
ట్రాక్టర్‌పై నుంచి జారిపడి మహిళ మృతి
మఠంపల్లి: ట్రాక్టర్‌పై నుంచి జారిపడి మహిళ మృతిచెందింది. ఈ ఘటన మఠంపల్లి మండల కేంద్రం సమీపంలోని రామస్వామి కుంట వద్ద రఘునాథపాలెం రోడ్డుపై ఆదివారం జరిగింది. మఠంపల్లి ఎస్‌ఐ పి. బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల నవనీత(30) ఆదివారం మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో ఇంటి స్లాబు వేసేందుకు కూలీలతో కలిసి ట్రాక్టర్‌పై వచ్చింది. తిరుగు ప్రయాణంలో మఠంపల్లి మండల కేంద్రం సమీపంలో రామస్వామి కుంట మూలమలుపు వద్దకు రాగానే ఆమె ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి జారి రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలై మృతిచెందింది. ఈ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
స్వర్ణగిరీశుడికి నవ కలశ
పంచామృతాభిషేకం
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి ఆలయ అర్చకులు నవ కలశ పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, మేల్ చాట్‌వస్త్ర సేవ, లక్ష తులసీ సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణం, మధ్యాహ్నం సుమారు 5వేల మంది భక్తులకు అన్నదానంచేశారు. సాయంత్రం ఆలయ మాడ వీధుల్లో తిరువీధి ఉత్సవ సేవ, మహా మంగళహారతులు సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. మేల్ చాట్ వస్త్ర సేవ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపికృష్ణ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.