కృష్ణా నది నీటి కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాల వాటాపై సోమవారం నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలోని బ్రిజేశ్ ట్రిబ్యునల్‌లో వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే ఏపీ తమ నీటి అవసరాల చిట్టాను ట్రిబ్యునల్ ముందుంచగా తెలంగాణ ప్రభుత్వం తమ నీటి అవసరాలతోపాటు ఏపీకి వాటా తగ్గించాలని వాదనలు వినిపించనుంది. ఏపీకి 155 టీఎంసీల నీటి వాటా సరిపోతుందని, ఆ రాష్ట్రానికి ఇప్పటికే ఉన్న 512 టీఎంసీల వాటాలో కోత పెట్టాలని డిమాండ్ చేయనుంది. ఏపీ సమర్పించిన అఫిడవిట్‌పై ఈ మేరకు వేసిన రిజాయిండర్‌లో పేర్కొన్న అంశాల ఆధారంగా వాదించనుంది. రాష్ట్ర వాదనల దృష్ట్యా ఐదు రోజుల కిందటే రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో చర్చలు జరిపారు. ప్రధానంగా కృష్ణా డెల్టాకు నీటి సరఫరాలో కోత పెట్టే అంశంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.