
దశలవారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
గీసుకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని, తమకు రాలేదని ఎవరూ బాధపడొద్దని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లలో శుక్రవారం లబ్ధి దారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. పేదవారి సొంతింటి కల కాంగ్రెస్ సర్కారుతోనే తీరుతుందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. విద్య, వైద్యం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ప్రతీ కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పమన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందన్నారు. ఇంది రమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కు వంటగ్యాస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, సన్నబియ్యం, రూ.2లక్షల లోపు రైతులకు రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దశల వారీగా ఇళ్ల బిల్లులు మంజూరు చేస్తారని ఎమ్మెల్యే వివరించారు. తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు కొండేటి కొమురారెడ్డి, కటకం సురేందర్, కుమారస్వామి, గోదాసి చిన్న, ఎలగొండ ప్రవీణ్‌కుమార్, బల్దియా అధికారులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి