బాలల పండుగ.. ఉత్సాహం నిండగా!
● అలరించిన బాలోత్సవ్ ప్రదర్శనలు
● 5 వేల మంది విద్యార్థుల హాజరు
కొందరు నృత్యంలో అద్భుత అభినయం ప్రదర్శించారు.. మరికొందరు చిత్రలేఖనంలో చాతుర్యం చాటుకున్నారు.. ఇంకొందరు మట్టితో వ్యవసాయ పరికరాలు తయారు చేసి ఔరా అనిపించారు.. అంతేగాక ఫ్యాన్సీ డ్రస్సులతో చూడముచ్చటగా నడుస్తూ చూపరులను కట్టిపడేశారు.. వక్తృత్వ పోటీల్లో భాషా కౌశల్యాన్ని చాటి చెప్పారు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అంశంలో సృజనాత్మకతకు కాదేదీ అనర్హం అని చిన్నారులు నిరూపించారు.
కడప సెవెన్‌రోడ్స్ : కడప నగరంలో రెండు రోజుల పాటు జరిగిన బాలోత్సవం 3.0 ఆదివారం ఉత్సాహంగా ముగిసింది. మొదటి రోజు శనివారం మరియాపురం బాలికల హైస్కూల్ మైదానంలో నిర్వహించారు. తుపాను ప్రభావంతో వర్షం కురవడంతో ఆదివారం బాలాజీ నగర్‌లోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ విద్యార్థుల భావ వికాసానికి కృషి చేస్తున్న బాలోత్సవం నిర్వాహకులను అభినందించారు. జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులు ఇలా పోటీల్లో పాల్గొనడం ద్వారా ఆత్మస్థైర్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు. బాలోత్సవం అధ్యక్షుడు జి.గోపాల్ మాట్లాడుతూ నేటి విద్యావిధానంలో పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయట పడాలంటే బాలోత్సవాలు ఒక సాధనంగా ఉపయోగపడుతున్నాయని, అందుకే బాలోత్సవాలకు విశేష ప్రాచుర్యం వస్తోందని తెలిపారు. సర్వశిక్ష అభియాన్ ఈడీ బ్రహ్మయ్య, అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నిత్యానందరాజు, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ వీరేంద్ర, వైవీయూ ప్రొఫెసర్ మృత్యుంజయరావు, బుద్దిస్ట్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు పిల్లా కుమారస్వామిరెడ్డి, బాలోత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు నాగమునిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాహుల్, సమత కన్వీనర్ సునీత, యూటీఎఫ్ నాయకులు మహేష్ విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
మొత్తం 54 విభాగాల్లో..
ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన బాలోత్సవం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు మొత్తం 8 వేదికలను ఏర్పాటు చేయగా, వ్యాసరచన, వక్తృత్వం, వైజ్ఞానిక ప్రదర్శనలను పాఠశాల తరగతి గదులు, ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతి ఒక్కరినీ అలరించాయి. విద్యార్థులు లఘునాటికలు, జానపద నృత్యాలు, ఏకపాత్రలు, కోలాటం ఇలా 54 విభాగాల్లో ప్రదర్శించారు. అదే విధంగా పద్యం చెప్పటం, కథ చెప్పటం, మట్టితో వ్యవసాయ పరికరాలను తయారు చేయటం వంటివి ప్రదర్శించారు.


