
దోమలపై దండెత్తరే?
వైఎస్సార్ సీపీ హయాంలో..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పట్టణాలు, పల్లెల్లో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా దోమల నిర్మూలన చర్యలు చేపట్టేవారు. డ్రెయినేజీల్లో ఆయిల్‌బాల్స్, స్ఫ్రేయింగ్ చేయించేవారు. క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిగేది. జ్వరపీడితులను గుర్తించేందుకు వలంటీర్లు, ఆరోగ్య సిబ్బందితో ఇంటింటా ఫీవర్ సర్వే చేయించి రోగులకు వైద్య సాయం అందించేవారు. దోమల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై వలంటీర్లతో ఇంటింటా అవగాహన కల్పించేవారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు కానరావడం లేదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఇండస్ట్రీయల్ ఏరియా, చినరంగనిపాలెం, బందరుపుంత, గంగమ్మగుడి ఏరియా, హౌసింగ్‌బోర్డు కాలనీ, మెంటే వారితోట, టిడ్కో ప్లాట్లు తదితర డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయి. పలుచోట్ల మురుగునీరు నిలిచిపోయి అపారిశుద్ధ్యంతో దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. తమ వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని, వారం పది రోజులకు డ్రెయినేజీలను శుభ్రం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల నిర్మూలనకు పురపాలక సంఘం రూ. 10 లక్షలు బడ్జెట్‌లో కేటాయిస్తుండగా నివారణ చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయంటున్నారు. దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
సాక్షి, భీమవరం : ప్రస్తుతం రుతుపవనాల రాకతో జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా పట్టణాలు, పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతున్న దాఖలాలు లేవు. ఎక్కడికక్కడ డ్రెయినేజీలపై గడ్డి, పిచ్చిమొక్కలతో అధ్వానంగా ఉన్నాయి. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా తయారయ్యాయి. దోమల విజృంభణతో విష జ్వరాల బెడద ఆందోళనకు గురిచేస్తోంది. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాలు, ఆకివీడు నగర పంచాయతీల్లో దోమల నిర్మూలన పేరిట రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలు వరకు బడ్జెట్‌లో కేటాయిస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 409 పంచాయతీలు ఉండగా పెద్ద పంచాయతీల్లో రూ.రెండు లక్షలు వరకు, చిన్న పంచాయతీల్లో రూ. 25 వేలు నుంచి రూ. లక్ష వరకు వెచ్చిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రూ. 5 కోట్లకు పైగానే కేటాయిస్తున్నట్టు అంచనా.
కానరాని నిర్మూలన చర్యలు
దోమల నిర్మూలన చర్యల్లో భాగంగా లార్వా దశలోనే వాటిని నిర్మూలించేందుకు డ్రెయినేజీలు, నీరు నిల్వ ఉండే ఖాళీ ప్రదేశాలను శుభ్రం చేయించి ఆయిల్ బాల్స్, కెమికల్స్ స్ప్రేయింగ్, సాయంత్ర వేళల్లో ఫాగింగ్ చేయించాలి. డ్రెయినేజీల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగునీరు పారే విధంగా ప్రతిరోజూ శుభ్రం చేయించాలి. క్షేత్రస్థాయిలో ఈ చర్యలు తూతూమంత్రంగానే ఉంటున్నాయి. నిధుల లేమితో పంచాయతీల్లో ఫాగింగ్ ఊసే ఉండటం లేదు. పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం పట్టణాల్లోనూ ఫాగింగ్ జరగడం లేదని స్థానికులు అంటున్నారు. దీంతో పట్టణాలు, గ్రామాల్లో దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దండయాత్ర ఊసేది?
‘దోమలపై దండయాత్ర’ అంటూ గతంలో టీడీపీ అధికారంలో ఉండగా సీఎం చంద్రబాబు హడావుడి చేసిన విషయం విధితమే. పట్టణాలు, గ్రామాల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయడం, తుప్పలు తొలగించడం, చెత్తను ఎత్తడం తదితర కార్యక్రమాలకు అప్పట్లో పిలుపునిచ్చారు. ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడికక్కడ ప్రచార ఆర్భాటంగానే దండయాత్ర సాగింది. పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయించి, ఉపాధ్యాయులు, విద్యార్థులతో ర్యాలీలు చేయించి మమ అనిపించడంతో అప్పట్లో ఈ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తాయి.
రోజుకు రూ.50 లక్షలకుపైగా ఖర్చు
జిల్లా జనాభా 18.48 లక్షలు. అర్బన్, రూరల్ ఏరియాల్లో నాలుగు లక్షలకు పైగా నివాస గృహాలు ఉన్నాయి. దాదాపు 4.62 లక్షల కుటుంబాలు నివసిస్తుండగా ఉపాధి కోసం ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు మరో లక్షకు పైగా ఉంటారు. దోమల బెడద నుంచి ఉపశమనం కోసం కాయిల్స్, స్టిక్స్, కెమికల్స్ తదితర వాటిపై సగటున ఒక్కో కుటుంబం రోజుకు రూ.10 చొప్పున జిల్లావ్యాప్తంగా రూ.50 లక్షలకు పైగానే వెచ్చిస్తున్నట్టు అంచనా. ఇప్పటికై నా మున్సిపల్, పంచాయతీ అధికారులు స్పందించి దోమల నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రతికూల వాతావరణంలో పడకేసిన పారిశుద్ధ్యం
గతంలో దోమలపై దండయాత్ర పేరిట హడావుడి చేసిన టీడీపీ ప్రభుత్వం
దోమల బెడద ఎక్కువగా ఉంది
భీమవరం టిడ్కో ప్లాట్లలో నివాసం ఉంటున్నాం. మా ప్రాంతంలో దోమలు బెడద ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. దోమల నివారణకు ఫాగింగ్ చేయడంగాని, నివారణ చర్యలు తీసుకోవడం లేదు. దోమలతో రాత్రిళ్లు కంటిమీద కునుకు ఉండటం లేదు. రాత్రిళ్లు రెండు కాయిల్స్ వెలిగిస్తున్నా తర్వాత మామూలుగా వచ్చేస్తున్నాయి.
– వై.వీర్రాజు, భీమవరం
డ్రెయినేజీలు శుభ్రం చేయడం లేదు
వర్షాకాలం కావడంతో ప్రస్తుతం దోమలు బెడద చాలా ఎక్కువగా ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వర్షాకాలంలో డ్రెయిన్లు శుభ్రం చేసేవారు. దోమల మందు, బ్లీచింగ్ పౌడర్ క్రమం తప్పకుండా చల్లేవారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు దండయాత్ర చేస్తున్నాయి.
– నలభ పోతురాజు, ఎనంఆర్‌పీ అగ్రహారం

దోమలపై దండెత్తరే?

దోమలపై దండెత్తరే?

దోమలపై దండెత్తరే?