12వ పీఆర్‌సీ కమిషన్ నియమించాలి
రాయచోటి : 12వ పీఆర్‌సీ కమిషన్ నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ డిమాండ్ చేశారు. రాయచోటిలో యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా ఆఫీసు బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు 11వ పీఆర్‌సీ బకాయిలు, డీఏలు, సరెండర్ లీవులు తదితర ఆర్థిక పరంగా బాకీ పడిందన్నారు. బకాయిలు చెల్లించాలని ఉద్యమాలు చేసిన సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న నేటి పాలకులు.. తాము అధికారంలోకి వస్తే అవన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చి నేడు పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. టెట్, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్య పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించామన్నారు. డిసెంబర్ 9,10వ తేదీలలో డివిజన్ కేంద్రంలో నిరసన ర్యాలీ, డిసెంబర్ 18న డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా, 2026 జనవరి 4న భీమవరంలో రాష్ట్రస్థాయి ర్యాలీ, జనవరి 29న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్, జాబీర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, జిల్లా సహాయ అధ్యక్షుడు శివారెడ్డి, మహిళా సహాధ్యక్షురాలు హేమలత, జిల్లా కోశాధికారి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శులు పి.వెంకట సుబ్బయ్య, వై.శ్రీధర్‌రెడ్డి, ఎ.అక్రంభాష, భాస్కర్‌రెడ్డి, ఆదినారాయణ, దావుద్దీన్, పురం వెంకటరమణ, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ సురేంద్ర రెడ్డి, ప్రచురణల విభాగం కన్వీనర్ కె.విజయ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ శివారెడ్డి, కిఫాయత్ పాల్గొన్నారు.
డిమాండ్లు : సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలి. జూన్‌లో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి. ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి, అలాగే రెగ్యులర్ చేయాలి. వంద రోజుల ఎస్‌ఏస్సీ యాక్షన్ ప్లాన్‌లో సెలవు దినాలు మినహాయించాలి. సింగిల్ టీచర్ ప్రాథమిక పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలి. పీఎస్ హెచ్‌ఎం, క్లస్టర్ టీచర్స్ సమస్యలు పరిష్కరించాలి. పరీక్షల విధానంలో మార్పులు చేయాలి. రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్‌క్యాస్మెంట్ ఇతర బకాయిలు చెల్లించాలి.


