
ఆటో, బ్యాటరీల దొంగల అరెస్ట్
భీమవరం: జల్సాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆటోలు, బ్యాటరీ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ. 23 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నటు ఏఎస్పీ వి భీమారావు చెప్పారు. గురువారం భీమవరం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వీరవాసరం గ్రామానికి చెందిన కంచర్ల శ్రీరామ్‌కుమార్ లారీలను కిరాయికి తిప్పుతుంటాడు. ఈ క్రమంలో పట్టణంలోని మెంటేవారితోట బైపాస్ రోడ్డులోని లారీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం వద్ద జూన్ 14న తన మూడు లారీల పార్క్‌చేసి ఉంచగా వాటిలోని 6 బ్యాటరీలు దొంగిలించారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్సై ఎస్‌వీవీఎస్ కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో పట్టణానికి చెందిన తీగల నరేంద్రభవాని, పైలా రాకేష్, యలగడ కోదండశివసాయివెంకట సత్యనారాయణలను అదుపులోనికి తీసుకుని విచారించగా భీమవరం వన్ టౌన్, భీమవరం టూ టౌన్, కాళ్ల, ఆకివీడు, ఉండి, వీరవాసరం, పాలకోడేరు పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగిలించిన 65 బ్యాటరీలు దొంగతనం చేసినట్లు గుర్తించారు. దీంతో వారి వద్ద నుంచి సుమారు రూ. 6 లక్షల విలువైన 65 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ భీమారావు చెప్పారు.
ఇద్దరు ఆటోల దొంగల అరెస్టు
భీమవరం పోలీసు సబ్‌డివిజన్ పరిధిలో ఇటీవల ఆటో దొంగతనాలు ఎక్కువ జరగడంతో భీమవరం టుటౌన్ పోలీసుస్టేషన్ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 2న కృష్ణా జిల్లా మండవల్లి మండలం పేరికిగూడెం గ్రామానికి చెందిన పరస నాగరాజును అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో భీమవరం పట్టణంలోని వన్‌టౌన్, టూటౌన్, రూరల్, ఆకివీడు, అమలాపురం, వైజాగ్ వన్‌టౌన్, టూటౌన్, మండవల్లి ప్రాంతాల్లో 13 ఆటోలను దొంగతనాలు చేశానని నేరం అంగీకరించారు. దీంతో నాగరాజుతో పాటు అనకాపల్లి మండలం సబ్బవరం గ్రామానికి చెందిన పోలిశెట్టి గణేష్‌లను అరెస్టు చేసి వారి నుంచి సుమారు రూ. 17 లక్షల విలువైన 10 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ భీమారావు చెప్పారు. సమావేశంలో భీమవరం డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య, సీఐలు ఎం.నాగరాజు, జి.కాళీచరణ్, ఎస్సై కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు.
10 ఆటోలు, 65 బ్యాటరీల స్వాధీనం