బీసీలకు బాబు వెన్నుపోటు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బీసీల రక్షణ, అభివృద్ధికి బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రత్యేక చట్టంతో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకట రమణ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా బీసీలకు ఇచ్చిన హామీలు ఎక్కడా అని నిలదీశారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి రిక్తహస్తం చూపారన్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీని అటకెక్కించారన్నారు. స్థానిక సంస్థలు, నామినేషన్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు హామీ ఏమైందని, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పిన హామీ కూడా గాలిలో కలిపేశారన్నారు. దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు ఇస్తామని చెప్పి అన్యాయం చేశారన్నారు. స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయలేదని, రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకాన్ని పునరుద్ధరించలేదన్నారు. బూటకపు హామీలతో మో సం చేసిన చంద్రబాబుకు బీసీలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీసీలు ఉప ముఖ్యమంత్రి పదవికి పనికిరారా అని ప్రశ్నించారు. టీడీపీ ద్వారా బీసీలకు రాజ్యాధికారం భ్రమ మాత్రమే అని, అభివృద్ధి కలే అన్నారు. బీసీలకు సామాజిక న్యాయం పచ్చి అబద్ధమన్నారు. టీడీపీలో ఉన్న బీసీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. టీడీపీ, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు చేస్తున్న అన్యాయానికి, అణచివేతకు, దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడుదామని నౌడు పిలుపునిచ్చారు.


