తెచ్చిన విత్తన చట్టం ప్రైవేటు విత్తనాలకు వర్తింప జేయడానికి సిద్ధంగా లేదు. 2004లో ఒక కొత్త చట్టం తెచ్చే ప్రయత్నం ప్రైవేటు విత్తన కంపెనీల వ్యాపార వెసులుబాటును సరళీకృతం చేయడానికే అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 20 యేళ్ల తరువాత కూడా అది రూపుదాల్చలేదు. ఇప్పటి వరకు ప్రతిపాదించిన 4, 5 ముసాయిదాలు రైతుల ప్రయోజనాలు కాపాడటానికీ, భారత దేశంలో ఉన్న అపర విత్తన సంపద స్వచ్ఛతను పరిరక్షణకూ ఉద్దేశించినవి కావు. రైతులు, కంపెనీల ప్రయోజనాల మధ్య కంపెనీల పక్షం వహిస్తున్న కేంద్రం కొత్త చట్టం తేవడానికి భయపడుతున్నది. విత్తనాల మీద స్వావలంబన అత్యంత మౌలికమైన అవసరం. రైతులకు విత్తన స్వాతంత్య్రం కోసం రాష్ట్రాలు చట్టాలు తేవాలి. రైతుల పరిజ్ఞానం పెంచే విధంగా విత్తన వ్యవస్థను నిర్మించాలి. విత్తన జన్యుసంపదను కలుషితం కాకుండా కాపాడాలి. పర్యావరణానికి, జన్యుసంపదకు హాని చేసే విత్తనాలను ప్రవేశపెట్టే కంపెనీలు,సంబంధిత వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. గ్రామీణ స్థాయి నుంచి విత్తనాలను రైతులు స్వేచ్ఛగా ఇచ్చి పుచ్చుకునే పద్ధతులను ప్రోత్సహించాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
హిందీ వ్యతిరేకత ఎందుకు?
మత, భాష, ప్రాంతీయ ఉన్మాదాలు భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు గొడ్డలి పెట్టు అనే విషయంలో దేశ హితాన్ని కోరే అందరి వ్యక్తుల అభిప్రాయం ఒకే విధంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హిందీ భాషపై అవాకులు చవాకులు పేలడం దేశంలో పెద్ద చర్చనీయాంశమైంది. ‘త్రిభాషా సూత్రం’ అమలులో భాగంగా హిందీనీ విద్యాలయాల్లో బోధించ డాన్ని వ్యతిరేకించడం తమిళ రాజకీయాలలో ఒక భాగమే.దేశంలో తెలివైన విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి, విద్యార్థుల్లో ‘ఈ దేశం నాది’ అనే భావనను నిర్మాణం చేయడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ‘నవోదయ’ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలలు తమిళనాడుకు అవసరం లేదని ద్రవిడ పార్టీల నాయకులు అడ్డు కున్నారు. ఆ పాఠశాలల్లో హిందీని ఒక భాషగా బోధించడమే ఇందుకు కారణం. ‘సర్వ శిక్షా అభియాన్’ నిధులను తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం విషయంలో కేంద్రానికి– రాష్ట్రానికి మధ్య చోటుచేసుకున్న వివాదం కారణంగా త్రిభాషా సూత్రం తమిళనాడు రాష్ట్రంలో అమలు చేయడం వీలు కాదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ బహిరంగ ప్రకటన చేయడంతో త్రిభాషా సూత్రం అమలు విషయంపై రాద్ధాంతం మళ్లీ తెరపైకి వచ్చింది. దక్షిణ భారతంలో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ విషయంపై అభ్యంతరాలు లేవు. త్రిభాషా సూత్రం అమలులో భాగంగా దక్షిణాదిలో రాష్ట్ర భాష, ఇంగ్లీషు, హిందీ బోధించేటట్లు; ఉత్తరాదిలో హిందీ, ఇంగ్లీషు, ఏదైనా దక్షిణాది రాష్ట్రాల భాష (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఏదో ఒకటి) బోధించేటట్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఏకాభి ప్రాయంతో నాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే తమిళులు దీన్ని వ్యతిరేకించారు. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఈనాటిది కాదు. 1937లో ‘ద్రావిడార్ కళగం’ పేరుతో ఈవీ రామస్వామి తమిళ ప్రజలను రెచ్చగొట్టి, ‘ఉత్తరాది వారి భాష హిందీ మనకెందు’కంటూ, తమిళ ప్రజల్లో హిందీ భాషపై ద్వేషాన్ని నూరి పోశారు. తమిళనాడులోని జస్టిస్ పార్టీ కూడా ఈ హిందీ వ్యతిరేక ఉద్యమానికి అండగా నిలిచింది. అగ్నికి ఆజ్యం పోసింది. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో అప్పటి రాజ గోపాలాచారి నేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం రాజీనామా చేయడంతో ఉద్యమం చల్లారింది. స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఇంగ్లీషు స్థానంలో హిందీని జాతీయ భాషగా ప్రవేశపెట్టాలని ఆలోచించడంతో 1965లో ‘ద తమిళనాడు స్టూడెంట్స్ యాంటీ హిందీ యాజిటేషన్ కౌన్సిల్’ పేరుతో తమిళ నాయకులు పెద్ద ఎత్తున హింసాత్మక ఉద్యమాన్ని లేవదీశారు. ఉద్యమాన్ని అణచడానికి పారా మిలటరీ దళం రంగ ప్రవేశం చేయడంతో 500 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. నాటి ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి బలవంతంగా హిందీని తమిళ ప్రజలపై రుద్దే అవకాశం లేదని ప్రకటించడంతో ఉద్యమం ఆగి పోయింది.ఈ ఉద్యమ ప్రభావంతో 1967 ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. ఉత్తరాది ప్రజలు ఆర్య సంస్కృతికి చెందిన వారనీ, వారి భాష హిందీ అనీ, ఆ భాషను మాట్లాడటం తమిళుల ఆత్మగౌరవానికి భంగం అనే భావనను తమిళ ప్రజల మనసులో బాగా చొప్పించారు బ్రిటిష్ పాలకులు. పాశ్చాత్య కోణంలో హిందూ సంస్కృతిని దునుమాడడమే ధ్యేయంగా పెట్టుకున్న ఈవీ రామ స్వామి బ్రిటిష్ పాలకులకు ఒక పనిముట్టుగా దొరికారు. ఆయన ప్రియ శిష్యుడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శ్రీరామునిపై, రామాయణంపై దుర్వా్యఖ్యలు చేయడం, ఆయన మనుమడు ఉదయనిధి ఒక మంత్రి హోదాలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాంటిదని మాట్లాడటం బ్రిటిష్ వాళ్ళు నూరి పోసిన ఆర్య ద్రావిడ వాద ప్రభావమే! తమిళులే హిందీని వ్యతిరేకించడం వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే!ఉల్లి బాలరంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
మనోభావాల మందుపాతర?
ఒక కార్టూన్ ప్రకటించడం రాజ్యాంగబద్ధమైన భావప్రకటనా స్వేచ్ఛలో భాగం అవునా కాదా నిర్ధారించుకోవడానికి ఒక పత్రిక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన దుఃస్థితికి చేరింది మన సమాజం. ఇవాళ దేశంలో కార్టూన్ అనే అతి సాధారణ సృజ నాత్మక ప్రక్రియ మనోభావాల మందు పాతరగా మారిపోయింది. ఒక కార్టూన్ వల్ల భారత సార్వభౌమత్వానికీ, సమగ్రతకూ, పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలకూ ముప్పు వాటిల్లుతున్నదనీ మద్రాసు హైకోర్టు ముందర కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నది. ఇంతకూ ఏమిటా కార్టూన్? అమెరికా ప్రభుత్వం తన దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారని, లేదా చట్టవిరుద్ధంగా ఉంటు న్నారని 300కు పైగా భారతీయ పౌరులను పట్టుకుని, ఫిబ్రవరిలో మూడు విడతలుగా వెనక్కి పంపించింది. ఆ దేశపు చట్టాల ప్రకారం అది సాధారణమే కావచ్చు. వారు తమ దేశంలో ప్రవేశించిన నేరం చేసినందుకు దేశం నుంచి వెళ్లగొట్టడం అనే శిక్ష వేశారు, సరిపోయింది. ఒకే నేరానికి రెండు, మూడు శిక్షలు వేయడం సహజ న్యాయానికి వ్యతిరేకం. కానీ వారికి రెండో శిక్షగా చేతులకూ కాళ్లకూ సంకెళ్లు వేశారు. మూడో శిక్షగా వారిని జంతువుల్లా, సరుకుల్లా చూసి యుద్ధవిమానాల్లో రవాణా చేశారు. ఇది తప్పనిసరిగా భారత ప్రజ లకు జరిగిన అవమానం, నేరాన్ని మించి శిక్ష విధించడం. భారత ప్రభుత్వంలో అత్యున్నతాధికారం నెరపుతున్న వ్యక్తిగా ప్రధాన మంత్రి తన సాటి పౌరులకు జరిగిన ఈ అవమానం గురించి, విపరీత శిక్షల గురించి ఆ శిక్షలు విధించిన దేశాధ్యక్షుడితో సమావేశంలో కనీసం మాట మాత్రం ప్రస్తావించకపోవడం, నిరసన తెలపకపోవడం ఎవరినైనా ఆలోచింపజేస్తుంది. అలా అవతలివైపు వ్యంగ్య ఆలోచనకు చిత్రరూపమైన కార్టూన్‌ను సుప్రసిద్ధ తమిళ పత్రిక ‘ఆనంద వికటన్’కు చెందిన వికటన్ ప్లస్ వెబ్సైట్ ఫిబ్రవరి 10 సంచిక ముఖచిత్రంగా ప్రచురించింది. అందులో అమెరికా అధ్య క్షుడి ముందు భారత ప్రధాని చేతులకూ కాళ్లకూ సంకెళ్లతో కూచుని ఉన్నట్టు చిత్రించారు. దాని మీద తమిళనాడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు, వెంటనే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆనంద వికటన్ వెబ్‌సైట్‌ను మూసివేసింది. తర్వాత ‘ఆనంద వికటన్’ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న మద్రాసు హైకోర్టు ఇప్పటికైతే, మధ్యంతర ఉత్తర్వులలో వెబ్‌సైట్‌ను మూసివేయగూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుదితీర్పు వచ్చే దాక కార్టూన్‌ను ఉపసంహరించాలని ఆనంద వికటన్‌కు సూచించింది. ఇట్టే పడే దృష్టి! ఏదైనా పత్రిక చూస్తున్నప్పుడు పాఠకుల దృష్టి సహజంగా కార్టూన్ మీదికి పోతుంది. మిగిలిన వార్తలన్నీ నిండా అలుక్కుపోయి ఉండగా, కార్టూన్ స్థలం సింగిల్ కాలం అయినా, రెండు కాలాలో మూడు కాలాలో అయినా, ఆ రేఖలూ, రేఖల మధ్య ఖాళీలూ,బాగా తెలిసిన ముఖాలే కాస్త వక్రంగా మారి ఉండటమూ, ఒకటో రెండో హాస్య, వ్యంగ్య, వెటకార పూరితమైన వాక్యాల వ్యాఖ్యలూ తప్పనిసరిగా పాఠకుల దృష్టిని ఆకర్షిస్తాయి. కార్టూన్ ప్రక్రియ ఎంతో ఆదరణ చూరగొన్నదీ, గౌరవనీయమైనదీ మాత్రమే కాక కనీసం రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది. పందొమ్మిదో శతాబ్దపు మధ్య భాగంలో ‘పంచ్’ పత్రికలో రాజకీయ కార్టూన్లు ప్రారంభమయ్యాయంటారు. రాజకీయ నాయకులే నిర్ణేతలుగా, ప్రముఖులుగా, అందరికీ తెలిసినవారుగా ఉన్న సమాజంలో వారే కార్టూన్‌కు ప్రధాన వస్తువు కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. అలాగే రాజకీయ ఘటనల ప్రభావం సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంటుంది గనుక, ఆ ఘటనల అవతలి కోణం మీద ప్రజలకు ఆసక్తి ఉంటుంది గనుక సహజంగానే వాటి మీద వ్యంగ్యపు, వెటకారపు వ్యాఖ్యానం బహుళ జనాదరణ పొందుతుంది. ఒక ప్రక్రియగా కార్టూన్ ఎంత విశాలమైనదీ, లోతైనదీ, ఆకర్షణీ యమైనదీ, ఆమోదయోగ్యమైనదీ అంటే ఆ కార్టూన్లో వెటకారానికి గురైన రాజకీయ నాయకులకు కూడా అది నవ్వు పుట్టిస్తుంది. అది తమను నొప్పించిందనో, వెటకరించిందనో, తమ మీద వ్యంగ్య వ్యాఖ్య చేసిందనో నొచ్చుకునే సందర్భంలో అయినా ఆ బాధిత వ్యక్తులు కూడా నవ్వుకునే గొప్ప కళ కార్టూన్. అసలు తనమీద వచ్చిన పరిహాసాన్ని ఆమోదించడం, తన పనిమీద వ్యంగ్య వ్యాఖ్యకు అవకాశం ఇవ్వడం ఆ వ్యక్తి విశాల హృదయానికి, సౌమనస్యానికి సంకేతాలు. వ్యంగ్యాన్ని స్వీకరించలేక...అందువల్లనే కార్టూన్ల, హాస్య, వ్యంగ్య రచనల వారపత్రికగా వెలువడుతుండిన ‘శంకర్స్ వీక్లీ’ని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆదరించాడు. అసలు శంకర్స్ వీక్లీ పుట్టుక కథే చిత్రమైనది. అప్పటికి ‘హిందుస్థాన్ టైమ్స్’లో కార్టూనిస్టుగా ఉండిన శంకర్ పిళ్లై అప్పటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి మీద విపరీతంగా కార్టూన్లు వేస్తుండగా అవి ఆపమని సంపాదకుడు దేవదాస్ గాంధీ ఆదేశించాడు. దానితో విభేదించి బైటికి వచ్చిన శంకర్ తన సొంత పత్రికగా 1948లో ‘శంకర్స్ వీక్లీ’ పెట్టాడు. ‘‘మౌలికంగా వ్యవస్థా (ప్రభుత్వ) వ్యతిరేక పత్రిక’’ అని శంకర్ చెప్పుకున్నప్పటికీ, పత్రికను ప్రధానమంత్రి నెహ్రూనే ఆవిష్కరించాడు. ఆ పత్రికలో తన మీద, తన మంత్రివర్గం మీద, తన ప్రభుత్వపు చర్యల మీద శంకర్, ఇతర కార్టూనిస్టులు వేసిన కార్టూన్ల లోని హాస్యాన్నీ వ్యంగ్యాన్నీ నెహ్రూ అభినందించాడు. ఇరవై ఏడు సంవత్సరాలు నిరాటంకంగా నడిచిన ‘శంకర్స్ వీక్లీ’ ఎమర్జెన్సీ విధించాక ఆరు వారాలకు ఆగిపోయింది. ఎమర్జెన్సీకీ పత్రిక ఆగిపోవడానికీ సంబంధం లేదని శంకర్ అన్నాడు. ఆ పత్రిక చూడటం తనకు చాలా అలవాటనీ, అది చూడకపోతే కొరతగా ఉంటుందనీ ఇందిరా గాంధీ కూడా అంది. కానీ మొత్తానికి పత్రిక ఆగిపోయింది. తర్వాతి కాలంలో శంకర్స్ వీక్లీలా పూర్తిగా కార్టూన్లకూ,హాస్య, వ్యంగ్య రచనలకూ అంకితమైన పత్రికే లేకుండా పోయింది. బహుశా మన సమాజంలో హాస్య చతురత, హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ ఆమోదించే విశాల హృదయాలు కుంచించుకుపోవడం మొదలయిందేమో!‘శంకర్స్ వీక్లీ’లోనే ప్రారంభమైన ఆర్.కె. లక్ష్మణ్, ఒ.వి. విజయన్, ఇ.పి.ఉన్ని, రాజిందర్ పూరీ, కుట్టి, బాల్ థాకరే, యేసుదాసన్ వంటి ఎందరో రాజకీయ కార్టూనిస్టులు నాలుగు దశాబ్దాలు భారత రాజకీయ కార్టూన్ రంగాన్ని వెలిగించారు. తెలుగులో కూడా ఎందరో రాజకీయ కార్టూనిస్టులు ఎందరెందరో నాయకుల మాటలనూ, హావభావాలనూ, పనులనూ తరతరాలు నవ్వుకునేంత హాస్య, వ్యంగ్య దృష్టితో చిత్రించారు. ఆ మహోజ్వల చరిత్ర గల కార్టూన్ కళకు ఇప్పుడు కాని కాలం దాపురించినట్టే ఉంది. పూర్తిగా కార్టూన్లకు, హాస్య, వ్యంగ్య రచనలకు అంకితమైన పత్రికలు లేవు. పత్రికల్లో ప్రతిరోజూ కార్టూన్ కనబడటం లేదు. సింగిల్ కాలం పాకెట్ కార్టూన్ మొక్కుబడి వ్యవహార మైపోయింది. కార్టూన్ స్ట్రిప్‌లు ఖాళీ నింపే ఆరో వేలు అయి పోయాయి. అన్నిటికన్నా ముఖ్యం రాజకీయ కార్టూన్ ఏ రాజకీయ నాయకుడి మనసు నొప్పిస్తుందో, ఏ నాయకుడి భక్తుల మనోభావాలను, ఏ మత, కుల, ప్రాంత, భాషా సమూహపు మనోభావాలను గాయపరుస్తుందో, ఆచితూచి అడుగువేయవలసిన మందుపాతరల క్షేత్రంగా మారిపోయింది. ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చెప్పిందేమిటి... చేసేదేమిటి?
అమరావతి దేవతల రాజధాని అంటారు. ఆ పేరుతో నిర్మించా లనుకుంటున్న రాజధాని నగరం మాత్రం శాపగ్రస్థ, వివాదాస్థ ప్రదేశంగా మారింది. విభజన చట్టం అమలు హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి కేవలం రూ. 2,500 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజ్టెక్ట్ అని, దానిపై ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టక్కరలేదని చంద్రబాబు పదేపదే చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 9 వేల కోట్లు ఖర్చు చేసింది. మరో రూ. 6 వేల కోట్లు ఖర్చు చేయడానికి తాజా బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. ఇవి కాకుండా అంతర్జాతీయ సంస్థల నుంచి రూ. 31 వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుంటోంది.కేంద్రంలోని మోదీ సర్కార్ తమ మద్దతుతోనే మన గలుగుతోంది అంటూ, ఈ 31 వేల కోట్ల రూపాయల రుణంతో రాష్ట్రానికి సంబంధం లేదని కేంద్ర ప్రభు త్వమే ఆ భారాన్ని మోస్తుందని చంద్రబాబు అండ్ కో ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలను ఉద్యమం రూపంలో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ తాజాగా మార్చి 10వ తేదీన తమ అధికారిక ఎక్స్ ఎక్కౌంట్లో ‘రాజధాని అమరావతికి అప్పులు అంటూ, వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టింది. వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే రుణాలు ఏపీ అప్పుల పరిధిలోకి రావని స్పష్టం చేసింది’ అని పేర్కొంది. అబద్ధాలు చెప్పడంలో రాటు దేలిన ఆ పార్టీ ఈ రుణాల బాధ్యత తమది కాదు, కేంద్రానిదే అని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రుణాలపై వివరణ ఇస్తూ ‘మల్టీ లేటరల్ లోన్ అసిస్టెన్స్’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులను ఆ ప్రభుత్వమే చెల్లించాలని చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మార్చి 10వ తేదీన మాట్లాడుతూ,‘అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్ట్, మెజార్టీ నిధులను సీఆర్డీఏనే సమకూర్చుకునే విధంగా ప్రాజె క్టును డిజైన్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా సపోర్ట్ ఇస్తున్నాం అంతే. అది కూడా బయటి సంస్థల ద్వారా రుణాల రూపంలో నిధులను సమకూర్చి ఇస్తున్నాం. అమరావతి భూములు అమ్మేసి ఈ అప్పు లన్నీ కట్టేసే విధంగా డిజైన్ చేస్తున్నాం’ అంటూ వివరణ ఇచ్చారు. కేంద్రం అమరావతికి ఏ రూపంలోనూ నిధులు సమకూర్చడం లేదని, దానిపై కేంద్రానికి ప్రత్యేక శ్రద్ధ కూడా లేదనడానికి ఇదే నిదర్శనం.అమరావతి నిర్మాణం, చంద్రబాబు ప్రభుత్వ చిత్త శుద్ధిపైనా సామాన్యులకే కాదు... అమరావతి ప్రాంత రైతులకు కూడా సందేహాలున్నాయి. అందుకే వారు భూ సమీకరణకు సీఆర్డీఏకి సహకరించడం లేదు. 38,581 ఎకరాల్లో రాజధానిని నిర్మించేందుకు 2015 జనవరిలో సీఆర్డీఏ ప్రారభించిన భూ సమీకరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనిలో 33 వేల ఎకరాల భూమి సమీకరించాం అంటున్న సీఆర్డీఏ రైతులకు బదులుగా 65 వేల కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇవ్వాలి. అయితే ఇప్పటి వరకూ 45 వేల ప్లాట్లను మాత్రమే రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో పాటు ఇతర కారణాల దృష్ట్యా ఇప్పటికి 20 వేల ప్లాట్లను రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ భూ సమీకరణ పూర్తి కానంత వరకూ రాజధాని విస్తీర్ణం నిర్ణయించడం సాధ్యం కాదు. సీర్డీఏ మరో ఐదు వేల ఎకరాలు రైతుల నుంచి సమీకరించడానికి ఎప్పటి నుంచో విఫలయత్నం చేస్తోంది. అయితే వారు తమ భూములను ఇవ్వడానికి ఏ మాత్రం అంగీకరించడం లేదు. 29 గ్రామాలతో కూడిన ప్రదేశంలో రాజ ధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దానిలో భాగస్వామ్యం కావడానికి రెండు గ్రామాల ప్రజలు ఇప్పటికీ నిరాకరిస్తున్నారు. అమరావతి భూము లపై ప్రస్తుతం వందలాది కోర్టు కేసులున్నాయి. ఇన్ని అడ్డంకులున్నా ప్రభుత్వం మాత్రం 47 సంçస్థలకు భూములు కేటాయించింది. ఇప్పటికే రూ. 9 వేల కోట్లు అమరావతి నిర్మాణాలపై ఖర్చు చేసి మరో రూ. 48 వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచింది. అమరావతిలో భూ సమీకరణ ఒక విఫల ప్రయోగం. భూ సమీకరణ పేరుతో అమాయక రైతులు ఎలా నష్టపోయారో బెంగళూరుకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ప్రొఫెసర్ కరోల్ ఉపాధ్యాయ తన ‘అసెంబ్లింగ్ అమరావతి: స్పెక్యు లేటివ్ ఎక్యుమిలేషన్ ఇన్ ఏ న్యూ ఇడియన్ సిటీ’ అధ్యయన గ్రంథంలో కళ్ళకు కట్టినట్లు వివరించారు. జపాన్‌కు చెందిన మాకీ అసోసియేట్స్ సంస్థ ‘అమరావతి’ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అంతర్జాతీయ వేదికల్లో ప్రస్తావించింది. ‘హైటెక్ సిటీ’ పేరుతో హైదరాబాద్‌లో చంద్ర బాబు నాయుడు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఎలా పాల్పడ్డారో ప్యారిస్ యూనివర్సిటీకి చెందిన ‘దలేల్ బెన్‌బబాలి’ కళ్ళకు కట్టినట్లు వివరించారు. అదే ప్రయోగాన్ని చంద్ర బాబు నాయుడు అమరావతిలో కూడా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అమరావతిలో దళితులకు అన్యాయం, బలహీన వర్గాల జీవనోపాధికి భంగం కలుగుతుందన్న వాదనలు ఉన్నాయి. శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి అమరావతి అనువైన ప్రదేశం కాదని అభిప్రాయపడిది. ఆ తరుణంలో అమరావతిలో రాజధాని పెట్టాలని చంద్రబాబు నాయుడికి వెంకయ్యనాయుడు సలహా ఇచ్చారంటూ అప్పట్లో ‘ఈనాడు’ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ ప్రదేశానికి అమరావతి అని నామకరణం చేసిన వ్యక్తి చెరుకూరి రామోజీరావు. దీనిని అమలు చేస్తోంది చంద్రబాబు నాయుడు. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పు లతో నిర్మిస్తున్న అమరావతి అందరి రాజధానిగా ఉంటుందా? కొందరి రాజధానిగా ఉంటుందా? అన్న అనుమానాలు సామాన్యులకు రావడం సహజమే.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్మొబైల్: 89859 41411 -
బెలూచిస్తాన్ ఎందుకు భగ్గుమంటోంది?
బెలూచిస్తాన్ (#balochistan) ఖైబర్ పక్తున్‌ఖ్వాల మీద పాకిస్తాన్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని ఫిబ్రవరి 18న అక్కడి మత, రాజకీయ నాయకుడు మౌలానా ఫజలుర్ రెహ్మాన్ ధ్వజ మెత్తారు. సాక్షాత్తు నేషనల్ అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిస్థితికి ప్రభుత్వం,సైన్యంతో పాటు ఐఎస్ఐ కూడా కారణమేనని ఆయన అన్నారు. ఈ మాటలు వినిపించినరెండో రోజునే, ఫిబ్రవరి 20న బెలూచిస్తాన్ మరొకసారి భగ్గుమంది. కామిల్ షరీఫ్, ఇషాన్ సర్వార్ బలోచ్ అనే ఇద్దరు తర్బత్ న్యాయ కళాశాల విద్యార్థుల నిర్బంధాన్ని నిరసిస్తూ ఈ ప్రదర్శనలు జరిగాయి. ఆ రెండు రాష్ట్రాలలోనూ ఆందోళనలు కొత్త కాదు. కానీ జాతీయ అసెంబ్లీలో ఒక ప్రముఖ సభ్యుడు ఈ స్థాయిలో హెచ్చరించడం కొత్త అంశమే.‘పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం’ఇటీవలి కాలంలో బెలూచిస్తాన్ ఉద్యమం గొంతు పెరిగింది. కొద్దికాలం క్రితమే ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఎదుట బెలూచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా దాని నాయకుడు రజాక్ బలోచ్ చెప్పిన మాటలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమనీ, అది బెలూచిస్తాన్సింధ్, ఆక్రమిత కశ్మీర్‌ల సంపదను అడ్డంగా దోపిడీ చేస్తూ బతుకీడుస్తున్నదనీ ఆరోపించారు. దీనికి చైనా తోడై పాక్ సైన్యానికి శిక్షణ ఇచ్చి, తన కనుసన్నలలో ఉంచుకున్నదని పెద్ద ఆరోపణే చేశారు. పాక్, చైనాలను బెలూచిస్తాన్ నుంచి తరిమేయడమే తమ లక్ష్యమని అన్నారు. స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్ మీద పోరాడుతున్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ‘పకడ్బందీ’ దాడులు ఉధృతం చేసింది. 75 ఏళ్లుగా సాగుతున్న ప్రత్యేక దేశ పోరాటం మలుపు తిరిగిందని భావించే స్థాయిలో ఈ దాడులు ఉన్నాయి. బీఎల్ఏను పాకిస్తాన్ తో పాటు అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రాంతంతో పాటు ఇరాన్, అఫ్గాన్లలోని కొన్ని ప్రాంతాలు కలిపి బెలూచిస్తాన్అనే స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలని బీఎల్ఏ కోరుతున్నది. ఇవాళ్టి బెలూచిస్తాన్ అంటే దేశ విభజనకు ముందు ఉన్న కలాత్ సంస్థానమే. దీనికి కూడా పాకిస్తా¯Œ లో లేదా భారత్‌లో కలవడానికి, లేదంటే స్వతంత్రంగా మనుగడ సాగించే వెసు లుబాటు ఇచ్చారు. కానీ జిన్నా ఎత్తు లతో ఇది అంతిమంగా పాక్‌లో విలీనం కావలసివచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పడమంటే, భారత్, పాక్ రెండూ కూడా వలస పాలన ఇచ్చిన సమస్యలను నేటికీ ఎదుర్కొంటు న్నాయి. కశ్మీర్ సమస్యను పాక్ అనుకూలంగా మలుచుకోవాలను కుంటున్నది. కానీ బెలూచిస్తాన్ వ్యవహారాలకు భారత్ దూరంగా ఉంది. 1947 నుంచే వేర్పాటు బీజంనిజానికి 1947 నుంచే బెలూచిస్తాన్‌లో వేర్పాటువాదానికి బీజం పడింది. దీని రాజధాని క్వెట్టా. కోటీ యాభయ్ లక్షల జనాభా ఉన్న బెలూచిస్తాన్ ప్రకృతి సంపదల దృష్ట్యా కీలకమైనది. 1947 నుంచి పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలోచ్ గిరిజన తెగ ఐదు తిరుగుబాట్లు చేసింది. వీటిలో చివరిది 2000 సంవత్సరంలో మొదలయింది. తమ ప్రాంత వనరులలో స్థానికులకు సింహభాగం ఉండాలన్న డిమాండ్‌తో ఈ తిరుగుబాటు తలెత్తింది. కశ్మీర్ వేర్పాటువాద పోరాటానికి మద్దతు ఇస్తామని బాహాటంగానే ప్రకటించే పాక్ పాలకులు బెలూచీలను దారుణంగా అణచివేస్తున్నారు.బెలూచీల అశాంతి తీవ్రరూపం దాల్చేటట్టు చేసినది పాక్–చైనా ఆర్థిక నడవా. 62 బిలియన్ డాలర్లతో దీనిని నిర్మిస్తున్నట్టు దశాబ్దం క్రితం చైనాప్రకటించింది. బెలూచిస్తాన్‌కు బంగారు బాతు వంటి గ్వదర్ డీప్ సీ పోర్టు నిర్మాణం చైనా చేతిలో పెట్టడం కూడా వారి తిరుగుబాటును తీవ్రం చేసింది. హత్యలే కాకుండా కొన్ని పోలీస్ స్టేషన్లను కూడా బెలూచ్ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశాయి. రైల్వే లైన్లను పేల్చి వేశాయి. ‘బీఎల్ఏకు దాడులు చేసే సామర్థ్యం బాగా పెరిగిందని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. సున్నిత ప్రదేశాలతో పాటు, గహనమైన లక్ష్యాల మీద కూడా దాడి చేసే శక్తి అది సముపార్జించుకున్నది. వీటితో బీఎల్ఏకు విదేశీ సాయం ఉన్నదన్న అనుమానం పాకిస్తాన్ లో మరింత పెరిగింది’ అని పాకిస్తాన్ రాజకీయ, సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత ఆయేషా సిద్దిఖీ వ్యాఖ్యానించారు. సాధారణంగా బెలూచిస్తాన్ ఉగ్ర వాదుల దాడులను పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం ‘శత్రువుల’ పనిగా అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే భారత వైమానిక దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ ఉదంతం తరువాత, అంటే 2016 నుంచి బెలూచిస్తాన్ హింసలో భారత్ హస్తం ఉన్నదని కొత్త పల్లవి అందుకుంది. ఇప్పటికీ జాదవ్ పాకిస్తాన్ నిర్బంధంలోనే ఉన్నారు. ఇందుకే బెలూచిస్తాన్ లో హింసకు సంబంధించి భారత్ మీద పాక్ చేసే ఆరోపణలకు చైనా మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది.పశ్చిమ ప్రాంతంలోనే ‘తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ సంస్థ కూడా పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నది. చిరకాలంగా బెలూచిస్తాన్ ప్రజల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేత వైఖరినే అవలంబిస్తున్నది. అక్కడి పౌరులను అపహరించి మళ్లీ వారి జాడ లేకుండా చేయడం స్థానిక ప్రభుత్వ నిఘా సంస్థలు చేస్తున్న పనేనని 2023 నాటి ఒక నివే దిక పేర్కొన్నది. కనిపించకుండా పోయినవారి కోసం, రాజ్యాంగేతర హత్యలకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న ‘వాయిస్ ఆఫ్ బెలూచ్ మిసింగ్ పర్సన్స్’, ‘బెలూచ్ యాక్ జెహెతి కమిటీ’ సభ్యులను కూడా భద్రతా బలగాలు తీవ్రంగా హింసిస్తున్నాయి. బెలూచిస్తాన్‌లో ఎన్నికలు ప్రహసనంగానే జరుగుతాయి. పౌర ప్రభుత్వాలు, వ్యవస్థలు, సైన్యం ఆ ఎన్నికలను తమకు అనుకూలంగా జరుపుకొంటూ ఉంటాయి. లేదంటే బెలూచిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించే స్థానిక జాతీయ పార్టీ లను గెలిపిస్తూ ఉంటారు. బెలూచిస్తాన్‌లో ఉండే బెలూచీలు, పష్తూన్ ప్రజల మధ్య సదా విభేదాలు రాజేయడానికి సైన్యం తన వంతు పాత్రను పోషిస్తూ ఉంటుంది.బుగ్తీని చంపిన తప్పిదంబెలూచిస్తాన్ లిబరేషన్ఆర్మీ మొన్నటి ఆగస్ట్‌లో చేసిన దాడులకు మరొక ప్రాధాన్యం ఉంది. అది బుగ్తీ తెగ ప్రము ఖుడు అక్బర్ ఖాన్ బుగ్తీ 18వ వర్ధంతి. పర్వేజ్ ముషార్రఫ్ ఆదేశాల మేరకు ప్రయోగించిన క్షిపణి దాడిలో రహస్య స్థావరంలోనే బుగ్తీ మరణించాడు. నిజానికి ఆయన మొదట పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వంలో మంత్రి. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌కు గవర్నర్‌గా కూడా పని చేశాడు. తరువాత బెలూచీల సాయుధ తిరుగుబాటులో భాగస్వామి అయ్యాడు. జుల్ఫీకర్ అలీ భుట్టో ఉరితీత ఎంత తప్పిదమో, బుగ్తీని హతమార్చడం కూడా అంతే తప్పిదమని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. బుగ్తీని చంపడం బెలూచిస్తాన్ ఉద్యమానికి అమ రత్వాన్ని ఆపాదించింది. 1970లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆవిర్భవించినప్పటికీ, దూకుడు పెంచినది మాత్రం ఆయన మరణం తరువాతే.ఈ నేపథ్యంలో బెలూచిస్తాన్ ఉద్యమకారులు భారత్ వైపు ఆశగా చూడటం ఒక పరిణామం. వారి ప్రదర్శనలలో భారత్ అనుకూల ప్లకార్డులు ప్రదర్శించడం సాధారణమైంది. పాక్ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ తుంటరి పిల్లాడికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత, హక్కు భారత్‌కు ఉన్నాయని లండన్ కేంద్రంగా పనిచేసే బెలూచిస్తాన్ విముక్తి పోరాట సంస్థ కార్యకర్త ఒకరు అభిప్రాయపడటం విశేషం. డా.గోపరాజు నారాయణరావు సీనియర్ జర్నలిస్ట్ -
నవ భారత ప్రణాళిక
ఒక సమాఖ్య దేశంగా భారత్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలోని భిన్నత్వాలన్నింటినీ కలిపి ఉంచే లక్ష్యంతో ఏర్పాటు చేసు కున్న రాజ్యాంగానికి పెను సవాలు ఎదురవు తోంది. భిన్న జాతులు, సంస్కృతులు, భాషల సమ్మేళనంతో కూడిన భిన్నత్వమే దీని ప్రత్యేకత. జనాభా కూర్పు కూడా ఈ దేశం హిందీ భాష, హిందుత్వ భావజాలంతోనిండి పోయేందుకు అవకాశం కల్పించదు.విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలి!ఈ దేశంలో ప్రతి రాష్ట్రమూ తనదైన రీతిలో ఒక ప్రత్యేక జాతి లాంటిది. అందుకే రాజకీయ, ఆర్థిక విషయాల్లో వీటి మధ్య సమ తౌల్యతను కాపాడాల్సిన అవసరముంది. 2026లో ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పార్లమెంటులో కొన్ని రాష్ట్రాల శక్తిని తగ్గించేదిగా ఉంటుంది. జనాభా నియంత్రణ ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను ఇచ్చేందుకు ఆ రాష్ట్రాలు చేసిన కృషికి లభించనున్న ప్రతిఫలమా ఇది!జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించని రాష్ట్రాలకు మరిన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలను సృష్టించటం ద్వారా ప్రోత్సాహ కాలు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క విషయమైతే స్పష్టం చేయాలి. ఈ పునర్విభజన ప్రకియను తక్షణం నిలిపివేయాలి. ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాలను మార్చడంపై శాశ్వత నిషేధం విధించాలి.ఇది సాంకేతిక పరిజ్ఞాన యుగం. నాణ్యమైన విద్య ఉన్న వారే సామాజిక ఫలాలను నిర్ణయిస్తారు. నియంత్రణ మొత్తం కేంద్రం చేతుల్లో ఉన్నప్పటికీ ఉన్నత విద్యారంగం ఇప్పటివరకూ ఆశించిన ఫలితాలనైతే ఇవ్వలేదు. ఉన్నత విద్య నాణ్యత కూడా ఆశించిన ప్రమాణాల మేరకు లేదు. కాబట్టి విద్య మొత్తాన్ని రాష్ట్రాల జాబి తాలోకి చేర్చడం మంచిది. రాష్ట్రాలపై ఏఐసీటీఈ (ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), యూజీసీ (యూనివర్సిటీగ్రాంట్స్ కమిషన్) వంటి సంస్థల పెత్తనానికి ఫుల్స్టాప్ పడాలి. దేశానికి నాణ్యమైన ఆధునిక వైద్య, న్యాయ, సామాజిక శాస్త్రాల విద్య అవసరం. నాణ్యమైన విద్యను అందించే విషయంలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడేలా చేయాలి కానీ, పరిపాలన పేరిటకేంద్రం పెత్తనం చలాయించ కూడదు.పన్నుల వాటా 66 శాతానికి చేరాలి!రాష్ట్రాలు ఆర్థికంగా స్వావలంబన, స్వతంత్రత సాధించినప్పుడే సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లుతుంది. ఆర్థిక వనరుల విషయంలో రాష్ట్రాలకు మరిన్ని మార్గాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 42 శాతం మాత్రమే లభిస్తోంది. పైగా ఇటీవలి కాలంలో కేంద్రం వద్దనే వనరులను కేంద్రీకరించే ధోరణి కనపడుతోంది. ఈ పరిస్థితి మారాలి. రాష్ట్రాలకు దక్కాల్సిన పన్నుల వాటా క్రమేపీ 66 శాతానికి చేరాలి. కేటాయింపులు కూడా జనాభా, తీసుకొచ్చిన ఆదాయం, సగటు కంటే ఎంత ఎక్కువ ఉంది అనే అంశాలతో కూడిన సూచీ ఆధారంగా జరగాలి. రాష్ట్రాలకు అందాల్సిన మొత్తాల విడుదలల్లోనూ అనవసరమైన జాప్యాన్ని చూస్తున్నాం. రాష్ట్రాల ఆదాయాలను కేంద్ర పథకాలకు ఉపయోగిస్తున్నారు. రాష్ట్రాలు తమ ప్రణాళికలు, హామీ లను నెరవేర్చుకునేందుకు వీలుగా ఆదాయం ఎక్కడికక్కడ పంపిణీ జరిగేలా ఒక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది. కేంద్రం ద్వారా నిధుల విడుదలల్లో ఆలస్యం జరిగితే ఆర్బీఐ ప్రైమ్ లెండింగ్ రేట్లతో రాష్ట్రాలకు వడ్డీ చేర్చి ఇవ్వాలి. దేశాద్యంతం చరిత్ర, సంస్కృతులు ఒక్క తీరున లేవు. ప్రతి ప్రాంతంలోనూ తనదైన ప్రత్యేకత కలిగిన చారిత్రక, సాంస్కృతికకేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వపు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) వీటి నిర్వహణ, సంరక్షణల్లో ఘోరంగా విఫల మైంది. ఆకతాయిలు పలు స్మారకాలను ధ్వంసం చేశారు. అన్ని రాష్ట్రాల్లో, ప్రాంతాల్లోనూ ప్రత్యేకమైన సంస్కృతి, చరిత్ర ఉన్న నేపథ్యంలో వాటి సంరక్షణ, నిర్వహణ బాధ్యతలు ఆయా రాష్ట్రాలకే అప్పగించాలి. ఆయా వనరులపై కేంద్రం పెత్తనం చలాయించకుండా వెంటనే రాష్ట్రాలకు బదలాయించాలి. సంకుచిత సైద్ధాంతిక భావ జాలం కారణంగా ఏఎస్ఐ, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టే ధోరణి కనిపిస్తోంది. సహజ వనరులపై హక్కురైతుల నుంచి సేకరించే పంటలకు మద్దతు ధర ఇవ్వడం ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఈ సేకరణ ఒక రకమైన సబ్సిడీనే కాబట్టి... ఆయా నిధులను వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా రాష్ట్రాలకే కేటాయించాలి. దేశాద్యంతం పండే పంటల్లో ధాన్యమే ఎక్కువ కాబట్టి అన్ని రాష్ట్రాల్లోనూ ధాన్యం సేకరణకు కనీస మద్దతు ధర అందించాలి. ఒకవేళ అన్ని రాష్ట్రాలకూ ఈ పద్ధతి అనువుగా ఉండదనుకుంటే... ఆయా రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో నష్టపరిహారాన్నైనా అందించాలి.వాయు కాలుష్యంలో శిలాజ ఇంధనాల వాటా దాదాపు 20 శాతం. చౌక ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగం (ప్యాకేజింగ్, ఒకసారి వాడి పారేయడం) వల్ల జల వనరులకు తీవ్ర నష్టం జరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు వాడి పారేసే ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై సుంకాలు విధించాలి. విద్యుత్తుతో, హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్స్‌తో నడిచే వ్యక్తిగత, రవాణా వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలి. వీటిపై పన్నులు ఎత్తివేయడం, వాడుతున్నందుకు ప్రోత్సాహకాలు అందించడం చేయాలి. గంగా పరీవాహక ప్రాంతాన్ని మినహా మిగిలిన చోట్ల బొగ్గు, ఇనుము, అల్యూమినియం, రాగి,జింక్, నికెల్ వంటి ఖనిజ నిక్షేపాలు బోలెడున్నాయి. ఈ ప్రకృతి వనరులపై సహజంగానే ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలకు హక్కు ఉంటుంది. కాబట్టి ఖనిజాన్వేషణ, వెలికితీత హక్కులు, ఆదాయం కూడా ఆయా రాష్ట్రాలకే చెందాలి.ఆర్మీలో కొన్ని ప్రాంతాలకేనా అవకాశం?సాయుధ దళాలు, పారామిలిటరీ దళాల్లో నియామకాలు కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. దేశంలోనే అతి పురాతనమైన పదాతిదళ రెజిమెంట్... మద్రాస్ రెజిమెంట్. నీలగిరి కొండల్లోని వెల్లింగ్టన్లో దీని ప్రధాన కేంద్రం ఉంది. దీంట్లో మొత్తం 29 బెటా లియన్లు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు మొత్తం అంటే సుమారు 27 కోట్లు లేదా దేశ జనాభాలో 22 శాతం మంది దీని పరిధిలోకి వస్తారు. మరోవైపు సిఖ్ రెజిమెంట్‌కు నియామకాలు 80 లక్షల జనాభానుంచి జరుగుతూంటాయి. ఈ రెజిమెంట్‌లో 24 పదాతిదళ బెటాలి యన్లున్నాయి. పంజాబ్ కేంద్రంగా ఉండే అన్ని రెజిమెంట్స్‌ను కలుపు కొంటే మొత్తం 74 బెటాలియన్లు ఉన్నాయి. మూడు కోట్ల మందినుంచి ఈ నియామకాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం ఏర్పాటైన వ్యవస్థలో ఈ రకమైన ప్రాతినిధ్యం ఎంత వరకూ సబబు? గ్రామీణ ప్రాంత యువతకు మేలైన ఉద్యోగావకాశం కల్పించే మిలిటరీలో అన్ని ప్రాంతాలకూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. పెట్టుబడులు ఎక్కువ అవసరమయ్యే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ కేంద్రం నియంత్రణలోనే ఉండటంతో పాటు ఈ రంగంలోకి అడుగుపెట్టడం పెద్ద వ్యాపారవేత్తలకే సాధ్యమయ్యే పరిస్థితి. జనాభాలో ఎక్కువమందికి చేరువ కాగల అవకాశమున్న రేడియోపై కూడా పెత్తనం కేంద్రానిదే. ఇలా కాకుండా ఎఫ్‌ఎంబ్యాండ్లపై రేడియో ఛానళ్లు ఏర్పాటు చేసే అవకాశాన్ని స్థానికులకు కల్పించాలి. ప్రైవేట్, ప్రభుత్వ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు పని చేస్తున్నప్పుడు... సమాచారం కోసం అత్యధికులు ఆధారపడే రేడియో ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ వనరులతో ఎందుకు నడవకూడదు? భారతదేశ ఏకత్వం అందరికీ సముచిత గౌరవమన్న దానిపై ఆధారపడి ఉండాలి. రాజకీయ భేదాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రాల న్నిటినీ భారత రాజ్యాంగం ఒక్కటిగా ఉంచుతోంది. అందరూ తమ గొంతు వినిపించేందుకు అవకాశం లభిస్తోంది. ఒక కేంద్రీకృత వ్యవస్థగా, ఏకస్వామ్యంగా మార్చేందుకు చేసే ఏ ప్రయత్నమైనా... అసలు ఉద్దేశాన్ని, సమాఖ్యను ముక్కలు చేస్తుంది.» కొన్ని రాష్ట్రాల శక్తిని తగ్గించేదిగా ఉన్న పునర్విభజన ప్రకియను నిలిపివేయాలి. ప్రస్తుత పార్లమెంటరీ నియోజక వర్గాలను మార్చడంపై శాశ్వత నిషేధం విధించాలి.» ప్రస్తుతం రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 42 శాతం మాత్రమే లభిస్తోంది. ఈ పరిస్థితి మారాలి. వాటా క్రమేపీ 66 శాతానికి చేరాలి.» విద్య మొత్తాన్ని రాష్ట్రాల జాబితాలోకి చేర్చడం మంచిది. రాష్ట్రాలపై ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల పెత్తనానికి ఫుల్స్టాప్ పడాలి.- వ్యాసకర్త ఫ్రీలాన్స్ కామెంటేటర్, రచయితmohanguru@gmail.com-మోహన్ గురుస్వామి -
సజాతి ధ్రువాల వికర్షణ
శశి థరూర్‌కీ, కాంగ్రెస్ నాయకత్వానికీ మధ్య తలెత్తినట్లుగా కనిపిస్తున్న విభేదాలను ఆసక్తికరంగా మారుస్తున్నది ఏమిటంటే,ఇరు వర్గాల గురించి ఆ విభేదాలు బయటికి ఏం వెల్లడిస్తున్నాయన్నదే. విభేదాలున్నా యన్న సంగతిని వారు ఒప్పుకొని, అంగీకరించకున్నా... ఒకటైతే వాస్తవం. వారు ఒకరి కొకరు పూర్తిగా భిన్నమైనవారు. బహుశా సమస్యకు మూలం, ప్రధానంగా అదే అయి వుండాలి. శశి థరూర్ ఫక్తు రాజకీయ నాయకుడు కారు. ముఠాలను, రహస్య మంతనాలను ఆయన నడపరు. బదులుగా, ఆయన తన సొంత ప్రతిభ, నైపుణ్యాల మీద ఆధారపడినవారు. దీనర్థం – ఆయనకు దాపరికాలేం ఉండవని. రాజకీయంగా పైకి రావాలన్న ఆకాంక్ష, గుర్తింపు కోసం ఆరాటం మాత్రమే ఉన్నాయని. అంతేకాదు, తన వైపునకు దృష్టిని మళ్లించుకోవాలని కూడా ఆయన కోరుకుంటారని అర్థమౌతోంది. ముందుకు సాగేందుకు ఆయన విధానం అది. అందులో విజయం సాధించారు కూడా. ట్విట్టర్లో ఆయన్ని అనుస రించే అసంఖ్యాక అభిమానులు, ఆయనకు గల ‘గుర్తింపు యోగ్యత’ ... ఇందుకు సాక్ష్యం. కాంగ్రెస్ నాయకత్వం, కనీసం ఇందిరాగాంధీ హయాం నుంచి చూసినా కూడా – ముఖస్తుతులు చెల్లించే వారి ద్వారా వర్ధిల్లుతూనే వచ్చింది. వారంతా గాంధీల అనుచరులు. వారి నాయకులు గాంధీలు. వారు తమ రాజకీయ జీవితాన్నంతా గాంధీల సేవకే అంకితం చేసినవారు. రాహుల్ గాంధీని మించి తాము శోభిల్లకూడదనీ, సోనియా గాంధీకి ఎదురు చెప్పకూడదనీ నేర్చుకున్నవారు. ఇక ఇప్పుడైతే ప్రియాంకా గాంధీకి పల్లకి మోయటానికి తయారవు తున్నవారు. అంతేనా, ఈ తరహా కుటుంబ ఆరాధనను నియమ బద్ధం చేయటానికి... గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించలేదని తమను తాము నమ్మించుకుంటున్నవారు ఈ అనుచరులు. చిన్నపాటి పోలికలు శశి, రాహుల్‌ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేయిస్తాయి. శశి తన ప్రతిభ, తెలివితేటలతో కష్టపడి పైకొచ్చినవారు. రాహుల్ బలం ఆయన ఇంటిపేరు. రాహుల్ స్వయంగా సాధించిన రాజకీయ విజయాలు పరిమితమైనవి. లేదా, ఏమంతగా గుర్తింపులో లేనివి. తగని సమయాలలో విహార యాత్రలకు వెళ్లిపోవటం ఆయన అభిరుచి. శశి బలం... దీర్ఘమైన ఆయన ఆంగ్ల పదాడంబరత, ఆహ్లాద కరమైన ఆయన నడవడిక. రాహుల్ స్పష్టంగా మాట్లాడలేని వ్యక్తిగా కనిపిస్తారు. రాహుల్‌కు తనేం చెప్పాలనుకుంటున్నారో దానిని వ్యక్తపరిచే విషయంలో సమస్యలు ఉన్నాయని చాలామంది నమ్ము తారు. శశి రచయిత. ఇరవైకి పైగా పుస్తకాలు రాశారు. ఆకాంక్షలు గల యువతను ఆయన ఆకర్షిస్తారు. రాహుల్ ఎప్పుడూ కూడా పేదలను, ఆర్థికంగా లేదా సామాజికంగా అణచివేతకు గురవుతున్నవారిని ఉద్దేశించి మాట్లాడుతుంటారు. మొత్తానికి, వీళ్లిద్దరూ భిన్న ప్రపంచాలలో ప్రకాశిస్తున్నవారు. మాజీ దౌత్యవేత్తగా శశి తీరు వివేకవంతంగా, వినయపూర్వకంగా, తన ప్రత్యర్థులు సాధించిన విజయాలను సైతం అంగీకరించే విధంగా ఉంటుంది. అందుకే మోదీ అమెరికా పర్యటనను, లేదా కేరళలో సీపీఎం స్టార్టప్‌లను అభివృద్ధి పరచటాన్ని ఆయన ప్రశంసించకుండా ఉండలేకపోయారు. రాహుల్ శైలి ఇందుకు విరుద్ధంగా కఠినంగా, గాయపరిచేలా ఉంటుంది. మాటల బాక్సర్ అతడు. కమిలిపోయేలా గట్టి దెబ్బ కొడతారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ అతి సునాయాసంగా అత్యున్నత స్థానానికి చేరుకోగలిగారంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. పార్టీలో అతడిది ప్రశ్నించేవారే లేని, సర్వదా ఆమోదంపొందిన ఆరోహణ. ఇందుకు భిన్నమైనది శశి థరూర్ రాజకీయ జీవితం. అది వెలుగులను విరజిమ్మేదేమీ కాదు. ఆయన కొంతకాలం విదేశాంగ, మానవ వనరుల అభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. 2014 తర్వాత రెండు పార్లమెంటరీ సెలక్ట్ కమిటీలకు చైర్మన్‌గా ఉన్నారు. అంతకుమించి, కాంగ్రెస్‌లో అగ్రశ్రేణి నాయ కుడిగా ఎప్పుడూ లేరు. ఆయన తన గతం వల్ల లేదా తన సహాయక రాజకీయేతర క్రీయాశీలతల వల్ల మాత్రమే ప్రసిద్ధులు. ఆయన్ని తన భవిష్యత్ నేతగా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేకపోతోంది. ఇవన్నీ కూడా నాలో మూడు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అవి శశి థరూర్‌కు, ఆయన పార్టీ అయిన కాంగ్రెస్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాలకు సంబంధించినవని నేను నమ్ముతున్నాను. మొదటిది, గొప్ప గౌరవ మర్యాదలను పొందుతూ, రాహుల్‌కు ప్రత్యర్థులు కావచ్చునని పరిగణన పొందుతున్న ప్రతిభావంతులైన వ్యక్తులతో ఎలా నడుచుకోవాలో కాంగ్రెస్ పార్టీకి తెలియటం లేదన్న విషయాన్ని ఈ విభేదాలు సూచిస్తున్నాయా?బయటి ప్రపంచానికి రాహుల్, శశి ఎలా కనిపిస్తారో ఒక్క క్షణం ఆలోచించండి. రాహుల్‌ను వారసత్వపు అర్హత గల రాజపుత్రుడిగా చూస్తారు. శశిని ప్రతిభకు, పనితీరుకు ప్రతీకగా చూస్తారు. కాంగ్రెస్ తన అధ్యక్ష వంశానికి విధేయతతో... ప్రతిభకు, పని తీరుకు మిగిల్చి ఉంచిన ఆ కాస్త చోటును కూడా పరిమితం చేసేసిందా?రెండవది... పార్లమెంటు లోపల గానీ, పార్లమెంటు బయట గానీ, పార్టీలో శశి థరూర్ పోషించవలసిన పాత్ర చాలా స్వల్ప మైనదిగా మాత్రమే ఉంది. ఆయన నేర్పును, నైపుణ్యాలను ఉపయో గించుకునే విషయంలో – అలాంటి అలవాటు లేకపోవటం కారణంగా – కాంగ్రెస్ జాగ్రత్త పడుతూ రావటమే కారణమా? ఒకప్పుడు విశాల గుడారమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నెరవేర్చదగిన ఆకాంక్షలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోయిందా?మూడవది, తానెప్పటికీ గెలవలేనని తెలుసు; తన ఆశయం, కనీసం తన ఉద్దేశం ఏమిటని ఆలోచించేవారిని అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందని తెలిసినా శశి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీ పడి తప్పు చేశారా? ఆ ఎన్నికలను ప్రజాస్వా మ్యబద్ధం చేయటానికే ఆయన పోటీలో నిలబడ్డారని నాకు తెలుసు. సాధారణంగానైతే ఆ చొరవను మెచ్చుకోవాలి. కానీ పోటీ లేకుండా అభ్యర్థిని గెలవనిచ్చే కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇదంతా జరిగినట్లయిందా?నాల్గవ ప్రశ్న కూడా ఉంది. సాధారణమైన ప్రశ్న. శశి థరూర్ కనుక కాంగ్రెస్ నుండి విడిపోతే అది ఆ పార్టీకి ఏపాటి ఎదురు దెబ్బ అవుతుంది? ఆయన విషయానికొస్తే కేరళలో ఆయన ఆశలు విఫలం కావచ్చు. ఒకటి మాత్రం చెప్పగలను. ఆయన కాంగ్రెస్‌ను వీడతారో లేదో గానీ, బీజేపీలో చేరతారంటే మాత్రం నేను నమ్మలేను.» కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాం నుంచి చూసినా కూడా – ముఖస్తుతులు చెల్లించే వారి ద్వారానే వర్ధిల్లుతూ వచ్చింది. వారంతా రాహుల్ గాంధీని మించి తాము శోభిల్లకూడదనీ, సోనియా గాంధీకి ఎదురు చెప్ప కూడదనీ నేర్చుకున్నవారు.» రాహుల్ గాంధీ అతి సునాయాసంగా అత్యున్నత స్థానానికి చేరుకోగలిగారంటే అందులో ఆశ్చర్యం లేదు. పార్టీలో అతడిది ప్రశ్నించేవారే లేని ఆరోహణ. ఇందుకు భిన్నమైనది శశి థరూర్ రాజకీయ జీవితం.- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- కరణ్ థాపర్ -
నిలిచి గెలిచిన శాస్త్రవేత్తలు
మానవజాతి ఉనికికి, పురోగమనానికి మహిళ పాత్ర కీలకం. ఆ మాటకొస్తే ఏ జాతి ప్రగతికైనా స్త్రీ పురుషుల భాగ స్వామ్యం తప్పనిసరి. కానీ అనాదిగా స్త్రీ వివక్షను ఎదుర్కొంటూనే ఉంది. ఇది ఏ ఒక్క రంగానికో, ప్రాంతానికో, దేశానికో పరిమితం కాదు. అందుకు సైన్సు కూడా మినహాయింపు కాదు. అవధులు లేని అభివృద్ధిని సాధించామనుకుంటున్న నేటి పరిస్థితుల్లో కూడా మహిళ వివక్షను, ప్రతికూలతలను ఎదుర్కొంటూనే ఉంది. విజయాలందుకొంటూనే ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతిలో తనదైన ముద్రను కనబరుస్తూనే ఉంది.ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె లేని సమాజాన్నెలా ఊహించుకోలేమో, ఆమె చేయూత లేని సైన్సు అభివృద్ధి కూడా ఊహాతీతం. నూరేళ్ల చరిత్ర కలిగిన నోబెల్ బహుమతులకు మహిళా శాస్త్రవేత్తలను ఎంపిక చేయటంలో కూడా ఈ వివక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇన్నేళ్లయినా సైన్సులో నోబెల్ బహు మతి వచ్చిన మహిళలు రెండు పదులకు మించి లేరు. రెండు సార్లు నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరి సైతం ఈ ప్రతికూలతను ఎదుర్కొంది. 1903లో తొలుత పియరీ క్యూరీ, హెన్రీ బెక్రెల్ల పేర్లే ఎంపికయినాయి. పియరీ దాన్ని తిరస్కరించటంతో ఆ తర్వాత మేరీతో కలసి వారు నోబెల్ బహుమతిని అందుకున్నారు. నేటి శాస్త్ర రంగాన్ని అత్యంత గణనీయంగా ప్రభావితం చేసినది వాట్సన్, క్రిక్‌ల డీఎన్ఏ నిర్మాణ డిస్కవరీ. ఇంత గొప్ప ఆవిష్కరణలో కీలక పరిశోధన లు అందించిన మహిళ రోజాలిండ్ ఫ్రాంక్లిన్‌కు నోబెల్ బహుమతి దక్కలేదు. డీఎన్ఏ నిర్మాణాన్ని కళ్లకు కట్టి చూపిన ఆమె ఎక్స్‌రే ఫొటో (ఫొటో నం. 51)నే ఆధారమన్న సంగతి మరచి పోలేని నిష్ఠుర సత్యం.ఈ డిస్క వరీ అనేకానేక విజ్ఞాన శాస్త్ర రంగా లకు ప్రాణం పోసింది. నేడది డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని నిగ్గు తేల్చటమే కాకుండా, కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన శిలాజాల నుండి సంగ్రహించిన డీఎన్ఏ నమూనాలతో సరి కొత్త శిలాజ జీనోమిక్ శాస్త్ర విజ్ఞా నానికి నాంది పలికింది. ఆ పరిశో ధనలు చేసిన స్వాంటే పేబో వంటి శాస్త్ర జ్ఞులకు నోబెల్ బహుమతిని అందించింది కూడా.క్రోమోజోమ్‌లపై జన్యువులు ఒక స్థానం నుండి మరొక స్థానానికి దూకుతాయన్న ‘దూకుడు జన్యువుల’ డిస్కవరీ జన్యు శాస్త్రాన్ని గొప్ప మలుపు తిప్పింది. జెనెటిక్ ఇంజనీరింగ్‌లో కొత్త ప్రక్రియలకు పునాది వేసింది. దీనిని కనిపెట్టింది కూడా బార్బరా మెక్లింటాక్ అనే గొప్ప మహిళా శాస్త్రవేత్త. ఈ డిస్కవరీకి తానొక్కతే నోబెల్ బహుమతి మొత్తాన్ని గెలుచుకున్న తొలి మహిళ కూడా ఆమె. ఏ జన్యువు ఎప్పుడు పని చేయాలో, ఎక్కడ ఆగిపోవాలో అనేది పరిణామంలో ఒక పజిల్. ఈ డిస్కవరీలో పరిణామ జీవ శాస్త్రం కొత్త పుంతలు తొక్కింది. విద్యాధికులూ, శాస్త్రవేత్తలూ మాత్రమే గొప్ప ఆవిష్కరణలు చేస్తారని సాధా రణంగా అనుకుంటాం. ఇందుకు భిన్నంగా ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి చదువు కూడా పెద్దగా లేని మహిళ మేరీ యానింగ్ శిలాజ విజ్ఞాన శాస్త్ర వేత్తగా ఎదిగి జీవ పరిణామ సిద్ధాంతాన్ని పరిపుష్టం చేసింది. బ్రిటన్ లైమ్రెజిస్ ప్రాంతపు సముద్ర తీరంలో పర్యాటకులకు గవ్వలమ్ముకుని జీవించే సాదా సీదా అమ్మాయి యానింగ్. పన్నెండేళ్ల వయసులోనే ఇక్తియోసార్ పుర్రెను వెలికి తీయటంలోతండ్రికి తోడ్పడింది. ఒకప్పుడు నీళ్లలో నివసించిన సరీసృపాల జాతికి చెందిన శిలాజానికిది నిదర్శనం. ఆమె కృషి పట్టుదలతో వెలికి తీసిన అనేక శిలాజాలు జీవులు పరిణామం చెందు తాయన్న ఆలోచనలకు బలం చేకూర్చాయి. డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఆమె కనిపెట్టిన శిలాజాలు పరిపుష్టం చేశాయి. అందుకే ఆమె ప్రపంచంలో తొలి మహిళా శిలాజ శాస్త్రవేత్తగా ఖ్యాతి గడించింది. బ్రిటన్‌లో శాస్త్రవేత్తలకిచ్చే అత్యున్నత పురస్కారా లను సైతం ఈ సామాన్య యువతి అందుకుంది. అవాంతరాలు, ప్రతికూలతలు ఎన్ని ఉన్నా మహిళ సాధించలేనిది లేదని చెప్ప డానికివి మచ్చుకు ఒకటి రెండు ఉదాహరణలే. సైన్సు ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అందాలంటే పురుషులతో సమా నంగా మహిళల భాగస్వామ్యాన్ని సాధించాలి.శాస్త్ర రంగంలో భారతదేశపు పరిస్థితి, మహిళల ప్రాతి నిధ్యం అంతంత మాత్రంగానే ఉంది. 2005లోనే సైన్స్‌రంగంలో మహిళలపై భారత ప్రభుత్వ (డీఎస్టీ) నియమించిన నిపుణుల కమిటీ కూడా మహిళలు అత్యల్ప సంఖ్యలో ఉన్నారని తేల్చింది. డాక్టరేట్లు చేసిన మహిళలు శాస్త్ర సంస్థలు, యూనివర్సిటీ సిబ్బందిలో అతి తక్కువగా ఉన్నారు. మరీ ముఖ్యంగా విధాన నిర్ణ యాలు చేసే స్థాయిలో, సంస్థల డైరెక్టర్లు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్లు, ఇతర పాలనాపరమైన ముఖ్య స్థానాల్లో పరిమితంగా ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?మహిళలకు సైన్సులో మరింత ప్రోత్సాహం ఇవ్వాలనీ, ఉద్యోగ నియామకా లను క్రమబద్ధంగా జరపాలనీ ఆ కమిటీ సూచించింది. అయినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. శాస్త్ర రంగంలో మహిళలు ముందడుగు వేయటానికి నిపుణుల సూచనలు అమలు చేయటం ఒక అవసరమైతే, ప్రభుత్వాల దృష్టి కోణంలో మార్పు రావటం అత్యవసరం. -వ్యాసకర్త జన విజ్ఞాన వేదిక ఉమ్మడి ఏపీ మాజీ అధ్యక్షులు-ప్రొ‘‘ కట్టాసత్యప్రసాద్ -
ఎందరో మహానుభావులు
స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని కాంక్షిస్తున్న నేపథ్యంలో వివిధ రంగాలకు నిర్దిష్ట లక్ష్యాలు నిర్వచించుకున్నాం. ఈ లక్ష్యం నెరవేరడంలో సైన్స్ కీలకపాత్ర పోషించనుంది. అయితే, భారతీయ శాస్త్ర రంగం అక్కడక్కడ కొన్ని సంస్థల్లో కనిపించే అద్భుతంగా ఉండకూడదు. సామాజిక సమస్యల పరిష్కారానికి అన్నిచోట్లా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా మారాలి. ఇవన్నీ జరగాలంటే, ప్రాథమిక విద్య నుంచి స్నాతకోత్తరం వరకూ శాస్త్ర రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరగాలి. ప్రభావశీల పరిశోధనలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, బహుమతులు పెరగాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌రంగంతో ప్రభుత్వ భాగస్వామ్యం, సమాజంలోని అట్టడుగు వర్గాలు ముఖ్యంగా మహిళల ప్రాతినిధ్యం పెరగాలి.హేతుబద్ధమైన, ససాక్ష్యాలతో కూడిన పరిష్కారాలను చూపడం మొదలుపెడితే ప్రజాభిప్రాయం శాస్త్రవేత్తల నిర్ణయాలతో ఏకీభవిస్తుందని కోవిడ్ సమయంలో నిరూపితమైంది. మన అభివృద్ధిని అడ్డుకునే... పరిష్కారం లేని, రిస్క్ కారణంగా ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టని శాస్త్రపరమైన సమస్యలపై తక్షణం ప్రభుత్వం దృష్టి పెట్టాలి.బయో–ఈ3, నేషనల్ క్వాంటమ్ మిషన్ , డీప్ ఓషన్ మిషన్ వంటివి ఇలాంటి సమస్యల పరిష్కారం దిశగా శాస్త్రవేత్తల దృష్టిని కేంద్రీకరించేందుకు ప్రయత్నించాయి. ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే, ఈ ఏడాది బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలకు కేటాయింపులు రెట్టింపు కంటే పెరగడం.దేశంలోని శాస్త్ర పరిశోధనశాలల్లో మూలనపడ్డ అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ప్రోత్సాహకాల లేమితో ఇవి ముందుకు కదలడం లేదు. వాయు కాలుష్యం, నీటిలోని సీసం, ఆర్సెనిక్ విషాల ఏరివేత, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ కాలుష్యం, ముఖ్యంగా జలవనరులకు సంబంధించిన సమస్యలను శాస్త్ర పరిశోధన సంస్థలు కలిసికట్టుగా చేపట్టాలి. దేశ సమస్యలకు శాస్త్ర ఆధారిత పరిష్కారాలు కనుక్కునేందుకు అవసరమైన మౌలిక పరిశో ధనలకు కేంద్రం సంస్థాగత గ్రాంట్ల రూపంలో అధి కంగా సాయపడాలి. ఇదే సమయంలో అప్లికేషన్స్, వాటి వాణిజ్యీకరణ, పరిశోధనలను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లడం వంటివి భాగస్వామ్య ఏర్పా ట్లతో ప్రోత్సహించవచ్చు. దేశంలో శాస్త్ర పరిశోధన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపు తున్న సంస్థలు క్రమేపీ పెరుగుతున్నాయి. టాటా గ్రూపు లాంటివి వందేళ్లుగా ఈ పని చేస్తున్నాయి. ప్రభుత్వ నిధులకు ప్రైవేట్ పెట్టుబడులు, దేశీ దాతలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు తోడైతే సమాజానికి ఉపయోగపడే పరిశోధనలకు ఊతమివ్వవచ్చు. మహిళలకు సముచిత స్థానం...భారతీయ మహిళలు చాలా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. పురిటిబిడ్డను కోల్పోయిన బాధ ఆనందీబాయి జోషీని ఎన్నో అడ్డంకులు అధిగమించి వైద్యశాస్త్రం చదువుకునేలా చేసింది. అది కూడా అమెరికాలోని పెన్సిల్వేనియా మహిళా కళాశాలలో. 1886లోనే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వైద్యురాలు ఆమె. దురదృష్టవశాత్తూ ఆ మరుసటి ఏడాదే ఆమె క్షయ వ్యాధికి బలైనా... ఎంతో మంది మహిళలు వైద్యం, వైద్య పరిశోధనల రంగాలను ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలిచారు.ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కానీ... ‘స్టెమ్’ రంగాల్లో (సైన్ ్స, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మేథమేటిక్స్) భారతీయ మహిళల భాగస్వామ్యం తక్కువ. ఈ రంగాల్లో కోర్సులందిస్తున్నసంస్థలపై ఇటీవల ఒక అధ్యయనం జరిగింది. అక్కడి బోధన సిబ్బందిలో కేవలం 16.6 శాతం మంది మాత్రమే మహిళలు. నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ రీసెర్చ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ ఐఆర్ఎఫ్) జాబితాలోని టాప్ ఎనిమిది సంస్థల్లో ఇది 10 శాతానికి మించడం లేదు. ఈ మహిళల్లోనూ 26.2 శాతం మంది మాత్రమే సీనియర్ స్థానాల్లో ఉన్నారు. దీన్నిబట్టే మహిళల విషయంలో ఎన్ని అసమానతలు ఉన్నాయో అర్థమవుతుంది. మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉంటే సంస్థల సమర్థత పెరుగుతుందనీ, వ్యవహారాలు పారదర్శకంగా ఉంటాయనీ, పనులు సమతుల్యతతో సాగుతాయనీ దశాబ్దాల అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలోని శాస్త్ర, వైద్య సంస్థల్లోని ఈ అసమానతలను సరిదిద్దాలంటే మొత్తం వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంటుంది. వనరుల కేటాయింపు, టాలెంట్ మేనేజ్మెంట్, పదోన్నతులు, బదిలీల వంటిఅంశాలపై నిర్ణయాలు తీసుకునే వ్యవస్థల్లో మహిళలకు తగిన భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలి. అన్ని స్థాయుల్లోనూ మహిళలకు ఉద్యోగాల విషయంలో తగిన సలహాలు ఇచ్చేందుకు, శిక్షణ వంటివి కల్పించేందుకు ఏర్పాట్లు ఉండాలి. శిశు సంరక్షణ, డే కేర్ సర్వీసులు, ప్రసూతి సెలవులు, పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేకమైన గదులు, పని వేళల్లో వెసలుబాటు, ఇంట్లోంచే పని చేసే అవకాశాలు అన్ని స్థాయుల్లోనూ కల్పించాలి. మహిళలు మళ్లీ ఉద్యోగాల్లో చేరేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి. వ్యవసాయం, ఆహార భద్రత, అంతరిక్ష ప్రయోగాలు, రక్షణ రంగ తయారీ, టీకాలు, వ్యాధి నిర్ధా రణ, ఫార్మా, ఐటీ వంటి అనేక రంగాల్లో భారతీయ శాస్త్రవేత్తల సామర్థ్యం, నాయకత్వం రెండింటికీ ఇప్పటికే ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఈ విజయాల నుంచి స్ఫూర్తి పొందుదాం.-వ్యాసకర్త ‘ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ చైర్పర్సన్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-డా‘‘ సౌమ్య స్వామినాథన్ఆమె కోసం అతనుసందర్భంస్త్రీలు– ఎవరి నొప్పికి వారే మందు వేసుకుంటూ, ఎవరి యుద్ధం వాళ్ళే చేస్తూ, ఆకాశంలో సగాలమని నినదిస్తూ, పడుతూ, రెట్టింపు బలంతో లేస్తూ– చలిచీమల కవాతుకి అర్ధ శతాబ్ది. కడచి వచ్చిన కాలాలను ఈ మహిళా దినోత్సవం రోజున పాఠకురాలిగా తిరిగి చూడటమంటే వెన్ను నిలబెట్టిన అక్షరాలని కావిలించుకోవడం. ఎన్నెన్ని కథలు, కవిత్వాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు మీకోసం మేమున్నామని భుజంమీద చేయివేసి కన్నీరు తుడిచాయి! అక్షరాలలో దట్టించిన ధైర్యం, విశ్వాసం, విజ్ఞానం, పోరాటం నలుగడలా కమ్ముకుని స్త్రీశక్తి విస్ఫోటనమై ఎన్నెన్ని కొత్త విలువలు బారులు తీరాయి! ఇప్పటి, మునుపటి తరాల ముందుచూపు కవులకి, రచయితలకివందనాలు. ఆడపిల్లలను అమ్ముకుంటున్న రోజుల్లో, అతిబాల్య, అతివృద్ధ వివాహాల మారకంలో స్త్రీ వస్తువైన రోజుల్లో– ‘మగడు వేల్పన పాతమాట, ప్రాణసఖుడ’ని చెప్పి, ‘ఆధునిక మహిళ చరిత్ర పునర్లిఖిస్తుంద’ని నమ్మిన క్రాంతదర్శికి కృతజ్ఞతలు. ఒకటీ అరా ఘటనలు పట్టుకుని స్త్రీలు ఎంత నేరస్థులో నిరూపించడానికి వర్తమాన మీడియా ప్రయత్నిస్తున్న కాలాన– ‘స్త్రీల మీద ప్రపంచానికి యింత అపనమ్మకం గనుకనూ స్త్రీని శీలం విషయమై damn చెయ్యడమూ, గాయం చెయ్యడమూ ఇంత సులభం గనుకనూ స్త్రీ శీలం తన సొమ్మని పురుషుడు అనుకోవడం వల్లనూ స్త్రీని శిక్షించే అధికారం ప్రతి పురుషునికీఉండటం వల్లనూ స్త్రీ ఇంత మోసగత్తె అబద్ధీకురాలు ఐ జీవితమంతా నటిస్తోంద’ని స్త్రీల చెడుగు వెనుక కారణాలను బట్టబయలు చేసిన స్వేచ్చా మూర్తిని స్మరించుకుంటూ ముంజేతిపై నాలుగు ముద్దులు. స్త్రీల నవ్వు, నడక, మాట దుస్తులబట్టి ఆమెలైంగిక వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్న ఈ మాయదారి కాలంలో– చెడిపోయిన మనుషులను, సవతి తల్లి, కొడుకుల ప్రేమబంధాన్ని ఒప్పించేలా రాసి, ‘మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారమూ సాధ్యమైనంత తక్కువ అపకారమూ జరిగేలా చూసు కోవడమే నీతి. తక్కిన బూటకపు నీతి నియమాలను నమ్మకండి’ అన్న భావ విప్లవకారునికి శాల్యూట్. ఉన్నదంతా కుటుంబానికి పెట్టి, అన్నిటికోసం చేయి సాచాల్సి వచ్చే స్త్రీలకి కొదవలేని మనదేశంలో– ‘అది నా ఇల్లు కాదా అని అడిగావు. అది నా ఇల్లు కాదు. ఒకప్పుడు నాదే అనుకున్నాను. ఆ ఇల్లు, మా ఆయన పెంచుకొంటున్న కుక్కదెట్లా కాదో, నాదీ అట్లానే కాదు. ఆయన కుక్కనీ అపేక్షగానే చూసుకొంటారు. నన్నూ ఆపేక్షగానే చూసుకొంటారు. అంతమాత్రాన ఆయనకులాగా మాకు ఇంటిమీద హక్కులుండవు. మేము మా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆయన ఆపేక్షని ప్రతిఫలంగా పొందగలిగాము.అంతే!’ అని ధీమాగా చెప్పిన ఆమె కోసం ఒకఇంటిని దృఢంగా నిర్మించిన మంచి రచయితకు ధన్యవాదాలు.అరవై దాటితే ఇక జీవితం బోనస్ అంటూ స్త్రీలకి ప్రో ఏజింగ్ మెళకువలను తిరస్కరించే సమాజంలో – ‘చీకటిని చూసో, పరిసరాలలోని అపరిచితత్వాన్ని చూసో భయం వేసినప్పుడు, ఆకలితో బెంగతో జ్వరంతో జీవనలౌల్యాల తీరనిమంకుతనంతో అల్లాడినప్పుడు, ఒక్కసారి గుక్కపట్టి ఏడ్వాలనిపిస్తుంది. లాలన, రక్షణ ఇవ్వగలిగే ఒకే ఒక్క అమ్మని పిలవాలనిపిస్తుంద’ని తల్లి విలువని గుర్తించిన పసిబాలునికి కావిలింతలు. తన కుటుంబ స్త్రీలు తప్ప తక్కినవారంతా అవైలబుల్ వస్తువులుగా కనపడే మెజారిటీ మగ సమాజంలో– ‘బాగ్ ఒక మూలకి పడేసి, కుర్చీలోంచి నా కాళ్ళు తీసి అక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని ‘యాభై వచ్చాయి.రెండునెలల నుంచి మెన్సెస్ రాలేదు. ఇప్పుడేమో రెండురోజుల నుంచి బ్లీడింగ్’ (I know that is not the complete story) ‘‘ఊ’’ అంటాను. ‘ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి పది అయ్యింది.బ్లూ ఫిలిమ్స్ చూస్తూ కూర్చున్నాడు. ఓపిక లేదన్నా వినలేదు, బ్లీడింగ్ అవుతుందని చెబుతున్నా...’ అనేక ఆమెలపై సాగే హింసలను ఒకచోట ముద్దచేసి కళ్లముందు పెట్టుకుని ఆ నెప్పినంతా తానే తీసేసు కోవాలన్నంతగా తపించే పువ్వులాంటి మనసున్న కవికి కరచాలనం. స్త్రీల విలువను గుర్తించేవారు...ఇతర మతాలు, ఆచారాలు, అలవాట్ల పట్ల వల్లమాలిన ద్వేషాన్ని నూరిపోస్తున్న మెజారిటీ మత రాజకీయ చదరంగంలో– ‘పువ్వులు రాల్చుకునీ రాల్చుకునీ/ నన్ను కాడగా మిగిల్చావు/ ఇంకా ఏం మిగిలిందని/ ఈ కంకాళంపై కారుమబ్బు కప్పి నడిపిస్తున్నావు/ నా ముఖానికి వేలాడేసిన నఖాబ్/ ఎత్తి చూశావా ఎన్నడైనా/ నా కళ్లు/ రెండు అమాస చంద్రుళ్లను మోస్తుంటాయ్’ అంటూ స్వజనులు చూపే వివక్షని నిలదీసిన సాహసికి సలాములు. స్త్రీలు, తాము ఎవరిని ఎపుడు పెళ్లి చేసుకోవాలో సొంతంగా నిర్ణయం తీసుకోగల హక్కుని నిరాకరించే కుటుంబాలున్న సామాజిక చట్రంలో– ‘మీ ఊరికి మా వాడకి మధ్య ఎద్దుతునకల దండెం కడదాం /కాస్త మీ ఇంట్లో ఉన్న జంధ్యం తీసుకు రారాదూ /కులం గీతలు దాటిన ప్రేమలు చంపబడుతున్న చోట /పారుతున్న నెత్తుటి ప్రవాహంలో నిలబడి అడుగుతున్నా/ రావే పిల్లా రా/ హద్దులన్నీ చెరిపేసి/ సరిహద్దులు లేని సమాజంలోకి నడుద్దా’మంటూ స్త్రీలు కులాలు దాటగలరని నమ్మి, చేయందించిన ప్రేమికునికి వందనం. కొందరుంటారు, తమ ఆధిపత్యాలకి తామే గండికొట్టుకుని చుట్టూ తనకలాడుతున్న ఆరాట పోరాటాలతో మమేకమయ్యేవారు. కొందరున్నారు తమ జీవితాల్లో మేలిమి భాగమైన స్త్రీల విలువని గుర్తించి అక్షరాలలో నిలబెట్టినవారు. వారందరి తపనని, ప్రేమని, అక్కరని, బాధ్యతని గుర్తు చేసుకుంటూ, అభినందిస్తూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.-వ్యాసకర్త ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com-కె.ఎన్. మల్లీశ్వరి -
ఆకాశంలో సగమైనా... వివక్షేనా?
కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా... అత్యాచారాలకు గురైన శవాలు. మనువాదం, ఫాసిజం, పితృస్వామ్యం దేశంలో నలుదిశలా ఊరేగు తున్నాయి.’ ‘ముళ్ళపొదల్లో ఓ ఆడ శిశువు... చెత్త కుండీలో మరో ఆడ శిశువు... ఇద్దరూ అప్పుడే భూమి మీద పడిన పసికూనలు.’ఇలాంటి వార్తలు నిత్యం వస్తుంటాయి. ఎన్నో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ మహిళల సామాజిక స్థితిగతుల్లో మార్పు రావటం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఆజాదీ ఎవరిది అన్న ప్రశ్న వస్తుంది. రోజురోజుకూ స్త్రీలపై హింస, వివక్ష రకరకాల రూపంలో పెరిగిపోతూ ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ముందు తరాల వారికి హింస లేని సమాజాన్ని అందించ లేమా? ఆకాశంలో సగమైన స్త్రీలు శ్రమ, ఉత్పత్తిలో సగానికి తక్కువ ఏమీ కాదు. కానీ తాను పూర్తిగా పరా ధీనగా జీవిస్తోంది భారత స్త్రీ.స్త్రీలు ఎప్పుడూ మగవాడి కను సన్నుల్లో జీవించాలి. చిన్నప్పుడు తండ్రి, పెళ్లి తర్వాత భర్త, ముసలితనంలో కొడుకుల అధీనంలో జీవించాలి. ఇలా స్త్రీలను బందీని చేయటం ఈ సమాజం మొదటి నేరం. ఇక ‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ’ అంటూ స్త్రీలను పురుషునికి సొంత ఆస్తిగా మలి చారు. ఇలా భూస్వామ్య, పితృ స్వామిక సంస్కృతిని వ్యవస్థీకృతం చేశారు. ఈ పరిస్థితి మారాలి. రాజ్యాంగంలోని 14, 15, 16 తదితర అధికరణాలు లింగ వివక్షకు వ్యతిరేకంగా రూపొందించబడ్డాయి. అలాగే అనేక చట్టాలు చేయబడ్డాయి. కానీ అమలుకు నోచుకోని కారణంగా స్త్రీలపై కుటుంబ, లైంగిక హింస రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం, స్వేచ్ఛ, స్వావలంబన లేకపోవడం (ఆర్థిక పరాధీనత) అసమానత, వివక్షలకు మూలం. దీనికి కారణం భూస్వామిక పితృస్వామ్యమే. ఇక పెట్టుబడిదారీ సంస్కృతి మహిళల శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చివేసింది. 1961లో వరకట్న నిషేధ చట్టం చేసినప్పటికీ, వరకట్నం గౌరవంగా అమలు చేయ బడుతోంది. ఆడ శిశువులను గర్భంలోనే చంపుతున్నారు. ఫలితంగా దేశంలో స్త్రీల జనాభా తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే తరం మూల్యం చెల్లించక తప్పదు. 1991 నుంచి దేశంలో ప్రపంచీకరణ దశ మొదలై పాశ్చాత్య విష సంస్కృతి పెచ్చరిల్లి స్త్రీ శరీరం సరుకుగా, అంగడి బొమ్మగా, విలాస వస్తువుగా మార్చబడింది. ఫలి తంగా స్త్రీలపై లైంగిక హింస పెరిగి పోయింది. ఈ విష సంస్కృతి కారణంగా మన దేశంలో ప్రతి గంటకు ఐదుగురిపై అత్యాచారాలు జరుగు తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.మహిళల సమస్యలు చర్చించుకొని, పరిష్కరించుకోవడానికి చట్ట సభలలో కనీసం స్త్రీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఏనాడూ పార్లమెంట్లో మహిళా ప్రతినిధులు 15 శాతానికి మించి లేరు. సామాజిక పరిణామంలో మొదట స్త్రీలకు మంచి గౌరవం ఉండేది. మాతృస్వామ్య వ్యవస్థే ఇందుకు ఉదాహరణ. ఆ తర్వాత వ్యక్తిగత ఆస్తి,వర్గ సమాజం ఏర్పడ్డాక స్త్రీలకు ఆస్తి హక్కు లేకుండా పోయింది.దీంతో స్త్రీలకు విలువ పోయి, వంటింటి కుందేలు అయిపోయింది. స్త్రీల దోపిడీకి, వివక్షకు మూలం పెట్టుబడిదారీ మార్కెట్ ఉత్పత్తి విధానం. తీవ్ర ఆర్థిక అసమానతలతో కూడిన ఈ విధానం నశించాలి. సోషలిజం రావాలి. ఇదే స్త్రీల విముక్తికీ, అన్ని సామాజిక సమస్యల పరిష్కారానికీ మార్గం.– ఎల్. గజేంద్రమ్మ, ఉపాధ్యాయురాలు ‘ 97054 93054 -
నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతూ...
‘మహిళల శక్తి సామర్థ్యాలు సమాజానికి సంపూర్ణంగా ఉపయోగపడితేనే అభివృద్ధి సాధ్యం’ అనే భావనను చాలామంది ప్రముఖులు వ్యక్తీకరిస్తుంటారు. ఈ అభిప్రాయం మంచి ఉద్దేశంతో చేసిందే కావచ్చు గానీ... మహిళల శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా సమాజానికి ఉపయోగపడటం లేదనే అర్థం స్ఫురిస్తుంది. అనాదిగా మహిళలు తమ సంపూర్ణ శక్తి సామర్థ్యాలను తమ కుటుంబానికి, తద్వారా సమాజానికి అందిస్తూనే ఉన్నారు. కాకపోతే, వారు చేసే సేవ లను కొలిచే కొలమానం ఉండదు. వారి సేవలు అనేక రూపాల్లో కారు చౌకగా దోపిడీకి గురవుతున్నాయి. ఉదాహరణకు చట్టాలు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో పురుష కూలీకి లభించే వేతనం మహిళా కూలీకి దక్కదు.మహిళల శక్తి సామర్థ్యాలను అన్ని రంగాలలో సమాన ప్రాతినిధ్యంలో ఉపయోగించుకోగలిగితేనే సమాజం మరింత అభివృద్ధి చెందగలుగుతుందన్నది ఓ కఠోర వాస్తవం. తదనుగుణమైన కార్యాచరణకు పూనుకోవాల్సింది ప్రభుత్వాలే. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కావాలని కలవరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరడం అన్ని రంగాలలో మహిళలను వినియోగించుకోవడం మీదనే ఆధారపడి ఉంది.భారతదేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలోని అనేక దేశాలలో శతాబ్దాలపాటు కొనసాగిన సాంఘిక దురాచారాలు, కట్టుబాట్లు మహిళల మనో వికాసాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని దెబ్బ తీశాయి. రాజ్యాంగంలోని 14, 15 అధికరణలు పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించి నప్పటికీ ఆచరణలో ఆమడ దూరంలోనే ఉన్నాయి. సామాజిక, రాజకీయ కారణాల వల్ల కొన్ని చట్టాల్ని అమలు చేయలేక ప్రభుత్వాలు నిస్సహాయంగా ఉండి పోతున్నాయి.అయితే, సానుకూల పరిస్థితులు క్రమేపీ నెల కొంటున్నాయి. ప్రపంచీకరణ మొదలై ప్రైవేటు రంగం ఆధిపత్యం, టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో పలు రంగాల్లో మహిళలు అగ్రభాగాన రాణిస్తున్నారు. ఉదాహరణకు చంద్రయాన్–3 ప్రాజెక్టులో వంద మందికిపైగా మహిళా శాస్త్రవేత్తలు పని చేశారు. 2018లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మహిళా శాస్త్రవేత్తల పథకం మంచి ఫలితాలు అందిస్తోంది. దాదాపు 2,000 మంది మహిళా శాస్త్ర వేత్తలు చేసే పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎస్టీ) చేస్తున్న కృషి కారణంగా, 2000– 01లో జరిగిన పరిశోధనలలో 13 శాతంగా ఉన్న మహిళల వాటా, ప్రస్తుతం 30 శాతం దాటింది.దాంతోపాటు, మహిళల ఆరోగ్యం, భద్రత లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ‘నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో’ వివరాల ప్రకారం, దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలు ఏటా 8% మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత విషయంలో అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో భారతదేశం 5వ స్థానంలో నిలవడం సిగ్గుచేటు. మన దేశంలో పర్యటించే విదేశీ మహిళా టూరిస్టులకు ఆ యా దేశాలు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇది దేశ పర్యాటక రంగం అభివృద్ధికి అవరోధం. రాజకీయ భాగస్వామ్యం పెరగాలి!మహిళల శక్తి సామర్థ్యాలు మిగతా రంగాలలో కంటే రాజకీయ రంగంలో అతి తక్కువ స్థాయిలో వినియోగం అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రేఖాగుప్తాను ఎంపిక చేసిన బీజేపీ... మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించుకొంది. అందుకు వారిని అభినందించాల్సిందే! కానీ, ఇది ఒక పార్శ్వం మాత్రమే. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఎంపికైన మహిళలు కేవలం ఐదుగురే. లోక్‌సభలో సైతం మహిళల ప్రాతినిధ్యం గరిష్ఠంగా 15 శాతం మించడం లేదు. 17వ లోక్‌సభలో మహిళా సభ్యుల శాతం 14.4 శాతం కాగా, ప్రస్తుత 18వ లోక్‌సభలో అది 13.6 శాతానికి తగ్గడం గమనార్హం!లోక్‌సభ, శాసనసభలలో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన బిల్లు 1996లో హెచ్.డి.దేవెగౌడ సారరథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రవేశ పెట్టినపుడు ఈ రచయిత కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కలిసిరాని రాజకీయ పార్టీల వైఖరి కారణంగా ఈ బిల్లు పలు పర్యాయాలు వాయిదాలు పడుతూ ఎట్టకేలకు 27 సంవత్సరాల తర్వాత మోదీ చొరవతో 2023లో పార్లమెంట్ ఆమోదం పొంది చట్టంగా రూపొందింది. అయితే జనగణన, డీలిమిటేషన్ వంటి ప్రక్రియలను దాటాలి కనుక 2029 నుంచి మాత్రమే ఈ చట్టం అమలులోకి రాగలదు. కానీ చట్టం అమలయ్యే వరకు వేచి చూడకుండా, పార్టీల పరంగా 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించుకొంటే అందుకు జవాబు దొరకదు.అనేక దేశాలలో మహిళలకు లభించిన హక్కులు, స్వేచ్ఛ, ఇతర సామాజికపరమైన భద్రతలన్నీ ఉద్యమాలు, పోరాటాల కారణంగానే లభించాయి. మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ రాజకీయాల స్వరూపం మారుతుంది. బ్రిటన్‌కు చెందిన ‘వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనమిక్స్ రీసెర్చ్’... మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలలో ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉందనీ, అక్కడి ప్రజలు సైతం తమ ప్రజాప్రతినిధి పనితీరు పట్ల ఎక్కువ సంతృప్తికరంగా ఉన్నారనీ వెల్లడించింది. ‘ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం’ అంటూ మాటల్లో మాత్రమే మహిళలను అందలం ఎక్కించడం కాకుండా, రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో వారికి సముచిత ప్రాతినిధ్యం అందించాలి. అప్పుడే సమాజం అభివృద్ధి పథంలో వడిగా ముందుకు సాగుతుంది. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
అమెరికా ఇక ఎందులో గొప్ప?
డోనాల్డ్ ట్రంప్ తీరు చూసి నోరు వెళ్లబెడు తున్నారా? బహుశా లెక్క పెట్టలేనన్ని సార్లు అయ్యుంటుంది. నాది మాత్రం అదే పరిస్థితి. మీరు అమెరికా అధ్యక్షుడి అభిమాని కావచ్చు, కాకపోవచ్చు; అది సమస్య కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉదారవాద రాజకీ యాలు సంక్షోభంలో పడిపోయాయి, ఉన్నత వర్గాల చర్మం మొద్దుబారింది, మితవాదం జనాదరణ పొందుతోంది... ఎందుకిలా జరుగుతుందో తేల్చడానికి చర్చోపచర్చలు నడుస్తున్నాయి. వాటినీ పక్కన పెడదాం. ట్రంప్ పదవిని అలంకరించి కొన్ని వారాలు గడచి పోయాయి. ఈ స్వల్ప సమయంలోనే అమెరికా బండారం బయట పడింది. అమెరికా అసామాన్యత (అమెరికన్ ఎక్సెప్షనలిజం) అనేది ఒక కట్టుకథ అని తేలిపోయింది. అమెరికన్ ఎక్సెప్షనలిజం అంటే? ‘ఎన్సైక్లోపీడియా బ్రిటానికా’ నిర్వచనం ప్రకారం, ‘చారిత్రక, సైద్ధాంతిక, మత కారణాల రీత్యా అమెరికా ప్రత్యేకమైనది, నైతికంగా ఒక ఉన్నతమైన దేశం అనే భావన.’అమెరికా ప్రతి చర్యలోనూ... కపటమైన సైనిక జోక్యాల్లో,అధికార పీఠాలను కూలదోసే కుట్రల్లో, ఆఖరికి పత్రికా వ్యాసా ల్లోనూ ఈ అహంభావపూరితమైన ఆధిక్యతా భావన కనబడుతుంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధ కాలంలో మాటిమాటికీ ‘విలువల ఆధారిత వ్యవస్థ’ అంటూ అరిగిపోయిన పదాలతో ఊదరగొట్టిన వారు, భారత్ దౌత్య విధానానికి వంక పెట్టిన వారు, ఆ తర్వాత ఏం చేశారు? అదే అమెరికా ఐక్యరాజ్య సమితి తీర్మానంపై ఊహకే అందని విధంగా రష్యాతో చేయి కలిపింది. ఉక్రెయిన్‌కు వ్యతి రేకంగా ఓటేసింది. యుద్ధ సమయంలోనూ ఆచితూచి వ్యవహరించినభారత్ ఓటింగ్‌కు హాజరు కాకుండా తటస్థ వైఖరి అవలం బించింది.హక్కుల గురించి మీరా మాట్లాడేది?విదేశీ దేశీ విధానాలను తలకిందులు చేస్తున్న ట్రంప్ విన్యాసాలు వినోదం కలిగిస్తున్నప్పటికీ, అవి ప్రమాదభరితమైనవి. ఏమైనా, అమెరికా విలువలు, అమెరికా ప్రజాస్వామ్యం, అమెరికా మీడియా, లేదంటే అమెరికా సంపన్నస్వామ్యం (అలిగార్కీ)... ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థల ప్రమేయం లేకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కంటే స్వేచ్ఛగా, ఆరోగ్యదాయకంగా ఉంటాయన్న కట్టుకథ తిరుగులేనివిధంగా పటాపంచలైంది. అమెరికా మేధావులు ఇకమీదట ఎప్పుడన్నా భారత ప్రజాస్వామ్యాన్ని శల్యపరీక్షకు పెడితే నేనేం చేస్తానో తెలుసా? పడిపడి కాకున్నా ముసిముసిగా నవ్వుకుంటాను! యూఎస్ ప్రభుత్వం భారత్‌లో మానవ హక్కుల మీద నివేదిక వెలువరించినా అంతే చేస్తా. భారతీయ అక్రమ వలసదారులను మీరెలా ట్రీట్ చేశారు? వారిని 40 గంటల పాటు ఉక్కు సంకెళ్లు వేసి స్వదేశానికి పంపించడమే కాకుండా ఆ మెటల్ శబ్దాల మ్యూజిక్‌తో వీడియోలు రూపొందిస్తారా? జన్మలో ఇక మీరు మానవ హక్కులంటూ భారతీయులకు ఉపన్యాసాలు ఇవ్వలేరు. ఈ క్షణాన యూఎస్ ప్రభుత్వాన్ని నడుపు తున్న టెస్లా, ఎక్స్ సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ సహా అమెరికా కార్పొరేట్ టైటాన్లు ట్రంప్ ప్రమాణస్వీకార ఉత్సవంలో బారులు తీరడం మేము చూడలేదనుకుంటున్నారా? ఇక మీదట మీరు ఏ ముఖం పెట్టుకుని భారత్ మీడియాకు, వ్యాపార సామ్రాజ్యాలకు మధ్య సంబంధాలు ఉన్నాయంటూ విమర్శిస్తారు? ట్రంప్ గెలుపు ఖాయం అనుకోక ముందు నుంచే మస్క్ ఆయన పక్షం నిలిచి ఉన్నారు. కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. మరి మెటా/ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ వాస్తవ నిర్ధారణ, రాజకీయాలు వంటి అంశాల మీద ఏళ్ల తరబడిగా అవలంబిస్తున్న విధానాలను వాషింగ్టన్ పెద్దలకు అనుకూల రీతిలో రాత్రికి రాత్రే రివర్స్ చేసుకున్నాడంటే ఏమనుకోవాలి? ఇన్ఫ్లుయెన్సర్లకు పీటఒకప్పుడు ఎంతో గౌరవప్రదమైన ‘ద వాషింగ్టన్ పోస్ట్’ సంగతేంటి? నేను కూడా చాలా సంవత్సరాల పాటు ఆ వార్తాపత్రికలో కాలమ్ రాశాను. ఆ పత్రికలో ఇప్పుడేం జరుగుతోందో చూడండి. సంక్షోభాల నడుమ కొట్టుమిట్టాడుతోంది. సంపాదకీయ నాయకత్వంలో వరసగా అనేక ఆకస్మిక మార్పులు చేశారు. యజమాని అయిన ‘అమెజాన్’ అధిపతి జెఫ్ బెజోస్ గందరగోళంగా ఆ పత్రిక దిశను మార్చడంతో అదిప్పుడు అనిశ్చితిలో పడింది. ‘ఒపీనియన్ పేజీ’ ఎడిటర్ డేవిడ్ షిప్లీ ఈ మార్పులకు నిరసనగా వైదొలిగారు. ‘స్వేచ్ఛా విపణులు, వ్యక్తిగత స్వాతంత్య్రం’ ఆదర్శాన్ని పత్రిక ఎలా అనుసరించాలో నిర్దేశిస్తూ బెజోస్ ‘ట్విట్టర్’ వేదికగా చేసిన ప్రకటన (బహుశా మస్క్, ట్రంప్‌ల అనుమతి కోసం) ప్రమోటర్‌కు, ఎడిటర్‌కు మధ్య ఒక గోడ ఉంటుందన్న భ్రమను ఈ ఆదేశం బద్దలు కొట్టింది.దీనికి తోడు, లబ్ధ ప్రతిష్ఠులైన జర్నలిస్టుల స్థానంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వైట్‌హౌస్ నియమిస్తోంది. వీరు పత్రికా సమావేశాల్లో ప్రభుత్వ అనుకూలురుగా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీడియా స్వేచ్ఛకు ఈ చర్య అశనిపాతం. అలిగార్క్లు చలాయించే అహంకారపూరిత అధికారం, పత్రికా స్వేచ్ఛకు సవాళ్లు, సమాచారం కోసం సంబంధిత సంస్థలను సంప్ర దించే వీలు తగ్గిపోతూ ఉండటం... ఇవన్నీ సీరియస్ అంశాలు. ప్రపంచంలోని ప్రతిచోటా ఉన్నట్లే భారత్ లోనూ ఈ సమస్యలు ఉంటాయి. కానీ అంత సమర్థంగా వీటిపై పోరాడలేక పోవచ్చు. అయితే, ఈసారి ఏదైనా అమెరికా వార్తాపత్రిక... మసకబారుతున్న ఇండియా మీడియా గురించి సంపాదకీయం రాసినప్పుడు మనం వారిని వేలెత్తి చూపించగలం. అత్యంత హేయమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘టేట్ బ్రదర్స్’ రొమేనియా నుంచి అమెరికాలో ప్రత్యక్షం కావడం ఈవారం కొసమెరుపు. ఆండ్రూ టేట్, ట్రిస్టాన్ టేట్ సోదరులు అత్యాచారం, సెక్సువల్ ట్రాఫికింగ్ కేసుల్లో ఇరుక్కున్నారు. మహిళలందరూ సెక్స్ వర్కర్లనీ, అత్యాచారాలకు వారే బాధ్యత వహించాలనీ... ఇంకా ఇలాంటి దుర్మార్గమైన, అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ఈ అన్న దమ్ములు ట్రంప్ ఫాన్స్! వీరు స్వదేశం తిరిగి వచ్చేందుకు అనుమతించాలంటూ ట్రంప్ ప్రభుత్వం రొమేనియాను సంప్రదించినట్లు ‘ద ఫైనాన్షియల్ టైమ్స్’ కథనం ప్రచురించింది. చివరకు, అతివాద రిపబ్లికన్ నేతలు సైతం వారిని ఏవగించుకుంటున్నారు. ట్రంప్ రాజకీయంగా మరింత బలపడవచ్చు. కానీ అమెరికా పతనమౌతోంది. ప్రభుత్వ గందరగోళ విధానాల నేపథ్యంలో అమెరికా అసామాన్యత (అసలు అలాంటిది ఎప్పుడూ లేదని నేనంటాను) చావుదెబ్బ తినబోతోంది!బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
వాడుకున్నవాళ్లకు వాడుకున్నంత...
సాఫ్ట్వేర్ రంగంలో ప్రోగ్రామర్ల నుంచి పెద్ద కంపెనీల సీఈఓల దాకా మనవాళ్లదే ఆధి పత్యం. ప్రతీ ప్రఖ్యాత సంస్థ మన దేశంలో బ్రాంచీలు తెరవాల్సిందే. మన డాక్టర్లు వైద్య రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. పంటికైనా తుంటికైనా తక్కువ ఖర్చులో మన్నికైన చికిత్స కోసం మనదాకా రావలసిందే... ఐతే, ఇకపై ఈ పరిస్థితి మారిపోతుంది; సాఫ్ట్వేర్ నిపుణులకు ఉద్యోగాలుండవు; డాక్టర్లకు కొలువులుండవు; ఇది మరో యుగాంతానికి దారి తీస్తుంది... కృత్రిమ మేధపై వ్యక్తమవుతున్న భయాందోళనలివి!మార్పును ప్రతిఘటించడం మనిషి సహజ స్వభావం. పారిశ్రా మిక విప్లవంలో యంత్రాలు ప్రవేశించినప్పుడు అవి తమ కడుపు కొడతాయన్న ఆందోళనతో కార్మికోద్యమాలు జరిగాయి. కంప్యూటర్లు వచ్చినప్పుడు అవి తమ ఉద్యోగాలను హరించివేస్తాయనే భయంతో నిరసనలు వెల్లువెత్తాయి. ఏఐ విషయంలో కూడా అలాగే మానసిక ఆందోళనలు కనిపిస్తున్నాయి. గతంలో మార్పును వ్యతిరేకిస్తూ కొంతకాలం ప్రతిఘటించే అవకాశమైనా ఉండేది. కానీ ఈ ఏఐ ఎవరు కాదన్నా ఆగేది కాదు. కాబట్టి ఎవరికి వారు తమకు అవస రమైన మేరకు దీన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకోవాలో నేర్చు కోవడం మంచిది. చాట్ జీపీటీ, గూగుల్ జెమిని, కోపైలట్, గ్రోక్ వంటి ఏఐ టూల్స్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవడం మొదలుపెట్టాలి.ఇదొక వాస్తవంకృత్రిమ మేధ విభిన్నమైన, మరింత ఉన్నతమైన ఉద్యోగావ కాశాలు కల్పిస్తుంది. ఇది మనుషులకు ప్రత్యామ్నాయంగా వచ్చిన పరిజ్ఞానం కాదు, మనకు సహాయకారిగా ఉంటూ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు దోహదం చేస్తుంది. మనకు తెలియకుండానే మనమంతా ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. ఫోన్లో అలె క్సానో, గూగుల్‌నో ఉపయోగిస్తాం. ఏదేనా టైపు చేస్తున్నపుడు స్పెల్లింగ్ దోషాలుంటే సవరించి చూపే పరిజ్ఞానాన్ని వాడుతున్నాం. స్మార్ట్ టీవీలో మన అభిరుచికి తగిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు మనం అడగకుండానే కనిపిస్తుంటాయి. స్మార్ట్ వాచ్, ఫోన్ యాప్‌ల ద్వారా మన ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసు కునే వెసులుబాటు కలిగింది. సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవడానికి కూడా ఏఐ ఉపకరిస్తుంది. సాధారణంగా వాట్సాప్‌లో వచ్చే సందేశాలలో కొన్ని అనుమానాస్పదంగా ఉంటాయి. ఏదైనా మెసేజ్‌పై అనుమానం కలి గితే అది నిజమా, కాదా అని ఏఐ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రపంచం ఏఐతో ముందుకు సాగుతోంది, వద్దనుకుంటే మనం వెనుకబడి పోతాం. యువతకు ఏఐ మరింత ఉపయోగకరం, తప్పనిసరి కూడా. దీని ద్వారా సృజనాత్మకతను, వ్యూహరచనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. నిత్య విద్యార్థికి, మార్పును స్వాగతించే వారికి ఏఐ మంచి మార్గదర్శనం చేస్తుంది. అన్ని రంగాల్లో ఉపయోగంవిద్యాభ్యాసంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, కృత్రిమ మేధ సాయంతో వారిలో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించే కార్య క్రమాన్ని ఈమధ్య ఐదు తెలంగాణ జిల్లాల్లోని ముప్పై పాఠశాలల్లో ప్రారంభించారు. ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నపుడు కొంద రికి వెంటనే అర్థమవుతుంది, మరికొందరు అర్థం చేసుకోలేక క్రమంగా వెనుకబడిపోతారు. ప్రాథమిక విద్యార్థులలో కొందరికి సరిగా చదవడం, రాయడం కూడా రాదు. చిన్నచిన్న కూడికలు, తీసి వేతలు కూడా చేయలేరు. అలాంటి వారిని గుర్తించి ఐదేళ్లలో ప్రధాన స్రవంతిలో కలపాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ’ పేరుతో ప్రారంభమైన కార్యక్రమం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఆ కార్యక్రమానికి తాజాగా కృత్రిమ మేధను జోడించి సత్ఫలితాలు సాధించే దిశగా వెళ్తున్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో, ప్రతి తరగతి నుంచి చదువులో వెనుక బడిన విద్యార్థులను ఎంపికచేసి వారికి ఏఐ పరిజ్ఞానంతో 40 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అవసరాన్ని బట్టి ప్రతిచోటా విద్యా లయాల్లో ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెడితే ఏఐ ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చు.జన్యుపరీక్షల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీ కరించి, భవిష్యత్తులో రాగల వ్యాధులను పసిగట్టే సామర్థం ఏఐకి ఉందని వైద్యులు చెబుతున్నారు. రోగి ఎక్స్–రేలో కంటికి కనిపించని సూక్ష్మమైన మచ్చలను కూడా విశ్లేషించి రోగనిర్ధారణ చేయడం ఏఐ వల్ల సాధ్యమవుతోందని వైద్యనిపుణులు అంటున్నారు. కృత్రిమ మేధపై అన్ని రంగాల్లో మాదిరిగానే వైద్యరంగంలో కూడా భయా లున్నాయి. ఐతే ఏఐ వల్ల వారి ప్రాధాన్యం తగ్గదనీ, అందులో ప్రావీణ్యం లేకపోతే వెనుకబడే అవకాశాలు మాత్రం ఉన్నాయనీ ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ నాగేశ్వర రెడ్డి చెప్పినట్లు ఈమధ్య చదివాను. ఇప్పటిదాకా కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా వచ్చిందంటే దాన్ని అందిపుచ్చుకునే ఆర్థిక స్థోమత అందరికీ ఉండేది కాదు. దానికి భిన్నంగా ఏఐ ఫలితాలను వైద్యరంగంలో అందరికీ అందించే అవకాశాలున్నాయనీ, పల్లెలోనైనా పట్నంలోనైనా అందరికీ సమానంగా వైద్యం అందుబాటులోకి వచ్చేరోజు ఎంతోదూరంలో లేదనీ నిపుణులు అంటున్నారు. కొత్త ఔషధాలను ఆవిష్కరించే పరిశోధన లలో కూడా ఏఐని ఉపయోగించి వేగవంతమైన ఫలితాలను సాధిస్తున్నారు.వ్యవసాయం సాధారణంగా శాస్త్ర సాంకేతిక పరిశోధనల ఫలితా లను అందుకోవడంలో చివరి వరుసలో ఉంటుంది. ఐతే, ఈమధ్య రైతులలో చైతన్యం, ప్రభుత్వాల చొరవ వలన ఈ రంగంలో సాంకేతి కత వినియోగం పెరుగుతోంది. మహారాష్ట్రలోని బారామతి జిల్లాలో ఉష్ణోగ్రతలు, భూసారానికి సంబంధించి ఏఐ అందించిన సమాచా రాన్ని ఉపయోగించుకున్న ఓ రైతు మంచి దిగుబడి సాధించాడు. వాతావరణానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం వల్ల ఎరు వుల ఖర్చు, నీటి వినియోగం గణనీయంగా తగ్గి, పంట దిగుబడి ఇరవై శాతం పెరిగిందని చెప్పే ఓ రైతు ప్రత్యక్ష అనుభవాన్ని మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవల పంచుకున్నారు. కరవు, నీటి ఎద్దడి కారణంగా వ్యవసాయం నష్టదాయకంగా మారిన బారామతి జిల్లాలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఐఏ ఆధారిత వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ఇలాంటి సహాయ సహకారాలు లభిస్తే వ్యవసాయం లాభదాయకం కావడంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తుంది.మానవ మేధకూ పదును...కృత్రిమ మేధ ఒక ప్రాంతానికో, దేశానికో కాకుండా యావత్తు విశ్వాన్ని ప్రభావితం చేయగల విస్తృత సామర్థ్యం కలిగిన పరిజ్ఞానం కావడం వలన ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో కచ్చితమైన మార్గ దర్శకాలు, నియంత్రణలు ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంది. దీన్ని వికాసం కోసం వినియోగిస్తే మేలు జరుగుతుంది, విధ్వంసం కోసం వినియోగిస్తే కీడు జరుగుతుంది. కృత్రిమ మేధలో అతి ముఖ్యమైన అంశం మానవ మే«ధా సామర్థ్యం. మనం ఎంత సమర్థవంతంగా ప్రశ్న అడిగితే జవాబుఅంత కచ్చితంగా, సూటిగా వస్తుంది. మనం అడిగే ప్రశ్నను ప్రాంప్ట్ అంటారు. ఏఐ ద్వారా పనులు చేయించే ప్రాంప్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఏఐ టూల్స్ వినియోగించే టప్పుడు మనమంతా ప్రాంప్ట్ ఇంజినీర్లమే. ప్రతి పౌరుడూ, విద్యార్థీ, సాంకేతిక నిపుణుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి... కృత్రిమ మేధ నిన్నెప్పుడూ తప్పించలేదు,కృత్రిమ మేధ తెలిసినవాడు నిన్ను తప్పించగలడు. కాబట్టి, మానవ మేధకు పదును పెట్టుకుంటూ సమర్థంగా ముందుకు సాగుదాం!పి. వేణుగోపాల్ రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ఈ–మెయిల్: pvg@ekalavya.net -
ఇది కొత్త రాజకీయమా?
నా చిన్నతనంలో డోనాల్డ్ అనగానే డక్ గుర్తొచ్చేది. ఇప్పుడు ట్రంప్ ఆ స్థానం ఆక్రమించారు. వాల్ట్ డిస్నీ కంపెనీ రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాత కార్టూన్ క్యారెక్టర్ డోనాల్డ్ డక్ లేదా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... శక్తిమంతమైన అగ్రరాజ్యం అమెరికాకు ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రాతి నిధ్యం వహిస్తారు?మొదటి ప్రపంచ యుద్ధానికీ ముందూ, ఆ తర్వాతా ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా వ్వవహరించిన జార్జెస్ క్లెమెన్సో అమెరికా గురించి చేసిన ప్రఖ్యాత వ్యాఖ్యను ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఆయన అభిప్రాయం ప్రకారం, నాగరికత అనే మధ్య దశను అనుభవించకుండానే, అనాగరికత నుంచి అధోగతికి నేరుగా పురోగమించిన దేశం ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉంది... అది అమె రికా! ఆయన ఇప్పుడు జీవించి ఉంటే ట్రంప్ గురించి ఏమనేవారో?డోనాల్డ్ ట్రంప్, వ్లాదిమీర్ జెలెన్స్కీ మధ్య ఇటీవల తలెత్తిన కలహం అబ్బురపరిచేది, లేదంటే నమ్మశక్యం కానిది. ఈ పనికి మాలిన కలహం అమెరికా అధ్యక్షుడి నిజస్వరూపం ఎలాంటిదో తేట తెల్లం చేసింది. కానీ మొన్న శుక్రవారం ఏం జరిగిందో తెలియాలంటే, జనవరి నుంచి జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవాలి.జెలెన్స్కీ ఓ ‘నియంత’ అంటూ ట్రంప్ అభివర్ణించారు.ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. జెలెన్స్కీకి ఆ దేశ ప్రజల్లో 4 శాతం మాత్రమే మద్దతు ఉందని చెప్పారు. ఉక్రెయిన్ ఎన్నికల్లో ఆయనకు 57 శాతం మద్దతు లభించిన వాస్తవాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఆ ‘4 శాతం’ అనేది రష్యా ప్రాపగాండా అని జెలెన్స్కీ కొట్టిపారేశారు. ట్రంప్ అక్కడితో ఆగలేదు. ఉక్రెయిన్ అధినేతను ‘ఒక మోస్త రుగా సక్సెస్ అయిన కమెడియన్’ (అధ్యక్షుడు కాకమునుపు జెలెన్స్కీ ఒక నటుడు) అని కొట్టిపారేశారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి ఆయనే తెరతీశారనీ ఆరోపించారు. సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోనట్లయితే తన దేశాన్ని కోల్పోతారు అని ఒక అడుగు ముందుకువేసి మరీ హెచ్చరించారు.రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా ప్రభుత్వం జరుపుతున్న చర్చల నుంచి జెలెన్స్కీనీ, ఇతర యూరప్ దేశాల నేతలనూ ట్రంప్ దూరం పెట్టారు. రష్యా అధ్యక్షుడు శాంతి కోరుకుంటున్నారని పలు ఇంటర్వ్యూలలో ఆయన పుతిన్‌ను ప్రశంసించారు. తాను పుతిన్‌ను విశ్వసిస్తున్నానని విస్పష్టంగా ప్రకటించారు. రష్యాదే పై చేయి అని నమ్ముతున్నట్లు తేల్చి చెప్పారు. చర్చల్లో భాగస్వామిగా చేయాల్సినంత ముఖ్యుడు కాదని వ్యాఖ్యానించి జెలెన్స్కీని కించపరిచారు. ఎంత రెచ్చగొట్టినా సరే మౌనం పాటించాలని ఉక్రెయిన్ అధినేతకు సలహాలు అందివుంటాయి. అయినా జెలెన్స్కీ ఊరు కోలేదు. రష్యా ‘తప్పుడు ప్రచారపు బుడగ’లో ట్రంప్ జీవిస్తున్నారని దుయ్యబట్టారు. ఉక్రెయిన్‌కు 500 బిలియన్ డాలర్ల సాయం అందించామన్న ట్రంప్ మాటలతో కూడా ఆయన విభేదించారు. అది ‘సీరియస్’గా చెబుతున్నమాట కాదని కొట్టేశారు. అమెరికా ఉపాధ్యక్షడు జె.డి.వాన్స్, జాతీయ భద్రతా సలహా దారు మైఖెల్ వాల్ట్స్‌ను రెచ్చగొట్టడానికి ఇంతకంటే ఇంకేం కావాలి! వారు వెంటనే స్పందించారు. ట్రంప్ మీద నోరు పారేసుకోవద్దని జెలెన్స్కీని ప్రసార మాధ్యమాల ద్వారా హెచ్చరించారు. నిజానికి నోరు పారేసుకున్నది ట్రంపే!ఇదంతా గమనిస్తుంటే, ఏమనిపిస్తోంది? సున్నిత హాస్యంతో సత్ప్రవర్తనకు మారుపేరుగా నిలిచిన ‘డోనాల్డ్ డక్’ ఈ వ్యవహారాన్ని సుతరామూ అంగీకరించలేదు. ఈసడించుకుని గగ్గోలు పెట్టేది. క్లెమెన్సో తన అభిప్రాయానికి తాజా పరిణామాలు రుజువు అనే వారు. దిగజారినవారు మాత్రమే ఇలా ప్రవరిస్తారు.నేను ఇప్పుడొక భిన్నమైన ప్రశ్న వేస్తాను. సాటి ప్రభుత్వ అధినేతను, అదీ తమ మిత్రపక్ష ప్రభుత్వ అధినాయకుడిని... శత్రు దేశం కొమ్ము కాస్తూ ఒక అమెరికా అధ్యక్షుడు ఇలా బహిరంగంగా చులకన చేసి మాట్లాడిన దృష్టాంతం మీరెప్పుడైనా విన్నారా? మీ ఊహకు అందని విరుద్ధ భావన కదా ఇది! ఈ చర్చ మరొక ప్రశ్నకు దారి తీస్తుంది. తాను అమెరికా అధ్యక్షుడు, శక్తిమంతుడు, విలక్షణ స్వభావి కనుక తానొక్కడికే ఎలా మాట్లాడినా చెల్లుబాటు అవుతుందా? లేదా ఇతర ప్రభుత్వాల అధి నేతలు సైతం ఆయన్ని అనుసరించే ప్రమాదం ఉందా? మరో విధంగా చెప్పాలంటే, ట్రంప్ ప్రవర్తన కొత్త తరహా రాజకీయాలకు ముందస్తు సూచనేమో! ఇతరులూ అలా మాట్లాడితే అదో కొత్త ఆన వాయితీ అవుతుంది.నా ఉద్దేశంలో కేవలం చిన్న దేశాల అధ్యక్షుల గురించి మాత్రమే శక్తిమంతమైన దేశాల అధినేతలు ఇలా లెక్క లేనట్లు మాట్లాడగలరు. స్కూల్లో అయితే దీన్ని బుల్లీయింగ్ అంటాం. ఇవ్వాళా రేపూ ఇదే వాస్తవ రాజకీయం. ఇంకా చెప్పాలంటే, నడుస్తున్న రాజనీతి!చివరకు ట్రంప్ ప్రవర్తన సమకాలీన అమెరికా గురించి ఆందో ళనకరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. జాత్యహంకారం, సామాజిక వివక్ష, అన్యాయాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న భావన వది లేసిన తర్వాత... ఇక ఏదైనా సరే ఎలా నిషిద్ధం అవుతుంది? అందుకే ఏం మాట్లాడినా, ఎలా విరుచుకుపడినా ఇప్పుడు సమ్మతమే అవుతుందా? అది అసత్యమైనా, అన్యాయమైనా, పూర్తిగా పక్షపాతమైనా సరే ఆమోదయోగ్యమేనా? ఈ తీరుతోనే అమెరికా మళ్లీ గొప్ప దేశం అవుతుందా? లేదా తనంతట తానే క్రమేణా క్షీణించి పోతుందా? తన ఔన్నత్యాన్ని మరీ మరీ దిగజార్చుకుంటుందా? తన నైతిక స్థితిని ఇంకా ఇంకా బలహీనపరుచుకుంటుందా? శుక్రవారం జరిగిన కలహం వల్ల ఉక్రెయిన్, యూరప్, ఆఖరికి అమెరికా కూడా తీవ్రమైన చిక్కులు ఎదుర్కోవచ్చు. దీన్నంతటినీ చూస్తూ నవ్వుకుంటున్నది ఒకే ఒక్కరు... రష్యా అధ్యక్షుడు! అయితే, తన దురుసుతనానికి త్వరలోనే ట్రంప్ పశ్చాత్తాపపడ్డా నేను ఆశ్చర్య పోను. కానీ అప్పటికే ఆలస్యమవుతుందా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆ కాలపు అరుదైన నటీమణి
నాకప్పుడు ఎనిమిదేళ్ళు. వేసవికని బెంగు ళూరులో ఉన్నాము. అక్కడి ‘మినర్వా’ సినిమా హాలులో హీరోయిన్ కృష్ణవేణి నటించిన ‘గొల్లభామ’ (1947) సినిమా చూశాను. ఒకటికి రెండు మార్లు! నాకు చిన్నతనం నుంచి గ్రామఫోన్ రికార్డులు వినడం అలవాటు. సినిమా చూడటానికి ముందే ఆ సినిమా రికార్డులు యింట్లో ఉన్నాయి. అందులో పాటలే కాక –– కె. రఘురామయ్యతో యుగళగీతం ‘చందమామ...’, కృష్ణవేణి సోలో ‘ఉన్నావా? లేవా...’–– ఒక పద్యం, సినిమాలోని పతాక సన్నివేశం లోనిది ‘భూపతి జంపితిన్’ ఉంది. అంతవరకు సినిమా పాటలే నా బుర్రకెక్కాయి. ఇదే మొదటి పద్యం. ఆ రాగ మాధుర్యం, నేపథ్య సంగీతం ఒరవడి అర్థమై కాదు... ఆ సులభమైన మాటలు, ఆ సన్నివేశానికి తగినట్లుగా బోధపడటం వలన!1947 మద్రాసులో మేము కొన్న యిల్లు ఉండేది పైక్రాఫ్ట్స్ గార్డెన్స్‌లో! ఆ వీధి చివరి యిల్లే కృష్ణవేణిది. ఆమె అమెరికా నుంచి దిగుమతి అయిన ఖరీదైన రెండు రంగుల ఇంపోర్టెడ్ కాడిలాక్ కారులో తిరిగేది. ఆమె భర్త మీర్జాపురం రాజా వారు చిన్న మోరీస్ మైనర్ కారులో వచ్చేవారు. అప్పట్లో సినీ రంగంలో సొంత లగ్జరీ లిమొజీన్ కారున్న తొలి వ్యక్తి కూడా కృష్ణవేణే!ఆమె కూతురు –– అప్పటి పేరు మేకా రాజ్యలక్ష్మి అనూరాధ. ‘ఎమ్.ఆర్.ఎ.’ ప్రొడక్షన్స్ అన్న కృష్ణవేణి సినిమా నిర్మాణసంస్థ యీమె పేరు తాలూకు పొడి అక్షరాలే! సాయంత్రం పూట తోపుడు బండిలో షికారు వస్తే మా అమ్మ ఆమెను ముద్దు చేసేది. నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా కృష్ణ వేణిది బహుముఖమైన ప్రస్థానం. కొన్ని సంగతులు ప్రత్యేకించి చెప్పుకోవాలి. చిన్న వయసులో ఆమె నటించిన ‘కచ దేవయాని’ (1938) దశాబ్దాల తరువాత పూనాలోని నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్‌లో చూశాను. అందులో ‘‘కచా! కచా!!’ అంటూ ఆమె నాయకుడి వెంట బడటం గుర్తున్నది నాకు! అలాగే, కథానాయికగా విజయాలు సాధించిన తర్వాత ఆమె కెరీర్లో ఒకే ఒక సందర్భంలో... ‘తిరుగుబాటు’ (1950) చిత్రంలో... వ్యాంప్ పాత్ర ధరించడం మరో విశేషం. అయితే, అంతటి వ్యాంప్ పాత్రలోనూ ఆమె బాడీ ఎక్స్పోజర్ చేయకుండా నటించడం గమనార్హం. ఆ పాత్ర కోసం ఆమె ఫుల్ స్లీవ్డ్ బ్లౌజులు స్వయంగా డిజైన్ చేసుకొని, ధరించడం మరో చిత్రం.కృష్ణవేణి తాను నటించిన సినిమాలన్నిటిలో తన పాటలు తానే పాడుకున్న అరుదైన గాయని. అయితే, ‘దాంపత్యం’ (1957) చిత్రంలో మాత్రం తెరపై కృష్ణవేణి నటనకు రావు బాలసరస్వతి నేపథ్యగానం చేయడం అరుదైన సందర్భం. ఇక, తమ సంస్థ సొంత చిత్రం ‘కీలుగుర్రం’(1949)లో నటి అంజలీదేవికి కృష్ణవేణి ప్లేబ్యాక్ పాడడం మరో గమ్మత్తు. ఆమె పాడిన పాటల్లో దాదాపు 20 దాకా పాటలు 78 ఆర్పీఎం గ్రామఫోన్ రికార్డుల్లో ఉన్నాయి. ఎన్.టి. రామారావుని ‘మన దేశం’ (1949) పోలీసు యిన్స్పెక్టర్గా, అదే చిత్రంతో ఘంటసాలను సంగీత దర్శ కునిగా పరిచయం చేసింది ఆమె. రమేశ్ నాయుడికి స్వతంత్ర సంగీత దర్శ కుడిగా మొదటి అవకాశమూ ఆమె నిర్మించిన ‘దాంపత్యం’ ద్వారానే! ఆ ‘దాంపత్యం’ చిత్రం ద్వారానే విజయ్ కుమార్‌ను హీరోగానూ పరిచయం చేశారు. ఆ విజయ్‌కుమార్ తల్లి...అంతకు చాలాకాలం ముందే వచ్చిన తొలి తెలుగు సాంఘిక చిత్రం ‘ప్రేమ విజయం’ (1936)లో నటించారు. మద్రాసులో శోభనాచలా స్టూడియో నిర్వహణతో పాటు, నిర్మాతగా కృష్ణవేణి కన్నడంలో రాజ్‌కుమార్‌తో హిట్ చిత్రాలు నిర్మించడమూ మర్చిపోలేము. చివరి రోజుల్లో ఆమె తన జీవితచరిత్రను సీనియర్ జర్నలిస్ట్ ఎస్వీ రామారావు సహకారంతో రాయగా, ‘కృష్ణవేణీ తరంగాలు’ పేరిట కుమార్తె అనూరాధ ప్రచురించారు. నూటొక్క సంవత్సరాలు నిండిన చిత్తజల్లు కృష్ణవేణి గంధర్వ లోక గతురాలైందన్న విషయం తెలిసి యివన్నీ గుర్తుకు వచ్చాయి. అవన్నీ మరపురాని గుర్తులు... ఆమె పాడినవి మధుర గీతాలు!!-వి.ఏ.కె. రంగారావు , వ్యాసకర్త ప్రముఖ సినీ – సంగీత – నాట్య విమర్శకులు -
శశి థరూర్ (లోక్‌సభ ఎంపీ) రాయని డైరీ
పుస్తకాలు చదివితే జ్ఞానం లభిస్తుందా? ఆ జ్ఞానం... ఎవరినైనా, ఏ విధంగానైనా అర్థం చేసుకోవటానికి తోడ్పడుతుందా? లేదంటే, అర్థం చేసుకోవటాన్ని ఆ జ్ఞానం మరింతగా సంక్లిష్ట పరుస్తుందా? ఢిల్లీ నుండి రాహుల్ ఫోన్! ‘‘మనం ఒకర్నొకరం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది థరూర్‌జీ...’’ అంటారాయన! అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని గుర్తించ టానికి ఏదైనా పుస్తకం చదవటం వల్ల సంప్రాప్తించిన జ్ఞానం ఆయనకు దోహదపడి ఉంటుందా? ‘‘కొత్తగా ఏం చదువుతున్నారు రాహుల్జీ...’’ అని అడిగాను. ‘‘కొత్తగా ఏమీ చదవటం లేదు థరూర్‌జీ. కొత్తగా మీ ట్విట్టర్ అకౌంట్ మాత్రం చూస్తున్నాను. ఎవరిదో కోట్ పెట్టినట్లున్నారు... ‘అజ్ఞానం ఆనందదాయకం అయిన చోట, జ్ఞానవంతులుగా ఉండటం మూర్ఖత్వమని’!ఆ కోట్ చూశాకే మీకు ఫోన్ చేశాను... మనం ఒకర్నొకరం అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని...’’ అన్నారు రాహుల్! ‘‘రాహుల్జీ! మీరు గానీ ఆ కోట్లో... అర్థాలనేమైనా వెతుకుతున్నారా?’’ అన్నాను.‘‘అర్థాలను కాదు థరూర్‌జీ. మిమ్మల్ని వెతుకుతున్నాను. మీ ట్వీట్ చదివాక, మీ పాడ్‌కాస్ట్ విన్నాక, పీయూష్ గోయల్‌తో మీ సెల్ఫీ చూశాక నాకనిపిస్తోంది, కాంగ్రెస్‌లో ఉన్న కారణంగా మీరు మీ జ్ఞానాన్ని చాలా మిస్ అవుతున్నారని...’’ అన్నారు రాహుల్! రాహుల్ ఇంత జ్ఞానగర్భితంగా మాట్లాడటం మునుపెన్నడూ నేను వినలేదు. ‘‘కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వద్దనుకుంటే మీరేం చేస్తారు?’’ అని పాడ్‌కాస్టర్ నన్ను అడిగినప్పుడు – ‘‘నాకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి’’ అని నేను చెప్పాను. వేరే ఆప్షన్స్ అంటే నా ఉద్దేశం పుస్తకాలు, ప్రసంగాలు. ఇక పీయూష్ గోయెల్‌తో నేను సెల్ఫీ దిగటమైతే ఎవరి దృష్టిలోనో పడటానికి చేసింది కాదు. గోయెల్ కామర్స్ మినిస్టర్. బ్రిటన్ కామర్స్ మినిస్టర్ ఆయన పక్కన ఉన్నారు. నాకూ కామర్స్‌లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ముగ్గురం కలిసి సెల్ఫీ తీసుకున్నాం. ‘‘నా ట్వీట్లో, పాడ్‌కాస్ట్‌లో, సెల్ఫీలో మీరు నన్ను వెతుకుతున్నట్లే, ‘కాంగ్రెస్ పార్టీలో నేనెక్కడ?!’ అని నేనూ నన్ను వెతుక్కుంటు న్నాను రాహుల్జీ...’’ అన్నాను. ‘‘థరూర్‌జీ! దేశానికెంతో చేస్తున్నారని మీరు మోదీజీని కీర్తిస్తున్నారు. కేరళకెంతో చేస్తున్నారని కమ్యూనిస్టులను ఆకాశానికెత్తేస్తు న్నారు. అలాంటప్పుడు మేము మిమ్మల్నిగానీ, మిమ్మల్ని మీరు గానీ కాంగ్రెస్‌లో ఎంత వెతికితే మాత్రం ఎలా మీరు కనిపిస్తారు?! ... ..అంతేకాదు థరూర్‌జీ! మీరు స్టెప్ బై స్టెప్ కింది నుంచి పైకి రాలేదు. ఒకేసారి పైనుండి ప్యారాచూట్లో కాంగ్రెస్‌లోకి వచ్చి పడ్డారు. ప్యారాచూట్ కిందికి దిగటానికే కానీ, పైకి ఎగరటానికి కాదు...’’ అన్నారు రాహుల్!! ‘ఒక జ్ఞానవంతుడి ఆత్మకథ’ అనే పుస్తకమేదో చదువుతున్నట్లుగా ఉంది నాకు, రాహుల్ అలా మాట్లాడుతుంటే వినటం!‘‘పార్టీలో నేనేమిటి?’ అని లోక్‌సభలో మీరు నాకు ఎదురుపడి అడిగినప్పుడే మీ మనసులో ఉన్నదేమిటో నాకు అర్థమైంది థరూర్‌జీ. కేరళకు సీఎం అయితేనే మీరేదైనా అయినట్లు కాదు. జ్ఞానం అన్నది ట్వీట్లకు, పాడ్‌కాస్ట్‌లకు, సెల్ఫీలకు మాత్రమే పనికొచ్చే ఒక మిత్. ఇదుగోండి, ఖర్గేజీ మీతో మాట్లాడతారట...’’ అని, ఆగారు రాహుల్!‘‘హ్యాపీ బర్త్‌డే థరూర్‌జీ...’’ అన్నారు ఖర్గేజీ లైన్లోకి రావటంతోనే!‘‘ఈ ఆదివారం కాదు ఖర్గేజీ... నా బర్త్‌డే. వచ్చే ఆదివారం...’’ అన్నాను నవ్వుతూ. ‘‘మీరు పార్టీలో ఉన్నప్పుడే బర్త్‌డే విషెస్ చెబితే మీకు సౌకర్యంగా ఉంటుంది కదా అని ముందే చెప్పేస్తున్నా థరూర్‌జీ...’’ అన్నారు ఖర్గే!! నేను మళ్లీ మళ్లీ చదువుతుండే మహాభారతాన్ని మళ్లొకసారి బయటికి తీశాను. భారతం జ్ఞానాన్ని ఇవ్వదు! జ్ఞానాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇస్తుంది! -
అస్తిత్వాల పోరులో రాజ్యాంగ స్ఫూర్తి
భారతదేశంలో త్రిభాషా సూత్రంపై మరొక సారి విస్తృతమైన చర్చ జరుగుతోంది. దక్షిణ భారత రాష్ట్రాలు భాషా అస్తిత్వాలపరంగా తమ ఉనికిని చాటుకోవటానికి ఎప్పటినుండో పోరాటం చేస్తున్నాయి. ప్రపంచంలోనే దక్షిణ భారత భాషలకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళ భాషలకు మూలం ద్రావిడ భాషే. అయితే అవి 21 భాషలుగా అభివృద్ధిచెందాయి: బ్రాహుయీ, మాల్తో, కూడుఖ్, గోండి, కొండ, కూయి, మండ, పర్జి, గదబ, కోలామీ, పెంగో, నాయకీ, కువి, తెలుగు, తుళు, కన్నడం, కొడగు, టోడా, కోత, మలయాళం, తమిళం. మధ్య ద్రావిడ భాషల్లో తెలుగు ఉంది. దక్షిణ ద్రావిడ భాషల్లో తమిళం ఉంది. వాఙ్మయ దృష్టితో కాకుండా భాషా చారిత్రక దృష్టితో చూస్తే మధ్య ద్రావిడ భాషల్లో గోండి, కొండ, కూయి; దక్షిణ ద్రావిడ భాషల్లో తుళు, టోడా ప్రాచీనమైనవి. క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్స రాల నాడు మూల ద్రావిడ భాష నుంచి ఈ భాషలు ఒకటొకటి స్వతంత్రతను సంతరించుకున్నాయని భాషా చరిత్రకారులు చెబు తుంటారు. ఒకటొకటి స్వతంత్ర భాషగా రూపొందడానికివెయ్యేండ్లు పట్టింది. ఈ భాషల మూలాలు దక్షిణాది జీవన వ్యవస్థల నుండి ఆవిర్భవించాయి. అంబేడ్కర్ తన ‘రాష్ట్రాలు – అల్పసంఖ్యాక వర్గాలు’ పుస్తకంలో వీటి అస్తిత్వాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు.ఏ మూడు భాషలు?దేశ పాఠశాలల్లో బాలలకు మూడు భాషలు బోధించాలన్న విధానం అధికారికంగా త్రిభాషా సూత్రంగా ప్రసిద్ధమయింది. 1968లో ఈ సూత్రానికి సర్వజనామోదం లభించింది. ఈ ప్రకారం పాఠశాల బాలలకు, హిందీ భాషా రాష్ట్రాలలో హిందీ, ఇంగ్లిష్, ఆధు నిక భారతీయ భాష (ఏదైనా ఒక దక్షిణాది భాష)ను బోధించాలి. హిందీయేతర రాష్ట్రాలలో హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషను బోధించాలి. దక్షిణ భారతావనిలో హిందీ వ్యతిరేక నిరసనలు వెల్లు వెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ త్రిభాషా సూత్రం ఆమోదం పొందింది. తొలుత రాధాకృష్ణన్ కమిషన్ (1948) ప్రతిపాదించిన ఈ త్రిభాషా సూత్రాన్ని విద్యావేత్త కొఠారి నేతృత్వంలోని తొలి విద్యా కమిషన్ అంగీకరించింది. దరిమిలా 1960లో, 1980ల్లో కేంద్రం రూపొందించిన ప్రథమ, ద్వితీయ జాతీయ విద్యా విధానాలలో ఈ సూత్రం భాగమైంది. అయితే నేర్పవలసిన త్రిభాషలు ఏవి అనేది ఆయా భాషా రాష్ట్రాల పాలకులు నిర్ణయించుకోవాల్సి వుంది.అందుకే హిందీని రెండవ భాషగానో, మూడవ భాషగానోఅంగీకరించకపోతే ‘సర్వ శిక్షా అభియాన్’ కింద పంపే నిధులు పంప మని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.కేంద్ర పాలకులు భాషా అస్తిత్వాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తు న్నారు. రాజ్యాంగంలో రాష్ట్రాల అస్తిత్వం గురించి ఇలా చెప్పారు: భారత రాష్ట్రాలు కలిసి శాసన, కార్యనిర్వాహక, పరిపాలనా అవస రాల కోసం భారత సంయుక్త రాష్ట్రాలు అనే పేరు మీద ఒక రాజకీయ రూపాన్ని తీసుకోవటానికి ఆదేశించుకుంటున్నాయి. ఈ స్ఫూర్తితో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళ నాడుపై హిందీని బలవంతంగా రుద్దకపోతే డీఎంకే దానిని వ్యతిరేకించదన్నారు. ‘డీఎంకే ఇప్పటికీ హిందీని ఎందుకు వ్యతిరేకిస్తుందని అడిగే వారికి, మీలో ఒకరిగా నా వినయపూర్వక సమాధానం ఏమి టంటే... మీరు రుద్దకపోతే మేము వ్యతిరేకించం. తమిళనాడులో హిందీ పదాలను నలుపు రంగులోకి మార్చం. ఆత్మగౌరవం అనేది తమిళుల ప్రత్యేక లక్షణం. ఎవరైనా దానితో ఆడుకోవడానికి మేము అనుమతించం’ అన్నారు. రాష్ట్రంలో భాషా వివాదం చెలరేగు తున్న నేపథ్యంలో ఈ మేరకు ఆయన డీఎంకే శ్రేణులకు లేఖ రాశారు. భాషల కోసం పోరాటంస్టాలిన్ వాదనలో ఒక సత్యం ఉంది. మాతృభాష ప్రతి రాష్ట్రంలోని విద్యార్థికి అత్యవసరం. దక్షిణాదిలో ఉన్న భాషా మూలాలను బట్టి వారికి రెండవ భాషగా దక్షిణాది భాష త్వరగా వస్తుంది. ప్రపంచీకరణలో భాగంగా ఇంగ్లిష్ అన్ని రాష్ట్రాల విద్యార్థులు నేర్చుకోవడం వల్ల ఏ దేశంలోనైనా ఉపాధిని సంపాదించుకోవచ్చు. తమిళనాడులో పెరియార్ రామస్వామి నాయకర్ కాలంలోనే తమిళ భాషా అస్తిత్వం కోసం పోరాడిన చరిత్ర ఉంది. అలాగే తెలుగువారు కూడా తమ భాషా అస్తిత్వాల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. నిజానికిఆంధ్రులు అనేక భాషల వారితో బాధింపబడినా తమ అస్తిత్వ పోరా టాల్ని బలంగా చేశారు. శాతవాహనుల కాలం నుండి సంస్కృత భాషలో, ప్రాకృత భాషలో పాలకులు ఉన్నప్పుడు, తెలంగాణలో ఉర్దూ భాష పాలకులు ఉన్నప్పుడు కూడా తెలుగువారు తమ లిఖిత భాషా సంప్రదాయాన్ని కొనసాగించారు. తమిళనాడును ఎంతో కాలం పాలించిన కరుణానిధి ప్రెస్మీట్లో కూడా తమిళంలోనే మాట్లాడి దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత విలేఖరులకు ఉందని చెప్పడం ఒక ఆత్మాభిమాన ప్రకటన!క్రీ.శ.1901లో శ్రీ కృష్ణదేవరాయల ఆంధ్ర భాషా నిలయం కొమర్రాజు లక్ష్మణరావు పంతులు ప్రోత్సాహంతో స్థాపించబడిన తరువాత తెలుగులో భాషోద్యమంతో పాటు, గ్రంథాలయాల ప్రాధా న్యత పెరిగింది. 1906వ సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా మండలి ప్రారంభంతో సాహిత్య ప్రచురణకు కూడా ఉత్సాహం వచ్చింది. తెలుగు భాషాభివృద్ధికి అన్ని ప్రాంతాల మేధావులు కృషి చేశారు. ఏ భాషోద్యమమైనా ఆ భాషా ప్రజల చరిత్రకు, పరిణామాలకు మూల శక్తి అవుతుంది. భాషను విస్మరించిన రాష్ట్రాలు తమ ఉనికిని కోల్పో తాయి. తెలుగు భాష గ్రంథస్తం కాకపోవడానికి వీరికి రాజ భాషగా సంస్కృత, ప్రాకృతాలు 900 యేండ్లు వ్యవహరించడం. అయినా తట్టుకొని నిలబడటమే గొప్ప అంటారు బి.ఎన్.శాస్త్రి. ‘‘ఆంధ్ర దేశ మున రాజభాషగా ప్రాకృతము క్రీ.పూ. 300 నుండి క్రీ.శ. 300 వరకు వర్ధిల్లినది. అటు పిమ్మట క్రీ.శ. 300–600 వరకు సంస్కృతము రాజ భాషయైనది.... గాథాసప్తశతి, బృహత్కథ, లీలావతి వంటి ప్రాకృత గ్రంథములందు అనేక తెలుగు పదములున్నవి. ప్రాకృత, సంస్కృత భాషల కన్న భిన్నమైన దేశభాష అనగా తెలుగు వాడుకలోనున్నట్లు శర్వవర్మ–గుణాఢ్యుల సంవాద గాథ తెలుపుచున్నది.’’ ఉత్తరాదివారూ నేర్చుకోవాలి!వాస్తవానికి మోదీ సర్కార్ జాతీయ విద్యా విధానంలో హిందీని ప్రస్తావించకపోవడం ద్వారా త్రిభాషా సూత్రాన్ని అస్పష్టపరిచింది. ఈ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం తాను ఎంపిక చేసిన ఏ మూడు భాషలనైనా బోధించవచ్చు. అయితే ఆ మూడు భాషలలో రెండు తప్పనిసరిగా దేశీయ భాషలు అయివుండాలి. ఈ దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం కోరుకుంటే, తమిళంతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో ఒకదాన్ని, ఆంగ్ల భాషను బోధించవచ్చు. నిజానికి ఉత్తరాదికి దక్షిణాదివారు, దక్షిణాదికి ఉత్తరాదివారు ప్రయాణం చేస్తున్న కాలం ఇది.దక్షిణాది భాషలు ఉత్తరాదిలో ఎగ తాళికి గురవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇంగ్లిష్‌ను ఎటూ ప్రపంచ భాషగా చదువుతున్నారు. ఉత్తరాది వారికి దక్షిణాది చరిత్ర, దక్షిణాది వారికి ఉత్తరాది చరిత్ర తెలియాలి. ఒకరి భాషా ఒకరికి, ఒకరి వస్తువుల పేర్లు మరొకరికి, ఒకరి తినుబండారాల పేర్లు మరొకరికి అర్థం కావాలంటే ఉత్తరాది వారు కూడా దక్షిణాది భాషల్లో ఒక భాషను నేర్చుకోవాలి. దీన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నీ భారతీయ భాషలే, అన్నింటికీ సమ ప్రాధాన్యత ఉండాలని నొక్కి చెప్పారు. ఫెడరల్ సూత్రాలను ఎలా విస్మరిస్తారని ప్రశ్నించారు. ఉత్తరాది సంప్రదాయశీలమైంది, దక్షి ణాది పురోగమన శీలమైంది. ప్రతి రాష్ట్రానికి ఇచ్చిన హక్కుల్ని కాపాడటం కేంద్ర ప్రభుత్వ విధి.» పాఠశాలల్లో బాలలకు మూడు భాషలు బోధించా లన్న విధానం అధికారికంగా త్రిభాషా సూత్రంగాప్రసిద్ధం. 1968లో దీనికి ఆమోదం లభించింది.» హిందీని బలవంతంగా రుద్దకపోతే దానిని వ్యతిరేకించం అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు.» త్రిభాషా సూత్రం ప్రకారం, హిందీ భాషా రాష్ట్రాలలో హిందీ, ఇంగ్లిష్తో పాటు ఒక ఆధునిక భారతీయభాష (ఏదైనా దక్షిణాది భాష)ను బోధించాలి. కానీ ఇది విస్మరణకు గురైంది.-వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695-డా‘‘ కత్తి పద్మారావు -
కుల గణన చర్చలో పస ఎంత?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆర్థిక, సామాజిక, విద్య, కులాల వారీగా తీసిన లెక్కల గురించి కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీజేపీ కేంద్ర మంత్రులు పెద్ద రాద్ధాంతం చేసే సమస్య... ముస్లిం ఓబీసీలు. ఇతరులు చర్చనీయాంశం చేసేది... ఓసీ కులాల సంఖ్య.56 ప్రశ్నలతో, వందలాది ఎనుమరేట ర్లతో 50 రోజులు చేయించిన సర్వే ఇది. 150 కుటుంబాలను ఒక బ్లాక్‌గా గుర్తించారు. అంటే ఒక్క ఎనుమరేటర్ ఆ బ్లాక్‌లో 50 రోజుల్లో ప్రశ్నావళిలో ఇచ్చిన కులాల పేర్ల ఆధారంగా 56 ప్రశ్నలకు సమాధానాలు తీసుకున్నారు. ప్రజల సంతకాలతో ప్రశ్నల చిన్న పుస్తకాన్ని కోడింగ్ సెంటర్లకు చేర్చారు. ఈ విధంగా తీసిన లెక్క లను, 4 ఫిబ్రవరి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ లెక్కలను, 2014లో అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రోజులో ఇంటింటి సర్వే పేరుతో జరిపిన తంతుతో పోల్చి కొందరు చర్చల యుద్ధం చేస్తున్నారు.ముస్లింలను విస్మరిస్తారా?అందులో మొదటిది ఆనాటి లెక్కల్లో ముస్లింలంతా ఓసీలే. ఇప్పుడు 10.08 శాతం బీసీలు ఎట్లా అయ్యారు? ముస్లింల బీసీ–ఈ కులాల పేర్ల జాబితాను వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తయారు చేసింది! అందులో బీసీ–ఈ ముస్లింలను 14 గ్రూపులుగా విభజించి వారి కులాల పేర్లను లిస్టులో పొందుపర్చారు. అందులో అచ్చుకట్టలవాండ్లు, అత్తర్ సాయబులు, ధోభి ముస్లిమ్, ఫకీర్, బుడ్‌బుడ్కి, గుర్రాలవాళ్ళు, గోసంగి ముస్లింలు, నజావ్, నాయిలబ్బి, కటిక్, షేక్, సిద్ది, జింక సాయిబులు, తుర్క కాష వరకు దాదాపు 60 కులాలు ఉన్నాయి. వీరంతా వివిధ దశల్లో, ముఖ్యంగా తెలంగాణలో నిజాం కాలంలో ముస్లింలుగా మారి బతుకుదెరువు వెతుక్కున్నవారు. ఇందులో చాలా కులాలు ఆరెస్సెస్/బీజేపీ వారు హిందువులుగా గుర్తించి, బీసీ కులాల్లాగా కులవృత్తులతో జీవించిన వారు. భిక్షాటన సంస్కృతితో జీవించే కులాలు కూడా ఇందులో ఉన్నాయి. గుడ్డేలుగులను ఆడించేవాళ్లు, ఊబిది పొగవేస్తూ ఇండ్లు తిరిగేవాళ్లు, దర్గాల దగ్గర పీర్సాయబులుగా బతికేవాళ్లు ఉన్నారు. అందులో అతిపెద్ద కులం దూదేకులవాళ్లు. వీళ్లలో పింజారీలు కూడా ఒక భాగం. ఆంధ్ర ప్రాంతంలో ప్రఖ్యాత బుర్రకథ యోధుడు నాజర్ ఈ కులానికి చెందిన సాంస్కృతిక సారథి. ఆయన జీవిత చరిత్ర ‘పింజారి’ చదివితే ఆయన ఎంత కిందిస్థాయి నుంచి ఎదిగాడో అర్థమౌతుంది. ఆయన తల్లి తిండిలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. బీజేపీ వాళ్లు రేపు ఆంధ్రప్రదేశ్‌లో కులగణన చేస్తే రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తయారు చేసిన ఈ ముస్లిం కులాల లిస్టును పక్కన పెట్టి మొత్తం వారిని ఓసీల్లో చూపిస్తారా? వారికిచ్చే 4 శాతం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని తెలంగాణలో మోదీ, అమిత్ షా ఎన్నికల సమయంలో గొంతు చించుకొని మాట్లాడారు. ఇప్పుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి అదే అంశాన్ని పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో కూడా రచ్చ చేస్తారా? బతుకుదెరువు, విద్య లేని వారిని అభివృద్ధి చేయాల్సిన పథకాల్లో చేర్చకుండా వాళ్ళను ఆకలిచావులకు గురిచెయ్యాలా? మానవత్వ విలువలు కూడా ఈ దేశానికి లేకుండా చేద్దామా?ఈ జనగణనలో 2.48 శాతం ముస్లింలు ఓబీసీలుగా తమను తాము ఐడెంటిఫై చేసుకోలేదు. వీరిలో పఠానులు, మొగలులు, షేక్‌లు, సయ్యద్‌లు ఉంటారు. వీళ్లు నిజాం కాలం నుండి ఫ్యూడల్, రాజరిక లక్షణాలతో బతుకుతున్నవాళ్లు. మత సమానత్వం మాట్లాడుతున్నప్పటికీ కుల అణచివేత, దోపిడీ ముస్లింలలో చాలా ఉంది. బీసీ ముస్లింలు తిరుగుబాటు చెయ్యకుండా, వారికి ఇంగ్లిష్ విద్య రాకుండా మతం ముసుగుతో ఈనాటికీ అణచివేస్తూనే ఉన్నారు. రాజ్యం వారిని విముక్తుల్ని చేసేందుకు రిజర్వేషన్లు, ఇంగ్లిష్ మీడియం విద్యను అందించాలి. ముస్లిమేతర బీసీ మేధావులు కూడా వారి రిజర్వేషన్‌కు అండగా నిలబడాల్సిన అవసరముంది.ఓసీల జనాభా ఎందుకు పెరిగింది?ఇక రెండో చర్చనీయాంశం ముస్లిమేతర బీసీలు 46.25 శాతమే ఎలా ఉంటారు? తెలంగాణలో ఓసీలు 13.31 శాతం ఎందుకు ఉంటారు అనేది బీసీ మేధావులు అడిగే ప్రశ్న. 2014 లెక్కల్లో టీఆర్ఎస్ ఓసీలు 7 శాతమన్నది కదా, ఇప్పుడు 13.31 శాతం ఎలా పెరిగిందని అడుగుతున్నారు. అసలు 2014 లెక్క పెద్ద బోగస్. ఒక్కరోజులో లెక్కలు తీశామని చెప్పి, బయటికి పర్సెంటేజీలు కూడా అధికారికంగా చెప్పలేదు. మొత్తం ముస్లింలను ఓసీలలో చూపించిన లెక్కల్లో బీసీ–ఈ కులాలు ఏమైనట్లు? ఈ విధంగా చర్చించడం బీజేపీని బలపర్చడమే. ఆనాడు టీఆర్ఎస్ బీజేపీలా వ్యవహరించింది.తెలంగాణలో మొత్తం బీసీలు 46.25 శాతం మాత్రమే ఉంటారా అనేది ఎలా చూడాలి? 1931 జనాభా లెక్కల తరువాత తెలంగాణలో మొదటి కులగణన ఇది. 1931 నాటి లెక్కల అంచనా గానీ, టీఆర్ఎస్ 2014 లెక్కలు గానీ ఇప్పుడు చూడలేము. ఈ లెక్క తçప్పు అని చెప్ప డానికి ఆధారం ఏంది? కొన్ని దశాబ్దాలుగా కుల నాయకులు, మేధా వులు ఇష్టమొచ్చిన లెక్కలు చెప్పుకొంటున్నారు. తెలంగాణ కులాల లెక్కలు విడుదల అయ్యాక కూడా ‘మా కులం గింతేనా?’ అని వాదించడం ఉంటుంది. 1980 దశకంలో మండల్ కమిషన్ దేశంలోని అన్ని శూద్ర కులాలను... రెడ్డి, వెలమ, కమ్మ, కాపులతో సహా – 52 శాతం ఓబీసీలు అని అంచనా వేసింది. ఇప్పుడు రిజర్వేషన్ బయట ఉన్న ముస్లిమేతర ఓసీ కులాలు 13.31 శాతం. అయితే ఓసీలు 7 నుండి 13.31 శాతం ఎలా అయ్యారు అనేది కొందరి ప్రశ్న. అసలు సరిగ్గా వాళ్ళది 7 శాతమే ఉండింది అని పూర్తి సర్వే ఎవరు చేశారు? అదొక ఊహాజనిత సంఖ్య. టీఆర్ఎస్ సర్వే, సర్వే కాదు.ఇకపోతే 2014 నుండి 2025 నాటికి హైదరాబాద్‌కు బయట రాష్ట్రాల నుండి వలస వచ్చిన ఓసీ కులాల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ప్రశ్నపత్రంలోని 31వ పేజీలో అయ్యర్/అయ్యంగార్ నుండి మొదలుకొని వెలమల వరకు అక్షరక్రమంలో 18 కులాల పేర్ల ద్వారా ఎనుమరేషన్ జరిగింది. 2014 ఒక్క రోజు లెక్కల డ్రామాలో కులాల పేర్లు అడుగలేదు. ఎనుమరేటర్లకు కులాల పేర్ల లిస్టు ఇవ్వ లేదు. అలాంటిది ఒక జాతీయ పార్టీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసు కొని జనాభా లెక్కలు తీయిస్తే బీసీ మేధావులే ఇది బూటకపు లెక్క అని ప్రచారం చేస్తే ఎవ్వరికి మేలు జరుగుతుంది? అసలు 2021 నుండి ఇప్పటి వరకు దేశ జనాభా లెక్కలే చెయ్యని బీజేపీకి లాభం చెయ్యడానికే ఈ వాదనంతా పనికొస్తుంది. ఒకవేళ కోర్టుపై ఒత్తిడి తెచ్చి కులజనాభా లెక్కలు తీయిస్తే ఆ లెక్కలను, ఈ లెక్కలను పోల్చి చూడవచ్చు. ముందు తెలంగాణ కులగణన ఆధారంగా కేంద్రం మీద కదా ఒత్తిడి చేయాల్సింది! బీసీల కోసమే చేసిన ఈ కులగణనను తామే నిర్వీర్యం చెయ్యడం సరైంది కాదు.ఈ లెక్కల ఆధారంగా ఆర్థిక రంగంలో, కాంట్రాక్టుల్లో, నిధుల కేటాయింపుల్లో, లోకల్ బాడీల్లో వాటా కావాలి అని అడగటం సమంజసం. తెలంగాణ రాష్ట్ర కులగణన దేశంలోనే రాజ్యాంగ రక్షణ, సామాజిక న్యాయరేటును పెంచడం అనే సిద్ధాంత పోరాటంలో భాగంగా చేసింది. ఇది అన్నింటికంటే కీలకం!ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
ఆయన అనుకున్నదంతా అయ్యేనా?
