కొత్తగా 36 హెచ్‌ఐవీ కేసులు
● జిల్లాలో హైరిస్క్ ఉన్న వారు
3,498 మంది
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు
● నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
గీసుకొండ: జిల్లాలో ప్రతీ నెలకు కొత్తగా సగటున 36 హెచ్‌ఐవీ కేసులు నమోదవుతున్నాయి. హైరిస్క్ ఉన్న వారు 3,249 మంది ఉన్నారని డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. ఆదివారం ఆయన జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు చేపడుతున్న చర్యలను మీడియాకు వెల్లడించారు. జిల్లాలో 2001 నుంచి ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలను చేపడుతున్నామన్నారు. ఇప్పటి వరకు 5,464 మంది ఏఆర్‌టీ కేంద్రాల్లో తమ పేరును నమోదు చేసుకున్నారని వారిలో 4,558 మందికి ప్రతి నెలా ఎయిడ్స్ నివారణ మందులను ప్రభుత్వం ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వారిలో 863 మందికి ప్రతి నెలా రూ.2,016 ప్రభుత్వం పింఛన్‌గా అందిస్తోందన్నారు. హైరిస్క్ ఉన్న వారిలో 2,269 మంది సెక్స్ వర్కర్లు, 1,112 మంది స్వలింగ సంపర్కులు, 117 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారని వివరించారు. వీరందరి ప్రవర్తనలో మార్పు తీసుకుని రావడానికి స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో తల్లుల నుంచి వారి పిల్లలకు హెచ్‌ఐవీ సోకకుండా చేసే కేంద్రాలు, వ్యాధి నిరోధానికి పలు కేంద్రాలను నిర్వహిస్తునట్లు తెలిపారు. 2024–25లో 59,913 మంది వ్యక్తులకు హెచ్‌ఐవీ రక్త పరీక్ష చేయగా 421 మందికి(0.70 శాతం) వ్యాధి నిర్ధారణ జరిగిందన్నారు. 25,556 మంది గర్భిణులకు పరీక్షలు చేయగా 9 మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 42,763 మందికి పరీక్షలు చేయగా 330 మందికి (0.50 శాతం) హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారించామన్నారు. 15,796 మంది గర్భిణులకు పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. హెచ్‌ఐవీ పరీక్షలు చేయడం, చికిత్సలు అందించే విషయంలో ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్ డాక్టర్లు, సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కలెక్టర్, న్యాయసేవాధికార సంస్థ సహకారంతో హై రిస్క్ ఉన్న వారికి నెలకు పది కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నామన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, వారికి వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


