జల్లికట్టుకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యం అద్భుతమని.. అయితే ఆ విషయం కోర్టులో ఉన్నందున దాని గురించి ఇప్పుడేమీ మాట్లాడలేమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తనను కలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి వీలైన అన్ని రకాలుగా సాయం చేస్తామని తెలిపారు. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు వ్యాప్తంగా భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. చెన్నై మెరీనా బీచ్‌లో కూడా నిరనసకారులు మూడు రోజుల నుంచి అక్కడే ఉండి జల్లికట్టుకు అనుమతి వస్తే తప్ప అక్కడినుంచి కదిలేది లేదంటున్నారు. దాంతో స్పందించిన సీఎం పన్నీర్ సెల్వం హుటాహుటిన ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ జారీచేయాలని కోరారు.