
కూలి పనికి వెళ్తూ మృత్యుఒడికి..
భువనగిరిటౌన్: కూలి పని చేసే మహిళను ఆమె భర్త ద్విచక్ర వాహనంపై పని ప్రదేశంలో దించేందుకు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతిచెందగా.. ఆమె భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం మగ్ధూంపల్లికి చెందిన సిల్వేరు సత్యనారాయణ, మల్లమ్మ(45) భార్యాభర్తలు. సత్యనారాయణ బీబీనగర్‌లోనే ఓ కంపెనీలో పనిచేస్తుండగా.. మల్లమ్మ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శనివారం ఉదయం సత్యనారాయణ తన భార్య మల్లమ్మను భువనగిరిలో కూలీ పనికి వదిలేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. భువనగిరి పట్టణంలోని జంఖన్నగూడెం చౌరస్తా వద్ద మల్లమ్మ, సత్యనారాయణ ఆగగా.. నల్లగొండ నుంచి భువనగిరి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. సత్యనారాయణకు గాయాలయ్యాయి. వీరికి ముగ్గురు కుమార్తెలు సంతానం కాగా.. ఒక కుమార్తె వివాహం చేశారు. మిగతా ఇద్దరు కుమార్తెలు పాఠశాల విద్య అభ్యసిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న భువనగిరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఫ ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మహిళా కూలీ మృతి
ఫ ఆమె భర్తకు గాయాలు