
నలుగురు ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్
● మరో ఇద్దరికి చార్జీ మెమోలు జారీ●
● చింతపండు చోరీ ఘటనలో అధికారుల చర్యలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ఆలయ ప్రసాద విక్రయశాల గోదాంలో సరుకులు, చింతపండు చోరీ చేసిన ఘటనకు సంబంధించి నలుగురిని సస్పెండ్ చేయడంతో పాటు మరో ఇద్దరికి చార్జీ మెమోలు జారీ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్, ఆలయ ఈఓ వెంకట్రావ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చోరీకి ఘటనపై విచారణ చేసేందుకు నియమించిన కమిటీ ప్రసాద విక్రయశాల, గోదాంలను పరిశీలించి, ఉద్యోగులు, సిబ్బందిని విచారించి.. ఆ రిపోర్ట్‌ను ఈఓ వెంకట్రావ్‌కు అందజేశారు. ఆ నివేదికను పరిశీలించిన ఈఓ.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టోర్ గుమాస్తా పి. నవీన్ (సీనియర్ అసిస్టెంట్)తో పాటు సహాయ పాచకులు టి. వాసు, ఎస్‌బీ. సంతోష్, ఎస్. కృష్ణమాచార్యులను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ప్రసాద తయారీ స్టాక్, రిజిస్టర్లను పరిశీలించడంలో విఫలమైన పర్యవేక్షకులు ఎ. సత్యనారాయణశర్మ, వి. వెంకటేశంకు చార్జీ మెమోలు ఇచ్చారు.
పెట్రోల్ బంక్ మిషన్లు పోలీస్ స్టేషన్‌కు తరలింపు
మోత్కూర్: రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్‌లోని మిషన్లను సోమవారం మోత్కూరు పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాలు.. మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో 2020 డిసెంబర్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) సహకారంతో మోత్కూరు రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం సంఘానికి నూతన పాలకవర్గం ఏర్పడగా.. వారు బంక్ వ్యవహారాలను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా బంక్ మూతబడింది. ఈ నేపథ్యంలో సోమవారం ఐఓసీ సిబ్బంది బంక్‌లో పెట్రోల్, డీజిల్ కొట్టే మిషన్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ వాహనంలో తరలిస్తుండగా.. సంఘం సీఈఓ కొనతం వరలక్ష్మి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బంక్ వద్దకు చేరుకొని మిషన్లను తరలిస్తున్న వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై సంఘం సీఈఓ వరలక్ష్మిని వివరణ కోరగా.. గతంలో వినియోగదారుల సేవా కేంద్రంగా ఉన్న బంక్‌ను మూడు నెలల క్రితం కమర్షియల్‌గా మార్చినట్లు తెలిపారు. కలెక్టరేట్ నుంచి బీఫాం రావాల్సి ఉండడంతో వినియోగంలోకి తీసుకురాలేదని, ఐఓసీ సిబ్బంది తమకు సమాచారం ఇవ్వకుండానే మిషన్లు తీసుకెళ్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఐఓసీ మేనేజర్‌తో మాట్లాడితే కొత్త మిషన్లు ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో ఐదు గేదెలు మృతి
మునగాల: విద్యుత్ స్తంభం కూలడంతో భూమిపై పడిన కరెంట్ తీగలకు తగిలి ఐదు గేదెలు మృతిచెందాయి. ఈ ఘటన మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామ శివారులో సోమవారం జరిగింది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం కొక్కిరేణి గ్రామానికి చెందిన గడ్డం రామానుజంకు చెందిన రెండు గేదెలు, ఎల్లావులు వెంకన్న, ఎల్లావుల సంతోష్, తెలిబోయిన నాగరాజుకు చెందిన మూడు గేదెలను సోమవారం ఉదయం మేత కోసం వదిలారు. గేదెలు మేత మేసుకుంటూ వెళ్లి తిమ్మారెడ్డిగూడెం శివారులో విద్యుత్ స్తంభం కూలడంతో భూమి మీద పడిన కరెంట్ తీగలను తాకి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాయి. గేదెల విలువ రూ.2.50లక్షలు ఉంటాయని, తమకు నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
బస్సు టైరు కిందపడి వృద్ధురాలికి గాయాలు
కొండమల్లేపల్లి: వృద్ధురాలు ఆర్టీసీ బస్సు టైరు కిందపడి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం జరిగింది. పెద్దవూర మండలం కల్వకుర్తికి చెందిన ముదిరెడ్డి ప్రమీల హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లి సోమవారం తిరిగి స్వగ్రామానికి వెళ్తోంది. హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చి కొండమల్లేపల్లి బస్టాండ్‌లో దిగింది. అనంతరం స్వగ్రామానికి వెళ్లడానికి మిర్యాలగూడ బస్సు ఎక్కాల్సిన ఆమె పొరపాటున నల్లగొండ బస్సు ఎక్కింది. అది మిర్యాలగూడ బస్సు కాదని తెలిసి బస్సు దిగుతుండగా జారి టైరు కిందపడింది. ఆమె ఎడమ కాలు పైనుంచి బస్సు వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయ్యింది. స్థానికులు ఆమెను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. బాధితురాలి బంధువుల ఫిర్యా దు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపారు.