
చెర్వుగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం
నార్కట్‌పల్లి: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేసినట్లుగానే చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. సోమవారం ఆమె నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో గల పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. వెంకట్రావ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కల్యాణ మండపం, కోనేరు, మెట్ల దారి, కాలభైరవ, ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆలయ ఈఓ చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని.. ఆలయ అభివృద్ధికి ఇదివరకే మంజూరు చేసిన రూ.12 కోట్లతో చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చెర్వుగట్టు పైనుంచి కిందకు ప్రత్యేక రహదారి, మెట్ల దారి విస్తరణ, కాటేజీల నిర్మాణం చేపట్టాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆమెను కోరారు. చెర్వుగట్టు ఆలయానికి సంబంధించి గట్టు పైన 44 ఎకరాల స్థలం, కొండ కింద 90 ఎకరాల స్థలం ఉందని, ప్రస్తుతం ఆలయ నిధులు రూ.24 కోట్లు ఉన్నట్లు దేవాదాయశాఖ కమిషనర్ ఎస్. వెంకట్రావ్ ఆమెకు వివరించారు. సంవత్సర ఆదాయం రూ.14కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకు వస్తుందని, రెండు కిలోల 640 గ్రాముల బంగారం, 241 కిలోల వెండి ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం చెర్వుగట్టు సమీపంలో హరిత హోటల్ మంజూరు చేసిందని, అయితే హోటల్ నిర్మించే స్థలానికి సంబంధించి ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆమెకు వివరించారు. ఈ కార్యక్రమంలో ధార్మిక పరిషత్ ప్రత్యేక సలహాదారు గోవింద హళ్లి, స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, నల్లగొండ ఆర్డీఓ వై. అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, దేవాదాయ శాఖ ఎస్‌ఈ ఓం ప్రకాష్, ఈఈ శ్రీనివాస శర్మ, దేవాలయ ఈఓ నవీన్‌కుమార్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉశషయ్య, వడ్డె భూపాల్‌రెడ్డి, బండ సాగర్‌రెడ్డి, పాశం శ్రీనివాస్‌రెడ్డి, పున్నంరాజు యాదగిరి, నేతకాని కృష్ణ, రేగట్టే నవీన్‌రెడ్డి, రేగట్టే నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
శైలజా రామయ్యర్
ఛాయా సోమేశ్వర ఆలయ చరిత్రను కాపాడాలి
రామగిరి(నల్లగొండ): నల్లగొండ మున్సి పాలిటీ పరిధిలోని పానగల్లులో గల ఛాయా సోమేశ్వర ఆలయ చరిత్రను కాపాడాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. సోమవారం ఆమె ఛాయా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి విశేష పూజల అనంతరం వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా దేవాలయ చరిత్రను తెలుసుకున్న ఆమె ఆలయ ప్రాముఖ్యత, శిల్ప కళ, చరిత్రను అందరికీ తెలిసేలా చూడాలని ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, ధార్మిక పరిషత్ సలహాదారు గోవింద హళ్లితో చెప్పారు. అనంతరం ఆలయం వద్ద ఉన్న కొనేరును సందర్శించారు. ఆమె వెంట కలెక్టర్ ఇలా త్రిపాఠి, నల్లగొండ ఆర్డీఓ వై. అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

చెర్వుగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం