శ్రీవారి క్షేత్రంలో కానిస్టేబుల్ కుటుంబంపై దాడి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలోని శ్రీవారి కొండపైన దేవస్థానం షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఓ ఫాన్సీ దుకాణంలో ఆదివారం పోలీస్ కానిస్టేబుల్ కు, షాపు నిర్వాహకులకు మధ్య జరిగిన గొడవ, కొ ట్లాటకు దారితీసింది. స్థానికుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వలవల గంగరాజు కృష్ణా జిల్లా కృత్తివెన్ను పోలీస్‌స్టేషన్ లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. చినవెంకన్న దర్శనార్థం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో దేవస్థానం షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఓ దుకాణంలో బొమ్మలు కొనుగోలు చేసి, రూ.500 ఇచ్చారు. ఆ తరువాత తీసుకున్న వాటిలో ఒక బొమ్మ వద్దని అన్నారు. అయితే తీసుకుని తీరాల్సిందేనని షాపు నిర్వాహకులు ఆయనపై దౌర్జన్యం చేశారు. ఆ సమయంలో గంగరాజు తల్లి త్రివేణి కలుగజేసుకుని నచ్చితే కొంటాం.. లేకపోతే లేదు.. మా డబ్బులు తిరిగి ఇవ్వండని అనడంతో షాపులోని ఇద్దరు వ్యక్తులు ఆమెను గెంటేశారు. దీంతో ఆమె కింద పడిపోయింది. ఇదేంటని అడిగిన గంగరాజుపై సైతం ఆ ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ, వారికి మద్దతుగా మరికొందరు వ్యాపారులు కుర్చీలు, కర్రలు, ఇనుప వస్తువులతో దాడి చేశారు. అక్కడున్న స్వాములు వారిని అడ్డుకుని గంగరాజు, ఆయన తల్లి, భార్య, పిల్లలను జంటగోపురాల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాధితులు హోంగార్డులకు జరిగిన విషయం చెబుతున్న సమయంలో మళ్లీ వ్యాపారులు దాడికి తెగబడ్డారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హోంగార్డులు, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో కానిస్టేబుల్ గంగరాజు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయింది.


