రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాతో పడే భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విద్యుత్ సంస్థలకు హామీ ఇచ్చారు. జనవరి ఒకటి నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలని, ఈ ఏడాది బడ్జెట్ నుంచే నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్ నుంచి విద్యుత్ సబ్సిడీలకు అదనపు కేటాయింపులు చేస్తామన్నారు. దీనితోపాటు వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులను కూడా ప్రభుత్వం నూటికి నూరు శాతం చెల్లిస్తుందని చెప్పారు. వచ్చే వర్షాకాలం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఎత్తిపోతలు పనిచేస్తాయని, అందుకు సిద్ధంగా ఉండాలని విద్యుత్ అధికారులకు సూచించారు. క్రమశిక్షణతో నడుస్తున్న విద్యుత్ సంస్థలను కాపాడుకుంటామన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో 24 గంటల విద్యుత్ అంశంపై కేసీఆర్ సమీక్షించారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో లాభనష్టాలు, సవాళ్లపై చర్చించారు.