దిత్వాగుబులు
● మేఘావృతం.. చిరుజల్లులు
● అన్నదాతల కలవరం
● పంటను కాపాడుకునేందుకు పాట్లు
పెనుగొండ: దిత్వా తుపాను హెచ్చరికల నేపథ్యంలో కళ్లాల్లో నిలిచిన ధాన్నాన్ని కాపాడుకునేందుకు కళ్లల్లో దైన్యంతో రైతులు అవస్థలు పడుతున్నారు. యంత్రాల కొరత ఉన్నప్పటికీ అవకాశం ఉన్నంత వరకూ వరి కోతలు ముమ్మరంగా చేపట్టారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోతలు సాగించిన రైతులు మధ్యాహ్నం నుంచి ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలో పడ్డారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిరుజల్లులు పడటంతో హడలిపోయారు. పట్టుబడులు పూర్తయిన రైతులు హుటాహుటిన ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. అయితే దిగుమతికి ఇబ్బంది ఉండటంతో వాహనాలపై బరకాలు కప్పి కాపాడుతున్నారు. ఖరీఫ్ సాగు చివరి దశలో తుపాను ప్రభావంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే మోంథా తుపాను, పొంగి పొర్లిన డ్రెయిన్లు, కాలువలతో పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులు మరోమారు తుపాను హెచ్చరికలతో చేతికందిన పంటను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నా రు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోతలు, ధాన్యం పట్టుబడులు, ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలో రైతులు నిమగ్నమై ఉన్నారు.
దిత్వాగుబులు


