పంచాయతీ ఎన్నికల అబ్జర్వర్‌గా బాల మాయాదేవి
● ఆదివారం పలు క్లస్టర్ల పరిశీలన
న్యూశాయంపేట/ దుగ్గొండి/ పర్వతగిరి/వర్ధన్నపేట/ సంగెం: రెండో సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వరంగల్ జిల్లా జనరల్ అబ్జర్వర్‌గా రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్ బి.బాలమాయాదేవిని నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నియమ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన సమస్యలను జిల్లాలోని మండలాలు, గ్రామాలకు చెందిన ప్రజలు, పార్టీల, ప్రజాసంఘాల బాధ్యులు ఫోన్ నంబర్ 8712735548 ద్వారా పరిశీలకులకు తెలియచేయవచ్చని కలెక్టర్ సూచించారు. కాగా, బాల మాయాదేవి ఆదివారం జిల్లాలోని దుగ్గొండి మండలం శివాజీనగర్, వెంకటాపురం క్లస్టర్, పర్వతగిరి మండలంలో వడ్లకొండ క్లస్టర్, వర్ధన్నపేట మండలంలో బండౌతపురం, నల్లబెల్లి, కట్య్రాల క్లస్టర్ కేంద్రాలు, సంగెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి సిబ్బంది అధికారులకు పలు సూచనలు చేశారు. విధుల్లో అలసత్వం వహించొద్దని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
నల్లబెల్లి: మండలంలో నల్లబెల్లి, రాంతీర్థం గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించారు.


