
నిరవధిక నిరాహార దీక్షలకు సంఘీభావం
కడప కార్పొరేషన్ : డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్(సీఓఏ) అనుమతి వెంటనే ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య డిమాండ్ చేశారు. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మూడు రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.350 కోట్లతో ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్శిటీని మంజూరు చేసిందన్నారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ, సొంత భవనాలు, హాస్టల్ భవనాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. యూనివర్సిటీకి డా. వైఎస్సార్ పేరుందనే ఈ ప్రభుత్వం కక్షసాధిస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు, శివతేజ, అరుణ్‌కుమార్, ఎన్.రాజేష్, నజీర్, సుధీర్, చంద్ర, శివశంకర్, శ్రీనివాసులు, వెంకటేష్, ప్రశాంత్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏడీసెట్ నిర్వహించాలంటే ముందుగా కన్వీనర్, సభ్యులను ప్రభుత్వం నియమించాల్సి ఉందని ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఇన్‌చార్జి వీసీ విశ్వనాథ్ అన్నారు. వీలైనంత త్వరగా అన్నీ సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.