3న అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన యాత్ర
భీమవరం: విజయవాడలో ఈనెల 3న బుధ వారం జరిగే అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన యా త్రను జయప్రదం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం శాఖ గౌరవాధ్యక్షుడు ఎం.సీతారాంప్రసాద్, అధ్యక్షుడు కె.గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి వేలాది మందితో ధర్నా చౌక్ వరకు ఆవేదనా యాత్ర జరుగుతుందని, ధర్నాచౌక్‌లో ఆవేదన దీక్షలు చేపడతామ న్నారు. అగ్రిగోల్డ్ కంపెనీ 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది డిపాజిటర్లను, ఏజెంట్లను నిలువుదోపిడీ చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 19.52 లక్షల మంది నుంచి రూ.3,986 కోట్లు కొల్లగొట్టారని, సుమారు 600 మందికి పైగా ఆత్మహత్యలు, గుండెపోటు, మనోవేదనతో ప్రాణాలు కోల్పోయారన్నారు. అగ్రిగోల్డ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును విజయవాడలో ఏర్పాటుచేయాలని, ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని, కంపెనీ ఆస్తుల మ్యూటేషన్‌ను వేగంగా పూర్తిచేసి ఆస్తుల అమ్మకాన్ని వేగిరపర్చాలని, కోర్టు పర్యవేక్షణలో ప్రముఖ కంపెనీల ద్వారా ఆక్షన్ నిర్వహించాలని, 2015 ముందు రిజిస్టర్ చేయించుకున్న ఇళ్ల స్థలాలను, అపార్ట్‌మెంట్ ఫ్లాట్లను అటాచ్‌మెంట్ నుంచి తొలగించాలని, బినామీల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని, మృతి చెందిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘ నాయకులు ఎం.సాయిబాబా పాల్గొన్నారు.


