కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి | - | Sakshi
Sakshi News home page

కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి

Jul 4 2025 3:30 AM | Updated on Jul 4 2025 3:30 AM

కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి

కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి

కృష్ణలంక (విజయవాడ తూర్పు): కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని, కొల్లేరు ప్రజలకు ఉరితాడుగా మారిన 120 జీఓను రద్దు చేయాలని, పర్యావరణంతో పాటు స్థానికుల జీవనోపాధిని కాపాడాలని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు డిమాండ్‌ చేశారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రైతు సంఘం సీనియర్‌ నాయకుడు వై.కేశవరావు అధ్యక్షతన గురువారం కొల్లేరు ప్రజల సమస్యలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కొల్లేరు ప్రజల ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి బదులుగా వారు కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని విమర్శించారు. కొల్లేరు ప్రజలకు హానికరమైన ఎకో సెన్సిటివ్‌ జోన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కొల్లేరు ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కొల్లేరు ప్రజలకు సీపీఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతు సంఘం సీనియర్‌ నాయకుడు వై.కేశవరావు మాట్లాడుతూ.. మూడో కాంటూరు నుంచి ఐదో కాంటూరు వరకు పది కిలోమీటర్ల దూరంలో సున్నితమైన పర్యావరణ ప్రాంతం పేరుతో 26 నిబంధనలు విధించి మొత్తం కొల్లేరును పూర్తిగా అటవీ శాఖ చేతుల్లో పెట్టబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, ఏలూరు, పెదపాడు, మండవల్లి, కై కలూరు, ఆకివీడు మండలాల్లోని కొల్లేటి ప్రాంతంలోని 89 గ్రామాలపై పడుతుందన్నారు. అధికారులు తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయాలను సేకరించి నివేదికలు పంపించడం దారుణమన్నారు. ఎకో సెన్సిటివ్‌ జోన్‌పై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement