
పెట్రోగిపోతున్న మోసాలు
కనిపించని బాట్లింగ్ పేపర్లు
పెట్రోల్‌లో కల్తీని గుర్తించేందుకు ప్రతీ బంకులో బాట్లింగ్ పేపర్లను యాజమాన్యాలు అందుబాటులో ఉంచి వినియోగదారులు కోరిన వెంటనే ఇవ్వాలి. కాగా రూరల్ ఏరియాల్లోని చాలా బంకుల్లో ఇవి కనిపించడం లేదు. అడుగుతుంటే అయిపోయాయని, రావాల్సి ఉందని బంక్ యజమానులు చెబుతున్నారని వినియోగదారులు అంటున్నారు.
సేవలకు బంక్ కొట్టారు
పెట్రోల్ బంకుల్లో కొన్ని ఉచిత సేవలు అందించాల్సి ఉన్నా చాలాచోట్ల వాటి జాడే ఉండటం లేదు. పెట్రోల్, డీజిల్ కోసం వచ్చే వాహనదారులకు తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉండాలి. ఫిర్యాదుల పుస్తకం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. చాలా చోట్ల బంకుల్లో పనిచేసే సిబ్బందికి మాత్రమే ఉపయోగపడేలా ఆఫీస్ రూంలో తాగునీరు ఉంచుతున్నారు. తప్పనిసరిగా సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉండాలి. కొన్నిచోట్ల వాటికి తాళాలు వేసి ఉంటుండగా, మరికొన్ని చోట్ల నిర్వహణ సరిగా లేక వాటిలో అడుగుపెట్టలేని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. 90 శాతం బంకుల్లో గాలి పెట్టే యంత్రాలు అలంకార ప్రాయంగానే తప్ప అక్కరకురావడం లేదు. ఫస్ట్ ఎయిడ్ బాక్సులది అదే పరిస్థితి. గత మూడు నెలల్లో జిల్లాలోని 12 బంకుల్లో తనిఖీలు నిర్వహించగా కొలతలు తేడాలున్నా రెండు బంకులపై కేసులు నమోదు చేసినట్టు సివిల్ సప్లయిస్ అధికారులు తెలిపారు.
సాక్షి, భీమవరం: పెట్రోల్ బంకుల్లో మోసాలు షరా ‘మామూలు’గా మారాయి. చాలా బంకుల్లో నాణ్యత నుంచి కొలత వరకు అన్నింటా అవకతవకలే. రెప్పపాటులో రీడింగ్‌ను పరుగులు పెట్టించి కొలతల్లో తేడాలు చేస్తుంటే, పెట్రోల్‌ను కల్తీ చేస్తూ నాణ్యతకు తూట్లు పొడుస్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన సివిల్ సప్లయిస్, తూనికలు, కొలతల అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఐఓసీ, హెచ్‌పీసీఎల్, రిలయన్స్ తదితర కంపెనీలకు చెందిన పెట్రోల్ బంకులు 130 వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 2.7 లక్షల లీటర్ల పెట్రోల్, 7.9 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా తూనికలు, కొలతల శాఖ అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేస్తుండటంతో పెట్రోల్ బంకు యాజమాన్యాల ఇష్టారాజ్యంగా మారింది. పెట్రోల్, డీజిల్ నాణ్యతను సూచించే డెన్సిటీని సరిగా నిర్వహించడం లేదు. ప్రతీరోజు వాటి క్వాలిటీని పరిశీలించి సూచిక బోర్డులలో ఏర్పాటు చేయాల్సి ఉన్నా చాలాచోట్ల అమలుకావడం లేదు.
‘పెట్రో’గిపోతున్నారు : చాలా బంకుల్లో పెట్రోల్ పరిమాణం, నాణ్యతల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు. వాహన ట్యాంకులో రెండు, మూడు లీటర్లకు పైగా పెట్రోల్ పోయించే సమయంలో బంకు సిబ్బంది పంపు రీడింగ్‌ను రెప్పపాటులో శ్రీ0శ్రీ కనిపించకుండా డబుల్, ట్రిపుల్ డిజిట్లలోకి పరుగులు పెట్టించడం, పంపు రీడింగ్ సున్నా నుంచి కాకుండా 5, 10 పాయింట్ల నుంచి ప్రారంభమయ్యేలా మీటర్ ట్యాపరింగ్ చేసి పెట్రోల్, డీజిల్‌ను కొల్లగొడుతున్నారు. వాటర్ బాటిల్‌లో కొట్టమన్నప్పుడు మాత్రం పంప్‌ను స్లోగా ఆపరేట్ చేస్తుంటారని వినియోగదారులు అంటున్నారు. ఉదయం బంక్ తెరిచాక పంపులోని ఎయిర్ తీసిన తర్వాతనే పెట్రోల్ పోయాల్సి ఉంది. కొన్నిచోట్ల గాలితీయకుండానే నేరుగా పెట్రోల్/ డీజిల్ కొట్టడం ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. భీమవరం, నరసాపురంలోని లాకు దిగువన, పీచుపాలెం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు, ఉండి రోడ్డు, ఆకివీడు తదితర ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొలతల్లో తేడాలుంటున్నాయని, నాణ్యత సరిగా ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.60 రూపాయలు ఉంటేనే కానీ పెట్రోలు కొట్టడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. నరసాపురం రూరల్ లక్ష్మణేశ్వరం పెట్రోల్ బంకులో తూకం విషయంలో మోసం జరుగుతోందని కొంతకాలం క్రితం వినియోగదారులు గొడవచేశారు. తణుకులోని ఒక బంకు వద్ద బాటిల్‌లో పెట్రోల్ కొట్టిస్తే అందులో నీళ్లు కూడా కలిసి ఉన్నట్టు పట్టణానికి చెందిన ఒక వినియోగదారుడు ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు.
జిల్లాలోని పలు పెట్రోలు బంకుల్లో నాణ్యత, తూకంలో తేడాలు
పంపుల వద్ద కనిపించని డెన్సిటీ వివరాలు
చోద్యం చూస్తున్న అధికారులు
పెట్రోల్‌కు బదులు నీళ్లు వచ్చాయి
తణుకులోని ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించిన తర్వాత మోటారు సైకిల్ తరచూ ఆగిపోతుండటంతో మెకానిక్‌కి చూపించాను. ట్యాంక్ ఓపెన్ చేసి పెట్రోల్ బయట తీయగా నీళ్లు వచ్చాయి. ఈ విషయమై బంకు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో సోషల్ మీడియాలో పోస్టు చేశాను.
– అన్నమనేడి రాంబాబు, తణుకు
తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలి
పెట్రోల్ బంకుల్లో సరైన క్వాలిటీ, క్వాంటిటీ ఉండడం లేదు. 60 కిలోమీటర్లు వచ్చే మోటారు సైకిళ్లు సైతం లీటర్‌కు 50 నుంచి 55 కిలోమీటర్ల వరకే వస్తున్నాయి. బంకుల్లో గాలి నింపే యంత్రాలు కూడా పనిచేయడం లేదు. అధికారులు తరచూ తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలి.
– కె.ఏసురత్నం, మోగల్లు

పెట్రోగిపోతున్న మోసాలు

పెట్రోగిపోతున్న మోసాలు

పెట్రోగిపోతున్న మోసాలు

పెట్రోగిపోతున్న మోసాలు