ఆయుధ బలం, ఆర్థిక బలంతో ఏదైనా సాగించవచ్చునన్నట్లు వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, అదంత తేలిక కాదని నెల రోజులు తిరిగేసరికి అర్థమవుతుండాలి! అమెరికన్లతోపాటు వారి అనుయాయ పశ్చిమ దేశాలను, మొత్తం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ సాగుతున్న ఆయన చర్య లను, అందుకు ఎదురవుతున్న ప్రతిఘటన లను బట్టి ఈ అభిప్రాయం కలుగుతున్నది.అధ్యక్షుని ప్రకటనలను, చర్యలను రెండు విధాలుగా విభజించాలి. అంతర్గతమైనవి, విదేశాంగపరమైనవి. అంతర్గతంగా అన్నీ ఇప్పటికి తను కోరుకున్న విధంగానే జరిగిపోతున్నాయి. కొన్ని చర్యల వల్ల తమ వ్యవసాయ, పారిశ్రామిక, సర్వీస్ రంగాలపైన, గృహావస రాలపైన, సామాజిక సంబంధాలపైన ప్రభావాలు మొదలైనా, నిర సనలు మంద్ర స్థాయిలోనే ఉన్నాయి. ప్రతిపక్షమైన డెమోక్రాట్లలో చలనమే లేదు. ట్రంప్‌కు అడ్డుపడటమంటూ ఏమైనా జరిగితే అది కోర్టుల స్టే ఉత్తర్వుల వల్లనే. నష్టపోతున్న వారిలో ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా), ‘అమెరికా ఫస్ట్’ నినాదాలకు ఆకర్షితులై భారీగా ఓటు చేసిన తరగతుల వారు కూడా ఉన్నారనీ, వారికి ఇప్పటికే పనులూ, ఫెడరల్ ఉద్యోగాలు పోతుండటం, ధరల పెరుగు దల వంటి సమస్యలు ఎదురవుతున్నాయనీ వార్తలు చెప్తున్నాయి. ఆ వర్గాల నుంచి వ్యతిరేకత పెరిగితే తప్ప ట్రంప్ తన అంతర్గత విధా నాలను సవరించుకోకపోవచ్చు.బయటి నిరసనలుఅంతర్గతంగా ఎట్లున్నా, బయటి ప్రపంచానికి విదేశాంగ విధానాలే ప్రధానమవుతాయి. విదేశాంగ విధానాలకు మూలం ఆంతరంగిక పరిస్థితులు, ప్రయోజనాలతో ఉండటం నిజమే అయినా, బయటివారికి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేది ముఖ్యమవుతుంది. ఆ విధంగా చూసినపుడు ఈ 40 రోజులలో కనిపిస్తున్నది ఏమిటి?ట్రంప్ మొదట చేసిన భౌగోళిక సంబంధమైన ప్రకటనలు పనామా కాలువ స్వాధీనం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చటం, గ్రీన్‌ల్యాండ్ ఆక్రమణ, కెనడాను ఆర్థిక ఒత్తిడితో అమె రికాలో విలీనం చేసి 51వ రాష్ట్రంగా మార్చటం. ఈ అంశాలలో జరి గిందేమిటి? పనామా బలహీన దేశం. అయినా వారి కాలువను స్వాధీనపరచుకోలేక పోయారు. కానీ ఆ కాలువ ద్వారా ప్రయాణించే అమెరికన్ నౌకలపై సుంకాల రద్దుకు అంగీకరించారన్నది అమెరికా చేసిన ప్రకటన. అది నిజం కాదన్నది పనామా ప్రభుత్వ ఖండన. కాలువపై చైనా నియంత్రణ ఉందన్నది ట్రంప్ ఆరోపణ కాగా, అది నిజం కాదని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కాకపోతే అమెరికా ఒత్తిడిని తట్టుకోలేక చైనా నిర్వహిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి పనామా ఉపసంహరించుకున్నది. ఆ ప్రాజెక్టులో చేరిన మొట్ట మొదటి లాటిన్ అమెరికన్ దేశం పనామాయే.అదే ప్రాంతపు మెక్సికో, తమ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చటాన్ని బలంగా తిరస్కరించింది. ఐక్యరాజ్య సమితి గుర్తించింది కూడా పాత పేరునే. ఇపుడు ట్రంప్ కొత్త పేరు పెట్టి ఉత్తర్వులు జారీ చేసినా, యూరోపియన్ దేశాలు సైతం ఆమో దించటం లేదు. మెక్సికో ఆర్థికంగా అమెరికాపై ఎంత ఆధారపడినా ట్రంప్ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తున్నది. ఆయన ఏమీ చేయలేక మౌనం వహించారు. గ్రీన్‌ల్యాండ్ మరొక బలహీన దేశం. కానీ డెన్మార్క్ పరిధిలో స్వయంప్రతిపత్తి గలది. ట్రంప్‌కు కావలసింది అక్కడి విస్తారమైన వనరులు. ఆ ప్రాంతం కీలక ప్రదేశంలో ఉన్నందున తమ రక్షణ వ్యూహాలకు అవసరం. కానీ అమెరికాకు అమ్మకం అయేందుకు గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్ సమ్మతించలేదు. డెన్మార్క్ యూరప్ దేశమైనందున మొత్తం యూరప్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. గ్రీన్‌ల్యాండ్‌లో ఇప్పటికే అమెరికా సైనిక స్థావరాలు ఉన్నందున వాటి విస్తర ణకు, సహజ వనరులపై ఒప్పందాలకు మాత్రం గ్రీన్‌ల్యాండ్ రాజీ పడుతున్న సూచనలున్నాయి. యూరప్ మద్దతు లేనట్లయితే ఆ చిన్న దేశంపై ట్రంప్‌దే రాజ్యమయ్యేది.అమెరికాకు సరిహద్దున ఉండటమేగాక అన్నివిధాలైన సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, ట్రంప్ అంటున్న 51వ రాష్ట్రపు మాటను కెనడా ఛీత్కరిస్తున్నది. 25 శాతం సుంకాలకు బెదరక అదే స్థాయిలో ఎదురు సుంకాలు ప్రకటించింది. ప్రజలలో జాతీయాభిమానం ఎగసి రాగా వారు అమెరికన్ ఉత్పత్తుల కొనుగోలును తగ్గించి వేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. బలమైన మద్దతుగల గ్రీన్‌ల్యాండ్ వలెనే, స్వయంగా బలమైన కెనడా విషయంలోనూ ట్రంప్ స్వేచ్ఛా ధోరణి నెరవేరటం లేదన్నమాట.బుల్డోజర్ పథకం సాగేనా?ఇంచుమించు ఇటువంటిదే గాజా విషయం. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు స్వతంత్ర దేశాలు కావాలన్న అమెరికా విధానంలో నిజాయితీ లేకున్నా నోటి మాటగా అంటూ వస్తూ, ఇపుడు తిరిగి అధికారానికి వచ్చినాక దానిని అకస్మాత్తుగా వదలివేసిన ట్రంప్, గాజాను తామే ఆక్రమించి బీచ్ రిసార్టుగా మారుస్తామన్నారు. ఆ రియల్ ఎస్టేట్ మాటను పాలస్తీనియన్లే గాక మొత్తం అరబ్ రాజ్యాలు, యూరోపియన్ యూనియన్, తక్కిన ప్రపంచం, ఐక్యరాజ్యసమితి వెంటనే కొట్టివేశాయి. అయినప్పటికీ తన పంతం వీడని ట్రంప్, తమపై బాగా ఆధారపడి ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌లను ఒత్తిడి చేసి గాజా ప్రజలను, బహుశా తర్వాత వెస్ట్ బ్యాంక్ పాల స్తీనియన్లను కూడా ఆ దేశాలకు తరలించేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ ఆయన ఎంతో ఆశలు పెట్టుకున్న ఈజిప్ట్, జోర్డాన్‌ల సొంత ఆలోచనలు ఏవైనా అక్కడి ప్రజాభిప్రాయానికి, తక్కిన అరబ్ ప్రపంచం ఆగ్రహానికి భయపడి అందుకు అంగీకరించలేదు. కీలకమైన పాత్ర వహించే సౌదీ అరేబియా వెంటనే తిరస్కరించగా, ఆ తర్వాత అరబ్ విదేశాంగ మంత్రులు, గల్ఫ్ కో ఆర్డినేషన్ కౌన్సిల్ సమావేశమై అదే వైఖరి తీసుకున్నారు. దానితో, తాము చెప్పిన దానికన్న మెరుగైన ప్రతిపాదన ఉంటే సూచించాలని అరబ్ దేశాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇపుడు కోరు తున్నారు. గాజా ప్రజలు తమ మాతృభూమిలోనే నివసించే విధంగా పునర్నిర్మాణ పథకాన్ని, పాలస్తీనా స్వతంత్ర దేశ పథకాన్ని అరబ్ దేశాలు ఇంచుమించు రూపొందించాయి. ఆ విధంగా అమెరికా అధ్యక్షుని బుల్డోజర్ ఉధృతి అక్కడ సాగబోవటం లేదు. ఈ పరి ణామాల దరిమిలా, తాము, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌ను ధ్వంసం చేయటం, లొంగ దీసుకోవటం జరగవచ్చునా అన్నది వేచి చూడ వలసిన ప్రశ్న అవుతున్నది.ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ చేస్తున్నదేమిటో రోజూ వార్తలు వెలువడుతున్నాయి. తాము, యూరప్ కలిసి ఉక్రెయిన్ను మూడేళ్లుగా నిలబెట్టలేక పోవటంతో, వ్యక్తిగతంగా వ్యాపార ధోరణి గల ట్రంప్ ఇప్పుడు రెండువైపుల నుంచి ప్రయోజనాలు పొందే వ్యూహం వైపు మారారు. ఉక్రెయిన్ను, యూరప్‌ను దారికి తెచ్చుకుని ఉక్రెయిన్‌లోని లోహాలు, ఖనిజాలను సంపాదించటం; బలమైన రష్యాతో ఆర్థిక, ఇతర సంబంధాల మెరుగుదల. ఎటూ గెలవలేని యుద్ధంలో ఆ విధంగా ఉక్రెయిన్, యూరప్, తనను కాదని చేయగలిగింది కూడా లేని బలహీనులు కావటం వల్ల వారిని దారికి తేగలుగుతున్నారు. దీనినిబట్టి అర్థమయే దేమిటి? పనామా, కెనడా, గాజా, ఉక్రెయిన్, యూరప్ వంటివి వేర్వేరు విధాలైన కేసులు. మొత్తం మీద తన పాలన రెండవ నెలలో ప్రవేశించే సరికే అమెరికా అధ్యక్షుడు ఇన్నిన్ని అనుభవాలు గడించటం బహుశా మరెవరి విషయంలోనూ జరిగి ఉండదు. ఆయనతో ప్రపంచ అనుభవాలు కూడా అటువంటివే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఏఐపై నియంత్రణ ఎలా?
కృత్రిమ మేధ అభివృద్ధి వడివడిగా సాగుతోంది. రెండు మూడేళ్ల క్రితం మొదలైన ఛాట్ జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లకు డీప్‌సీక్ రూపంలో చైనా కంపెనీ సవాలు విసిరింది. ఇదే సమయంలో ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ ఎలా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ప్యారిస్‌లో ఇటీవలే ముగిసిన ఏఐ శిఖరాగ్ర సమావేశంలోనూ ఈ అంశం ప్రబలంగా వినిపించింది. దౌత్య వేత్తలు, రాజకీయనేతలు, టెక్ కంపెనీ సీఈవోలు పాల్గొన్న ఈ సమా వేశానికి భారత్, ఫ్రాన్స్ ఉమ్మడిగా అధ్యక్ష స్థానాన్ని వహించాయి. అయితే ఏఐ టెక్నాలజీల నియంత్రణ విషయంలో ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాకపోయింది సరికదా... అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత మారిన రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టేలా బోలెడన్ని విభేదాలు బయటపడ్డాయి. ప్రభావరీత్యా చూస్తే గతంలో మనం సాధించిన టెక్నాలజీ ఘనతల కంటే ఏఐ భిన్నమైనది. అందుకే ప్రధాని మోదీ ఏఐ నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో సమష్టి ప్రయత్నం జరగాలనీ, ప్రమాణాల నిర్ధారణతో పాటు, మానవీయ విలువల పతనం జర క్కుండా, ప్రమాదాలను నివారించేలా, నమ్మకం పెంచేలా చూడాలనీ పిలుపునిచ్చారు. పొంచివున్న ప్రమాదాలుఈ సమష్టి బాధ్యత కార్యాచరణలో తొలి అడుగుగా ఈ సమావేశం ‘ఇన్‌క్లూజివ్ అండ్ సస్టెయినబుల్ ఏఐ’ అనే దౌత్యపరమైన ప్రక టనను చేర్చింది. అయితే ఏఐ రంగంలో అగ్రగాములుగా ఉన్న రెండు దేశాలు యూఎస్, యూకే ఈ డిక్లరేషన్‌పై సంతకాలకు నిరాకరించాయి. ఏఐలో వినూత్న, సృజనాత్మక ఆవిష్కరణలకు సాయం చేసే అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థ అవసరమనీ, ఏఐని గొంతు నొక్కేది కాదనీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్స ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు ఆ ప్రకటన జాతీయ భద్రతపై ఏఐ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని యూకే భావించింది. శిఖరాగ్ర సమావేశం ముగిసే సమయానికి ఏఐ భద్రత, నియంత్రణ విషయంలో ప్రపంచం రెండుగా విడిపోయింది!కృత్రిమ మేధ చాలా ఏళ్ల నుంచే మనకు పరిచయం. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు జనరల్ పర్పస్ ఏఐ అందు బాటులోకి వచ్చేలా చేసింది. ఈ జనరల్ పర్పస్ ఏఐ టూల్స్ రక రకాల పనులు చేయగలవు. ఏఐ ఏజెంట్లు స్వతంత్రంగా కంప్యూ టర్లను ఉపయోగించుకుని ప్రాజెక్టులు పూర్తి చేయగలవని ప్యారిస్ లోనే విడుదలైన ఒక నిపుణుల నివేదిక స్పష్టం చేయడం గమనించాల్సిన అంశం. ఈ సామర్థ్యం ఒకరకంగా వరం, ఇంకో రకంగా శాపం. భారత్, ఇతర దేశాలకు చెందిన స్వతంత్ర టెక్నాలజీ నిపు ణులు ఈ నివేదికను సిద్ధం చేశారు. ఏఐతో వచ్చే ప్రమాదాలు కొన్నింటి గురించి మనకు ఇప్పటికే తెలుసు. స్కాములకు ఉపయోగపడటం వీటిల్లో ఒకటి. అనుమతు ల్లేకుండా సున్నితమైన విషయాల ఫొటోలు తీయడం, కొంతమంది ప్రజలు, లేదా అభిప్రాయాలకు వ్యతిరేకంగా వివక్ష, వ్యక్తిగత గోప్య తకు భంగం, విశ్వసనీయత వంటివి ఏఐ తీసుకొచ్చే ప్రమాదాల్లో కొన్ని మాత్రమే. ఉద్యోగాల కోత, ఏఐ ఆధారిత హ్యాకింగ్, బయలా జికల్ దాడులు కూడా సాధ్యమని ప్యారిస్‌లో విడుదలైన ‘ఏఐ సేఫ్టీ రిపోర్టు’ స్పష్టం చేసింది. కొన్ని ఏఐ మోడళ్లను పరీక్షించే క్రమంలో అవి జీవ, రసాయన ఆయుధాలను పునరుత్పత్తి చేయగలవనీ, సరికొత్త విష పదార్థాలను డిజైన్ చేసేందుకు సాయపడగలవనీ తెలిసింది.ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ కావాలంటే... ముందుగా వాటితో వచ్చే ప్రమాదాలపై స్పష్టమైన అంచనా ఉండాలి. అలాగే ఆ ప్రమాదాలను అధిగమించేందుకు, పరిశీలించేందుకు ఉన్న మార్గాలూ తెలిసి ఉండాలి. ఇది చాలా పెద్ద పనే. ఈ వ్యవస్థలను అటు వైద్య పరికరాల్లో, ఇటు సాఫ్ట్వేర్ అభివృద్ధిలో, ఇంకోవైపు ఛాయాచిత్రాలను సృష్టించడంలో వాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏఐ డెవలపర్లకు గానీ, వినియోగదారులకు గానీ ఈ ఏఐ వ్యవస్థలను పూర్తిస్థాయిలో ఎలా వాడుకోవచ్చో తెలిసే అవకాశాలు తక్కువ. ఫలితంగా ఏఐ టెక్నాలజీల నియంత్రణ ఒక సవాలుగా మారుతుంది. జనరల్ పర్పస్ ఏఐలో మార్పులు ఊహించలేనంత వేగంగా జరిగిపోతున్న నేపథ్యంలో విధాన రూపకర్తలు, నియంత్రణ చేసేవారికి కూడా ఏఐ ప్రమాదాలకు సంబంధించిన సాక్ష్యాలు వెతుక్కోవడమూ కష్టమవుతుందని ఏఐ సేఫ్టీ రిపోర్టు తెలిపింది. ఏతావతా, ఏఐ నియంత్రణను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు. నియంత్రణా? సృజనా?ఏఐ ఇప్పుడు ఓ పాత చర్చను మళ్లీ లేవనెత్తింది. సృజన, నియంత్రణలో ఏది అవసరమన్న చర్చపై ప్యారిస్ సమావేశంలోనే అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. సృజనను అడ్డుకుంటుందంటే ఏ టెక్నా లజీ నియంత్రణనూ తాము అనుమతించబోమని తెలిపింది. ఏఐ విషయంలో పోటీ పడుతున్న టెక్ కంపెనీల వైఖరి కూడా ఇదే. భారత్ కూడా చిన్న మార్పుతో విషయాన్ని అంగీకరించింది. ప్రధాని మోదీ ‘పాలన అంటే కేవలం ప్రమాదాలను మేనేజ్ చేయడం కాదు. సృజనాత్మకతను ప్రోత్సహించడం, దాన్ని విస్తృత ప్రయోజనాల కోసం ఉపయోగించడం’ అని అనడంలో ఈ తేడా స్పష్టమవుతోంది. ట్రంప్ అధ్యక్షతన మళ్లీ శిలాజ ఇంధనాల వైపు మళ్లే ఆలోచన చేస్తున్న అమెరికా... ప్యారిస్ సమావేశం సిద్ధం చేసిన సస్టెయినబిలిటీ స్టేట్ మెంట్‌పై సంతకం చేయలేదు. ఎందుకంటే ఏఐ అభివృద్ధికి చాలా విద్యుత్తు అవసరమవుతుంది. ఏఐ వ్యవస్థలను పెద్ద స్థాయిలో ఉపయోగించడం మొదలుపెడితే శిలాజ ఇంధనాలకు దూరంగా వెళ్లేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు గండిపడినట్లే! వాతావరణ మార్పులకూ, ఏఐకీ మధ్య సంబంధం ఏమిటంటే... ఇదేనని చెప్పాలి. టెక్నాలజీకీ, నియంత్రణకూ మధ్య ఉన్న సంబంధం కూడా చాలా పాతదే. గతంలో చాలా టెక్నాలజీల విషయంలో నియంత్రణ అవసరమైంది. స్టెమ్ సెల్ పరిశోధన, క్లోనింగ్, జీనో ట్రాన్స్సప్లాంటేషన్ (జంతు అవయవాలను మనుషులకు అమర్చడం), ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి అనేక టెక్నాలజీలకు నియంత్రణ అవస రమైంది. అయితే ఏఐ వీటన్నింటి కంటే భిన్నమైంది. ఇది ఒక టెక్నాలజీ కాదు. వేర్వేరు టెక్నాలజీలు, అప్లికేషన్ల సమ్మేళనం. కాబట్టి వీటిల్లో దేన్ని నియంత్రించాలన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. రెండో కీలకమైన ప్రశ్న ఎవరిని నియంత్రించాలి అన్నది! టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థనా? టెక్నాలజీ సాయంతో అప్లికేషన్లు అభివృద్ధి చేసేవారినా? వాటిని వాడే వారినా? ఇవన్నీ అస్పష్టమైన అంశాలు. ఇంటర్నెట్ ఆధారిత కంటెంట్‌కు సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రశ్నలే ఏఐ విషయంలోనూ వస్తున్నాయి. మూడు సూత్రాలు1942లో ప్రసిద్ధ సైన్స్‌ఫిక్షన్ రచయిత ఐజాక్ అసిమోవ్ రోబోటిక్స్‌కు సంబంధించి మూడు సూత్రాలను ప్రతిపాదించారు. ‘మనిషిని రోబో గాయపరచకూడదు’ అన్నది తొలిసూత్రం. మనిషి ఇచ్చే ఆదేశాలను పాటించాల్సిందిగా రోబోలకు చెబుతూనే, తొలి సూత్రానికి విరుద్ధంగా ఉండే ఆదేశాలను పాటించవద్దని రెండో సూత్రం స్పష్టం చేస్తుంది. చివరిదైన మూడో సూత్రం ప్రకారం, ఒక రోబో తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి; ఎప్పటివరకూ అంటే, తొలి రెండు సూత్రాలకూ విరుద్ధం కానంత వరకు! ఈ మార్గదర్శక సూత్రాల ఆధారంగా ఏఐ టెక్నాలజీలకు వర్తించే కొన్ని విస్తృత సూత్రాలను నిర్ణయించడం, ఎప్పటికప్పుడు ఈ టెక్నా లజీ ద్వారా వచ్చే లాభాలు, ప్రమాదాలను బేరీజు వేస్తూండటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్స అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అత్యవసరంగా నేర్చుకోవాల్సింది!
రాజకీయ నాయకుడి సత్తా ఏమిటో గుర్తించాలంటే వాళ్లు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో గమనించాలి. పార్టీ, కుటుంబం, లేదా వ్యక్తిగతమైన తప్పులను ఒప్పుకొంటారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు ఇది మరీ ముఖ్యమవుతుంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ... ఆ మాటకొస్తే ఆయన కుటుంబం, నాయనమ్మ కూడా బలహీనులనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం కార్నెల్ యూనివర్సిటీలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థికవేత్త కౌశిక్ బసు ఎమర్జెన్సీ గురించి రాహుల్ గాంధీని ఒక ప్రశ్న వేశారు. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ‘పొర బాటు’గా అభివర్ణించారనీ, ‘‘కాంగ్రెస్ పార్టీ ఏ దశలోనూ దేశంలోని వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం చేయలేదనీ’’ రాహుల్ వివరించారు. రెండు విషయాల్లోనూ రాహుల్ తప్పే చెప్పారు. ఎందుకంటే, అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు సుమారు లక్ష మందిని అరెస్ట్ చేసింది. పత్రికలపై నిషేధాజ్ఞలు విధించారు. న్యాయ, అధికార వ్యవస్థలను ఇష్టారీతిన వాడుకున్నారు. అత్యంత దారుణమైన రీతిలో రాజ్యాంగాన్ని మార్చేశారు. అçప్పుడు ఆయనకు ఐదేళ్లు అయినప్పటికీ, రాహుల్ గాంధీ ఇవన్నీ తెలుసుకొని ఉండాలి!వ్యూహాత్మక సమర్థనలుఅత్యవసర పరిస్థితిని ‘పొరబాటు’ అని ఇందిరా గాంధీ అన్నారనడం కూడా అబద్ధమే. ఆమె స్వయంగా దానికి బాధ్యత వహించారు. అందులో సందేహం లేదు. ఆ తరువాత జరిగిన ఎన్ని కల్లో ఘోరంగా ఓడిపోయారు. కానీ దాన్ని ‘పొరబాటు’ అన్నారనడం అవాస్తవం. ఎమర్జెన్సీ అకృత్యాలను సమర్థించుకునేందుకు ఇందిర రకరకాల ఎత్తులు పన్నారు. ఆమె మాటల్లో దానిపట్ల సమర్థింపే కనిపించేది. ఇందిరా గాంధీ అనుసరించిన వ్యూహాల్లో ఒకటి, అవసరానికి మించి జరిగిన ఘటనను అంగీకరించడం. 1978 జూలైలో మేరీ కరాస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘పత్రికలను అణచివేయడం మరీ గట్టి చర్య’’ అని వ్యాఖ్యానించారు. ఇంకోలా చెప్పాలంటే, కట్టడి చేసేందుకు ఇంకొంచెం తేలికైన పద్ధతి ఉంటే బాగుండేదని అర్థం.అంతేతప్ప, పత్రికలను నియంత్రించడం పొరబాటైతే కాదు.ఇంకో వ్యూహం ఉంది. ఇతరులు తప్పులు చేశారు... నేను మాత్రం వాటికి బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పడం. 1978 జనవరి 24న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఇందిరా గాంధీ యవ త్మాల్ (మహారాష్ట్ర)లో ఇచ్చిన ఒక ప్రసంగంపై కథనాన్ని ప్రచురించింది. ‘‘తప్పులు చేసిన ఇతరులు తమ అతిని ఒప్పుకొనేందుకు సిద్ధంగా లేరు. నేను మాత్రం జరిగిన తప్పులకు బాధ్యత తీసుకుంటున్నాను’ అని ఇందిరాగాంధీ చెప్పారు’’ అని ఉంది అందులో.ఇక మూడో వ్యూహం: ఏ రకమైన తప్పులు జరిగినా వాటిని చాలా చిన్నవిగా చూపించి ఒప్పుకోవడం. మేరీ కారస్ ఇంట ర్వ్యూలోనే ఇందిరా గాంధీ ‘‘రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకోవడం, పత్రికా స్వాతంత్య్రాన్ని హరించడం మినహా అసాధార ణమైనవి ఏవీ లేవు’’ అని వ్యాఖ్యానించారు. తుర్క్‌మాన్ గేట్ (ఢిల్లీ) వద్ద కొంతమంది మరణించిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు, ‘‘హింస జరగలేదు... అవి ఒకట్రెండు విడి ఘటనలు’’ అని తేల్చే శారు. దేశ ప్రజలందరినీ ఆందోళనకు గురి చేసిన బలవంతపు కుటుంబ నియంత్రణ కూడా పెద్దగా జరగలేదంటారు ఇందిర. ‘‘తప్పుడు ప్రచారమే మమ్మల్ని ఓడించింది. అలాగని మేమేమీ తప్పులు చేయలేదని అనడం లేదు. అయితే వాటిని కొండంత చేసి చూపించారు. బలవంతపు కుటుంబ నియంత్రణ విషయంలోనూ ఇదే జరిగింది. విషయాలను వాళ్లు ఎట్లా ప్రచారం చేస్తారంటే... చెప్పాలంటే నా దృష్టిలో అవి అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లే కాదు. ప్రచారం మాత్రమే. వారు చెప్పేంత స్థాయిలో జరగలేదు. కొన్ని కేసులున్నాయి కానీ... చాలా కేసుల గురించి వాకబు చేసిన ప్పుడు తప్పని తేలింది’’ అని ఇందిర 1978 మార్చి 26న పాల్ ఆర్ బ్రాస్‌తో జరిపిన సంభాషణలో స్పష్టం చేశారు. ఇప్పటివరకూ చెప్పుకొన్న ప్రతి అంశంలోనూ ఇందిరాగాంధీ కొన్ని నిర్దిష్ట అంశాల గురించి అంటే... నిషేధాజ్ఞలు, అరెస్టులు, తుర్క్‌మాన్ గేట్, బలవంతపు కుటుంబ నియంత్రణ వంటి వాటి గురించి మాట్లాడారే కానీ... అత్యవసర పరిస్థితి గురించి నేరుగా మాట్లాడలేదు. అత్యవసర పరిస్థితిలోంచి ఈ తప్పులను వేరుగా చూపే ప్రయత్నం చేశారు. దీన్నిబట్టే అత్యవసర పరిస్థితి విధింపుపై ఇందిరా గాంధీకి ఎలాంటి ఇబ్బందీ లేదన్నది ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. క్షమాపణ చెప్పలేదు!1978 జనవరి 24న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం, అత్యవసర పరిస్థితి సమయంలో ఇతరులు చేసిన తప్పులు, అక్రమాలకు ఇందిరా గాంధీ బాధ్యత వహిస్తూనే, ‘‘ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో దేశంలోని పరిస్థితి ఏమిటో ఆలోచించాలి’’ అని శ్రోతలను కోరారు. ‘‘అన్నివైపులా గందరగోళం నెలకొని ఉండింది. పరిస్థితి అలాగే కొనసాగి ఉంటే భారత్ పరిస్థితి బంగ్లా దేశ్లా అయ్యేదని వ్యాఖ్యానించారు.’’ ‘‘రోగానికి చికిత్స చేసేందుకు ఇచ్చిన ఔషధమే ఎమర్జెన్సీ’’ అని అన్నారు.ఎమర్జెన్సీకి సంబంధించి మీరేదైనా భిన్నంగా చేసేవారా? అని పాల్ బ్రాస్ అడిగినప్పుడు ఇందిర ఇచ్చిన సమాధానం ‘లేదు’ అని. సూటి ప్రశ్నకు వచ్చిన మొట్టమొదటి స్పందన అది. ఆ తరువాత... ఎమర్జెన్సీ కష్టాలను, బాధలను ‘వ్యక్తిగతంగా’ చూడలేకపోవడం తన తప్పు అని అన్నారు. ‘‘నా తప్పేమిటి అంటే... ఆ విషయాలను వ్యక్తిగతంగా చూడకపోవడం, చర్చించకపోవడం.’’ ఇవీ ఆమె మాటలు!కాబట్టి విషయమైతే స్పష్టం. ఎమర్జెన్సీ ఒక పొరబాటు అని ఇందిరా గాంధీ ఎప్పుడూ అనుకోలేదు. అందుకు క్షమాపణ కూడా చెప్పలేదనడం నిస్సందేహం. 1977 ఎన్నికల్లో ఓటమికి బాధ్యతను మాత్రం అంగీకరించారు. దానికి అతిపెద్ద కారణం ఎమర్జెన్సీ అన్నారే గానీ, అది తప్పు అని మాత్రం అనలేదు. నా పరిశోధనలో ఎంతో సాయం చేసిన, ఇందిరా గాంధీ ఆత్మకథ రాసిన సాగరికా ఘోష్ కూడా దీనితో ఏకీభవిస్తారు. ఎమర్జెన్సీ విధించడం తప్పు అని ఇందిరా గాంధీ అన్న దాఖలా నాకు ఎక్కడా కనిపించలేదు.మౌలికంగా భిన్నమా?ఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థల్లో తనవాళ్లను ప్రవేశపెడుతోందని ఇప్పుడు ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ... ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రవర్తన మాత్రం ‘మౌలికంగా భిన్నం’ అంటారు. ఇది కూడా తప్పే. అప్పట్లో ఓ జూనియర్ న్యాయమూర్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా చేయడంతో హెచ్.ఆర్.ఖన్నా రాజీనామా చేయాల్సి వచ్చింది. హోంశాఖ కార్యదర్శి నిర్మల్ ముఖర్జీ వంటి నిబద్ధత కలిగిన అధికారులను పదవుల నుంచి తప్పించారు. రాహుల్ గాంధీ ఎక్కడ పప్పులో కాలేశారో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితినీ, ఎమర్జెన్సీ పరిస్థితినీ వేరుగా చూపాలని ఆయన భావించారు. తద్వారా ఇప్పటితో పోలిస్తే అప్పటి పరిస్థితి మెరుగు అన్న భావన కల్పించాలని అనుకున్నారు. అందుకే ‘‘కాంగ్రెస్ పార్టీ ఏ రోజూ వ్యవస్థలను వశపరచుకోవాలని అనుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు. ఇంకో అంశం... ఎమర్జెన్సీని నానమ్మ ‘పొరబాటు’ అన్నారని చెప్పడం ద్వారా ఆ అంశంపై మరిన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురు కాకుండా జాగ్రత్తపడ్డారు. చర్చను ముగించేందుకుగానూ, కొంత నష్టపోవడం అన్నమాట. అయితే రాహుల్ మాటలు అప్పట్లోనే వివాదాన్ని సృష్టించాయి. ఆయన జ్ఞానం, తీర్పరితనం, నిజాయితీ, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం... అన్నింటిపై సందేహాలు వచ్చాయి. ఈ విషయాలన్నింటిలోనూ ఆయన చాలా తేలికగా ఓడి పోయారేమో అనిపిస్తుంది. ఇదో గూగ్లీ అనుకుంటే రాహుల్ బౌల్డ్ అయ్యారు. దీన్ని ఒక పరీక్షగా అనుకుంటే రాహుల్ దీంట్లో పాస్ కాలేదు. జనాలను ఆకట్టుకోవాలన్నది రాహుల్ ఉద్దేశమైతే అది కూడా జరగలేదు. రాహుల్ ఈ దేశ ప్రధాని అయితే... ఇబ్బంది కరమైన పరిస్థితులను, మరీ ముఖ్యంగా తన కుటుంబ గత చరిత్ర గురించి ఎదుర్కోవడం ఎలాగో ఏదో ఒక రోజు కచ్చితంగా నేర్చు కోవాల్సి ఉంటుంది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Secunderabad Railway Station: జ్ఞాపకాల స్టేషన్
‘నూటా ఏభై ఏళ్ళ క్రితం, నిజాం రాజు మహబూబ్ అలీ ఖాన్ కట్టించిన సికింద్రాబాదు రైల్వే స్టేషన్ భవనం జమీన్ దోస్త్’. పేపర్లో ఈ వార్త చదివి, అనుకోకుండా అర శతాబ్దం వెనక్కెళ్ళాను నేను. ఎలాగా..? పాఠశాల విద్యార్థి దశ రోజులు. వేసవి సెలవులు ఊళ్ళో పూర్తి చేసుకుని బొంబాయికి తిరుగు పయనం ఆ రోజుల్లో సికింద్రాబాదు స్టేషన్ నుండే!మా ఊరు దాచారం. ఈ స్టేషన్‌కి 115 కి.మీ. దూరం. ఊరినుండి ఒకే ఒక ప్రైవేటు బస్సు ఉదయం 6 గంటలకు బయల్దేరి భువనగిరికీ, అటునుండి ప్యాసింజర్ రైలెక్కితే పగటి పూట ఏ ఒంటిగంటకో సికింద్రాబాదు స్టేషన్‌కూ చేరుకునే వాణ్ణి అమ్మా నాన్నలతో (ఒకో సారి బంధువులతో). రాత్రి 8 గంటలకు బాంబే ఎక్స్‌ప్రెస్. అప్పటి వరకు మా మకాం, ఇప్పుడు నేలమట్ట మవుతున్న ఈ విశాల ప్రాంగణంలోనే. 1వ నంబర్ ప్లాట్‌ఫారంకు ఆనుకుని ఉండే ఈ విశాల భవంతి మూడు ప్లాట్ ఫారాలకు ముఖ్య ద్వారం. వచ్చీ పోయే ప్రయాణికులతో అది హమేషా హడావుడి. హాలుకు కుడివైపు బుకింగ్ కౌంటర్లు, ఎడమ వైపు ఖాళీ స్థలం. ఆ ఖాళీ స్థలం మాలాంటి గరీబ్ బాటసారులకు విడిది.అక్కడే లగేజి దించి, వెంట తెచ్చుకున్న విస్తరిలోని చద్దన్నం తలా ఇంత తినేసి పెద్ద వాళ్ళు అలా లగేజికి ఆనుకుని నడుం వాల్చి పడుకుంటే, నేనేమో ఆ ప్రాంగణం అంతా, దానికి దగ్గరున్న మూడు ప్లాట్ ఫారమ్‌లు కలియ తిరుగుతూ... కనిపించే బుక్ స్టాల్‌లోని ‘విజయ చిత్ర’, ‘సినిమా రంగం’ లాంటి సినీ పత్రికలు తీసి ఓ రెండు మూడు నిమిషాలు తిరగేసి మళ్ళీ పెట్టేసేవాణ్ణి (డబ్బులు ఉండేవి కాదు మరి కొనటానికి). ప్లాట్ఫారం గుమ్మాలకు అతికించిన అలనాటి ‘అంతస్తులు’, ‘ధర్మదాత’, ‘కథానాయకుడు’, ‘అదృష్ట వంతులు’, ‘గూఢచారి 116’, ‘వీరాభి మన్యు’ లాంటి తెలుగు సినిమా పోస్టర్లను... వచ్చినప్పుడల్లా అలాగే చూస్తూ నిలుచోవటం ఇప్పటికీ గుర్తే (అవి ముంబాయి వీధుల్లో కనిపించేవి కాదు).ఇదీ చదవండి: ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్ చేసిన పీఎం మోదీఇక అడపా దడపా తెలుగు ప్రాంతాల నుండి వచ్చే రైళ్ళలోని ప్రయాణికుల కోలాహలం, వారి కట్టూ–బొట్టు, మాటల యాస ఆసక్తితో గమనించే వాణ్ణి. అదో తీయని దృశ్యం. బంబయ్యా కా హిందీ లానే మన తెలుగునూ ఇక్కడ మనం మాట్లాడేది. కాని తెలుగునాట ఎన్ని యాసలో, ఆ స్టేషన్లోనే విన్నాను! ఆధునీకరణ పేరుతో ఇది ఇప్పుడు జమీన్ దోస్త్ అవుతున్నా... ఈ వయసులోనూ నా మనో ఫలకంపై భద్రంగానే ఉంది. – జిల్లా గోవర్ధన్, మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై -
Ukraine War ఈ యుద్ధంలో అంతిమ విజయం అమెరికాదే?
గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో అమెరికా ఆధ్యక్షుడు ట్రంప్ 90 నిమిషాలపాటు పుతిన్‌తో టెలీ ఫోనులో సంభాషించిన తర్వాత శాంతి చర్చల ప్రారంభానికి సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను ఎన్నుకొన్నారు. అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ నాయకత్వంలో ఫిబ్రవరి 18 తేదీన మంతనాలు జరిపి తొందరలోనే ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించాలనుకొన్నారు. ట్రంప్ మాత్రం ఈ సంప్రదింపులలో పాల్గొనవలసిందిగా అటు ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని గానీ, ఇటు యూరప్ దేశా లను కానీ ఆహ్వానించక పోవటంతో పారిస్‌లో పోటీగా శాంతిచర్చలకు యూరప్‌లోని ప్రధాన దేశాధినేతలు సమావేశమవ్వటంతో ఒక్కసారిగా నాటో దేశాల మధ్య ఆధిక్యత బయటపడింది. యుద్ధాన్ని ఆపితే ప్రతిఫలంగా కొన్ని తాయిలా లను ట్రంప్ రష్యాకు ఇస్తానన్నారని అనధికార వార్తలు వస్తున్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి ఉక్రెయిన్‌కు భవి ష్యత్తులో నాటో సభ్యత్వం ఇవ్వరు. అలాగే ఇప్పటి వరకూ యుద్ధంలో రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రె యిన్ ప్రాంతం, లోగడ తీసుకొన్న క్రిమియా భాగం రష్యా ఆధీనం కిందకు వస్తుంది. అమెరికా, ఉక్రెయిన్లు ఈ ప్రాంతాల్ని దౌత్యపరంగా గుర్తించాలి. రష్యా ఆధీనంలో ఉన్న భూభాగంలోని 50,000 కోట్ల డాలర్ల విలువ చేసే లిథియం, టైటానియం నిక్షేపాలను అమె రికా పొందుతుంది. పశ్చిమాసియాలో రష్యా అమెరి కాలు ఒకరికొకరు మద్దతునిచ్చుకొని అవసరమైతే చైనా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేయవచ్చు. పాలస్తీనియన్లను గాజా నుండి పారదోలటంలోనూ, ఇరాన్‌పై యుద్ధం చేస్తే రష్యా మద్దతును పొందడానికే ట్రంప్ ప్రయత్నం చేయవచ్చు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చి, ఉక్రెయిన్, అమెరికా వలసవాద దేశం కాజాలదన్నాడు. ట్రంప్ విధానాలు యూరప్‌పై దాడిగా ప్రముఖ యూరప్ పత్రికలు రాశాయి. ఈ విధానాలు ‘ట్రాన్స్ అట్లాంటిక్ కూటమి’ పతనానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించాయి. యూరప్ భద్రతా సవాళ్లను చర్చించి మిలిటరీ పరంగా యూర ప్ దేశాలు తమ జీడీపీ నుండి 3 నుండి 5 శాతం వరకూ ఖర్చు చేయాల్సి వస్తుందని దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే యూరపు ఆర్థికవ్యవస్థలు ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో తిరోగమన దిశలో పయనిస్తున్నాయి. ఇంకా మిలిటరీ ఖర్చు పెరిగితే ప్రజలపై అదనపు భారం పడే ప్రమాదముంది.ఉక్రెయిన్ ఆన్లైన్ పత్రిక ‘స్టార్నా’ ట్రంప్, పుతిన్‌ల శాంతి ఒప్పందాలను లీక్ చేసింది. దీన్ని అనుసరించి ఏప్రిల్ 20 నాటికి పరిపూర్ణ కాల్పుల విరమణ జరగా లని, ఉక్రెయిన్ ఆక్రమించిన రష్యా భూభాగం కుర్ స్క్‌ను తిరిగి రష్యాకు ఇవ్వాలని, తొందరలోనే పుతిన్, ట్రంప్‌లు మాస్కోలో, వాషింగ్టన్లో కల్సుకొంటారని, జెలెన్స్కీ, పుతిన్‌లు సౌదీ అరేబియాలో కలుసుకోవ చ్చని అభిప్రాయపడింది. అధికారికంగా ఈ షరతులన్నీ మే 9 నుండి అమలులోకి రావచ్చని తెలిపింది. అయితే ఇవేవీ జరుగలేదు. నిన్న శనివారం కూడా యుద్ధం కొనసాగింది. రష్యా కొత్తగా ఉక్రెయిన్ గ్రామాన్ని ఒక దాన్ని ఆక్రమించుకుంది.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిచైనాను ఎదుర్కొనే వ్యూహంతాను అమెరికా అధ్యక్షునిగా ఉండి ఉంటే అప్పట్లో యుద్ధాన్ని జరిపించే వాడిని కాదని ట్రంప్ ఇప్పటికే అనేకసార్లు చెప్పారు. 3 సంవత్సరాల యుద్ధంతో ఉక్రె యిన్ తీవ్ర నష్టాల పాలయ్యింది. సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన ఈ యూ దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలో కూరుకోవటం, తిరుగులేని అణుశక్తిగా, మిలిటరీశక్తిగా ఇప్పటికే రష్యా ఉండి, అపారమైన ఖనిజ సంపద కల్గి ఉండటంతో ట్రంప్ రష్యాపై మొగ్గు చూపు తున్నారు. భౌగోళికంగా వ్యూహాత్మకంగా రష్యా సహా యంతో చైనాను చుట్టు ముట్టటం తేలిక అనుకోవటం ట్రంప్ ఆలోచన కూడా కావచ్చు. ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయాన్ని అందించటం కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారం కావటం మరొక కారణం కాగా, అమెరికా మార్కెట్లకు రష్యా కొత్తద్వారాలను తెరుస్తుందని ఆశ పడటం మరొక కారణం కావచ్చు. అసలు యుద్ధం ప్రారంభించటానికి ప్రధాన కారణం రష్యాను ముక్కలుగా చేసి, దాని అపార ఖనిజసంపదను దోచుకోవటానికే ననేది జగమెరిగిన సత్యం. శాంతి చర్చలతో రష్యా అధ్యక్షుడు పుతిన్ విజేతగా నిలువనున్నాడు. అమెరికా ఉక్రెయిన్‌కు మద్డతు పలికి ఓటమిపాలవుతూ ఇప్పుడు ట్రంప్ రూపంలో శాంతి ఒడంబడిక ద్వారా నెగ్గే ప్రయత్నం చేస్తోంది. రష్యాకి సంబంధించిన 30వేల కోట్ల డాలర్లను అమెరికా బ్యాంకుల్లో స్తంభింపజేసి, ఉక్రెయిన్‌లో ఖనిజ సంపదపై కన్నేసిన అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ నైజాన్ని ప్రపంచానికి తెలిపింది. తాజా వార్తలు అందే సమయానికి ట్రంప్ తన సహజధోరణిలో మాట మార్చి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిందని ప్రకటించారు. యుద్ధ పరిసమాప్తి గురించి వాషింగ్టన్...రష్యాతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ తమతో ఖనిజ ఒప్పందాలను కుదుర్చుకుంటుందని ప్రకటించారు. మొత్తానికి ఈ యుద్ధం వల్ల అమెరికా ప్రయోజనాలు నెరవేరబోతున్నాయన్నమాట!నేటితో రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు2025 ఫిబ్రవరి 24 నాటికి రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడేళ్లవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో చోటు చేసుకున్న భయంకర యుద్ధం ఇదే. ఉక్రెయిన్‌లో 20 శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. ఈ యుద్ధం వల్ల 2024 నవంబర్ నాటికి ఉక్రెయిన్‌కు సంభవించిన మొత్తం ఆస్తి నష్టం 170 బిలియన్ డాలర్లు అని ‘కేఎస్ఈ ఇనిస్టిట్యూట్’ అంచనా. ఉక్రెయిన్ సైనికులు 80 వేల మంది చనిపోయినట్టు, 4 లక్షల మంది గాయపడినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ అంచనా. రష్యా పౌరులు కొద్దిమందే మరణించినా సైనికులను మాత్రం పెద్ద సంఖ్యలోనే కోల్పోయిందని వార్తలు. అందుకే అది కిరాయి సైనికులను రంగంలోకి దించింది. -బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, కె.ఎల్. యూనివర్సిటీ ‘ 98494 91969 -
మల్లికార్జున్ ఖర్గే (ఏఐసీసీ ప్రెసిడెంట్) రాయని డైరీ
ఇందిరా భవన్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ఉన్నాం అందరం. అంతా ఆలిండియా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీలు, స్టేట్ ఇంఛార్జిలు, కొత్త సీడబ్ల్యూసీ సభ్యులు, పార్టీలోని ఇతర మహామహులు. ‘చెప్పండి’ అన్నట్లు వారి వైపు చూశాను. ఎప్పటిలా, ‘మీరే చెప్పండి ఖర్గేజీ’ అన్నట్లేమీ వారునా వైపు చూడలేదు. ఎవరి వైపు వాళ్లు చూసుకుంటూ ఉన్నారు! బహుశా అది ఆత్మ పరిశీలనావస్థ కావచ్చు. పార్టీ లీడర్ రాహుల్, జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ నా పక్కనే ఇటొకరు, అటొకరు కూర్చొని ఉన్నారు. ‘‘ఎవరైనా హ్యాట్రిక్ కొట్టి హీరోలు అవుతారు. మనం ‘జీరో’లు కొట్టి హ్యాట్రిక్ సాధించాం!’’ అన్నాను అందర్నీ యాక్టివేషన్ మోడ్‌లోకి తీసుకొస్తూ. వెంటనే రాహుల్ స్పందించారు. ‘‘ఖర్గేజీ, ఐపీఎల్లో ఆర్సీబీ ఎంత గొప్పగా ఆడుతుందో మీకూ తెలుసు. కానీ ఒక్కసారైనా ఆ జట్టు గెలిచిందా?’’ అన్నారు మెల్లగా నా చెవిలో. ఆర్సీబీ జట్టుది కర్ణాటకే, కాంగ్రెస్ అధ్యక్షుడిదీ కర్ణాటకే అనే భావన నాలో కలిగించటం ద్వారా ఆయన నాకు ఊరటనివ్వ దలిచారా!‘‘గొప్పగా ఆడటం గెలుపౌతుందా రాహుల్ బాబు. గెలిస్తేనే కదా గొప్పగా ఆడినట్లౌతుంది’’ అన్నాను రాహుల్ చెవిలో. ఇలా చెవుల్లో మాట్లాడుకునే సంప్రదాయం కాంగ్రెస్‌లో గాంధీ, నెహ్రూ, పటేల్‌ల కాలం నుంచే ఉన్నా, నలుగురి ముందు చెవుల్లో చెవులు పెట్టటం నాకు ఇష్టం ఉండదు. రాహుల్ నా చెవిలో మాట్లాడారు కాబట్టి ఆయన్ని రెస్పెక్ట్ చెయ్యటం కోసం నేనూ ఆయన చెవిలో మాట్లాడానంతే. ‘‘అంకుల్...’’ అని చెయ్యి లేపారు ప్రియాంక. ‘‘చెప్పమ్మా ప్రియాంకా...’’ అన్నాను.‘‘అంకుల్... మనమూ కొట్టాం కదా హ్యాట్రిక్. షీలా దీక్షిత్ ఆంటీ వరుసగా మూడుసార్లు ఢిల్లీ సీఎంగా ఉండలేదా?’’ అన్నారు.‘కానీ సీఎంగా హ్యాట్రిక్ కొట్టటం వేరు, వరుసగా ఒక్క సీటైనా గెలవకుండా హ్యాట్రిక్ కొట్టటం వేరు కదా తల్లీ’ అని నేను ప్రియాంకతో అనలేదు. ఈలోపు – జైరాం రమేశ్ యాక్టివేట్ అయ్యారు!‘‘హ్యాట్రిక్‌గా మనం ఎందుకు ఓడిపోతూ వచ్చామో ఎంతగా అంతర్మథనం చేసుకున్నా అర్థం కావటం లేదు ఖర్గేజీ. ఢిల్లీకి షీలా దీక్షిత్ ఎన్నెన్ని చేశారు! అసలు ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అంతు చిక్కటం లేదు’’ అన్నారు జైరాం రమేశ్, సహనం కోల్పోయిన సాధువులా!‘‘అంతా బాగున్నా ఎందుకీ ప్రజలు మార్పు కోరుకుంటారో!’’ అన్నారు వేణుగోపాల్, తనూ ఆశ్చర్యపోతూ. ‘‘అంతా బాగుండబట్టే మార్పును కోరుకుంటారు వేణూజీ. అన్ని పార్టీలూ అన్నీ ఇస్తున్నప్పుడు అన్నీ ఇచ్చే అవకాశాన్ని ఎప్పుడూ ఒకే పార్టీకి ఎందుకివ్వాలి అని ప్రజలు అనుకుంటారు. ఢిల్లీ ప్రజలు 26 ఏళ్ల తర్వాత మళ్లీ బీజెపీని ఎన్ను కున్నారు. ఏమో, వచ్చే ఎన్నికల్లో బీజేపీని మార్చి మనల్ని గెలిపించినా గెలిపించవచ్చు’’ అని వెనుక సీట్లోలోంచి ఎవరో అన్నారు!‘‘ఎవరతను గోపాల్జీ... ఆశలు చిగురించేలా మాట్లాడాడు’’ అని అడిగాను... సాయంత్రం కాన్ఫరెన్స్ ముగిశాక వేణుగోపాల్‌తో పాటుగా ఇందిరా భవన్ నుంచి బయటికి నడుస్తూ. ‘‘కుర్రాడు కమిటీలోకి కొత్తగా వచ్చాడు ఖర్గేజీ. గ్రాస్రూట్స్ నుంచి తెచ్చాం’’ అన్నారు వేణుగోపాల్.ఒక్క క్షణం అలా నిలబడి పోయాను. ‘‘ఏంటి ఖర్గేజీ?’’ అని అడిగారు వేణుగోపాల్.‘‘ఏం లేదు గోపాల్జీ. మన లీడర్స్ అందరినీ వెంటనే ఏ ఫ్లయిట్ దొరికితే ఆ ఫ్లైట్‌లో గ్రాస్రూట్స్కి పంపించండి’’ అని చెప్పి, వచ్చేశాను. -
రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాం
బ్యాంకులు ప్రదర్శిస్తున్న ఈ అసమానత వింత గొలుపుతుంది. ఒక ఆర్టీఐ అభ్యర్థనకు ప్రతిస్పందిస్తూ, 2014 ఏప్రిల్ 1 నుండి కార్పొరేట్ ఇండియాకు సంబంధించి రూ. 16.61 లక్షల కోట్ల మొండి రుణాలనుబ్యాంకులు మాఫీ చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. మరుసటి రోజు రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ పార్లమెంటులో మాట్లాడుతూ, దేశంలో బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు ఇప్పుడు రూ. 32 లక్షల కోట్లు దాటాయని అన్నారు. 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ అని బేనీ వాల్ అన్నారు. రైతులకు వ్యవసాయ రుణ మాఫీ పథకం గురించి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు.కార్పొరేట్లకు రుణమాఫీదీనికి విరుద్ధంగా, గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్లు చేసిన మొత్తం రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) రద్దు చేశారు. గత ఐదేళ్లలో కార్పొరేట్లు చెల్లించని రుణా లలో రూ. 10.6 లక్షల కోట్లను రద్దు చేయడానికి భారతీయబ్యాంకులు ఏమాత్రం సందేహించలేదు. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలకు చెందినవని నివేదికలు చెబుతున్నాయి. అదే కర్ణాటక, శివమొగ్గలోని ఒక రైతు కేవలం తన రూ. 3.46 పైసల బకాయి చెల్లించేందుకు సాధారణ బస్సు సర్వీస్ లేకపోతే, 15 కిలో మీటర్లు నడిచివెళ్లాల్సినంతటి ఆత్రుతను బ్యాంక్ ప్రదర్శించింది.2023–24 ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులు రూ. 1.7 లక్షల కోట్లు మాఫీ చేశాయి. ఒక సంవత్సరం క్రితం, 2022–23లో రూ. 2.08 లక్షల కోట్లు మాఫీ చేశాయి. కానీ వ్యవసాయ రుణాలను మాఫీ చేసే విషయానికి వస్తే, కేంద్రం రెండుసార్లు మాత్రమే ఆ పని చేసింది: 1990, 2008లో. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా వ్యవ సాయ రుణాల మాఫీ చేశాయి. కానీ మాఫీ చేసిన మొత్తాన్ని బ్యాంకు లకు రాష్ట్రాలు చెల్లిస్తున్నందున అది బ్యాంకులపై భారం కాదు. కార్పొ రేట్లు చెల్లించని బ్యాంకు రుణాలను అవి దేశ నిర్మాణానికి తోడ్ప డ్డాయనేంత జాగ్రత్తగా మాఫీ చేశారు. చిన్న రుణాలు మాఫీ చేయలేమా?పేద రైతులు, గ్రామీణ శ్రామికవర్గం చేసిన చిన్న చిన్న రుణా లను మాఫీ చేయడం అనేది జాతీయ బ్యాలెన్స్ షీట్‌ను కలవర పెట్టడానికి కారణంగా కనిపిస్తుంది. అదే ధనవంతులైన రుణమాఫీ దారులు సులభంగా తప్పించుకుంటారు. వీరిలో రూ.3.45 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను చెల్లించని 16,000 మందికి పైగా ఉద్దేశ పూర్వక రుణమాఫీదారులు ఉన్నారు. పైగా వారివద్ద డబ్బు ఉందని ఆర్బీఐ అంగీకరించినప్పటికీ వారు తిరిగి చెల్లించడానికి ఇష్టపడలేదు. కచ్చితంగా, వీరు సంపద సృష్టికర్తలు. దేశం వారిని అభినందించాలన్నమాట!ఇప్పుడు రాజస్థాన్‌లోని పీలీబంగాకు చెందిన ఒక రైతును చూడండి: ఆయన ఒక ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 2.70 లక్షల రుణం తీసుకొని రూ. 2.57 లక్షలను తిరిగి చెల్లించాడు (మహమ్మారి సమయంలో రాష్ట్రం నుండి అందుకున్న రూ. 57,000 మద్దతుతో సహా). మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. ఆయన ఒక రోజు ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తరువాత, ఆగ్రహించిన గ్రామస్థులు ఆ తాళం పగలగొట్టారు.ఈ దురదృష్టకర సంఘటనను మరొకదానితో పోల్చి చూద్దాం. ప్రముఖ మిశ్రమ లోహ, ఉక్కు తయారీదారు అయిన ‘ఆధునిక్ మెటాలిక్స్’... 2018 జూలైలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్‌కతా శాఖ తన పరిష్కార ప్రణాళికను ఆమోదించిన తర్వాత, తమ బకాయిలు రూ. 5,370 కోట్లకుగానూ కేవలం రూ. 410 కోట్లు చెల్లించడానికి ఒప్పుకుంది. అంటే 92 శాతం రుణమాఫీ! స్పష్టంగా, ఇంత పెద్ద ‘రుణమాఫీ’ తర్వాత, కంపెనీ ప్రమోటర్లు అన్ని కార్యకలాపాలను పూర్తి చేయడానికీ, ప్రధానసంస్థను పునరుద్ధరించి తిరిగి పని చేయడం ప్రారంభించడానికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు పరివర్తనాత్మక పరిష్కార యంత్రాంగంగా ప్రశంసలందుకున్న దివాళా కోడ్ ఇప్పుడు ఒక వైఫల్యంగా మారిపోయింది.అయితే, పెద్ద ప్రశ్న మిగిలే ఉంది. పెండింగ్‌లో ఉన్న రూ. 20,000 మొత్తాన్ని తిరిగి పొందలేకపోయినందుకు రాజస్థాన్ రైతు ఇంటికి తాళం వేయగలిగినప్పుడు, పెండింగ్‌లో ఉన్న బకాయిలలో 92 శాతం మాఫీ చేసి రాజమార్గాన పంపడానికి బదులుగా, ఆధునిక్ మెటాలిక్స్ వంటి సంస్థల ప్రాంగణాన్ని ఎన్సీఎల్టీ ఎందుకు తాళం వేయలేకపోయింది? రైతుల వంటి వారే అయిన ఆ యజమానులను ఎందుకు కటకటాల వెనుక ఉంచలేకపోయింది?చట్టాల్లో ఎందుకు తేడా?ఒక పెద్ద కంపెనీకి ఇంత పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, రైతులు ఇలాంటి విధానంతో ప్రయోజనాన్ని, అది కూడా సాపేక్షంగా తక్కువ అయినాసరే ఎందుకు పొందకూడదు? వివిధ వర్గాల బ్యాంకు వినియోగదారులకు బ్యాంకింగ్ చట్టాలు ఎందుకు భిన్నంగాఉండాలి? గృహనిర్మాణం, కారు, ట్రాక్టర్ లేదా మోటార్ సైకిల్ రుణాలు తీసుకునే వారిని బ్యాంకులు ఎప్పుడైనా అదే రకమైన సున్ని తత్వంతో చూస్తాయా? ఆర్థిక వృద్ధి పేరుతో కంపెనీల మొండి బకాయిలను మాఫీ రూపంలో తమ సొంతం చేసుకోవాల్సిన అగత్యాన్ని బ్యాంకులు ఎంతకాలం సమర్థించుకోగలవు?పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో నిటారుగా నిలబడి ఉన్న తమ కాలీఫ్లవర్, క్యాబేజీ పంటలను తిరిగి దున్నడానికి ట్రాక్టర్లను నడుపుతున్న రైతుల బాధాకరమైన వీడియోలను; ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్లలో టమోటా ధరలు పతనమై రైతులు కుప్పగూలిపోవడాన్ని నేను సోషల్ మీడియాలో చూసినప్పుడు తీవ్రంగా బాధపడ్డాను. టమోటా, ఉల్లిపాయ, బంగాళాదుంపల ధరలను స్థిరీకరించడానికి రూ. 500 కోట్ల వ్యయంతో 2018–19 బడ్జెట్లో ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్స్ పథకం నాకు ఇలాంటి సందర్భాల్లో గుర్తుకువస్తుంది. కోల్డ్ చైన్స్ నెట్‌వర్క్‌తో సహా వ్యవసాయ మౌలిక సదుపా యాలలో తగినంత పెట్టుబడి పెట్టడం అనేది నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ వాస్తవికత ఏమిటంటే, కూరగాయల ధరలను స్థిరీకరించడంలో ఆపరేషన్ గ్రీన్స్ పథకం ఘోరంగా విఫలమైంది. తగిన నిధుల మద్దతు లేకపోవడం ఒక కారణం కావచ్చు.రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్సీఐఎల్) దివాళా తీసిన తీర్మానాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) 2023 డిసెంబర్లో ఆమోదించింది. ఈ సంస్థ క్లెయిమ్ చేసిన రుణంలో 99 శాతాన్ని మాఫీ చేయడం జరిగింది. చూడండి విచిత్రం: 2018–19లో ఆపరేషన్ గ్రీన్స్ కోసం కేటాయించిన రూ. 500 కోట్లతో పోలిస్తే, ఆర్సీఐఎల్ రూ. 47,251.34 కోట్ల క్లెయిమ్‌కు బదులుగా కేవలం రూ. 455.92 కోట్లు చెల్లించి బయటపడింది. మాఫీ చేసిన ఆ మొత్తాన్ని తిరిగి పొంది ఆపరేషన్ గ్రీన్స్ లో పెట్టుబడి పెడితే, పండ్లు, కూరగాయల ధరలను స్థిరీకరించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఆర్థిక వనరుల కొరత ఏమాత్రం ఉండేది కాదు.- దేశంలో 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ.- గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్ల రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) బ్యాంకులు రద్దు చేశాయి. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలవి.- ఒక పెద్ద కంపెనీకి పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, ఒక చిన్న రైతు అలాంటి ప్రయోజనం ఎందుకు పొంద కూడదు?- వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు , ఈ–మెయిల్: hunger55@gmail.com- దేవీందర్ శర్మ -
చంపాల్సింది కులాన్ని... ప్రేమికుల్ని కాదు!
భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘మనం రేపటి నుండి రాజకీయంగా ఓటు ద్వారా మనిషికి ఒకే విలువను సాధించుకున్నాం. కానీ సామాజికంగా సమానతను సాధించుకోవాల్సి ఉంది’ అన్నారు. కులమత అంతరాలు ఆర్థిక అసమానతలు, దోపిడీ పీడనలు లేని సమాజాన్ని కలగన్న ఆనాటి మహనీయుల కలలు ఇంకా నెరవేరనే లేదు. భారతదేశ చాతుర్వర్ణ కుల వ్యవస్థ భారత సమాజాన్ని నిలువునా చీల్చిందనీ, కుల నిర్మూలన జరగకుండా, అంధ విశ్వాసాలు తొలగి పోకుండా సమాజం పురోగమించదనీ, ఆ లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ స్ఫూర్తితో సమాజాన్ని పాలకులు ముందుకు నడపాలి. అయితే వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులాల దొంతరలలోని కులాలను స్థిరీకరిస్తూ, అంతరాలను పెంచి పోషిస్తున్నారు. కులం కట్టుబాట్లను అనుసరించి... తమ ఇష్టానిష్టాలకు భిన్నంగా ఆ యా కులాల్లోనే వివా హాలు చేసుకోవడం ఒకరకంగా దోపిడీకి గురికావడం లాంటిదే. రెండు వందల ఏళ్ల నాడే సావిత్రీబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలేలు ఈ కుల కట్టుబాట్లను తుదమట్టిస్తూ, కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్స హించారు. ప్రేమించి పెళ్లి చేసుకోవా లనుకునే జంటలకు కాని, కులమత అడ్డుకోటలను కూల్చాలనుకునే ప్రేమి కులకు కాని, కుల కట్టుబాట్లు, సంప్రదాయాలు, పెళ్లి తంతులు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లిళ్లు చేసుకొనేవారు అనేకమంది విడిపోతున్నారు. ఇవాళ కుటుంబంలో అమ్మాయి పుట్టిందంటే భయపడే పరిస్థితి ఎందుకుంది? ఆమె పెరిగి, పెద్దదై పెళ్లి చేసుకునేదాకా తల్లితండ్రులు భయాందోళనలకు గురికావలసి రావడానికి కారణం ఏమిటి? సమాజంలో పాతుకుపోయిన మనువాదమే కదా. ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హసి’ (ఏ స్త్రీ కూడా స్వేచ్ఛకు అర్హురాలు కాదు) అనే భావం నరనరాల్లో జీర్ఙించుకున్న సమాజం కదా మనది. స్త్రీని ఒక వస్తువుగా, ఆస్తిగా, కుటుంబ పరువును కాపాడవలసిన జీవిగా పురుషాధిక్య సమాజం చూడటం వల్లే... ఆమె కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే పరువు హత్యలకు పాల్పడుతున్నారు.రాజ్యాంగం మనిషికి స్వేచ్ఛగా బ్రతికే హక్కుని ప్రసాదించింది. ఇష్టమైనవారిని కులమతాల ప్రసక్తి లేకుండా వివాహమాడే స్వేచ్ఛను కల్పించింది. వరకట్నం చట్ట వ్యతిరేకమని తెలిసినా పట్టించుకుంటున్నది ఎంతమంది? కట్నాలు లేకుండా, కులపట్టింపులు లేకుండా తమకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటే వారి మీద కత్తులు నూరటం దుర్మార్గం. ఇవాళ్టి సామాజిక సందర్భంలో పిల్లలు ఒకరిని ఒకరు కలుసు కోవడం, తెలుసుకోవడం, భావి జీవితం గురించి కలలు కనటం అనేది చాలా సహజాతి సహజమైన పరిణామం. ఇందుకు తల్లిదండ్రులు, సమాజం ప్రోత్సహించాల్సిందిపోయి... వాళ్ళు ఏదో సమాజానికి కీడు చేస్తున్నట్టు నియంత్రించడం తగదు. కులం అనే ఒక కాగితపు పులిని చూసి మనిషి తన కన్న బిడ్డల్ని చంపుకొనే క్రూర జంతువుగా మారడం దారుణం. కుల పెద్దలుగా చలామణీ అయ్యేవారు, నాయకులు కులాంతర వివాహం చేసుకున్న జంటల్ని వెంటాడి వేధిస్తు న్నారు. సినిమాల్లో ప్రేమల్ని, ప్రేమికుల కష్టాల్ని చూసి కన్నీళ్లు కార్చే పెద్దలు, తమ కడుపున పుట్టిన బిడ్డలు తమకి ఇష్టం వచ్చిన అబ్బాయినో, అమ్మాయినో కోరుకుంటే... పరువు పోయిందని హత్యలకు తెగపడటం చూస్తూనే ఉన్నాం. సూర్యాపేటలో బంటినీ, మిర్యాలగూడలో ప్రణయ్ లాంటి ప్రేమికులనూ చంపడం ఇందుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వాళ్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవలసి ఉంది. ప్రేమ వివాహాలు, కులాంతర పెళ్లిళ్లు చేసుకునే పిల్లలకు చట్టం, సమాజం మద్దతుగా నిలవాలి.తమ ఇష్టాలకు అనుగుణంగా పెళ్లిళ్లు చేసుకునే పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించడం ద్వారా నిజమైన ప్రేమికుల్ని కాపాడుకోవాల్సి ఉంది. అలాగే వాళ్లకు నచ్చకపోతే విడిపోయి స్వేచ్ఛగా బ్రతికే అవకాశాలను కూడా సమాజం ఇవ్వాలి. కులాంతర వివాహం... మానసిక, శారీరక వైకల్యం లేని క్రియాశీల భవిష్యత్ తరానికి బాటలు వేస్తుంది. కులాంతర వివాహాలు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సాహ కాలు పెంచాలి. ఈ జంటలపై దాడులు చేసేవారిని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే విచారణ చేసి శిక్షించాలి. – ప్రభాకర్ కస్తూరిసమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ‘ 94409 70454 -
దేశ పునర్నిర్మాణానికి మార్గం
భారతదేశం ఈనాడు సామాజిక, ఆర్థిక సంక్షోభంలో ఉంది. రూపాయి విలువ అంతకంతకూ పతనం కావడం దేశ ఆర్థిక వ్యవస్థ దుఃస్థితిని తెలియజేస్తుంది. యువత నైరాశ్యంలో, మత్తులో కునారిల్లుతోంది. స్త్రీలైతే నిరక్షరాస్యతలో, మత కర్మకాండల్లో, పనిలేని తనంతో ఉత్ప్రేరక రహిత జీవితం జీవిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థల్లో కులవివక్ష, అస్పృశ్యత ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని వర్గాల వారే సంపదలను స్వాధీనం చేసుకోవడం పెరుగుతోంది. కొన్ని కులాల వారే వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపార వ్యవస్థల మీద తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కులం పేరుతో సాంఘిక, ఆర్థిక సంస్థలు, విద్యా వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. కుల ఆర్థిక వ్యవస్థ బలీయమైనదిగా రూపొందుతున్నదని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. హర్షద్ మెహతా లాంటి ఒక సామాన్య వ్యక్తి ప్రభుత్వ ఆర్థిక సంస్థలను వినియోగించుకొని వేల కోట్ల సొమ్మును ఏమార్చాడు. అదే చిన్న పొరపాట్లకే ఎస్సీ, ఎస్టీ సివిల్ సర్వీసు ఉద్యోగులు శిక్షలను అనుభవిస్తున్నారు. నూతన ఆర్థిక విధానం, ఉన్నత కులాలకు తమ ఆర్థిక, సామాజిక అధికారాన్ని పటిష్ఠపరుచుకోడానికి కొత్త అవకాశాల్ని ఏర్పరచింది. ఇటీవల ఒక ఏజెన్సీ భారతదేశంలోని వంద మంది ధనవంతుల పేర్లని వెల్లడించింది. వారిలో ఒక్కడు కూడా దళితుడు లేడు. భారతదేశంలోని అస్పృశ్యతా భావం వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. కారణం భూమి పంప కాన్ని ప్రభుత్వాలు నిరాకరించడం! భూములను కార్పొరేట్లకే ధారా దత్తం చేస్తున్నారు కానీ, పేద ప్రజలకు పంచడం లేదు. ఇటీవల సీపీఎం మహాసభలు జరిగినా వారు అస్పృశ్యతా నివారణ మీద, దళితులకు సాగు భూమి పంచాలనే అంశం మీద, కులనిర్మూలనా అంశం మీద తీర్మానం చేయకపోవడం గమనించదగ్గ విషయం.పెరగని శాస్త్రీయ భావనలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళాలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 45 మంది ప్రాణాలు కోల్పోవటం విషాదకరం. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణీ సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని విపరీత ప్రచారం జరగటంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి చేరారు. అంత మందికి అవసరమైన ఏర్పాట్లు చేయకపోవటం వల్లే ఈ ఘోరం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి.అదే రాష్ట్రంలో అంతకుముందు హత్రాస్‌లో జరిగిన ఒక అధ్యాత్మిక కార్యక్రమంలో బోలే బాబా పాద ధూళి కోసం జనం ఎగబడిన సందర్భంలో తొక్కిసలాట జరిగి, 121 మంది చని పోయారు. ఇటీవల తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన భక్తుల తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం చెందారు. హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పో యిన సంఘటనలు ఉన్నాయి. ఈ ఆధునిక కాలంలోనూ శాస్త్రీయ భావనలు దేశంలో వెల్లివిరియడం లేదు. సాంకేతిక, వైజ్ఞానిక భావచైతన్యం పెరగడం లేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.అంబేడ్కర్ బాట అందరూ తమ రాజకీయ మేనిఫెస్టోల్లో దళిత వర్గాల స్త్రీల గురించే హమీలిస్తున్నారు. కానీ చివరకు శూన్య హస్తాలే చూపిస్తు న్నారు. ఈ విషయంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1951 అక్టోబర్ 28న తన ముంబయి ఎన్నికల ప్రచారంలో ఇలా విశ్లేషించారు: ‘ప్రతి రాజకీయ పార్టీ తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అని ప్రతి రాజకీయ పార్టీ వాగ్దానం చేస్తుంది. భారత్‌లో అసలు సమస్య పేదరికం. ప్రతి ఏటా కోట్లాది రూపాయిల విలువ గల ఆహార ధాన్యాలు దిగుమతి చేసు కోవాల్సి వస్తే ప్రజలు ఎలా నెట్టుకు రాగలుగుతారు? ఈ విషయా లన్నింటికీ ప్రభుత్వ ఆలోచనల్లో తావులేదు’ అన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు పాలక వర్గాల మనస్తత్వంలో ఏ విధమైన మార్పూ లేదు. దీన్ని ఎదిరించి నిలబడే దళిత బహు జనులకు స్వీయ రాజకీయ చైతన్యం కావాలని అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. రాజ్యాధికారమే ప్రధానమైన ‘కీ’ అని, దళిత బహుజన రాజ్యాన్ని నిర్మించినప్పుడే సంపద పంపిణీ అవుతుందని అన్నారు. లేదంటే పరిస్థితుల్లో మార్పులు రాకపోగా, మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘ఇవాళ దళితుల పరిస్థితి ఏమిటి? నాకు తెలిసినంత వరకూ ముందు ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. అదే నిరంకుశత్వం, అదే అణచివేత. పరిపాలనలో అంతకుముందున్న వివక్షే కొనసాగుతోంది’ అన్నారు. అయినా వారికి ఉపశమనం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. అంబేడ్కర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఉద్దేశించి ఈ విశ్లేషణ చేశారు. అవి ఇప్పటికీ స్పష్టంగా అన్వయం అవుతున్నాయి. భారతీయుల బాధ్యతనిజానికి దేశంలో నిరుద్యోగం, పేదరికం, స్త్రీ అణచివేత ఇంకా కొనసాగుతున్నాయి. మరో పక్క ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. కానీ తయారీ రంగానికి అవస రమైన సమస్త యంత్రాలనూ దిగుమతి చేసుకుంటున్నాం. పరి శోధన, అభివృద్ధి రంగంలో మనం చేస్తున్న వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో 1 శాతం కంటే తక్కువ! పరిశోధన అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు సమకూర్చడం, నవకల్పనలను ఇతోధికంగా ప్రోత్సహించడం, కార్మిక శ్రేణుల నైపుణ్యాలను మెరుగుపరచడం అవసరమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలూ ఏవీ అమలు జరగడం లేదు. రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక సూత్రాలు విధ్వంసానికి గురి అవుతున్నాయి. సమాఖ్య భావన తగ్గడంతో రాష్ట్రాల అస్తిత్వాలు సంఘర్షణలో ఉన్నాయి. రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గిస్తూ కేంద్రం ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునే క్రమం సాగుతోంది. మేలిమి చదువులు, తీరైన వసతులు, ఉపాధి అవకాశాల కల్పన, అసమా నతల నివారణ ద్వారా జనం బతుకుల్లో వెలుగులు నింపాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని ప్రలోభస్వామ్యంగా మారుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద శక్తులు ఏకం కావలసిన సమయం ఆసన్నమయింది. దేశంలో ఉత్పత్తిని పెంచు కొని, దేశ గౌరవాన్ని పెంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీ యుని మీద ఉంది. ఈ క్రమంలో అంబేడ్కర్ ఆలోచనలను స్వీకరించి అభివృద్ధి భారతానికి బాటలు వేయాలి.డా"కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులుమొబైల్: 98497 41695 -
World Day of Social Justice సామాజిక న్యాయం కావాలి!
