
సమస్యలు ఉంటే ఫోన్ చేయండి : ఎస్‌ఈ
దుగ్గొండి: వ్యవసాయ బావులు, ఇళ్లలో విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే సిబ్బందికి లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని ట్రాన్స్‌కో వరంగల్ ఎస్‌ఈ గౌతంరెడ్డి అన్నారు. సొంతంగా మరమ్మతులు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. శివాజీనగర్ గ్రామంలో శుక్రవారం విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి రైతులతో మాట్లాడి విద్యుత్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తరచూ కరెంట్ ట్రిప్పు కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలంలో వ్యవసాయ బావుల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తడిసిన సపోర్టు తీగలు, స్టార్టర్లను ముట్టుకోవద్దని చెప్పారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుని ప్రాణాలను రక్షించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీఈ తిరుపతి, టెక్నికల్ డీఈ ఆనంద్, ఏడీ లక్ష్మణ్, ఏఈ ప్రత్యూష, విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.