
వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్‌పై వేటు
సాక్షి, వరంగల్: వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్‌పై వేటు పడింది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి వివిధ సందర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎస్కార్ట్ కల్పించి మెమోలు అందుకున్నారు. కాంగ్రెస్ నేత నవీన్‌రాజ్‌కు ఏ పదవి లేకున్నా కూడా పోలీసు భద్రత కల్పించి వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొన్న ఆయన తరచూ వివాదాలకు కేంద్రబిందువుగా మారిన సందర్భాలున్నాయి. కేవలం 15నెలల పాటు పనిచేసిన నందిరాంనాయక్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. ఆ స్థానంలో 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఎన్.శుభంప్రకాశ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శుభంప్రకాశ్ 2024లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఆరు నెలలపాటు ట్రెయినీ ఐపీఎస్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం కరీంనగర్ రూరల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నారు. ఏసీపీగా రానున్న ఆయనకు వరంగల్‌పై కొంత అవగాహన ఉంది. దీంతో శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగానే ఉండే అవకాశముంది. కాగా, ఆయన సాయంత్రం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ డివిజన్ పోలీసులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్
ఆయన స్థానంలో ఎన్.శుభంప్రకాశ్
నియామకం.. బాధ్యతల స్వీకరణ