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పిలుపు మేరకు 2009 నుంచి ఫిబ్రవరి 20వ తేదీన ‘ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవా’న్ని జరుపుతున్నారు. సమాజాల మధ్య సంఘీభావం, సామరస్యం, సమాన అవకాశాలను ప్రోత్సహించడానికీ; పేదరికం, నిరుద్యోగాన్ని తొలగించవలసిన ప్రాముఖ్యాన్ని గుర్తించడం దీని వెనుక ఉన్న లక్ష్యం. ఈ ఏడాది ఉత్సవం సందర్భంగా... విద్యార్థులకు పేదరికం, ప్రపంచ పౌరసత్వం, మానవ హక్కులు, స్థిరమైన అభివృద్ధి వంటి సామాజిక న్యాయ ఆవశ్యకత గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. జాతి, లింగ, వయస్సు, లైంగిక ధోరణి, మతం, జాతీయత, విద్య, మానసిక లేదా శారీరక సామర్థ్యం వంటివాటిలో పక్షపాతం వల్ల ఈ అసమానతలు ఉత్పన్నమవుతాయి. సామాజిక న్యాయం లేక పోవ డానికి గల కారణాలలో వలసవాదం, బానిసత్వం, లేదా అణచివేత ప్రభుత్వాలకు మద్దతు, ఆర్థిక అధికార దుర్వినియోగం, జాత్యహంకారం, ఆర్థిక అసమానత, వర్గ వివక్ష ముఖ్యమైనవి. 2024 నాటికి, సామాజిక న్యాయం అందించడంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాలు: స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, డెన్మార్క్, లక్సెంబర్గ్, ఐర్లాండ్. మానవ హక్కులు లేకపోవడం, న్యాయం పొందడం కష్టమవ్వడం, అవినీతి రాజ్యమేలడం వంటి అంశాల్లో ముందున్న దేశాలు వెనిజులా, కంబోడియా, అఫ్గానిస్తాన్, హైతీ, మయన్మార్లు.భారతదేశంలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషి అపారమైనది. అందుకే ‘భారత సామాజిక న్యాయ పితామహుని’గా అంబేడ్కర్‌ను గౌరవించుకుంటున్నాం. భారతదేశంలో రాజ్యాంగం పీఠిక సామాజిక న్యాయాన్ని సూచిస్తోంది. భారతదేశంలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పడంలో మూడు అంశా లను పేర్కొనాలి: ఒకటి – ప్రాథమిక హక్కులు, నిర్దేశక సూత్రాల రూపంలో రాజకీయ సామాజిక–ఆర్థిక హక్కులను కల్పించడం. ఇది సమాన స్వేచ్ఛా సూత్రాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది,రెండవది–సామాజిక–ఆర్థిక అభివృద్ధి మధ్య, విరుద్ధమైన సామాజిక– ఆర్థిక లక్ష్యాల మధ్య సమాన సంతులనాన్ని సాధించే నమూనాను అవలంబించడం. మూడవది – భారతీయ సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రక్షణలు నిశ్చయాత్మక చర్యలను అందించడం.ఇందుకోసం దేశంలో ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలు, పథకాలు, చట్టాలు రూపొందించి అమలు చేయడం. – డా. పి.ఎస్. చారి ‘ 83090 82823(ఫిబ్రవరి 20న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం) -
ఉచితమా? అనుచితమా?
ఉచిత పథకాల గురించి సుప్రీం కోర్టు ఈనెల 12న వ్యాఖ్యానించటంతో ఈ విషయం మరొకమారు చర్చలోకి వచ్చింది. ఈ ధోరణులకు మూలం ఎక్కడున్న దనేది ఒక ప్రశ్న అయితే, అందుకు అసలు పరిష్కారం ఉందా అన్నది రెండవ ప్రశ్న. ఇండియా మధ్యయుగాల కాలం నుంచి ఫ్యూడల్ వ్యవస్థలలో, తర్వాత దానితో పాటు కొన్ని వందల సంవత్సరాలపాటు వలస పాలనలో మగ్గిపోయి అన్ని విధాలుగా వెనుకబడింది. అట్లాగని దేశంలో సహజ వనరులకు, కష్టించి పనిచేసే మానవ సంపదకు కొరత లేదు. ఏవో కొన్నిచోట్ల తప్ప, గ్రామీణ ఆర్థికతపై, అవసరాలపై ఆధారపడి సాగే సకల వృత్తుల వారున్నారు. అయినప్పటికీ, 1947లో దేశానికి స్వాతంత్య్రం సాధించుకునే నాటికి, అత్యధిక శాతం ప్రజలు దయనీయంగా వెనుకబడి ఉన్నారు. తమ స్థితిగతుల పట్ల, అందుకు కారణాలపట్ల, ప్రజలలో చైతన్యానికి ఎంత మాత్రం కొరత లేదు. వాస్తవానికి అటువంటి చైతన్యాలు గలవారు అనేక రూపాలలో సాగించిన ఉద్యమాలూ, తిరుగుబాట్లూ, 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామానికీ, 1885 నుంచి కాంగ్రెస్ నాయకత్వాన స్వాతంత్య్రోద్యమానికీ భూమికగా పనిచేశాయి.ప్రణాళికలు సరిగ్గా అమలైవుంటే...ఈ నేపథ్యాన్నంతా ఇంతగా చెప్పుకోవటానికి కారణాలున్నాయి. వనరులు, ప్రజల చైతన్యాలు గల దేశంలో గత 75 సంవత్సరాల స్వాతంత్య్ర కాలంలో తగిన విధానాలు, వాటి అమలు ఉండిన పక్షంలో ఈరోజు అసలు ఉచితాల అవసరమే ఏర్పడేది కాదు. ఎన్నిక లకు ముందు ఎందుకీ ఉచితాలని, అందువల్ల ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడటం లేదని, ఆ విధంగా పరాన్నజీవుల తరగతి ఒకటి సృష్టి అవుతున్నదని సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యా నించవలసిన పరిస్థితి వచ్చేది కాదు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. దేశం పేదరికం నుంచి బయటపడి అభివృద్ధి సాధించేందుకు చేయవలసిందేమిటన్న అవగా హన స్వాతంత్య్రోద్యమ నాయకులకు 1947 కన్న ముందే స్పష్టంగా ఉంది. వ్యవసాయిక, పారిశ్రామిక, వాణిజ్య రంగాలన్నింటికి సంబంధించి వారంతా బాగా చదివి అనేక దేశాలను, అక్కడి ఆలోచనా విధానాలను, అభివృద్ధి విధానాల తీరుతెన్నులను గమనించినవారు. వాటిని భారతదేశ పరిస్థితులకు ఏ విధంగా అన్వయించాలో అర్థం చేసుకున్నవారు. ఇటువంటి నేపథ్యాల వల్లనే వారి మేధస్సుల నుంచి, సుదీర్ఘ చర్చల నుండి, అప్పటికే చిరకాలంగా ప్రజాస్వామికంగా ఉండిన దేశాలకు మించి, ప్రపంచంలోనే ఎక్కడా లేనంత గొప్ప రాజ్యాంగం రూపుదిద్దుకున్నది. దేశ స్వాతంత్య్రోద్యమం వలెనే రాజ్యాంగం కూడా ఆసియా, ఆఫ్రికాలలోని ఇతర వలస వ్యతిరేక ఉద్యమాలకు ఆదర్శప్రాయమైంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా తర్వాత కాలంలో చట్టాలు, ప్రణాళికలు, సంక్షేమ పథకాలు రూపు తీసుకున్నాయి. అవి సక్రమంగా అమలై ఉండినట్లయితే ఈ చర్చలకు ఆస్కారమే ఏర్పడేది కాదు.స్వాతంత్య్రం వచ్చిన నాటి పేద స్థితిగతులను బట్టి సంక్షేమం తప్పనిసరి. దేశం, దానితోపాటు వారూ అభివృద్ధి చెందటం రాత్రికి రాత్రి జరిగేది కాదు. సంక్షేమ దృక్పథం పారిశ్రామిక విప్లవం నుంచి యూరప్‌లో, ఇంకా చెప్పాలంటే మన దేశంలోనూ మొదటి నుంచి ధార్మిక భావనలలో భాగంగా ఉన్నదే. అయితే, ఆధునిక ప్రజా స్వామిక, ఆర్థిక వ్యవస్థలు ఏర్పడిన తర్వాత, సకల జనుల అభివృద్ధి క్రమంలో, ఆ పని సవ్యంగా జరిగినట్లయితే, సంక్షేమ చర్యల అవసరం క్రమంగా తగ్గిపోవాలి. పేదలు తమ కాళ్లపై తాము నిలబడ గలగాలి. అదే ప్రభుత్వం లక్ష్యమై, దాని విధానాలు, ఆచరణలు అందుకు దోహదం చేయాలి. ఆ పని జరగనపుడు అంతా అస్తవ్యస్త మవుతుంది. ఈ పరిస్థితుల నుంచి పుట్టుకు వచ్చేదే పాప్యులిజం.సంక్షేమం కాస్తా పాప్యులిజంగా లేదా జంక్ వెల్ఫేర్‌గా మారటం. అభివృద్ధి మార్గంస్వాతంత్య్ర సమయానికి దేశ పరిస్థితులు ఏమిటో స్పష్టంగా తెలిసిన నాయకులు అందుకు పరిష్కార మార్గాలను కూడా అన్వేషించినట్లు పైన చెప్పుకున్నాము. వారి అవగాహనలు, అన్వేషణలు అంతకుముందే ఉండినట్లు 1947కు ముందు కాంగ్రెస్ మహాసభల ఆర్థిక సంబంధ తీర్మానాలను, 1935 నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాల చర్యలను పరిశీలించినట్లయితే అర్థమవుతుంది. అటువంటపుడు 1947 తర్వాత, 1951–52 నాటి మొదటి ఎన్నికల వెనుక జరిగిందేమిటి? పరిస్థితులను మార్చేందుకు నెహ్రూ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చట్టాలు చేసింది. వాటిలో భూసంస్కరణలు, గ్రామ పంచాయితీ వ్యవస్థ, సహకార సంఘాల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు మొదలైనవి ఉన్నాయి. ఇవి అమలైనట్లయితే గ్రామీణ భారతంలో పేదలకు భూములు లభించటం, పంచాయితీలలో, సహకార సంఘాల ద్వారా లభించే వాటిలో వారికి అవకాశాలు, రిజర్వేషన్ల ద్వారా విద్యా – ఉద్యోగాలు, అంతిమంగా ఫ్యూడల్ శక్తుల పట్టు క్రమంగా సడలి పేద ప్రజల అభ్యున్నతి వంటివి జరుగుతాయి. పలు దేశాలలో భూసంస్కరణలు ఇటువంటి ఫలితాలను ఇవ్వటమే గాక, వ్యవసాయ రంగంలో సంపదల సృష్టి జరిగి అది పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడిగా ఉపయోగ పడింది. భారతదేశంలో అటు వంటి క్రమం మొదలై సాగి ఉంటే, సంక్షేమం ఉచితాలుగా, ఉచితాలు ఊబిగా మారి ఉండేవి కావు. నిజానికి చాలా కాలం వరకు సంక్షేమం కూడా సరిగా అమలు కాలేదు. కనుక ఇదంతా కేవలం స్వయంకృతం.ప్రహసన ప్రాయంగా...అదట్లుంచితే, తొలి దశలో రూపొందిన ఈ గొప్ప ప్రణాళికలు ఎందువల్ల విఫలమైనట్లు? సూటిగా చెప్పాలంటే, కాంగ్రెస్‌లో స్వాతంత్య్రోద్యోమ కాలం నుంచే బలంగా ఉండిన ఫ్యూడల్ వర్గాలు, తర్వాత ఆ పార్టీలో చేరిన మాజీ రాజసంస్థానాలవారు, గొప్పగా కాకున్నా ఒక మేరకు ఉండిన పారిశ్రామిక వర్గాలు కలిసి, అధికార యంత్రాంగాన్ని తమకు విధేయులుగా మార్చుకుని, తమ ప్రయో జనాల కోసం అన్నింటినీ కుంటుపరిచారు. నెహ్రూ నిస్సహాయునిగా మిగిలారు. అందుకే ఏ ఒక్కటీ సవ్యంగా అమలుకాక, స్వాతంత్య్ర ఫలితాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుండిన పేదలు, మధ్య తరగతి వర్గాలను తీవ్రంగా నిరాశపరచింది. దాని పర్యవసానంగానే 1957 ఎన్నికలలో కాంగ్రెస్ కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలలో ఓడటం, 1960ల మధ్యకు వచ్చేసరికి వివిధ తరగతుల ఆందోళనలు, 1967లో కాంగ్రెస్‌ను 9 రాష్ట్రాలలో ఓడించి సంయుక్త విధాయక్ దళ్ ప్రభు త్వాల ఏర్పాటు, 1969 నుంచి నక్సలైట్ ఉద్యమం వంటివి వరుసగా జరుగుతూ వచ్చాయి. భూసంస్కరణలు, పంచాయితీరాజ్ వ్యవస్థ, సహకార సంఘాలు, రిజర్వేషన్ల అమలు ప్రహసనంగా మిగిలాయి. ఇందుకు ప్రజలను నిందించటంగానీ, వారు ఉచితాల కారణంగా పనులకు వెళ్లటం లేదనటంగాని పూర్తిగా నిర్హేతుకమైనది. మారుతున్న పరిస్థితులలో వారికి నిత్య జీవిత వ్యయం, ఇతర అవస రాల ఖర్చు చాలా పెరుగుతున్నాయి. కేవలం ఉచితాలు ఎంత మాత్రం సరిపోవు. ఉచితాల ఊబికి ఏకైక పరిష్కారం ప్రభుత్వాలు, పార్టీలు తామే చేసిన రాజ్యాంగాన్ని, చట్టాలను నిజాయితీగా అమలు పరచటం. పేదలు పెట్టుబడిదారీ వ్యవస్థ కోసం సరిగా పని చేయా లన్నా, తిరుగుబాట్లు చేయవద్దనుకున్నా వారికి సంక్షేమ పథకాలు అవసరమని సిద్ధాంతీకరించి సవ్యంగా అమలు చేసిన బ్రిటిష్ వ్యవస్థను, జర్మన్ నియంత బిస్మార్క్‌ను మనం ఒకసారి చదువుకుంటే ఉపయోగపడుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇచ్చిన మాట ప్రకారం నీరివ్వండి!
ప్రణాళికా సంఘం నివేదిక ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ దేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లా. స్వతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా ఈ జిల్లా పరిస్థితి దాదాపు ఏమీ మారలేదనే చెప్పాలి. ఉమ్మడి జిల్లా నలుదిక్కులా అనేక నదులు ఉపనదులూ ప్రవహి స్తున్నా వ్యవసాయం ఇప్పటికీ వర్షాధారంగానో లేదా భూగర్భ జలాలపైనో ఆధారపడి సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున సాగునీటిని అందించడానికి ‘ప్రాణహిత– తుమ్మిడి హెట్టి’ ప్రాజె క్టుకు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2008లో శంకు స్థాపన చేసింది. దానికి ‘బీఆర్ అంబేడ్కర్ ప్రాజెక్టు’గా నామకరణం చేసింది. ప్రాణహిత నుండి ఎల్లంపల్లి వరకు 116 కి.మీ. కాలువ నిర్మాణానికి జిల్లాలో 1700 కోట్లు ఖర్చు చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 38 వేల కోట్లు అయ్యే మొత్తం ప్రాజెక్టుకు, ఆనాడే 9 వేల కోట్లు ఖర్చు చేశారు. 2014లో బీ(టీ)ఆర్ఎస్ అధి కారంలోకి వచ్చింది. నీరు లేదనే కుంటి సాకు చూపి, రీ ఇంజనీరింగ్, రీ డిజైనింగ్ పేరిట (కాళేశ్వరం) మేడి గడ్డకు ప్రాజెక్టును మార్చారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు నిర్మించారు. బడ్జెట్‌ను లక్ష యాభైవేల కోట్లకు పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టును 2019లో ముగ్గురు మంత్రులు ముచ్చటగా ప్రారంభించారు. నాలుగేళ్ల లోపే ఏడవ బ్లాకులోని అనేక గేట్లు, ఐదు అడుగుల లోతుకు పైగా కుంగిపోయాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో పునాది అడుగున కూడా భారీ లీకేజీలు, సీపేజీలు ఏర్పడ్డాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ‘డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ అత్యున్నత స్థాయి ఇంజనీర్ల బృందం పరిశీలించింది. నీరు నిలువ ఉంచడం ప్రమాదమని, అత్యవసరంగా అన్ని బ్యారేజీలలోని నీటిని బయటికి పంపాలని నాటి ప్రభుత్వాన్ని కోరింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ఘోరమైన తప్పులు చేసిందని నిర్ధారించింది. ఈ నివేదికప్రకారం: పునాదికి సంబంధించిన భూగర్భ పరీక్షలు ఏమాత్రం చేయలేదు. బలహీనమైన పునాదులపై బ్యారేజీలు నిర్మించింది. బ్యారేజీలలో వచ్చిన నీరు వచ్చినట్టు కాలువకు వెళ్లాలి. ఎక్కువైన నీరు నదిలోకి వెళ్లాలి. కానీ బలహీన పునాదులపై నిర్మించిన బ్యారే జీలలో, ప్రాజెక్టుల వలె భారీ ఎత్తున నీటిని నిలువ చేశారు. బ్యారేజీలను డ్యాముల వలె నిర్వహించారు. ఆ భారీనీటి నిలువ ఒత్తిడి, తాకిడికి పునాదులు భారీగా దెబ్బతిన్నాయి. కేవలం నాలుగు మీటర్ల పునాది క్రింద ఉన్న అడుగు పొరల్లోని ఇసుకంతా భారీ ఎత్తున కొట్టుకుపోయింది. స్పిల్‌వే నిట్టనిలువుగా పునాది నుండి మూడు ఫీట్ల వెడల్పుతో చీలిపోయి, రెండు చెక్కలయ్యింది. భూమిలో కుంగిపోయింది. మేడిగడ్డ వలెనే సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు ఎప్పుడైనా భూమిలో కుంగిపోవచ్చు. నాడు భూమిలో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్‌ను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు నిశితంగా పరిశీలించి దీని నిర్మాణ ంలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ కమిషన్ వేసి సొమ్ము రికవరీ చేసి శిక్షిస్తామని ప్రకటించారు. ప్రత్యా మ్నాయంగా ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ అంతటికీ సాగునీరు ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా, ప్రాజెక్టును ప్రస్తావించడం లేదు. యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి నిర్మాణం ప్రారంభించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం(మేడిగడ్డ) ప్రాజెక్టులో సీఎం కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ వేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ‘పినాకీ చంద్రఘోష్ కమిషన్’ విచారణ జరుపుతోంది. నేటి రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి వారివారి నియోజకవర్గాల్లో, కొత్త ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు వెచ్చించి శరవేగంతో నిర్మిస్తున్నారు. ఎన్ని కల ప్రణాళికలో పేర్కొన్న ప్రాణహిత – తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన కడెం ఆయకట్టును సస్యశ్యామలం చేసే ‘కుప్టి ప్రాజె క్టు’కు నిధుల కేటాయింపు కానీ, దాని కనీస ప్రస్తావన కానీ లేదు. కుంటాల జలపాతం ఎగువన ఉన్న, కుప్టి ప్రాజెక్టుతో కడెం ఆయకట్టు చివరి వరకు గూడెం ఎత్తిపోతలు లేకుండానే పూర్తిగా రెండు పంటలకు సాగునీరు ఇవ్వవచ్చు. కడెం ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. చెన్నూరు– ప్రాణహిత వరకు, మంచి ర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోని బీడు భూము లకు సంపూర్ణ గ్రావిటీతో సాగునీరు అందుతుంది. ‘నెహ్రూ ఉత్తర కాలువ’ లేదా ‘మందాకిని ఎన్టీఆర్ కాలువ’ సాగునీటి కలలు పూర్తిగా నిజం అవుతాయి. ఎల్లంపల్లికి వచ్చే ప్రాణహిత కాలువ, కడెం (నెహ్రూ ఉత్తర లేదా మందాకిని) కాలువ ఎక్స్ (గీ) ఆకారంలో క్రాస్ అవుతూ వెళ్తాయి. బెల్లంపల్లి, చెన్నూర్ నియో జకవర్గాల బీడు భూములకు అవసరమయ్యే నీటిని ప్రాణహిత ద్వారా, కడెం కాలువకు అనుసంధానించ డానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఈ ఉత్తర కాలువకు... శ్రీరాంసాగర్ నీటినీ, సదర్మాట్ నీటినీ, ఎల్లంపల్లి నీటినీ పూర్తి గ్రావిటీతో అనుసంధానం చేయవచ్చు. కుప్టి ప్రాజెక్టు సముద్రమట్టానికి 1450 అడుగుల ఎత్తులో ఉంటుంది. కడెం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం ఎత్తు 700 అడుగులు. అంటే కడెం కంటే 750 అడుగుల ఎత్తులో కుప్టి ప్రాజెక్టు బెడ్ లెవెల్ ఉంటుంది. కడెంకు కుప్టికి మధ్య ఉన్న దూరం కేవలం 30 కి. మీ. మాత్రమే. 750 అడుగుల ఈ వ్యత్యాసపు ఎత్తు అనేది, నీటిపారుదల పరిభాషలో భారీ ఎత్తు గానే పరిగణిస్తారు. కాలుష్యం లేని జల విద్యుత్తుకు, ఎత్తి పోతలు అసలే లేని గ్రావిటీ సాగుకు అత్యద్భు తమైన అరుదైన ప్రాకృతిక అనుకూలత! జల విద్యుత్తు భారీ ఎత్తున ఉత్పత్తి అవుతుంది. కుప్టితో కుంటాల జలపాతం సంవత్సరం అంతా నీరు ఎత్తిపోస్తూ, తెలంగాణలోనే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా భారీ ఆదాయంతో కళకళలాడుతుంది. నేరేడిగొండ, ఇచ్చోడ ప్రాంతపు బీడు భూములకు ఎత్తిపోతలతో సాగునీరు ఇవ్వవచ్చు. -నైనాల గోవర్ధన్ (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్మొబైల్: 97013 81799) -
మారాల్సిన దౌత్యం తీరు
దౌత్య కెమిస్ట్రీ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహం భారత్, అమెరికా మధ్య సంబంధాలకు ఒక నిర్మాణాత్మక వాతావరణాన్ని అందిస్తుంది. ఇలాంటి సంబంధం ఉద్రిక్తతలను తగ్గిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. అయితే దౌత్యం అనేది పూర్తిగా నాయకత్వ స్థాయి కెమిస్ట్రీ పైనే ఆధారపడదు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు అదృష్టవ శాత్తూ పరస్పర ప్రయోజనం, ప్రజా మద్దతుకు చెందిన దృఢమైన చట్రంపై ఆధారపడి ఉన్నాయి. జాతీయ ప్రయోజనాలకు సంబంధించి, బహుళ రంగాలలో అనేక సంవత్సరాల పరిణామ క్రమంపై కూడా ఇవి నిర్మితమై ఉన్నాయి. అయితే మనం జీవిస్తున్నది విచ్ఛిన్న మవుతున్న ప్రపంచం. దీంట్లో ఆత్మసంతృప్తికి కాలం చెల్లిపోయింది.మారిన సవాళ్లునేడు మనం ఎదుర్కొంటున్న వాస్తవాలు ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలానికి భిన్నంగా ఉన్నాయి. ప్రపంచ దౌత్య చలనశీలత మారిపోయింది. యుద్ధం– సంఘర్షణ, కొల్లగొట్టే పోటీ, వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచీకరణకు చెందిన క్షీణిస్తున్న ఆకర్షణలు భౌగోళిక రాజకీయాలను నిర్వచిస్తున్నాయి. ట్రంప్ తన ‘అమెరికా ఫస్ట్’ ఎజెండాతో అధికారంలోకి వచ్చారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదా నికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అమెరికన్ రాజకీయాల్లో జన రంజక, స్థానికవాదపు ఉప్పెనపై ఆయన స్వారీ చేస్తున్నారు.మోదీ అమెరికా పర్యటన ఫలితాలను మీడియా మొత్తంగా విశ్లే షించింది. ఇప్పుడు భారతదేశంపై ట్రంప్ ప్రాపంచిక దృక్పథం చూపిన ప్రభావం గురించి మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ట్రంప్ విలువ ఇవ్వలేదని కాదు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో గగనతలం, భూమి, సముద్రం, అంతరిక్షం, సైబర్‌స్పేస్‌తో సహా వివిధ రంగాలను ఉన్నతీకరించడానికి, సైనిక సహకారాన్ని పెంచడానికి ఇరు పక్షాలూ ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టమైంది. ఎఫ్–35 జెట్ల వంటి అధు నాతన విమానయాన వ్యవస్థల అమ్మకాలకూ, సహ ఉత్పత్తికీ ప్రణాళి కలు ఉన్నాయి. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఇండో–పసిఫిక్ వాణిజ్యం, వలసల కోసం ఉమ్మడి వ్యూహాత్మక దృష్టి కూడా ఉంది. ఇవి మరింత సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయి.అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న ‘ప్రతీకార’ సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ప్రాథమికంగా దెబ్బతీస్తాయి, వ్యాపార అనిశ్చితులు పెరుగుతాయి, భౌగోళిక రాజకీయ అంతరాలు తీవ్రమ వుతాయి. దేశాలు అమెరికాతో తమ వాణిజ్య సంబంధాలను తిరిగి అంచనా వేయవలసి ఉంటుంది. ఇప్పటికే ఏర్పర్చిన సరఫరా గొలు సులు, అలాగే ప్రపంచ ఆర్థిక స్థిరత్వం కూడా ప్రభావితం కావచ్చు. అమెరికా సుంకాలను విధించడం వల్ల ఉత్పత్తి ఖర్చులు ప్రభావిత మవుతాయి. ఇది వినియోగదారులను దెబ్బతీస్తుంది. అధిక ద్రవ్యో ల్బణానికి దోహదం చేస్తుంది. వాస్తవానికి, చైనాకు దూరం జరు గుతూ, తన సరఫరా గొలుసులను అమెరికా వైవిధ్యపరిచినందు వలన, మన వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ వస్తువుల రంగాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే, ప్రపంచంతో ఆర్థిక సంబంధాలపై ట్రంప్ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానం భారత్‌కు సవాళ్లను కలిగిస్తుంది. వాటిని తక్కువ అంచనా వేయకూడదు.బ్రిక్స్ దేశాలకు బెదిరింపుఅమెరికాతో మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూనే మన ఆర్థిక ప్రయోజనాలను సమతుల్యం చేసుకోవడానికి జాగ్రత్తగా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ప్రతీకార సుంకాల విధానం భారత్ తన సొంత సుంకాలను హేతుబద్ధీకరించుకోవడా నికి తోడ్పడుతుంది. ఈ సంవత్సరం చివరిలోపు రెండు దేశాలు కుదుర్చుకోవాలనుకుంటున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలకు ఇది ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. అటువంటి ఒప్పందాన్ని చేరుకోవడం మన చర్చల నైపుణ్యాలకు నిజమైన పరీక్ష అవుతుంది. వలసల విషయానికి వస్తే, సంకెళ్లలో బంధించి మరీ, భారతీయ అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరిస్తున్న విధానం చాలా మందికి రుచించలేదు. ఇంతవరకూ అనుసరించిన బహిష్కరణ విధా నాలు తీవ్రమైన వివాదానికి దారితీశాయి. మన జాతీయులతో అమా నుషంగా ప్రవర్తించారనే భావన దేశీయుల్లో ఉంది. విదేశాలలోని మన పౌరులను రక్షించడంలో వైఫల్యంగా దీన్ని అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అంతర్జాతీయంగా తన పౌరులను రక్షించుకోగల సామర్థ్యం స్మార్ట్ పవర్లో ఒక భాగం. చట్టపరమైన వలసలను, హెచ్–1బీ వీసా సమస్యలను రెండు దేశాలు నిస్సందేహంగా దీటుగా ఎదుర్కోగలవు. కానీ మానవ అక్రమ రవాణా పరిశ్రమను మన ఏజెన్సీలు ఎలా సమర్థంగా అణచివేయగలవనేదే మన సమస్య.బ్రిక్స్ దేశాలకు ట్రంప్ చేసిన హెచ్చరిక మరొక ఆందోళనను రేకెత్తిస్తోంది. అమెరికన్ డాలర్ శక్తి ఆధారంగా ట్రంప్ ప్రపంచ ఆధిప త్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డాలర్ ఆధిపత్యాన్ని నిరోధించే ప్రత్యా మ్నాయ ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ దేశాలు అనుసరిస్తే బ్రిక్స్‌కు మరణ శాసనం లిఖిస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. బ్రిక్స్ సభ్యదేశమైన దక్షిణాఫ్రికా, శ్వేత ఆఫ్రికనర్ మైనారిటీని ప్రభావితం చేసే భూ విధా నాల కారణంగా చిక్కుల్లో పడింది. దీనిని ఎలాన్ మస్క్ ‘జాత్యహంకార యాజమాన్య చట్టాలు’గా ఎత్తి చూపారు. మస్క్ దక్షిణాఫ్రికాలో తన స్టార్‌లింక్ ప్రాజెక్ట్ కోసం సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. ఫలి తంగా దక్షిణాఫ్రికాకు తాను అందించే అన్ని ఆర్థిక సహాయాలనూ అమెరికా నిలిపివేసింది. పైగా జొహాన్నెస్‌బర్గ్‌లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాకూడదని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. విధాన ‘సూత్రాల’కు నష్టం కలుగుతున్నట్లు కనిపిస్తే దౌత్య సంబంధాలను త్యాగం చేయడానికి కూడా ట్రంప్ సిద్ధంగా ఉన్నారని ఇది చెబుతోంది.బహుళ ధ్రువ ప్రపంచంబహుళ ధ్రువ ప్రపంచం గురించి నేడు చాలా చర్చ జరుగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ఇంట ర్వ్యూలో ‘ప్రపంచానికి ఏక ధ్రువ శక్తి ఉండటం సాధారణం కాదు’ అని అంగీకరించారు. ఇది ఓదార్పునిచ్చే మాటగా అనిపించవచ్చు. కానీ ‘అమెరికా ఫస్ట్’ అనే ప్రాపంచిక దృక్పథం అమెరికా ప్రాధాన్యం గురించిన అంతర్లీన అంచనాలను కలిగి ఉంది. పైగా బ్రిక్స్‌కు హెచ్చ రిక బహుళ పక్ష సమూహాలకు కూడా మేల్కొలుపు కానుంది: గట్టిగా కోరుకుంటే ఉనికిలో ఉండండి, కానీ అమెరికన్ నియమాల ప్రకారం ఆడండి. అందుకే కొందరు ట్రంప్ కొత్త అధ్యక్ష పదవిని తనదైన ’సామ్రాజ్యవాదం’ అని పిలుస్తున్నారు.అమెరికా రక్షణ మంత్రి పీట్ హేగ్సెత్ ఇటీవల మాట్లాడిన ‘స్పష్ట మైన వ్యూహాత్మక వాస్తవాలు’ యూరప్ రక్షణ నుండి అమెరికా వైదొలగుతుందనీ, ఈ బాధ్యతను యూరోపియన్లకు వదిలివేస్తుందనీ సూచిస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ వివాదంలో శాంతి అంటే రష్యా బలమైన పక్షం అని, ఉక్రెయిన్ ‘నాటో’లో భాగం కాలేదని లేదా రష్యా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి పొందాలని అది కోరు కోలేదని ఆయన మాటలు సూచిస్తున్నాయి. విజేత అన్నింటినీ ఆక్ర మించగలదని భావించే ప్రపంచంలో ఇజ్రాయెల్ ఛాంపియన్ కాబట్టి పాలస్తీనియన్లు సర్వం కోల్పోయారని పీట్ మాటలు చెబుతున్నాయి. చైనా విషయానికొస్తే, వాణిజ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు ఇతర రంగాలలో సహకారాన్ని విస్తరించ డానికి లేదా కనీసం ఆయనతో ఒక నిలకడైన పద్ధతిలో వ్యవహరించ డానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ప్రస్తుత సంద ర్భంలో స్నేహితులు, శత్రువులు ఎవరూ లేరు. కేవలం లావాదేవీలు జరపాలి, ఒప్పందాలు కుదుర్చుకోవాలి. భారతదేశం తదనుగుణంగా తన దౌత్య దిక్సూచిని నిర్దేశించుకోవాలి.నిరుపమా రావు వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి -
సాంత్వననిచ్చే గొంతులు
అంతా నిన్ననే జరిగినట్లుంది. జ్ఞాపకం ఏమాత్రం మసకబారలేదు. ఫాదర్ టెర్రీని నేను మొదటిసారి కలిసి దాదాపు 45 ఏళ్ల య్యింది. అది 1982. వేసవి కాలం చివరి రోజులు. నిషా, నేను పెళ్లి చేసుకోబోతున్నాం. మా రెండు జీవితాలు ఒక్కటి కాబో తున్నాయి. తను క్యాథలిక్కు. అన్ని లాంఛ నాలతో చర్చిలో పెళ్లి జరగాలని ఆమె కోరిక. నాకూ అభ్యంతరం లేదు. కాకుంటే చర్చి మతాధికారిని మూడుసార్లు కలిసి పెళ్లి ట్యూషన్ చెప్పించుకోడం ఒక్కటే నాకు నచ్చలేదు. అలా చేస్తేనే నిషాకు నాన్–క్రిష్టియన్ అయిన నాతో పెళ్లి జరుగుతుంది. ఈశాన్య ఇంగ్లాండ్‌లోని నార్తంబర్లాండ్ ఎవెన్యూలోని సెయింట్ మేరీ మాగ్దలీన్ చర్చి నిబంధన అలా ఉంది. కాబట్టి ఒప్పుకోక తప్పలేదు. సెప్టెంబరు నెలలో ఒక శనివారం నేను, నిషా కలిసి ఫాదర్ టెర్రీ దగ్గరకు వెళ్లాం. అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం 6 గంటలు. ఆయన డెస్క్ వెనుక కూర్చుని ఉన్నారు. గది చివరన ఎదురుగా ఉన్న పాత లెదర్ సోఫా మీద మేం కూర్చున్నాం. ముక్కు మీదకు జారిన కళ్లజోడు పైనుంచి ఆయన మమ్మల్ని నిశితంగా గమనిస్తున్నారు. బయట వేడిగా ఉన్నా ఆ గదిలో వాతావరణం ఎందుకో బాగా చల్లగా ఉంది. ‘‘షెర్రీ తీసుకుంటారా?’’ ఫాదర్ చేసిన ఆఫర్ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘ మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు. నాకు మాత్రం షెర్రీ వైన్ చాలా ఇష్టం’’ అన్నాడాయన. ఆయన ఇచ్చిన టియో పెపే నా ఫేవరైట్ బ్రాండ్. ఫాదర్ టెర్రీకి ఎన్నో విషయాల్లో మంచి పరి జ్ఞానం ఉంది. వివేచనశీలి. కాసేపట్లోనే మేం బాగా దగ్గరయ్యాం. యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, సల్మాన్ రష్దీ ‘మిడ్నైట్స్ చిల్డ్రెన్’ నవల... మా మధ్య చర్చకు వచ్చాయి. విశేష మేమిటంటే... మా పెళ్లి ఎలా జరగాలి, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతం స్వీకరించాల్సి ఉంటుంది వంటి అసలు విషయాలు మినహా అన్నీ చర్చించాం. ఫాదర్ టెర్రీ జారిపోతున్న కళ్ల జోడును వెనక్కు ఎగదోసుకుంటూ సంభాషణను చక్కగా ఎంజాయ్ చేశారు. గంట సేపు ఇట్టే గడచిపోయింది. వచ్చే వారం మళ్లీ కలవాలనుకున్నాం. ఇక మేము సెలవు తీసుకుని అలా తలుపు వద్దకు వెళ్లామో లేదో ఫాదర్ మమ్మల్ని ఆపేశారు. ‘మీరు విడివిడిగా ఎందుకు ఉంటున్నారు?’ అంటూ బాంబు లాంటి ఒక ప్రశ్న కూల్‌గా అడిగారు. అలా అడుగుతున్నప్పుడు, ఆయన గుండ్రటి ముఖం మీద చిరుదరహాసం మెరిసింది. దాంతో మా ముఖాలు లిప్తపాటు రక్తవిహీనం అయ్యాయి. నోట మాట రాలేదు. వాస్తవం ఏమిటంటే, మేం అప్పటికే సహజీవనం చేస్తున్నాం. కానీ ఆ విషయం దాచిపెట్టి, ఫాదర్ టెర్రీకి మేము వేరు వేరు చోట్ల ఉంటు న్నట్లు అడ్రస్‌లు ఇచ్చాం. ఆయన ఆ విషయం పసిగట్టారు. అయినా అదేమంత పెద్ద విషయం కాదులే అంటూ మమ్మల్ని ఆ ఇరకాటం నుంచి బయట పడేశారు. అలా ఉండేది ఆయన సరళి. ఫాదర్ టెర్రీ మాకు త్వరలోనే ఆప్తమిత్రుడయ్యారు. మా పెళ్లికి రెండు రోజుల ముందు ఒక రిహార్సల్ జరిగింది. పెళ్లిలో భగవద్గీత నుంచి ఏవైనా రెండు మంచి మాటలు చదవాలని ఆ సందర్భంగా ఆయన సూచించారు. ఆ ఎంపిక బాధ్యత నా మీదే పెట్టారు. తీరా ఆ సమయం వచ్చేసరికి నేను చేతులెత్తేశాను. ‘మరేం ఫర్లేదులే, ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించి వేరొకటి రెడీగా పెట్టుకున్నా’ అంటూ నవ్వి మృదువుగా నా వీపు చరిచారు. ఆయన ఎంపిక చేసుకున్న పేరా ఖలీల్ జిబ్రాన్ ‘ప్రాఫెట్’ లోనిది.పెళ్లి సందర్భంగా ఫాదర్ టెర్రీ చేసిన ఉపదేశం అందరినీ ఆకట్టుకుంది. నరకం, దేవుడు, దేవుడి మంచితనం... వంటి పెద్ద మాటలను పక్కన పెట్టారు. ఐ లవ్ యూ అనే ‘మూడే మూడు చిన్న మాటలు’ చెప్పారు.‘నేను, నువ్వు అనే భేదాన్ని ప్రేమ చెరిపేస్తుంది... అలాగే అది ఆ రెంటినీ విడదీస్తుంది కూడా! కరణ్, నిషా... మీరు ఈ సత్యం గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇద్దరు విభిన్న వ్యక్తులు అనే వాస్తవాన్ని మర్చి పోయిన రోజు ఆ బంధం కూడా వేర్పడిపోతుంది.’’ఈ ప్రవచనం ఆర్భాటం లేకుండా ఇష్టాగోష్ఠిలా సాగింది. స్నేహ పూర్వకమైన ఆయన సందేశం మర్చిపోలేనిది. పాతికేళ్లుగా అది నా జ్ఞాపకాల్లో మసకబారకుండా నిలిచిపోయింది.ఆరేళ్ల తర్వాత... నిషా తన ఆఖరు ఘడియల్లో లైఫ్ సపోర్ట్ మీద ఉన్నప్పుడు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు మత కర్మలు నిర్వహించారు. అంతే కాకుండా, మా అమ్మను కూడా నిషా చెవిలో హిందూ పుణ్యవచనాలు వినిపించవల్సిందిగా కోరారు. చివరకు నిషా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్న క్షణాల్లో కూడా ఫాదర్ టెర్రీ నా పక్కనే ఉన్నారు. నాకు తెలిసిన ఒకే ఒక క్రైస్తవ మతాచార్యుడు టెర్రీ గిల్ఫెడర్! ఆయన అసాధారణమైన గొప్ప వ్యక్తి. క్రైస్తవుల మీద, ముస్లిముల మీద దాడులు జరిగాయన్న వార్తలు చదివిన ప్రతిసారీ నేను ఆయనను తలచుకుంటాను. గాయపడిన హృదయాలకు సాంత్వన చేకూర్చేందుకు ఫాదర్ టెర్రీ వద్ద ఎప్పుడూ కొన్ని మాటల దివ్యౌ షధాలు ఉండి తీరుతాయి. ఆయన ఆఫర్ చేసే షెర్రీ వారికి ఉపక రిస్తుంది.ఫాదర్ టెర్రీలు ప్రతి మతంలోనూ ఉంటారు. దైవమే పరమావధిగా భావించేవారు సాటి మానవులను ప్రేమపూర్వకంగా అర్థం చేసుకోగలరు. మనకు అలాంటి వారి అవసరం నేడుఎంతగానో ఉంది. అయినా వారెవరూ ఎందుకు నోరు మెదపడం లేదు?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మీరు చాలా మారాలి సార్!
అంతరిక్షంలో చిక్కుకుపోయి, భూమికి చేరేమార్గం కోసం ధైర్యంగా ఎదురుచూస్తున్న సునీతా విలియమ్స్ (Sunita Williams) వంటి సాహసగత్తెల కాలంలో ఉన్నాము. అదే సమయంలో స్త్రీల మీద వివక్షలు మారకపోగా కొత్త రూపాలు తీసుకున్నాయని ఇటీవలి కొన్ని వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. ప్రాబల్య స్థానాల్లో ఉన్న కొందరు పురుషులు బహిరంగంగా, ఎటువంటి సంకోచాలూ లేకుండా స్త్రీల గురించి చేస్తున్న వ్యాఖ్యలు పితృస్వామ్య సామాజిక స్థితిని దగ్గరగా చూపిస్తున్నాయి. ఈ పురుషుల్లో సినిమా నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, చివరికి న్యాయ, రక్షణ వ్యవస్థలు కూడా ఉండడం వివక్ష తీవ్రతను తెలుపుతున్నది.మాట, చూపు, హావభావ కవళికల్లో పెద్దమనిషితనం ఉట్టి పడుతున్నట్లు కనిపించేలా సవాలక్ష జాగ్రత్తలు తీసుకునే ‘మెగాస్టార్’ ఈసారి దొరికిపోయారు. ఆడపిల్లలతో నిండిన తన ఇల్లు లేడీస్ హాస్టల్లా, తను వార్డెన్‌లా ఆయనకి అనిపించింది. అయిదుగురు చెల్లెళ్లకి రక్షకుడిలా తను నటించిన ‘హిట్లర్’ సినిమా నిజం అనుకున్నారు కాబోలు! అంతేకాకుండా తమ లెగసీ కొనసాగించడానికి ఈసారైనా కొడుకుని కనమని కొడుక్కి బహిరంగంగా చమత్కారపూర్వక సలహా ఇచ్చారు. పసిబిడ్డ మొహాన్ని కూడా బహిరంగపరచకుండా తమ ప్రైవసీని కాపాడుకునే అతని కొడుకూ కోడలూ – తమ ఆడపిల్లకి ఎదురైన ఈ బహిరంగ వివక్షని ఎలా తీసుకుంటారో బహుశా అది వారి కుటుంబ విషయం. కానీ అనేకమంది ఆరాధకులని పెంచి పోషించుకునే ఒక సినిమా నటుడిగా ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకించవలసినవి. రేపుమాపు ‘మెగా’ అభి మానులందరూ తమ ఇంటి స్త్రీలకి వార్డెన్లగానూ, లెగసీ కోసం కొడుకుల్ని కనమని వేధించేవారిగానూ ఉండడమే ఫ్యాషన్ అనుకుంటే అది ప్రమాదం కనుక ఈ వ్యాఖ్యలని కొందరైనా ఖండిస్తున్నారు. స్త్రీలపట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో సినీనటుడు బాలకృష్ణ ‘గాడ్ ఆఫ్ వల్గారిటీ’కి ప్రతీకగా మారిపోయారు. స్త్రీలను ఉద్దేశించి నర్మగర్భంగా తను ఎక్కని ఎత్తులు, దిగని లోతులు లేవని అనడం, వెంటపడే పాత్రలు చేస్తే తన ఫాన్స్ ఊరుకోరని, అమ్మాయిలు కనపడగానే ముద్దయినా పెట్టాలి, కడుపైనా చేసేయాలని కోరుకుంటారన్న అసభ్య వ్యాఖ్యలకి కోర్టుకేసులు ఎదుర్కున్నారు. ఒక నటిని పడిపోయేంతగా వేదిక మీద నెట్టడం దగ్గర్నుంచి తన చుట్టూ ఉండే స్త్రీలతో కొన్నిసార్లు ఆయన ప్రవర్తన వేధింపు పరిధిలోకి వస్తుంది. ఇటీవల విడుదలైన చిత్రంలోని ఒక పాటకు ఆయన వేసిన స్టెప్పులు దిగజారడానికి పరిధులు ఏమీ లేనంత హీనమైనవి. అది కళారంగపు టేస్ట్ అనుకుని వదిలేయనివ్వలేదు బాలకృష్ణ (Balakrishna). అదే నటితో ఒక ప్రయివేట్ పార్టీలో అవే స్టెప్పులు వేస్తూ ఆమెని ఇబ్బంది పెట్టారు. వారికి లేని బాధ మీకేమిటనే అభిమానులకి కొరత లేదు. మగనటుల పవర్, స్త్రీ నటుల అవకాశాలను ప్రభావితం చేస్తుంది కనుక వారు ఊరుకుంటారు. కానీ సమాజం కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు. బహిరంగంగానే ఇలా ఉంటే కనపడని వేధింపులు ఎన్నో ఊహించలేము. నటుడిగా దాక్కోడానికి చోటు ఉన్నట్లు రాజకీయాల్లో ఉండదు కనుక ఇట్స్ టైమ్ టు స్టాపబుల్ మిస్టర్ ఎమ్మెల్యే!భార్యతో భర్త చేసే బలవంతపు అసహజ శృంగారం నేరం కాదని ఇటీవల ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (chhattisgarh high court) ఇచ్చిన తీర్పు ఇపుడు చర్చలోకి వచ్చింది. 2017లో జరిగిన ఘటన ఇది. భర్త చేసిన అసహజ లైంగికచర్యల కారణంగా భార్య అనారోగ్యానికి గురయి మరణించింది. మరణ వాంగ్మూలంలో ఆమె ఇదే చెప్పింది. కింది కోర్టు వేసిన పదేళ్ళ శిక్షని కొట్టేసి భర్తని నిర్దోషిగా తేల్చింది హైకోర్టు. మారిటల్ రేప్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. భార్యకి ఇష్టం లేకుండా భర్త బలవంతంగా ఆమె శరీరాన్ని తాకకూడదన్నది ఒక విలువగా, హక్కుగా సమాజానికి అలవాటు కావాల్సిన సమయంలో ఈ తీర్పు స్త్రీల లైంగిక స్థితిని కొన్ని రెట్లు వెనక్కి నెట్టేదిగా ఉంది. ఆ భర్త అసహజ లైంగిక చర్య చేయడం గురించి కొంతమంది తప్పు బడుతున్నారు. సహజమా, అసహజమా అన్నది కాదు ముఖ్యం. ఆమె సమ్మతి ముఖ్యం. స్త్రీని లైంగిక కోరికలు తీర్చే వస్తువుగా చూసే పాత ఆలోచనా విధానాన్ని అందరూ సవరించుకోవాల్సిన అవస రాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తోంది. పనిగంటల విషయంలో ఎల్ అండ్ టి ఛైర్మన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చాలా చర్చల్లోకి వచ్చాయి. వారానికి తొంభై పనిగంటలు పనిచేయాలని సూచిస్తూ ‘ఇంట్లో మీరు మీ భార్య మొహం ఎంతసేపు చూస్తూ ఉండగలరు, మీ భార్య మీ మొహం ఎంతసేపు చూస్తూ ఉండగలదు’ అని వ్యాఖ్యానించారు. పనిగంటల భారాన్ని వ్యతిరేకిస్తూ ఇంటిపనులు, బైటిపనులు, వ్యక్తిగత, మానసిక అవసరాల గురించి చాలామంది మాట్లాడారు. అయితే తక్కువగా చర్చకు వచ్చిన విషయం ఒకటి ఉంది. అది ఈ పనిగంటల సూచన కేవలం మగ ఉద్యోగులను ఉద్దేశించినట్లుగా ఉండడం. దాని ద్వారా ఇల్లు, పిల్లలు, వృద్ధుల బాధ్యతలు మగవారి టెరిటరీ కావు, అవి కేవలం స్త్రీలకి ఉద్దేశించినవి మాత్రమేనన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు! మగవారు తమ పూర్తికాలం ఉద్యోగంలో గడిపితే కుటుంబాల సమస్త బాధ్యతలు స్త్రీల మీద పడతాయి. ఉద్యోగం పురుష లక్షణం, ఇల్లు దిద్దుకోవడం స్త్రీ లక్షణంగా ఆ వ్యాఖ్యల అంతరార్థం స్ఫురిస్తోంది. చదవండి: ‘దంగల్’ చూడండి ‘మాస్టారు’పై నాలుగు ఘటనల్లో నాలుగు ప్రధానమైన సమస్యలు మన ముందుకు చర్చకు వచ్చాయి. ఆడశిశువుని పురిటిలోనే చంపేసిన సమాజాలు మనవి. ఆ దశ దాటి వస్తున్నాము. ఆకాశంలో సగాలకి తాము వార్డెన్లమని బాధపడటం కాకుండా– వారి పుట్టుక, ఎదుగు దల, విజయాలు సాధికారికంగా సెలెబ్రేట్ చేసుకోవడం మన వివేకంలో భాగం కావాలి. స్త్రీలకు సొంత లైంగిక వ్యక్తిత్వం ఉంటుంది. అధికారం, హోదా, పేరు ప్రఖ్యాతులతో మదించినవారు ఆ వ్యక్తిత్వం మీద దాడి చేస్తూనే ఉంటారు. చదవండి: దీపికా పదుకోన్ (బాలీవుడ్ నటి) రాయని డైరీధైర్యంగా వ్యతిరేకించే వారు పెరగాలి. న్యాయవ్యవస్థలు న్యాయసూత్రాల పరిధికి లోబడి పనిచేస్తాయి. న్యాయసూత్రాలు కాలం చెల్లినవిగా, స్త్రీలకి రక్షణ కల్పించలేనివిగా ఉన్నప్పుడు వాటిమీద పౌరసమాజం విస్తృత చర్చ చేయాలి. ఇంటిపనికి విలువ కట్టడం సరే, స్త్రీ పురుషుల మధ్య పని విభజనకి మార్గదర్శకాలు రూపొందించుకోవాలి. వీటన్నిటితో పాటు లోకం తన చూపుకి మరికాస్త స్త్రీ తత్వాన్ని అద్దుకోవాలి.కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
అన్నదొకటి... అయ్యిందొకటి!
కాలక్రమంలో వాడుకలో ఉన్న కొన్ని పదాలు అర్థం కోల్పోతాయని, పైగా వాటికి పూర్తి విరుద్ధమైన అర్థాలు పుట్టుకొస్తాయని ప్రముఖ రచయిత జార్జ్ ఆర్వెల్ అంటారు. 8 ఏళ్ల క్రితం ‘ఒకే దేశం ఒకే పన్ను’ అన్నది లక్ష్యంగా, చక్కని సరళతరమైన పన్ను (గుడ్ అండ్ సింపుల్ టాక్స్– జీఎస్టీ)గా చెప్ప బడిన ‘జీఎస్టీ’ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) క్రమంగా తన అర్థాన్ని మార్చుకొంది. 2017 జూలై 1న ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీఎస్టీ చిన్న, సన్నకారు వ్యాపారుల సమస్యలను తీర్చకపోగా వారికి అనేక చిక్కుముళ్లను తెచ్చి పెడుతోంది.జీఎస్టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణ నీయంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వస్తు సేవల వినియోగం పెరుగుతుంది. దాంతో సహజంగానే పన్ను వసూళ్ల మొత్తం పెరుగుతుంది. ఇపుడు జరుగుతున్నది అదే! ఒక దశాబ్ద కాలంలో దేశస్థూల ఉత్పత్తి గణనీ యంగా పెరిగింది. ప్రజల తలసరి ఆదాయమూ హెచ్చింది. కనుక కేవలం జీఎస్టీ అమలు కారణంగానే పన్ను ఎగవేతలు తగ్గాయని, కేంద్రం చెబుతున్నట్లు జీఎస్టీ వల్ల దేశంలో ‘పన్ను ఉగ్రవాదం’ సమసిపోయిందని చెప్పడం అర్ధసత్యమే. దేశంలో 8 ఏళ్ళుగా అమలవుతున్న జీఎస్టీ వల్ల అనేక సమ స్యలు వస్తున్నాయని పలు వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ, వాటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదు. సరళతరమైన పన్నుగా జీఎస్టీని చెప్పుకోవడం వరకు బాగానే ఉంది గానీ, ఆ పన్ను రేట్లు, వివిధ శ్లాబులలోకి వచ్చే వస్తువులు, సేవల విషయంలో కేంద్రం, రాష్ట్రాల నడుమ ఇంకా ఏకాభిప్రాయం కుద రకపోవడం గమనార్హం. ముఖ్యంగా, రాష్ట్రాలకు అతి పెద్ద ఆదాయ వనరులుగా ఉన్న పెట్రోల్, డీజిల్, మద్యం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడానికి మెజార్టీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికి 50కి పైగా సమావేశాలు జరిపినప్పటికీ పలు అంశాలపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. చిక్కుముళ్లుజీఎస్టీ అమలులో అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. ఇందులో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ప్రధానమైనది. జీఎస్టీలో 5, 12, 18, 28 శాతాలుగా పన్ను రేట్లు ఉన్నాయి. 1400 పైబడిన వస్తువులు; 500 రకాల సేవలను ఈ 4 శ్లాబులలో సర్దుబాటు చేశారు. భారీ కసరత్తు అనంతరం రేట్లను ఖరారు చేశామని చెప్పారుగానీ అందులో హేతు బద్ధత, మానవత్వం కనుమరుగయ్యాయన్న విమర్శల్ని సాక్షాత్తూ బీజేపీ నేతలే చేస్తున్నారు. ఉదాహరణకు జీవిత బీమా (లైఫ్ ఇన్సూ రెన్స్), ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) ప్రీమియంలపై 18% జీఎస్టీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన సహచర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బహిరంగ లేఖ సంధించడం కలకలం రేపింది. సామాన్యులకు అవసరమైన జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై 18% జీఎస్టీ వేయడం వల్ల... వారందరూ జీవితం, ఆరోగ్య రక్షణకు దూరం అవుతారని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. ఇక, శ్లాబుల విషయంలో స్పష్టత లోపించడం వల్ల చెల్లింపుదారులకు, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య వివాదాలు తలెత్తి చివరకు అవి న్యాయస్థానాలకు చేరుతున్నాయి. అలాగే, కోవిడ్ ప్రబలిన 2020, 2021 సంవత్సరాలలో రాష్ట్రాలకు కేంద్రం అందించిన ఆర్థిక సహకారాన్ని తిరిగి రాబట్టుకొనేందుకు ‘సెస్సు’ విధించి ప్రజలపై అదనపు భారాన్ని మోపింది. ఈ సెస్సును ఉపసంహరించు కోవాలన్న అభ్యర్థనను సైతం కేంద్రం పెడచెవిన పెట్టింది.జీఎస్టీ పరిధిని క్రమంగా విస్తరిస్తూ పోతున్నారు. శ్లాబ్‌లను మారుస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులపైన, ప్రాణాలు నిలబెట్టే ఔషధాలపైన కనిష్ఠంగా 5% జీఎస్టీని మాత్రమే వేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తు న్నారు. వెన్న, నెయ్యి, పాలు వంటి పాల ఉత్పత్తుల పైన, ప్యాకింగ్ చేసిన కొబ్బరి నీళ్లు, పండ్ల రసాల పైన 18% జీఎస్టీ విధించడం ఏవిధంగానూ సమర్థనీయం కాదు. చివరకు పెన్నులపైన కూడా జీఎస్టీ విధిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన 55వ జీఎస్టీ మండలి సమావేశంలో... పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పాప్ కార్న్‌పై 3 రకాల జీఎస్టీని విధించడాన్ని ప్రజలు తప్పుబట్టారు. ఎంఎస్ఎంఈలకు శరాఘాతంజీఎస్టీ అమలులో స్పష్టత, హేతుబద్ధత లోపించడం వల్ల దెబ్బ తిన్న ప్రధాన రంగాలలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగం ఒకటి. దేశీయ తయారీరంగంలో దాదాపు 70% మేర ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తున్న ఎంఎస్ఎంఈ రంగం జీఎస్టీ కారణంగా కుదేలైందన్నది ఓ చేదు వాస్తవం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చాక... అవి చాలా వరకు మూతపడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్ను వేయడం వల్ల... దేశంలో దాదాపు 20 కోట్ల మంది ఆధారపడిన సూక్ష్మ–మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం కలిగింది. వాటి సప్లయ్ చెయిన్ తెగిపోయిందని ఆ రంగంపై అనేక ఏళ్లుగా జీవనం సాగిస్తున్నవారు మొత్తుకొంటున్నారు. ఒకవైపు వస్తుసేవలను అంతి మంగా వినియోగించుకొనే వారే పన్ను చెల్లించాలని చెబుతూ... మరో వైపు బహుళ పన్నులు వేస్తున్న పరిస్థితి కొన్ని రంగాల్లో ఉంది. వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్కరించుకోవడానికి జీఎస్టీ అప్పీ లేట్ ట్రిబ్యునల్‌ను అందుబాటులోకి తెచ్చిన మాట నిజమే గానీ... చిన్న వ్యాపారులు ఎంతమంది దానిని ఆశ్రయించగలరు? ఇక, స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఆ యా ఉత్ప త్తులపై పన్నులు విధించే హక్కు గతంలో రాష్ట్రాలకు ఉండేది.ప్రజలకు జవాబుదారీతనం ఎక్కువగా వహించేది రాష్ట్రాలే. కానీ, రాష్ట్రాలకు తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే అవ కాశం జీఎస్టీ వచ్చాక తగ్గిపోయింది. రాష్ట్రాల వినతులకు జీఎస్టీ కౌన్సిల్లో పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదన్న వాదన ఉంది. జీఎస్టీకి సంబంధించి ఏ యే రాష్ట్రాలు ఎన్నెన్ని అభ్యర్థనలు అంది స్తోంది? అందులో వేటికి ఆమోదం తెలుపుతున్నారు? ఎన్నింటిని బుట్టదాఖలా చేస్తున్నారన్న సమాచారాన్ని వెల్లడించడం లేదు. నిజానికి, తగిన సన్నద్ధత లేకుండా జీఎస్టీని అమలులోకి తేవడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. జీఎస్టీ అమలు లోకి వచ్చి 8 ఏళ్లు గడిచాయి. జీఎస్టీ మండలి 55 పర్యాయాలు సమావేశమైంది. అయినా అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లల్లో కనబడుతున్న వృద్ధిని చూసి మురిసి పోవడమే తప్ప... ఎదురవుతున్న ఇబ్బందుల్ని సాధ్యమైనంత తొంద రగా పరిష్కరించలేకపోవడం వైఫల్యంగానే పరిగణించాలి. పుట్టుక తోనే లోపాలు ఉన్న బిడ్డగా జీఎస్టీని కొందరు అభివర్ణించారు. మరి కొందరు జీఎస్టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. ఈ రెండూ నిజమే కావొచ్చు. కానీ, అంతిమంగా ప్రజ లకు మేలు జరుగుతున్నదా లేదా అన్నదే కొలమానం. రచయిత జార్జ్ ఆర్వెల్ చెప్పినట్లు కొన్ని పదాలు అర్థం కోల్పోవడమే కాక వాటికి పూర్తి భిన్నమైన అర్థాలు పుట్టుకొస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ ‘సంస్కరణ’ అనే పదం. ప్రపంచీకరణ తర్వాత ఈ పదా నికి అర్థం మారిపోయింది. సంస్కరణ అంటే ఆర్థిక భారంగా ప్రజలు భావిస్తు న్నారు. జీఎస్టీ అంశంలో కూడా సరళతరమైన పన్ను అనే భావన పోయి జీఎస్టీ అంటేనే మోయలేని భారం అని ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది.» జీఎస్టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణనీ యంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది.» పుట్టుకతోనే లోపాలున్న బిడ్డగా జీఎస్టీని కొందరు అభివ ర్ణించారు. మరికొందరు జీఎస్టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. కానీ, అంతిమంగా ప్రజ లకు మేలు జరుగుతున్నదా లేదా అన్నదే కొలమానం.» చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చాక... చాలా వరకు మూతపడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్నువల్ల... దాదాపు 20 కోట్ల మంది ఆధా రపడ్డ సూక్ష్మ–మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం కలిగింది.- వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, మాజీ కేంద్రమంత్రి- డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -
విధాన లోపాలే మణిపూర్‌కు శాపం
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ .బీరేన్ సింగ్ ఎట్టకేలకు ఈ నెల 9న రాజీనామా చేశారు. సుమారు 21 నెలలపాటు రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేసిన తెగల కొట్లాటలకు ఈయన ఆజ్యం పోశారని అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన కొద్ది సమయానికి సీఎం తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మణిపూర్‌లో దీర్ఘకాలం కొనసాగిన అనిశ్చితి, ద్వేషపూరిత వాతావరణం కారణంగా మాన భంగాలు, హత్య, విధ్వంసాలు రాజ్యమేలిన సంగతి తెలిసిందే. దేశ ఈశాన్య ప్రాంతం ఒకప్పుడు ఉగ్రవాదానికి, చొరబాట్లకు, మత్తుమందులకు, ఆయుధాల అక్రమ తరలింపులకు కేంద్రంగా ఉండిందనీ, ప్రస్తుతం అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, వ్యవ సాయాభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులకు మారుపేరుగా నిలిచిందనీ అమిత్ షా పేర్కొనడం గమనార్హం. దశాబ్ద కాలంలో కేంద్ర మంత్రులు ఈ ప్రాంతాన్ని 700 సార్లు సందర్శించారని కూడా ఆయన అన్నారు. అగర్తలలో కొంతమంది యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి ఆన్ లైన్ మాధ్యమంలో హాజరైన హోం శాఖ మంత్రి మాట్లాడుతూ, త్రిపుర సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నా యని అన్నారు. ఆశ్చర్యకరంగా ఇదే రకమైన భరోసా, సాంత్వన మాటలు మణిపూర్ విషయంలో ఈ నేత నుంచి వెలువడలేదు!వ్యతిరేకత స్పష్టమయ్యాకే...బీరేన్ సింగ్ రాజీనామాకు కొన్ని రోజుల క్రితం అమిత్ షా మణి పూర్ పంచాయతీ రాజ్ మంత్రి, సీఎం వ్యతిరేకి వై.ఖేమ్‌చంద్ సింగ్, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ టోక్‌చోమ్ సత్యబ్రత సింగ్‌లతో సమావేశ మయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మంది సత్యబ్రతను కలిసి సీఎం నేతృత్వం పట్ల తమ అసంతృప్తిని స్పష్టం చేశారు. ప్రజలు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తాము నిర్దిష్ట నిర్ణయాలు తీసుకుంటామనీ, ఇంకా వేచి ఉండటం సాధ్యం కాదని కూడా వీరు తేల్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పున రుద్ధరణ తక్షణం జరగాలనీ, లేదంటే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని అనూహ్య పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందనీ వీరు హెచ్చరించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10న ప్రారంభం కావాల్సి ఉండగా... సీఎం రాజీనామాతో అవి నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు త్రిపురలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలతోనూ విభేదించడం గమనార్హం. 2023 మే నెలలో మణిపూర్‌లో రెండు తెగల మధ్య హింస మొదలైనప్పటి నుంచి బీరేన్ సింగ్ నాయకత్వం మీద అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. అయితే ప్రధాని, హోంశాఖ, బీజేపీ అధి ష్టానం బీరేన్ ను పదవి నుంచి తప్పించేందుకు ఇష్టపడలేదు. ఈ సమయంలోనే రాష్ట్రంలో నేతల మధ్య కుమ్ములాటలు అంతకంతకూ పెరగడం మొదలైంది. కుకి–జో వర్గానికి చెందిన పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని ప్రకటించారు. బీజేపీ భాగస్వామ్య పక్షాలైన నాగాస్ పీపుల్స్ ఫ్రంట్, జనతా దళ్(యునైటెడ్) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఈ క్రమంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది. అవిశ్వాస తీర్మా నాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే హోం శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసి, 2024 డిసెంబర్లో మణిపుర్ గవర్నర్‌గా నియమితులైన అజయ్ భల్లాకు రాష్ట్ర రాజకీయ, శాంతి భద్రతల పరిస్థితుల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన తన అనుభ వంతో రాజకీయ సంక్షోభాన్ని నియంత్రించగలిగారని అంచనా. ఘర్షణల్లో సీఎం పాత్ర?అయితే రాష్ట్రంలో తెగల మధ్య కొట్లాటను సీఎం స్వయంగా ఎగ దోశారన్న ఆరోపణలు వచ్చిన తరువాత పరిస్థితి ఆసక్తికరమైన మలుపు తిరిగింది. మానవ హక్కులపై ఏర్పాటైన కుకీ సంస్థ ఒకటి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొట్లాటల్లో సీఎం ప్రమేయంపై ఆడియో టేపులు ఉన్నాయని ఈ సంస్థ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ టేపులను పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్ ్స లాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్)కి పంపడమే కాకుండా... ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఈ టేపులను విశ్లేషించిన ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సర్వీసెస్ అందులోని గొంతు 93 శాతం బీరేన్ సింగ్‌దేనని స్పష్టం చేసింది. ట్రూత్‌ల్యాబ్ ఫలితాలు, సీఎఫ్ఎస్ఎల్తో సరిపోలితే దాని ప్రభావం మణిపూర్ రాజకీయాలపై మాత్రమే కాకుండా... జాతీయ స్థాయిలోనూ తీవ్రంగానే ఉండనుంది. బీరేన్ సింగ్ బీజేపీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వాలకు అనుగుణంగానే పనిచేశారు. ఘర్షణలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించినా పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆయన్ని తొలగించేందుకు ఇష్టపడకపోవడమే అందుకు నిదర్శనం. ప్రతిపక్షం బీరేన్ సింగ్‌ను తొలగించేందుకు ఒత్తిడి తీసుకు రావడమే కాకుండా... బీజేపీ కేంద్ర నాయకత్వంపై కూడా విమర్శల దాడికి సిద్ధమైంది. బీరేన్ సింగ్ కూడా మోదీ–షా తరహా హిందుత్వ రాజకీయాల స్ఫూర్తితో మెయితీలందరినీ ఒక ఛత్రం కిందకు తీసుకు రాగా... ఆర్ఎస్ఎస్ తన వంతు పాత్రను పోషించింది. మయన్మార్‌తో మణిపూర్ సుమారు 390 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగివుంది. ఈ సరిహదులో కంచె వేసిన ప్రాంతం 10 కిలోమీటర్లు మాత్రమే. చొరబాట్లకు కుకీ–జో తెగలు కారణమనీ,అందువల్లనే రాష్ట్రంలో అశాంతి పెరిగిపోతోందనీ బీజేపీ ఆరోపిస్తుంటే... ఆ తెగల ప్రతినిధులు మాత్రం ఘర్షణలను ఎగదొసేందుకు బీరేన్ సింగ్ ఈ చొరబాట్లను ఒక నెపంగా వాడుకున్నారని ఆరోపి స్తున్నారు. మయన్మార్ సరిహద్దులో మొత్తం కంచె వేయడం భౌగో ళికంగా అసంభవమని తెలిసినా, అవినీతి ఆర్థికశాస్త్రంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. స్వపరిపాలనే మార్గంఈ ప్రాంతంలో మత్తుమందుల రవాణా విచ్చలవిడిగా కొనసాగేందుకు మయన్మార్, థాయ్‌ల్యాండ్ సరిహద్దులు అంత సురక్షితంగా లేకపోవడమే కారణం. అక్రమ రవాణా, మత్తుమందుల వ్యాపారాలతో వచ్చే ఆదాయం సహజంగానే అయా ప్రాంతాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు వెళ్తుంది. మణిపూర్‌లో అధికారంలో ఉన్న బీజేపీ వీటికి అతీతంగా పనిచేస్తుందని అనుకోలేము. వేర్వేరు తెగలు ఉన్న మణిపూర్ వంటి రాష్ట్రాల్లో సమాఖ్య తరహా పాలన, స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలను ఏర్పాటు చేసు కోవడం మేలని నేను చాలాకాలంగా సూచిస్తూ ఉన్నాను. ఈ ఏర్పాట్ల వల్ల వేర్వేరు స్థాయుల్లో స్వపరిపాలనకు మార్గం ఏర్పడుతుంది. మణిపూర్‌లో కేవలం రెండు తెగలు మాత్రమే లేవు. హమార్, వైఫీ, గాంగ్టే, కోమ్, చిరు, ఆనల్, మారింగ్ తెగలూ ఉన్నాయి. కానీ మోదీ ప్రభుత్వం, బీజేపీ రెండూ తమకు రాజకీయంగా లాభం ఉంటే తప్ప స్వపరిపాలన వ్యవస్థల ఏర్పాటుకు అనుకూలంగా ఉండవు. ప్రకృతి వనరులు, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాల్లో కుకీలు ఎక్కువగా ఉంటారు. వీరికి స్వపరిపాలన మార్గం చూపితే అక్కడ కేంద్ర ప్రభుత్వానికి దగ్గరైన కార్పొరేట్ కంపెనీల ఆటలు చెల్లవు. దశాబ్ద కాలం అధికారంలో ఉన్నప్పటికీ మణిపూర్‌లాంటి సంక్షోభాలు తలెత్తిన ప్రతి సందర్భంలోనూ బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూంటుంది. అయితే కాషాయ పార్టీ స్వయంగా కొట్లాటలకు ఆజ్యం పోసిన సందర్భంలో మాత్రం ఈ విమర్శలకు విలువ ఉండదు. అన్నింటికీ మించి అందరం అడగా ల్సిన ప్రశ్న ఒకటి ఉంది... ఈ కల్లోలం నుంచి మణిపూర్ బయటపడే రోజు ఎప్పుడొస్తుంది?అజయ్ కె. మెహ్రా వ్యాసకర్త పొలిటికల్ సైంటిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విద్వేషం చేసిన దాడి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో గల చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్‌పై ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం కొందరు వ్యక్తులు ఆయన ఇంట్లోకి జొరబడి దాడి చేశారు. తమని తాము శ్రీరాముని వంశానికి చెందినవారమని చెప్పుకొన్న ఆ గుంపు, రామరాజ్య స్థాపన కోసం తమకు ఆర్థికంగా సహాయం చేయాలని, తాము ఏర్పాటు చేసుకున్న ‘శ్రీరామ సైన్యం’లోకి ఇక్ష్వాకు వంశస్తులను ఎంపిక చేయించాలని రంగరాజన్‌ను డిమాండ్ చేశారు. దానికి ఆయన నిరాకరించినందుకు ఆయనపై భౌతిక దాడి చేశారు. హిందూత్వ భావ జాలానికి ప్రతినిధులుగా వ్యవహరించే వారంతా ఇలాంటి దాడులే గతంలో చేస్తే ఎవరూ నోరు మెదపలేదు. కానీ ఈరోజు రంగరాజన్ పైన జరిగిన దాడిని మాత్రం మూకుమ్మడిగా ఖండిస్తూ వస్తున్నారు.నిజానికి ఇది మొదటి దాడి కాదు, ఇలా విద్వేషంతో జరుగుతున్న దాడుల పరంపరలో చివరిది కూడా కాకపోవచ్చు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ రాష్ట్ర స్థాపన కోసం తాము చేసే ప్రయత్నానికి సహకరించమని పలువురు హిందువులు గౌరవంగా చూసే, పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తిపై దాడి చేయడం ఈ సంఘటనలో గల కొత్త అంశం. ఎవరైనా హిందూ మతాన్ని అగౌరవ పరుస్తున్నారని, మతానికి నష్టం కలిగిస్తున్నారని ఆరో పించి, అలా నష్టం కలిగించిన వారిని శిక్షించే పని కూడా తామే చేయడం ఇప్పటివరకు మనం చూశాం. ఇటీవల తుక్కుగూడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులపై జరిగిన దాడి కూడా మత విశ్వాసాలను ఆయన గౌరవించలేదన్న ఆరోపణ మీదనే! ఇప్పుడు మాత్రం మత విశ్వాసాలను గౌరవించి సనాతన ధర్మాన్ని పాటించి, దాని ఎదుగుదల కోసం నిరంతరం శ్రమించే అర్చకుని పైన దాడి జరిగింది.ఇది అత్యంత హేయమైన చర్య. బహుశా వారికి రంగరాజన్, అతను ఆలయాన్ని నడిపే పద్ధతి, ఆయనకి ఈ వ్యవస్థ పట్ల గల గౌరవం కూడా నచ్చలేదని తెలుస్తోంది. అంటే వచ్చిన వారికి భారత రాజ్యాంగం పైన, న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం లేదన్నది స్పష్టం. వారు తమ సొంత ఊహా ప్రపంచంలో, తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం ఒక ఉన్మాద స్థితిలో ఉన్న మూక. ఇది సాధా రణ హిందూ మతస్థులపైన అదుపుతప్పిన హిందూత్వ విద్వేషం చేసిన దాడి!ఎదుటి వ్యక్తుల విశ్వాసాలు మన విశ్వాసాలకు భిన్నమైనవి అయినందువల్ల మాత్రమే ద్వేషించాలి అన్న అభిప్రాయం సాధారణ హిందూ జన సామాన్యానికి ఎప్పుడూ లేదు. ఇప్పుడు యువతలోకి క్రమంగా వచ్చి చేరుతున్న అసహన వాతావరణం రంగరాజన్ పైన జరిగిన దాడి ద్వారా మనకు తెలుస్తుంది. దాడికి వచ్చిన శ్రీరామసేన ఏర్పాటు చేసిన వీర రాఘవరెడ్డి అనే యువకుడు తన యూట్యూబ్ ఛానల్లో చిత్రవిచిత్రమైన వీడియోలు పెట్టాడు. వాటిని చూసినప్పుడు అతను ఎలాంటి రాజ్యాన్ని స్థాపించడానికి ఆ సేన ఏర్పాటు చేశాడో మనకు అర్థం అవుతుంది. మన దేశానికి రాజ్యాంగం 1950 జనవరి 26న అమలైన నాటికంటే ముందే ఈ దేశంలో మనుస్మృతి అనే రాజ్యాంగం ఉన్నదని, అది అసలు ఈ దేశపు రాజ్యాంగం అని, ఇప్పుడు అమలవుతున్న రాజ్యాంగం మన భారత దేశపు విలువలకు సరిపోదని అతని ప్రగాఢ విశ్వాసం. నిజానికి ఈ విశ్వాసం అతనికి మాత్రమే లేదు ఈ దేశాన్ని ప్రస్తుతం పరిపాలిస్తున్న పార్టీ సైద్ధాంతిక భావజాలానికి కారణమైన సంస్థ కూడా నమ్ముతున్నట్లుంది. సమానత్వ, సౌభ్రాతృత్వ, లౌకిక విలువలకు వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తే కలిగే విపరిణామాలు ఇలాగే ఉంటాయి. దాన్ని ఒంట పట్టించుకున్నటువంటి యువత దారి తప్పుతుంది. అలాంటి వారే ఈరోజు ఈ రకంగా దాడులకు పాల్పడు తోందని అర్థం చేసుకోవాలి. విద్వేషాలకు స్వస్తి పలికితేనే సమాజానికి శ్రేయస్కరం.– టి.హరికృష్ణ, మానవ హక్కుల వేదిక. -
ఏఐలో చైనాతో పోటీ పడగలమా?
