
‘గురుకులం’ పనులు పూర్తి చేయండి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో వెనుకబడిన తరగతుల పేద విద్యార్థులకు అధునాతన వసతులతో నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో ఏర్పాటవుతున్న మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయం త్వరలో నిర్వహణలోకి రానుందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.. తొండూరు మండలంలోని మల్లెల గ్రామంలో నూతనంగా ఏర్పాటైన మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో పెండింగ్ పనులు, వసతులు సంబంధిత అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న విద్యాలయాన్ని త్వరలో నూతన భవనంలో మారుస్తామని వెల్లడించారు. రెండు నెలల్లో గురుకులంలో ఎలాంటి మౌళిక సదుపాయాల కొరత లేకుండా రోడ్లు, విద్యుత్, నీటి పైప్ లైన్, గ్రీనరీ, డ్రిప్ ఇరిగేషన్ తదితర అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చాలన్నారు. ఆర్ అండ్ బీ ఈఈ మాధవి, డీఈ జగదీశ్వర్ రెడ్డి, డీఈఓ షంషుద్దీన్, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ ఎ.నిత్యానందరాజులు, కాంట్రాక్టు ఏజెన్సీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి