
కుమారులు దూరమై.. విగ్రహాల్లో కొలువై
కొడకండ్ల: అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణం పోయిన వారి కుమారులకు విగ్రహాల రూపంలో ప్రాణం పోసి కళ్లారా చూస్తున్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయమే జీవనాధారమైన వారు కుమారులను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించిన వారు ప్రయోజకులయ్యారు. పెద్దకుమారుడు అరవింద్, రెండో కుమారుడు శ్రవణ్ సాప్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్‌లో మూడో కుమారుడు శ్రవణ్ వరంగల్ ఎంజీఎంలో హౌస్ సర్జన్‌గా పనిచేసేవారు. గత సంవత్సరం మే 19న శివ హైదరాబాద్‌లోని అన్న శ్రవణ్ వద్దకు వెళ్లాడు. భోజనం తెచ్చుకునేందుకు బయటికి వెళ్లిన ఇద్దరు సోదరులను స్కార్పియో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కుమారులను గుర్తు చేసుకుంటూ తమ వ్యవసాయ భూమిలో గదిని నిర్మించి శ్రవణ్, శివ విగ్రహాలను ఏర్పాటు చేయించారు. మే 19న ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు ఆవిష్కరించుకున్నారు.