
ఎస్‌వీ రంగారావుకు భారతరత్న ఇవ్వాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విశ్వనట చక్రవర్తి స్వర్గీయ ఎస్‌వీ రంగారావుకు భారతరత్న ఇవ్వాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక ఎస్‌వీఆర్ సర్కిల్‌లో గురువారం ఎస్‌వీ రంగారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్‌వీఆర్ సేవా సమితి అధ్యక్షుడు భోగిరెడ్డి రాము మాట్లాడుతూ తెలుగు సినీ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పిన తొలి తెలుగు నటుడు ఎస్‌వీ రంగారావు అని కొనియాడారు. కాపునాడు అధ్యక్షుడు మాకా శ్రీనివాసరావు మాట్లాడుతూ అద్భుత నటనతో ప్రపంచాన్ని మెప్పించిన నటుడు ఎస్‌వీ రంగారావుకు తక్షణమే భారత రత్న అవార్డును ప్రకటించాలని డిమాండ్ చేశారు. తొలుత ఎస్‌వీ రంగారావు సర్కిల్ నుంచి ర్యాలీగా పోస్టాఫీస్ వరకు చేరుకున్నారు. భారతరత్న ఇవ్వాలనే విన్నపాన్ని రిజిస్టర్ పోస్టులో ప్రధాని నరేంద్ర మోదీ అడ్రస్‌కు పంపారు. కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, బండి రామస్వామి, గంధం రాజశేఖర్, జంగా రామ్‌రాయ్, పి.కుమార్‌స్వామి, సామినేటి రంగారావు, బాకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.