లియాంగ్ వెన్ఫెంగ్ అనే 39 ఏండ్ల చైనా యువకుడు తన నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ– కృత్రిమ మేధ) కంపెనీలో అతి తక్కువ ఖర్చుతో ఒక అద్భుతం చేశాడు. అతను డీప్‌సీక్ అనే కొత్త చాట్ బాట్ యాప్‌ను కనిపెట్టి ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టాడు. జనవరి చివరి వారంలో ప్రవేశపెట్టిన ఈ సెర్చ్ ఇంజిన్ ఒక్కరోజులోనే అమెరికాకు ఒక ట్రిలియన్ డాలర్లు, అంటే ఒక లక్ష కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌లు తయారుచేసే కంపెనీలు భారీ నష్టాన్ని చవి చూశాయి.సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ప్రపంచ సమాచార సెర్చ్ అంతటినీ గూగుల్ కంపెనీ గుప్పిట్లో పెట్టుకొని ఉంది. అంతేకాకుండా ఇతర యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ మొదలైనవన్నీ అమెరికన్ల పరిశోధనలో రూపుదిద్దుకున్నవే. ఈ రంగంలో చైనా వారు కూడా ఈ అమెరికా టెక్నాలజీని తీసుకొని తమ దేశ అవసరాలకు అప్లై చేసుకుంటున్నారు. లియాంగ్ ఒక ఇంట ర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం, చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఇప్పటివరకు జరుగలేదు. ఆధార ఏఐ సైన్సును లియాంగ్ ఇన్నోవేటివ్ సైన్సుగా మార్చాడు.హేతుపూర్వక సమాజంఐతే చైనా చాలా ఇతర రంగాల్లో ఇన్నోవేషన్లు చేస్తూ వస్తున్నది. అది కమ్యూనిస్టు దేశంగా మారకముందే తమ దేశంలోని అగ్రి కల్చరిజం అనే ఫిలాసఫీని కన్ఫ్యూషియనిజం, బుద్ధిజంతో జతపర్చి సమాజాన్ని ఒక హేతుపూర్వక సమాజంగా మారుస్తూ వచ్చింది. మతతత్వానికంటే ముందే వారు వ్యవసాయ తత్వానికి పాఠశాలల్లో ఉన్నత స్థానమిచ్చారు. పిల్లల్ని బడి నుండి పొలానికి, పొలం నుండి బడికి పంపి... పని, పాఠాలు కలగలిపి నేర్పించారు. చైనా పాఠశాల విద్యా విధానం వందల సంవత్సరాల శ్రమ జీవన పాఠాలతో ముడిపడింది. ఆ దేశంలో మతాన్ని, హేతుబద్ధతను ముడేశారు. దాన్ని పిల్లలకు నేర్పే అగ్రికల్చరిజం ఫిలాసఫీతో అనుసంధానించారు. భూమికి, ఆకాశానికి, ప్రకృతికి, వానకు, గాలికి గల సంబం«ధాన్ని మెటీరియలిస్ట్ ఆధ్యాత్మికతకు అనుసంధానించడం వల్ల చిన్న ప్పటినుండే పిల్లల మెదళ్లలో క్రియేటివ్ దైవవాదం ఏర్పడింది. ఈ విధానాన్ని సభ్య సమాజమంతటికీ అనుసంధానించారు. తద్వారా వారి దైవం ఉత్పత్తిలో భాగమయ్యాడు లేదా అయింది.అందుకే గన్ పౌడర్, కాగితం, కంపాస్, అచ్చు యంత్రం, సిస్మోమీటర్ (భూకంపాల అధ్యయన మిషన్) ముందు వాళ్ళే కనిపెట్టారు. సిస్మోమీటర్ను 1880లో బ్రిటిష్ జాన్ మిల్నే కను క్కున్నాడని రాసుకున్నప్పటికీ అది మొదలు చైనా కనిపెట్టిందే. ఆ సైన్సు తరువాత జపానుకు పాకి వారిని చాలా భూకంపాల నుండి కాపాడింది.డెంగ్ షియావోపింగ్ కాలంలో ప్రపంచ ఆధునిక సైన్సుతో తమ సైన్సును అనుసంధానం చేస్తున్నప్పుడు, మావో ధరించే ‘బంద్ గలా కోటు’ తమదేనా లేదా ‘టై అండ్ సూట్’ తమదా అని చర్చ జరిగింది. ఐతే టై–సూట్ చైనా డిస్కవరీ అని చారిత్రక ఆధారాలు దొరికాయి. దాంతో అధ్యక్షుడి నుండి కిందిస్థాయిల వరకు టై– సూట్‌ను అధికార డ్రెస్‌కోడ్‌గా మార్చుకున్నారు.ఇండియా పరిస్థితి ఏమిటి?చైనా యువకులు గత ముప్పయి సంవత్సరాలుగా యూరో– అమెరికా డిస్కవరీస్తో పోటీ పడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మావో కల్చరల్ రెవల్యూషన్ కాలంలో ఇచ్చిన నినాదం ‘మాయా వాదాన్ని బద్దలుకొట్టి, ప్రకృతిని పఠించు’. ఆయన యునాన్ రిపోర్టులో ఆ దేశంలోని అగ్రికల్చరిజం తత్వభూమికను బాగా అర్థం చేసుకున్నాడు. ఈ మొత్తం పరిణామ క్రమమే చైనాలో సైన్సు,మతం, నైతికత జాగ్రత్తగా అనుసంధానం కావడం. ఆ సామాజిక చైతన్యం నుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వాళ్ళు అమెరికాను తలదన్నే మార్గంలో ఉన్నారు. అందులో భాగమే డీప్‌సీక్. మరి మన దేశం స్థితి ఏమిటి? రుగ్వేద రచనా కాలంలోనే ఇక్కడి అగ్రికల్చరిజం ఫిలాసఫీని చంపేశారు. ఉత్పత్తి రంగంలో శాస్త్రీయ శ్రమ చేస్తున్న శూద్రులను (దళితులూ అందులో భాగమే) బానిసలుగా మార్చి, శ్రమశక్తి అజ్ఞాన మని నిర్వచించారు. ఈ ఆలోచనను బలోపేతం చెయ్యాలని ఆరెస్సెస్–బీజేపీ నాయకత్వం సైన్సు నుండి మతాన్ని సంపూర్ణంగా విడగొట్టాలనే భావనతో పయనిస్తోంది. చైనా డీప్‌సీక్ కనిపెట్టి అమెరికాను అతలాకుతలం చేసిన రోజులలోనే కుంభమేళాపై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఖర్చవుతున్నాయి. ఉత్పత్తికీ, ఆధునిక సైన్సుకూ పూర్తిగా దూరంగా ఉండేవారికి మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. వీటి ప్రభావం లక్షలాది మంది స్కూలు, కాలేజీ పిల్లల మీద పడి దీన్నే భారతదేశ మార్గంగా భావించే దశకు తీసుకెళ్తున్నారు. ఉత్పత్తితో ముడిపడినవారికి స్తుతి చెయ్యట్లేదు. కూర్చొని తినేవారికి రాజ్యం గౌరవ పీఠం వేస్తుంది.ఇంగ్లిష్ వ్యతిరేక ప్రచారం, పురాతన దుస్తులు ధరించాలనే ప్రచారం యువకులను కచ్చితంగా సైన్సు వ్యతిరేకులను చేస్తుంది. ఈ దేశపు యువతను సీరియస్ యూనివర్సిటీ పరిశోధ కులను చెయ్యనివ్వకుండా మూఢ నమ్మకస్తుల్ని చేస్తుంది.ప్రశ్నించే తత్వం ముఖ్యంచైనాలో అది మతరంగంలోగాని, ఉత్పత్తి రంగంలో గాని, యూనివర్సిటీలోగాని ప్రశ్నించే తత్వాన్ని బాగా నేర్పుతారు. మావో ‘వంద ఆలోచనలు ఘర్షణ పడనివ్వు, వంద పువ్వులు వికసించనివ్వు’ నినాదం వాళ్ళ సంఘర్షణల చరిత్ర నుండి వచ్చింది. కానీ ఇండియాలో స్కూళ్లు, యూనివర్సిటీల్లో మతరంగాన్ని, అంతకంటే ముఖ్యంగా ఉత్పత్తి రంగాన్ని ఆలోచనల ఘర్షణలకు బయట నడవాలనే సంప్రదాయాన్ని ప్రచారం చేస్తున్నారు. మోహన్ భాగవత్ ఉత్పత్తికీ, దేవుడికీ మధ్య సంబంధం, ఘర్షణ గురించి ఒక్క ఉప న్యాసం ఇవ్వగా మనం చూడలేదు. మోదీ కూడా నెహ్రూ లాగా సైన్సు మీద ఒక్క సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వలేదు. చైనాతో సమానంగా ఉన్న ఇంత పెద్ద జనాభాను సైన్సుకు శత్రువులను చేస్తే కొత్త ఆలోచనలు యువతకు ఎక్కడి నుండి వస్తాయి?నేను ఇంతకుముందు వ్యాసంలో చెప్పినట్లు... కులం, ఏకవృత్తి, మూఢ నమ్మకాలు వేల ఏండ్లుగా మన మెదడు చిప్‌ను లాక్ చేసిన స్థితి ఉన్నది. ఆరెస్సెస్/బీజేపీ ప్రయత్నం ఈ లాక్ చెయ్యబడ్డ చిప్‌ను ఓపెన్ చెయ్యడం వైపు లేదు. వారి రాజకీయ మూఢ నమ్మకం ఈ లాక్‌ను తుప్పు పట్టించింది. అది పగల కొడితే తప్ప ఓపెన్ కాదు. కానీ అలాంటి ప్రయత్నం మన విద్యా రంగంలో ఎవరు మొదలు పెట్టినా వారిని దేశద్రోహులు, సనాతన వ్యతిరేకులు అని ముద్ర వెయ్యడం, భయభ్రాంతులకు గురి చెయ్యడం మామూ లైంది. ఈ స్థితిలో చైనాతో పోటీపడే డిస్కవరీస్ ఇక్కడ ఎలా జరుగుతాయి? కొత్త డిస్కవరీలు జరగడానికి డబ్బు ఒక్కటే సరి పోదు. సైంటిస్టును అభివృద్ధి చేసే సామాజిక, గృహ, మార్కెట్, మత పునాది ఉండాలి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
కేజ్రీవాల్ క్రేజ్ తగ్గిందా?
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుకున్న కంచు కోట బీటలు బారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు సాధించి అధికారంలోకి వస్తే, 62 స్థానా లతో అధికారంలో ఉన్న ఆప్ 22 సీట్లకు పడిపోయి పరాజయం పొందింది. అంతకు మించి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. ‘కర్ణుని చావుకు సవా లక్ష కారణాలు’ ఉండొచ్చేమోగానీ, కేజ్రీవాల్ ఓటమికి వేళ్ల మీద లెక్క బెట్టదగ్గ కారణాలే ఉన్నాయి.కేజ్రీవాల్ రెవెన్యూ సర్వీసులో ఉండగానే 1999లో ‘పరివర్తన్’ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి, ఢిల్లీ ప్రజలకు పన్నులతో పాటు ఇతర సామాజిక విషయాల మీద అవగాహన కల్పించే వారు. సమచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని ఢిల్లీలోని ప్రభుత్వ సంస్థల్లో అవినీతిని వెలికి తీశారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2006లో ‘రామన్ మెగసెసే అవార్డు’ లభించడంతో ఆయనకు దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. 2011లో ఢిల్లీలోని ‘జంతర్ మంతర్’ వద్ద అవినీతికి వ్యతిరేకంగా ‘జన్ లోక్ పాల్’ బిల్లును తీసుకురావాలని అన్నా హజా రేతో కలిసి దీక్ష చేసి దేశం దృష్టిని ఆకర్షించారు. ‘జీవితంలో నేను ఎన్నికల్లో పోటీ చేయను. ఏ పదవీ చేపట్టను. యాక్టివిస్టుగానే ఉంటా’ అని ప్రకటించు కున్న కేజ్రీవాల్, అనూహ్యంగా 2013లో రాజకీయా ల్లోకి అడుగుపెట్టారు. మొత్తానికి ఢిల్లీ ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. అయితే గడిచిన ఐదేళ్లలో ఆప్ ప్రజల అంచనాలను అందుకోలేకపోయింది. దాని పర్యవసా నమే 2025 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.సామాన్యుల సీఎంనని, ప్రభుత్వ బంగ్లా తీసు కోనని చెప్పి... ఖరీదైన శీష్ మహల్ నిర్మించుకోవడాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారు. ఈ అంశాన్ని బీజేపీ వ్యూహాత్మకంగా ‘కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ కాదు, కాఫీ ఆద్మీ’ అని ప్రచారం చేసింది. అవినీతికి వ్యతి రేకంగా వ్యవస్థను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కానీ, దీనికి విరుద్ధంగా ఆయనతో పాటు ఆయన మంత్రులు అవినీతి కేసుల్లో ఇరుక్కోవడంతో విశ్వసనీ యత కోల్పోయారు. అవినీతి ఆరోపణలు వస్తే నాయకులు రాజీనామా చేయాలని చెప్పిన కేజ్రీవాల్, తాను జైల్లో ఉన్నా రాజీనామా చేయలేదు. సిసోడి యాని అరెస్టు చేయగానే, రాజీనామా చేయించిన కేజ్రీవాల్, తను జైల్లో ఉండి కూడా చాలాకాలం కుర్చీని వదల్లేదు. దీంతో అవినీతి వ్యతిరేక ఆందోళన నుంచి పుట్టుకొచ్చిన ఆప్ అవినీతి పార్టీగా మారిందని బీజేపీ ప్రచారం చేసి జనాన్ని తనవైపు తిప్పుకుంది. జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాక రాజీనామా చేసి, కీలుబొమ్మ లాంటి ఆతిశీని సీఎం చేయడం ఒక నాటకంలా ప్రజలు భావించారు. కేజ్రీ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ సీఎం కుర్చీలో కూర్చొని మీడియాతో మాట్లాడేవారు. అదే కుర్చీని ‘కేజ్రీవాల్ పట్ల తనకున్న గౌరవం’ పేరుతో ఖాళీగా వదిలేసి ఆతిశి మరో కుర్చీలో కూర్చోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆప్ నేతలు ఒకవైపు కేసుల్లో ఇరుక్కోవడం, మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఆప్ అంతకుముందు ఐదేళ్లలో చేసినట్టుగా ఈసారి పరిపాలించలేక పోయింది. 2020 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఎన్నికల ముందు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని చేసిన కీలక ప్రకటన... మధ్యతరగతిని బీజేపీ వైపు తిప్పింది. ఇది ఉద్యోగులు అధికంగా ఉండే న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీ వాల్ ఓటమికి కూడా కారణమైంది. 2015, 2020 ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించడంతో ఢిల్లీలో తనకు ఎదురేలేదని భావించిన కేజ్రీవాల్ అతి విశ్వాసంతో దేశంలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించు కోవడానికి ప్రయత్నాలు చేశారు. పంజాబ్ విజయంతో ఈ అతివిశ్వాసం మరింత మితిమీరింది. గోవా, గుజరాత్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓట్లు చీల్చి, కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారు. జీవితంలో కాంగ్రెస్ పార్టీతో కలవ నని చెప్పిన కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల సమయంలో మాటమార్చి ‘ఇండియా’ కూటమితో కలిశారు. ఆరు నెలలు తిరగకుండానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్తో తెగదెంపులు చేసుకోవడంతో రెండు పార్టీలు ఎవ రికి వారే పోటీ చేశారు. ఢిల్లీలో ఈసారి దాదాపు 6 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్, చాలా చోట్ల ఓట్లను చీల్చి ఆప్ విజయవకాశాలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా ముస్లిం, ఎస్సీ ఓట్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు పడటంతో బీజేపీకి కలిసొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓట మితో పాటు కేజ్రీవాల్ స్వయంగా ఓడిపోవడంతో ‘ఆయనకు క్రేజ్ తగ్గిందా’ అనే చర్చలు ప్రారంభ మయ్యాయి. కేజ్రీవాల్‌కు మళ్లీ క్రేజ్ పెరగడంతోపాటు ఆప్‌కు ఆదరణ పెరగాలంటే ఆయన గతంలోవలే ఢిల్లీ లోని కాలనీలు, గల్లీలు, మొహల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు చేరువయితే, మరో ఐదేళ్లలో ఆయనకు పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయి.జి. మురళీ కృష్ణ వ్యాసకర్త సీనియర్ రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ -
హిట్లర్‌ను మానవుడన్న మహాత్ముడు!
ఇప్పుడు రాస్తున్న దానిని గతవారమే నేను ఈ కాల మ్లో రాసి ఉంటే, అప్పు డది మహాత్మాగాంధీ వర్ధంతి రోజుకు మరింత సంద ర్భోచితంగా ఉండి ఉండే దని అనిపించవచ్చు. అదే కారణంతో అలా నేను రాసి ఉంటే సమయం,సందర్భం చూసి, రెచ్చకొట్టడానికి నేను రాసిన ట్లుగా ఉండేది. లేదంటే, మనోభావాలను దెబ్బ తీసినట్లయ్యేది. కాబట్టి, ఈరోజు నేను లేవనెత్తు తున్న విషయాలపై మీ ప్రతిస్పందన భావావేశా లకు లోను కాని విధంగా ఉంటుందని ఆశిస్తాను. గాంధీ మరణించిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడైనా – ఆయనకున్నటువంటి కొన్ని వివాదాస్పద, లేదా విరుద్ధమైన, అదీ కాకుంటే ఆమోదయోగ్యం కానివైన అభిప్రాయాలను మనం ఎలా పరిగణించాలన్న దానిని పరిశీలించవలసిన అవసరం ఉంది. 2024లో అవి మనకు దిగ్భ్రాంతిని గొల్పవచ్చు. 1940ల లోనైనా వాటికి ఇప్పటి కన్నా ఎక్కువగానే సమ్మతి లభించి ఉంటుందని నాకైతే నమ్మకం లేదు. భారత స్వాతంత్య్రం, దేశ విభజనలపై అలెక్స్ వాన్ తంజల్మాన్ (బ్రిటిష్ చరిత్రకారిణి) పుస్తకం ‘ఇండియన్ సమ్మర్’ (2007)ను జాగ్ర త్తగా చదివినప్పుడు–రెండో ప్రపంచ యుద్ధం, హిట్లర్, ఆనాటి మారణహోమం పైన గాంధీజీ దృష్టికోణం ఏమిటో తెలిసి నిర్ఘాంతపోయాను. గాంధీ శాంతి కాముకులని, అహింస పట్ల ఆయన నిబద్ధత తిరుగులేనిది, కొదవలేనిదని మనకు తెలిసిందే. ఆ నిబద్ధతే ఆయనను... హిట్లర్, ముస్సోలినీల దురాక్రమణ ప్రయత్నాలను అడ్డుకోవద్దని బ్రిటన్‌కు సలహా ఇచ్చేంతవరకు తీసుకెళ్లిందా! ‘‘వారిని మీ అందమైన దీవిని జయించనివ్వండి. పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని చంపేయటానికి మీకై మీరు వారిని అనుమతించండి. అయితే వారికి విధేయంగా ఉండటానికి మాత్రం నిరాకరించండి’’ అని చెప్పారాయన. 1962లో ఇండియాపై చైనా దాడి, లేదా ఇండి యాపై పాకిస్తాన్ పదే పదే చేస్తుండే దాడుల విషయంలో కూడా గాంధీ అలాగే స్పందించే వారా? ఏమైనా మహాత్ముడు భీతికొల్పేంత స్థిర చిత్తుడు అయుండాలి కానీ కపటి మాత్రం కాదు. మరీ అధ్వాన్నం... హిట్లర్ దుష్టుడు అంటే గాంధీకి నమ్మబుద్ధి కాకపోవటం! ‘‘గౌరవనీయు లైన హిట్లర్‌ను – ఆయన్ని చిత్రీకరించినంత – చెడ్డ వారిగా నేను పరిగణించను’’ అని 1940లో గాంధీ రాశారు. ‘‘ఎక్కువ రక్తపాతం లేకుండా విజయాలు సాధించే అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న ట్లుగా ఆయన నాకు కనిపిస్తారు’’ అన్నారు. ‘‘భవి ష్యత్ జర్మన్లు శ్రీ హిట్లర్‌ను మేధావిగా, ధీశాలిగా, సాటిలేని కార్యాచరణశీలిగా, మరెన్నో విధాలుగా గౌరవిస్తారు’’ అని గాంధీ భావించారు. దీనికన్నా కూడా, మాటల్లో వివరించలేనిది ఏమిటంటే – యూదుల పట్ల నాజీల అమానవీయ ప్రవర్తనపై గాంధీ ప్రతిస్పందన. లూయీ ఫిషర్ (అమెరికన్ జర్నలిస్ట్) రాసిన మహాత్ముడి జీవిత కథను ఉటంకిస్తూ, వాన్ తంజల్ మాన్... యూదులు సానుకూలమైన ప్రతిఘటనను మాత్రమే నాజీలకు అందించాలనీ, అవసరం అయితే తమ జీవితాలను సైతం త్యాగం చేయాలనీ గాంధీ సలహా ఇచ్చారని వెల్లడించారు. అడాల్ఫ్ హిట్లర్ కోసం ప్రార్థించమని కూడా ఆయన వారిని కోరారట. ‘‘కనీసం ఒక యూదుడు ఇలా చేసినా అతడు తన ఆత్మగౌరవాన్ని కాపాడు కున్నట్లేనని, అందువల్ల ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాడని, ఆ మంచితనం అంటువ్యాధిలా విస్త రించి మొత్తం యూదు జాతినే కాపాడుతుందని, మానవాళికి సుసంపన్నమైన ఒక గొప్ప వారస త్వాన్ని వదిలివెళుతుందని గాంధీ అన్నారు’’ అని లూయీ ఫిషర్ రాసినట్లు వాన్ పేర్కొన్నారు. యూదుల నిర్బంధ శిబిరాలను కనుగొన్నాక కూడా, వాటిల్లో జరుగుతున్న అతి భయానక దారుణాలు ప్రపంచం దృష్టికి వచ్చాక కూడా లూయీ ఫిషర్‌తో గాంధీ ఇలా అన్నారు: ‘‘హిట్లర్ 50 లక్షల మంది యూదులను చంపాడు. ఇది మనకాలపు అతి పెద్ద నేరం. కానీ యూదులు తమకై తాము కసాయి కత్తికి తమను సమర్పించుకుని ఉండాల్సింది. తమను తాము శిఖరం అంచులపై నుండి సముద్రంలోకి తోసుకుని ఉండాల్సింది...’’హింసపై పూర్తి వ్యతిరేకత, అహింస పట్ల అచంచలమైన నిబద్ధత కలిగి ఉన్న కారణంగానే గాంధీ అలా అని ఉంటారనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే అంతవరకే అది ఏకైక ఆమోదయోగ్యమైన ప్రతిస్పందన. హిట్లర్‌ను ఎది రించవద్దని, హిట్లర్ కోసం ప్రార్థించమని, తమకు తాము ఆత్మార్పణం చేసుకోవాలని ఆయన యూదులకు చెప్పటం మాత్రం విడ్డూరం. కనికరం లేకపోవటం, కించపరచటం, క్రూరత్వం.1984లో సిక్కులకు, 2002లో ముస్లింలకు, నేటి ఆదివాసీలకు గాంధీ ఇచ్చే సలహా కూడా అదే విధంగా ఉండేదా? బహుశా... ఉండేది! మళ్లీ అడి గినా ఇదే సమాధానం. బ్రహ్మచర్యంతో గాంధీ చేసిన ప్రయోగాల మాదిరిగా కాకుండా... యుద్ధం మీద, హిట్లర్ మీద, మారణహోమం మీద ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు వ్యక్తిగత వ్యామోహాలు, బలహీనతల స్థాయికి మించినవి. ఆయన ఒకవేళ దేశాన్ని పరిపాలించి ఉంటే అవి విధానాలుగా మారిఉండేవి. అందుకే వాటిని చర్చించి, పరిష్కరించాల్సి ఉంది. అంతిమంగా, వాటికి ఆమోదయోగ్యమైన వివరణ లభించకపోతే వాటిని విమర్శించాలి. తిప్పికొట్టాలి. ఇలా అంటున్నందుకు నేను చిక్కుల్లో పడతాననే మాటనైతే నేను కాదనను.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మయన్మార్ ముక్కలవడం ఖాయమా?
2025 ఫిబ్రవరి 1న మయన్మార్ అంత ర్యుద్ధం ఐదో సంవత్సరంలోకి ప్రవేశించింది. ‘తమడో’ (మయన్మార్ సైనిక బలగాలు) తిరుగుబాటు చేసినప్పటి నుండి దేశంలో జనజీవితం మారిపోయింది. 2020 ఎన్ని కలలో గెలిచినప్పటికీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ నేతృత్వంలోని ప్రభుత్వం అధి కారంలోకి రావడానికి సైనిక నాయకత్వం ఎన్నడూ అనుమతించలేదు. దాని నాయకు లను, మద్దతుదారులను అరెస్టు చేశారు. ఏడాదిపాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సైన్యం ద్వారా నూతన ప్రభుత్వం ‘స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్’ ఏర్పడింది. దీనికి సైన్యం కమాండర్ ఇన్‌చీఫ్ అయిన సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ నాయకత్వం వహి స్తున్నారు. ఆయన తనను తాను మయన్మార్ ప్రధానమంత్రిగా ప్రక టించుకున్నారు. 2008 రాజ్యాంగం ప్రకారం ఈ పదవి లేదు. సంవ త్సరం లోపే ఎన్నికలు జరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు.2025లో మయన్మార్ ఎన్నికలపై ఊహాగానాలు జరుగు తున్నాయి. ప్రతిపక్ష నాయకులను, జుంటా (సైనిక నాయకత్వం) వ్యతిరేకులను అరెస్టు చేస్తూనే ఉన్నారు. అంతర్యుద్ధానికి పరిష్కారా లను కనుగొనే ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. మయన్మార్ ప్రజలు బాధలకు గురవుతూనే ఉన్నారు. గ్రామాలను తగలబెట్టడం, వైమానిక బాంబు దాడులు, మరణ శిక్షలు వంటి పాత వ్యూహాలనే సైనిక నాయకత్వం ఉపయోగిస్తున్న క్రమంలో, మయన్మార్‌లో అంత ర్గతంగా స్థానభ్రంశం చెందిన వ్యక్తుల సంఖ్య 33 లక్షలను దాటింది.తగ్గుతున్న సైన్య ప్రాభవంగత రెండేళ్ల కాలంలో, మయన్మార్‌లో సైనిక బలగాల అధికారం, భూభాగంపై నియంత్రణ తగ్గిపోవడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. జనరల్ నే విన్ తలపెట్టిన 1962 సైనిక కుట్ర, సైనిక కుట్రకు దారితీసిన 1988 తిరుగుబాటు రెండు సందర్భాల్లోనూ అధికారం చేజిక్కించుకున్నాక సైన్యం బలపడింది. కానీ 2021 సైనిక కుట్ర తర్వాత విషయాలు భిన్నంగా ఉన్నాయి. ప్రజా ప్రతిఘటన మరింత ఆచరణీయమైన నిర్మాణంతో తన బలాన్ని పెంచుకుంది.ప్రవాసంలో ఉన్న ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్’ ఏర్పర్చిన ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్’ సైనిక అణచివేతను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా సహ కరించింది. ఇది పౌర అవిధేయతా ఉద్యమానికి ఊపునిచ్చింది. ప్రజా స్వామ్యం నుండి మయన్మార్ వెనక్కి తగ్గడం వల్ల నిరాశ చెందిన యువత ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో చేరారు. దీనికి సమాంతరంగా, అనేక జాతి సాయుధ సంస్థలు ఈ అవ కాశాన్ని ఉపయోగించుకుని అవి చాలా కాలంగా పోరాడుతున్నప్రాంతాల నుండి తమడో బలగాలను వెనక్కి నెట్టాయి. షాన్ లోని ‘మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ’, ‘తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ’, రఖైన్ లోని ‘అరకాన్ ఆర్మీ’, కరెన్నిలోని ‘కరెన్ని ఆర్మీ’ దీనికి కొన్ని ఉదాహరణలు. ఆసక్తికరంగా, ‘కాచిన్ ఇండిపెండెన్్స ఆర్మీ’ వంటి అనేక జాతీయ సాయుధ సంస్థలు ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్’కు బహిరంగంగా మద్దతు ఇచ్చాయి. తమడోకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇలాంటి వివిధ సంయుక్త ఫ్రంట్ల ఉనికి మయన్మార్‌లో దీర్ఘకాలిక అంతర్యుద్ధానికి ప్రారంభ సంకేతం. గతంలో మాదిరిగా కాకుండా, మయన్మార్ అంతటా ఉన్న 330 టౌన్ షిప్‌లలో కనీసం 321 పట్టణాలకు ఈ పోరాటం వ్యాపించిందని వార్తలు వస్తున్నాయి.మయన్మార్ సైనిక బలగమైన తమడో అనేక కీలకమైన అంశా లలో విఫలమైంది. బలగాల పరంగా, 2024లో ఉన్న సైనికుల సంఖ్య 4,00,000 నుండి కేవలం 70,000కు పడిపోయింది. చాలా మంది సైన్యాన్ని విడిచిపెట్టి, వెళ్లిపోయారు. దీనికి ప్రాథమిక వేతనం, బీమా లేకపోవడంతో పాటు ఇతర కారణాలు ఉన్నాయి. తమడో బలగా లకు నైతిక స్థైర్యం, యుద్ధరంగంలో నైపుణ్యాలు లేకపోవడం కూడా ఉంది. నాయకత్వ పరంగా, మిన్ ఆంగ్ హ్లైంగ్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నారు. 2024 ఆగస్టులో జరిగిన ఒక అంతర్గత కుట్ర గురించిన పుకార్లు, మయన్మార్‌లో పరిస్థితులు అంత చక్కగా లేవని సూచి స్తున్నాయి. సైన్యంలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న మిన్ ఆంగ్హ్లైంగ్, సో విన్ ఇద్దరూ 2023లో నేపిటా ప్రాంతంలో త్రుటిలో తప్పించుకున్నారు. ఇది వారి రక్షణ దుర్బలత్వాన్ని బహిర్గతంచేసింది. తమడో తన భూభాగాలను నిలుపుకోలేకపోవడం మరింత ముఖ్యమైనది. మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ, తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, అరకాన్ ఆర్మీలతో కూడిన ‘త్రీ బ్రదర్హుడ్ అలయన్స్’ 2023 అక్టోబర్‌లో నిర్వహించిన ‘ఆపరేషన్ 1027’ ఈ విషయంలో ఒక మలుపు అని చెప్పాలి.దీని తర్వాత కరెన్ని రాష్ట్రంలో జరిగిన ‘ఆపరేషన్ 1111’ ద్వారా ప్రతిఘటనా బలగాలు ప్రయోజనాలు సాధించాయి. కొత్త పాలనా వ్యవస్థలను ఎలా రూపొందిస్తున్నారో చూపించే తాత్కాలిక కార్య నిర్వాహక మండలిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. 2024 ప్రారంభం నాటికి, మయన్మార్ భూభాగంలో 50 శాతాన్ని సైనికేతర దళాలే నియంత్రిస్తున్నట్లు నివేదికలు వచ్చాయి. అంతర్యుద్ధం ముగిసిపోతుందా?సైనిక నియంతృత్వం విఫలమైతే, అంతర్యుద్ధం ముగిసిపోతుందా? అంతర్యుద్ధానికి అంత తేలికైన ముగింపు లేదు. ఈ అంత ర్యుద్ధంలో పాల్గొంటున్న పార్టీల సంఖ్య చాలా ఎక్కువ. 2021 నుండి యుద్ధంలో పాల్గొంటున్న కొత్త ప్రభుత్వేతర సైనికుల సంఖ్య 2,600 అని ఒక అంచనా. ఉదాహరణకు, ‘మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ’, ‘షాన్ స్టేట్ ప్రోగ్రెసివ్ పార్టీ’ వంటి వాటి మధ్య కూడా పోరాటం ఉంది. ఇవి రెండూ ‘ఫెడరల్ పొలిటికల్ నెగో షియేషన్ అండ్ కన్సల్టేటివ్ కమిటీ’లో భాగం.‘త్రీ బ్రదర్హుడ్ అల యన్స్’ కూడా మయన్మార్ పరిణామాలపై భిన్నమైన అభిప్రాయా లను కలిగి ఉంది. చైనా ఆదేశం మేరకు, ‘తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ’ 2024లో కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ‘మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ’ ఇటీవలే దానిని అనుసరించింది. కానీ తమడో ఆధీనంలో ఉన్న రఖైన్ లోని చివరి కీలకప్రాంతాలలో ఒకటైన సిట్వే వద్ద సైన్యంతో పూర్తి యుద్ధానికి ‘అరకాన్ ఆర్మీ’ సిద్ధమవుతోంది. అందువల్ల, మయన్మార్ ముఖచిత్రం చాలా అస్పష్టంగా ఉంది.ఇప్పుడు ఏమి జరగవచ్చు? మొదట, మయన్మార్ విచ్ఛిన్నం కావడం ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న జాతి రాజ్యాలు సైనిక దళాల నియంత్రణ నుండి దాదాపుగా బయటపడ్డాయి. ప్రత్యేక రాజ్యాలు లేదా ముఖ్యంగా రఖైన్ లో ఏదో ఒక రకమైన సమాఖ్య కోసం ప్రకటన కూడా తయారు కావచ్చు. అయినప్పటికీ, బామర్లు నివసించే ప్రాంతాల్లో సైనిక దళాలు అధికారంలో ఉంటాయని ఒక అంచనా. సైనిక దళాలు ప్రతి పాదిస్తున్నట్లుగా 2025లో ఎన్నికలు జరిగితే, అది సైన్యం ఆధ్వర్యంలోని ‘స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్’(ఎస్ఏసీ) పాలనను మరింత చట్టబద్ధం చేయడానికే ఉపయోగపడుతుంది. దీని అర్థం సైనిక కుట్ర తర్వాత గత వారం ఏడవసారి పొడిగించిన అత్యవసర పరిస్థితి ఈ ఏడాది కూడా ముగిసిపోదు. చైనా ప్రాబల్యంలోని పార్టీలను చర్చ లకు తీసుకురాగలిగితే, కొత్త సైనిక ప్రభుత్వం ఎస్ఏసీ స్థానంలోకి రావచ్చు. కానీ, ఇది మయన్మార్ కోసం మరొక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే పనిలో పడుతుంది. మళ్లీ దేశ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మయన్మార్ గతంలోకంటే ఈ ఏడాది మరింత వార్తల్లో ఉంటుంది.- వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, డైరెక్టర్ ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలోని నెహ్గిన్ పావో కిప్జెన్ సెంటర్ ఫర్ ఆగ్నేయాసియా స్టడీస్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-శ్రబణ బారువా -
వాణిజ్య యుద్ధంతో అందరికీ నష్టమే!
స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాన్ని ప్రపంచంపై బలవంతంగా రుద్దిన అమెరికా, దాన్ని తమకు లాభం కలిగినంత కాలం ఉపయోగించుకుని ఇపుడు లాభం లేదనిపించటంతో ఎదురు తిరుగుతున్నది. ఆ విషయం బయ టకు ఒప్పుకోకుండా అధ్యక్షుడు ట్రంప్ సాకులు వెతుకుతున్నారు. కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు పెంచిన ఆయన తన చర్యకు పేర్కొన్న కారణాలను గమనించండి: అక్రమ వలసలు, ఫెంటానిల్ అనే మాదక ద్రవ్యం రవాణా. అక్రమ వలసలు మెక్సికో నుంచే గాక, ఆ దేశం మీదుగా ఇతర లాటిన్ అమెరికన్ దేశాల నుంచి, చివరకు ఇండియా వంటి సుదూర దేశాల నుంచి కూడా సాగుతున్న మాట నిజం. వాటి నిరోధానికి మెక్సికో సరిహద్దులలో గోడల నిర్మాణం, వేలాది సైన్యాల మోహరింపు ఇప్పటికే మొదలు పెట్టారు. కెనడా, చైనా నుంచి అక్రమ వలసలు అత్యల్పం. మాదక ద్రవ్యాల తయారీ, రవాణాను ఈ మూడు దేశా లలో ఏదీ అధికారికంగా ప్రోత్సహించటం లేదు. స్వేచ్ఛా వాణిజ్యానికి భంగంఅమెరికా, కెనడా, మెక్సికోల మధ్య వాణిజ్యానికి ఒక ప్రత్యేక ఒప్పందం ఉంది. అది ట్రంప్ మొదటి హయాం (2017–21)లో జరి గిందే. దానిని ట్రంప్ స్వయంగా ఉల్లంఘిస్తున్నారు. అమెరికా పట్టు బట్టి చేయించిన గాట్స్ ఒప్పందానికీ, అందుకు రూపాంతరమైన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకూ, ఇంకా చెప్పా లంటే అమెరికా పెట్టుబడిదారీ, స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాలకూ ఈ చర్యలు విరుద్ధమైనవి. వాస్తవానికి తదనంతర కాలంలో ఇందుకు అనుగుణంగానే పాశ్చాత్య ప్రపంచంతో సహా అనేక దేశాలు పర స్పరమో, లేక ప్రాంతీయ బృందాలు గానో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ వస్తున్నాయి. ఆ విధంగా ప్రపంచం ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. పెట్టుబడులు, వాణిజ్యంలో పరస్పర చర్చల ద్వారా జరిగే ఈ ఒప్పందాలు సాధారణంగా అన్ని పక్షాలకూ ప్రయో జనకరమవుతున్నాయనే భావన ఏర్పడింది కూడా. అటువంటిది, ఈ పరిణామాలన్నింటికీ మాతృదేశమనదగ్గ అమెరికాయే అందుకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతుండటం ఆశ్చర్యకరం. అనేక దేశాల వలెనే అమెరికాలోనూ మాదక ద్రవ్యాల విని యోగం పెద్ద ఎత్తున ఉంది. ఈ వినియోగం ఎప్పటినుంచి ఎందువల్ల మొదలై కొనసాగుతున్నదనే విషయం ప్రచారంలోకి రావటం లేదు. వియత్నాం యుద్ధంలో అమెరికా 1960ల నుంచి 1970ల వరకు ఉధృతంగా పాల్గొని భయంకరమైన హత్యాకాండ సాగించి ఆఖరుకు ఓటమిపాలైంది. ఆ కాలమంతా వారి యుద్ధ విమానాల రవాణా నైజీరియా మీదుగా జరిగినపుడు, యుద్ధం వల్ల వ్యథకు గురైన సైనికులు దానిని మరిచిపోయేందుకు స్థానికంగా లభించే మాదక ద్రవ్యా లకు అలవాటుపడ్డారు. అది యుద్ధం తర్వాత మాజీలు అయిన సైనికులకు కొనసాగి వారి ద్వారా, ఇతరత్రా వ్యాపించి స్థిరపడింది. ఆ కాలంలో లాటిన్ అమెరికా నుంచి డ్రగ్ కార్టెల్స్ ఎట్లా పని చేశాయన్న చర్చ అప్రస్తుతం. అయితే ఇందుకు సుంకాల హెచ్చింపు ఎట్లా పరిష్కారమవుతుందన్నది ట్రంప్ సైతం వివరించని ప్రశ్న. ఆ పని చేయటానికి బదులు, అంతర్జాతీయ ఆర్థిక అత్యవసరాల చట్టం ఒక దానిని అడ్డు పెట్టుకుని మెక్సికో, కెనడా వంటి అతి సన్నిహిత మిత్ర దేశాలపై 25 శాతం సుంకాలు పెంచారు.కృత్రిమ ఆధిపత్యంఅమెరికా వంటి అగ్రస్థాయి సంపన్న దేశానికి ఇటువంటి చర్యల అగత్యం ఎందుకు ఏర్పడింది? తమ వద్ద ఉత్పత్తుల ఖర్చు పెరుగు తున్నందున, వెనుకబడిన దేశాలలో వేతనాలు, ముడిసరుకులు, మౌలిక సదుపాయాల ఖర్చు తక్కువ గనుక, అక్కడ ఉత్పత్తులు చేయించి, అక్కడి నుంచి చవకగా దిగుమతి చేసుకోవచ్చుననే వ్యూహంలో దీనికంతా మూలాలు ఉన్నాయి. ఇది కొంతకాలం సజా వుగా సాగినా, ఆయా దేశాలు సాంకేతికంగా, పారిశ్రామికంగా బల పడటం, తొలి దశలో అమెరికా నుంచి యూరప్ నుంచి తరలి వెళ్లిన ప్రైవేట్ కంపెనీలు అక్కడి లాభాలకు అలవాటుపడటంతో ఈ పాశ్చాత్య దేశాలకు పలు సమస్యలు మొదలయ్యాయి. అక్కడి పారి శ్రామికత, ఆదాయాలు, ఉపాధి అవకాశాలు తగ్గసాగాయి. మిగులు బడ్జెట్లు లోటు బడ్జెట్లుగా మారాయి. అమెరికా అయితే సుమారు 30 ట్రిలియన్ డాలర్ల లోటు, అప్పుల భారానికి చేరి, బంగారం నిల్వల మద్దతు లేకపోయినా డాలర్లను యథేచ్ఛగా ముద్రించి ప్రపంచం పైకి వదలటం, డాలర్ ఆధిపత్యాన్ని కృత్రిమంగా నిలబెట్టడం వంటి దశకు చేరుకుంది. మామూలుగానైతే ఆర్థికంగా ఇది దివాళా స్థితి అవుతుంది. కానీ ఆ కృత్రిమతను నిలబెట్టేందుకు, ఒకవేళ బ్రిక్స్ కూటమి డాలర్‌ను బలహీనపరిచే చర్యలు తీసుకునే పక్షంలో ఆ కూటమి దేశాలపై 100 శాతం సుంకాలు పెంచగలమంటూ పదేపదే బెదిరించవలసిన బలహీన స్థితిని అమెరికా ఎదుర్కొంటున్నది. ఇంతకూ ట్రంప్ సుంకాల హెచ్చింపు అమెరికాకు ఎంతవరకు ఉపయోగపడవచ్చునన్నది ప్రశ్న. ఈ తరహా చర్యలు ఆయన తన మొదటి పాలనా కాలంలోనూ తీసుకున్నారు. అపుడు ఆయన వాణిజ్య యుద్ధం కేవలం చైనాపై. అది చైనాకు కొంత నష్టం కలిగించినా అమెరికాకు అంతకన్న ఎక్కువ నష్టం కలిగిందన్నది అమెరికన్ ఆర్థిక వేత్తల దాదాపు ఏకాభిప్రాయం. అందుకు కారణాలను విశ్లేషించుకోవడానికి బదులు, తన వాణిజ్య యుద్ధాన్ని మిత్ర దేశాల పైకి కూడా విస్తరించటం నమ్మశక్యం కాకుండా ఉంది. రానున్న రోజులలో యూరోపియన్ దేశాలపై కూడా సుంకాల పెరుగుదల ఉండగలదని సూచించారు. అమెరికా దిగుమతులలో ఈ మూడు దేశాల ఉత్ప త్తులు కలిపి 40 శాతం ఉంటాయని అంచనా. అమెరికాకు ఎగుమతులు చేసే మొదటి 10 దేశాలలో చైనా తప్ప మిగిలినవన్నీ వారి మిత్ర దేశాలే. ఇండియా పదవ స్థానంలో ఉంది. ఇండియా పైనా సుంకాలు పెంచగలమని ట్రంప్ ఇప్పటికే అన్నారు. తమ ఆధునిక మోటార్ వాహనాలపై ఇండియా సుంకాలు తగ్గించాలని మొదటి పాలనా కాలంలో కోరగా అందుకు అంగీకరించని మోదీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త బడ్జెట్లో అటువంటి ప్రతిపాదనలు చేయటం గమనించదగ్గది. ఆ చర్య ట్రంప్‌ను మెత్తబరచగలదేమో చూడాలి.ట్రంప్ చర్యకు ప్రతిగా, కెనడా ప్రధాని ట్రూడో కొద్ది గంటల లోనే, అదే 25 శాతం స్థాయిలో ఎదురు సుంకాలు ప్రకటించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షెన్బామ్ కూడా తాము సుంకాలను పెంచి తీరగలమన్నారు. ఈ రెండు దేశాల నుంచి వివిధ వినియోగ వస్తువులపైనే గాక యంత్ర పరికరాలు, చమురు, విద్యుత్ దిగుమతు లపై అమెరికా చాలా ఆధారపడి ఉంది. మరొక వైపు చైనా ఈ సుంకాలు వివక్షాపూరితం అంటూ డబ్ల్యూటీవోకు ఫిర్యాదు చేసింది. వాణిజ్య యుద్ధాలను అమెరికా గతంలోనూ చేసింది. కాకపోతే దౌత్యపరమైన లక్ష్యం కోసం ఇతరులను లొంగదీయటానికి. ట్రంప్ అట్లాగాక ఈ యుద్ధంతో తమ ఆర్థిక వ్యవస్థకు లాభం చేస్తామంటున్నారు. ఇతరులు లొంగి రావటంవల్ల అమెరికా లాభపడగలదనీ, దానితో ప్రజలపై ఆదాయ పన్ను మొత్తంగా రద్దు చేయవచ్చుననీ ఆశపెడుతున్నారు. అమెరికా మార్కెట్లు ఎంత పెద్దవి అయినా ఈ సుంకాల ఒత్తిడితో ఇతరులు కూడా సుంకాలు పెంచటం, వారి ముడి వస్తువులు అమెరికా పరిశ్రమలకు లభించకపోవటం, ఆయా దేశాలు ఇతర మార్కెట్లను వెదుక్కోవటం వంటివి జరిగితే పరిస్థితి ఏమిటి? ఇవిగాక రెండు ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. ఇటువంటి యుద్ధాలతో స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతపు భవిష్యత్తు ఏమిటన్నది ఒకటైతే, ఈ ప్రభావాలు రాజకీయంగా, భౌగోళికంగా ఏ విధంగా ఉండవచ్చు ననేది రెండవది. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
విదేశాలకు విస్తరిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు లాభాల పంట పండిస్తోంది. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం బడా వ్యాపారవేత్తలు అప్పట్లో ఎగబడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరిస్తున్నారు. వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ తరహా టోర్నమెంట్లలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ లు కడుతున్నారు. తాజాగా ఐపీఎల్లో హైదరాబాద్ వేదికగా పోటీ పడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న 'ది హండ్రెడ్' టోర్నమెట్లోకి రంగ ప్రవేశం చేసింది.మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీబుధవారం నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌ను కొనుగోలు కోసం నిర్వహించిన వేలంలో కళానిధి మారన్ యాజమాన్యంలోని సన్ గ్రూప్ పాల్గొని మొత్తం వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యొక్క 49 శాతం వాటాను, ఈ క్లబ్ నిర్వాహకులైన యార్క్‌షైర్ యొక్క 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అంగీకారాన్ని పొందింది. దీంతో 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో 100% వాటాను పొందిన తొలి ఫ్రాంచైజ్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో వాటాలు చేజిక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో ఫ్రాంచైజీ కావడం విశేషం. సూపర్‌చార్జర్స్ కొనుగోలు కోసం సన్ గ్రూప్ ఏకంగా 100 మిలియన్ పౌండ్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. నాలుగో స్థానంలో సూపర్చార్జర్స్యార్క్షైర్కు వేదికగా పోటీ పడుతున్న సూపర్‌చార్జర్స్ గత సీజన్లో పురుషులు మరియు మహిళల టోర్నమెంట్లలో నాలుగో స్థానంలో నిలిచింది. సూపర్‌చార్జర్స్ పురుషుల జట్టుకు ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్లు లో సభ్యుడైన హ్యారీ బ్రూక్ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.లక్నో సూపర్ జెయింట్స్ నిర్వాహకులైన ఆర్ పి ఎస్ జి గ్రూప్, ముంబై ఇండియన్స్ నిర్వాహకులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో పోటీ పడుతున్న జట్ల స్టాక్లను కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత సన్ గ్రూప్ కూడా ఈ టోర్నమెంట్ లో పెట్టుబడి పెట్టింది.ప్రారంభంలో లండన్ స్పిరిట్ కొనుగోలు హక్కులను దక్కించుకోవడంలో విఫలమైన ఆర్ పి ఎస్ జి గ్రూప్ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో వాటాను కొనుగోలు చేసింది. రాబోయే రోజుల్లో ది హండ్రెడ్‌లో మరో ఐపీఎల్ క్లబ్ కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల కథనం.మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ టాటా గ్రూప్ 2024-2028 సంవత్సరానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను దాదాపు 2,500 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది మునుపటి ఒప్పందం కంటే దాదాపు 50 శాతం అధికం. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయానికొస్తే, 231.0 మిలియన్ డాలర్లతో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీ గా కొనసాగుతోంది. గత సంవత్సరం ఈ క్లబ్ తొమ్మిది శాతం వృద్ధి రేటు ని సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 227.0 మిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది. గత సంవత్సరం ఐపీఎల్ విజేత అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యాపార వృద్ధి లో 19.3 శాతం పెరుగుదలతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ముంబై ఇండియన్స్ 204.0 మిలియన్ డాలర్లతో బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో ఉంది. తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (132 మిలియన్ డాలర్లు), రాజస్థాన్ రాయల్స్ (113 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.లాభాల పంటవాణిజ్య ప్రకటనల ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. దాదాపు ప్రతి జట్టుకు 5 మిలియన్ డాలర్ల నుండి 12 మిలియన్ డాలర్ల వరకు స్పాన్సర్షిప్ ఆదాయం లభించడమే కాక టెలివిజన్ హక్కుల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మూడేళ్ల ఒప్పందం కోసం ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 175 కోట్ల రూపాయలతో ఒప్పందం ఖరారు చేసుకుందంటే ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. -
పడిపోతున్న వర్సిటీల ప్రమాణాలు
రాష్ట్రాల జాబితాలోని అంశాలు కొన్నింటిని, ఉమ్మడి జాబితాలోని అంశాల్లో మరి కొన్నింటిని క్రమంగా దొడ్డిదారిన తన ఖాతా ల్లోకి మళ్లించుకొంటూ ఇప్పటికే కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల పేరుతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ద్వారా రూపొందించిన ముసా యిదాను బలవంతంగా రాష్ట్రాలపై రుద్ది, యూనివర్సిటీలపై పూర్తి స్థాయి పట్టుసాధించడానికి కేంద్రం అడుగులు వేయడంతో మరో కొత్త వివాదం మొగ్గ తొడిగింది.యూజీసీ ప్రతిపాదించిన సంస్కరణలు అమలులోకి వస్తే...ఎంతో కీలకమైన వైస్ ఛాన్స్లర్ల నియామకాల్లో రాష్ట్రాలకున్న హక్కు లుప్తమైపోతుంది. ఇప్పటివరకు ఉపకులపతులుగా అర్హులైన వారిని నియమించడానికి సెర్చ్ కమిటీ వేయడం ఆనవాయితీగా ఉంది. సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రతినిధి ఒకరు ఉంటారు. సెర్చ్ కమిటీ ఎంతో కసరత్తు జరిపి 5 పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే... దానిని పరిశీలించి ఒక అభ్యర్థిని ఎంపిక చేసి గవర్నర్ ఆమోదానికి పంపుతుంది. కానీ, కొత్తగా వచ్చే సంస్కరణల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయానికి కత్తిరింపు వేశారు. నిజానికి, రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని హరించే సంస్కరణలు చాలానే యూజీసీ ప్రతిపాదించింది. ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతాయా అన్న అంశం పక్కన పెడితే... అసలు యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన సంస్కరణలు ఏమిటి? నాణ్యతా ప్రమాణాలు పెంచే సంస్కరణలు కాకుండా పెత్తనం కోసం కేంద్రం వెంపర్లాడటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.సంస్కరణలు ఏ రంగంలో చేపట్టాలి?మన దేశంలోని పలు యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళా శాలల విద్యా ప్రగతి ప్రమాణాలు పాతాళానికి పడిపోయాయన్నది నిర్వివాదాంశం. ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి బంగారు బాటలు వేయ డంలో ఉన్నత విద్య, పరిశోధన కీలకమైనవి. ఆరోగ్యం, ఆహారం, ఉపాధి తదితర రంగాలలో ఎదురయ్యే సవాళ్లకు తగిన పరిష్కారం అందించే పరిశోధనలు పురుడుపోసుకొనేది యూనివర్సిటీ ప్రాంగణాలలోనే. వివిధ దేశాలలో జరుగుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలతో పోలిస్తే భారత్ ఎంతో వెనుకబడి ఉంది. ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచిన యూనివర్సిటీలు పలు రుగ్మతలతో కునారి ల్లుతున్నాయి. నిధుల లేమి, రాజకీయ జోక్యం, బోధనా సిబ్బంది కొరత, అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం తదితర కారణాలతో యూనివర్సిటీల ప్రమాణాలు గణనీయంగా పడి పోయాయి. గతేడాది ‘క్యూఎస్’ అనే ప్రఖ్యాత సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 107 దేశాల్లోని 1,740 యూనివర్సిటీలను అధ్యయనం చేసి ర్యాంకులు ఇవ్వగా అందులో భారత్‌కు చెందిన 78 యూనివర్సి టీలు మాత్రమే ఆ ప్రమాణాలు అందుకోగలిగాయి.ఒకప్పుడు ప్రపంచానికి దిశానిర్దేశనం చేసి, వేల సంఖ్యలో గొప్ప విద్యావేత్తలను అందించిన నలంద, తక్షశిల, విశ్వభారతి, శాంతిని కేతన్ వంటి అత్యున్నత విద్యా పీఠాలు గలిగిన భారతదేశంలో నేడు అనేక యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు అడుగంటాయి. ఆవిష్కరణలకు మాతృమూర్తి వంటి విశ్వవిద్యాలయాలు విజ్ఞాన వెలుగులు ప్రసరించాలంటే అందుకు అనుగుణంగా మౌలిక సదు పాయాలు, నిష్ణాతులైన బోధనా సిబ్బంది ఉండాలి. రాజకీయ జోక్యానికి తావులేకుండా సమర్థత, అంకితభావం కలిగిన వ్యక్తులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. విశ్వగురువు ఎలా అవుతాం?2047 నాటికి మన దేశం ‘విశ్వగురువు’గా అవతరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంగా పెట్టుకొన్నారు. ఈ లక్ష్యం గొప్పదే. అందుకు తగిన కార్యాచరణ అన్ని రంగాలలో కనపడాలిగా! ప్రత్యేకించి ఉన్నత విద్యారంగంలో, పరిశోధనా రంగంలో అభివృద్ధి పథంవైపు అడుగులు పడాలి. అందుకు భిన్నంగా ఈ రంగంలో అడు గులు తడబడుతున్నాయి. అందుకు ఉదాహరణ దేశం నుంచి సుమారు 13 లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం విదే శాల బాట పట్టడం. నాణ్యమైన ఉన్నత విద్యకు చిరునామాగా నేటికీ అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలే నిలుస్తు న్నాయి. వైద్య విద్య కోసం ఒకప్పటి కమ్యూనిస్టు దేశాలైన రష్యా, అజర్జైబాన్, ఉక్రెయిన్ తదితర దేశాలకు భారతీయ విద్యార్థులు వేల సంఖ్యలో ‘క్యూ’ కడుతూనే ఉన్నారు. జబ్బు ఒకటయితే, మందు మరొకటి వేసినట్లుగా... దేశంలోని విశ్వవిద్యాలయాలను అన్ని విధాలా బలోపేతం చేసే చర్యలను తీసు కోకుండా, దేశంలో విదేశీ యూనివర్సిటీలకు ద్వారాలు తెరిచేందుకు రంగం సిద్ధం చేయడం, యూనివర్సిటీలపై రాష్ట్రాల హక్కుల్ని హరించి వేయడం విద్యావేత్తలను కలవరపరుస్తోంది. మరోవైపు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన స్వదేశీ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.దేశంలో విదేశీ యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గాన్ని ఏర్ప రిస్తే... ఎటువంటి విదేశీ యూనివర్సిటీలు ఇక్కడకు వస్తాయి? ప్రపంచంలో పేరు బడిన తొలి 50 యూనివర్సిటీలు భారత్ కొస్తాయా? అని ప్రశ్నించుకొంటే స్పష్టమైన సమాధానం దొరకదు. పైగా ఇక్క డకు వచ్చే విదేశీ యూనివర్సిటీలపై తమ నియంత్రణ ఏదీ ఉండదనీ, కానీ పారదర్శకతతో ఉండాలని మాత్రమే కోరతామనీ యూజీసీ స్పష్టం చేసింది. అంటే... ఫీజుల వసూళ్ల విషయంలో విదేశీ వర్సిటీ లకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే అవి ప్రదానం చేసే డిగ్రీలకు, విదేశాలలో ఇచ్చే పట్టాలకు సమానమైన విలువ ఉంటాయన్నది ఒక్కటే విద్యార్థులను ఆకర్షిస్తోంది. విదేశీ యూనివర్సిటీలు ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టాలో ముసాయిదా పత్రంలో నిర్దేశించకపోవడంతో అవి మన బ్యాంకుల నుంచే రుణాలు పొంది, వాటితోనే మౌలిక సదుపా యాలు ఏర్పాటు చేసి, లాభాల్ని మాత్రం తమ దేశానికి తీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పైగా విదేశీ యూనివర్సీటీలలో సంపన్నుల పిల్లలు మాత్రమే చదువు‘కొనే’ అవకాశం ఉన్నందువల్ల... దేశంలో ‘సంపన్న విద్యార్థి శ్రేణి’ మరొకటి నూతనంగా తయారవుతుంది.బోధన–పరిశోధనఒకప్పుడు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో జరిపిన పరి శోధనలకు అంతర్జాతీయంగా పేటెంట్లు లభించాయి. ఒక అంచనా ప్రకారం... దేశంలోని మన వర్సిటీలు ఏటా 24,000 డాక్టరేట్ పట్టాల్ని ప్రదానం చేస్తున్నాయి. అంటే ఏటా వేల సంఖ్యలో పరిశో ధనా పత్రాలు వెలువడుతున్నాయి. కానీ... వాటిని దేశాభివృద్ధి కోసం ఏ మేరకు ఉపయోగించుకోగలుగుతున్నారనేదే ప్రశ్నార్థకం. అసలు రీసెర్చ్ ఈ అంశం మీద జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా... స్వదేశీ విశ్వవిద్యాలయాలకు రెండు కళ్లుగా భావించే బోధన, పరిశోధనలను పటిష్ఠం చేయాలి. విదేశీ విశ్వ విద్యాలయాల మోజులో స్వదేశీ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం తగదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను, సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఉన్నత విద్యా వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దాలి. విశ్వ విద్యాలయాలపై రాష్ట్రాల హక్కుల్ని కొనసాగించాలి. ఉపకులపతుల నియామకం పూర్తిగా రాజకీయమై పోయింది. రాజకీయాలకు అతీతంగా విశ్వ విద్యాలయాలు పని చేయగలిగే సంస్కరణలు తేవాలి తప్ప కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందంగా కేంద్రం వ్యవహరించడం సమ్మతం కాదు.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
ఏఐ... పిల్లలూ... తల్లిదండ్రులూ!
ఏఐ ప్రాధాన్యం రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల ప్రపంచం తీవ్ర ప్రభావానికి లోనవుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు బిడ్డల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అత్యంత ముఖ్యమైన అంశం అయ్యింది. 2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలు బీటా తరం కిందకు వస్తారు. మొన్న జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12.03 నిమిషాలకు మిజోరంలోని ఐజ్వాల్ ఆసుపత్రిలో జన్మించిన అబ్బాయిని భారతదేశంలో మొదటి తరానికి చెందే తొలి ‘బీటా చిన్నారి’గా గుర్తించారు. అసలు ఆల్ఫా, బీటా... అంటూ ఈ వర్గీకరణ అంతా ఏమిటి అనుకుంటున్నారా? పిల్లలు ఏ తరంలో జన్మించారు అన్న అంశం వాళ్ల సామాజిక వ్యవహార శైలిని నిర్దేశిస్తుంది. అప్పుడు ఉండే సాంకేతికత, సామాజిక మాధ్య మాల ప్రభావం వంటి అంశాలు వాళ్ల వ్యక్తిత్వాన్ని, అనుభవాలను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు. రాజకీయంగా వాళ్ల ఐడియాలజీని, వినియోగ దారునిగా వాళ్ల మనస్తత్వాన్ని నిర్దేశిస్తాయి. ఇప్పుడు పుట్టుకొస్తున్న బీటా బేబీలు ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్‌తో నిండిపోయిన సాంకేతిక ప్రపంచంలో జీవిస్తారు. అంటే వాళ్ల రోజువారీ జీవితం చిన్న రోబోల మధ్య సాగుతుంది. అవి చెప్పినట్టే వాళ్లు నడుచుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే అవి వీళ్లకు ట్యూటర్లు అన్న మాట. దాంతో పాటు వాటికవే నడిచే డ్రైవర్ లేని కార్లను చూస్తారు. 2035 నాటికి మొత్తం జనాభాలో 16 శాతం మంది బీటా తరానికి చెందిన వాళ్లే ఉంటా రని అంచనా.బీటా తరంలో పుట్టిన పిల్లలు ఆల్ఫా తరం కంటే చురుగ్గా, తెలివిగా, టెక్ సావీగా ఉంటారు. ఉదాహరణకి ‘వీల్స్ ఆన్ ద బస్’ ఆట ఆడాలంటే ‘అలెక్సా’ను పిలుస్తారు. లెక్కల్లో హెచ్చివేతలు అంటే మల్టిప్లికేషన్ వంటివి తెలియకపోతే ‘బ్లాక్ బాక్సు’ను ఆశ్రయిస్తారు. ఈ పరిస్థితుల్లో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసు కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ముందుగా మార్కెట్లోకి కొత్తగా వస్తున్న యాప్స్, ప్లాట్ ఫారమ్స్ గురించి తెలుసుకోవాలి. ట్రెండ్స్‌ను అనుసరించాలి. అప్పుడు పిల్లలకు ఏవి ఉపయోగపడతాయి? ఏవి ఉపయోగపడవు అనేది తెలుసుకోగలుగుతారు. పిల్లలు ఎక్కువ టెక్నాలజీ మధ్య ఉంటారు గనుక సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలకు తగినంత అవగాహన పెంచాలి. ఎక్కువ డివైజ్‌లపై ఆధారపడకుండా బాహ్య ప్రపంచంలో వాళ్లకు మంచి అనుభవాలను అందించాలి. కొత్త ప్రదేశాలకు తీసికెళ్లటం, బంధువులు, స్నేహితుల మధ్య గడపటం నేర్పాలి. ఇంట్లో కొంత ప్రదేశాన్ని ‘టెక్ ఫ్రీ జోన్’గా మలచాలి. ప్రధానంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేసే డైనింగ్ టేబుల్ మీద ఎలాంటి డివైజ్‌లూ లేకుండా చూసుకోవాలి. పుస్తకాలు చదవటం, ఇంట్లో అమ్మానాన్నలతో మాట్లాడటం వంటివి అలవాటు చేయాలి. ఏది ఏమైనా బీటా తరం కొత్త ప్రపంచాన్ని చూస్తుంది. చుట్టూ ఉన్న వాళ్లకు కొత్త అనుభవాలను అంది స్తుంది. అవి ఎలా ఉంటాయో రానున్న రోజుల్లో మనకు అర్థం అవుతుంది.– డా‘‘ పార్థసారథి చిరువోలుసీనియర్ జర్నలిస్ట్ ‘ 99088 92065 -
ఖర్చు పెట్టించేందుకు ఇది చాలదు!
