మీ చేతుల్లోనే నా భవిష్యత్తు
కోదాడ : దేశానికి పట్టుగొమ్మలు మన పల్లెలు.. ఇది జాతిపిత మహాత్మాగాంధీ నాకు ఇచ్చిన గొప్ప గౌరవం. కానీ పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా నా పరిస్థితి తయారయ్యింది. నా పల్లె బిడ్డలకు కనీస సౌకర్యాలు కల్పించడానికి నానా కష్టాలు పడుతున్నాను. తాజాగా నా ఆలనాపాలన చూసేందుకు గ్రామ ప్రథమ పౌరుడిగా గౌరవాన్ని పొందడానికి ఆశావహులు ఎన్నికల బరిలో పోటాపోటీగా తలపడడానికి సిద్ధపడుతున్నారు. ఏడు దశాబ్దాల నా ప్రస్థానాన్ని ఒకసారి అవలోకనం చేసుకుంటే నాకు నిరాశే కలుగుతుంది. నా పరిస్థితి చూస్తే నాకే జాలేస్తుంది. అభివృద్ధిలో అందరికి ఆదర్శంగా ఉండాల్సిన నేను నా పల్లె బిడ్డలకు కనీస సౌకర్యాలను కూడా అందించలేకపోతున్నాను. గుంతలు పడిన రోడ్లు, కంపుకొడుతున్న మురికి కాలువలు, నాలుగు రోజులకు ఒకసారి వచ్చే నల్లా నీళ్లు, వెలగని వీధి దీపాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే నా సమస్యలు చాంతాడంత అవుతుంది. పట్టించుకోవాల్సిన పెద్ద నేతలు పట్టణాలకే పరిమితం అవుతుండడంతో నా పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతుంది. అప్పుడప్పుడు ప్రభుత్వాలు అరకొర విదిల్చే నిధులతో నా వాకిట చేపడుతున్న పనుల్లో అధికారుల, పాలకుల కమీషన్ల కక్కుర్తి వల్ల నాణ్యత నేతి బీరకాయలో నెయ్యి అన్న చందంగా మారింది. సీసీ రోడ్లు కాస్తా ఛీ..ఛీ.. రోడ్లుగా దర్శనం ఇస్తున్నాయి. వీధి దీపాలు మిణుకు మిణుకుమంటూ నా వీధుల్లో మూడువందల అరవై రోజులు అమవాస్య చీకట్లే కనిపిస్తాయి. ఇక గ్రామంలో స్వైరవీహారం చేస్తూ చిన్నారులపై దాడి చేస్తున్న గ్రామ సింహాలను, ఇళ్లపై దండెత్తుతున్న వానర మూకలను కట్టడి చేయలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, నాలో నేనే మదనపడుతున్నాను. ఇదిలా ఉండగా నా గుండెల మీద కుంపటిలా వీధికి రెండు మూడు బెల్ట్ షాపులు వెలిసి మంచినీరు దొరకని చోట రేయింబవళ్లు మద్యం అమ్మకాలు చేస్తూ యువతను మత్తులో జోగేలా చేస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించే వారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాను.
గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తారని..
ప్రజాస్వామ్యానికి పునాదైన పల్లెలు పటిష్టంగా ఉండాలంటే అది మీ చేతుల్లో, చేతల్లోనే ఉంది. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మరో వారం, పది రోజుల్లో ఐదు సంవత్సరాలు నా, మీ బాగోగులు చూసే ప్రథమ పౌరుడిని ఎంపిక చేసుకొనే అవకాశం మీకు వచ్చింది. ఓటే వజ్రాయుధమంటారు. దాన్ని మీరు సక్రమంగా వినియోగించి మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తారని ఆశిస్తున్నాను. చివరగా గ్రామ సేవ చేయాలని సర్పంచ్‌గా నిలబడాలనుకుంటున్న ఔత్సహికులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సొంతూరిని బాగు చేసుకోవాలనే మీ సంకల్పం మంచిదే. దీని కోసం లక్షలు ఖర్చుచేసి అప్పులపాలై కుటుంబాలను వీధిన పడేయకండి. ప్రజా బలంతో నిజాయితీగా ఎన్నికకావడానికి ప్రయత్నించండి..
ఇట్లు
మీ పల్లె
డబ్బు, మద్యానికి ఓటు అమ్ముకోను
ఫ ఇందూర్తిలో ఇంటి గోడపై
రాసిన రామచంద్రం
మర్రిగూడ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యానికి ఓటును అమ్ముకోను అంటూ మర్రిగూడ మండలంలోని ఇందూర్తి గ్రామానికి చెందిన పగిళ్ల రామచంద్రం తన ఇంటి ప్రహరీపై రాసి ఉంచాడు. ప్రజలకు కనువిప్పు కావాలన్న ఉద్దేశంతో ఓట్లను డబ్బు, బిర్యానీకి అమ్ముకోవద్దని, ఓటును గ్రామాభివృద్ధికి పాటుపడే అభ్యర్థులకు స్వచ్ఛందంగా ఓటు వేసి గెలిపించుకోవాలని రామచంద్రం కోరారు. ఈ సందర్భంగా రామచంద్రం దంపతులను మేటిచందాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఏర్పుల యాదయ్య, ఏరుకొండ అబ్బయ్య శాలువాలతో ఘనంగా సన్మానించారు.
మీ చేతుల్లోనే నా భవిష్యత్తు


