
వయ్యారిభామతో ముప్పు
యలమంచిలి: రైతులు తెగుళ్ల కంటే అధికంగా భయపడేది వయ్యారిభామ (పార్థీనియం) కలుపు మొక్కకే. ఎక్కడైనా పెరగడం ఈ మొక్క లక్షణం. ఈ కలుపు మొక్క ప్రధాన పంటకు నష్టం కలిగిస్తుంది. మొలిచిన నెల రోజుల్లోనే పూతకు వస్తుంది. ఒక్కో మొక్క 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేయడంతో పాటు గాలి పాటుకు దూర ప్రాంతాలకు సైతం తేలికగా విస్తరిస్తుంది. ఈ కలుపు మొక్క గురించి మండల వ్యవసాయాధికారి షేక్ అబ్దుల్ రహీమ్ తెలిపిన వివరాలు..
జీవరాశికి ప్రమాదమే
వయ్యారిభామ వల్ల పంటలకే కాదు మనుషులు, పశువులకూ ముప్పే. మనుషులకు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులతో పాటు చర్మ సంబంధిత అలర్జీ వస్తుంది. జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పల వాపు తదితర సమస్యలు వస్తాయి. ఈ మొక్కలను తింటే పశువులు అయితే హైపర్ టెన్షన్‌కు గురవుతాయి. ఇక పంటలకు నీరు, పోషకాలు అందకుండా వాటి కన్నా ముందుగా ఇవే శోషించుకుంటాయి. తద్వారా దిగుబడులు 40 శాతం వరకు తగ్గుతాయి. వంగ, మిరప, టమాట, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారిభామ పుప్పొడి పడితే ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వ, కాండం కుళ్లు తెగుళ్లు సోకే ప్రమాదముంది. ఈ మొక్కలు పశుగ్రాస పంటలకు కూడా నష్టం కలిగిస్తాయి. ఈ మొక్క ల్ని నిర్మూలించాలంటే రైతులు తప్పనిసరిగా సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
ఇలా తొలగించాలి
వయ్యారిభామ మొక్కలు తక్కువ సంఖ్యలో ఉంటే చేతితో పీకేయాలి. మొక్కలు పూతదశకు రాక ముందే పీకి తగలబెట్టాలి. లేకపోతే వాటి వ్యాప్తిని నివారించడం కష్టం. ఒకవేళ పూత దశకు చేరుకున్న తర్వాత మొక్కలను పీకినట్లయితే వాటిని వెంటనే కుప్పగా వేసి తగలబెట్టాలి.
రసాయనాలతో..
మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలక రాకముందు లీటరు నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేస్తే వయ్యారిభామ మొక్కల బెడద ఉండదు. విత్తనాలు మొలకెత్తిన 15–20 రోజులకు లీటరు నీటికి 2 ఎంఎల్ పేరాక్వాట్ మందును కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పశుగ్రాసం వేసేవారు పైరు వేయకముందే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేయాలి.
ఈ కలుపు మొక్కతో పంటకు నష్టం, జీవరాశికీ ప్రమాదమే
పూతకు ముందే తొలగించాలి
కంపోస్ట్ తయారీ చేయవచ్చు
వయ్యారిభామ మొక్కలు ఎంతో హానికరమైనప్పటికీ వాటిని ఉపయోగించి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇందుకు నీరు నిలవని చోట 3 మీటర్ల లోతు, 6 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేలా గుంత తవ్వాలి. ఇందులో 50 కిలోల వయ్యారిభామ మొక్కలను వేసి, వాటిపై 5 కిలోల యూరియా, 50 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కూడా చల్లాలి. ఈ విధంగా పొరలు, పొరలుగా గుంతను డోము ఆకారంలో నింపుకోవాలి. పొరల పైన పేడ, మట్టి, ఊక మిశ్రమాన్ని వేసి కప్పేయాలి. నాలుగైదు నెలల్లో కంపోస్ట్ తయారవుతుంది. దానిని జల్లెడ పట్టి పంటకు వేసుకోవాలి. ఈ కంపోస్టులో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి. ఇలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని అన్ని పంటలకు వేసుకోవచ్చు. – షేక్ అబ్దుల్ రహీమ్, యలమంచిలి మండల వ్యవసాయాధికారి

వయ్యారిభామతో ముప్పు

వయ్యారిభామతో ముప్పు