భారతదేశ మధ్య తరగతి బహుశా గడచిన మూడు దశాబ్దాల్లో ఇలాంటి బడ్జెట్ చూడ లేదు. ఆదాయ పన్నులో ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుందని మోదీ సర్కారుపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇంత భారీ ఊరట లభిస్తుందని మాత్రం ఊహించలేదు. నగరాల్లో నెలకు కనీసం లక్ష రూపాయల ఆదాయం ఉన్నవారిని మాత్రమే మధ్య తరగతిగా పరిగణించాలని నేను గతంలో వాదించాను. అయితే, ఇలాంటి వాళ్లు దేశం మొత్తమ్మీద నాలుగైదు శాతం మాత్రమే ఉంటారు. ఇంత మొత్తం ఆర్జిస్తున్నవాళ్లు కూడా పన్నులు కట్టే పని లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఎందుకీ ఉపశమనం?ఫలితంగా ఈ స్థాయి ఆదాయమున్న వారి జేబుల్లోకి ప్రతి నెల ఆరు వేల రూపాయలు అదనంగా వచ్చి చేరుతుంది. ఈ డబ్బును ఇంటికి కావాల్సిన వస్తువుల కొనుగోలుకు వాడుకోవచ్చు. లేదంటే దాచుకుని చిరకాలంగా ఆశపడుతున్న స్మార్ట్‌ఫోన్ నైనా సొంతం చేసుకోవచ్చు. మీ ఆదాయం నెలకు రెండు లక్షల రూపాయలనుకుంటే, మారిన పన్ను రేట్ల కారణంగా మీకు నెల నెలా రూ. 9,000 అదనంగా ఆదా అవుతుంది. దీన్ని రోజువారీ ఖర్చుల కోసం వాడు కోవచ్చు. ఫ్యాన్సీ రెస్టారెంట్‌కు వెళ్లి భోంచేయొచ్చు. ఏడాదిలో రూ. 1.10 లక్షలు మిగులుతుంది. ఈ డబ్బుతో 55 అంగుళాల టీవీ, అత్యాధునిక వాషింగ్ మెషీన్ కొనుక్కోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే, పన్నుల మినహాయింపు పొందిన మధ్య తరగతి విరగబడి కొనుగోళ్లు చేస్తుందనీ, తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమొస్తుందనీ మోదీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే జరిగితే దేశంలో, ముఖ్యంగా నగర మధ్యతరగతి వినియోగం తగ్గుతోందన్న ఫిర్యాదులకు ఫుల్స్టాప్ పడుతుంది. 2022–23లో దేశంలో దాదాపు 7 కోట్ల మంది ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించారని దాఖలైన ఆదాయ పన్ను రిటర్న్స్ చెబుతున్నాయి. వీరిలో దాదాపు రెండు కోట్ల మంది పన్నులు చెల్లించారు. ప్రస్తుతం వేతనాల్లో పెంపును పరిగణనలోకి తీసుకున్నా, పన్ను రేట్లలో వచ్చిన మార్పుల కారణంగా సుమారు 1.5 కోట్ల మంది పన్ను పరిధిలోంచి జారిపోతారు. అంటే, పన్ను చెల్లింపుదారుల సంఖ్య సుమారు 1.4–1.6 కోట్లకు పడిపోనుంది. వీరిలో ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వారూ ఉంటారు. ఇది మొత్తం మన శ్రామిక శక్తిలో కేవలం 4 శాతం మాత్రమే. ప్రభుత్వ అంచనా వేరే!పరిస్థితి ఇలా ఉంటే, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ పన్ను రాబడుల లెక్కలు ఇంకోలా ఉన్నాయి. 2025 బడ్జెట్ అంచనాల ప్రకారం, ఆదాయపు పన్ను రూపంలో వచ్చే మొత్తం రూ.1.8 లక్షల కోట్లు ఎక్కువ కానుంది. ఇంకోలా చెప్పాలంటే ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం వచ్చిన దానికంటే రానున్న సంవత్సరం వచ్చే మొత్తం 14 శాతం ఎక్కువ. గతేడాది ప్రభుత్వ అంచనాలతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా పన్ను రేట్లలో మార్పుల వల్ల ప్రభుత్వానికి ఒక లక్ష కోట్ల రూపాయల నష్టం జరగడం లేదు. పాత రేట్లు, శ్లాబ్స్ కొనసాగి ఉంటే ప్రభుత్వం 22 శాతం వరకూ ఎక్కువ ఆదాయపు పన్నులు వసూలు చేసి ఉండేది. ఆదాయ పన్ను రాబడి పెరిగేందుకు ఒకే ఒక్క మార్గం... వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రజల వ్యక్తిగత ఆదాయం బాగా పెరగడం! ఇలా జరిగే సూచనలైతే లేవు. నిజానికి కృత్రిమ మేధ, వేర్వేరు ఆటో మేషన్ పద్ధతుల ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల సంఖ్య తగ్గేందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా జీతాలు కూడా స్తంభించిపోతాయి. తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం ఆర్జిస్తున్న వ్యక్తి గురించి ఆలోచిద్దాం. ఆదాయపు పన్ను కొత్త విధానాన్ని ఎంచుకుంటే ఇతడికి రూ.70 వేల వరకూ మిగులుతుంది. ఇంత మొత్తాన్ని వస్తు, సేవల కోసం ఖర్చు పెట్టగలడు. ఒకవేళ ఆదాయం పది శాతం తగ్గితే? అప్పుడు పన్ను మినహాయింపులు అక్కరకు రావు. వాస్తవికంగా ఖర్చు పెట్టడం ఇప్పటికంటే మరింత తక్కువైపోతుంది.ఇంకో పెద్ద ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఖర్చు చేయడం తగ్గించుకుంటోంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారనుంది. గత ఏడాది కంటే ఈసారి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 6.1 శాతం మాత్రమే ఎక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇంకో 5 శాతమే అదనంగా ఖర్చు పెట్టాలని యోచిస్తోంది. ద్రవోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే ఈ పెంపుదల కేవలం 1.5 శాతమే అవుతుంది. పెట్టుబడులు తగ్గించుకుంటున్న ప్రభుత్వంరోడ్లు, హైవేలు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం గతంలో ఖర్చు పెట్టినదానికి ఇది పూర్తి భిన్నం. ఆ ఖర్చులో పెరుగుదల జీడీపీ పెంపునకు దారితీసింది. ఈసారి మూలధన వ్యయం గత ఏడాది కంటే కేవలం ఒకే ఒక్క శాతం ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణిస్తే అసలు మొత్తం ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి... ఈ ఏడాది మౌలిక వసతులపై పెట్టే ఖర్చు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే, మౌలిక వసతుల రంగానికి అనుబంధమైన స్టీల్,సిమెంట్, తారు, జేసీబీల్లాంటి భారీ యంత్రాలు, బ్యాంకులు కూడా డిమాండ్‌లో తగ్గుదల నమోదు చేయవచ్చు. ఇదే జరిగితే ఆయా రంగాల్లో వేతనాల బిల్లులు తగ్గించుకునే ప్రయత్నం అంటే... వేత నాల్లో కోతలు లేదా ఉద్యోగాల కుదింపు జరుగుతుంది. ఇది మధ్య తరగతి వారి ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం ఈ ఏడాది కార్పొరేట్ కంపెనీల ద్వారా ఎక్కువ ఆదా యపు పన్ను ఆశించడం లేదని అంచనా కట్టింది. జీడీపీ విషయంలోనూ ఇంతే. వృద్ధి నామమాత్రమేనని ప్రభుత్వం భావిస్తోంది.పెట్టుబడులు పెరగకపోతే?ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తాను లక్ష్యించుకున్న కార్పొరేట్ పన్నులు కూడా పూర్తిగా వసూలు చేయలేకపోయింది. మొత్తం 10.2 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీల ద్వారా వస్తుందని ఆశిస్తే వసూలైంది రూ.9.8 లక్షల కోట్లు మాత్రమే. అదే సమయంలో ఆదాయపు పన్ను రాబడులను మాత్రం రూ.11.9 లక్షల కోట్ల నుంచి రూ.12.6 లక్షల కోట్లకు సవరించింది. అంటే ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల కంటే 28 శాతం ఎక్కువ ఆదా యపు పన్ను రూపంలో వసూలు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కార్పొరేట్ పన్నుల కంటే ఆదాయపు పన్నులు 33 శాతం ఎక్కువ వసూలు చేస్తామని చెబుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ బాగు పడుతోందనేందుకు ఏమాత్రం సూచిక కాదు. ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగం నుంచి ఎక్కువ పెట్టుబడుల్లేకుండా... కేవలం ఆదాయపు పన్ను రాయితీలతోనే వినియోగం పెరిగిపోతుందని ఆశించడంలో ఉన్న సమస్య ఇది. మధ్య తరగతి ప్రజల జేబుల్లో కొంత డబ్బు మిగిల్చితే, కొన్ని రకాల వస్తు సేవలకు తాత్కాలిక డిమాండ్ ఏర్పడవచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో ఎదగకపోతే ఆ డిమాండ్ ఎక్కువ కాలం కొనసాగదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌పై మరింత పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు సిద్ధంగా కనిపించడం లేదు. వీరి ప్రాజెక్టుల్లో అధికం ప్రభుత్వ మౌలిక వసతుల కల్పనకు సంబంధించినవే. అవే తగ్గిపోతే, కార్పొరేట్ కంపెనీలు కూడా తమ పెట్టుబడులను కుదించుకుంటాయి. దీంతో పరిస్థితి మొదటికి వస్తుంది. ఆదాయపు పన్ను రిబేట్లు ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం సాయం చేయనివిగా మిగిలిపోతాయి!అనింద్యో చక్రవర్తి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, ఆర్థికాంశాల విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Satyendra Nath Bose : దైవకణాల పరిశోధకుడు
ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్తల్లో పద్మవిభూషణ్ సత్యేంద్రనాథ్ బోస్ ఒకరు. కలకత్తాలో 1894 జనవరి 1న జన్మించి ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. విశ్వ సృష్టికి సంబంధించిన దైవ కణాల పరిశోధన వెనక సత్యేంద్ర నాథ్ బోస్ కృషి చాలా ఉంది. ప్రాథమిక కణాల (దైవకణాల)పై ఐన్‌స్టీన్‌తో కలిసి సమర్పించిన అధ్యయన ఫలితాలను ప్రస్తుతం ‘బోస్–ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్’గా పరిగణిస్తున్నారు.బోస్ సంప్రదాయ భౌతికశాస్త్రం గురించి ప్రస్తావించకుండా, ఒకేలా ఉండే కణాలతో గణన స్థితుల అద్భుతమైన మార్గం ద్వారా ప్లాంక్ యొక్క క్వాంటం వికిరణాల నియమాన్ని ఉత్పాదించి ఒక పరిశోధనా పత్రాన్ని రాశారు. దానిని నేరుగా జర్మనీలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు పంపారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆ పరిశోధనా పత్రం ప్రాముఖ్యాన్ని గుర్తించి, దానిని జర్మన్ భాషలోకి అనువదించారు. దానిని బోస్ తరపున ప్రతిష్ఠాత్మక ‘జీట్స్‌క్రిఫ్ట్ ఫర్ ఫిజిక్’కు సమర్పించారు. ఈ గుర్తింపు ఫలితంగా, బోస్ యూరోపియన్ ఎక్స్–రే, క్రిస్టల్లాగ్రఫీ ప్రయోగశాలల్లో రెండు సంవత్సరాలు పని చేయగలిగారు. ఈ సమయంలో అతను లూయిస్ డి బ్రోగ్లీ, మేరీ క్యూరీ, ఐన్‌స్టీన్‌లతో కలిసి పనిచేశారు. వీరు ప్రతిపాదించిన కణాల ఆధారంగానే తర్వాతి కాలంలో దైవకణానికి సంబంధించిన సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవల జ్ఞాపకార్థం, కణ భౌతిక శాస్త్రంలో ప్రాథమిక ఉప పరమాణు కణాలలోని ఒక కణానికి ‘బోసాన్స్’ అని ఆయన పేరు పెట్టి అరుదైన గౌరవాన్ని అందించారు.బోస్–ఐన్‌స్టీన్ కండెన్సేట్ (బీఈసీ) అనేది చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సంభవించే పదార్థ స్థితి. ఆయన పరిశోధనలు అనేక ఆవిష్కరణలకు దారితీశాయి. మెరుగైన కచ్చితత్వం, స్థిరత్వంతో అత్యంతపొందికైన లేజర్లను సృష్టించడానికి బీఈసీలను ఉపయోగించవచ్చు. సూపర్ కండక్టివిటీని అధ్యయనం చేయడంలో సహాయపడతాయి. క్వాంటం కంప్యూటర్ల ప్రాథమిక యూనిట్లు అయిన క్వాంటం బిట్లనుసృష్టించడానికి ఉపయోగించవచ్చు. గురుత్వాకర్షణ, భ్రమణం,ఇతర భౌతిక పరిమాణాలను కొలవడానికి అత్యంత సున్నితమైన సెన్సార్లను సృష్టించడానికి ఉపయోగించవచ్చు.అపూర్వమైన కచ్చితత్వంతో అణు గడియారాలను సృష్టించడానికి ఉపయోగించవచ్చు. ఇది జీపీ, ఇతర నావిగేషన్ వ్యవస్థలను మెరుగుపరు స్తుంది. డీఎన్ఏ వంటి జీవసంబంధమైన అణువుల నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం లక్ష్యంగా ఉన్నమందులు, చికిత్సల అభివృద్ధికి దారితీశాయి. ఆయన రూపొందించిన బోస్– ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్ , బోస్– ఐన్‌స్టీన్ కండన్సేట్ విషయాలపై పరిశోధనలు చేసినవారికి ఏడు నోబెల్ బహుమతులు రావడం విశేషం.– మడక మధు ఉపాధ్యాయుడు, మహాదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా(నేడు సత్యేంద్రనాథ్ బోస్ వర్ధంతి)ఇదీ చదవండి: World Cancer Day 2025 : లక్షలాదిమంది బిడ్డలు అనాథలుగా; ముందుగా గుర్తిస్తే! -
కాలుష్యంపై కానరాని హామీలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అటు ఆప్, ఇటు బీజేపీలకు ప్రతిష్ఠాత్మకంగా పరిణమించాయి. రెండు పార్టీలూ ఉచిత పథకా లను వాగ్దానం చేయడంలో పోటీపడుతున్నాయి. కాని, కాలు ష్యంతో కునారిల్లుతున్న రాజధాని ఢిల్లీ పరిస్థితిని బాగు చెయ్యడంపై ఎటువంటి హామీలూ ఇవ్వకపోవడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నట్లు మరో మూడేళ్లలో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా అభివృద్ధి చెందినా ఇటువంటి రాజధాని నగరంతో అంతర్జాతీయ యవనికపై భారత్ సగర్వంగా నిలబడలేదు. ఒక వంక మురికి కాలువగా మారిపోయిన యమునా నది, ఇంకోవైపు ఎటుచూసినా కనిపించే వ్యర్థపదార్థాలు వంటి ఎన్నో కారణాల వల్ల ఢిల్లీ కాలుష్యం రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, వైఫల్యాలను ఈ స్థితి తెలుపుతోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి ప్రజాజీవనం ప్రారంభించిన కేజ్రీవాల్ స్వయంగా అవినీతి కేసులో జైలుకు వెళ్లిరావడం, ఆయన సహచరులూ అనేకమంది జైలుపాలు కావడం వల్ల ఆప్ ఆత్మరక్షణలో పడింది. తమ నాయకులపై పెట్టిన కేసులన్నీ రాజకీయ కక్షసాధింపుతో నమోదు చేసినవి అని చెబుతున్నా, ఆ కేసులు న్యాయస్థానాల ముందు నిలబడే అవకాశాలు ఉన్నా, లేకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకనే తన రాజకీయ జీవనంలో పెనుసవాల్‌ను కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నారు. 2014 నుండి వరుసగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 7 లోక్ సభ సీట్లనూ గెల్చుకుంటున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి పరాజయం తప్పడం లేదు. మీడియాలో సంచలనాలు సృష్టించే నాయకులపై ఆధారపడుతోంది కానీ ఇతర పార్టీల మాదిరిగా క్షేత్రస్థాయిలో జనం మధ్యలో పని చేసే నాయకులను ప్రోత్సహించడం లేదు. దానితో బీజేపీకి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో సైతం పరాజయం తప్పలేదు. ‘శీష్ మహల్’ గురించి కొంతమేరకు కేజ్రీవాల్‌ను ఇరకాటంలో పడవేసిన బంగారు పూత పూసిన టాయిలెట్ ఫిట్టింగ్‌లు, స్విమ్మింగ్ పూల్ వంటి ప్రచారాలు అవాస్తవమని వెల్లడి కావ డంతో వెంటనే బీజేపీ తమ ప్రచారాన్ని మార్చి వేసింది. ‘ఒక్కసారి అధికారం ఇస్తే ఢిల్లీ రూపురేఖలను మార్చగలం’ అని ఇప్పుడు చెబున్నారు. ఢిల్లీ తీవ్ర మైన నీటి సమస్య ఎదుర్కొంటున్న సమయంలో పొరుగున ఉన్న హరి యాణాలోని బీజేపీ ప్రభుత్వం సహ కరించే విధంగా కేంద్రం ఎటువంటి చొరవ తీసుకోలేక పోయింది.వాస్తవానికి కేజ్రీవాల్‌తో సమా నంగా ప్రజాదరణ గల నాయకులు ఎవ్వరూ ఢిల్లీ బీజేపీలో లేరు. అందుకనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు ఆ పార్టీ వెనకాడుతోంది. కేవలం ప్రధాని మోదీ ప్రజాకర్షణపైననే ఆధారపడుతోంది. ఆప్ ఈ ఎన్నికలలో గెలుపొందితే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ వంటి వారు కలిసి బలమైన ప్రత్యా మ్నాయం అందించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజల జీవన్మరణ సమస్య అయిన కాలు ష్యాన్ని వదిలేసి ఆప్, బీజేపీలు ఉచిత పథకాలపై హామీలు గుప్పించి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నాయి. – సభావట్ కళ్యాణ్‌లా విద్యార్థి, ఢిల్లీ యూనివర్సిటీ ‘ 90143 22572 -
నీ ముక్కెర ... కాళ్ళ పట్టాలు కూడా మెరుస్తాయి లక్ష్మి
చీకటిపడుతున్నవేళ చిన్నగా ఈలవేస్తూ.. లచ్మీ ఇదిగో.. మన పొలం కాడ గుమ్మిలో దొరికింది పట్టేశాను.. బుర్రా తోకలు పులిసెట్టు.. నడు మ్ముక్కలు ఇగురు చెయ్యవే.. అంటూ కళ్ళు కడుక్కోడానికి గోలేం కాడికి వెళ్ళాడు.. మత్స్య రాజు... తిక్కనా సన్నాసికి ఎప్పుడు ఏది అనిపిస్తే అదే చేస్తాడు..ఈడి జిమ్మకు ఒకటి చాలదు .. రెండు రకాలుండాలి.. ఈ చీకట్లో ఇదేటి దరిద్రం.. సన్నగా గొణుక్కుంది లచ్మి .. ఒసేయ్... ఇన్నావా.. వాటిని తియ్యు.. లేపోతే పిళ్లెత్తుకెళ్ళిపోద్ది.. అప్పుడు నీకు దరువులు పడతాయి అన్నాడు కొంటెగా..ఈ రాత్తిరిపూట వాటిని పెరట్లోకి వెళ్లి రాయిమీద పొయ్యి బుగ్గేసి పామి.. కడిగి.. పులు సెట్టి ఈడీకి కూడెట్టాలి.. మొగుడిమీద ప్రేమగా విసుక్కుంది లచ్మి.. ఏందే నీ సణుగుడు... కేకేశాడు.. రాజు.. ఈడీకి పనికొచ్చినముక్క చెప్తే ఒక్కటీ ఇనబడదు కానీ. ఇలాంటివి మాత్రం టక్కున చెవిలోపడతాయి.. సచ్చోనోడివి పాము చెవ్వులు.. అంటూనే వంటి పూర్తి చేసేసింది .. చీకట్లో సరిగ్గా చూసుకుని తిను.. లేపోతే ముల్లుదిగిపోద్ది.. జాగ్రత్త చెప్పింది.. పోన్లేయే.. ఇదొక్కటే చీకటి భోజనం.. ఎల్లుండినుంచి అదిగో.. అక్కడ కూకుని తిందాం.. నువ్వు నేను.. మన బుడ్డి సాంబిగాడు అన్నాడు..సీకట్లో కూకుని ఆ సెట్టుకింద తింతావా .. నువ్వేమైనా గబ్బిలానివా మామ.. అంటూ నవ్వింది లచ్చ్మి.. లేదే.. మనూరికి కరెంటొచ్చింది.. అదిగో మన గొర్రిల పాక పక్కనే స్థంభం వచ్చింది.. ఇక మనకు ప్రతోరోజూ.. పగలే... రేత్తిరి అనేది ఉండదు అన్నాడు.. రేత్తిరి లేకపోతే నువ్వు ఊరుకుంటావా మామ .. నర్మగర్భంగా పంచ్ వేసింది.. ఐనా కరెంటొస్తే మనకేటి మామ.. లాభం అంటూ డోకితో కాసింత పులుసు పోసింది.. అదేటి అలాగంటావు. కరెంటొస్తే ఊరికే కాదే మన బతుకుల్లోకి కూడా వెలుగొచ్చినట్లే అన్నాడు .. అదెలా అంది..చేప తలకాయ ను రాజు పళ్లెంలో వేస్తూ..ఒసేయ్ లచ్చిమి.. కరెంట్ వచ్చిందనుకో.. మనం ఇంటికి ఒక కరెంట్ బుడ్డి వేసుకోవచ్చు.. మన బుడ్డి గాడు మన ఇంట్లోనే పెట్టి మీద కూకుని సదూకుంటాడు.. మనం కొర్రలు... సామలు.. గట్రా ఇంట్లోనే మరాడించుకోవచ్చు.. కరెంట్ కుక్కర్ కొనుక్కోవచ్చు.. ఇక నువ్వు చీకటిపడ్డాక కూడా ఉడుకుడుగ్గా వండొచ్చు.. మనం కూడా వేడివేడిగా తిని.. అన్నాడు.. సాల్సాల్లే నీకు తిపారం ఎక్కువైంది.. అన్నది లచ్చ్మి . ఒసేయ్.. ఈ చీకట్లో కనబళ్ళేదు కానీ... కరెంట్ వచ్చాక.. ఆ వెల్తుర్లో నీ నత్తు .. కాళ్ళ పట్టీలు కూడా భలే మెరుస్తాయి లచ్చిమి అన్నాడు.. ఆమె చుబుకం మీద చెయ్యేస్తూ.. ఈడీకి పనికి వెళ్ళడానికి ఒల్లొంగదుకానీ ఇలాంటీటీకి మాత్రం రద్దీగా ఉంటాడు మురిపెంగా విసుక్కుంది లచ్చిమి.. ఒసేయ్ ఇంకెన్ని లాభాలున్నాయో తెలుసా.. మనఇంటి ముందు లైట్ ఉంటుంది కదా.. అక్కడే మనమంతా రాత్రి పూత కబుర్లు చెప్పుకుని పడుకోవచ్చు.. ఇక ఆముదం. కిరసనాయిలు దీపాలు అక్కర్లేదు.. చుట్టాలు వచ్చినా ఇక ఇంటిముందున్న రాళ్లు తన్నుకుని పడిపోయేది ఉండదు.. ఒసేయ్ లచ్మి కరెంట్ ఎల్తురులో నువ్ మరింత మెరిసిపోతావే అన్నాడు.. రాజు.. ఈడికిపోయేకాలం రాను.. అంటూ గిన్నెలు తీసి.. సర్లే.. అవతల పెయ్యి అరుస్తుంది దాన్ని పాకలో కట్టేసి రా.. అంటూ గదిమింది..అనకాపల్లి జిల్లా గిరిశిఖర గ్రామం నీలబంధకు తొలిసారిగా కరెంట్ వచ్చింది.. ఈ సందర్భంగా ఓ గిరిజన కుటుంబంలో కలిగే మార్పులపై చిన్న కథ.. కథనం.. మీ కోసం... -- సిమ్మాదిరప్పన్న77 ఏళ్ల తర్వాత కొండశిఖర గ్రామమైన నీలబంధకు ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం.#APNDAWorkshttps://t.co/VN2UYyVSxr— Team Rajakeeyam (@TeamRajakeeyam) February 2, 2025 -
ట్రంప్, ఆర్బీఐ నిర్ణయాలు కీలకం
కేంద్ర ఆర్థికమంత్రి గత శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ రకంగా మార్కెట్‌కు రుచించలేదు. మధ్య తరగతి, వేతన జీవులకు ప్రాధాన్యమిస్తూ సాగిన బడ్జెట్లో మార్కెట్ డిమాండ్లేవీ నెరవేరకపోవడంతో బడ్జెట్‌కు ముందు వచ్చిన ర్యాలీ కొనసాగలేదు. పన్ను స్లాబులు, రేట్లలో చేసిన మార్పుల వల్ల సామాన్యుల ఆదాయం పెరుగుతుందని, తద్వారా కొనుగోలు శక్తి ఇనుమడిస్తుందన్న ఉద్దేశంతో ఆటో మొబైల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో మాత్రం హడావుడి కనిపించింది. గతవారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీ లు దాదాపు 1.5 శాతం దాకా పెరిగాయి. ప్రముఖ కంపెనీలు ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు యధావిధిగానే నిరాశపరిచాయి. కేవలం బడ్జెట్ మీద దృష్టితోనే గత వారమంతా మార్కెట్ నడిచింది. అందువల్లే ప్రీ-బడ్జెట్ ర్యాలీ వచ్చింది. వారం మొత్తానికి సెన్సెక్స్ 1316 పాయింట్లు పెరిగి 77506 వద్ద, నిఫ్టీ 390 పాయింట్లు లాభపడి 23482 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు కూడా లాభాల్లోనే సాగాయి.ఈవారంబడ్జెట్ ప్రభావం సోమవారం మార్కెట్లపై స్పష్టంగా కనిపించవచ్చు. మార్కెట్ వర్గాలను మెప్పించే చర్యలు బడ్జెట్లో లేకపోయినప్పటికీ సామాన్యులకు కలిగే ప్రయోజనం వల్ల పెట్టుబడులు పెరగవచ్చని అంచనా. దీని ఫలితాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అదే సమయంలో వారం చివర్లో... అంటే శుక్రవారం రిజర్వు బ్యాంకు ప్రకటించబోయే పాలసీలో వడ్డీ రేట్లు పావు శాతం తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ఇది కొంత సానుకూల అంశం.ట్రంప్ చర్యలుకెనడా, మెక్సికో, చైనాలపై టారిఫ్ లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడటం ప్రపంచ మార్కెట్లను మళ్లీ వణికిస్తోంది. మన స్టాక్ మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఈవారం మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని బడా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలు ప్రకటించబోతున్నాయి. వీటి ప్రభావం ఎటూ ఉండనే ఉంటుంది. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదేసమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లను పడదోస్తూనే ఉంటాయి.ఆర్థిక ఫలితాల కంపెనీలుఈవారం మార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల వాటిలో పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, భారతి ఎయిర్టెల్, బ్రిటానియా, హీరో మోటో, ఐటీసీ, ఎస్బీఐ, మహీంద్రా & మహీంద్రా ఫలితాలు ఉంటాయి. తర్వాతి స్థానంలో ఎల్ఐసీ, టాటా పవర్పె, ఆరోబిందో ఫార్మా, దివీస్, జైడస్ లైఫ్, టాటా కెమికల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, థర్మాక్స్, టొరెంట్ పవర్, కమిన్స్, గుజరాత్ గ్యాస్, అపోలో టైర్స్, ఎన్ఎండీసీల ఫలితాలపైనా ఓ కన్నేసిఉంచాల్సిందే.ఎఫ్ఐఐలుమార్కెట్లో భారీ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత జనవరి నెల మొత్తానికి రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపారు. పెట్టుబడులను తరలిస్తున్నారు. గత అక్టోబర్‌లో రూ.1.14 లక్షల కోట్ల షేర్లు విక్రయించిన వీరు మళ్లీ అధిక స్థాయిలో అమ్మకాలకు పాల్పడింది జనవరి నెలలోనే కావడం గమనార్హం. దీని ప్రభావం రూపాయిపై పడుతోంది. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు. వీరు నెల మొత్తానికి దాదాపు రూ.76,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. తద్వారా మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోకుండా వీరు అడ్డుకోగలుగుతున్నారు. గత వారం మొత్తం మీద విదేశీ మదుపర్లు రూ.20,000 కోట్ల నికర అమ్మకాలు జరపగా అదే వారంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.19,000 కోట్ల నికర కొనుగోళ్లు జరిపి మార్కెట్లను నిలబెట్టారు.సాంకేతిక స్థాయిలుమార్కెట్లలో ప్రస్తుతానికి సానుకూల సంకేతాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ నిఫ్టీ 23500 పైన ఉన్నంతవరకు ఫర్వాలేదు. ఈ ధోరణి కొనసాగితే మాత్రం సూచీలు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 23650 ని ప్రధాన నిరోధంగా భావించాలి. ఇది దాటితే 23800, 23920 వద్ద నిరోధాలున్నాయి. మొత్తం మీద 24000 పాయింట్లు అనేది ప్రస్తుతానికి పెద్ద అవరోధంగా భావించొచ్చు. దానికంటే ముందు 23200, 23050, 22850, స్థాయిల వద్ద నిఫ్టీ కి మద్దతు లభించొచ్చు. ఒకవేళ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి విస్తృతమైతే 22500 దాకా పడిపోయినా ఆశర్యపోనక్కర్లేదు. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్ లను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాలమెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు మరింత ఇబ్బందికరంగా మారినా సూచీలు ఇంకా ఇంకా పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ సోమవారం నాటికి 15.1 శాతం క్షీణించి 14.1 దగ్గర ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ బుల్స్ కు అనుకూలంగా ఉందనేందుకు ఇది నిదర్శనం.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
మన రాజ్యాంగం బలమైనదేనా?
మీకు తెలుసా? ప్రపంచ దేశాలన్నింటి రాజ్యాంగాల సగటు ఆయుష్షు 19 ఏళ్లు మాత్రమేనని! భారతదేశం మాత్రం 75 ఏళ్ల పాటు తన రాజ్యాంగాన్ని కాపాడుకుంది. దీనికి సంతోషపడదాం. గర్వంగా ఫీల్ అవుదాం. దేశ చరిత్రలోనే కీలకమైన ఈ ఘట్టాన్ని గత వారమే చూశాం. అయితే, సమీక్షకు తగిన సమయం కూడా ఇదే! డెబ్ఫై ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత రాజ్యాంగం ఎదుర్కొన్న సవాళ్లు, ప్రశ్నలేమిటన్నది చూద్దాం.మన రాజ్యాంగం వలసవాదులదని చాలామంది మేధావులు విమర్శిస్తూంటారు. భారతీయ మూలాలు ఉన్నది కాదని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానిస్తూ ఉండేది. అలాంటప్పుడు ఇది ఏ విధంగా మనకు మంచిది?ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించిందనేది ఒక సమాధానం. అలాగే ఏకకాలంలో అర్హులందరికీ ఓటుహక్కు కల్పించిన రాజ్యాంగం కూడా మనదే. కానీ దీనివల్ల అందరూ సమానంగా లాభ పడ్డారా? లేక... ముస్లింలు, ఆదివాసీలు, దళిత మహిళలు లాభ పడలేదా? డెబ్భై ఏళ్ల ప్రయాణంలో మన రాజ్యాంగం ఇప్పటివరకూ 106 సార్లు మార్పులకు గురైంది. ఇది మన శక్తికి ప్రతీకా? ఎందుకంటే, అవసరమైనప్పుడు తగు విధంగా మార్పులు, చేర్పులు చేసుకునే వీలుతో రాజ్యాంగం ఉంది. లేదా ఇది బలహీనతా? అగ్రరాజ్యం అమెరికాలో 1789 నుంచి జరిగిన సవరణలు కేవలం 27 మాత్రమే.శాసనాలు చేసే ప్రజా ప్రతినిధుల వ్యవస్థ కంటే కార్యనిర్వాహక వర్గాన్ని రాజ్యాంగం ఎక్కువ బలోపేతం చేసిందని చెబుతారు. అసెంబ్లీ స్పీకర్ల పనితీరు, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఈ పరి స్థితిని మరింత దిగజార్చాయి. ఫలితంగా ఎంపీలు పార్టీ నాయకత్వా నికి సబార్డినేట్లుగా మారిపోయారు. స్పీకర్లకు హౌస్ ఆఫ్ కామన్ ్స (యూకే) మాదిరిగా వారిపై అధికారం ఏదీ ఉండదు. ఈ విమర్శను ఇప్పటివరకూ ఎవరూ సవాలు చేయలేదు కూడా! అయితే దీని వెనుక ఏముందన్నది నిశితంగా పరిశీలించాల్సిన అంశం. ‘‘భారతీయ రాజ్యాంగం అడ్డుగోడలు నిర్మించకుండా... కార్యనిర్వాహక వర్గానికి ఎక్కువ అధికారాలు ఇచ్చింది. అంతేకాకుండా ఈ వర్గం తన అధికారాన్ని పూర్తిస్థాయిలో చలాయిస్తుందని విశ్వసించింది’’ అంటారు గౌతమ్ భాటియా. పాలకులందరూ మంచివారనీ, రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారా? ఊహూ, అలా అనుకోలేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఒక ఉదాహరణ – ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి. ఇది రాజ్యాంగాన్ని సుప్తచేతనావస్థలో పెట్టడం వల్లనో, రాజ్యాంగా నికి అతీతంగా పోవడం వల్లనో అమలు కాలేదు. దాంట్లో భాగమైన వ్యవస్థలతోనే జరిగింది. ఇది మన రాజ్యాంగం బలహీనత లేదా లోపాన్ని ఎత్తిచూపింది. రాజ్యాంగ పరమైన నైతికత లేని విషయాన్ని ఎమర్జెన్సీ పరిస్థితి ఎత్తి చూపిందని చెప్పవచ్చు. ఈ నైతికత అనేది రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు పనిచేస్తాయా, లేదా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. గవర్నర్లు, ఎన్నికల కమిషనర్లు తరచూ ఈ రాజ్యాంగ నైతికతను తప్పుతుంటారని మనకు తెలుసు. కానీ వాటిపై వ్యాఖ్యా నించడం కంటే ఎక్కువేమీ చేయలేము – ఈ అంశాలపై మనఆందోళన, విమర్శ ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ! రాజ్యాంగంలో ఉన్న మరో లోటు ఇదేనా?రాజ్యాంగం సమాఖ్య నిర్మాణానికి ఏర్పాటు చేసింది. కానీ ఆర్థికాంశాలతో పాటు పరిపాలనకు సంబంధించిన విషయాల్లోనూ రాష్ట్రాలపై పెత్తనం చలాయించే అధికారం కేంద్రానికి కట్టబెట్టింది. సమాఖ్య స్వరూపాన్ని మార్చే అధికారం, శక్తి కూడా కేంద్రానిదే. స్వాతంత్య్రం లభించిన సమయంలో దేశం బలహీనంగా, ముక్కలు ముక్కలుగా విడిపోయింది కాబట్టి... ఆ పరిస్థితుల్లో ఇలాంటి ఏర్పాట్లు చేశారని అనుకున్నా మూడు సిల్వర్ జూబ్లీల కాలం గడచిన ఈ తరుణంలోనైనా మార్పులు చేయడం అనవసరమా? భారతీయ పౌరులకు రాజ్యాంగం బోలెడన్ని ప్రాథమిక హక్కు లను కల్పించింది. అయితే భావ ప్రకటన, వ్యక్తీకరణపై పూర్తిస్థాయి స్వాతంత్య్రం మాత్రం లేకుండా పోయింది. నిజానికి ఈ ‘ఫ్రీ స్పీచ్’ను నైతికత, పరువునష్టం వంటి రెండు సందర్భాల్లో మాత్రమే నియంత్రించాల్సి ఉంటుంది. మహా అయితే... విదేశాలతో మన సంబంధాలు దెబ్బతినే పరిస్థితులకూ పొడిగించవచ్చు. కానీ... మనకున్న నియంత్రణలు చాలా ఎక్కువగా లేవూ?1973లో రాజ్యాంగంపు మౌలిక స్వరూపాన్ని కాపాడే లక్ష్యంతో సుప్రీంకోర్టు కొన్ని విధి విధానాలను సిద్ధం చేసింది. ఇదో చారిత్రక నిర్ణయం. అయితే దాదాపుగా అదే సమయంలో జబల్పూర్ అడిష నల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎమర్జెన్సీ విషయంలో శాసనకర్తల ఒత్తిడికి లొంగిపోయారు. అయోధ్య విషయంలోనూ ఇదే జరిగిందన్నది చాలామంది అభిప్రాయం. అలాగే జమ్మూ–కశ్మీర్‌కు ఉన్న రాష్ట్ర హోదాను కూడా రాజ్యాంగం కాపాడలేకపోయింది. కాబట్టి... రాజ్యాంగ సంరక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు తమ నిర్ణయాల్లో అసందిగ్ధతతో వ్యవహరిస్తున్నాయి. లేదంటే అవసరమైనంత చేయడం లేదు. రాజ్యాంగం మనకు ఎన్నికల కమిషన్ , కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), ఇన్ఫర్మేషన్ కమిషన్ వంటి ఎన్నో వ్యవస్థలను కల్పించింది. కానీ... ఇవి పాలకవర్గానికి అతీతంగా స్వతంత్రంగా పని చేసేలా మాత్రం చేయలేకపోయింది. ఆ యా సంస్థల ఉన్నతాధి కారుల నియామకాల విషయంలో ఇది మరింత సత్యమని చాలా మంది చెబుతారు. చివరగా... రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన రాజకీయ నేతలు, సంస్థల అధినేతలు ఆ పని ఎంత వరకూ సక్రమంగా నిర్వర్తించారు? అలాగే రాజ్యాంగ సంరక్షణ బాధ్యతను న్యాయమూర్తులు ఎంత సమర్థంగా నిర్వహించారు? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్‌ను ఇదే ప్రశ్న అడిగితే... ‘‘భారత్‌కు మంచి రాజ్యాంగం ఉంది. కీలక సందర్భాల్లో రాజకీయ నేతలు, న్యాయమూర్తులు దీని ప్రతిష్ఠను దిగజార్చారు. పాలకవర్గం మాత్రమే కాదు... పార్లమెంటు కూడా ఇందులో భాగస్వామే’’ అన్నారు. ఇందులో అంగీకరించక పోయేందుకు ఏమీ లేదన్నది నా అభిప్రాయం!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
లక్ష్యాల సాధన సాధ్యమేనా?
‘మిడిల్ క్లాస్ ఫీల్‌గుడ్ బడ్జెట్’గా 2025–26 బడ్జెట్‌కు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. అయితే మధ్యతరగతిని సంతృప్తి పరిచే దిశలో కొంత ప్రయత్నం జరిగినా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ సమస్య పరిష్కారం దిశలో బడ్జెట్లో ఎలాంటి చర్యలూ లేవు. ప్రత్యేకంగా చూస్తే దేశంలో ఆహార ద్రవ్యోల్బణం సైతం పెరుగుతోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పన దిశగానూ ప్రత్యేక చర్యలేవీ తీసుకోలేదు. దిగువ మధ్యతరగతి, పేద ప్రజల ఆదా యాలు పెంచేందుకు అవసరమైన నిర్దిష్టమైన కార్యక్రమాలు లేదా చర్యలు చేపట్టలేదు. అంటే సమాజంలో అధిక శాతమున్న ప్రజల చేతుల్లో మరింత డబ్బు పెట్టే చర్యలేవీ తీసుకోలేదన్నమాట. అభివృద్ధి సాధనలో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ పెట్టుబడులకు పరిమితం కావడం, ఆశించిన మేర ప్రైవేట్ పెట్టుబడులు పెరగక పోవడం, కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్తోనే వృద్ధిని ముందుకు తీసుకెళ్ల లేకపోవడంతో ఉద్దీపనలతో ప్రైవేట్ పెట్టుబడులను పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కీలకమైన రంగాల అభి వృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోకుండా మధ్యతరగతి చేతుల్లో డబ్బుపెట్టి కొనుగోలుశక్తి పెంచడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో వివిధ ఉత్పత్తులకు డిమాండ్ పెంచవచ్చని ఆశిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగం విషయానికొస్తే... దేశంలో మొత్తం ఏడు వందలకు పైగా జిల్లాలు ఉంటే... కేవలం వంద జిల్లాల్లో ‘ధన్, ధాన్య, కిసాన్ యోజన’ కింద (11 కోట్ల మంది రైతులకు గాను 1.7 కోట్ల మంది) రైతాంగానికి ప్రయోజనం కల్పిస్తామని చెబుతున్నారు. అది కూడా మూడు పప్పుదినుసులకు సంబంధించి రాబోయే ఆరేళ్లలో దీనిని చేస్తామని చెప్పడం ద్వారా ఇప్పటికిప్పుడు ఈ రైతులకు ఒనగూడే ప్రయోజనం ఏమీఉండదు. దేశ వ్యాప్తంగా విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విశ్వ విద్యాలయాల్లో విద్యాభివృద్ధికి, దాని నాణ్యతను పెంచే దిశలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఎక్కడా పేర్కొన లేదు. దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న మధ్య తరగతిని మంచి చేసుకునే ప్రయత్నంలో భాగంగా బడ్జెట్లో కొన్ని చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పట్టణాల్లోని డిమాండ్ అనేది స్తబ్ధుగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కొంత మెరుగైన పరిస్థితుల్లో ఉండడంతో అర్బన్ డిమాండ్ పెంచేందుకు ప్రైవేట్ పెట్టుబడులకు ‘ఉద్దీపన’ కింద రాయితీల కల్పన జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో మధ్యతరగతి అనేది అసంతృప్తితో ఉందని, ఈ వర్గం కొనుగోలు శక్తి తగ్గిందనే అభిప్రాయం సర్వత్రా నెలకొనడంతో ఈ అంశానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. వార్షిక బడ్జెట్లో ఇచ్చిన ఆదాయపు పన్ను మినహాయింపులతో దాదాపుగా అన్ని వర్గాలనూ సంతోషపరిచే ప్రయత్నం జరిగింది. ఇది ఎంతో కాలం నుంచి కోరుకుంటున్నదే. గతంలో రూ. 15 లక్షల వార్షికాదాయం గలవారు గరిష్ఠంగా 30 శాతం పన్ను కట్టేవారు. ఇప్పుడు ఈ 30 శాతం పన్ను ఏడాదికి రూ. 24 లక్షలకు పైగా ఆర్జిస్తున్నవారికి వర్తింప చేశారు. ఈ పన్ను మినహాయింపుల పరంగా చూస్తే రూ. 12 లక్షల దాకా ఆదాయం వచ్చేవారికి ప్రయోజనం కలుగుతుంది. అయితే ఇది నూతన ఆదాయ పన్ను విధానానికి లోబడి ఉన్న వారికే వర్తిస్తుంది.ఈ విధంగా రూ. లక్ష కోట్ల వరకు వచ్చే ఆదాయపు పన్ను మొత్తాన్ని మధ్యతరగతి చేతుల్లో పెట్టి కొనుగోలుశక్తి పెంచడంద్వారా డిమాండ్పెంచితే ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయనేది దీని వెనక ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే వాస్తవంగా చూస్తే... స్వేచ్చగా తమ అభిప్రా యాలను వ్యక్తపరిచే ‘వోకల్ సెక్షన్స్’ను సంతృప్తి పరిచే ప్రయత్నంగానే ఇది నిలుస్తోంది. ఇలా పెద్ద సంఖ్యలోని ప్రజలు ఇంకా కొనుగోలు శక్తి లేక ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులే ఉంటాయి. అందువల్ల ఆదాయపు పన్ను మినహాయింపు రూపంలో ఇచ్చిన ఉద్దీపనలు ఏ మేరకు ఉపయో గపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.ప్రొ‘‘ డి. నర్సింహా రెడ్డి వ్యాసకర్త ఆర్థికవేత్త, హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ సోషల్‌సైన్సెస్ మాజీ డీన్ -
సాగుకు ఊతమేది?
భారత్‌ను అభివృద్ధి పథంలో పయనింపజేసే కీలకమైన నాలుగు ఇంజిన్లలో వ్యవసాయం ఒకటని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యవసాయ అభివృద్ధి– ఉత్పాదకతల్లో సాధించే ప్రగతి... గ్రామీణ భారతం తిరిగి పుంజుకోవ డానికీ, సౌభాగ్యవంతం కావడానికీ దారితీస్తుందని ఆమె 2025–26 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ అందుకు తగిన కేటా యింపులు చేయడం మాత్రం మరిచారు. భూతాపం పెరుగు తున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతి కూల ప్రభావాలు, అతివృష్టి, అనావృష్టి, సారం లేని నేలలు, నాణ్యత లేని విత్తనాలు వల్ల సగటు రైతులు పంట దిగుబడిలో తీవ్ర మార్పులు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్లో ఈ పరిస్థితి నుంచి వారిని బయటపడవేయడానికి ఎట్లాంటి నిధులూ లేవు. ఈ ఏడాది వ్యవసాయ బడ్జెట్ రూ. 1,27,290.16 కోట్లుగా ప్రకటించారు. ఇది 2024–25లో రూ.1,22,528 కోట్లు, 2023–24లో రూ. 1,16,788 కోట్లుగా ఉంది. 2025–26 మొత్తం బడ్జెట్ అంచనా (బీఈ) రూ. 50,65,345 కోట్లు. అంటే వ్యవసాయానికి మొత్తం బడ్జెట్లో ఇచ్చింది కేవలం 2.51 శాతం మాత్రమే అన్నమాట. వ్యవసాయం, వ్యవసాయ పరిశోధన, చేపలు, పాడి పశువుల శాఖలకు కలిపి మొత్తం రూ. 1,45,300.62 కోట్లు. గత ఏడాది ఇది రూ. 1,39,607.54 కోట్లుగా ఉంది. వ్యవసాయ పరి శోధనకు గతేడాది రూ. 9,941.09 కోట్లు ఇస్తే ఈసారి రూ. 10,466.39 కోట్లు కేటాయించారు (పెరుగుదల 5.2 శాతం).ఆశ్చర్యంగా, పంటల దిగుబడి ప్రభుత్వ లెక్కలలో పెరుగుతోంది. అననుకూల పరిస్థితుల వల్ల కేరళ రాష్ట్రంలో 3 పంటలు పండించే ప్రాంతంలో ఒకే పంట వేస్తున్నారు. గత 10 ఏండ్లలో వేల ఎకరాల వ్యవసాయ భూమి రోడ్లకు, ఇంకా ఇతర అభివృద్ధి పనులకు మళ్ళింది. దాదాపు 100 నదులు ఎండిపోయాయి. ఇవేవీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంటల దిగుబడి మీద వ్యతిరేక ప్రభావం చూపకపోగా... దిగుబడి పెర గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పంటల విలువ పెరిగింది అని ఆర్థిక సర్వే చెబుతున్నది. అంటే ధరలు పెరిగినాయి. దీని వలన రైతుల ఆదాయం పెరగలేదు. కాగా ఆహార వస్తువుల ధరలు పెరిగాయి. అందువల్ల సాధారణ పౌరులకు అనేక పంట ఉత్పత్తులు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి.ఆర్థిక మంత్రి తన 2024–25 బడ్జెట్ ప్రసంగంలో 9 ప్రాధాన్యాలను ప్రస్తావించారు. వ్యవసాయంలో దిగుబడి పెంచడం, వ్యవసాయాన్ని దృఢంగా సవాళ్ళను ఎదుర్కునే విధంగా తయారు చేయటం వంటివి ఇందులో ఉన్నాయి. అయితే ఏడాది గడిచేటప్పటికి ఈ ప్రాధాన్యాలు మరిచి పోయారు. పశుగణ అభివృద్ధికి, మత్స్య రంగానికి కలిపి రూ. 7,544 కోట్ల కేటాయింపు జరిగింది. వ్యవసాయ రంగ పెరుగు దలలో ఆర్థిక సర్వే కీలకంగా గుర్తించిన ఈ రెండు రంగాల మీద ప్రభుత్వం బడ్జెట్ పెరుగుదల 5 శాతం లోపే. మొత్తం బడ్జెట్ దిశ మారలేదు. ఈ రంగాల అభివృద్ధిని నిలువరిస్తున్న మౌలిక అంశాల మీద మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రధానంగా నీటి వనరుల కాలుష్యం, పశువులకు దొరకని దాణా వంటి అంశాల మీద దృష్టి లేనే లేదు. వ్యవసాయ పరిశోధనలకు రూ. 9,504 కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ‘ప్రధాన మంత్రి పంటల బీమా పథకా’నికి 13 శాతం కోత విధించింది. ఈ సారి ఇచ్చింది కేవలం రూ. 13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారిన పడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకం తగ్గించడం శోచనీయం.రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీల కొరత, వ్యవ సాయ కూలీ భారం వంటి అంశాల మీద ఆర్థిక సర్వేతో పాటు బడ్జెట్ కూడా ప్రస్తావించలేదు. గ్రామీణ భారతంలో ఉన్న భూమి లేని వారి ఉపాధికి, దాని రక్షణకు కేటాయింపులు లేవు. గ్రామీణ శ్రామిక శక్తికి అవసరమైన వసతుల కల్పనకు, సంక్షేమానికి, ఉపాధి రక్షణకు నిధులు మృగ్యం. వ్యవసాయంతో గ్రామీణ శ్రామిక శక్తి అనుసంధానం గురించిన కేటాయింపులు లేవు. పెరుగు తున్న ఉష్ణోగ్రతల వల్ల శ్రామికుల ఉత్పాదకత శక్తి పడి పోతున్నది. ఆహార ద్రవ్యోల్భణం వల్ల సరైన పరిమాణంలో పౌష్టిక ఆహారం శ్రామిక కుటుంబాలకు అందడం లేదు. ఈ సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం.భారత ప్రభుత్వం పెరుగుతున్న ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల మీద ఖర్చు చేయడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ఉపాధి ఇచ్చి ఆదుకున్న వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. వ్యవసాయంలో ఉపాధిని తగ్గించే డిజిటలీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోక పోగా హాని కలిగించే పనుల మీద దృష్టి సారించడం మంచిది కాదు. కేంద్ర బడ్జెట్లో తీవ్ర మార్పులు అవసరం ఉన్నాయి. దార్శనిక నిధుల కేటాయింపుల అవసరం ఎంతైనా ఉంది.డా‘‘ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
మానవాభివృద్ధి దిశగా!
2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. వ్యవసాయం; సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు; పెట్టుబడి, ఎగుమతుల అభివృద్ధిని వేగవంతం చేయడం, సమ్మిళిత సాధన, ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, మధ్యతరగతి ప్రజల వినియోగ వ్యయ సామర్థ్యం పెంపు లాంటి లక్ష్యాల సాధన ‘వికసిత్ భారత్’ ఆకాంక్షలుగా ఆర్థిక మంత్రి అభివర్ణించారు. నూతన పన్ను వ్యవస్థలో భాగంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు వల్ల ప్రజల వ్యయార్హ ఆదాయాలు పెరిగి, కుటుంబ వినియోగ వ్యయం పెరుగుతుంది. తద్వారా దేశంలో సమష్టి డిమాండ్ పెరిగి, ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది.బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడం ఆహ్వానించద గిన పరిణామం. ఈ చర్య ఆరోగ్య బీమా రంగంపై దీర్ఘకాల ప్రభా వాన్ని కలుగజేస్తుంది. బీమా రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు పోటీతత్వం పెరిగి బీమా పాలసీల రూపకల్పన, సేవల డెలి వరీలో నవకల్పనలు చోటుచేసు కుంటాయి. తద్వారా వ్యక్తులు, కుటుంబాలు తమ ఆరోగ్య సంర క్షణ వ్యయాన్ని సక్రమంగా నిర్వ హించుకోవడం ద్వారా నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను పొంద గలుగుతారు. ఆర్థిక సేవల అందు బాటు దేశంలో మానవాభివృద్ధికి దారితీస్తుంది, ఆర్థికాభివృద్ధి వేగ వంతమవుతుంది.ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను విద్యారంగానికి విస్తరించి పెట్టుబడులను ప్రకటించడం ద్వారా దీన్ని భవిష్యత్ సామాజిక – ఆర్థిక ప్రగతికి కారకంగా ప్రభుత్వం గుర్తించింది. అదనంగా పదివేల మెడికల్ సీట్లు, ఐఐటీలలో అదనంగా 6,500 సీట్ల పెంపు, నాణ్యతతో కూడిన శ్రామిక శక్తి పెంపు నవకల్పనలకు దారితీస్తాయి. గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనపై పెట్టు బడులు, ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు దారితీసి, అధిక వినియోగం, మార్కెట్ విస్తరణకు నూతన అవకాశాలు ఏర్ప డతాయి. 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌కు కస్టమ్ సుంకాన్ని మినహా యింపునివ్వడం వల్ల పేషెంట్లపై ఆర్థిక ఒత్తిడి తగ్గి ఆరోగ్య ప్రమాణాలు మెరుగవుతాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీల క్షీణతకు మూలధన వ్యయంలో స్వల్ప పెరుగుదల కారణంగా భావించవచ్చు. 2024–25 ఆర్థిక సంవత్సరం మూలధన వ్యయంతో పోల్చినప్పుడు 2025–26లో మూలధన వ్యయంలో పెరుగుదల 10 శాతం మాత్రమే. ఆర్థికాభివృద్ధికి మూలధన వ్యయంలో పెరుగుదల అధికంగా లేనప్పుడు ఆ ప్రభావం ఉత్పాక రంగాలపై రుణాత్మకంగా ఉండి, వృద్ధి క్షీణతకు దారితీస్తుంది. ప్రభుత్వ కోశ విధానాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు స్పందిస్తాయి. 2024–25 ఆర్థిక సంవ త్సరం ద్రవ్యలోటు జీడీపీలో 4 శాతంగా నమోదు కావడం, పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, బాండ్ల రాబడి, ఈక్విటీ మార్కెట్లపై స్వల్పకాల ఒడుదొడుకులను కలుగజేస్తాయి. విదేశీ పెట్టుబడులను భారత్ అధికంగా ఆకర్షించడమనేది ప్రతి పాదిత బడ్జెట్ చర్యలు ఆర్థిక విస్తరణ, రాజకీయ సుస్థిరత, కార్పొరేట్ సంస్థల రాబడుల పెరుగుదలకు దారితీశాయా, లేదా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.ఆదాయపు పన్ను మినహాయింపు వలన పెరిగిన వ్యయార్హ ఆదాయాన్ని, వినియోగదారులు వినియోగ వ్యయంగా మరల్చగలరనే విషయంలోనూ అనిశ్చితి ఉంది. పన్ను రేట్ల తగ్గింపు స్వల్పకాల ప్రయోజనాలకే దారి తీస్తుంది. మరోవైపు అవస్థాపనా సౌకర్యా లపై పెట్టుబడులు అధికవృద్ధి సాధనకు దారి తీస్తాయి.రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వా మ్యంతో వంద జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడం, సరకు నిల్వ, నీటి పారుదల సౌకర్యాల విస్తరణ, స్వల్పకాల, దీర్ఘకాల వ్యవసాయ పరపతి పెంపు లక్ష్యాలుగా, ‘ప్రధాన మంత్రి ధన్ – ధాన్య క్రిషి యోజన’ పథకాన్ని ప్రకటించారు. భారత్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించి అధిక శాతం రైతులు ఉపాంత, చిన్న కమతాలపై ఆధా రపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తం వ్యవసాయ భూమిలో రెండు హెక్టార్ల కన్నా తక్కువ ఉన్న కమతాల వాటా 86 శాతం. కమతాల విస్తీర్ణం తక్కువగా ఉండటం వలన ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించలేకపోతున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన సంస్క రణలు ముఖ్యంగా మేలు రకమైన వంగడాల వినియోగం,పంటమార్పిడి విధానాన్ని అవలంబించగలిగే సామర్థ్యం తక్కువగా ఉండటానికి రైతులలో ఆధునిక వ్యవసాయ పద్ధతు లపై అవగాహన లేకపోవడంతోపాటు, పరపతి లభ్యత తక్కు వగా ఉండటాన్ని కారణాలుగా పేర్కొనవచ్చు.స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు బడ్జెట్ ప్రతిపాదనలు అనుకూలంగా ఉన్నప్పటికీ లోప భూయిష్ఠ సప్లయ్ చెయిన్ వ్యవస్థ, అసంఘటిత రంగ కార్య కలాపాలు, సంస్థాపరమైన పరపతి లభ్యతలో ఇబ్బందులు అభివృద్ధికి అవరోధంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త ప్రొఫెసర్ అండ్ డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐఎఫ్ హెచ్ఇ, హైదరాబాద్ -
కేంద్ర రాష్ట్రాల సయోధ్యతోనే వృద్ధి
రాజ్యాంగం ప్రవచించిన భారత సమాఖ్య విధానం కాల పరీక్షకు తట్టుకుని దృఢంగా నిలిచింది. అధికారాల విభజన, లిఖిత రాజ్యాంగం, స్వతంత్ర న్యాయవ్యవస్థవంటివి సమాఖ్య లక్షణాలు. వీటిని బల మైన కేంద్ర ప్రభుత్వం, అత్యవసర సంద ర్భాలకు అనువైన నిబంధనలు, కేంద్ర నియమిత గవర్నర్ల వ్యవస్థలతో అనుసంధానం చేశారు. ఎంతో నేర్పుగా జరిగిన ఈ మేళవింపు ఒక అద్భుతం. కాబట్టే... పలు ప్రాంతీయ అస్తిత్వాలు, మరెన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, ఇంత పెద్ద దేశ పరిపాలన సుసాధ్యమైంది. భిన్నత్వంలో ఏకత్వం సాధించగలిగాం. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ...కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో ఉద్రిక్తతలు లేవని కాదు. ఉన్నాయి. అయితే ఏ సమాఖ్య దేశంలో ఇవి లేవు? కెనడాలో సుదీర్ఘకాలంనుంచీ క్యుబెక్ వేర్పాటు ఉద్యమం నడుస్తోంది. క్యాటలన్ స్వాతంత్య్ర ఉద్యమంతో స్పెయిన్ సతమతమవుతోంది. అమెజాన్ అడవుల నరికివేత సమస్య బ్రెజిల్ కేంద్ర–రాష్ట్ర సంబంధాలను దెబ్బతీస్తోంది. ఇక నైజీరియా, ఇథియోపియాలు అక్కడి జాతుల ఘర్షణతో అట్టుడికి పోతున్నాయి. వనరుల పంపకంలో తలెత్తిన అసంతృప్తి జ్వాలలు చివరకు ఇండోనేషియా నుంచి ఈస్ట్ తిమోర్ వేరుపడేందుకు దారి తీశాయి. వీటితో పోల్చి చూసుకుంటే, మన ఉద్రిక్తతలు అదుపు తప్ప కుండా మనం సర్దుకుపోగలుగుతున్నాం. మన రాజ్యాంగం ఏర్పర చిన ‘చెక్స్ అండ్ బ్యాలెన్సెస్’ ఇందుకు కారణం. మన సమాఖ్య విధానం కాలానుగుణ మార్పులను తనలో ఇముడ్చుకుంటూ సాగిపోతోంది. అయితే, మన సహకార సమాఖ్య విధానం... పోరాట సమాఖ్య విధానం దిశగా జరిగిపోయింది. ఇదొక అపశ్రుతి. తమ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ప్రాంతీయ పార్టీలు, జాతీయ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు భావిస్తు న్నాయి. కేంద్ర వైఖరి పట్ల అక్కడ వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇది రాజకీయ కోణం. ఆర్థిక కోణం నుంచి చూస్తే, ఈ చీలిక మరీ తీవ్రంగా ఉంది.కేంద్ర నిధుల బదలాయింపులు తగినంతగా ఉండటం లేదని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. తమ సొంత ఆదాయాలకు తమ వ్యయ బాధ్యతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కేంద్రం భర్తీ చేయాలని కోరుతున్నాయి. అంతేకాదు, కేంద్రం ఇచ్చే నిధులను ఎలా ఖర్చు చేయాలనే అంశంలో వాటికి పూర్తి స్వయం ప్రతిపత్తి ఉండటం లేదు. దీనికి తోడు, అవి ఎంత అప్పు చేయాలో, ఎవరి నుంచి తీసుకోవాలో కూడా కేంద్రం నిర్ణయిస్తోంది. రాష్ట్రాలకు వ్యతిరేకం కాదు!ఈ వాదన చర్చనీయం. ఆర్థిక సమాఖ్య విధానం అత్యుత్తమ మైంది కాదనుకున్నా, నిధుల బదిలీ ఏర్పాట్లు రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయనడం సరికాదు. ఎలానో ఒక ఉదాహరణ చెప్పుకుందాం. రాజ్యాంగం ఒరిజినల్‌గా నిర్దేశించిన ప్రకారం, రాష్ట్రాలకు రెండే రెండు కేంద్ర పన్నుల్లో వాటా లభించాల్సి ఉంటుంది.. ఒకటి వ్యక్తిగత ఆదాయ పన్ను, రెండు కేంద్ర ఎక్సయిజ్ సుంకాలు. 2000 సంవత్సరంలో చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఏర్పాటును రాష్ట్రాలకు అనుకూల రీతిలో మార్చారు. దీని ప్రకారం, కేవలంరెండు పన్నుల్లోనే కాకుండా కేంద్రం వసూలు చేసే అన్ని పన్నుల్లో వాటికి వాటా దక్కింది. అలాగే, ప్రణాళికా సంఘం రద్దుతో రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి సైతం పెరిగింది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి రావడంతో మరో యుద్ధానికి తెరలేచింది. తమ ప్రయోజనాలను హరించివేయడానికి తమ మెడలు వంచి మరీ దీన్ని తీసుకు వచ్చారని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇది వాటి హ్రస్వదృష్టి అవుతుంది. కొత్త పన్నులు వేయడంలో వాటికి ఉన్న స్వేచ్ఛను కొంత కోల్పోయిఉండొచ్చు. కేంద్రం కూడా అలాగే కోల్పోయిందని గుర్తుంచుకోవాలి. క్రమేణా, జీఎస్టీ వల్ల పన్ను పరిధి విస్తరిస్తుంది. ఎగవేతలకు బ్రేక్ పడుతుంది. తద్వారా కేంద్రం, రాష్ట్రాలు రెండూ ప్రయోజనంపొందుతాయి. ఆర్థిక సమాఖ్య విధానం నిబంధనలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయన్న రాష్ట్రాల భావన వాస్తవం కాదు. అదే సమయంలో, రాష్ట్రాల ఆర్థిక సవాళ్ల పట్ల కూడా కేంద్రం ఎంతో సానుభూతి కనబరచాలి, వాటితో సంప్రదింపులకు ఎఫ్పుడూ సిద్ధంగా ఉండాలి. అయితే ఇలా జరుగుతోందా? ఉదాహరణకు, కేంద్రం పన్నులుపెంచడానికి బదులు సెస్సులు, సర్‌ఛార్జ్‌లు పెంచుకుంటూపోతోంది. కేంద్రం విధించే అన్ని పన్నుల నుంచీ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలంటూ 2000 సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసినప్పుడు, కేంద్రం పరిమితంగానే సెస్సులు, సర్‌ఛార్జ్‌లు విధిస్తుందని భావించారు. అయితే అందుకు విరుద్ధంగా జరుగుతోంది. వాటిలో తమకు వాటా రాదు కాబట్టి జాతీయ పన్ను ఆదాయంలో న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన వాటా దక్కడం లేదని, ఇది తమను మోసం చేయడమేనని రాష్ట్రాలు బాధపడుతున్నాయి.2047 గేమ్ ప్లాన్?ఆర్థిక గురుత్వ కేంద్రం రాష్ట్రాల దిశగా జరిగిందని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఉజ్జాయింపు అంచనా ప్రకారం, కేంద్రం ఉమ్మడి రెవెన్యూ వసూళ్లు (కేంద్రం, రాష్ట్రాలవి కలిపి) 60 శాతంఉండగా, ఉమ్మడి వ్యయాల్లో కేంద్రం వాటా 40 శాతం మాత్రమే ఉంటోంది. రాష్ట్రాల విషయంలో ఇందుకు పూర్తి భిన్నంగా జరుగు తోంది. వాటన్నిటి ఉమ్మడి రెవెన్యూ వసూళ్లు కలిసి 40 శాతం కాగా, ఖర్చు మాత్రం 60 శాతం చేస్తున్నాయి. దీని అర్ధం ఏమిటంటే, దేశ స్థూల ఆర్థిక సుస్థిరత, తద్వారా పెట్టుబడులు పెంచే సామర్థ్యం కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి ఆర్థిక బాధ్యత మీద ఆధారపడి ఉంటుంది. 2047లో మనం వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకొంటాం. అప్పటికి ఇండియా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలని ఉవ్విళ్లూరుతున్నాం. ఆ స్థాయికి చేరడానికి మన ముందున్న ఎజెండా కూడా అంత పెద్దది, సంక్లిష్టమైంది. కేంద్రం రాష్ట్రాలు ఉమ్మడి వ్యూహంతో ముందడుగు వేస్తే తప్ప మనం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించలేం. ఆర్థిక వ్యవస్థ ఉత్పా దకతను మెరుగు పరచుకోవడానికి అవసరమైన రెండో తరం సంస్క రణలను అమలు చేయడం మన గేమ్ ప్లాన్‌లో భాగం అయితీరాలి. 1990ల తొలితరం సంస్కరణలు పెట్టుబడులు, వాణిజ్యం, ఫైనాన్స్ రంగాల సరళీకరణపై దృష్టి సారించాయి. ఇవన్నీ తన పరిధిలోనివే కాబట్టి, వీటిని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్ర దించాల్సిన అవసరం లేకపోయింది. రెండో తరం సంస్కరణలు అలా కాదు. ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన ఈ సంస్కరణలు భూమి, కార్మికులు, పన్నులతో ముడిపడి ఉంటాయి. వీటికి రాష్ట్రాల సమ్మతి మాత్రమే కాదు, అమలులో చురుకైన భాగస్వామ్యం కూడా కావాలి. రాజ్యాంగం ద్వారా మన కోసం మనం చేసిన ప్రతిజ్ఞ నెర వేరాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సయోధ్య కీలకం.» వ్యాసకర్త భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్,యేల్ విశ్వవిద్యాలయంలో సీనియర్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)» 2000లో చేసిన రాజ్యాంగ సవరణ వల్ల, రెండు (వ్యక్తిగత ఆదాయ పన్ను, ఎక్సయిజ్ సుంకాలు) పన్నుల్లోనే కాకుండాకేంద్రం వసూలు చేసే అన్ని పన్నుల్లో రాష్ట్రాలకు వాటా దక్కింది.» రాజ్యాంగ సవరణ చేసినప్పుడు, కేంద్రం పరిమితంగానే సెస్సులు, సర్‌ఛార్జ్‌లు విధిస్తుందని భావించారు. అందుకు విరు ద్ధంగా జరుగుతోంది. వాటిలో తమకు వాటా రాదు కాబట్టి, ఇది తమను మోసం చేయడమేనని రాష్ట్రాలు బాధపడుతున్నాయి.» 1990ల తొలితరం సంస్కరణలు పెట్టుబడులు, వాణిజ్యం, ఫైనాన్స్ రంగాల సరళీకరణపై దృష్టి సారించాయి. వీటిని ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదించాల్సిన అవ సరం లేకపోయింది. కానీ రెండో తరం సంస్కరణలు అలా కాదు. ఇవి భూమి, కార్మికులు, పన్నులతో ముడిపడి ఉంటాయి. వీటికి రాష్ట్రాల సమ్మతే కాదు, వాటి చురుకైన భాగస్వామ్యం కూడా కావాల్సి ఉంటుంది.» వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం తమ ప్రయోజనా లను హరించివేయడానికి తమ మెడలు వంచి మరీ తెచ్చారని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇది వాటి హ్రస్వదృష్టి అవుతుంది. -
పని చెయ్యడమే!
సూఫీ సాధువులలో అత్యంత ప్రముఖులు ఇబ్రహీం. ఆయన జీవనశైలి నిరాడంబరమైనది. ఇబ్రహీం నిశ్చలమైన ధ్యానం ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు. ఆయన కుటుంబం అరబ్ మూలాలతో కూడినది. ఇప్పటి అఫ్గానిస్తాన్‌లోని బాల్ఖ్‌లో జన్మించారు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం, ఆయన 2వ రషీద్ ఖలీఫా ఉమర్ మాతృ వంశానికి చెందినవారు. సన్యాసిగా మారడానికి సింహాసనాన్ని విడిచి పెట్టారు. తన జీవితంలో పాక్షికంగాసంచార జీవనం గడిపారు. ఆయన భిక్షా టనను అసహ్యించుకున్నారు. జీవనో పాధి కోసం అవిశ్రాంతంగా పని చేశారు. ఒకానొకమారు ఇబ్రహీం ఓ ధనవంతుడిని కలుసు కున్నారు. అతడు ఆయన జ్ఞాని అని తెలియక తోటమాలిగా నియమించాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి కొందరు స్నేహితులు వచ్చారు. అందరూ కలిసి తోటలోకి ప్రవేశించారు. ఇబ్రహీంను చూసి తమకు తినడానికి మంచి మామిడిపళ్ళు కావాలని అడిగారు. సరే నని ఇబ్రహీం పండ్లు కోసిచ్చారు. వాటిని తిన్న మిత్రులు పుల్లగా ఉన్నాయని ధనవంతుడితో అన్నారు. అప్పుడు ధనవంతుడు ఇబ్రహీంను పిలిచి ‘ఏమిటీ పళ్ళన్నీ పుల్లగా ఉన్నాయంటున్నారు... చాలా కాలంగా తోటలో పని చేస్తు న్నావు. ఏ పండ్లు పుల్లటివో, ఏవి తియ్యటివో తెలియవా’ అని కసురుకున్నాడు. అందుకు ఇబ్రహీం చాలా నిదానంగా, ప్రశాంతంగా ఇలా జవాబిచ్చారు: ‘మీరు నాకు తోటమాలి పని అప్పజెప్పారు తప్ప పండ్లు తినమని చెప్ప లేదు. తింటే కదా వాటి రుచి తెలిసేది?’ ఈ సంఘటన తర్వాతే ఆ ధనవంతుడికి తన ఎదుట ఉన్న వ్యక్తి సామాన్యుడు కాదని, గొప్ప జ్ఞాని అని తెలుసుకున్నారు. కొన్ని నిముషాల ముందు కసురుకున్నందుకు తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు ధనవంతుడు.సాధువుగా ఉండాలనుకుంటే, ఈ లోకంలోని లేదా పరలోకంలోని వస్తువులను కోరుకోవద్దని ఇబ్రహీం చెప్పేవారు. దృష్టంతా ఆ దేవునిమీదే కేంద్రీకరించినప్పుడే మిమ్మల్ని తన సాధువుగా చేసుకుంటా డనే వారు. ‘ముసుగులు తొలగించినప్పుడే ఆనందం తలుపు తెరవ బడు తుంద’న్నది ఆయన సూక్తి. – యామిజాల జగదీశ్పని చెయ్యడమే! -
మన బ్రెయిన్ చిప్ లాకైందా?
ఈమధ్య నేను మానవ జన్యుశాస్త్రం మీద కొంత అధ్యయనం చేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఎపిజెనెటిక్స్, యునిజెనెటిక్స్ మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు నాకర్థమైంది. మానవ మెదడు ఒక తరం నుండి మరో తరానికి మేధా శక్తిని జన్యు మార్పు ద్వారా అందిస్తుందని ఈ సైన్సు చాలా స్పష్టంగా నిరూపించింది. ఈమధ్య కాలంలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఒడెడ్ రెచావీ అనే జెనెటిసిస్టు మానవ మెదడులోని ఆలోచనా శక్తి పిల్లలకు చాలా తరాల నుండి సంక్రమిస్తుందని తేల్చాడు.కులం, ఏకవృత్తి మనకేం చేశాయి? ఈ అధ్యయనంలో ఆయన కనుక్కున్నదేమంటే, తల్లిదండ్రుల డీఎన్ఏ, ఆర్ఎన్ఏతో పాటు వారి ఇరు కుటుంబాల తాతముత్తాతల, అమ్మమ్మల, వారి వెనుక తరాల మెదడు జన్యుశక్తితో పాటు వారి అనుభవాల సమూలశక్తి, క్రియాశీల శక్తి, భావ ప్రకటనా శక్తిని ఇప్పుడు పుడుతున్న పిల్లల మెదళ్లు సంక్ర మించుకుంటాయి. ఈ సంక్రమణ వాళ్ళ కుటుంబాలలోని చాలా తరాల నుండి పిల్లలకు వస్తుందట. భారతదేశంలో ఒకే కులం పెళ్ళిళ్లు, ఆయా కులాల తరతరాల ఏక వృత్తి వల్ల ఎన్ని వేల ఏండ్లు మన మెదళ్ళు బంధించబడ్డాయో మన సోషల్ సైన్సు అధ్యయనం చెయ్యలేదు. అసలు కులం, కుల వృత్తులపై ఈ మధ్యనే కొద్దిపాటి చర్చ మొదలైంది. ఏక కుల పెళ్ళిళ్లు ఎదుగుదల లేని, రోగభరిత సంతానాన్ని అందిస్తాయని కొద్దిగా చర్చ జరుగుతోంది. కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న జంటల సభలో ఈ మధ్యనే మాట్లాడుతూ జస్టిస్ రాధారాణి గారు మనం మనుషులుగా బతకడం లేదు, కులాలుగా బతుకు తున్నామన్నారు. అదీ 21 శతాబ్దంలో. అయితే అసలే చర్చకు రాని సమస్య ఏమంటే, మెదడు క్రియాశీల శక్తిని ఒకే కుల వృత్తికి పరిమితి చేసినందువల్ల ఈ తల్లిదండ్రుల సంతానాల మెదళ్ళు పరిమిత అనుభవ, ఆలోచన, క్రియాశీల, కమ్యూనికేషన్ శక్తిని మాత్రమే సొంతం చేసుకోవడం.ఉదాహరణకు నా కుల కుటుంబ వృత్తినే చూస్తే, నా తల్లిదండ్రుల, అమ్మమ్మ, తాతముత్తాతల కుల జన్యు పరిమితి, వారి ఏకవృత్తి అయిన గొర్రెల కాపరి అనుభవ జ్ఞానం మాత్రమే నా మెదడుకు అందింది. అది ఎన్ని రకాల శక్తిని బంధించిందో తెలియదు. నా ముందు తరాల నిరక్షరాస్యత నా క్రియేటివ్, కమ్యూనికేషన్ శక్తులను ఎంత బంధించిందో తెలియదు. ఒకవేళ నా తల్లి గొర్రెల కాపరి కుటుంబం, తండ్రి వడ్రంగి కుటుంబం నుండి వచ్చి ఉంటే నా మెదడు ఎలా పని చేసేదో తెలియదు. ఇదే అంశం ఒక బ్రాహ్మణ మంత్ర పఠన కుటుంబానికీ, చెప్పులు చేసే మాదిగ కుటుంబానికీ వర్తిస్తుంది. ఈ ప్రక్రియ రుగ్వేద కాలం నుండి మొదలైందని మనకు ఆ అధ్యయనం చెబుతుంది.ఒక కుటుంబంలో వివిధ వృత్తులుంటే...ఈ క్రమంలో మన దేశంలోని మానవ మెదళ్ల చిప్ లాక్ చెయ్యబడిందని నా అభిప్రాయం. దీనిపై చాలా అధ్యయనం జర గాలి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి, ఈ మధ్య చనిపోయిన జిమ్మీ కార్టర్ ఆత్మ కథ ‘ఎ ఫుల్ లైఫ్’ చదివాను. ఆయన తండ్రి వేరుశనక్కాయ బాగా పండించే రైతు, ఇండ్లు కట్టే వడ్రంగి, చెప్పులు చేసే మోచి, ఇంట్లో అన్నీ బాగుచేసే ప్లంబర్, మంచి వ్యాపారి. ఆయన తల్లి నర్సు, మంచి వంట పనివంతురాలు, చేను పనుల్లో దిట్ట. వారి వెనుక తరాలు ఎన్ని రకాల పనులు చేశారో ఆయన రాయలేదు. కానీ వారి పిల్లలు, ముఖ్యంగా జిమ్మీ కార్టర్ విభిన్న మానసిక, శారీరక శక్తులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆయన అతి చిన్న వయస్సు నుండే వేరుశనగ పంట పని చైతన్యమంతా మెదడుకెక్కించాడు. తండ్రిలా షూ మేకర్ అయ్యాడు. బ్రహ్మాండమైన నేవీ ఎలెక్ట్రికల్ ఇంజినీర్ అయ్యాడు. అన్నిటినీ మించి తన 95వ సంవత్సరం వరకు తాను పెట్టిన స్వచ్ఛంద సంస్థ ‘హబిటాట్ ఫర్ హ్యుమానిటీ’ తరఫున కార్పెంటర్‌గా ఎన్నో దేశాల్లో వేలాది ఇండ్లు కట్టించాడు. స్వయంగా 400కు పైగా ఇండ్లు కట్టాడు. ఈ పనులన్నీ చేస్తూ 22 పుస్తకాలు రాశాడు. 95వ ఏటి వరకు తన ఇంటి సమీపంలోని స్కూళ్లలో పాఠాలు చెప్పేవాడు. గొప్ప ఉపన్యాసకుడు. వీట న్నిటితోపాటు, జార్జియా స్టేట్ గవర్నర్. ఆ తరువాత అమెరికా 39వ అధ్యక్షుడు. ఆ మెదడు బలంతో క్యాన్సర్‌ను గెలిచి 100 సంవత్సరాలు బతికాడు. మానవ మెదడు చిప్ లాక్ చెయ్యబడి ఉండకపోతే ఒక మనిషి ఎన్ని పనులు చెయ్యగలడో జిమ్మీ కార్టర్ నిరూపించాడు.కృత్రిమ మేధ ప్రపంచంలో...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని ఏం చెయ్య బోతున్నదోనని చాలా చర్చ జరుగుతోంది. చాలా పనులు ఏఐ తప్పులు జరక్కుండా మనిషిని మించి చెయ్యగలదు. కనుక మును ముందు మానవులకు పని మాయమై, క్రమంగా మానవాళి జీవనమే ఆగిపోతుందా అనేది సమస్య. ఇజ్రాయెల్‌కు చెందిన యువల్ నోవా హరారీ పదేపదే ఈ విషయమే చెబుతున్నాడు. ఐతే మానవ మెదడుకు ఉన్న కొత్త ఆలోచన సృష్టి ఏఐకి ఉండదు. ఇప్పటివరకు ప్రపంచంలో సృష్టించబడ్డ ఆలోచనలను క్రోఢీకరించి ప్రపంచంలో ఏ మూలన జీవిస్తున్న వారికైనా అది అందిస్తుంది. కానీ కొత్త క్రియాశీల ఆలోచనలు, అంచనాలను మానవ మెదడు మాత్రమే చెయ్యగలదు. ఐతే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కుల–ఏకవృత్తి పెళ్ళిళ్ల వల్ల తరాలు, తరాలు లాక్ చెయ్యబడ్డ మెదళ్ళతో పుట్టాం.అందుకే అతి చిన్న దేశంలోని ఇజ్రాయెలీలు సృష్టించగలిగిన కొత్త ఆలోచనలు మన దేశంలోని మనుషులు చెయ్యలేకపోతున్నారు. మత మూఢ నమ్మకాలు తర తరాల మెదళ్ళను క్రియేటివ్ ఆలోచనలోకి పోనియ్యక పోవడం కూడా మరో ప్రతిబంధకం. ఇది మన దేశంలో జరిగింది. ఇతర దేశాల్లో కూడా జరిగింది. ముస్లిం దేశాల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది.వేల ఏండ్లు మెదడు చిప్ లాకై ఉన్నప్పుడు అలా ఉన్నదని సమాజం కనుక్కోడానికే చాలా కాలం పడుతుంది. దళితులు, ఆది వాసులు, శూద్రులు, స్త్రీలలో చదువుకునే అవకాశం లేనప్పుడు ఇంత పెద్ద మానవ జెనెటిక్ సైన్సు సమస్య ఉన్నదని గుర్తించడం, దానికి పరిష్కారం వెతుక్కోవడం, దాన్ని కులాల చేత, మతాల చేత ఒప్పించడం చాలా పెద్ద సమస్య. మన దేశంలో ఈ విధమైన సమస్యను లాబరేటరీకి, సోషల్ సైన్సు పాఠాల్లోకి తీసుకుపోవడం చాలా కష్టం. అయితే ఇతర దేశాల్లోని ప్రయోగాలు, అన్ని రంగాల్లో రచనలు, వీడియో చర్చలు బయటికి వస్తున్న నేపథ్యంలో మన దేశంలో కూడా ఆ సామాజిక వ్యాధిని కనుక్కోకపోయినా, దానికి పరిష్కారాలు వెతక్కపోయినా, మనం ఇతర దేశాలకు మానసిక బానిసలవ్వడం తప్పుదు. ఇప్పటికి జరిగింది అదే. ఇక ముందు కూడా జరుగుతుంది. కేవలం మనల్ని మనం జాతీయవాద పొగడ్తల్లో ముంచెత్తుకుంటే మనం ఉపయోగించాల్సిన మెదడు అలాగే లాక్ వెయ్యబడి ఉంటుంది. సమాజం ముందుకు కొత్త ఆలోచన తేగానే కేసులు, దాడులు మామూలయ్యే కుల–మత విలువల్లో అది మరింత నిజం.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
ఆర్థిక యుద్ధం గెలవగలరా?
అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్ని ఉత్తర్వుల తుఫానును సృష్టిస్తున్నా, వాటన్నింటి అంతిమ లక్ష్యం ఆర్థిక సంబంధ మైనదే. ఆయన తన మొదటి విడత పాలనా కాలంలో (2017–21) ఇచ్చి ఈసారి మళ్లీ ఇస్తున్న ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదంలోని ఉద్దేశం కూడా అదే. పౌరసత్వా లపై, వలసలపై ఆంక్షలు; దిగుమతులపై భారీగా సుంకాలు; గ్రీన్లాండ్, పనామా కాలువల స్వాధీనం; చైనాపై వాణిజ్య యుద్ధం; చమురు ధరలు తగ్గించాలనీ, తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలనీ అరబ్ దేశాలపై ఒత్తిడులు; ఇతరులు అమెరికా చమురునే ఖరీదు చేయాలనటం; తాము అధిక నిధులు ఇస్తున్నామంటూ డబ్ల్యూహెచ్ఓ, ప్యారిస్ ఒప్పందాల నుంచి ఉపసంహరణ; డాలర్‌కు పోటీ రావద్దంటూ బ్రిక్స్ కూటమికి బెదిరింపులు... ఇట్లా దేనిని గమనించినా వాటన్నింటి వెనుక కనిపించేది ఆర్థిక విషయాలే.ఆధిపత్యపు గుప్పిటిఏ అధ్యక్షుడైనా తమ దేశం ఆర్థికంగా బలంగా ఉండాలనీ, ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలబడాలనీ కోరుకోవటంలో ఆక్షేపించ వలసింది ఏమీ లేదు. వాస్తవానికి, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పగూలినప్పటి నుంచి అమెరికాదే అగ్రస్థానం. అయినప్పటికీ ట్రంప్ ఆర్థిక యుద్ధం అనదగ్గ రీతిలో పై చర్య లను ఎందువల్ల ప్రకటిస్తున్నట్లు? అమెరికా బలానికి మూలస్తంభాలు నాలుగున్నాయి. ఒకటి, ఆర్థిక స్థితి. రెండు, సైనిక శక్తి. మూడు, ఉన్నత విద్యతోపాటు శాస్త్ర–సాంకేతిక రంగాలలోని ప్రతిభా సామ ర్థ్యాలు. నాలుగు, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ, ఐక్య రాజ్యసమితి వంటి ప్రపంచ వ్యవస్థలపై ఆధిపత్యం. ఈ నాలుగు అమెరికా గుప్పిట్లో ఉన్నంతకాలం అమెరికా సామ్రాజ్యానికి ముప్పు ఉండదు. ఈ పాఠాలను వారు బ్రిటిష్ సామ్రాజ్య పతనం నుంచి నేర్చుకున్నారు. కనుక ఈ ఆధిపత్యాలు చెదరకూడదు.రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ జర్మనీ ఓడిన తర్వాత సోవియెట్ యూనియన్ నాయకత్వాన కమ్యూనిస్టు శిబిరం బలపడి, అమెరికాకు మొదటి పెద్ద సవాలుగా నిలిచింది. కానీ, సోవియెట్ కూటమి అమెరికాకు సైద్ధాంతికంగా, సైనికంగా మాత్రమే సవాలు అయింది తప్ప, పైన పేర్కొన్న మొత్తం నాలుగు రంగాలలోనూ కాలేకపోయింది. చివరకు పలు స్వీయాపరాధాలవల్ల కుప్పకూలింది. ఇది 1991 చివరి దశ మాట. తర్వాత 30 ఏళ్లపాటు అమెరికాకు ఎదురులేక పోయింది. చైనా సవాలుఆ విధంగా తమకు ఎదురు లేదని భావిస్తుండగా రష్యా తన అపారమైన సహజ వనరుల బలంతో నెమ్మదిగా పుంజుకోవటం మొదలైంది. దానితోపాటు మరికొన్ని పరిణామాలు అమెరికాకు సరికొత్త సవాలుగా మారసాగాయి. ఈ పరిణామాలలో అన్నింటి కన్నా ప్రధానమైంది చైనా అనూహ్యమైన అభివృద్ధి. అందుకు ఆరంభం ఆ దేశం 2001లో డబ్ల్యూటీఓలో ప్రవేశించటంతో మొదలైంది. 1980–90 మధ్య తెంగ్ శియావ్ పింగ్ ఆర్థిక సంస్కరణలకు పునాదులు వేయగా, డబ్ల్యూటీఓ ప్రవేశంతో అందుకు మహా వేగం వచ్చింది. పదేళ్లయేసరికి అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2017 నాటికైతే పర్ఛేజింగ్ పవర్ పేరిటీ (పీపీపీ; దేశాల మధ్య కొనుగోలు శక్తిలోని తారతమ్యం) కొలమానాల ప్రకారం అమెరికాను సైతం మించిపోయింది.ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అది సోవియెట్ యూనియన్ వ్యూహానికీ, చైనా వ్యూహానికీ మధ్యగల తేడా. సోవియెట్ పతనం నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా, అమెరికా వలెనే ఒక సమగ్ర వ్యూహాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నది. ఆర్థికాభివృద్ధి, సైనికాభివృద్ధి, విద్యతోపాటు శాస్త్ర–సాంకేతిక రంగాల అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థలలో పలుకు బడిని క్రమంగా పెంచుకోవటం. ఇవిగాక, అమెరికా, యూరోపియన్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా గల చిన్న దేశాల సహజ వనరులను, మార్కెట్లను కొల్లగొడుతూ వాటిని తమ చెప్పు చేతలలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా, చైనా తన అపారమైన ధన సంపదతో వాటి అభివృద్ధికి సహకరించటంతో పాటు తాను కూడా లాభపడే వ్యూహాన్ని అనుసరించటం మొదలుపెట్టింది.అమెరికా, యూరప్ ఉత్పత్తుల ఖర్చు పెరగటంతో పరిశ్రమలను తమంతట తామే చైనాకు, ఆగ్నేయాసియా దేశాలకు తరలించటం, అక్కడి నుంచి చవకగా దిగుమతి చేసుకోవటం అనే వ్యూహం తొలుత బాగానే పనిచేసింది. కానీ తర్వాత అదే వారికి సమస్యగా మారింది. అనేక ఆధునిక పరిశోధనలు, ఉత్పత్తుల విషయంలో చైనా తదితర దేశాలు అమెరికా కన్నా ముందుకు వెళ్లి పోయాయి.బ్రిక్స్ సవాలుఅమెరికా కూటమికి దీనికిదే ఒక జంకుగా మారగా, చైనా చొరవతో ఏర్పడిన బెల్ట్ అండ్ రోడ్ పథకం, బ్రిక్స్ కూటమి పెద్ద సవాళ్లు అయాయి. ఇండియా కొన్ని కారణాల వల్ల బెల్ట్ పథకంలో చేరలేదుగానీ, 2009లో వ్యవస్థాపితమైన బ్రిక్స్‌లో వ్యవస్థాపక సభ్య దేశం కావటం గమనించదగ్గది. అమెరికా ఏక ధృవ ప్రపంచంవల్ల కలుగుతున్న హానిని గుర్తించిన ముఖ్యమైన దేశాలు కొన్ని బహుళ ధృవ ప్రపంచం అనే భావనను అజెండా పైకి తెచ్చాయి. ఒకప్పుడు అమెరికా, సోవియెట్ యూనియన్లతో ద్విధృవ ప్రపంచం ఉండగా, సోవియెట్ పతనం తర్వాత అది ఏకధృవంగా మారింది. దీనితో ఈ కొత్త సవాలును భగ్నం చేసేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్లు చతురోపాయాలను ప్రయోగిస్తు న్నాయి గాని సఫలం కావటం లేదు. వారు ఎంత వ్యతిరేకించినా బెల్ట్ పథకపు సభ్య దేశాల సంఖ్య 150కి మించి పోయింది. విశేషమేమంటే, అమెరికా కూటమిలోని యూరోపియన్ దేశాలు కొన్ని కూడా అందులో చేరాయి. బ్రిక్స్‌లో మరికొన్ని పెద్ద దేశాలు కొత్తగా చేరగా డజన్ల కొద్దీ దరఖాస్తు చేశాయి. సరిగా ట్రంప్ అధికార స్వీకరణ చేస్తుండిన రోజులలోనే ఇండోనేసియా చేరగా, తాము కూడా చేరను న్నట్లు మలేసియా ప్రధాని ప్రకటించారు. బ్రిక్స్ కూటమి జీడీపీ ప్రపంచ జీడీపీలో ఇప్పటికే 35 శాతానికి చేరగా, జీ–7 జీడీపీ 30 శాతం దగ్గర ఆగిపోయి ఉంది. మరొకవైపు చైనాతో అమెరికా వాణిజ్య లోటు సంవత్సరాల తరబడిగా తీరటం లేదు. దాదాపు 120 దేశాలతో చైనా వాణిజ్యం అమెరికాను మించిపోయింది.ఈ విధమైన మార్పులతో కలవరపడినందువల్లనే ట్రంప్ తన మొదటి హయాంలో చైనాపై బహిరంగంగా వాణిజ్య యుద్ధం ప్రక టించారు. సుంకాలు పెంచారు. అమెరికన్ కంపెనీలు అక్కడి నుంచి తరలి వెళ్లకపోతే వాటి ఉత్పత్తులపైనా సుంకాలు పెంచుతామన్నారు. చైనాకు ముడి వనరులు, సాంకేతికతలు అందకుండా వీలైనన్ని ప్రయ త్నాలు చేశారు. కానీ, ఆయన పాలన ముగిసే నాటికి, ఆ యుద్ధం విఫలమైనట్లు అమెరికా సంస్థలే తేల్చి చెప్పాయి. చైనాకు కలిగిన నష్టం కన్నా అమెరికా నష్టాలు ఎక్కువని లెక్కలు వేసి చూపించాయి. ఆ తర్వాత బైడెన్ కూడా అదే వ్యూహాన్ని అనుసరించి విఫల మయ్యారు. ఇప్పుడు ట్రంప్ వైఖరి చిత్రంగా ఉంది. ఒకవైపు తిరిగి వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తూనే, మరొకవైపు చైనాతో చర్చలు జరప గలమని అంటున్నారు. అమెరికా ఆధిపత్యానికి డాలర్ శక్తి ఒక ముఖ్యాధారం. బ్రిక్స్ కూటమి ప్రత్యామ్నాయ కరెన్సీ సృష్టించగలమని చెప్పలేదు గానీ, వివిధ దేశాల మధ్య వాణిజ్య చెల్లింపులు డాలర్‌కు బదులు స్థానిక కరెన్సీలలో జరిగేందుకు ప్రయత్నించ గలమన్నది. ఈ మార్పులు డాలర్‌ను బలహీనపరచగల అవకాశం ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఇంతకూ ట్రంప్ ఈ రెండవ విడత వాణిజ్య యుద్ధం ఫలించగలదా అన్నది ప్రశ్న.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఆహార భద్రతకు ఆ ఆదాయమే కీలకం
ప్రస్తుత వేగంతో 2050 నాటికి ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించడమనే పెను సవాలును ఎదుర్కోవడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో బిగ్గరగానూ, స్పష్టంగానూ వ్యవసాయ శాస్త్ర వేత్తలు, పరిశోధకులు తమ లేఖ ద్వారా చేసిన హెచ్చరిక సకాలంలో వినిపించిన మేల్కొలుపులా కనపడుతోంది. ‘‘భవిష్యత్ ఆహార అవసరాలను తీర్చడానికి మనం సరైన మార్గంలో లేకపోగా, కనీసం దానికి సమీపంలో కూడా లేము’’ అని వారి లేఖ అప్రమత్తం చేసింది.14వ దలైలామా, జోసెఫ్ స్టిగ్లిడ్జ్, కైలాస్ సత్యార్థి, రాబర్ట్ హుబెర్, డరోన్ అసెమోగ్లు, సర్ జాన్ ఇ వాకర్ వంటి నోబెల్ గ్రహీ తలు, డాక్టర్ గురుదేవ్ ఎస్ ఖుష్, పెర్ పిన్ స్ట్రప్ ఆండర్సన్, రట్టన్ లాల్, హాన్స్ ఆర్ హెర్రెన్ వంటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీతలు ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో ఉన్నారు. ‘‘సైన్స్, ఆవిష్కరణల నాయకులుగా మేము ప్రపంచ ఆహార, పోషకాహార భద్రతకు హామీ నివ్వడానికి, ప్రపంచాన్ని మేల్కొలపటంలో, సామూహిక ఆకాంక్షలను పెంచడంలో మాతో చేరాలని, పరిశోధనాపరమైన పెద్ద ముందంజ వేయాలని మిమ్మల్ని కోరుతున్నాము’’ అని ఆ లేఖ ముగుస్తుంది.2050 నాటికి ప్రపంచం 980 కోట్ల మంది ప్రజల అవసరాలను తీర్చడానికి తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి పూనుకుంటున్న వేళ, దాదాపు 80 కోట్లమందిని ఆకలితో అలమటింపజేస్తున్న ఆహార కొరత అనేది ఉత్పత్తి పడిపోవడం వల్లనే ఏర్పడలేదు. ఆహార కొరత కేవలం తప్పుడు విధానాల ఫలితమేనని అందరూ గ్రహించాలి. ‘హంగర్స్ టిప్పింగ్ పాయింట్’ అనే శీర్షికతో కూడిన ఆ లేఖ... ‘వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న సాధారణమైన తీవ్ర వాతావరణ ఘటనల’ గురించి ఈ శతాబ్ది మధ్యనాటికి ఆహార, పోషకాహార సంక్షోభం మరింత తీవ్రమవడం గురించి మాట్లాడుతుంది. ఇక ఆ లేఖలోనే సరిగ్గానే వేర్కొన్నట్లుగా.. నేలకోత, భూమి క్షీణత, జీవవైవిధ్య నష్టం, నీటి కొరత, సంఘర్షణలు వంటి అదనపు అంశాలు ఆహార ఉత్పాదకతను తగ్గిస్తాయి.ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. ఆఫ్రికాకు ప్రధాన ఆహారమైన మొక్కజొన్న గురించి ఆ లేఖలో పేర్కొన్నప్పటికీ భవిష్యత్తులో ఆహార దిగుబడి తగ్గుతుందనే అంచనాల వల్ల ఆ పంటకు నిజంగానే ముప్పు పొంచి ఉంది. అయితే చేతులు కలిపి సహకరించాల్సిన తక్షణ అవసరాన్ని ప్రపంచం గ్రహించేవరకు, ఆహార, పోషకాహార భద్రతకు సంబంధించిన ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఉదాహరణకు, ఆఫ్రికా తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ, అమెరికాలో దేశీయ మొక్కజొన్న ఉత్పత్తిలో 44 శాతం ఇథనాల్ ఉత్పత్తికి మళ్లిస్తున్నారు. అలాగే, న్యూ సైంటిస్టు జర్నల్ (2022 మార్చి 14) లోని ఒక నివేదిక ప్రకారం, 9 కోట్ల టన్నుల ఆహారధాన్యాలను ఇథనాల్ కోసం మళ్లించారు. ఇక యూరో పియన్ యూనియన్ గోధుమలు, మొక్కజొన్నతో సహా కోటి 20 లక్షల టన్నులను ఆటోమొబైల్స్ కోసం ఆహారంగా ఉపయోగిస్తోంది. ఇంకా, 35 లక్షల టన్నుల పామాయిల్‌ను ఈయూ డీజిల్ ఉత్పత్తి కోసం మళ్లించింది.రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహార సరఫరాలు దెబ్బతిన్నప్పుడు ఇదంతా జరిగింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ లలో జీవ ఇంధన ఉత్పత్తిలో కేవలం 50 శాతం తగ్గించినట్లయితే, అలా ఆదా చేసిన ధాన్యం... యుద్ధం వల్ల ఏర్పడిన మొత్తం ఆహార కొరతను తీర్చగలదు. గోధుమ, వరి వంటి పంటల్లో కిరణజన్య సంయోగక్రియను పెంపొందించడం, ప్రధాన తృణ ధాన్యాలలో జీవసంబంధమైన నత్రజనిని స్థిరీకరించడం, వార్షిక పంటలను శాశ్వత పంటలుగా మార్చడం, పంటల వ్యవస్థను వైవిధ్యీకరించడం, సూక్ష్మజీవులు – శిలీంధ్రాల నుండి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను సృష్టించటం వంటి అవసరమైన పరివర్తనా ప్రయత్నాలను చేపట్టాలని ఈ లేఖ కోరుతోంది. ‘‘బిలియన్ల కొద్దీ ప్రజలకు ఆరోగ్యకరమైన, ఉత్పాదక, సురక్షితమైన జీవితాలను కల్పించడం వల్ల కలిగే ప్రయోజనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటా విస్తృతంంగా రాబడిని ప్రవహింపజేస్తుంది’’ అని అంగీకరించాలని ఆ లేఖ పేర్కొంది.వ్యవసాయ పరిశోధనలో పెట్టే పెట్టుబడి బహుళ రాబడిని కలిగిస్తుందని చూపడానికి తగినన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ‘‘భవి ష్యత్తులో విజయవంతమైన ఆహార వ్యవస్థను నడిపించే ఆవిష్క రణకు పునాదిగా సమాజం స్పాన్సర్ చేసిన పరిశోధన ఉండాలని’’ కూడా నివేదిక పిలుపునిచ్చింది. అయితే ప్రభుత్వ ప్రాయోజిత పరిశోధనకు ప్రాధాన్యం ఉందా, లేక ప్రైవేట్ పరిశోధనల ఆధిపత్యంపై ప్రాధాన్యం ఉందా అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రజలకు ఆరోగ్యకరమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న స్థిరమైన ఆహారాన్ని అందించడంలో బహుళ మార్కెట్ వైఫల్యాల గురించి ఈ లేఖ మాట్లాడుతుంది. అయితే ఇంకా అతి పెద్ద ఉపద్రవం ఏమిటంటే, ప్రపంచంలోని ప్రతిచోటా వ్యవసాయ ఆదాయాలను పెంచడంలో మార్కెట్ల వైఫల్యం!నా అవగాహన ప్రకారం, స్థిరమైన వ్యవసాయ జీవనోపాధికి హామీ ఇచ్చేందుకు కఠినమైన ప్రయత్నాలు చేయకపోతే భవిష్యత్తులో ఆహారం, పోషకాహార భద్రతకు సంబంధించి సవాళ్లను ఎదుర్కో వడం కష్టం కావచ్చు. ఉదాహరణకు, 2024 సెప్టెంబర్‌లో ముగిసిన చివరి ఐదు సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ కోసం అమెరికా వ్యవసాయ బిల్లు రైతులకు, వ్యవసాయానికి 1.8 ట్రిలియన్ డాలర్లను కేటాయించింది. అయినప్పటికీ ఈ సంవత్సరం ఐదుగురు రైతుల్లో ఒకరు వ్యవసాయం మానేస్తారని అమెరికా అంచనా వేస్తోంది. నిజానికి, సరకుల ధరలు తక్కువగా ఉండడం, అధిక ఉత్పత్తి వ్యయం కారణంగా రైతులు ఎదుర్కొన్న నష్టాన్ని పూడ్చడానికి 10 బిలియన్ డాలర్ల తక్షణ సాయం వాగ్దానం చేసింది. అయినప్పటికీ ఈ పరిణామం జరగబోతోంది. కొత్త వ్యవసాయ బిల్లు–2024 ఆమోదం కోసం వేచి ఉంది.గత సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 24 దేశాల్లో రైతుల నిరసన తర్వాత యూరోపియన్ యూనియన్‌లో హామీ ఇచ్చిన వ్యవసాయ ఆదాయం ఒక సాధారణ సూత్రంగా ముందుకొచ్చింది. పక్షం రోజుల క్రితం ఫ్రాన్స్‌లోని చిన్న రైతుల సమాఖ్య అయిన కాన్ఫెడరేషన్ పేజన్, వ్యవసాయ ఆదాయాన్ని వ్యవసాయ ఆహార సరఫరా గొలుసుకు చెందిన సర్దుబాటు అస్థిరతగా వదిలివేయ కూడ దని పిలుపునిచ్చింది. రైతులకు హాని కలిగించే విధంగా దిగువ స్థాయి అదనపు మార్జిన్లను సమాఖ్య ఖండించింది. దీని అర్థం ఏమిటంటే ఆహార గొలుసులోని అన్ని ఇతర వాటాదారులు భారీ లాభాలతో ముందుకు వెళ్లిపోతున్నప్పటికీ, రైతు మాత్రం దాని అంచుల వద్దే మనుగడ సాగించాల్సి వస్తుంది.భారత్‌లో, పంజాబ్–హరియాణా సరిహద్దులో 11 నెలలకు పైగా జరుగుతున్న రైతుల నిరసన నేపథ్యంలో గమనిస్తే, 14 ఖరీఫ్ పంటలలో ఏడింటి మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే 12 నుండి 26 శాతం తక్కువగా ఉన్నాయి. సంవత్సరాలుగా, వ్యవసాయ ఆదాయాలు స్తబ్ధుగా ఉంటున్నాయి లేదా కిందికి పడిపోతున్నాయి. నిజం చెప్పాలంటే, 2050లో 150 కోట్ల మంది అదనపు ప్రజలకు ఆహారమివ్వడం కచ్చితంగా సాధ్యమే. కానీ వ్యవసాయాన్ని ఆచరణీ యమైనదిగా, లాభదాయకమైనదిగా మార్చే కార్యాచరణ విధానం కీలకం. అప్పుడే అది సాధ్యం. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
దేశాన్ని అణుశక్తిగా మార్చిన మేధ
దేశభక్తి, సంస్కృతీ సంప్ర దాయాల పట్ల గౌరవం, సంగీత సాహిత్యాల పట్ల ప్రేమ, సగటు మనిషి జీవన ప్రమాణాలు పెంచా లన్న తపన కలిగిన గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ రాజా రామన్న. ఆయన 1925 జనవరి 28న సంప్రదాయ మైసూర్ అయ్యంగార్ కుటుంబంలో కర్ణాటకలో పుట్టారు. సంగీతంపై ఉన్న అభిమానంతో సంగీత కళాశాలలో చేరాలనుకున్న రాజా రామన్న, సర్సి.వి. రామన్ పరిచయ ప్రభావం వల్ల వైజ్ఞానిక రంగంలోకి ప్రవేశించారు. ఆరేళ్ళ వయసులోనే పియానో నేర్చుకోవడం ప్రారంభించారు.పన్నెండో ఏట మైసూర్ మహారాజు ఎదుట పియానో వాయించి ప్రశంసలందుకున్నారు. 1949లో టాటా గ్రూపు– స్కాలర్‌షిప్‌పై లండన్ వెళ్ళి, అక్కడి ‘కింగ్స్ కాలేజి’ నుండి ‘న్యూక్లియర్ ఫిజిక్స్’లో డాక్టరేట్ తీసుకుని స్వదేశం తిరిగి వచ్చారు. డా‘‘ హోమీ భాభా ఆధ్వర్యంలో పని చేయడానికి 1952లో– టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో చేరారు. బొంబాయి, ట్రాంబేలోని ఆ సంస్థ పేరు తరువాత కాలంలో భాభా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బీఏఆర్సీ: బార్క్)గా మారింది. 1960లలో అణ్వాయుధా లను తయారు చేయడం, వాటిని అభివృద్ధి చేయ డంలో సాంకేతిక పరిశోధన చేపట్టారు. అప్పుడే మన దేశంలో అణుబాంబుకు రూపకల్పన జరిగింది. 1966లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు–అణుపరికరాల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ కొనసాగింది. ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసే 75 మంది శాస్త్రవేత్తల బృందానికి రాజా రామన్న నాయకత్వం వహించారు. బార్క్‌లో ‘పూర్ణిమ’ అనే పేరుతో ప్లుటోనియం ఇంధనంతో నడిచే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ స్థాపించడానికి కార కులయ్యారు. 1974 మే నెలలో అతి రహస్యంగా అణు పరీక్షను నిర్వహించారు. 1978లో అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, డా‘‘ రామ న్నను బార్క్ నుండి తీసు కొచ్చి, రక్షణ మంత్రిత్వ శాఖకు సలహాదారుగా నియమించారు. రక్షణ పరిశోధన కార్యదర్శిగా, డీఆర్డీఓ డైరెక్టర్ జన రల్‌గా కూడా నియమించారు. అప్పుడే ఒక విచి త్రమైన సంఘటన జరి గింది. ఈయన నేపథ్యం తెలుసుకుని ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అణుబాంబుల తయారీలో రామన్న సహాయం అర్థించాడు. పరిస్థితి విషమించేట్టుగా ఉందను కుని, దేశభక్తుడయిన రాజా రామన్న చెప్పా పెట్ట కుండా ఇండియా విమానం పట్టుకుని హుటా హుటిన తిరిగొచ్చారు. నిబద్ధత గల దేశభక్తుల చర్యలు అలా ఉంటాయి. వారు వేటికీ లొంగరు.చదవండి: ఈశ్వరాజ్ఞ హోమీ జె. భాభా అకాల మరణం తర్వాత, ఆయన నిర్దేశించిన మార్గంలోనే రాజా రామన్న పరిశోధనలు కొనసాగించి, ఆణుశక్తి పరిశోధనల్లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టారు. ఆయన న్యూక్లి యర్ ఫిషన్ రంగంలో కూడా కృషి చేశారు. బరువైన కేంద్రకాలను విభజించి, శక్తిమంతమైన న్యూక్లియన్ రేడియేషన్‌ను ఉత్పత్తి చేయవచ్చని– ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతం అణుపరిశోధనా రంగానికి, తద్వారా దేశ ప్రగతికి ఎంతో ఉపయోగపడింది. 1980లో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా తిరిగి రావడంతో అణు కార్యక్రమం ఊపందుకుంది. ఆమె రామన్నను మళ్ళీ బార్క్‌కు డైరెక్టర్‌గా నియమించారు. పైగా అణుపరీక్షల కోసం అయనకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. 1990లో వి.పి. సింగ్ ప్రభుత్వంలో రామన్న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్‌లతో పాటు అనేక పురస్కారాలు, పతకాలు, డాక్ట రేట్లు పొందారు.రాజా రామన్న శత జయంతి (28 జనవరి 1925 – 28 జనవరి 2025) సందర్భంలో మనం ఉన్నాం. మంచి మనిషిగా, అత్యున్నత స్థాయికి ఎదిగిన వైజ్ఞానికుడిగా, పియానో వాద్యకారుడిగా – ఎవరికి తోచిన విధంగా వారు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త(నేడు డా. రాజా రామన్న శతజయంతి)-డా. దేవరాజు మహారాజు -
ఆరోగ్యానికి అశనిపాతం
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ తొలి రోజున తీసుకున్న అనేక నిర్ణయాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి వైదొలగడం ఒకటి. దీని ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాదు. ప్రపంచ ఆరోగ్య భద్రతపై కూడా తీవ్రంగానే ఉండనుంది. కోవిడ్–19 పరిస్థితులను సక్రమంగా నియంత్రించలేకపోవడం, అత్యవసరమైన సంస్కరణలను చేపట్టడంలో విఫలమైన కారణంగా తామీ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తెలిపింది. సభ్యదేశాల అనవసర రాజకీయ జోక్యాన్ని నివారించడంలోనూ డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. అమెరికా ఇతర దేశాలతో పోలిస్తే, మరీ ముఖ్యంగా చైనా కంటే ఎక్కువగా డబ్ల్యూహెచ్ఓకు మద్దతిస్తోందనీ, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న చైనా చాలా చిన్న మొత్తం మాత్రమే తన వంతుగా ఇస్తోందనీ కూడా ఈ ఆర్డర్లో పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ చేసింది ఎంతో!ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ మొత్తం బడ్జెట్లో 18 శాతం అమెరికా నుంచే వస్తోంది. 2024, 2025 సంవత్సరాలకుగాను ఈ సంస్థ బడ్జెట్ సుమా రుగా 680 కోట్ల డాలర్లు! రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, వ్యాధి సంబంధిత విషయాలను పర్యవేక్షించేందుకుగాను ఐక్యరాజ్య సమితి ప్రత్యేక విభాగంగా డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటైంది. అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, ఆరోగ్య సంబంధిత విధానాలను రూపొందించేవారి నెట్‌వర్క్‌గా, ఒక టెక్నికల్ ఏజెన్సీగా వ్యవహరించాలన్నది దీని ఏర్పాటు లక్ష్యం. అలాగే పేద దేశాలకు సాంకేతిక పరి జ్ఞానానికి సంబంధించి సహకారం అందించడం; తద్వారా ఆ యా దేశాలు ఆరోగ్య సమస్యలను సొంతంగా ఎదుర్కొనేందుకు తగిన మానవ వనరులు, సామర్థ్యాలను సంపాదించుకునేలా చేయడం మరో లక్ష్యం.కొన్ని దశాబ్దాల కాలంలో ఈ సంస్థ మశూచితో పాటు, యాస్(చర్మరోగం), ఎల్లో ఫీవర్, కుష్టు, పోలియో వంటి ఎన్నో మహ మ్మారులను సమర్థంగా కట్టడి చేయగలిగింది. యూఎన్ ఎయిడ్స్ ద్వారా హెచ్ఐవీ/ ఎయిడ్స్‌పై అంతర్జాతీయ స్థాయి పోరు సాగించింది. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి మొత్తం క్షయ వ్యాధి నిర్మూలనపై ఉంది. అయితే, సార్స్ వంటి కొత్త వ్యాధులు పుట్టుకొచ్చినప్పుడు, పాత వ్యాధులు తిరగబెట్టిన సందర్భాల్లోనూ ఈ సంస్థ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికాకూ నష్టమే!డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగడం వల్ల సభ్యదేశాలకు అందించే వ్యాధుల సమాచారం అమెరికాకు అందకుండా పోతుంది. ‘డబ్ల్యూహెచ్ఓ పాండెమిక్ ఇన్ ఫ్లుయెంజా ప్రిపేర్డ్నెస్ ఫ్రేమ్‌వర్క్’ ఆధారంగానే పలు అమెరికన్ ఫార్మా కంపెనీలు టీకా తయారీకి సంబంధించి కొత్త రకం వైరస్ నమూనాలు పొందుతూంటాయి. ఇకపై ఈ వివరాలు అందకపోవడం వల్ల ఫ్లూ వైరస్ నిరోధక టీకాపై ప్రభావం పడనుంది. కోవిడ్ లాంటి మహమ్మారుల నియంత్రణకు చేపట్టాల్సిన అంశాలపై ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ చర్చల నుంచి కూడా అమెరికా వైదొలిగే అవకాశం ఉంది. అలాగే ఇప్పటివరకూ డబ్ల్యూహెచ్ఓలో పని చేస్తున్న పలువురు అమెరికన్ నిపుణులను వెనక్కి పిలిపిస్తారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అనే రెండు అమెరికన్ సంస్థలతో డబ్ల్యూహెచ్ఓ ఇప్పటి వరకూ ఏర్పాటు చేసుకున్న భాగస్వామ్యం ఇకపై ఉండదు. ఇది ఇరువర్గాలకూ చేటు చేసేదే. షరతుల విరాళాలతో సమస్యఅమెరికా నిర్ణయం వల్ల డబ్ల్యూహెచ్ఓకు జరిగే నష్టం గురించి ఆలోచిస్తే... ఆర్థికంగా ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఇతర సభ్యదేశాలు ఇస్తున్న మొత్తాలు కూడా తక్కువైపోతున్న తరుణంలో అతిపెద్ద దాత వైదొలగడం గమనార్హం. అమెరికా తరువాత అంత పెద్ద స్థాయిలో ఆర్థిక సాయం అందించే దేశం జర్మనీ మాత్రమే. డబ్ల్యూహెచ్ఓ వార్షిక బడ్జెట్లో సుమారు మూడు శాతాన్ని ఈ దేశం భరిస్తోంది. అయితే ప్రభుత్వాలకు అతీతంగా అందుతున్న విరాళాలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరగడం కొంత ఊరటనిచ్చే అంశం. ఉదాహరణకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ , యూరోపియన్ కమిషన్ , ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు భారీ మొత్తాలను అందిస్తున్నాయి. గేట్స్ ఫౌండేషన్ ప్రధానంగా పోలియో నిర్మూలన, టీకా తయారీలకు మద్దతిస్తోంది. అమెరికా వైదొలగుతున్న నేపథ్యంలో ఆర్థిక వనరుల కోసం గేట్స్ ఫౌండేషన్ వంటి వాటిపై డబ్ల్యూహెచ్ఓ ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఐక్యరాజ్య సమితి విభాగానికి ఇలాంటి పరిస్థితి రావడం ఏమంత శ్రేయస్కరమైంది కాదు. ప్రైవేట్ సంస్థలు ఇచ్చే విరాళాలు కొన్ని షరతులతో వస్తాయని, ఇవి కాస్తా ఆరోగ్య అజెండాపై ప్రభావం చూపుతాయని విమర్శకుల వాదన. డబ్ల్యూహెచ్ఓ మరింత సమర్థంగా, పారదర్శకంగా పనిచేసేందుకు తగిన సంస్కరణలు చేపట్టా లన్న వాదన సబబే. కోవిడ్ సమయంలో భారత్ కూడా జీ20, బ్రిక్స్ వంటి వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తింది. కొన్ని ఇతర దేశాలు కూడా డబ్ల్యూహెచ్ఓ సంస్కరణలపై డిమాండ్ చేశాయి. అయితే ఈ రకమైన విమర్శలపై చర్చకు సంస్థ కూడా సిద్ధంగా ఉంది. అయితే నిధులు నిలిపివేయడం, తప్పు కోవడం పరిష్కారం కాదన్నది అమెరికా గుర్తిస్తే మేలు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్బుక్) రాయని డైరీ
వాషింగ్టన్ లో ప్రెసిడెంట్ ఇనాగరేషన్ కు వెళ్లి, తిరిగి క్యాలిఫోర్నియాలో మేము ఉంటున్న పాలో ఆల్టోకి వచ్చేసరికి వైట్ హౌస్ నుండి ఫోన్ కాల్!‘‘మిస్టర్ జుకర్‌బర్గ్! నేను అలెక్స్ ఎన్ వాంగ్, యునైటెడ్ స్టేట్స్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌ని మాట్లాడుతున్నాను. ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ లైన్ లోకి రావటం కోసం దయచేసి కొద్ది క్షణాలు మీరు వేచి ఉండగలరా?’’ – అని !! ‘‘ఎస్... ప్లీజ్’’ అన్నాను.‘ఎవరు?!’ అన్నట్లు ప్రిసిల్లా నావైపు చూసింది. టేబుల్ మీద ఉన్న ‘లాస్ ఏంజిల్స్ టైమ్స్’ లో ట్రంప్ ఫొటోను కనుసైగగా ఆమెకు చూపించాను.పిల్లల్ని తీసుకుని ప్రిసిల్లా పక్క గదిలోకి వెళ్లిపోయింది. మాక్సిమా, ఆగస్ట్, ఆరేలియా ఎప్పుడూ తల్లిని చుట్టుకునే ఉంటారు. తొమ్మిదేళ్లొకరికి, ఏడేళ్లొకరికి. రెండేళ్లొకరికి! కాలేజ్‌లో ప్రిసిల్లా అంటే... ప్రిసిల్లా–నేను. ఇప్పుడు ప్రిసిల్లా అంటే ‘ఆల్ గర్ల్ టీమ్’ లా పిల్లలు–తను! కలిసి తిరుగుతుంటారు. కలిసి ఆడుతుంటారు. బుద్ధి పుడితే ఎప్పుడైనా ‘పోన్లే పాపం డాడ్...’ అన్నట్లు నన్ను తమ జట్టులోకి చేర్చుకుంటారు.‘‘మిస్టర్ జుకర్‌బర్గ్! లైన్ లోనే ఉన్నారా...?’’ అన్నారు అలెక్స్ ఎన్ వాంగ్, నిర్ధారణ కోసం.‘‘ఎస్... మిస్టర్ వాంగ్! నేను లైన్ లోనే ఉన్నాను...’’ అన్నాను.హఠాత్తుగా ‘‘హాయ్ జాక్...’’ అంటూ లైన్ లోకి వచ్చేశారు ట్రంప్!‘‘సర్ప్రైజింగ్, మిస్టర్ ప్రెసిడెంట్!’’ అన్నాను.‘‘నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనని చెప్పటానికే నీకు ఫోన్ చేశాన్ జాక్...’’ అన్నారు ట్రంప్!!‘‘ఏ విషయం గురించి మిస్టర్ ప్రెసిడెంట్!!’’ అని అడిగాను.‘‘వెల్... జాక్! నా ఇనాగరేషన్ లో నువ్వు నీ పక్కనున్న స్త్రీమూర్తిని – ఆమె కంఠానికి దిగువనున్న భాగం వైపు – ఆపేక్షగా చూశావని అంతా నిన్ను ట్రోల్ చేయటం గురించే అంటున్నా! మగవాళ్లు నిప్పులా ఉన్నా నిందలు తప్పవు. లుక్! స్త్రీ విషయంలో నోరు జారిన మగాడినైనా ఈ లోకం క్షమిస్తుంది కానీ, చూపు జారిన మగాడికి ఏ లోకంలోనూ క్షమాపణ లభించదు...’’ అన్నారు ట్రంప్.‘‘థ్యాంక్యూ మిస్టర్ ప్రెసిడెంట్’’ అన్నాను.ఆయన అంటున్న ఆ స్త్రీ మూర్తి లారెన్ సాంచెజ్! జెఫ్ బెజోస్ ప్రియురాలు. ఇనాగరేషన్ లో నాకు ఒక పక్క నా భార్య,ఇంకో పక్క ఆమె ఉన్నారు. ఆమెకు అటువైపున నిలబడి ఉన్న జెఫ్ బెజోస్ ఏదో చెబుతుంటే, నేను తలతిప్పి చూసినప్పుడు, నా చూపు ఆమె ‘లో–నెక్’ లోపలికి స్లిప్ అయినట్లుంది. అంత బ్యాడ్ మోమెంట్ లేదు నా లైఫ్‌లో!ఇలాంటి సంక్షోభ సమయంలో లోకంలోని ఒక మగవాడు నాకు సపోర్ట్‌గా రావటం బాగుంది. అయితే ఆ మగవాడు డోనాల్డ్ ట్రంప్ కాకపోయుంటే నాకు మరింత సపోర్టివ్‌గా అనిపించేది.‘‘వింటున్నావా జాక్? నువ్వు ఆమెను చూడాలని చూడలేదని నాకు తెలుసు. చూడటం వేరు. చూపు పడటం వేరు. కానీ జాక్, నీపైన వచ్చిన లక్ష కామెంట్లలో ఒకటైతే నాకు భలే నచ్చింది. మొదటిసారి నువ్వొక హ్యూమన్ లా స్పందించావట! హాహ్హహా...’’ అంటూ పెద్దగా నవ్వారు ట్రంప్. నేనూ నవ్వాపుకోలేకపోయాను.‘హాయ్ జాక్’ అంటూ లైన్ లోకి వచ్చినంత హఠాత్తుగా ‘బాయ్ జాక్’ అంటూ లైన్ లోంచి వెళ్లిపోయారు ట్రంప్.ఫోన్ పెట్టేశాక, ‘‘ఏమిటట?’’ అని ప్రిసిల్లా.పక్కన పిల్లల్లేరు! నిద్రబుచ్చి వచ్చినట్లుంది.‘‘అదే, ఆ బ్యాడ్ మోమెంట్ గురించి ట్రంప్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు... ’’ అని చెప్పాను.ప్రిసిల్లా నవ్వింది.‘‘అది బ్యాడ్ మోమెంట్ కాదు బాస్, బ్యాడ్ ఫొటోగ్రాఫ్... ‘ అంది, నన్ను అతుక్కుపోతూ.ప్రిసిల్లా అంటే... ఇప్పుడు మళ్లీ ప్రిసిల్లా–నేను... కాలేజ్ డేస్ తర్వాత ఇన్నేళ్లకు! -
రాజ్యాంగ అమలులో చిత్తశుద్ధి ఉందా?
దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి చర్చలు తుది రూపంలోకి వస్తున్న తరుణంలోనే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ‘రాజ్యాంగ సభ’ను ఏర్పాటు చేశారు. బి.ఆర్. అంబేడ్కర్ ముసాయిదా కమిటి చైర్మన్‌గా, బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించారు. వివిధ రాజ్యాంగ రచనా కమిటీలకు నిష్ణాతులు సేవలందించారు. వీరి కృషి ఫలితంగా రూపొందిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాడు రాజ్యాంగ సభ ఆమోదించింది. నాటి రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉన్నాయి (ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు, 486 పైగా అధిక రణలు). చివరకు 1950 జనవరి 26 నాడు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అంటే 2025 జనవరి 26 నాటికి రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లన్నమాట! ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో దేశం పరిపాలనా పరంగా, జనాభా పరంగా, సంస్థాగతంగా, సాంకేతికంగా చాలా ప్రగతిని సాధించిందని చెప్పగలం. కానీ ఆ అభివృద్ధి అన్ని రంగాల్లో ఆశించిన స్థాయిలో జరగకపోవడం, రాజ్యాంగంలో పేర్కొన్నట్లు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా పంపిణీ కాకపోవడం బాధాకరం. రాజ్యాంగ ప్రవేశికలో లేని ‘సామ్యవాద’, ‘లౌకిక’ పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం చేర్చింది. మొత్తం మీద ఇప్పటికి 106 రాజ్యాంగ సవరణలు జరగడం గమనార్హం. ఏ దేశ రాజ్యాంగం అయినా మారుతున్న అవసరా లకు అనుగుణంగా తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. ఆనాడు రాజ్యాంగ సభలో అంబేడ్కరే స్వయంగా ‘ఒకవేళ రాజ్యాంగం విఫలం అయితే ఆ తప్పు రాజ్యాంగానిది కాదు, దానిని అమలు చేసే పాలకులదే’ అన్నారు. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టా’న్ని చేశారు. కానీ దీన్ని చాలా రాజకీయ పార్టీలు ఎంతగా నీరుగార్చాయో తెలిసిందే కదా! 6–14 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ‘విద్యా హక్కు చట్టం’ తెచ్చారు. కానీ అమలును మరచారు. నేటికీ బడి బయట కోట్లాదిమంది పిల్లలు బాలకార్మికులుగా బతుకు తున్నారు. దేశంలో అంతర్గతంగా పెరుగుతున్న కులం, మతం భావాలు విద్వేషాన్ని నింపుతున్నాయి. ఈ మధ్యనే ఫ్యూచర్ రీసెర్చ్ సెంటర్ నివేదికలో మత విద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో మనదేశం మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది.రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశ సూత్రాలు సరిగ్గా అమలుకు నోచుకోవడం లేదు. ప్రాథమిక హక్కు లదీ దాదాపు అదే స్థితి. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వాలు ఎలా నీరుగారుస్తున్నాయో జైళ్లలో మగ్గుతున్న అనేక మంది హక్కుల కార్యకర్తలూ, ప్రజా ఉద్యమకారులూ, మేధావులను చూస్తే అర్థమవు తుంది. అలాగే అమానవీయమైన అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించినా ఇప్పటికీ గ్రామాల్లో వివక్ష కొన సాగుతూనే ఉంది. ‘రాజ్యాంగం’ మీద కనీస అవగాహన లేనివారు చట్టసభలలో అడుగుపెట్టడం శోచనీయం. ఇక వారు ఎటువంటి చట్టాలు చేస్తారో చెప్పవలసిన పనేముంది! ఒక అందమైన భవంతిని నిర్మించుకొని దానిని సక్రమంగా వాడుకోకపోతే అది త్వరలోనే శిథిల స్థితికి చేరుతుంది. ఈ సూత్రం ఏ దేశ రాజ్యాంగానికైనా వర్తిస్తుంది. ‘భారత ప్రజలమైన మేము దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్య్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్నీ, ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛ, మతవిశ్వాస ఆరాధనా స్వేచ్ఛలనూ, అవకాశాల్లో సమానత్వాన్ని సాధించేందుకు, వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు శాసనం (రాజ్యాంగం రూపంలో) చేసి, ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాం’ అని రాజ్యాంగ ప్రవేశికలోనే ఉంది. అంటే ఆనాడు మన లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగానే అది రూపొందించబడింది. కానీ దాని అమలులోనే పాలకులకు చిత్తశుద్ధి కొరవడింది. ఇది గర్హనీయం. డా‘‘ మహ్మద్ హసన్ వ్యాసకర్త పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ -
వాగ్దాన పూరిత ఎంపిక
మన రాజ్యాంగ అమృతో త్సవ సందర్భం తర్వాత జరుగుతున్న 2025 రిప బ్లిక్ దినోత్సవంలోఆంధ్రప్రదేశ్ నుంచి పార్వతీపురం మన్యం జిల్లా తొలి కలెక్టర్ నిశాంత కుమార్‌ను ‘ప్రైమ్ మిని స్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ 2023’కి భారత ప్రభుత్వం ఎంపిక చేయడం ఒక వాగ్దానపూరిత ఎంపిక. ఒడిశాను ఆనుకుని ఉన్న ఏపీ సరి హద్దులోని ఆ గిరిజన ప్రాంతం అస్సలు జిల్లా ఎప్పుడు అయింది? అక్కడ కలెక్టర్ ఎందుకుఉంటాడు? అనేవి కొత్తవారికి ఈ వార్త విన్నప్పుడు కలిగే సందేహాలు. ఇక్కడే ‘లెజిస్లేచర్’ (శాసన వ్యవస్థ) పాత్ర కీలకమై, దాని రాజకీయ నిర్ణయాల చర్చకు ఈ ‘అవార్డు’ కేంద్రబిందువు అవుతున్నది.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్ళలో కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసింది. ‘లెజిస్లేచర్’ (శాసన వ్యవస్థ), ‘ఎగిక్యూటివ్’ (కార్యనిర్వాహక వర్గం) కలసి తీసుకున్న (ప్రభుత్వ) నిర్ణయంతో విజయనగరం జిల్లాలో భాగమైన పార్వతీపురం విడిపోయి 2022 ఏప్రి ల్లో అదొక కొత్తజిల్లా అయితే... దాని తొలి కలెక్టర్ నిశాంత కుమార్ 2022–24 మధ్య అక్కడ పనిచేశారు. అది జిల్లా కావడానికి కొంచెం ముందుగానే, ఒడిశా సరిహద్దున రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న 21 కొటియా గిరిజన గ్రామాల సమస్య విషయమై 2021 నవంబరులో జగన్ అప్పటి ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌ను భువనేశ్వర్‌లో కలిసి మాట్లాడ్డంతో దాని పరిష్కారానికి ఒక రూపం వచ్చి, రెండు రాష్ట్రాల ‘ఎగ్జిక్యూటివ్’ల మధ్య చర్చ మొదలైంది.పదిహేను మండలాలకు అంటే ఒక ‘ఎస్సీ’, మూడు ‘ఎస్టీ’ అసెంబ్లీ నియోజక వర్గాల ‘ప్రజ లకు’ కొత్తగా ఒక ‘కలెక్టరేట్’ వచ్చింది. ఇక్కడ గమనించవలసిన నాలుగు అంశాలు ఉన్నాయి: ఒకటి ‘ప్రాంతం’ (పార్వతీపురం), రెండు‘ప్రజలు’ (గిరిజనులు), మూడు ‘ప్రభుత్వం’ (వైసీపీ), నాలుగోది ‘సార్వభౌమాధికారం’ (కలె క్టర్). ఈ నాలుగు ‘రాజ్యం’ ఉపాంగాలు. వీటిలో రాజ్యంగ ప్రతినిధిగా ‘కలెక్టరేట్’ రూపంలో ‘సార్వభౌమాధికారం’ (సావర్నిటీ) 75 ఏళ్లతర్వాత ఆ మన్య ప్రాంతంలో సూక్మస్థాయిలోకి ప్రవేశించింది.ఇక ఇక్కడ జరిగింది చూస్తే... జిల్లాయంత్రాంగం (వైద్య ఆరోగ్యశాఖ) వివరాల ప్రకారం 2022 ఏప్రిల్‌లో కలెక్టరేట్ వచ్చాక ‘ప్రిజం–10’ (‘ప్రాజెక్ట్ టు రెడ్యూస్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ బిలో 10’) అమలు అయ్యే నాటికి ఇక్కడి శిశు మరణాల రేటు 24, తల్లుల మరణాల రేటు 128, రోగ నిరోధకత 47.2 శాతం ఉంది. కలెక్టర్ తీసుకున్న ప్రత్యేక చొరవతో రెండేళ్లలో 2024 ఫిబ్రవరి నాటికి 97.77 శాతం రోగనిరోధకతతో ఏడాదికి 210 మంది శిశువుల జననంతో మర ణాల రేటు 8కి తగ్గింది. అలా ఈ ప్రాజెక్టు అమలులో పార్వతీపురం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రజలు, ప్రభుత్వ సిబ్బందిలో నమ్మకం కలిగించడానికి కలెక్టర్ నిశాంత్ కుమార్ తన భార్య కాన్పు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించారు. దాంతో ‘ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్’గా పార్వతీపురం జిల్లాను భారత ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డ్ ప్రకటించింది. ఆ మన్యప్రాంతంలో గాలిలో దీపంలా మారిన గిరిజన శిశువుల ప్రాణాలు నిలపడంతో అక్కడ ‘రాజ్యం’ పని మొదలైంది. పౌర సంక్షేమం విషయంలో రాజ్యం బాధ్యత–‘ఫ్రవ్‌ు క్రేడిల్ టు గ్రేవ్’ (ఊయల దశ నుండి సమాధి వరకూ...) అనేది రాజనీతి శాస్త్ర తొలి పాఠం.రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా పార్వతీపురం, పల్నాడు వంటి జిల్లాలు ఏర్పాటుచేసి, ‘కోటలో పాగా’ రాజకీయాలను మొదలుపెట్టిన జగన్ దీన్నే బహిరంగ సభల్లో జనరంజక భాషలో చెప్పే ప్రయత్నంలో– ‘ఇది పేదలకూ, పెత్తందార్లకూ మధ్య జరుగుతున్న యుద్ధం’ అనేవారు. కొందరి కిది సానుకూలంగా అర్థమైతే, మరికొందరికి ఇది ‘విధ్వంసం’ అనిపించింది. ఎవరికి ఏది ఎలా అర్థ మైనా, ఈ ‘అవార్డు’ అయితే సానుకూలంగా ఆలో చించేవారికి సంతోషం కలిగించేది అవుతుంది.-జాన్సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
మాయాబజార్లో మన స్వతంత్రం
స్వాతంత్య్రానికి పూర్వం మొత్తం భారత దేశంలో కేవలం రెండు, రెండున్నర శాతం ప్రజలకు మాత్రమే ఓటు హక్కు ఉందంటే బానిస పాలన లక్షణం తేలిపోతుంది.కొందరు జమీందారులు, సంస్థానాధీశులు, భూస్వాములు, విపరీత సంపన్నులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఇది అర్థం చేసుకుంటే మన స్వాతంత్య్రం గొప్పతనం అర్థమవుతుంది. వయోజనుడైన ప్రతి వ్యక్తికీ ఓటు హక్కు ఇచ్చారు. ఇది సామాన్యమైన హక్కు కాదు. ప్రాణాలకు ప్రాణమైన హక్కు. మనకు స్వరాజ్యం ఉంది కానీ సురాజ్యం లేదనే విమర్శలు ఉన్నాయి. అందరికీ సమానంగా ఓటు హక్కు మాత్రం ఉంది. బలహీనులకు ఓటు ఇవ్వకూడదు అన్నా, మహిళలకు ఇవ్వలే మన్నా, చదువుకున్నవారికే ఇస్తామన్నా సమానత ఉండదు. నిశ్శబ్ద విప్లవం1950 నాటికి ప్రజాస్వామ్యం అని గొప్పలు చెప్పుకున్న అనేకా నేక దేశాల్లో సమాన ఓటు హక్కు లేదు. మన దేశంలో ఓటింగ్ హక్కు పైన ఒకటే పరిమితి ఉండేది. అదే 21 సంవత్సరాల వయసు. ఆ తరువాత 18 ఏళ్లుంటే చాలు కచ్చితంగా ఓటు హక్కు ఇవ్వాల్సిందే! ఓటు అమ్ముకుంటున్నారో కొంటున్నారో, ఓటు వేస్తున్నారో లేదో అవసరం లేదు. కానీ హక్కు మాత్రం ఉంది. మనం వాడుకుంటున్నందువల్లనే ఇవ్వాళ రక్తపాతం లేకుండానే అధికారం మారిపోతూ ఉన్నది. ఇది నిశ్శబ్ద విప్లవం. ఓ అర్ధరాత్రి ఫలితాలు తెలిసినపుడు అధికారం మార్పిడి జరుగుతున్నది. ఎంత గొప్ప విషయం! మనదేశంలో ఎందరికి ఓటు హక్కు ఉందో తెలుసా? 99.1 కోట్ల మందికి ఓటు అనే అధికారం ఉంది. వీరిలో 18 నుంచి 29 వయ సున్న 21.7 కోట్ల యువశక్తి కాస్త మెదడు వాడుకుంటే చాలు ప్రభు త్వం మారిపోతుంది. అదీ ఈ ఓటు మాయ. ‘ఓటింగ్ వంటిది మరోటి లేదు. కచ్చితంగా నేను ఓటేస్తాను’ అనే నినాదంతో ఈ జనవరి 25న ఎన్నికల కమిషన్ 75వ వార్షిక ఉత్సవం జరుగుతున్నది. 2011 నుంచి ఇదే తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. రాజ్యాంగం ఏర్పడిన తరువాత 1952లో తొలి ఎన్నికలసంగ్రామం జరిగింది. అదొక గొప్ప పండుగ అని పెద్దలు అనేవారు. కొన్ని దశాబ్దాల కింద మనిషి పోలింగ్ బూత్‌కు రాకపోతే ఆ వ్యక్తి చని పోయినాడనుకునేది. ఇంత కష్టపడి ఓటేయడం ఎందుకు అని ఎవ రైనా అంటే, ఓటు వేయడం నేను బతికి ఉన్నాను అనడానికి నిద ర్శనం అనేవారు. అధికారులు, ఉద్యోగులు, నాలుగోస్థాయి ఉద్యో గులు, ఉపాధ్యాయులు ఓటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది చాలా కష్టమైన పని. వాళ్లంతా కొన్ని నెలలపాటు కష్టపడితే, ఆడుతూ పాడుతూ ఓటు వేసుకోవచ్చు.పారదర్శకత ఎంత?ఇదివరకు ఒక్కరే కమిషనర్‌గా టి.ఎన్.శేషన్ ఎన్నికలు అద్భుతంగా నిర్వహించారు. ఆ తరువాత ముగ్గురు కమిషనర్లు వచ్చారు. ప్రధాన మంత్రి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్‌ను నియ మిస్తారు. వారిలో సీనియర్ కమిషనర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా నియమిస్తారు. ఈ అధికారం భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 నుండి సంక్రమించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ప్రత్వేక అధికారాలు లేవు. ఆ ముగ్గురిలో మెజారిటీ అభిప్రాయం ద్వారా నిర్ణయం సాగుతుంది. ఈ మధ్య 2023లో సవరణ చట్టం చేశారు. ఎంపిక కమిటీలో ప్రధానితో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపికైన మరొక మంత్రి ఉంటారు. అభిశంసన ప్రక్రియ ద్వారా సీఈసీని పదవి నుండి తొలగించవచ్చు. కానీ ఆ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ముగ్గురిలో ఇద్దరి మెజారిటీ ఉంటే కొన్ని నిర్ణయాలు తీసు కోవచ్చు. కానీ ఒకరి నిరసన ఉంటే అది తీవ్రమైన అంశంగా పరిగ ణించాలి. ప్రధాని నాయకత్వంలో రాష్ట్రపతి నియమించినప్పటికీ ముగ్గురూ నీతిగా ఉంటూ, ప్రభుత్వ ఒత్తిళ్లను ప్రతిఘటించడం అవసరం. ముగ్గురూ ప్రభుత్వానికి పక్షపాతంగా ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరగవు. ఆ మధ్య అరుణ్ గోయల్‌తో మిగిలిన ఇద్దరికి అభిప్రాయ భేదం రావడం వల్ల రాజీనామా చేశారు. 2027 డిసెంబర్ దాకా కమిషనర్‌గా ఆయనకు గడువు ఉన్నప్పటికీ, 2024 మార్చ్ 9న రాజీనామా చేయడం వల్ల అనుమానాలు వచ్చాయి కూడా! ప్రవర్తనా నియమావళిలో ఏ మాత్రం గందరగోళం ఉన్నా అను మానాలు పెరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలలో, ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో తీవ్రమైన అనుమానాలు వచ్చాయి. ఇప్పటికీ అనేక వివాదాలు వస్తున్నాయి. అలాగే మతాన్ని ఎన్నికలలో విరివిగా దుర్వినియోగం చేస్తుంటే, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగినట్లు కాదు. విప రీతమైన డబ్బు వెదజల్లడం, ఓటర్లను బెదిరించడం, కండబలం వాడటం, ఫేక్ న్యూస్‌ను వ్యాపింపజేయడం వల్ల ఎన్నికలు పారదర్శ కంగా సాగవు. ప్రభుత్వాలే అక్రమాలకు పాల్పడితే ప్రజాస్వామ్యం మీద నమ్మకం తగ్గిపోతుంది. చీకటి నిధులుఓటర్లకు అభ్యర్థులను గురించి తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తరువాత ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థీ తన నేరాల చిట్టాలు, స్థిరచరాస్తులు పట్టాల వివరాలతో ఇచ్చిన ప్రమాణ పత్రాలు అట్లా పడి ఉన్నాయి. ఓటర్లకూ పట్టదు, రాజకీయ పార్టీలకూ పట్టదు. 43 శాతం ప్రజాప్రతినిధుల మీద ఉన్న తీవ్రనేరాలను త్వరగా విచారణ జరపకపోతే దేశ రాజ్యాంగ సంవి ధాన సుపరిపాలనా వ్యవస్థ కుప్పకూలిపోతుంది.నిజానికి ఈసారి ఎన్నికల బాండ్లు చాలా అనుమానాలకు దారి తీశాయి. కోట్లకు కోట్ల రూపాయలను బాండ్ల ద్వారా ‘సంపాదించారు’. వీటిని మనం విరాళాలు అంటున్నాం. ఎలక్టోరల్ బాండ్స్ ప్రవేశపెట్టడానికి ఆనాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 జనవరి 28న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిప్రాయం కోరుతూ లేఖ రాశారు.జనవరి 30న రాసిన జవాబులో ఈ పద్ధతి అక్రమాలకు దారి తీసే అవకాశం ఉందనీ, పారదర్శకంగా ఉండవలసిన ఎన్నికల విరా ళాలను గోప్యంగా మారుస్తుందనీ, దీనివల్ల బలవంతపు విరాళాలు వసూలు చేసే అవకాశం ఉందనీ రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయపడింది. అయినా పార్లమెంటులో ఎటువంటి చర్చా జరగకుండానే, ఎలక్టోరల్ బాండ్స్ దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించాయి. అందుకు తగినట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని కూడా సవరించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిపోయి 2018 జనవరి 2న ఎలక్టోరల్ బాండ్ పథకం మొదలైంది.ఎలక్టోరల్ బాండ్లను వ్యతిరేకించిన ఎన్నికల సంఘం 2019 మార్చ్ 25న అఫిడవిట్ దాఖలు చేసింది. విరాళాలకు సంబంధించిన వివరాలను పంచుకోవడం నుండి రాజకీయ పార్టీలను మినహాయించడం విదేశీ నిధుల సమాచారాన్ని చీకటిలో ఉంచుతుందని చెప్పింది. ‘భారతదేశంలోని రాజకీయ పార్టీల విదేశీ నిధులను తనిఖీ చేయ లేము, ఇది భారతీయ విధానాలను విదేశీ కంపెనీలు ప్రభావితం చేయడానికి కారణం అవుతుంది’ అని పేర్కొంది. అయితే, 2019 ఏప్రిల్ 12 నుండి ఇప్పటివరకు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. మొత్తం మీద గడచిన ఐదేళ్లలో దాదాపు 1,300 కార్పొరేట్ సంస్థలు దాదాపు 20 రాజకీయ పార్టీలకు రు 12,156 కోట్ల విరాళాలు అందజేశాయి. అందులో అత్యధిక భాగం రు. 6,060 కోట్లు బీజేపీకే దక్కాయి. చివరికి 2024 ఫిబ్రవరి 15న కేంద్రం కళాత్మకంగా నిర్మించిన ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని కోర్టు ఏకగ్రీవంగా కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)లో పొందు పరిచిన ఓటర్ల సమాచార హక్కును ఈ పథకం ఉల్లంఘించిందనిబెంచ్ పేర్కొంది. ఎన్నికలు మాయాబజార్‌గా నిర్వహిస్తే రాజ్యాంగం ఉన్నట్టా, లేనట్టా? » 75 ఏళ్ల కిందట, గణతంత్రానికి ఒక్కరోజు ముందు,అంటే 1950 జనవరి 25న మన భారత ఎన్నికల కమిషన్ ఏర్పడింది. ఎన్నికలు లేకపోతే ప్రజాస్వామ్యం లేదు, భారత రాజ్యాంగం లేదు, ఇంతెందుకు మన స్వాత్రంత్యానికి కూడా అర్థం పర్థం ఉండదు.» ఇంగ్లీషు, హిందీ, తెలుగు వంటి అన్ని భాషల్లో అందరికీ బాగా తెలిసిన మాట... ఓటు!» ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి నియమించినప్పటికీ ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ప్రభుత్వ ఒత్తిళ్లు ప్రతిఘటించడం అవసరం. ప్రభుత్వానికి పక్షపాతంగా ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరగవు.- వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్- మాడభూషి శ్రీధర్ -
పాకిస్తాన్ ముంగిట తాలిబన్ సవాళ్లు
అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు 2021లో అఫ్గానిస్తాన్‌ను వీడిన తర్వాత ఆ దేశాన్ని రెండోసారి హస్తగతం చేసుకున్న తాలిబన్... ప్రస్తుతం భద్రతా పరంగా పాకిస్తాన్‌కు అత్యంత ముప్పుగా మారింది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్‌లో తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ మిలిటరీ, నిఘా సంస్థలు తాలిబన్లకు శిక్షణ ఇచ్చి వారిని మరింత బలపడేలా చేశాయి. సోవియట్ యూనియన్ దళాల ఉపసంహరణ తర్వాత రాజకీయ అనిశ్చితి మధ్య అఫ్గానిస్తాన్‌ను పాలిస్తున్న బుర్హనుద్దీన్ రబ్బానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి 1996లో తాలిబన్లు ఆ దేశాన్ని హస్తగతం చేసు కున్నారు. అప్పటినుండి 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై దాడి తర్వాత అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని కూలదోసి హమీద్ కర్జాయ్ ప్రభుత్వం ఏర్పడే దాకా, తాలిబన్లతో పాకిస్తాన్ సత్సంబంధాలు నెరిపింది.వివాదాలు కూడా పట్టనంతగా...ఈ కాలంలో తాలిబన్ ప్రభుత్వం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎంతలా పెనవేసుకు పోయాయంటే, రెండు దేశాల మధ్య 1947 నుండి ఉన్న సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేంతగా. ముఖ్యంగా 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిన 2,640 కిలోమీటర్ల పొడవైన డ్యూరాండ్ లైన్ వల్ల దశాబ్దాలుగా ఏర్పడిన సంఘర్షణాత్మక వైఖరులను కూడా మరిచిపోయేంతగా. తాలిబన్‌తో సహా అఫ్గానిస్తాన్‌లో ఏర్పడిన అన్ని ప్రభుత్వాలదీ డ్యూరాండ్ లైన్ మీద ఒకే వైఖరి. వాటి వాదన ప్రకారం, ఇది సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పష్తూ జాతి ప్రజలను వేరుచేయడమే కాకుండా, శతాబ్దాలుగా ఉన్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను దెబ్బతీస్తోంది. పాకిస్తాన్ మాత్రం ఈ లైన్ చట్టబద్ధత కలిగిన అధికారిక సరి హద్దుగా భావిస్తోంది. తాలిబన్ తన మొదటి దశ పాలనలో ఎక్కు వగా అఫ్గానిస్తాన్‌ను ఏకీకృతం చేయడంపై, తన అధికార పరిధిని విస్తరించడంపై దృష్టి కేంద్రీకరించింది. తాలిబన్‌కు కావలసిన కీలక మైన సైనిక, ఆర్థిక, దౌత్య సహాయాలను పాక్ చేస్తుండటంతో సరి హద్దు సమస్యలను లేవనెత్తి పాకిస్తాన్ ఆగ్రహానికి గురికాకూడదనే భయంతో తాలిబన్ కూడా సరిహద్దు విషయాన్ని పక్కన పెట్టింది. సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పష్తూన్లు ఏకమైతే పష్తూన్ జాతీయ వాదం తమను ముక్కలు చేస్తుందన్న భయం పాకిస్తాన్‌ను మొదటి నుండి వెంటాడుతోంది. ఆ విషయం తాలిబన్‌కు తెలిసినప్పటికీ తన కున్న అవసరాల దృష్ట్యా పష్తూన్ల ఐక్యత ఒక రాజకీయ కోణంలా రూపాంతరం చెందకుండా చూసుకుంది.ఎక్కడ చెడింది?ఇంతటి బలమైన సంబంధాలు నెరపిన పాకిస్తాన్, తాలిబన్ మధ్య 2021 తర్వాత దూరం పెరగడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనబడతాయి. ఒకటి, 2001లో అమెరికా చేపట్టిన తీవ్రవాదంపై యుద్ధంలో పాకిస్తాన్ పోషించిన ముఖ్యపాత్ర. 1999లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి జనరల్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దుర్భరస్థితిలో వుంది. ఆ దేశ విదేశీ అప్పులు సుమారు 39 బిలియన్ డాలర్లు ఉంటే, వడ్డీల చెల్లింపులకే బడ్జెట్లో సుమారు 56 శాతం కేటాయించాల్సిన పరిస్థితి! ఆ సమయంలో అమెరికాతో జట్టు కట్టడం వలన, అనేక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం పొందడమే కాకుండా, పారిస్ క్లబ్ రుణదాతల నుండి కొత్త రుణాలు పొందగలిగింది. పాత రుణ బకాయిల చెల్లింపుల్లో సైతం అనేక వెసులుబాట్లు పొందగలిగింది. 1998లో అణు పరీక్షల తర్వాత ఎదుర్కొన్న అనేక ఆర్థిక ఆంక్షల నుండి విముక్తి పొందగలిగింది. వీటన్నిటి ఫలితంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడటమే కాకుండా, 2003 నాటికి పారిశ్రామిక రంగం సుమారు 8 శాతం వృద్ధి నమోదు చేసింది. అదే సమయంలో 2001లో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కూలిపోవడంతో అనేక మంది తాలిబన్ ఫైటర్లు పాకిస్తాన్‌లోని ట్రైబల్ ఏరియాల్లోకి పారిపోయి ప్రజల్లో కలిసి పోయారు. మరి కొంతమంది, 2007లో పాకిస్తాన్లో కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇస్లామిక్ సిద్ధాంతాలను వ్యాపింప జేయ డానికి ‘తెహ్రిక్ ఏ తాలిబన్ పాకిస్తాన్’(టీటీపీ) స్థాపించారు.రెండో కారణానికి వస్తే, పాకిస్తాన్ 2017–2022 మధ్య ఏక పక్షంగా తన, అఫ్గానిస్తాన్ మధ్యన ఉన్న సరిహద్దుల్లో కంచె వేసి సరి హద్దులకిరువైపులా ఉన్న అనేక సంబంధాలను దెబ్బ తీసింది. ఈ కంచె తనకు సరిహద్దులపై పట్టును కల్పించి తీవ్రవాదాన్ని, మాదక ద్రవ్యాల, ఆయుధాల, మానవ, ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు తోడ్పడుతుందని భావించింది. అష్రాఫ్ ఘనీ నేతృత్వంలోని అప్పటి అఫ్గాన్ ప్రభుత్వం ఎంత వ్యతిరేకించినప్పటికీ అత్యాధునిక వసతులతో సరిహద్దు కంచెను పూర్తిచేసింది. ఇది అఫ్గానిసాన్లోని అన్ని వర్గాలను, ముఖ్యంగా తాలిబన్లకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ సరిహద్దు వలన, సుమారు పదిహేను వేలమంది అఫ్గాన్లు తమ ఉపాధి కోల్పోవడమే కాకుండా, పాకిస్తాన్ నుండి వచ్చే సరుకుల్లో సుమారు 40 శాతం వస్తువులపై కోత పడటంతో అవి స్థానిక మార్కెట్లలో లభ్యం కాక అఫ్గాన్ ప్రజలు తీవ్ర అవస్థలు పడటానికీ, వస్తువుల ధరలు పెరగడానికీ దారితీసింది.టీటీపీ డిసెంబర్ 31, 2022న మరింత ముందుకెళ్లి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఏకంగా పాకిస్తాన్ సార్వ భౌమత్వాన్ని సవాలు చేయడమే. అప్పటి నుండి పాకిస్తాన్లో తీవ్ర వాద దాడులు పెరగడం చూడవచ్చు. ఇస్లామాబాద్‌లోని ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్’ ఇటీవల ప్రచురించిన నివేదిక ప్రకారం, పాకిస్తాన్ గతేడాది 1,166 తీవ్రవాద దాడులు ఎదుర్కొంది. అందులో 2,546 మంది చనిపోతే, 2,267 మంది గాయపడ్డారు. ఈ లెక్కలు అంతకుముందు ఏడాది (2023)తో పోలిస్తే 66 శాతం ఎక్కువ. ఒక్క గత నవంబర్లోనే 444 (రోజుకు సుమారు 15) దాడులు జరిగితే అందులో సుమారు 685 మంది చనిపోయారు.అంటే పరిస్థితి ఎంత తీవ్రత సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఒక వైపు టీటీపీ, మరోవైపు బలోచిస్తాన్ ప్రాంత స్వతంత్రం కోసం కొట్లాడుతున్న తీవ్రవాద గ్రూపుల దాడుల మధ్య పాకిస్తాన్ చిక్కుకుంది. అయితే, ఆ రెండు ప్రాంతాల తీవ్రవాద గ్రూపుల మధ్య ఉన్న భావజాల విభేదాల వల్ల వాటికి సన్నిహిత సంబంధాలు ఉండక పోవచ్చు. కానీ సరిహద్దుల్లో తాలిబన్ దాడులు చేస్తోంటే, పాకిస్తాన్ లోపల టీటీపీ రక్తపాతాన్ని సృష్టిస్తోంది.ఇండియాకూ కీలకమే!ఇలాంటి పరిస్థితుల మధ్య గత డిసెంబర్ 30న పాకిస్తాన్ ఐఎస్ఐ అధినేత... తాలిబన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అఫ్గాన్ నేష నల్ ఫ్రంట్‌కు ఆశ్రయమిచ్చిన తజికిస్తాన్ అధ్యక్షుడు ఏమోమాలి రహెమాన్‌ను కలిశారు. అది జరిగిన కొద్ది రోజులకు, జనవరి 8న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టకీని దుబాయ్‌లో కలిశారు. ఇవి కొత్త చర్చలకు దారి తీయడమే కాకుండా, ఈ ప్రాంతంలో మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలను, ఏర్పడుతున్న కొత్త సంబంధాలను, ఆవిష్కృతమవుతున్న నూతన ప్రాంతీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రానున్న రోజులలో వివిధ అవసరాల దృష్ట్యా తాలిబన్లతో సత్సంబంధాలు అటు రష్యాకూ, ఇటు చైనాకూ, వాటితో పాటే భారత్‌కూ అత్యంత కీలకం. గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం, జేఎన్‌యూ, న్యూఢిల్లీ ‘ opgadde2@gmail.com -
సంతాన సాఫల్య తంత్రం
చైనాకు మించిన జనసంఖ్యతో భారత దేశం పేదరికానికి పెద్ద పీటగా మారినందుకు బాధపడుతున్న సమయంలో మాన్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మరింత మందిని కనండని ప్రజలకు పిలుపునివ్వడం కలయా, వైష్ణవ మాయయా అనిపిస్తున్నది. గతంలో ఒకసారి అస్పష్టంగా ఈ ప్రకటన చేసిన చంద్రబాబు ఇప్పుడు దీనికొక ప్రణాళికను జోడించారు. ఇద్దరికంటే ఎక్కువ సంతానం గలవారికే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆ మేరకు చట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడి అవుతున్నది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా ఎక్కువమందిని కనాలేమో అన్నారు గానీ ఈ ఇద్దరు సీఎంల ఆలోచనల్లో స్పష్టమైన తేడా ఉంది.ముందు ముందు దేశ జనాభాలో యువత శాతం తగ్గిపోయి ముసలివారు అధికమవుతారని, ఆ ప్రమాదాన్ని తొలగించడానికి ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు అంటున్నారు. మేమిద్దరం, మాకు ఇద్దరు అనే నినాదాన్ని ఆచరణలో పెట్టి కుటుంబ నియంత్రణను గట్టిగా పాటించినందువల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పరిమిత మయిందని, అందువల్ల 2026 తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంటులో మన స్థానాలు తగ్గిపోతాయని,కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా మరింతగా కుంచించుకు పోతున్నాయనే కారణాల మీద ఎక్కువమంది బిడ్డలను కనాలే మోనని స్టాలిన్ అన్నారు. ఇందుకు తమిళనాట దీవెనగా ఉన్న 16 రకాల భాగ్యాల ప్రస్తావన తెచ్చి ఒక్కొక్కరూ అంతమందిని కనవలసి వస్తుందేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఈ విషయంలో వల్లమాలిన ఆత్రం ప్రదర్శించడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నది.కుటుంబ నియంత్రణను జాతీయ విధానంగా చేపట్టి 1950 లోనే అమలు ప్రారంభించిన దేశం ఇండియా. అయినా జనాభాలో ప్రథమ స్థానంలో ఉంటూ వచ్చిన చైనాను ఈ మధ్యనే దాటి పోయాము. ప్రస్తుతం భారత జనాభా 145 కోట్లమంది. ఇందులో 25 సంవత్సరాల లోపు వయసువారు 40 శాతం మంది. 40 ఏళ్ల లోపు జనం 74 శాతం. ఈ పరిస్థితి 2061 వరకు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. పనిచేసే వయసులోని జనం ఇంత ఎక్కు వగా ఉండటం ఒక వరం. వీరందరికీ పని కల్పించగలిగితే సంపద పెరిగి ఇండియా త్వరితంగా అభివృద్ధి చెందిన దేశం కాగలుగుతుంది. కానీ పాలకులు ఇందులో ఘోరంగా విఫలమవుతున్నారు. కుటుంబ నియంత్రణ పాటింపువల్ల జనాభా తగ్గిపోవడం, ఉత్తరాదికంటే అధిక తలసరి ఆదాయం కలిగి ఉండటం దక్షిణాది రాష్ట్రాలకు పెనుశాపమయ్యింది. అయిదు దక్షిణాది రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ) ఉమ్మడి జనాభా 24 కోట్లు. ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభాయే ఇప్పుడు దాదాపు 25 కోట్లని అంచనా. 2026 తర్వాత జరిగే నియోజక వర్గాల పునర్వి భజనలో అప్పటికి ఉండే జనాభా ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడున్న వాటిలో 20 పార్లమెంటు స్థానాలు కోల్పోవచ్చు; ఉత్త రాది రాష్ట్రాలు అదనంగా 31 స్థానాలు పొందవచ్చు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికే 11 పార్లమెంటు స్థానాలు వచ్చి చేరుతాయని అంచనా. దాంతో ఇపుడున్న 80 స్థానాలు 91కి పెరుగుతాయి. తమిళనాడు 8 స్థానాలను కోల్పోవచ్చు. ప్రస్తుతం దానికున్న 39 స్థానాలు 31కి కుదించుకుపోతాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఉండిన 42 పార్లమెంటు స్థానాలు 34కి తగ్గిపోతాయంటున్నారు. బిహార్ పది, రాజస్థాన్ ఆరు స్థానాలను, మధ్య ప్రదేశ్ నాలుగింటిని, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, ఢిల్లీ, చత్తీస్‌గఢ్ ఒక్కో పార్లమెంటు స్థానాన్ని అదనంగా పొందవచ్చని భావిస్తున్నారు. పునర్విభజన వాయిదా ఒక పరిష్కారంఈ మార్పు కారణంగా కేంద్ర పాలకులు ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసి నిధులను ఉత్తరాది రాష్ట్రాలకే మరింత ఎక్కువగా కేటాయిస్తారు. పర్యవసానంగా దక్షిణాది ఇంతవరకు సాధించిన అభివృద్ధిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. జనాభా నియంత్రణను చిత్త శుద్ధితో పాటించినందువల్ల ఇలా నష్టపోవలసి వస్తున్నది కాబట్టి ఎక్కువమందిని కనక తప్పదా అని తమిళనాడు ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమస్యకు పరిష్కారాలు లేకపోలేదు. లోక్‌సభ సభ్యుల సంఖ్య ఇప్పుడు 543. ఇది 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించినది. కుటుంబ నియంత్రణ పాటింపు దెబ్బ తినకుండా చూసుకొనేందుకు, దానిని ప్రోత్సాహించడం కోసం ఈ సంఖ్యను 30 ఏళ్ల పాటు యధాతథంగా కొనసాగించాలని భావించి 42వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. అలా ఆ సంఖ్యను అక్కడే ఆపి ఉంచారు. ఈ నియోజకవర్గాల పునర్విభజనను 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల అనంతర కాలానికి వాయిదా వేస్తూ 2000 సంవత్సరంలో మళ్ళీ నిర్ణయం తీసుకొన్నారు. అదే విధంగా మరి కొన్ని సంవత్సరాలపాటు యధాతథ స్థితిని కొనసాగిస్తూ 2026లో ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా జనసంఖ్యను బట్టి ప్రజా ప్రాతినిధ్య నియోజకవర్గాల పునర్విభజనను పార్లమెంటుకు బదులు రాష్ట్రాల శాసనసభలకు బదలాయించవచ్చు. కొంపలేం మునగవు. లోక్‌సభ స్థానాలను కాపాడుకోవడం కోసం, వాటిని పెంచు కోవడానికి ఎక్కువ మందిని కనాలనడం ఎంతమాత్రం హర్షించ వలసినది కాదు. అసలే వనరులు తక్కువగా ఉన్న దేశంలో జనాభాను పెంచుకోడం ఆత్మహత్యా సదృశమే. దేశ జనాభాలో 60 శాతం మంది సగటున రోజుకి 250 రూపాయలతో జీవిస్తున్నారు. జీవన హక్కు అంటే అన్ని సౌకర్యాలతో గౌరవప్రదంగా బతికే హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్వచించింది. దేశంలో 50 శాతానికి మించిన జనాభా కనీస సౌకర్యాలకు దూరంగా బతుకుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇద్దరు కంటే ఎక్కువమందిని కనాలని చంద్ర బాబునాయుడు అనడం పరమ హాస్యాస్పదంగా ఉన్నది. పరిమిత సంతానమే మేలుఏ రోజు పని ఉంటుందో ఏ రోజు ఉండదో తెలియని స్థితిలోని ప్రజలను, అందీ అందని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్రులు చాచేవారిని కనండి కనండి అంటూ అదిలించడం మానవీయం కాదు. దేశంలో ఐదేళ్ల లోపు బాలల్లో 44 శాతం మంది వయసుకు తగిన బరువు లేమితో బాధపడుతున్నారు. బాలల్లో 72 శాతం మంది, వివాహిత మహిళల్లో 52 శాతం మంది రక్త హీనతతో తీసుకుంటున్నారు. గర్భవతులకు పోషకాహారం లోపిస్తే పుట్టే పిల్లలు రోగాల బారిన పడతారు. 2013 నుంచి స్థూల దేశీయ ఉత్పత్తి 50 శాతం పెరిగినప్పటికీ ప్రపంచమంతటిలో గల పోషకాహార లోపమున్న పిల్లల్లో మూడింట ఒక పాలు కంటే ఎక్కువ మంది ఇండియాలోనే ఉన్నారనీ, ఇందుకు విపరీతమైన ఆర్థిక వ్యత్యాసాలే కారణమనీ నిపుణులు నిగ్గు తేల్చారు. శారీరకంగా చితికిపోయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు గుక్కెడు గంజి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అత్యధిక శాతం మహిళలు ఎక్కువ మంది బిడ్డలను కనడమంటే చావుకి త్వరితంగా దగ్గరవ్వడమే. పిల్లలు లేనివారికీ ఇద్దరే బిడ్డలు కలవారికీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేయడం ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరచడమే. పరిమిత సంతాన సూత్రం ప్రజలకు మంచి చేసింది. బతుకు భారాన్ని తగ్గించి ఎండిన పెదాలను తడిపింది. దక్షిణాది సాధించుకున్న ఈ సౌభాగ్యాన్ని నాశనం చేయా లనే దుర్బుద్ధి హానికరం. ఒకవైపు పిల్లల విద్యను, వైద్యాన్ని నానాటికీ ప్రియం చేస్తూ ఇంకా ప్రసవించండని అనడం దుర్మార్గమే. చంద్ర బాబునాయుడుకి ఈ ఆలోచన ఎందుకు కలిగిందో గాని అది ప్రజలపట్ల ద్రోహ చింతనే. ఈ దురాలోచనను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి మానుకోవడం మంచి చేస్తుంది. ఎప్పుడో వచ్చే విపత్తు కోసం ఇప్పుడే శోక గంగలో దూకమనడం విజనూ కాదు, విజ్ఞతా అనిపించుకోదు.జి. శ్రీరామమూర్తి వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పనిగంటల్లో మహిళను మరిచారా?
