
నేడు భీమవరంలో ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’
భీమవరం: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి మోసం చేసిన వైనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు చెప్పారు. భీమవరం పట్టణంలోని ఆనంద్ ఇన్ ఫంక్షన్ హాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వెంకటరాయుడు పిలుపునిచ్చారు.
బడి ఈడు పిల్లలు తప్పక బడిలో ఉండాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): ప్రతి పాఠశాల పరిధిలో బడి ఈడు పిల్లలు తప్పక బడిలో ఉండాలని, ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించాలని డీఈఓ నారాయణ అన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల సమయానికే ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరై ఇన్‌టైంలో అటెండెన్స్ నమోదు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు సబ్జెక్టు వారీగా టీచర్ హ్యాండ్ బుక్స్ త్వరలోనే అందజేస్తామని, ఈనెల 10న జరగబోవు మెగా పేరంట్స్ టీచర్ మీటింగ్‌కు తల్లిదండ్రులు అందరూ హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం ఎంఈఓలు వి.హనుమ, పీఎంకే జ్యోతి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం ఎం.సత్యనారాయణ, శ్రీనివాస్, కనకదుర్గ, సీఆర్‌పీలు పాల్గొన్నారు.
ఆ ఫోన్ కాల్స్ నమ్మకండి
భీమవరం (ప్రకాశంచౌక్): కమిషనర్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు చెల్లించాలని ఫోన్ చేస్తే తక్షణమే వార్డు సచివాలయ శానిటేషన్ సెక్రటరీ ద్వారా పురపాలక సంఘ అధికారులకు గానీ పోలీసులకు తెలియజేయాలని పురపాలక సంఘ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భీమవరం పురపాలక సంఘ పరిధిలో గల కొన్ని వార్డుల్లోని కమర్షియల్ ప్రాంతాల్లో దుకాణాల యజమానులకు 91210 97923, కొన్ని ఇతర నెంబర్ల నుంచి కమిషనర్ పేరుతో ఫోన్ చేసి ఈ ట్రేడ్ లైసెన్సులు రుసుము చెల్లించాలని లేకుంటే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులు పాల్పడుతున్నారని, అటువంటి వాటిని నమ్మవద్దని తెలిపారు. చెల్లించాల్సిన ఈ–ట్రేడ్ లైసెన్స్ బకాయిలు నేరుగా భీమవరం పురపాలక సంఘ కార్యాలయము నందు గాని లేదా సమీప వార్డు సచివాలయం నందు గాని చెల్లించాలని కోరారు.
పరిశ్రమల స్థాపనకు వాట్సాప్ సేవలు
భీమవరం (ప్రకాశంచౌక్): పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తులకు నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గవర్నెన్స్ మనమిత్ర యాప్ 95523 00009 ద్వారా పరిశ్రమలకు సంబంధించి అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకునేలా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. జిల్లాలో మే 27 నుంచి ఇప్పటివరకు వివిధ శాఖల అనుమతుల కోసం 465 దరఖాస్తులు అందగా, వాటిలో 458 దరఖాస్తులను ఆమోదించామని, మరో 7 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు.
ఐచ్ఛిక సెలవుల కోసం వినతి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు క్యాలెండర్ సంవత్సరం ప్రకారం ఐచ్ఛిక సెలవులకు అనుమతులివ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు ఫ్యాప్టో నాయకులు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 5వ తేదీన మొహర్రం, అక్టోబర్ 9న యజ్‌దహుకు షరీఫ్, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 26న బాక్సింగ్ డేలను పురస్కరించుకుని ఐచ్ఛిక సెలవులకు అనుమతులివ్వాలని కోరారు. వినతిపత్రం సమర్పించన వారిలో ఫ్యాప్టో ఛైర్మన్ జీ మోహన్‌రావు, నాయకులు పాల్గొన్నారు.