నూజివీడు: మండలంలోని గొల్లపల్లిలో ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరొకరి చేతికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బోనాల నాగేంద్రబాబు(34), బోనాల దశరథ రామాంజనేయులు ఇద్దరూ అన్నదమ్ములు. వీళ్లతో పాటు వాళ్ల బాబాయ్ బోనాల శ్రీనివాసరావులకు కలిపి ఏడు సెంట్ల ఇళ్ల స్థలం ఉంది. దీనిలో చెరి సగం కాగా బోనాల శ్రీనివాసరావు మొత్తం నాదేనంటూ బోనాల నాగేంద్రబాబు, దశరథ రామాంజనేయులను రానీయడం లేదు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇళ్ల స్థలంలోకి వెళ్లగా బోనాల శ్రీనివాసరావుతో పాటు అతని కుమారులు, భార్య కలిసి నాగేంద్రబాబు, బోనాల దశరథ రామాంజనేయులపై కత్తితో దాడి చేసి కొట్టారు. దీంతో నాగేంద్రబాబుకు తలపై తీవ్ర గాయమైంది. దశరథరామాంజనేయులకు చేతిపై దెబ్బ తగిలింది. దీంతో స్థానికులు వారిని హుటాహుటిన నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
51 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నూజివీడు: పట్టణంలోని బైపాస్ రోడ్డులో బుధవారం అర్ధరాత్రి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ట్రక్కు వాహనంలో తరలిస్తున్న అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు. వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు బైపాస్ రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో 51 క్వింటాళ్లు రేషన్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ బియ్యం ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట ఏరియా నుంచి హనుమాన్ జంక్షన్‌కు రవాణా చేస్తున్నారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, బియ్యాన్ని సీజ్ చేశారు. వాహన డ్రైవర్ నక్కా శివ, రేషన్ బియ్యం సరఫరాదారులు ధనికొండ గోపిరాజు, ధనికొండ గణేష్, వారికి సాయం చేస్తున్న ఖాసీంబాబు, వాహన యజమాని నక్కా నాగగోపాలకృష్ణలపై 6ఏ, 7(1)కేసులను నమోదు చేశారు. విజిలెన్స్ ఎస్సై నాగరాజు, హెచ్‌సీ వెంకటేశ్వరరావు, సీఎస్ డీటీ జి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రైలు నుంచి జారిపడి ఉపాధ్యాయుడి మృతి
ఏలూరు టౌన్: నగరంలోని ఫిల్‌హౌస్ పేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నేతల చంద్రశేఖర్ ఆజాద్ (51) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఏలూరు రైల్వే ఎస్సై పి.సైమన్ తెలిపిన వివరాల ప్రకారం వన్‌టౌన్ ఫిల్‌హౌస్ పేటకు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ శ్రీపర్రు జెడ్పీ స్కూల్‌లో బయాలజీ టీచర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విజయవాడలోని తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు ఏలూరు రైల్వేస్షేషన్‌లో కాకినాడ–తిరుపతి రైలు ఎక్కాడు. రైలు వట్లూరు సమీపానికి వచ్చేసరికి రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆజాద్ విజయవాడ చేరుకోలేదని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం రైల్వే గ్యాంగ్‌మెన్ ఓ మృతదేహాన్ని గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఎస్సై సైమన్ మృతుడిని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.