మంత్రి సురేఖ వ్యాఖ్యల కలకలం! | - | Sakshi
Sakshi News home page

మంత్రి సురేఖ వ్యాఖ్యల కలకలం!

May 17 2025 7:15 AM | Updated on May 17 2025 7:15 AM

మంత్రి సురేఖ వ్యాఖ్యల కలకలం!

మంత్రి సురేఖ వ్యాఖ్యల కలకలం!

పైసలిస్తేనే మంత్రుల వద్ద

ఫైల్స్‌ క్లియరవుతాయని కామెంట్‌

ఇదీ కమీషన్ల సర్కారు అని

మాజీ మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌

కావాలనే తనపై సోషల్‌ మీడియాలో

దుష్ప్రచారం చేస్తున్నారన్న మంత్రి సురేఖ

గత బీఆర్‌ఎస్‌ మంత్రులనుద్దేశించి

అన్నానని స్పష్టత

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని లేపాయి. ‘మంత్రుల వద్దకు క్లియరెన్స్‌ కోసం కొన్ని ఫైల్స్‌ వస్తాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకొని వాటిని క్లియరెన్‌్స్‌ చేస్తుంటారు. మేం మాత్రం మాకు నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. సామాజిక బాధ్యతగా స్కూల్‌ను అభివృద్ధి చేయాలని కోరాం’ అని ఆమె వరంగల్‌లోని కృష్ణా కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆవరణలో గురువారం జరిగిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఆమెకు థాంక్స్‌ అని చెప్పి, మొత్తానికి కొండా సురేఖ నిజాలు బయటపెట్టారని, కాంగ్రెస్‌ కమీషన్‌ సర్కారు నడుపుతోందని ఎక్స్‌ వేదికగా పోస్టు చేయడంతో మరోసారి ఓరుగల్లు కేంద్రంగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ‘వరంగల్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఏ పనిచేయడానికి అయినా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని నేను మాట్లాడినా. అవి అక్షర సత్యం కూడా. ఆ మాటలకి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. మా ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక బీఆర్‌ఎస్‌ నాయకులు తమ పెయిడ్‌ సోషల్‌ మీడియా ద్వారా విష ప్రచారం చేసే కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ వీడియోలో నా వ్యాఖ్యల్ని ముందు వెనుక కొంత తీసేసి, మిగతా కొంత పార్ట్‌ను కావాలనే హైలెట్‌ చేయడం వెనుక ఉన్న కుట్ర ఇది’ అని ఆమె మీడియాతో మాట్లాడి వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు.

గతంలోనూ పలు వివాదాలు..

గతంలోనూ నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చేసి పరువు నష్టం దావాలు మంత్రి కొండా సురేఖ ఎదుర్కొంటున్నారు.

గతేడాది దసరాకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో మొదలైన వివాదంలో ముగ్గురు కొండా వర్గీయులను పోలీసులు అరెస్టు చేయగా.. మంత్రి కొండా సురేఖ నేరుగా గీసుకొండ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం అప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

వేములవాడ రాజన్న కోడెల విషయంలోనూ మంత్రి అనుచరుడికి అప్పనంగా కట్టబెట్టారని గీసుకొండ ఠాణాలో కేసు నమోదు కావడం కూడా గతేడాది డిసెంబర్‌లో వివాదమైంది.

తాజాగా మంత్రులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏకంగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement