హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలి
● అచలానంద ఆశ్రమం పీఠాధిపతి
శ్రీ విరజానందస్వామి
● హిందూ సమ్మేళనం విజయవంతం
బ్రహ్మంగారిమఠం : సమాజ శ్రేయస్సు కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని తోట్లపల్లె అచలానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విరజానందస్వామి పేర్కొన్నారు. ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మంగారిమఠం మండలం నుంచి దాదాపు 3 వేల మంది హిందూ సోదరీ, సోదరులు తరలి వచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విరజానందస్వామి మాట్లాడుతూ పురాణాలు, ఇతిహాసాలు, సంప్రదాయాల ప్రభావంతో సనాతన ధర్మం ప్రారంభమైందని, ఈ సనాతన ధర్మం ప్రతి రూపమే హిందూ సమ్మేళనం అన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం పాటించినప్పుడే సమాజం బాగుంటుందన్నారు. ఇప్పటికే కొంత మంది వారి విధానాల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అందులో యువత ముందుకు రావడంతో వారి విధానాలకు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి విధానాలు మంచివి కావన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఉన్న పుణ్యస్థలంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శ్రీఈశ్వరీదేవిమఠం మఠాధిపతి శ్రీ వీరకుమారస్వామి మాట్లాడుతూ భారత దేశ సమైక్యతకు ప్రతి రూపం హిందూ సమ్మేళనం అన్నారు. ప్రతి మనిషి వారి విధానాలు సక్రమంగా అలవర్చుకోవాలన్నారు. అప్పుడే సంప్రదాయం ఉంటుందన్నారు. సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత కార్యనిర్వాకులు యుగంధర్, రాష్ట్ర సేవాసమితి మండల కార్యనిర్వాకురాలు బయన బోయిన రమాదేవి మాట్లాడారు. హిందూ సమ్మేళనానికి సహకరించిన వారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, పిల్లలు, పుర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వర్షం సైతం లెక్కచేయకుండా..
హిందూ సమ్మేళనానికి ఆదివారం వర్షం సైతం లెక్కచేయకుండా మండలంలోని పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ముందుగా మఠం నాలుగు రోడ్ల కూడలి నుంచి సభా స్థలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలి


