
కలల తీరాలకు తొలి అడుగు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎన్నో ఆశయాలు, మరెన్నో లక్ష్యాలు నిర్దేశించుకుంటున్న విద్యార్థులు వాటిని సాధించడానికి, చేరుకోవడానికి వేయి ఆశలతో ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. తమ లక్ష్యాలను సాధించడానికి తొలి అడుగు వేసే తరుణం వచ్చేసింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఈఏపీ సెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్ ఆప్షన్లపై పూర్తి స్థాయిలో ఆలోచించుకుని తుది నిర్ణయం తీసుకోవాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో ఏలూరు జిల్లా నుంచి 4700 మంది పరీక్ష రాయగా వారిలో ఇంజనీరింగ్ కోర్సుకు 3409 మంది మాత్రమే అర్హత సాధించారు.
ఈ కోర్సుల గురించీ తెలుసుకోండి..
ఇంజనీరింగ్‌లో సంప్రదాయ కోర్సులతో పాటు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సీఎస్‌ఈ, సివిల్ వంటి సంప్రదాయ కోర్సులు ఇప్పటికే ఉన్నాయి. కొత్తగా సీఎస్‌ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (వీఎల్‌ఎస్‌ఐ) డిజైన్, అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, నెట్ వర్కింగ్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామ్ డిజైన్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, అగ్రికల్చరల్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్‌టైల్ వంటి కొత్త బ్రాంచిలు వచ్చాయి. ఈ కోర్సుల్లో నైపుణ్యం సాధించినా అపార అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు
ఏలూరు జిల్లాలో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా మొత్తం 4,920 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200 సీట్లు, ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో 900 సీట్లు, ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో 660 సీట్లు, హేలాపురి ఇంజనీరింగ్ కళాశాలలో 420 సీట్లు, ఆగిరిపల్లిలో ఎన్‌ఆర్‌ఐ ఇంజనీరింగ్ కళాశాలలో 1,320 సీట్లు, నూజివీడు సారథి ఇంజనీరింగ్ కళాశాలలో 420 సీట్లు ఉన్నాయి.
ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ షురూ
7 నుంచి షెడ్యూల్ ప్రారంభం
10 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం
ఆగస్టు 4 నుంచి తరగతులు ప్రారంభం
షెడ్యూల్ ఇలా..
తొలి విడత కౌన్సెలింగ్
జూలై 7 నుంచి 16 వరకూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు
జూలై 7 నుంచి 17 వరకూ ఆన్‌లైన్‌లో విద్యా ర్థులు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల వరిశీలన
జూలై 10 నుంచి 18 వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం
జూలై 19న వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం
జూలై 22న సీట్ల కేటాయింపు.
జూలై 23 నుంచి 26 వరకూ
కళాశాలలో ప్రవేశాలు
ఆగస్టు 4 నుంచి తరగతుల ప్రారంభం
మలివిడత కౌన్సెలింగ్
జూలై 25 నుంచి 27 వరకూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు
జూలై 26 నుంచి 28 వరకూ ఆన్‌లైన్‌లో విద్యార్థులు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన
జూలై 27 నుంచి 29 వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం
జూలై 30న వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం
ఆగస్టు 1న సీట్ల కేటాయింపు
ఆగస్టు 2 నుంచి 5 వరకూ
కళాశాలలో ప్రవేశాలు