జోన్ల కథ మళ్లీ మొదటికొచ్చింది. పాలనలో మూడంచెలుగా ఉన్న జోన్ల విధానాన్ని రద్దు చేసి రెండంచెల విధానాన్ని అమలు చేసేందుకు మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగానే కసరత్తు చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు సవ రించాలని భావించింది. ఈ మేరకు అవసరమైన అధ్యయనం చేసి నివేదికను అందించే బాధ్యతను ఉన్నతాధికారులకు అప్పగించింది. రెండు నెలలు గడిచాక.. తీరా కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా కొత్త జోన్లను ఏర్పాటు చేసే దిశగా ఇప్పుడు సమాలోచనలు చేస్తోంది. దీంతో జోన్లపై మరింత సంక్లిష్టతకు తెర లేపిన ట్లయింది. తెలంగాణలో ప్రస్తుతం (అయిదు, ఆరు) రెండు జోన్లున్నాయి. ఇవి పాత పది జిల్లాల భౌగోళిక సరిహద్దులకు అనుగుణంగా నిర్దేశించినవి. దీని ప్రకారం అయిదో జోన్‌లో కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, ఆరో జోన్‌లో హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమల్లోకి వచ్చిన పాత జోన్ల ప్రకారమే ఉద్యోగుల నియామకాలు, బదిలీలు జరిగాయి. కానీ జోన్లను రద్దు చేస్తే.. తలెత్తబోయే పర్యవసనాలు, సమస్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసినట్లయింది. దీంతో ఇప్పటివరకు జరిగిన కసరత్తును పక్కనబెట్టిన ప్రభుత్వం జోన్లను సైతం పునర్వవ్యస్థీకరించే దిశగా ఆలోచన చేస్తోంది.