
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
పరకాల: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాల మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్‌రెడ్డితో కలిసి పరకాల మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఇంజనీరింగ్ విభాగం, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాల పనితీరుపై సమీక్షించారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన వర్షాకాలంలో ముందు జాగ్రత్తలు తీసుకోకపోపోతే ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తాచెదారం పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని, విద్యా, వ్యాపార వాణిజ్య సంస్థల ముందు చెత్త వేసే వారికి జరిమానాలు విధించాలని కమిషనర్ సుష్మను ఆదేశించారు. ఫాగింగ్, స్ప్రే నిర్వహణ కోసం కావాల్సి న మిషన్లు కొనుగోలు చేయాలని, మున్సిపల్ మిగులు నిధులతో జేసీబీ, స్వచ్ఛ వాహనాలు కొనాలని సూచించారు. అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య సిబ్బందికి సమాచారాన్ని డిస్‌ప్లే చేయాలన్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
రోడ్డుపై చెత్త వేసే వారికి జరిమానా