
రేషన్ కందిపప్పునకు ఎసరు
భీమవరం: చౌక ధరల దుకాణాల ద్వారా అన్ని రకాల నిత్యావరాలు అందిస్తామని ఎన్నికల్లో ప్రచారం చేసిన టీడీపీ కూటమి కేవలం బియ్యం, పంచదారకే పరిమితమైంది. గతంలో చౌక డిపోల ద్వారా బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుములు పంపిణీ చేయగా కూటమి ప్రభుత్వం కందిపప్పుకు మంగళం పాడింది. జిల్లాలో సుమారు 5.58 లక్షల రేషన్ కార్డులకు ప్రతి నెలా దాదాపు 8,500 టన్నుల బియ్యం పంపణీ చేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉచిత బియ్యంతో పాటు రేషన్ కార్డుకు అర కిలో పంచదార రూ.17, కిలో కందిపప్పు రూ.67కు ఎండీయు వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండు, మూడు నెలలు కందిపప్పు సరఫరా చేసి తరువాత చేతులెత్తాశారు. దీనితో పేదలు కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్కువ ధరకు అందించే కందిపప్పు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది.
ఎదురుచూపులే మిగిలాయి
కూటమి ప్రభుత్వం అన్ని నిత్యావసర సరుకులు చౌకడిపోల ద్వారా సరఫరా చేస్తుందని ఆశించిన ప్రజలకు కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇవ్వడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెలా దాదాపు 600 మెట్రిక్ టన్నుల కందిపప్పు సరఫరా చేయాలి. కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.150 వరకు విక్రయించడంతో పేద, మధ్యతరగతి ప్రజలు అంత ధర చెల్లించి కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కిలో రూ.67కే పంపిణీ చేసే కందిపప్పు కోసం ఎదురుచూసినా నిరాశే మిగులుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కందిపప్పు, ఇతర నిత్యావసరాలు రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకు అందించాలని కోరుతున్నారు.
జిల్లాలో 5.58 లక్షల రేషన్ కార్డులు
600 టన్నుల కందిపప్పు అవసరం