
వేగవరం వద్ద భారీ రోడ్డు ప్రమాదం
జంగారెడ్డిగూడెం: జాతీయ రహదారి 516డి పై జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద బుధవారం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు సిమెంటు లోడుతో వెళుతున్న లారీని, ముంబయి నుంచి రాజమండ్రికి పేపర్ లోడ్‌తో వెళుతున్న లారీ మండలంలోని వేగవరం ప్రధాన సెంటర్ వద్ద వెనుక నుంచి ఢీకొంది. దీంతో సిమెంట్ లోడు లారీ అదుపు తప్పి రోడ్డు ఎడమపక్క ఉన్న దుకాణాల్లో దూసుకుపోయింది. ఇదే సమయంలో పేపర్ లోడ్ లారీ కుడి పక్కన దుకాణాల్లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో పేపర్ లోడ్ లారీ డ్రైవర్ పప్న పిన్నెబాయ్, అలాగే రోడ్డుపక్కనే ఉన్న కొప్పర్తి నాగేంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సీఐ సుభాష్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తన వాహనంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.
గ్రామస్తుల ఆందోళన
రహదారికి ఇరువైపులా దుకాణాలు ముందుకు వచ్చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వేగవరం గ్రామస్తులు ఆందోళన చేశారు. జాతీయరహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమణలను తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో సీఐ సుభాష్ మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.
దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీలు
పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ధ్వంసం
ఇద్దరికి గాయాలు

వేగవరం వద్ద భారీ రోడ్డు ప్రమాదం