
నిధులు పక్కదారి.. ఏదీ రికవరీ!
బీబీనగర్: జిల్లాలోనే అత్యధిక ఆదాయం కలిగిన బీబీనగర్ మండలం కొండమడుగు పంచాయతీ నిధులు రూ.లక్షల్లో పక్కదారి పట్టాయి. అభివృద్ధి పనులు సాకు చూపి పంచాయతీ కార్యదర్శి, తాజా మాజీ సర్పంచ్ భర్త కుమ్మకై ్క ఏకంగా రూ.95.40 లక్షల దుర్వినియోగానికి పాల్పడినట్లు డీఎల్‌పీఓ విచారణలో తేలింది. డీపీఓకు మూడు నెలల క్రితమే విచారణ నివేదిక అందజేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎంబీ రికార్డు, ఓచర్లు లేకుండానే..
2022–23, 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో వివిధ అభివృద్ధి పనులు చూపి ఎంబీ రికార్డులు, ఓచర్లు లేకుండానే రూ.93 లక్షలకు పైగా చెల్లింపులు జరిగాయి. డంపింగ్ యార్డులో టాయిలెట్ నిర్మాణం కోసం రూ.61,340 ఖర్చు చేసినట్లు గ్రామ పంచాయతీ రికార్డులో నమోదు చేశారు. కానీ, ఎంబీ రికార్డులో నమోదు చేయలేదు. అదే విధంగా నర్సరీ నిర్వహణకు రూ.39,120 ఖర్చు చేసి అందులో రూ.12 వేలకు ఓచర్లు లేకుండానే చెల్లింపులు జరిపారు. శానిటేషన్‌కు రూ.40,800, హారితహారం కోసం రూ.86,600, డంపింగ్‌యార్డు నిర్వహణకు రూ.36 వేలు ఖర్చు చేసి జీపీ రికార్డుల్లో ఎక్కుగా నమోదు చేశారు. అలాగే ఒకే రోజు ఐదు ఓచర్ల ద్వారా రూ.3 లక్షలు ఖర్చు చేసినట్లు జీపీ రికార్డుల్లో ఉండగా ఎంబీ రికార్డులో ఆ వివరాలే నమోదు చేయలేదు. గ్రామ పంచాయతీ నిర్వహణ, విద్యుత్ లైట్లు, నీటి సరఫరా, శానిటేషన్, ట్రాక్టర్ రిపేర్ ఇతర వాటికి మూడేళ్లలో రూ.90 లక్షలు ఖర్చు చేసి జీపీ రికార్డుల్లో రాశారు. నిధుల వినియోగంపై గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు అందడంతో అప్పటి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వీరారెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డీఎల్‌పీఓ శ్రీకాంత్‌రెడ్డి విచారణ చేశారు. 2022 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు 62 పనులకు గాను 133 ఓచర్లు రాసి మొత్తం రూ.93,40,372 ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపారని తేల్చారు. ఇందులో అవసరం లేని పనులు నిర్వహించి బిల్లులు పెట్టడం, చేసిన పనులకు ఎక్కువ బిల్లు డ్రా చేశా రని, కొన్ని పనులు చేయకుండానే బిల్లు తీసుకు న్నారని విచారణలో తేలింది. డీఎల్‌పీఓ విచారణ నివేదికను 2025 ఏప్రిల్ 11న జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ)కు అందజేశారు.
కొండమడుగు కార్యదర్శి, మాజీ సర్పంచ్ కుమ్మక్కు!
ఫ గ్రామ పంచాయతీ నిధులు రూ.95.40 లక్షలు స్వాహా
ఫ డీఎల్‌పీఓ విచారణలో వెలుగులోకి
ఫ డీపీఓకు మూడు నెలల క్రితమే అందిన నివేదిక
ఫ ఇప్పటి వరకు చర్యలు శూన్యం
నిగ్గు తేలినా చర్యలేవీ..
జూనియర్ పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్ భర్త కుమ్మకై ్క పంచాయతీ నిధులు పక్కదారి పట్టించినట్లు తెలిసింది. మండల, జిల్లాస్థాయి అధికారులు వారికి మద్దతుగా నిలుస్తూ ఎవరి స్థాయిలో వారు వాటాలు పంచుకున్నారని ఆరోపణలున్నాయి. డీఎల్‌పీఓ విచారణలో అక్రమాలు నిగ్గు తేలడంతో వివరాలు బయటకు పొక్కకుండా, కార్యదర్శిపై చర్యలు లేకుండా ఉండేందుకు సర్పంచ్ భర్త ఆ శాఖ జిల్లాస్థాయి అధికారికి రూ.10 లక్షలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. కాగా అవినీతి అక్రమాలు వెలుగుచూడటంతో పంచాయతీ కార్యదర్శి మరో చోటకు బదిలీ చేయించుకునేందుకు ఎమ్మెల్యే ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.