వారంలో ఎన్ని గంటలు పనిచేయాలి? ఈ మధ్య కాలంలో దేశం మొత్తమ్మీద విపరీతమైన చర్చ లేవనెత్తిన ప్రశ్న ఇది. ఏడాది క్రితం ‘ఇన్ఫోసిస్’ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దేశం కోసం వారంలో 70 గంటలు పనిచేయాలని సూచించడంతో మొదలైందీ చర్చ. ఇది సద్దుమణిగేలోపు, ‘లార్సెన్ అండ్ టూబ్రో’ (ఎల్ అండ్ టీ) ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ వారంలో 90 గంటలు పని చేయాలని ఇచ్చిన సలహా మళ్లీ దుమారం రేకెత్తించింది. ‘ఆదివారాలు ఎంత సేపని మీ భార్యల ముఖాలు చూస్తూ కూర్చుంటారు, ఆఫీసులకు వచ్చి పనిచేయండి’ అని కూడా ఆయన చతుర్లు ఆడారు. ఈ సరదా వ్యాఖ్య కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షల జోకులు, మీమ్స్ పుట్టుకొచ్చాయి. నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు యథాలాపంగా చేసిన వ్యాఖ్యలను బట్టి వారిని జడ్జ్ చేయడం మంచిది కాదు. కానీ సుదీర్ఘ పనిగంటలను వారు సీరియస్‌గానే ప్రతిపాదిస్తున్నట్టు కనిపిస్తోంది.వ్యాపార రంగంలో వారిద్దరి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసు కుని చూస్తే ఆ వ్యాఖ్యలకు మనం విలువ ఇవ్వాలి. దేశంలో ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీని నిలబెట్టిన వ్యక్తి నారాయణమూర్తి. ఎల్ అండ్ టీ చైర్మన్ కూడా ఆషామాషీ వ్యక్తి కాదు. 5,690 కోట్ల డాలర్ల విలువైన, ఫోర్బ్స్ జాబితాలో నమోదైన కంపెనీని నడిపిస్తున్నారు. కాబట్టి వీరి దృష్టి కోణాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇంటి పని మాటేమిటి?నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యల నేపథ్యంలో కనిపించే ఒక అంశం ఏమిటంటే... వీరిరువురి భార్యలకు సొంతంగా ఉద్యోగాలేమీ లేకపోవడం. దీనివల్ల మన సంరక్షణ బాధ్యతలు చూసుకునే వ్యక్తులు మన అభివృద్ధిలో ఎంత మేరకు భాగస్వాములో తెలియకుండా పోతుంది. వీరిద్దరు చెప్పినట్లు వారానికి 70 లేదా 90 గంటలు పనిచేశామనుకోండి... మహిళలు ఉద్యోగాలు చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు అంత ఎక్కువ పెరిగిపోతాయి కాబట్టి!ఉద్యోగాలు చేసే వారి పిల్లల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటి వరకూ ఎలాంటి ఏర్పాట్లూ లేవు. ఇలా ఉండి ఉంటే తల్లులు కూడా ఎక్కువ సమయం ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో గడిపేందుకు అవకాశం ఏర్పడేది. వారంలో 70 లేదా 90 గంటలు పనిచేయాలన్న ఆలోచన వెనక ఆ ఉద్యోగి జీవిత భాగస్వామికి ఉద్యోగం ఏదీ లేదన్న నిర్ధారణ ఉండి ఉండాలి. పితృస్వామిక భావజాలం ఎక్కువగా ఉండే భారతదేశ నేపథ్యాన్ని లెక్కలోకి తీసుకుంటే... ఆ జీవిత భాగస్వామి మహిళే అయి ఉంటుంది. ఈ వ్యవహారంలో భార్య ప్రస్తావన వచ్చేందుకు ఇంకోటి కూడా కారణం. భార్యలు ఇంటిపట్టున తీరికగా ఉన్నారు అన్న అంచనా. ఇంకోలా చెప్పాలంటే... ఇంట్లో పని మొత్తం అంటే ఇల్లూడ్చడం, వంట, పిల్లల మంచిచెడ్డలు, వయసు మళ్లిన వారి బాగోగులన్నీ ఇతరులు ఎవరో చూసుకుంటున్నారన్నమాట. వాస్తవం ఏమిటంటే... ఇలా పనులు చేసిపెట్టే వారు ఏమీ అంత చౌకగా అందుబాటులో ఉండరు.ఈ దృష్ట్యా చూస్తే... ఈ ఇద్దరు ప్రముఖులు పని అంటే కేవలం ఇంటి బయట చేసేది మాత్రమే అన్న అంచనాతో మాట్లాడటం సమంజసం కాదు. ఇంటి పని కూడా చాలా శ్రమతో కూడుకున్నది, సమయం తీసుకునేదని వీళ్లు గుర్తించి ఉండాల్సింది. పైగా ఇంటి పనులు సాధారణంగా ఆడవారే చేస్తూంటారు. ప్రపంచవ్యాప్తంగా, ఇంకా ముఖ్యంగా భారతదేశంలో ఇదే ధోరణి కనిపిస్తుంది. ఇంట్లో ఆడవాళ్లు చేసే శ్రమ విలువ ఎంతో అర్థం చేసుకోవాలంటే ఆ మధ్య వచ్చిన మలయాళ సినిమా ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఒకసారి చూడాలి. మహిళ శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత?ఈ నేపథ్యంలో దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత అన్న ప్రశ్నకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. అంతర్జాతీయంగా మహిళల భాగస్వామ్యం సగటున 51 శాతం ఉంటే భారత్‌లో గణనీయంగా తక్కువ ఉండేందుకు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. అయితే, ఇటీవలి కాలంలో ఈ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, మహిళల భాగస్వామ్యం 2017–18లో 23.3 శాతం మాత్రమే ఉంటే, 2023–24లో 41.7 శాతానికి పెరిగింది. పురుషుల భాగస్వామ్యం సుమారుగా 78.8 శాతం ఉండటం గమనార్హం. ఆర్థికవేత్తలు శమికా రవి, ముదిత్ కపూర్లు చేసిన ఒక అధ్యయనం ప్రకారం, దేశంలో శ్రమశక్తిలో పెళ్లయిన మగవారి భాగస్వామ్యం చాలా ఎక్కువ. అదే సమయంలో పెళ్లయిన మహిళల సంఖ్య చాలా తక్కువ. తల్లి లేదా తండ్రి ఉద్యోగస్తుడైతే ఆ యా కుటుంబాల్లో పిల్లలపై ప్రభావాన్ని కూడా పరిశీలించారు. తండ్రి ఉద్యోగస్తు డైతే ఆ ప్రభావం దాదాపు లేకపోయింది. మహిళల విషయానికి వస్తే పిల్లలున్న కుటుంబాల్లోని మహిళలు శ్రామిక శక్తిలో భాగం కావడం కేరళ వంటి రాష్ట్రాల్లో బాగా తగ్గిపోయింది. బిహార్, పంజాబ్, హరి యాణా వంటి రాష్ట్రాల్లో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వరుసగా తక్కువగా నమోదవుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. అసంఘటిత రంగం మాటేమిటి?పని గంటలు పెంచాలన్న అంశంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఏమాత్రం నియంత్రణ లేని అసంఘటిత రంగం పరి స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పని గంటలను అసాధారణంగా పెంచి చిన్న వ్యాపారులు ఉద్యోగుల శ్రమను దోపిడి చేసే అవకాశం ఉంది. నగర ప్రాంతాల్లో గిగ్ ఆర్థిక వ్యవస్థ చాలా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరికి పనివేళలు నిర్దిష్టంగా ఉంటాయి కానీ టార్గెట్లు ఎక్కువ ఇవ్వడం ద్వారా అధిక శ్రమకు గురి చేస్తూంటారు. ఇంటి పని చేసే వారి విషయంలోనూ పనివేళలు, వేత నాలపై ఎలాంటి నియంత్రణ లేదు. పనిగంటలపై మొదలైన చర్చ ఏయే రంగాల్లో నియంత్రణ వ్యవస్థల అవసరం ఉందన్నది గుర్తించేందుకు ఉపయోగపడవచ్చు. అయితే అసంఘటిత రంగంలో ఉన్న వారు తమంతట తామే పనివేళలను నిర్ధారించుకునే అవకాశం ప్రస్తుతానికైతే లేదన్నది విధాన నిర్ణేతలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం వారంలో ఎన్ని గంటలు పనిచేయాలన్న విష యంపై మొదలైన చర్చ కొన్ని సానుకూల అంశాలను తెరపైకి తెచ్చింది. పని చేసే సమయం ముఖ్యమా? చేసిన పని తాలూకూ నాణ్యత ముఖ్యమా అన్నది వీటిల్లో ఒకటి. అదృష్టవశాత్తూ చాలా మంది కార్పొరేట్ బాసులు సమయం కంటే నాణ్యతకే ఓటు వేశారు. ఒక్కటైతే నిజం... నారాయణ మూర్తి, సుబ్రహ్మణ్యన్ వంటి తొలి తరం వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలపై ఏకాగ్ర చిత్తంతో పని చేయడం వల్లనే ఇప్పుడీ స్థితికి ఎదిగారు. అయితే విజయానికి మార్గాలు అనేకం. రతన్ టాటా వంటి వారు పారిశ్రామికంగా ఎదుగుతూనే ఇతర వ్యాపకాలను కూడా చూసుకోగలిగారు. అభివృద్ధి పథంలో మన సంరక్షకుల పాత్రను కూడా విస్మరించలేము. మొత్త మ్మీద చూస్తే ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలేమిటన్నది సంకుచిత దృష్టితో కాకుండా సమగ్రంగా చూడటం మేలు!సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
తప్పు ఎవరిది? శిక్ష ఏమిటి?
దేశాన్ని అట్టుడికించిన కేసులో కోర్టు తీర్పు వెలువడింది. తీరా తీర్పు సైతం ఆ కేసులానే చర్చకు దారి తీస్తోంది. కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలోని సెమినార్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ డాక్టర్‌పై గత ఆగస్ట్ 9న జరిగిన దారుణ హత్యాచార ఘటనపై తాజా తీర్పు సహేతుకం కాదనే విమర్శ వినిపిస్తోంది. ఆస్పత్రిలో వాలంటీరైన సంజయ్ రాయ్ భారతీయ న్యాయ సంహిత లోని వివిధ సెక్షన్ల కింద నేరస్థుడంటూ శనివారమే కోర్ట్ ప్రకటించేసింది. కానీ, ఈ కేసులో అతనికి ఉరిశిక్ష బదులుగా యావజ్జీవ కారాగారవాస శిక్ష మాత్రమే విధిస్తున్నట్టు సియాల్డాలోని అడిషనల్ జిల్లా, సెషన్స్ కోర్ట్ సోమవారం తీర్పు చెప్పేసరికి మళ్ళీ తేనెతుట్టె కదిలింది. బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారే కాక, అటు కేంద్ర నేరదర్యాప్తు సంస్థ (సీబీఐ), ఇటు బాధితురాలి కుటుంబం సైతం నేరస్థుడికి ఉరిశిక్ష విధించాలంటూ వాదించింది. కానీ, అంతటి తీవ్ర శిక్ష విధించేందుకు హేతుబద్ధత లేదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం గమనార్హం. దాంతో, మహిళా లోకంలో, బాధిత, వైద్య వర్గాల్లో అసహనం కట్టలు తెంచుకుంది. సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాలే అందుకు నిదర్శనం.హత్యాచారానికి గురైన ఆడకూతురు, ఆమె కుటుంబం బాధను ముగ్గురు ఆడపిల్లలకు తల్లినైన తాను అర్థం చేసుకోగలనంటూ నేరస్థుడి తల్లే స్వయంగా అనడం గమనార్హం. కన్నకొడుకైనా సరే నేరం రుజువైతే, శిక్ష పడాల్సిందేనని ఆ మాతృమూర్తి అన్న మాటలు జరిగిన ఘటన రేపిన భావోద్వేగాలను గుర్తు చేస్తుంది. పైపెచ్చు, ఆగస్ట్ 9 తర్వాత బెంగాల్లో అయిదు హత్యాచార ఘటనల్లో, మైనర్లపై దారుణానికి పాల్పడ్డ నేరస్థులకు ‘పోక్సో’ కోర్టులు ఏకంగా మరణశిక్షే విధించాయి. అందుకే, ఈ కేసులోనూ నేరస్థుడికి ఉరిశిక్ష పడుతుందనీ, పడాలనీ బలమైన భావన వ్యాపించింది. అయితే జరిగింది వేరు. బెంగాల్‌నే కాక అప్పట్లో భారత్ మొత్తాన్నీ కదిలించిన ఈ ఘటనలో బాధిత కుటుంబానికి రూ. 17 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఈ ఘటన ఉరిశిక్ష విధించాల్సినంత అత్యంత అరుదైన కేసు ఏమీ కాదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. బెంగాల్ ఏలిక మమతా బెనర్జీ సైతం తీర్పుతో సంతృప్తికరంగా లేమంటూ కుండబద్దలు కొట్టేసి, తీర్పుపై హైకోర్టుకు వెళతామని తేల్చేశారు. సర్వసాధారణంగా నేరం తాలూకు తీవ్రత, సమాజంపై దాని ప్రభావం, నేరస్థుడి గత చరిత్ర, ప్రవర్తన లాంటివన్నీ మరణశిక్ష విధింపునకు ప్రాతిపదిక అవుతాయి. అయితే, గౌరవ న్యాయస్థానం తన ముందున్న సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే ఎలాంటి తీర్పునైనా ఇస్తుంది. తీర్పు చెబుతూ న్యాయమూర్తి సైతం ఆ మాటే అన్నారు. అంతేతప్ప, మీడియాలో సాగుతున్న ప్రచారం సహా ఇతరేతర కారణాలను బట్టి శిక్షపై నిర్ణయం తీసుకోవడం జరగదు. కాబట్టి, తగినంత బలమైన సాక్ష్యాధారాలు లేనందు వల్లనే ఈ కేసులో నేరస్థుడికి కోర్ట్ మరణశిక్ష విధించలేదా అన్నది ఆలోచించాల్సిన అంశం. తీర్పు పూర్తి పాఠం అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ ఆ అంశంపై మరింత స్పష్టత రాదు. ఆస్పత్రి సిబ్బంది భద్రత కోసం పనిచేయాల్సిన వాలంటీర్ రాయ్ అసలు తన ఉద్యోగ ధర్మాన్నే మంటగలిపి, కాపాడాల్సిన డాక్టర్నే కాటేశాడన్నది చేదు నిజం. అతడు చేసిన నేరం ఘోరం, హేయమన్నదీ నిర్వివాదాంశం. అయితే, హత్యాచారానికి పాల్పడ్డ సదరు నేరస్థుడు జీవితంలో మారే అవకాశం లేదంటూ ప్రాసిక్యూషన్ బలంగా వాదించలేక పోయింది. ఆ మాటను నిరూపించలేక పోయింది. అది కూడా శిక్ష విషయంలో నేరస్థుడికి కలిసొచ్చిందని నిపుణుల మాట.కోల్‌కతా కేసు దర్యాప్తు ఆది నుంచి అనుమానాలకు తావివ్వడం దురదృష్టకరం. నిజానిజా లేమో కానీ, అత్యంత హేయమైన ఈ ఘటనలో శిక్షపడ్డ నేరస్థుడే కాక, ఇంకా పలువురి హస్తం ఉంద నేది అందరి నోటా వినిపిస్తున్న మాటే. స్థానిక పోలీసుల నుంచి చివరకు సీబీఐ చేతుల్లోకి దర్యాప్తు వెళ్ళినా జనంలో అనుమాన నివృత్తి కాలేదన్నది నిష్ఠురసత్యం. సీసీ టీవీ దృశ్యాల్లో 68 దాకా రాకపోకలు కనిపించినా, రాయ్ ఒక్కరినే గుర్తించారన్న ఆరోపణలే అందుకు సాక్ష్యం. పనికి మాలిన రీతిలో దర్యాప్తు జరిగిందనీ, పలుకుబడి గల బడాబాబులు తప్పించుకున్నారనీ, ఆఖరికి ఒకడే నేర స్థుడని తీర్మానించి యావజ్జీవ ఖైదుతో సరిపెట్టారనీ విమర్శలు వెల్లువెత్తడానికి కారణమూ అదే. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ సహా పలువురి వ్యవహారశైలి, ఆశ్రిత పక్ష పాతం, అవినీతి ఆరోపణలు, ఆస్పత్రి యంత్రాంగం పనితీరు, వగైరా... ఎన్నో ప్రశ్నల్ని ముందుకు తెచ్చాయి. సాక్ష్యాధారాల తారుమారు యత్నంలో ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసినా, నిర్ణీత 90 రోజుల వ్యవధిలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోయే సరికి నిష్పూచీగా ఆయన బయటకొచ్చారంటే మన నిఘా, దర్యాప్తు సంస్థలు ఎంత ఘనంగా పనిచేస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కీలకమైన మరో విషయం – ఈ ఘటనకు కారణమైన పరిస్థితులు. ప్రగతి బాటలో ముందున్నా మనే దేశంలో... పనిప్రదేశాల్లో సైతం మహిళలకు రక్షణ కొరవడడం, ఉద్యోగస్థలాలు స్త్రీలకు సురక్షితంగా లేకపోవడం శోచనీయం. కోల్‌కతా ఘటనతో పార్టీలు, ప్రజలు కదం తొక్కిన మాట నిజమే కానీ, ఇప్పటికైనా ఈ పరిస్థితుల్ని సమూలంగా మార్చాల్సిన అవసరం పాలకులకుంది. అవినీతి పంకిలమై, లోపభూయిష్ఠంగా నడుస్తున్న అనేక వ్యవస్థల్ని చక్కదిద్దాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనే కోర్టులు ఉన్నంతలో సత్వర న్యాయం అందించడం, ప్రజాభిప్రాయం కన్నా ప్రత్యక్ష సాక్ష్యాలే ప్రాతి పదికగా తీర్పులివ్వడం ఆహ్వానించదగ్గదే. అయితే, చాలా సందర్భాల్లో న్యాయం చెప్పడమే కాదు... న్యాయమే చేస్తున్నట్టు కనిపించడం ముఖ్యం. ఈ కేసులో అది జరిగిందా అన్నదే పలువురి ప్రశ్న. -
కాంతి లేని కూటమి పాలన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి ఏడు నెలల పాలన పూర్తి చేసుకుంది. పాలనపై తనదైన ముద్ర వేయ డానికి ఇది సరిపడ సమయంగానే భావించ వచ్చు. అందునా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి 7 నెలలు గణనీయమైన సమయంగానే పరిగణించాలి. ముందుగా, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలు విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోడానికి ఏమీలేదు. ‘నీకు 15,000... నీకు 15,000’గా పాపులర్ అయిన ‘తల్లికి వందనం’ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి ఇస్తామని తాజగా ప్రకటించి మరో వాయిదా వేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ పథకం మునుపు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’కి పేరు మార్పు పథకం. అంటే, ఉన్న పథకానికి తిలోదకాలు ఇచ్చి కొత్త పథకం ఇవ్వకుండా ‘అప్పు రేపు’ తరహా గోడ మీద రాత గారడీ చేయడమే! ‘దీపం’ పథకాన్ని చంద్రబాబు మార్కు చాకచక్యంతో ముందుగానే అరకొరగా అమలు చేసే ప్రణా ళిక సిద్ధం చేశారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఇస్తాము అన్న హామీపై నోరు మెదపట్లేదు. అలాగే, ప్రతి మహిళకూ సంవత్సరానికి రూ. 18,000 ఇస్తా మంటూ చేసిన వాగ్దానమూ అటకెక్కినట్టే ఉంది. మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉగాదికి అని వస్తున్న వార్తల్లో నిజం ఎంతో వేచి చూడాలి. రైతులకు వాగ్దానం చేసిన సంవత్సరానికి 20 వేల రూపాయల పథకం రేపో మాపో అని దాటేస్తున్నారు – ఇది కూడా గత ప్రభుత్వం ఇచ్చిన పథకమే అయినప్పటికీ వారు ఇచ్చిన రూ. 13,500 కూడా గడచిన సంవత్సరానికి ఇంకా ఇవ్వనేలేదు. వెరసి, ‘సూపర్ సిక్స్’ హమీలలో ఒక్కటి కూడా చిత్త శుద్ధితో అమలు చెయ్యలేదు అనేది సుస్పష్టం.‘నాడు–నేడు’ పథకం ద్వారా పెక్కు ప్రభుత్వ బడులను జగన్ ప్రభుత్వం ఆధునీకరించి, మరుగుదొడ్ల నిర్వహణకై ప్రత్యేక నిధులు కేటాయించి, పిల్లలకి స్వచ్ఛమైన వాతావరణం కల్పిస్తూ అధ్యాపకులకీ, పిల్లల తల్లి–తండ్రులకీ పర్యవేక్షణ అప్పజెబితే, లోకేష్ అధ్యాపకులకు ఉపశమనం పేరిట పర్యవేక్షణ పద్ధతికి తూట్లు పొడిచారు. పేద పిల్లలకు ఇంగ్లీషు చదువు చెప్పించి విప్లవాత్మకమైన మార్పులు జగన్ తెస్తే, మాతృ భాష పేరుతో సదస్సులు పెట్టి తమ అస్మదీయులైన మాజీల నోటితో ఆ పథకానికి తెర దించే కార్యక్రమం మొదలు పెట్టారు. బుడమేరు వరద తీవ్రతను ముందుగానే అంచనా వేయలేక పోవటం, ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించలేకపోవటంలో ప్రభుత్వ అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. అధికార లెక్కల ప్రకారంగానే 45 మంది చనిపోయారంటే ధన, ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోచ్చు. ప్రభుత్వంలో ఉన్నవారే అత్యంత సున్నితమైన తిరుపతి లడ్డూ వివాదానికి తెరలేపటం చాలా దిగజారుడు చర్యగా నిలిచిపోతుంది. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన సనాతన ధర్మ పరిరక్షణ హావభావ కేళి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుంది.పవన్ కల్యాణ్ ప్రతి విషయానికీ గత ప్రభుత్వానిదే బాధ్యత అనడం ఒక రివాజుగా పెట్టుకున్నారు. అది ఎంత చవకబారు స్థాయికి చేరిందో ఇటీవల జరిగిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈవెంట్‌కి వచ్చి రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన ఇద్దరు యువకుల ఉదంతం చెబుతుంది. కనీసం ఆ కుర్రాళ్లు చనిపోయిన రహదారి తీరు ఎలా ఉందో తెలుసుకోకుండా జగన్ రోడ్లు బాగు చేయకపోబట్టే వారు చనిపోయారు అని ఒక ఉప ముఖ్యమంత్రి అనడం సిగ్గు చేటు. మరుసటి రోజు స్వయానా ఆయనే వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన చిత్రాలలో చక్కని రోడ్డు కనిపిస్తూనే ఉంది. పై పెచ్చు యువతను బైక్ స్టంట్లు చేయమని, సైలెన్సర్లు తీసేసి రచ్చ చేయమని ఒక సినీ వేదిక పైనుంచి పిలుపు నివ్వడం అత్యంత హేయమైన చర్య. రాష్ట్రంలో జరిగిన ప్రతిపక్ష కార్య కర్తల బహిరంగ హత్యలు, నేతల అరెస్టులు ఒక ఎత్తయితే, సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టిన వేల కొలది కేసులు బహుశా రాష్ట్ర చరిత్రలోనే కనివిని ఎరుగం. చంద్రబాబు వాగ్దానాలు నీటిమూటలనే విషయం ఇప్పుడు కళ్ళు తెరిచి పరిశీలించగలిగే ఎవరికైనా అర్థమవుతుంది. ‘సూపర్ సిక్స్’ అని హమీ ఇచ్చిన వారికే వాటిపై విశ్వాసం లేదు అనేది ఇప్పుడు అందరికీ విదితమయ్యింది. అయితే, ఇవన్నీ తెలిసే ఈ రాష్ట్ర ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారా? సామాజిక సమీకరణాలే తప్ప ప్రభుత్వ పనితీరు కానీ, వాగ్దానాల అమలుపై నమ్మకం గానీ మన రాష్ట్రంలో ప్రాధాన్యత సంత రించుకోవా? రానున్న కాలం ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. డా‘‘ జి. నవీన్ వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులుnaveen.prose@gmail.com -
‘కనీస’ చట్టబద్ధతే సంజీవని!
కాలచక్రంలో నెలలు, సంవత్సరాలు పరిగెడుతున్నాయి. కొన్ని రంగాలు రూపు రేఖలు గుర్తుపట్టలేనంతగా మారుతున్నాయి. కానీ, మార్పు లేనిదల్లా వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల జీవితాలే. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు దాటిపోయినా, ఇంకా రైతులు తమ గోడు చెప్పు కోవడానికి రోడ్లపైకి వస్తున్నారు. ప్రాణాలకు తెగించి ఉద్యమిస్తున్నారు. ఇంతా చేసి రైతులు కోరుతున్నదేమీ అన్యాయమైన డిమాండ్లు కావు. ప్రభుత్వాలు నెరవేర్చగల సహేతుక డిమాండ్లే! ఆత్మగౌరవంతో జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు. అప్పుల ఊబిలో నుంచి బయటపడేంత వరకూ రైతులకు ఆత్మగౌరవం లభించదు. రైతాంగం ఆత్మగౌరవంతో బతకాలంటే వారికి కనీస మద్దతు ధరలు లభించాల్సిందే. వాటికి చట్టబద్ధత కల్పించాల్సిందే.2024 ఏడాది ప్రారంభంలో పంజాబ్ రైతులు మరో పోరాటానికి ఉద్యుక్తుల య్యారు. ఏడాది గడిచినా ఆ ఉద్యమాన్ని కొనసాగించడానికి గల కారణాలను విశ్లేషించి చూస్తే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అమా నుష వైఖరి బహిర్గతమవుతుంది. దాదాపు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి మూడు నల్ల చట్టాలను తేవాలని ప్రతిపాదించడం, దానిపై అన్ని రాష్ట్రాల రైతాంగం ఢిల్లీలో చలికి, ఎండలకు, వానలకు తట్టుకొని చేసిన సుదీర్ఘ ఉద్యమం దరిమిలా కేంద్రం దిగొచ్చింది, ప్రతిపాదిత బిల్లుల్ని ఉప సంహరించుకుంది. అయితే, ఆ సందర్భంగా రైతులకు చేసిన వాగ్దానాలను మాత్రం కేంద్రం నెరవేర్చలేదు. ప్రధానంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనీ, రైతుల్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న పంట రుణాలను మాఫీ చేయాలనీ రైతాంగం చేసిన డిమాండ్లను పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయ లేదు. దాంతో 2024 ఫిబ్రవరి 14 నుంచి పంజాబ్ రైతులు హరి యాణా సరిహద్దుల్లోని శంభూ అంబాలా, అఖేరిజింద్ కూడళ్ల వద్ద బైఠాయించి ఉద్యమం నడుపుతున్నారు. రైతుల డిమాండ్ల పరిష్కా రానికి సహేతుక ముగింపు లభించాలన్న ఉద్దేశంతో రైతు నాయకుడు జగ్జీత్సింగ్ డల్లేవాల్ (నవంబర్ 26న) ఆమరణ దీక్ష మొదలు పెట్టాక, ఈ పోరాటానికి దేశ వ్యాప్త గుర్తింపు లభించింది. నిజానికి ఓ పోరాటాన్ని విరమింపజేసే సమయంలో ఇచ్చిన వాగ్దానాల్ని కేంద్రం నెరవేర్చకపోవడం, వాటిని నెరవేర్చాలన్న డిమాండ్‌తో రైతాంగం మరో పోరాటానికి దిగడం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చు.కనీస మద్దతు ధర ప్రాథమిక హక్కు లాంటిదే!మూడేళ్ల క్రితం ఉపసంహరించుకున్న మూడు నల్ల చట్టాల్ని కేంద్రం మరో రూపంలో తీసుకురాబోతోందన్న సంకేతాలతోనే పంజాబ్ రైతులు ఆందోళనకు దిగారు. ‘‘దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ 75 సంవత్సరాలలో పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు లభించక, సాగు గిట్టుబాటు కాక, అప్పుల ఊబిలో చిక్కుకొని గత్యంతరం లేక, తమ జీవితం పట్ల తమకే విరక్తి కలిగి ఇప్పటికి 7 లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. నా ప్రాణం పోతే పోతుంది. కానీ ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల జాబితాలోకి మరికొన్ని పేర్లు చేరకూడదు’’ అన్న 70 ఏళ్ల డల్లేవాల్ మాటలు వ్యవసాయరంగ వాస్తవ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తాయి. దేశానికి ఆహార భద్రత అందించే రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకొనే దుఃస్థితి ఎందుకు ఉన్నదో పాలకులు ఆలోచించడం లేదు. గతంలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు తాజాగా తెస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సంస్కరణలు రైతుల పాలిట ఉరి తాళ్లుగా మారనున్నాయి. పంట ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (అగ్రి కల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)లను రద్దు చేసి కాంట్రాక్టు సాగుకు పట్టం కట్టాలన్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు ప్రతిపాదనకు రైతాంగం ససేమిరా ఇష్టపడటం లేదు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకురాదలిచిన సంస్కరణలకు సంబంధించి 2024లో విడుదల చేసిన ముసాయిదా పత్రంలో పేర్కొన్న అంశాలు దాదాపుగా అంతకుముందు విరమించుకొన్న వ్యవసాయ బిల్లుల్లోని అంశాలకు నకలుగా ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తు న్నారు. అవి: 1. జాతీయ వ్యవసాయ మార్కెట్లను అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం; 2. ఒకే లైసెన్సు, ఒకే రిజిస్ట్రేషన్ వ్యవస్థ తీసుకు రావటం; 3. ఫీజు ఏకమొత్తంలో ఒకేసారి చెల్లింపు చేయటం;4. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలను ప్రత్యేక మార్కెట్లుగా గుర్తించడం; 5. ప్రైవేట్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికల ఏర్పాటు... ఇలా పలు ప్రతిపా దనలను ముసాయిదా బిల్లులో చేర్చి, వాటిని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని రైతులు అనుమానిస్తున్నారు. సాధారణంగా వ్యవసాయ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు రైతాంగ ప్రతినిధులతో చర్చించడం, వారిని భాగస్వాముల్ని చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కేంద్రం ఆ సంప్రదాయాన్ని పాటించకపోవడాన్ని రైతు సంఘాలు తప్పు పడుతున్నాయి. తమకు అంగీకార యోగ్యం కాని నిర్ణయాలు చేయడం కోసమే కేంద్రం ఏక పక్షంగా వ్యవహరించిందని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరలు ఆశించడం రాజ్యాంగంలో ప్రజలకు దఖలు పడిన ప్రాథమిక హక్కు లాంటిదేనని డల్లేవాల్ పేర్కొనడం దేశవ్యాప్త చర్చకు ఆస్కారం కల్పించింది. దేశవ్యాప్త డిమాండ్ కూడా అదే!తాము పండించే పంటకు ఎంత ధర ఉండాలో నిర్ణయించుకొనే హక్కు ఎలాగూ రైతాంగానికి లేదు. కనీసం పండించే పంటకు ఎంత మొత్తం కనీస మద్దతు ధర (ఎంఎస్íపీ)గా ఇస్తారో ముందుగా తెలుసుకోవాలను కోవడం అత్యాశేమీ కాదు కదా? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం అంటే పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చుతోపాటు లెక్క గట్టి ధరల్ని ప్రకటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో కొందరు సామాజిక కార్యకర్తలు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించి కేంద్రానికి తగిన సూచనలు చేయాలని అభ్యర్థించారు. అయితే, ప్రజల జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని... కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించలేమనీ, అలా చేస్తే నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పుతాయనీ సాకులు చెప్పి కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాలను తప్పుదారి పట్టించిందన్నది నిర్వివాదాంశం.నిజానికి ఈ సమస్యను న్యాయస్థానాలు పరిష్కరించాలని ఆశించడం కూడా సముచితం కాదు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల్ని నిర్ణయించే సీఏసీపీ (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్)లో చైర్మన్ నుంచి సభ్యుల వరకూ అందరూ బ్యూరోక్రాట్లే. రైతాంగ ప్రతినిధులు ఉండరు. పేరుకు ‘సీఏసీపీ’ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా కనిపిస్తుంది గానీ, దానిపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. సీఏసీపీ నిర్ణయించే కనీస మద్దతు ధరల విధానం ఆమోదయోగ్యం కాదని దశాబ్దాలుగా రైతాంగ సంస్థలు మొత్తుకొంటున్నా, కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులే శిరోధార్యం అని ఎందరు చెప్పినా దానికి మొగ్గుచూపడం లేదు. పైగా, తాము అనుసరించే విధానాన్నే స్వామినాథన్ కమిషన్ సూచించిందనీ, ఆ ప్రకారం సాగు వ్యయంపై 50 శాతం జోడించి ఇస్తున్నా మనీ దాదాపు ఐదారేళ్ల నుంచి కేంద్రం బుకాయిస్తూనే ఉంది.దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కేంద్రంలో అనేక పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడ్డం జాతీయ రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిన నేపథ్యంలోనే రైతాంగ సమస్యలు నేటికీ రావణ కాష్టంగా రగులుతూనే ఉన్నాయి. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అన్న దాతలతో తక్షణం చర్చలు జరపాలి (ఎట్టకేలకు ఫిబ్రవరి 14న చర్చలకు ఆహ్వానించింది). ‘మార్కెటింగ్ ఫ్రేవ్ువర్క్’ పేరుతో తెచ్చిన ముసాయిదాను ఉపసంహరించుకోవాలి. రైతాంగం కోరు తున్నట్లు పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించటం ఒక్కటే దేశ రైతాంగానికి సంజీవనిగా పని చేయగలుగుతుంది.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు -
ప్రపంచానికి ఏం రాసి పెట్టి ఉంది?
ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయిననాటికీ, తిరిగి ఇప్పుడు నాలుగేళ్ల విరామంతో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నాటికీ ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి. సవాళ్లు, చిక్కుముడులు, అడ్డంకులు, అనివార్యతలు ఆయన ముందుకొచ్చి నిలబడ్డాయి. అధ్యక్షుడిగా గెలిచీ గెలవగానే ఆయన చేసిన వివాదాస్పద నియామకాలలో అవసరమైతే మార్పులు చేయాలి. యుద్ధాలు చేసుకుంటున్న దేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహించాలి. వందల మిలియన్ల డాలర్లను తన గెలుపు కోసం ఖర్చుపెట్టిన ఎలాన్ మస్క్‌ను సంతృప్తిపరచాలి. ఆయనే హామీ ఇచ్చిన విధంగా అమెరికాను ‘మళ్లీ గొప్ప దేశంగా’ నిలబెట్టాలి. ఇక భారత్‌తో ఆయన ఎలా ఉండబోతారన్నది మన వైపు నుండి ఉత్పన్నం అయ్యే ప్రశ్న.కొన్నిసార్లు భవిష్యత్తును అర్థం చేసుకోవటానికి ఉత్తమమైన మార్గం, దాని గురించిన ప్రశ్నలను లేవనెత్తటమే! ఆ ప్రశ్నలకు మీకు సమాధానాలు లభించక పోవచ్చు; కనీసం ఆందోళన కలిగించగల అవకాశం ఉన్న అంశాలనైనా మీరు గుర్తిస్తారు. అది మిమ్మల్ని, భవిష్యత్తు ముడి విప్పబోయే వాటికి సంసిద్ధం చేస్తుంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ – ఒక పదవీకాల విరామంతో – రెండోసారి పదవిని చేపడుతున్నారు. ఈ తరుణంలో... మున్ముందరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న సందేహాలు సహజం. ఆ దిశగా కొన్ని ప్రశ్నలను నా వైపు నుంచి వేయనివ్వండి. ట్రంప్‌తో సన్నిహితంగా పని చేసిన ఇద్దరు వ్యక్తులు... మాజీ ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’ జాన్ కెల్లీ, మాజీ ‘డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్’ ఆంథోనీ స్కారమూచీ ఆయన్ని ఫాసిస్ట్ (తీవ్రమైన నియంతృత్వ వైఖరి కలిగిన జాతీయవాద పాలకుడు) అనేవారు. ఆ మాట నిజమే నని భవిష్యత్తు రుజువు చేయబోతోందా?అధ్యక్షుడిగా గెలవగానే ట్రంప్ చేపట్టిన అనేక నియామకాలు వివాదాస్పదం అయ్యాయి. రక్షణ మంత్రిగా పీట్ హెగ్సేత్, ఆరోగ్య మంత్రిగా రాబర్డ్ కెన్నెడీ, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్ పటేల్ (కశ్యప్ పటేల్), ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా తులసీ గబ్బార్డ్ నియామకాలు యథాతథంగా కొనసాగుతాయా, లేక మార్పులు జరుగుతాయా?ఏమైనా, రెండు నియామకాలు మాత్రం ప్రశంసనీయార్హం అయ్యాయి. విదేశాంగ మంత్రిగా మార్కో రుబియో, జాతీయ భద్రతా సలహాదారుగా మైఖేల్ వాల్ట్జ్ – అయితే ఆ ఇద్దరూ నిజంగానే ట్రంప్ విదేశాంగ విధానాన్ని నిష్కర్షగా అమలు పరచ గలుగుతారా?ఇక పారిశ్రామికవేత్త, సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది బహుశా, మరింత ముఖ్యమైన ప్రశ్న. ట్రంప్‌కు ఆయన అత్యంత సన్నిహితులుగా ఉన్నారన్నది పైకే కనిపిస్తోంది. పైగా ట్రంప్‌ను అధ్యక్షుడిగా గెలిపించటం కోసం ఆయన 27 కోట్ల డాలర్లను ఖర్చు చేశారు. అది ఆయన్ను వైట్ హౌస్‌లో రాజ్యాంగేతర అధికార శక్తిగా నిలబెట్టే ప్రమాదం ఉంటుందా?బ్రిటన్ ప్రధాని పదవి నుంచి కీర్ స్టార్మర్ను తప్పించేందుకు ఎలాన్ మస్క్ చర్చలు జరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. స్టార్మర్ను ఆయన ‘ఏమాత్రం తగని మనిషి’ అన్నారు. జర్మనీ ఎన్నికల్లో కూడా వేలు పెట్టారు. జర్మనీ చాన్స్‌లర్ షోల్జ్‌ను ‘బుద్ధిహీనుడు’ అన్నారు. ట్రంప్ అశీస్సులతోనే ఇదంతా జరిగి ఉంటుందా?అన్ని దిగుమతులపై 20 శాతం సుంకాన్ని, చైనా ఎగుమతుల పైనైతే మరింత అత్యధిక సుంకాన్ని విధించే ఆలోచన ట్రంప్ మదిలో ఉన్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. కెనడా, మెక్సికోలపై 25 శాతం వరకు సుంకం ఉంటుందని కూడా ఆయన బెదిరించారు. ఇది మనల్ని ఇబ్బందికరమైన వాణిజ్య యుద్ధంలోకి మళ్లిస్తుందా?ఈ విషయంలో చైనా, దాని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో ట్రంప్ ఎలాంటి సంబంధాలను కొనసాగించే అవకాశం ఉంది? భారత్‌కు ఎలాంటి చిక్కులు ఎదురవుతాయి? ఇక ఇప్పుడు రెండు పెద్ద విదేశాంగ విధానాలు విసిరే సవాళ్ల దగ్గరకు వద్దాం. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేయ గలనని ట్రంప్ గొప్ప ధీమాతో చెప్పారు. అయితే అది వట్టి ప్రగల్భమేనా, లేక ఆయన మనసు లోపలి నిజమైన ఉద్దేశమా? ఏ విధంగా చూసినా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అది మంచి వార్తేమీ కాదు. మళ్లీ ఇదే విషయానికి వస్తే, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ‘నాటో’ ఏ విధమైన భవిష్యత్తును ఎదుర్కోబోతోంది? ట్రంప్ ఆ సంస్థ సభ్య దేశాలను వాటి రక్షణ కోసం మరింత ఎక్కువగా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారా? లేకుంటే, నాటో ఐక్యతకు, ఉనికికి ఒక విపత్తులా పరిణమిస్తారా? ఇంకొక అంతర్జాతీయ సవాలు ఇజ్రాయెల్–గాజా! ట్రంప్ ఇజ్రాయెల్‌కు, ముఖ్యంగా నెతన్యాహూకు మద్దతు ఇస్తున్నారు. అధ్యక్షుడిగా తన మొదటి హయాంలో యూఎస్ రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చారు. ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న గోలన్ హైట్స్‌కు అధికార గుర్తింపునిచ్చారు. ఇప్పుడు నెతన్యాహూకు ఎలాంటి ధైర్యాన్నిస్తారు? ఇరాన్ మీద దాడి చేసేట్టుగానా? మధ్య ప్రాచ్యం గురించి కనుక మాట్లాడుకుంటే, సిరియా మాటే మిటన్నది ప్రశ్న. గత నెలలో బషర్ అల్–అస్సద్ పదవీచ్యుతుడు అయినప్పుడు అక్కడ మనం ఒక రాజకీయ భూకంపాన్నే చూశాం. బైడెన్ ప్రభుత్వం డమాస్కస్ చేరుకోటానికి ప్రయత్నమన్నా చేసింది. కానీ ట్రంప్ వల్ల ఈ దౌత్య విధానం తారుమారవుతుందా?మూడో అంతర్జాతీయ సమస్య కూడా ఉంది కానీ, ట్రంప్ దానిని ఎలా తీసుకుంటారనే దానిపై నేనేమీ చెప్పలేను. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఆయన చెబుతున్నారు. పనామా కాలువను వెనక్కు తీసుకుంటాననీ, కెనడాను యూఎస్‌లో కలుపుకొంటాననీ కూడా ఆయన మాట్లాడారు. ఇవన్నీ ఆయన నిజంగానే చేస్తారా, లేక నిస్పృహ నుంచి బయట పడే ప్రయత్నంగా మాత్రమే అలా అంటున్నారా? చివరిగా, భారతదేశంపై దృష్టి పెడదాం. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మోదీకి, ట్రంప్‌కు మధ్య సన్నిహిత వ్యక్తిగత సంబంధం ఏర్పడింది. ఆ స్నేహం ఇప్పుడు కూడా వికసి స్తుందా? లేదా పారిశ్రామికవేత్త అదానీ, పన్నూ(ఖలిస్తానీ నాయ కుడు గుర్పథ్వత్ సింగ్ పన్నూను చంపడానికి ఇండియా ప్రయత్నించిందన్న కేసు) కేసుల విషయమై ట్రంప్ ఒత్తిడి చేస్తే అది వడలి పోతుందా?అత్యంత ఆందోళన కలిగించే విషయం – ట్రంప్ తరచూ ఇండియా విధించే సుంకాలు మితిమీరి ఉంటున్నాయని ఆరోపించే వారు. అందుకు ఆయన చూపించే నిదర్శనం హార్లీ–డేవిడ్సన్ మోటార్ బైక్ దిగుమతులపై భారత్ విధించే సుంకాలు. ఇప్పుడు మళ్లీ, భారతీయ సుంకాలు మరొకసారి ట్రంప్ దృష్టిలోకి వస్తాయా? ఎటూ కదలని ఇంకొక అంశం హెచ్–1బి వీసాలు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ వీసాల గురించి ‘దారుణం’, ‘అన్యాయం’ అన్నారు. కానీ ఈసారి ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి (రిపబ్లికన్ నాయకుడు), శ్రీరామ్ కృష్ణన్ (కృత్రిమ మేధలో సీనియర్ విధాన సలహాదారు) హెచ్–1బి వీసాలకు గట్టి మద్దతుగా మాట్లాడారు. మస్క్ అయితే ఈ విషయమై యుద్ధాని కైనా తెగబడతానని అన్నారు. కాబట్టి ఈ వీసాల విషయంలో ట్రంప్ రెండో హయాం, ట్రంప్ మొదటి హయానికి భిన్నంగా ఉండబోతోందా?ఈ ప్రశ్నలు ఏవీ సమగ్రమైనవి కావు. కానీ, ఆందోళన కలిగించే అంశాల విస్తృతిని సూచిస్తాయి. అధ్యక్షుడిగా ట్రంప్ రెండో హయాం ఎంత అస్థిరత్వంతో ఉండబోతున్నదో ఇవి వెల్లడిస్తాయి. కనుక మీరు ఎగుడు దిగుళ్ల రాళ్ల దారిలో ప్రయాణానికి సిద్ధంగా ఉండండి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
డోనాల్డ్ ట్రంప్ (ఎన్నికైన ప్రెసిడెంట్) రాయని డైరీ
జీవితంలో ప్రతిదీ అదృష్టమే. జీవితంలోని వేడి, జీవితంలోని చల్లదనం కూడా! పామ్ బీచ్ ‘మరలాగో’ రెసిడెన్స్‌లో ఉన్నాం నేను, మెలానియా. అద్దాల్లోంచి బయట ఫ్లోరిడా నగరం అస్పష్టంగానైనా కనిపించటం లేదు! దట్టంగా పొగమంచు. లోపల మా శరీర ఉష్ణోగ్రతలకు తగ్గట్లుగా మా వేర్వేరు గదుల గోడలు వాటికవి తమ సెంటీగ్రేడ్ల హెచ్చుతగ్గులను అప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటూ ఉంటాయి. భార్యాభర్తలు కూడా అలా ఉండకూడదా, ఒకరి కోసం ఒకరు?! ‘‘రేపు ఈ సమయానికి మనం వైట్ హౌస్ గోడల మధ్యకు మారి ఉంటాం...’ అన్నాను, మెలానియాతో మాట కలుపుతూ. ఆమెకు వైట్ హౌస్ నచ్చదు. ‘‘ఒకవేళ నువ్వు అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైనా నేను మాత్రం ఇక్కడే పామ్ బీచ్లోనో, లేదంటే న్యూయార్క్ సిటీలోనో ఉండిపోతాను...’’ అని ఎన్నికలకు ముందే ఆమె చెప్పేసింది, వైట్ హౌస్ ఆమెకు నచ్చకపోవటానికి కారణం... నేను ఆమెకు నచ్చకపోవడం! నచ్చని మనిషితో కలిసి ఉండాల్సి వచ్చినప్పుడు, ఉన్నది స్వర్గమే అయినా అది నరకంలా అనిపిస్తుంది. మెలానియా తనకు నచ్చినట్లు తను ఉంటుంది. ఆమె ‘ఎస్’లు, ఆమె ‘నో’ లు ఆమెకు ఉన్నాయి. ఆమె నా ఎలక్షన్ ర్యాలీలకు రాలేదు. నేను గెలిచాక, ఫ్యామిలీ గ్రూప్ ఫొటోకి రాలేదు. ఇప్పుడైనా వైట్ హౌస్‌కి వస్తాను అనటం లేదు. వస్తుంటాను అంటోంది! అదృష్టం ఏమిటంటే – ‘రేపు నేను రావటం లేదు’ అని ఇప్పటివరకైతే తను అనలేదు.మెలానియా తిరిగి తన గదిలోకి వెళ్లిపోయింది. నాతో ఏం చెప్పాలని వచ్చిందో, ఏం చెప్పకూడదని అనుకుందో ఆమె చెబితే తప్ప నాకు ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. ‘‘గుడ్ మార్నింగ్ మిస్టర్ ప్రెసిడెంట్...’’అంటూ జేడీ వాన్స్ వచ్చి కూర్చున్నాడు. అతడు మనిషిలా లేడు. మంచు ముద్దలా ఉన్నాడు! అతడి వాలకం చూస్తుంటే బయటి ఉష్ణోగ్రతలు జీరోకు పడిపోయి ఉంటాయని అనిపిస్తోంది. వాన్స్ నా వైస్ ప్రెసిడెంట్. క్యాపిటల్ హిల్‌లో రేపు నాతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. నా జీవితానికి పట్టిన మరొక అదృష్టం అతడు.వాన్స్ నన్ను ‘ఇడియట్’ అన్నాడు. ‘నేనెప్పటికీ ట్రంప్‌ను ఇష్టపడను’ అన్నాడు.‘ట్రంప్ ఒక చెత్త వెధవా లేక అమెరికన్ హిట్లరా అన్నది తేల్చుకోలేకపోతున్నాను’ అన్నాడు. చివరికి నా రన్నింగ్ మేట్‌గా వచ్చేశాడు. అభిప్రాయాలు మార్చుకునే వాళ్లే నిజమైన స్నేహితులు. జీవితమంతా ఒకే అభిప్రాయంతో ఉండేవారు భార్యలు లేదా శత్రువులు. ‘‘చెప్పండి మిస్టర్ వైస్ ప్రెసిడెంట్! వెచ్చగా ఏమైనా సేవిస్తారా?’’ అని అడిగాను. ‘‘వెచ్చగా కాదు, వేడిగా ఏమైనా తెప్పించండి ప్లీజ్...’’ అన్నాడు వాన్స్, అరిచేతుల్ని ఒరిపిడిగా రుద్దుకుని, చెవులపై బిగింపుగా అద్దుకుంటూ. లోపల పింగాణీ కప్పుల చప్పుడవుతోంది! మెలానియా సూప్‌ను సిద్ధం చేయించే పనిలో పడినట్లుంది.‘‘మిస్టర్ ప్రెసిడెంట్! నేషనల్ వెదర్ సర్వీస్ రిపోర్ట్ చూశారా? జనవరి 20న చలి, మంచు, ఈదురు గాలులు అంటున్నారు. ఉష్ణోగ్రతలు కనుక 7 డిగ్రీల కంటే కిందికి పడిపోతే, రోనాల్డ్ రీగన్ తర్వాత మీదే కోల్డెస్ట్ ఇనాగరే షన్ అవుతుంది...’’ అని నవ్వారు వాన్స్. 2016 ఇనాగరేషన్‌లో 48 డిగ్రీల వేడిలో చెమటలు తుడుచుకోవటం గుర్తొచ్చి నేనూ నవ్వాను. ‘‘మేడమ్ ఫస్ట్ లేడీకి నా వైఫ్ ఉష తన బెస్ట్ విషెస్ చెప్పమంది...’’ అంటూ, తను తెచ్చిన పూలబొకేను టేబుల్ మీద ఉంచాడు వాన్స్. మెలానియాకు ‘ఫస్ట్ లేడీ’ అనిపించుకోవటం ఇష్టం లేదు. ఫస్ట్ లేడీ అనిపించుకోవాలని తనకు అనిపించేలా నేను ఏనాడూ బిహేవ్ చేయలేదని ఆమె కంప్లైంట్! కంప్లైంట్లు కూడా జీవితం ప్రసాదించే అదృష్టాలే. అయితే అవి పరీక్షించుకోవలసిన అదృష్టాలు కావచ్చు! -
‘స్వింగ్’ ఓటరే కింగ్ మేకర్!
హస్తిన ఓటర్లు వైవిధ్యమైన తీర్పు ఇస్తుండడంతో లోక్‌సభ, శాసనసభ ఎన్ని కల్లో పూర్తి భిన్నమైన ఫలితాలు వస్తు న్నాయి. ‘మినీ ఇండియా’గా పిలవబడే దేశ రాజధాని ఢిల్లీలో అన్ని వర్గాలు ఎంతో విజ్ఞతతో స్థానిక అంశాల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికను, జాతీయ అంశాల ఆధారంగా పార్లమెంట్ ఎన్నికలను శాసి స్తున్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధిపత్యం కొనసాగిస్తున్న వేళ... ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండనుందో ‘పీపుల్స్ పల్స్’ అధ్యయనం చేయగా దాదాపు 30 శాతం మంది ఓటర్లు ఆయా ఎన్నికల్లో భిన్నంగా స్పందిస్తుండడంతో ఈ స్వింగ్ ఓటర్లే రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారనున్నారని తేలింది.ఢిల్లీలో 2013 అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ మార్పులకు తెరలేపాయి. అప్పుడు మొదటిసారిగా బరిలోకి దిగిన ఆప్ ఊహించని విధంగా 30 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు సవాలు విసిరింది. అప్పటికే మూడు పర్యా యాలు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో 33 శాతం ఓట్లతో పెద్ద పార్టీగా నిలిచినా అధికారం చేపట్టలేకపోయింది. వరుసగా మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ 25 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీకి 4 స్థానాలు తక్కువగా పొంది 32 స్థానాలకు పరిమితమై అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో 46 శాతం ఓట్లతో మొత్తం 7 ఎంపీ స్థానాల్లో గెలిచింది. ఆప్ అసెంబ్లీ ఎన్నికల కంటే 3 శాతం అధికంగా 36 శాతం ఓట్లు పొందినా ఒక్క స్థానం కూడా సాధించ లేదు. కాంగ్రెస్ 15 శాతం ఓట్లే పొందింది. 2015 అసెంబ్లీ ఎన్ని కలతో పోలిస్తే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ భారీగా 36 శాతం ఓట్లు కోల్పోగా, బీజేపీ 25 శాతం, కాంగ్రెస్ 13 శాతం ఓట్లు అధికంగా పొందాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తిరిగి 7 స్థానాల్లో గెలిచింది. 2020 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నుండి చెరో 18 శాతం ఓట్లు చీల్చిన ఆప్ 2019లో తాను కోల్పో యిన 36 శాతం ఓట్లను తిరిగి పొంది అధికారం చేపట్టింది. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ 30 శాతం ఓట్లను నష్టపోగా, బీజేపీ 16 శాతం ఓట్లు ఎక్కువ సాధించి మళ్లీ మొత్తం 7 స్థానాలనూ గెల్చుకుంది. ఒక్క ఎంపీ సీటూ రాకపోయినా కాంగ్రెస్ 15 శాతం ఓట్లు అధికంగా పొందింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భిన్నంగా స్పంది స్తున్న దాదాపు 30 శాతం మంది ఢిల్లీ ఓటర్లే ఆప్‌కు కీలకంగా మారుతున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అగ్రవర్ణ ఓటర్ల గణాంకాలను అధ్యయనం చేస్తే... 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 75 శాతం వీరి మద్దతు పొందిన బీజేపీ 2020 ఎన్నికల్లో 54 శాతానికి పరిమితం అయ్యింది. కాంగ్రెస్‌కు 2019లో అగ్రవర్ణాల మద్దతు 12 శాతం లభించగా, 2020లో అది 3 శాతానికి పడిపోయింది. మరోవైపు ఆప్‌కు 2019లో 13 శాతమే మద్దతివ్వగా, 2020లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి 41 శాతం మద్దతిచ్చారు.ఓబీసీ ఓటర్ల తీర్పును పరిశీలిస్తే... 2019లో బీజేపీకి 64 శాతం మంది మద్దతివ్వగా 2020 ఎన్నికలు వచ్చేసరికి అది 50 శాతానికి పడిపోయింది. 2019లో 18 శాతం మంది ఓబీసీలు కాంగ్రెస్‌కు మద్దతివ్వగా 2020లో 16 శాతమే మద్దతిచ్చారు. ఆప్‌కు 2019లో ఓబీసీల మద్దతు 18 శాతమే లభించగా, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 49 శాతం మద్దతు సంపాదించగలిగింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ 29 శాతం ఓబీసీ ఓట్లు కోల్పోయింది.దళిత ఓటర్లు 2019 లోక్‌సభ ఎన్నికల్లో 44 శాతం బీజేపీకి మద్దతివ్వగా 2020 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి 25 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ 2019లో 20 శాతం ఓట్లు పొందగా, 2020లో 6 శాతానికి పరిమితమైంది. 2019లో 22 శాతం దళితుల మద్దతు పొందిన ఆప్ 2020లో ఏకంగా 69 శాతం దళితుల మద్దతు పొందింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ 41 శాతం దళితుల ఓట్లను కోల్పోయింది. ముస్లిం ఓటర్ల గణాంకాలను పరిశీలిస్తే... 2019 లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింల మద్దతు బీజేపీకి 7 శాతం, ఉండగా, 2020 అసెంబ్లీ ఎన్నికల నాటికి అది 3 శాతానికి దిగజారింది. కాంగ్రెస్‌కు 2019 ఎన్నికల్లో 66 శాతం ముస్లింలు మద్దతివ్వగా, 2020 నాటికి అది 13 శాతానికి పరిమితమైంది. ఆప్‌కు 2019లో 28 శాతం ముస్లింలు మద్దతివ్వగా, 2020 నాటికి భారీగా 83 శాతం ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ 34 శాతం ముస్లింల మద్దతు కోల్పోగా, అవి 11 శాతం బీజేపీకి, 21 శాతం కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఆప్, కాంగ్రెస్ ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తుండడంతో త్రిముఖ పోటీలో ప్రధానంగా ముస్లిం, దళిత ఓట్ల చీలికతో ఆప్‌కు నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆప్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్థిక, సామాజిక వర్గాలవారీగా ఓట్లను పరిశీలిస్తే... పేదల్లో 37 శాతం ఓటర్ల మద్దతును ఆప్ కోల్పోగా, వారిలో 19 శాతం బీజేపీకి, 17 శాతం కాంగ్రెస్ వైపు మళ్లారు. మధ్యతరగతి కుటుంబాల ఓటర్ల లెక్కలను గమనిస్తే ఆప్ 21 శాతం మద్దతు కోల్పోగా, అందులో బీజేపీకి 11 శాతం, కాంగ్రెస్‌కు 12 శాతం లభించింది.రాజధాని ఢిల్లీలో పరిపాలన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండడంతో ఓటర్లు కూడా పరిణతితో కూడిన తీర్పు ఇస్తు న్నారు. ‘పీపుల్స్ పల్స్’ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించిన ప్పుడు ఢిల్లీకి కేజ్రీవాల్, భారత్‌కు మోదీ నాయకత్వం కావాలని బలంగా కోరుకుంటున్నట్టు కనిపించింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సర్వేలో ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎవరికి మద్దతిస్తారని’ ఓటర్లను ప్రశ్నించగా ఆప్‌కు 49 శాతం, బీజేపీకి 33 శాతం మంది ఆమోదం తెలపడంతో ఈ రెండు పార్టీల మధ్య అప్పుడే 16 శాతం వ్యత్యాసం కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు ఇప్పటి వరకు అనుకూలంగా ఉంటున్న 30 శాతం స్వింగ్ ఓట్లను బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 5 శాతం చీలిస్తే ఆప్ 44 శాతానికి పరిమితమవడంతో పాటు బీజేపీ 44 శాతానికి పెరిగి ఎన్నికలు పోటాపోటీగా జరుగుతాయి. గతంలో వలే బీజేపీ, కాంగ్రెస్‌ల నుండి చెరో 15 శాతం ఓటింగ్‌ను తమకు అనుకూలంగా మల్చుకుంటే హస్తిన మరోసారి ఆప్ హస్తగతమవుతుంది. ఆప్‌కు అగ్నిపరీక్షగా మారిన కీలకమైన 30 శాతం స్వింగ్ ఓట్లను ఎప్పటిలాగే తమ వైపుకు తిప్పుకోగలిగి తేనే మరోసారి ఆ పార్టీ అందలమెక్కుతుంది.జి. మురళీ కృష్ణ వ్యాసకర్త పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థలో సీనియర్ రిసెర్చర్ -
తొలితరం రాజకీయ దిగ్గజం : ఆసక్తికర సంగతులు
భారత స్వాతంత్య్రోద్యమ తొలితరం మేరునగధీరుల్లో మహదేవ గోవింద రనడే ఒకరు. 1943లో ఆయన శత జయంతి కార్యక్రమంలో డా‘‘ బీఆర్అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘రనడే కేవలం ఆజానుబాహుడు మాత్రమే కాదు; విశాల భావాలు కలిగిన వారూ, ప్రజల పట్ల సమదృష్టిని కలిగిన వారు కూడా’ అని ప్రశంసించారు. ఓరిమి కలిగిన ఆశావాది.తన జీవిత కాలంలో‘వక్తృత్వోత్తేజక సభ’, ‘పూర్ణ సార్వజనిక సభ’, ‘మహారాష్ట్ర గ్రంథోత్తేజక సభ’, ‘ప్రార్థనా సమాజం’ లాంటి సంస్థలను స్థాపించారు. తన సాంఘిక, మత సంస్కరణల ఆలోచనలకు అనుగుణంగా ‘ఇందు ప్రకాష్’ అనే మరాఠీ–ఆంగ్ల దినపత్రికను నిర్వహించారు.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్‌లో 1842 జనవరి 18న జన్మించారు. కొల్హాపూర్‌లోని ఒక మరాఠీ పాఠశాలలో చదివారు. తర్వాత ఓ ఆంగ్ల మాధ్యమ పాఠశాలకు మారారు. 14 ఏళ్ల వయసులో బాంబేలోని ఎల్ఫిన్స్టన్ కళాశాలలో చేరారు. బాంబే విశ్వవిద్యాలయం మొదటి విద్యార్థుల్లో ఆయనా ఒకరు. 1867లో ఎల్ఎల్బీ పట్టా పుచ్చు కున్నారు. 1871లో పూనాలో సబార్డినేట్ జడ్జిగా నియమితులయ్యారు. ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనించిన ఆంగ్లేయులు 1895 దాకా ఆయనను బాంబే హైకోర్టుకు పంపే పదోన్నతికి అడ్డు పడుతూ వచ్చారు. ఆయన కొన్ని పాశ్చాత్య భావాలకు ప్రభావితులయ్యారు.అందరికీ విద్య, సమానత్వం, మానవత్వం వంటివి ఇందులో ప్రధాన అంశాలు. మత పరంగా హిందూమతంలో ఆయన చేయాలనుకున్న సంస్కరణలు ప్రార్థనా సమాజం స్థాపించడానికి ప్రేరణ. గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర తిలక్ వంటి స్వాతంత్య్ర సమర యోధులకు రాజకీయ గురువుగా పేరు పొందారు. తుదకు 1901 జనవరి 16న తుదిశ్వాస విడిచారు. నేటి స్వేచ్ఛా భారతానికి దారులు వేసిన ఆయన చిరస్మరణీయులు.– యం. రాం ప్రదీప్; జేవీవీ సభ్యులు, తిరువూరు(రేపు మహాదేవ గోవింద రనడే జయంతి) -
ఉక్రెయిన్ యుద్ధంలో అంతిమ క్రీడలు
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనుండగా, రష్యా–ఉక్రెయిన్లు... యుద్ధంలో చివరి దశ క్రీడలు సాగిస్తున్నాయి. ట్రంప్ ఈ సమస్య పరిష్కారానికి తన ప్రతినిధిగా జనరల్ కీత్ కెల్లోగ్ అనే అనుభవజ్ఞుడిని నియమించారు. ట్రంప్ మొదటి అధ్యక్ష కాలంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారైన కెల్లోగ్, ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారంపై తన ఆలోచనలను ఇప్పటికే వివరించారు. ఈ పరిణామాల దృష్ట్యా రష్యా, ఉక్రెయిన్లు చర్చలకు సమ్మతిస్తూనే, అవి జరిగేలోగా యుద్ధంలో వీలైనంత పైచేయి కోసం ప్రయత్నిస్తున్నాయి.చర్చలు అంటేనే ఎవరి షరతులు వారు విధి స్తారు. మధ్యవర్తి అయినవారు ఇరుపక్షాల మధ్య రాజీ కోసం ప్రయత్నిస్తూనే, తమవైపు నుంచి కొన్ని ప్రతిపాద నలు చేస్తారు. వాటిపై చర్చల క్రమంలో ఒక రాజీ కుదురుతుంది. అయితే ప్రస్తుత అంశంపై చర్చలు త్వరలోనే ప్రారంభం కావచ్చు గానీ, రాజీ ఎప్పటికి జరిగేదీ ఎవరూ చెప్పలేరు. వంద రోజులన్న జనరల్ కెల్లోగ్ అయినా! ఉక్రెయిన్ తూర్పున తమ సరిహద్దుల వెంట గల డోన్ బాస్ ప్రాంతాన్నంతా పూర్తిగా తమకు వదలి వేయటం, 2014 నుంచితమ ఆక్రమణలో గల క్రిమియా దీవిని తిరిగి కోరక పోవటం, ఉక్రె యిన్ యూరోపియన్ యూనియన్‌లో చేరినా, ఎప్పటికీ నాటోలో చేరక పోవటం అన్నవి రష్యా షరతులు. బ్లాక్ సీలో గల క్రిమియా, ముఖ్యంగా చలికాలంలో ఆ సముద్రం ఘనీభవించదు గనుక నౌకా రవాణాకు రష్యాకు తప్పనిసరి అవసరం. ఉక్రెయిన్ నాటోలో చేరినట్ల యితే రష్యా భద్రతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. సోవియట్ యూనియన్, వారి నాయకత్వాన ఉండిన వార్సా సైనిక కూటమి 1991లో రద్దయిన తర్వాత, అమెరికన్ నాటో కూటమి మాత్రం మరింత విస్తరిస్తూ, రష్యా సరిహద్దునే గల ఉక్రెయిన్ను కూడా చేర్చుకొన జూస్తుండటం మాస్కో భయానికి కారణం. తక్షణం యుద్ధం ఆగితేనే చర్చలురష్యా దృష్టి నుంచి గల పరిస్థితులు ఇవి కాగా, ఉక్రెయిన్ షరతులు రెండు. ఒకటి–క్రిమియాను, ప్రస్తుత యుద్ధంలో రష్యా ఆక్ర మించిన డోన్ బాస్ భూభాగాలను తమకు తిరిగి అప్పగించటం. రెండవది–నాటోలో చేరే స్వేచ్ఛ తమకు ఉండటం. డోన్ బాస్‌లో రష్యా ఇప్పటికి 20 శాతానికి పైగా భాగాన్ని ఆక్రమించింది. ఇక ట్రంప్ ప్రతినిధిగా జనరల్ కెల్లోగ్ సూచిస్తున్నది, మొదట యుద్ధం వెంటనే ఆగిపోవాలి. ఇరు సైన్యాలు ఎక్కడివక్కడ నిలిచి పోవాలి. తర్వాత చర్చలు ఆరంభమవ్వాలి. రష్యా ఆక్రమణలో గల భూభా గాలు కనీసం కొన్నింటిని వదులుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధపడాలి. దానికి నాటో సభ్యత్వ విషయం నిరవధికంగా, కనీసం 20 ఏళ్లపాటు, వాయిదా వేయాలి. ఇందుకు రష్యా అంగీకరించనట్లయితే ఉక్రెయి న్కు తమ సహాయం కొనసాగిస్తారు. ఉక్రెయిన్ కాదంటే వారికి అన్ని సహాయాలూ నిలిపివేస్తారు.వీటన్నింటిపై చర్చలు ఏ విధంగా పురోగమించవచ్చునన్నది అట్లుంచి కొన్ని విషయాలు గమనించాలి. యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతునిస్తూ రష్యా ఆక్రమణలో గల డోన్ బాస్ ప్రాంతాన్ని, క్రిమియాను వదలుకునేందుకు జెలెన్ స్కీ సిద్ధపడవలసి ఉంటుందని సలహా ఇస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని తిరిగి ఉక్రెయిన్ స్వాధీనం చేసేందుకు రష్యా ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించ బోదని, అటువంటి షరతు వస్తే యుద్ధాన్ని కొనసాగించగలదని, అపుడు అమెరికా కూటమి ఎంత సహాయం చేసినా రష్యా మరిన్ని భూభాగాలు ఆక్రమిస్తూ పోగలదని, ఉక్రెయిన్ పక్షాన తాము ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనే అవకాశం లేదని వారికి తెలుసు. తామూ, అమె రికా ఇప్పటికే ఎంత ఆధునిక ఆయుధాలనిచ్చినా రష్యాను ఉక్రెయిన్ నిలువరించలేక పోతున్నది. ఇప్పటికే రష్యా ఆక్రమణలో గల ప్రాంతా లను, క్రిమియాను వదులుకునేందుకు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్న సూచనలున్నాయి. కానీ, రష్యా డిమాండ్ చేస్తున్నట్లు డోన్ బాస్ ప్రాంతం యావత్తునూ వదిలేందుకు ససేమిరా అంగీకరించక పోవచ్చు. అట్లాగే, తాము నాటోలో ఎన్నటికీ చేరక పోవటాన్ని.ఇందుకు బహుశా ట్రంప్ కూడా సమ్మతించకపోవచ్చు.ట్రంప్ గెలుపుతో కొత్త చిక్కులు!అమెరికా, యూరప్‌లకు కూడా కొన్ని ఆందోళనలున్నాయి. సోవి యట్ యూనియన్ పతనం తర్వాత 10–15 సంవత్సరాలకు తమ అపారమైన సహజ వనరుల బలంతో పుతిన్ నాయకత్వాన తిరిగి పుంజుకోవటం ప్రారంభించిన రష్యా.. చైనా, ఇండియా తదితర అనేక దేశాలతో మైత్రీ సంబంధాల అభివృద్ధితో ఆర్థికంగా, ఆయుధ బలం రీత్యా ఈసరికి శక్తిమంతంగా మారింది. అటువంటి స్థితిలో పుతిన్ ఉక్రెయిన్‌తో ఆగక తమకు కూడా సవాలుగా మారగలరన్నది అమెరికా, యూరప్‌ల సందేహం. అందువల్ల రష్యాను ఉక్రెయిన్ యుద్ధంలో ఓడించదలచారు గానీ అదీ సాధ్యం కాదని ఆంక్షల వైఫ ల్యంతో, తమ ఆయుధాల వైఫల్యంతో అర్థమైంది. అందుకే ఇపుడు రాజీ ప్రయత్నాలను సమర్థిస్తున్నారు. అనూహ్యంగా ట్రంప్ గెలుపు వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. రష్యా పట్ల కొంత మెతకదనం కలవాడనే పేరు తన మొదటి హయాంలోనూ కలిగి ఉండిన ఆయన, ప్రస్తుత యుద్ధం వల్ల అందరికీ నష్టమేనంటూ అసలు యుద్ధాన్నే వ్యతిరేకించారు. జెలెన్స్కీ వైఖరిని విమర్శించి ఆయన వాదనలను కొట్టివేశారు. ఉక్రెయిన్‌కు బైడెన్ ప్రభుత్వం ఆయుధాలు, నిధులు ఇవ్వటాన్ని తప్పుపట్టారు. అంతటితో ఆగక నాటోను, యూరో పియన్ యూనియన్ను సైతం వేర్వేరు విషయాలపై తప్పుపట్టడం మొదలు పెట్టారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) అనే తన నినాదానికి అనుగుణంగా ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వంటి దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు పెట్టించగలమని ప్రకటించారు. ఐరోపా దేశాలకు అమెరికా భయం!ఈ మార్పులను గమనించి, ఉక్రెయిన్ సందర్భంలోనే గాక ఇతరత్రా కూడా జంకిన యూరప్ నేతలు ట్రంప్‌కు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల ప్రచార సమయంలోనే కీడెంచి మేలెంచమన్నట్లు, ట్రంప్ రాక తర్వాత అమెరికా భాగస్వామ్యం పరిమితమైనప్పటికీ ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక సహాయాలు అదే స్థాయిలో కొనసాగించాలని తీర్మానాలు చేశారు. కానీ, తమ సైనిక, ఆర్థిక శక్తి రెండూ క్రమంగా బలహీన పడుతున్నందున అది సాధ్యం కాదని గ్రహించి రాజీ ఆలోచనలు మొదలు పెట్టారు. పాశ్చాత్య దేశాల నుంచి ఇప్పటికి ఉక్రెయిన్‌కు సుమారు 130 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందగా అందులో సగం అమెరికాదే. ఆయుధాలతో పాటు ఆర్థిక సహాయాన్ని ట్రంప్ నిలిపివేస్తే ఉక్రెయిన్ అక్షరాలా కుప్పకూలుతుంది. ఇది యూరోపియన్ దేశాలను భయపెడుతున్న అతి పెద్ద విషయం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఉభయుల మధ్య రాజీని కుదర్చటం కెల్లోగ్కు సమస్య కాబోదు. బేరసారాలకు ఇరు దేశాల ఎత్తుగడపోతే, పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారే అవకాశా లున్నట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రచార సమయంలోనే అను మానించిన జెలెన్స్కీ రష్యాతో చర్చల సమయంలో పై చేయి సాధించలేక పోయినా కనీసం సమ ఉజ్జీ అయేందుకు కొన్ని ఎత్తుగడలను అనుసరించారు. తూర్పున విశాలమైన భూభాగాలను ఆక్రమించిన రష్యా, పోక్రొవ్ స్కీ అనే కీలకమైన నగరంపై దృష్టి కేంద్రీకరించింది. దానిని ఆక్రమిస్తే, ఆ మొత్తం ప్రాంతానికి గుండెకాయ వంటి కూడలి కేంద్రం తన అధీనమై ఉక్రెయిన్ తీవ్రంగా బలహీనపడుతుంది. ప్రస్తుతం ఆ నగరానికి కొద్ది కిలోమీటర్ల దూరానికి చేరిన రష్యన్ సేనలు, చర్చల లోగా దాని స్వాధీనానికి భీకర యుద్ధం సాగిస్తు న్నాయి. ఉక్రెయిన్ ఆ నగర రక్షణకు పోరాడుతూనే, రష్యాతో ఉత్తర సరిహద్దున గల కుర్స్క్ ప్రాంతంలోకి అకస్మాత్తుగా చొచ్చుకు పోయింది. చర్చలు జరిగినపుడు ఈ రెండు నగరాలు బేరసారాల కోసం ఉపయోగపడాలన్నది ఇరువురి ఎత్తుగడ. ఇటువంటి చివరి దశ యుద్ధ క్రీడలే మరికొన్ని సాగుతున్నాయి. రష్యా ఉత్తర కొరియన్ సేనలను రప్పించటం, ఉక్రెయిన్ యూరప్ సహాయంతో తన రాజ కీయ బేరసారాల శక్తిని పెంచుకోజూడటం, రష్యా పైకి దీర్ఘ శ్రేణి క్షిపణుల ప్రయోగం వంటివన్నీ అవే. మొత్తానికి ఈ చివరి దశ క్రీడ లకు జనవరి చివరిలోగా కొద్ది సమయమే మిగిలి ఉంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు