ఆధ్యాత్మిక ధామం.. పరిశుద్ధ మందిరం
కలసపాడు : సగిలేరు ఒడ్డున నూతనంగా నిర్మించిన తెలుగుగంగ అక్విడిక్ట్ కాలువ పక్కన.. ఠీవీగా నిలబడి ఉన్న ఆ నిర్మాణం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడి ప్రశాంతత వారిని లోనికి రమ్మని పిలుస్తుంది. లోపలికి వెళితే గుడి అందం ఔరా అనిపిస్తుంది. అపురూపమైన నిర్మాణశైలి మనసుకు హత్తుకుంటుంది. ఆధ్యాత్మికతతో మరో లోకంలోకి తీసుకెళుతుంది. ఒకసారి సందర్శిస్తే మళ్లీ రావాలనిపిస్తుంది. ఆ నిలయమే కలసపాడులోని పరిశుద్ధ పరిపేతురు పరిపౌలు ఆలయం.
138వ ప్రతిష్టా మహోత్సవానికి సిద్ధం
కలసపాడు సగిలేరు ఒడ్డున పరిశుద్ధ పరిపేతురు పరిపౌలు ఆలయం అందానికి, ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది. చరిత్ర తెలుసుకుంటే ఔరా అనిపిస్తుంది. ఆలయంపై మరింత భక్తిని పెంచుతుంది. 137 ఏళ్లు పూర్తయిన ఆ అందం డిసెంబర్ 2వ తేదీ నాటికి 138వ ప్రతిష్టా మహోత్సవానికి సిద్ధమైంది. ఆధ్యాత్మిక నిలయం, చెక్కుచెదరని అందాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది తరలివస్తారనడం అతిశయం కాదు. కలసపాడు చుట్టుపక్కల ప్రార్థనలు చేసుకునేందుకు సరైన ఆలయం లేదని భావించిన ఇంగ్లాండ్‌కు చెందిన రెవ.అర్ధర్‌ఇన్‌మన్ ఆధ్వర్యంలో 1884లో నిర్మాణం ప్రారంభించారు. మూడేళ్ల నిర్మాణ పనుల అనంతరం అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దారు. 1887 డిసెంబర్ 3 నాటికి పూర్తయింది. ఈ సందర్భంగా ఏటా డిసెంబర్ 2, 3వ తేదీల్లో ప్రతిష్టా మహోత్సవాన్ని గుడి తిరునాలగా జరుపుతున్నారు. ఈ ఏడాది 138వ ప్రతిష్టా మహోత్సవం జరగనుంది. జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు ఉత్సవాలకు తరలి వస్తారు.
ఆకట్టుకునే ఇటుకల నిర్మాణం
ఆలయ నిర్మాణంలో వాడిన ఇటుకలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. స్థానికంగా దొరికే బంకమట్టితో ఇటుకలను తయారు చేశారు. వీటిని ఇసుక, సున్నం, బెల్లం, నీటికి లక్షల సంఖ్యలో కోడిగుడ్లను కలిపి గానుగ తిప్పి తయారు చేసిన గచ్చుతో నిర్మించారు. నునుపుదనం కోసం వేసే పైపూతలో కూడా గుడ్ల మిశ్రమాన్ని ఉపయోగించారు. ఆధునీకత ఉట్టిపడేలా టేకు, తాటి చెక్కలను వినియోగించారు. కేరళ పెంకులతో పైకప్పు నిర్మించారు. తలుపులు, కిటికీలు టేకుతో తయారు చేశారు. నిర్మాణదారుల పనితనంతో చూడగానే ఆకట్టుకునేలా పటిష్టంగా తయారైంది.
లక్షల్లో తరలిరానున్న భక్తులు
ఏటా గుడి తిరునాలకు లక్షల్లో భక్తులు తరలివస్తారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాక కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ప్రధాన కార్యక్రమమైన భోగి పండుగకు కనీసం లక్ష మందికి పైగా భక్తులు హాజరవుతుంటారు. 3వ తేదీన ఉదయాన్నే భక్తులు తలనీలాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. చర్చిలో భారీగా కానుకలు సమర్పించుకుంటారు.
రూట్ మ్యాప్ ఇది
గుడి తిరునాలకు వచ్చే భక్తులు రైలులో అయితే ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నుంచి రావచ్చు. గిద్దలూరు నుంచి కలసపాడుకు 33 కిలోమీటర్ల బస్సు సౌకర్యం ఉంటుంది. కడప జిల్లా కేంద్రం వరకు రైలులో వచ్చి అక్కడి నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలసపాడుకు బస్సులో రావచ్చు. బస్సులో ప్రయాణికులు కడప జిల్లాలోని బద్వేలు, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా చేరుకోవచ్చు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు మీదుగా బస్సులో కలసపాడుకు ప్రయాణించవచ్చు. నెల్లూరు జిల్లా నుంచి వచ్చే వారు ఉదయగిరి, బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా కలసపాడుకు చేరుకోవచ్చు. కర్నూలు జిల్లా నుంచి వచ్చేవారు నంద్యాల, గిద్దలూరు నుంచి కలసపాడుకు చేరుకోవచ్చు.
ప్రత్యేకతలు
ఆలయంలో నిర్మించిన గంటగోపురం, బాప్టీజం తొట్టి ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు. చర్చిలోపల ముఖద్వారం వద్ద బాప్టీజం తొట్టి ఉంది. ఆలయంలోకి వచ్చే భక్తులు తొట్టిలోని నీటిని చల్లుకుని బాప్టీజం పొందుతారు. సుదూర ప్రాంతాల నుంచి తమ పిల్లలకు బాప్టీజం ఇప్పించేందుకు భక్తులు ప్రతిష్టా మహోత్సవాలకు తరలివస్తారు. గుడి వెలుపల ఏర్పాటు చేసిన గంటను మరో ప్రత్యేకతగా పేర్కొన్నవచ్చు. గడియారం లేని రోజుల్లో సమయాన్ని తెలిపేందుకు అక్కడి గంటను మోగించేవారు. 40 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ గంట ఆ నాటి నుంచి భక్తులను ఆకట్టుకుంటూనే ఉంది. ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడు భక్తులు ఇబ్బందులు పడేవారు. దానిని దృష్టిలో ఉంచుకుని చర్చి కమిటీ సభ్యులు ఈ సంవత్సరం తిరునాలకు వచ్చే భక్తులకు వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా జర్మన్ టెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకు ప్రత్యేక స్నానపు గదులు నిర్మించారు.
ఆకట్టుకుంటున్న పరిశుద్ధ పరిపేతురు పరిపౌలు ఆలయం
138 ఏళ్ల చరిత్ర సొంతం
చెక్కు చెదరని అందం
2, 3వ తేదీల్లో గుడి తిరునాల
ఆధ్యాత్మిక ధామం.. పరిశుద్ధ మందిరం
ఆధ్యాత్మిక ధామం.. పరిశుద్ధ మందిరం


