అయ్యప్ప భక్తుడిపై దాడి చేసిన వారిని శిక్షించాలి
అట్లూరు : అయ్యప్పస్వామి భక్తుడిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి శిక్షించాలని అయ్యప్ప భక్తులు పేర్కొన్నారు. అట్లూరు క్రాస్ రోడ్డు సమీపాన అయ్యప్పస్వామి ఆలయం వెనుక వైపున ఉన్న స్థల విషయమై నవంబర్ 25న అయ్యప్ప మాలధారణలో ఉన్న నరసింహారెడ్డిపై రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆంజనేయులు, ఆయన కుమారుడు శివ దాడి చేశారు. ఈ ఘటనపై నామమాత్రంగా కేసు నమోదు చేశారని, దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆదివారం అట్లూరు క్రాస్‌రోడ్డు కడప–బద్వేలు ప్రధాన రహదారిపై సుమారు 100 మంది అయ్యప్పస్వామి భక్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మాలధారణలో ఉన్న అయ్యప్ప భక్తుడు నరసింహారెడ్డిని చంపేందుకు ప్రయత్నించినా హత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని, నిందితులను ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో బద్వేలు రూరల్ సీఐ కృష్ణయ్య, రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్, అర్బన్ ఎస్‌ఐ సత్యనారాయణ, స్థానిక డిప్యూటీ తహసీల్దార్ శిరీష ఆర్‌ఐ రమణ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణయ్య మాట్లాడుతూ కేసు నమోదు చేశామని, అరెస్టు కూడా చేస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
మిద్దె పైనుంచి పడి గర్భిణి మృతి
వేంపల్లె : వేంపల్లెలోని పుల్లయ్యతోటకు చెందిన వల్లెపు దేవి(22)అనే గర్భిణి మిద్దైపె నుంచి కళ్లు తిరిగి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు భర్త పవన్ కళ్యాణ్ తెలిపారు. స్థానిక పుల్లయ్య తోటలోని రెండవ అంతస్తులో గర్భణి వల్లెపు దేవి, పవన్ కళ్యాణ్ నివాసముంటున్నారు. ఆదివారం దేవి కుమార్తె హేమదర్శిని మూడేళ్ల చిన్నారి మిద్దైపె నుంచి కిందికి దిగుతుండగా పైకి పాపను రావాలని పిలిచే సమయంలో దేవికి కళ్లు తిరిగి పైఅంతస్తు నుంచి కింద పడింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గర్భణి అయిన దేవి అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. గర్భిణి దేవికి 10 రోజుల్లో ప్రసవం జరగాల్సి ఉండగా.. ఈ ప్రమాద ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
అయ్యప్ప భక్తుడిపై దాడి చేసిన వారిని శిక్షించాలి


